Chronological
యాజకుల, లేవీయుల పని
18 అహరోనుతో యెహోవా ఇలా చెప్పాడు: “పవిత్ర స్థలానికి వ్యతిరేకంగా ఎలాంటి అపచారాలు జరిగినా ఇక మీదట నీవు, నీ కుమారులు, నీ తండ్రి కుటుంబం బాధ్యులు. యాజకులకు వ్యతిరేకంగా జరిగే అపచారాలకు నీవు, నీ కుమారులు బాధ్యులు. 2 నీ వంశంలో మిగిలిన లేవీ మనుష్యులను కూడ నీతో చేర్చుకో. ఒడంబడిక, పవిత్ర గుడారంలో నీవు, నీ కుమారులు చేయాల్సిన పనిలో వారు మీకు సహాయం చేస్తారు. 3 లేవీ వంశంలోని ఆ మనుష్యులు నీ స్వాధీనంలో ఉంటారు. గుడారంలో జరగాల్సిన పని అంతా వారు చేస్తారు. అయితే పవిత్ర స్థలంలోగాని, బలిపీఠం దగ్గరగాని ఉన్న వస్తువులను వారు సమీపించకూడదు. ఒకవేళ వారు వెళ్తే, వారూ, నీవు కూడా చనిపోతావు. 4 వారు నీతో కలిసి పనిచేస్తారు. సన్నిధి గుడారం విషయమై జాగ్రత్త తీసుకోవటం వారి బాధ్యత. గుడారంలో జరగాల్సిన పని అంతా వాళ్లు చేస్తారు. నీవు ఉన్న చోటికి ఇంకెవ్వరూ రాకూడదు.
5 “పవిత్ర స్థలాన్ని, బలిపీఠాన్ని జాగ్రత్తగా చూసుకోవటం నీ బాధ్యత, ఇశ్రాయేలు ప్రజల మీద నేను మళ్లీ కోపగించుకోవటం నాకు ఇష్టం లేదు. 6 ఇశ్రాయేలు ప్రజలందరిలోనుండి లేవీ ప్రజలను అంటే నీ ప్రజలను నేనే ఏర్పాటు చేసుకొన్నాను. వారు నీకు ఒక కానుక వంటివారు. యెహోవాను సేవించటం, సన్నిధి గుడారం పని చేయటం ఒక్కటే వారి ఉద్దేశ్యం. 7 అయితే నీవు, నీ కుమారులు మాత్రమే యాజకులుగా పని చేయవచ్చు. బలిపీఠం దగ్గరకు వెళ్లగలిగేది మీరు మాత్రమే. మీరు మాత్రమే తెర లోపలకు వెళ్లగలవారు. యాజకునిగా మీ సేవ అనేది నేను మీకు కానుకగా ఇస్తున్నాను. అతి పవిత్ర స్థలాన్ని ఇంకెవరు సమీపించినా వారిని చంపెయ్యాలి.”
8 అప్పుడు యెహోవా అహరోనుతో ఇలా చెప్పాడు: “నాకు అర్పించబడిన అర్పణలన్నింటిమీద నేనే నీకు బాధ్యత ఇచ్చాను. ఇశ్రాయేలు ప్రజలు నాకు అర్పించే పవిత్ర అర్పణలన్నీ నేను నీకు ఇస్తాను. ఈ కానుకలను నీవూ, నీ కుమారులూ పంచుకోవచ్చు. ఎప్పుడూ అవి మీకే చెందుతాయి. 9 దహించబడని పవిత్ర అర్పణలన్నింటిలో మీకు వంతు ఉంటుంది. ప్రజలు తమ కానుకులను అతి పవిత్ర అర్పణలుగా నా దగ్గరకు తీసుకుస్తారు. ఇవి ధాన్యార్పణలు, పాప పరిహారార్థ అర్పణలు, అపరాధ పరిహారార్థ అర్పణలు. అయితే ఇవన్నీ నీవి, నీ కుమారులవి. 10 అవి అత్యంత పవిత్రమైనవిగా వాటిని తినాలి. నీ కుటుంబంలో మగవారు ప్రతి ఒక్కరూ దానిని తినాలి. అది పవిత్రం అని నీవు చెప్పాలి.
11 “ఇశ్రాయేలు ప్రజలు నైవేద్యంగా ఇచ్చు అర్పణలు అన్నీ నీవే. ఇది నీకూ, నీ కుమారులకు, కుమార్తెలకు నేను ఇస్తున్నాను. ఇది నీ వంతు. నీ కుటుంబంలో పవిత్రంగా ఉన్న ప్రతి వ్యక్తీ దీనిని తినగలుగుతాడు.
12 “శ్రేష్ఠమైన ఒలీవ నూనె అంతయు, శ్రేష్ఠమైన కొత్త ద్రాక్షారసం అంతయు, ధాన్యం అంతయు నేను నీకిస్తున్నాను. ఇవన్నీ యెహోవానైన నాకు ఇశ్రాయేలు ప్రజలు ఇచ్చేవి. ఇవన్నీ వారి పంట కోతలో ప్రథమ ఫలాలు. 13 ప్రజలు పంటకోత కూర్చినప్పుడు, మొదటివి అన్నీ వారు యెహోవాకు ఇస్తారు. కనుక వీటిని నేను నీకు ఇస్తాను. నీ కుటుంబంలో పవిత్రంగా ఉన్న ప్రతి వ్యక్తీ అవి తినవచ్చును.
14 “ఇశ్రాయేలులో యెహోవాకు అర్పించబడిన ప్రతిదీ నీదే.
15 “ఒక కుటుంబంలో, మనిషికి గాని జంతువుకు గాని పుట్టిన మొట్టమొదటిది యెహోవాకు అర్పించబడుతుంది. అది నీదే అవుతుంది. అయితే అపవిత్రంగా పుట్టిన ప్రతి మొదటి శిశువుకు, ప్రతి మొదటి మగ జంతువుకు నీవు వెల చెల్లించాలి. అప్పుడు ఆ మొదటి శిశువు తిరిగి తన కుటుంబానికే చెందుతుంది. 16 వారు ఒక నెల వయసులో ఉన్నప్పుడు వారికోసం నీవు వెల చెల్లించాలి. ఆ వెల అయిదు తులాల వెండి.
17 “అయితే ఆవులలో, గొర్రెలలో మేకలలో మొదట పుట్టిన దానికి నీవు వెల చెల్లింపకూడదు. ఆ జంతువులు పవిత్రం – పరిశుభ్రం. వాటి రక్తం బలిపీఠం మీద చిలకరించి వాటి కొవ్వును దహించాలి. ఇది హోమంగా అర్పించబడిన అర్పణ. దీని వాసన యెహోవానగు నాకు ఎంతో సంతోషం కలిగిస్తుంది. 18 అయితే ఆ జంతువుల మాంసం నీదే అవుతుంది. మరియు నైవేద్యంలోని బోర నీదే. మిగిలిన అర్పణల్లోకుడి తొడ నీదే. 19 పవిత్ర కానుకలుగా ప్రజలు అర్పించేవి ఏవైనా సరే, యెహోవానగు నేను నీకు ఇస్తాను. ఇది నీ వంతు. నీకు, నీ కుమారులకు, నీ కుమార్తెలకు నేను ఇస్తాను, ఇది శాశ్వతంగా కొనసాగే వాగ్ధానం. నీకూ, నీ సంతతికీ నేను ఈ వాగ్దానం చేస్తున్నాను.”
20 అహరోనుతో యెహోవా ఇంకా ఇలా చెప్పాడు: “దేశంలో నీకేమీ స్వాస్థ్యం ఉండదు. ఇతరులు స్వంతంగా కలిగి ఉన్నవి ఏవి నీకు స్వంతంగా ఉండవు. నేను, యెహోవాను నీ స్వంతం. నేను వాగ్దానం చేసిన దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలు పొందుతారు. అయితే నీకు మాత్రం నేనే నీ కానుకగా ఉంటాను.
21 “ఇశ్రాయేలు ప్రజలు వారికి ఉన్న ప్రతి దానిలోను పదోవంతు నాకు ఇస్తారు. కనుక ఆ పదోవంతును నేను లేవీ ప్రజలకు ఇస్తాను. వారు సన్నిధి గుడారంలో సేవించేటప్పుడు చేసే పనికి ఇది వారికి జీతం. 22 అయితే ఇశ్రాయేలీయుల్లో ఇతరులు ఎన్నడూ సన్నిధి గుడారం సమీపించకూడదు. వారు అలా వెళ్తే, వారి పాపం నిమిత్తం ప్రాయశ్చిత్తం చెల్లించి మరీచస్తారు. 23 సన్నిధి గుడారంలో పనిచేసే లేవీ ప్రజలే, దానికి వ్యతిరేకంగా జరిగే పాపాలకు బాధ్యులు. ఈ ఆజ్ఞ భవిష్యత్ కాలంలో కూడ కొనసాగుతుంది. ఇతర ఇశ్రాయేలు ప్రజలకు నేను వాగ్దానం చేసిన దేశాన్ని లేవీ ప్రజలు మాత్రం పొందరు. 24 అయితే ఇశ్రాయేలు ప్రజలు వారికి ఉన్న ప్రతి దానిలోనుండి పదోవంతునాకు ఇస్తారు. కనుక ఆ పదో వంతును నేను లేవీ ప్రజలకు ఇస్తాను. అందుకే లేవీ వాళ్లను గూర్చి నేను ఈ మాటలు చెప్పాను. ఇశ్రాయేలు ప్రజలకు నేను వాగ్దానం చేసిన దేశాన్ని ఆ లేవీ ప్రజలు పొందరు.”
25 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: 26 “లేవీ ప్రజలతో మాట్లాడి వారికి ఇలా చెప్పు: ఇశ్రాయేలు ప్రజలు వారికి ఉన్న ప్రతి దానిలోనుండి పదోవంతు యెహోవాకు ఇవ్వాలి. ఆ పదోవంతు లేవీ ప్రజలకు చెందుతుంది. అయితే అందులో పదోవంతు యెహోవా అర్పణగా మీరు ఆయనకు ఇవ్వాలి. 27 పంట కోసిన తర్వాత ధాన్యం, ద్రాక్ష గానుగ నుండి రసం మీకు ఇవ్వబడుతాయి. అప్పుడు అవి కూడ యెహోవాకు మీ అర్పణలు. 28 ఈ విధంగా ఇతర ఇశ్రాయేలు ప్రజలు చేసినట్టు, మీరు కూడ యెహోవాకు అర్పణ ఇవ్వాలి. ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు ఇచ్చే పదోవంతు మీకు ఇవ్వ బడుతుంది. దానిలో పదోవంతును మీరు యాజకుడైన అహరోనుకు ఇవ్వాలి. 29 ఇశ్రాయేలు ప్రజలు వారికి ఉన్నదానంతటిలో నుండి పదోవంతు మీకు ఇచ్చినప్పుడు, వాటిలో శ్రేష్ఠమైనవి, అత్యంత పవిత్రమైనవి మీరు ప్రత్యేకించాలి. అది మీరు యెహోవాకు ఇచ్చే పదోవంతు.
30 “మోషే! లేవీ ప్రజలకు ఇది చెప్పు: ఇశ్రాయేలు ప్రజలు వారి పంటలో నుండి, ద్రాక్షారసంలో నుండి పదోవంతు మీకు ఇస్తారు. అప్పుడు అందులో శ్రేష్ఠమైన భాగం మీరు యెహోవాకు ఇవ్వాలి. 31 మిగిలి పోయినదంతా మీరు, మీ కుటుంబాలు తినవచ్చు. సన్నిధి గుడారంలో మీరు చేసే పనికి ఇది మీకు జీతం. 32 మరియు ఎల్లప్పుడూ దానిలోని శ్రేష్ఠ భాగాన్నే మీరు యెహోవాకు ఇస్తే, మీరు ఎన్నటికీ అపరాధులు కారు. ఇశ్రాయేలు ప్రజల నుండి అనేకుల పవిత్ర అర్పణలని మీరు ఎన్నటికీ గుర్తుంచుకుంటారు. మీరు చావరు.”
ఎర్ర ఆవు బూడిద
19 మోషేతో, అహరోనుతో యెహోవా మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు: 2 “ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చే ఆజ్ఞలు, ప్రబోధాలు ఇవే. వారు బలంగా ఉన్న ఒక ఎర్ర ఆవును నీ దగ్గరకు తీసుకుని రావాలి. ఆ ఆవుకు ఎలాంటి గాయాలు ఉండకూడదు. ఆ ఆవు ఎన్నడూ కాడి మోసి ఉండకూడదు. 3 ఆ ఆవును యాజకుడైన ఎలియాజరుకు ఇవ్వాలి. ఎలియాజరు ఆవును నివాసం యొక్క వెలుపలికి తీసుకునిపోయి, అక్కడ దాన్ని వధించాలి. 4 అప్పుడు యాజకుడైన ఎలియాజరు దాని రక్తంలో కొంత తన వేలిమీద వేసుకొవాలి. తర్వాత అతడు ఆ రక్తంలో కొంత పవిత్ర గుడారం వైపు చల్లాలి. అతడు ఇలా ఏడు సార్లు చేయాలి. 5 అప్పుడు మొత్తం ఆవు అతని ఎదుట దహించబడాలి. దాని చర్మం, మాంసం, రక్తం, ప్రేగులు అన్నీ దహించాలి. 6 అప్పుడు యాజకుడు ఒక దేవదారు కర్రను, హిస్సోపు కొమ్మను, ఎర్ర నూలును తీసుకుని, ఆవు దహించబడుతున్న అగ్నిలో వేయాలి. 7 అప్పుడు యాజకుడు స్నానం చేసి, నీళ్లతో తన బట్టలు ఉదుక్కోవాలి. అతడు తిరిగి నివాసానికి రావాలి. యాజకుడు సాయంత్రం వరకు అపవిత్రంగా ఉంటాడు. 8 ఆ ఆవును దహించే వ్యక్తి స్నానం చేసి, నీళ్లతో తన బట్టలు ఉదుక్కోవాలి. సాయంత్రం వరకు అతడు అపవిత్రంగానే ఉంటాడు.
9 “అప్పుడు పవిత్రుడైనవాడు ఒకడు ఆ ఆవు బూడిదను పోగు చేయాలి. అతడు నివాసానికి బయట పరిశుభ్రమైన స్థలంలో ఆ బూడిదను ఉంచుతాడు ప్రజలు పవిత్రులయ్యేందు కోసం ఒక ప్రత్యేక ఆచారాన్ని పాటించేటప్పుడు ఈ బూడిద ఉపయోగించబడుతుంది. ఒక వ్యక్తి పాపాలను తొలగించేందుకు కూడా ఈ బూడిద ఉపయోగించబడుతుంది.
10 “ఆవు బూడిదను పోగుచేసే వ్యక్తి తన బట్టలు ఉదుక్కోవాలి. అతను సాయంత్రం వరకు అపవిత్రంగా ఉంటాడు.
“ఈ నియమం శాశ్వతంగా కొనసాగుతుంది. ఇశ్రాయేలు పౌరులకు, మీతో కలసి నివసిస్తున్న విధేశీయులకు ఈ నియమం వర్తిస్తుంది. 11 ఎవరైనా ఒకరు ఒక శవాన్ని తాకితే, అప్పుడు అతడు ఏడు రోజులు అపవిత్రంగా ఉంటాడు. 12 ప్రత్యేక జలంతో మూడోరోజున, మళ్లీ ఏడో రోజున అతడు తనను తాను కడుక్కోవాలి. అతడు ఇలా చేయకపోతే అపవిత్రంగానే ఉంటాడు. 13 ఒకడు ఒక శవాన్ని తాకితే అతడు అపవిత్రుడు. అతడు అపవిత్రుడుగానే ఉండి, పవిత్ర గుడారానికి వెళ్తే, అప్పుడు ఆ పవిత్ర గుడారం అపవిత్రం అవుతుంది. కనుక అతనిని ఇశ్రాయేలు ప్రజల్లోనుంచి తొలగించి వేయాలి. ఒక అపవిత్రునిమీద ప్రత్యేకజలం చల్లకపోతే అతడు అపవిత్రంగానే ఉండిపోతాడు.
14 “తమ గుడారాల్లోనే మరణించే వారిని గూర్చిన నియమం ఇది. ఒకడు తన గుడారంలో మరణిస్తే, ఆ గుడారంలో ఉన్న ప్రతి ఒక్కరూ అపవిత్రులే. ఏడు రోజులపాటు వారు అపవిత్రం అవుతారు. 15 మూతలేని ప్రతి పాత్ర అపవిత్రం అవుతుంది. 16 ఏ మనిషిగాని శవాన్నిగాని ముట్టుకొంటే, ఆ మనిషి అపవిత్రుడుగా ఏడు రోజులు ఉంటాడు. శవం బయట పొలంలో ఉన్నా, లేక యుద్ధంలో చచ్చిన వానిదైనా సరే ఇదే వర్తిస్తుంది. మరియు చచ్చిన మనిషి ఎముకను ఒక దాన్ని ఎవరైనా ముట్టుకుంటే అప్పుడు అతడు అపవిత్రుడౌతాడు.
17 “కనుక అతనిని మరల పవిత్రం చేయటానికి దహించబడ్డ ఆవు బూడిదను నీవు ప్రయోగించాలి. పాత్రలో బూడిద మీద స్వచ్ఛమైన నీళ్లు పోయాలి. 18 పవిత్రుడు ఒకడు హిస్సోపు కొమ్మను తీసుకుని, దానిని ఆ నీళ్లలో ముంచాలి. అప్పుడు అతడు గుడారంమీదా, గిన్నెలమీదా, గుడారంలోని మనుష్యులందరి మీదా దానిని చల్లాలి. శవాన్ని ముట్టు కొన్న ఎవరికైనా నీవు ఇలాగే చేయాలి. యుద్ధంలో చంపబడిన ఒకరి శవాన్ని ముట్టుకొనిన ఎవరికైనా సరే, చచ్చిన మనిషి ఎముకను తాకిన ఎవరికైనా సరే నీవు ఇలాగే చేయాలి.
19 “అప్పుడు పవిత్రంగా ఉన్న ఒక మనిషి అపవిత్రంగా ఉన్న వానిమీద మూడో రోజున, మరల ఏడో రోజున ఈ నీళ్లు చల్లాలి. ఏడో రోజున అతడు పవిత్రం అవుతాడు. అతడు తన వస్త్రాలను నీళ్లలో ఉతుక్కోవాలి. ఆ సాయంకాలం అతడు పవిత్రుడవుతాడు.
20 “ఒక వ్యక్తి అపవిత్రుడై, పవిత్రుడుగా చేయబడకపోతే, అతడు ఇశ్రాయేలు ప్రజల్లోనుంచి వేరు చేయబడాలి. అతనిమీద ప్రత్యేక జలం చల్లబడలేదు. అతడు పవిత్రుడు కాలేదు. కనుక అతడు పవిత్ర గుడారాన్ని అపవిత్రం చేస్తాడేమో. 21 ఇది మీకు శాశ్వత నియమం. ఒక వ్యక్తిమీద ప్రత్యేక జలం చల్లబడితే అతడు తన బట్టలను కూడ ఉదుక్కోవాలి. ఆ ప్రత్యేకజలాన్ని ముట్టినవాడు ఆ సాయంకాలంవరకు మాత్రం అపవిత్రంగానే ఉంటాడు. 22 అపవిత్రుడు ఒకడు ఇంకో వ్యక్తిని ముట్టుకుంటే అతడుకూడా అపవిత్రుడవుతాడు. అతడు ఆ సాయంత్రం వరకు అపవిత్రంగా ఉంటాడు.”
మిర్యాము మరణము
20 మొదటి నెల ఇశ్రాయేలు ప్రజలు సీను అరణ్యానికి వచ్చారు. ప్రజలు కాదేషులో నివాసం చేసారు. మిర్యాము చనిపోయి, అక్కడే పాతి పెట్టబడింది.
మోషే పొరబాటు
2 ఆ స్థలంలో ప్రజలకు చాలినంతగా నీళ్లు లేవు. కనుక ప్రజలు మోషే, అహరోనులతో ఫిర్యాదు చేయటానికి సమావేశమయ్యారు. 3 ప్రజలు మోషేతో వాదించారు. వారు ఇలా అన్నారు: “ఒక వేళ మా సోదరుల్లా మేము కూడా యెహోవా ఎదుట మరణించి ఉంటేబాగుండేది. 4 యెహోవా ప్రజలను నీవు ఈ అరణ్యంలోనికి ఎందుకు తీసుకొచ్చావు? మేమూ, మా పశువులూ ఇక్కడే చావాలని కోరుతున్నావా? 5 ఈజిప్టు నుండి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? ఈ పనికిమాలిన చోటుకు మమ్మల్ని నీవెందుకు తీసుకువచ్చావు? ఇక్కడ ధాన్యం లేదు. అంజూరపు పండ్లు, ద్రాక్షాపండ్లు, దానిమ్మ పండ్లు ఏమీ లేవు. కనీసం తాగటానికి నీళ్లు కూడ లేవు.”
6 కనుక మోషే, అహరోను ఆ జనాన్ని విడిచి, సన్నిధి గుడార ద్వారం దగ్గరకు వెళ్లారు. వారు సాష్టాంగపడగా యెహోవా మహిమ ప్రత్యక్షమయింది.
7 యెహోవా మోషేతో మాట్లాడాడు: 8 “నీ సోదరుడు అహరోనును, ఈ జనాన్ని తీసుకుని ఆ బండ దగ్గరకు వెళ్లు నీ కర్ర కూడా తీసుకుని వెళ్లు. ఆ బండ ఎదుట ప్రజలతో మాట్లాడు. అప్పుడు ఆ బండనుండి నీళ్లు ప్రవహిస్తాయి. అప్పుడు ప్రజలకు, పశువులకు నీవు ఆ నీళ్లు ఇవ్వవచ్చును” అన్నాడు ఆయన.
9 కనుక యెహోవా చెప్పిన ప్రకారం మోషే ఆయన ఎదుటనుండి కర్ర తీసుకున్నాడు. 10 అప్పుడు ప్రజలంతా ఆ బండ ముందు సమావేశం కావాలని మోషే, అహరోను వారితో చెప్పారు. అప్పుడు మోషే, “మీరు ఎప్పుడూ సణుగుతున్నారు. ఇప్పుడు నా మాటవినండి. ఈ బండలోనుండి నీళ్లు వచ్చేటట్టు మేము చేస్తాము” అన్నాడు. 11 మోషే తన చేయి పై కెత్తి రెండుసార్లు ఆ బండను కొట్టాడు. బండనుండి నీళ్లు ప్రవహించటం మొదలయ్యింది. ప్రజలు, పశువులు ఆ నీళ్లు త్రాగారు.
12 అయితే మోషే, అహరోనులతో యెహోవా అన్నాడు: “ఇశ్రాయేలు ప్రజలంతా చుట్టూచేరారు. కానీ మీరు నాకు ఘనత చూపలేదు. నీళ్లను ప్రవహింప జేసిన శక్తి నా దగ్గరనుండి వచ్చిందని ఇశ్రాయేలు ప్రజలకు మీరు చూపించలేదు. మీరు నన్ను నమ్ముకొన్నట్లుగా మీరు ప్రజలకు చూపించలేదు. ఆ ప్రజలకు నేను వాగ్దానం చేసిన దేశాన్ని వారికి ఇస్తాను. అయితే వాళ్లను ఆ దేశంలోనికి నడిపించేవాళ్లు మాత్రం మీరు కారు.”
13 ఈ స్థలం మెరీబా[a] జలాలు అని పిలువబడింది. ఇక్కడనే ఇశ్రాయేలు ప్రజలు యెహోవాతో వాదించారు. ఆయన పవిత్రుడని యెహోవా ఇక్కడనే వారికి చూపించాడు.!
ఇశ్రాయేలీయులను ఎదోము ఆటంకపర్చుట
14 మోషే కాదేషులో ఉన్నప్పుడు, కొందరు మనుష్యులను ఎదోము రాజు దగ్గరకి పంపి ఈలాగు చెప్పమన్నాడు. ఆ సందేశం ఇది:
“మీ సోదరులైన ఇశ్రాయేలీయులు మీతో చెప్పేది ఏమంటే: మాకు కలిగిన కష్టాలన్నీ నీకు తెలుసు. 15 చాల సంవత్సరాల క్రిందట మా పూర్వీకులు ఈజిప్టు వెళ్లారు. చాల సంవత్సరాలు మేము అక్కడ జీవించాము. ఈజిప్టు ప్రజలు మా యెడల కృ-రంగా ఉండిరి. 16 అయితే మేము యెహోవాను సహాయం అడిగాము. యెహోవా మా మొర విని, మాకు సహాయం చేసేందుకు ఒక దేవదూతను పంపించాడు. యెహోవా మమ్మల్ని ఈజిప్టునుండి బయటకు రప్పించాడు.
“ఇదిగో ఇప్పుడు మేము నీ దేశ సరిహద్దు అయిన కాదేషులో ఉన్నాము. 17 దయచేసి నీ దేశంలో నుంచి మమ్మల్ని ప్రయాణం చేయనివ్వు. పొలాల్లోనుంచి, ద్రాక్షా తోటల్లోనుంచి మేము నడువము. మీ బావుల్లో దేనినుండి మేము నీళ్లు తాగము. రాజమార్గంలో మాత్రమే మేము ప్రయాణం చేస్తాము. ఆ మార్గంనుండి కుడికి గాని ఎడమకు గాని మేము తొలగము. మీ దేశం దాటిపోయేంత వరకు మేము రాజ మార్గాననే వెళ్తాము.”
18 అయితే ఎదోము రాజు, “మీరు మా దేశంలోనుండి ప్రయాణం చేయగూడదు. మా దేశంలోనుండి ప్రయాణం చేయటానికి మీరు ప్రయత్నిస్తే, మేము వచ్చి కత్తులతో మీతో పోరాడుతాము” అని జవాబిచ్చాడు.
19 ఇశ్రాయేలు ప్రజలు, “మేము రహదారి వెంబడే ప్రయాణం చేస్తాము. మా పశువులు మీ నీళ్లు ఏమైనా తాగితే, దానికి మేము వెల చెల్లిస్తాము. మేము మీ దేశంలోనుంచి నడుస్తాము, అంతే. అంతేగాని, దాన్ని మేము తీసుకోము” అని జవాబిచ్చారు.
20 అయితే, “మేము మిమ్మల్ని మా దేశంలోంచి పోనియ్యము” అని ఎదోము జవాబిచ్చాడు.
అప్పుడు ఎదోము రాజు బలంగల విస్తార సైన్యాన్ని సమకూర్చుకొని, ఇశ్రాయేలు ప్రజలతో పోరాడటానికి వారి మీదికి వెళ్లాడు. 21 ఇశ్రాయేలు ప్రజలను తన దేశంగుండా వెళ్లనిచ్చేందుకు ఎదోము రాజు నిరాకరించాడు. ఇశ్రాయేలు ప్రజలు వెనక్కు తిరిగి మరో మార్గంగుండా వెళ్లిపోయారు.
అహరోను మరణం
22 ఇశ్రాయేలు ప్రజలంతా కాదేషు నుండి హోరు కొండకు ప్రయాణం చేసారు. 23 హోరు కొండ ఎదోము సరిహద్దుకు దగ్గర్లో ఉంది. మోషే, అహరోనులతో యెహోవా చెప్పాడు, 24 “అహరోను తన పూర్వీకుల దగ్గరకు వెళ్తాడు. ఇశ్రాయేలు ప్రజలకు నేను వాగ్దానం చేసిన దేశంలో అతడు ప్రవేశించడు. మోషే, అహరోనూ, మీరు మెరీబా జలాల దగ్గర నేను మీకు ఇచ్చిన ఆజ్ఞకు పూర్తిగా విధేయులు కాలేదుగనుక నేను మీతో ఇలా చెబుతున్నాను:
25 “అహరోనును, అతని కుమారుడైన ఎలియాజరును హోరు కొండమీదికి తీసుకుని రా. 26 అహరోను ప్రత్యేక దుస్తులు అతని దగ్గరనుండి తీసుకుని, అతని కుమారుడైన ఎలియాజరుకు వాటిని తొడిగించు. అహరోను కొండమీద మరణిస్తాడు. అతడు తన పూర్వీకుల దగ్గరకు వెళ్తాడు.”
27 యెహోవా ఆజ్ఞకు మోషే విధేయుడయ్యాడు. మోషే, అహరోను, ఎలియాజరు హోరు కొండ శిఖరం మీదికు వెళ్లారు. వారు వెళ్లటం ఇశ్రాయేలు ప్రజలంతా చూసారు. 28 అహరోను వస్త్రాలన్నీ తీసి అతని కుమారుడైన ఎలియాజరు మీద వేసాడు మోషే. అప్పుడు అహరోను ఆ కొండ శిఖరం మీద చనిపోయాడు. మోషే, ఎలియాజరు కొండ దిగి క్రిందికి వచ్చారు. 29 అప్పుడు అహరోను చనిపోయినట్టు ప్రజలంతా తెలుసుకొన్నారు. కనుక ఇశ్రాయేలులో ప్రతి వ్యక్తి 30 రోజులపాటు సంతాపపడ్డాడు.
© 1997 Bible League International