Beginning
క్రీస్తు దేహంలో ఐక్యత
4 ప్రభువు మిమ్మల్ని పిలిచిన పిలుపు సార్థకమయ్యేటట్లు జీవించమని ప్రభువు యొక్క ఖైదీనైన నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 2 అన్ని వేళలా విధేయతగా, శాంతంగా ఉండండి. వినయంతో, దయతో, సహనంతో జీవించండి. ఇతర్ల తప్పులను ప్రేమతో క్షమించండి. 3 శాంతి కలిగించిన బంధంతో పరిశుద్దాత్మ యిచ్చిన ఐక్యతను పొందటానికి అన్ని విధాలా ప్రయత్నం చెయ్యండి. 4 శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, నిరీక్షణ ఒక్కటే. 5 ఆ ఒకే నిరీక్షణ యందుండుటకే ఆయన మనలను పిలిచాడు. అదే విధముగా ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, దేవుడు ఒక్కడే. 6 ఆయనే అందరికి తండ్రి. అందరికి ప్రభువు. అందరిలో ఉన్నాడు. అందరి ద్వారా పని చేస్తున్నాడు.
7 క్రీస్తు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరికి కృప యివ్వబడింది. 8 అందువల్ల లేఖనాల్లో ఇలా వ్రాయబడి ఉంది:
“ఆయన పైకి వెళ్ళినప్పుడు బంధితుల్ని వరుసగా తనతో తీసుకు వెళ్ళాడు.
మానవులకు వరాలిచ్చాడు.”(A)
9 “ఆయన పైకి వెళ్ళాడు” అని అనటంలో అర్థమేమిటి? ఆయన క్రిందికి, అంటే భూమి క్రింది భాగాలకు దిగి నాడనే అర్థం కదా! 10 క్రిందికి దిగినవాడే ఆకాశములను దాటి పైకి వెళ్ళాడు. ఆ విధంగా పైకి వెళ్ళి సమస్తమును నింపి వేసాడు. 11 పవిత్రుల్ని సేవా కార్యాలకు సిద్ధం చేయాలనీ, దాని వల్ల క్రీస్తు శరీరం అభివృద్ధి చెందాలని ఆయన ఉద్దేశ్యం. 12 అప్పుడు మనము విశ్వాసంతో, దేవుని కుమారుణ్ణి గురించిన జ్ఞానంలో ఒకటిగా ఉంటాము. క్రీస్తులో ఉన్న పరిపూర్ణతను పొందేదాకా ఆత్మీయంగా అభివృద్ధి చెందుతాము. 13 కొందరు అపొస్తలులు కావాలని, కొందరు ప్రవక్తలు కావాలని, కొందరు సువార్తికులు కావాలని, కొందరు సంఘ కాపరులు కావాలని, మరి కొందరు బోధకులు కావాలని ఆదేశించి వాళ్ళకు తగిన వరాలిచ్చాడు.
14 అప్పుడు మనము పసిపిల్లల వలె ఉండము. అలలకు ఇటు అటు కొట్టుకొనిపోము. గాలిలాంటి ప్రతి బోధనకు కదిలిపోము. కపటంతో, కుయుక్తితో పన్నిన మాయోపాయాలకు మోసపోకుండా ఉంటాము. 15 మనము ప్రేమతో నిజం చెబుతూ అన్ని విధాల అభివృద్ధి చెంది శిరస్సైన క్రీస్తును చేరుకోవాలి. 16 శరీరంలోని అన్ని భాగాలు ఆయన ఆధీనంలో ఉంటాయి. చక్కగా అమర్చబడిన ఆ భాగాలన్నీ కలిసి శరీరానికి ఆధారమిస్తాయి. ఇలా ప్రతీ భాగం తన పని చెయ్యటంవల్ల శరీరం ప్రేమతో పెరిగి అభివృద్ధి చెందుతుంది.
వెలుగు పిల్లలుగా జీవించటం
17 ప్రభువు పేరిట నేను ఈ విషయం చెప్పి వారిస్తున్నాను. ఇక మీదట యూదులు కానివాళ్ళవలే జీవించకండి. వాళ్ళ ఆలోచనలు నిరుపయోగమైనవి. 18 వాళ్ళు చీకట్లో ఉన్నారు. వాళ్ళలో ఉన్న మూర్ఖత కారణంగా వాళ్ళ హృదయాలు కఠినంగా ఉండటం వల్ల వాళ్ళకు దేవుడిచ్చిన జీవితంలో భాగం లభించలేదు. 19 వాళ్ళు మంచిగా ఉండటం మానుకొన్నారు. అంతులేని ఆశతో శారీరక సుఖాలు అనుభవిస్తూ అన్ని రకాల అపవిత్రమైన సుఖాలకు మరిగారు. 20 కాని మీరు క్రీస్తును గురించి నేర్చుకొన్నది యిది కాదు. 21 మీరు యేసును గురించి విన్నారు. ఆయనలో ఉన్న సత్యాన్ని ఆయన పేరిట నేర్చుకొన్నారు. 22 మీ గత జీవితం మిమ్మల్ని పాడు చేసింది. దాన్ని మరిచిపొండి. మీ మోసపు తలంపులు మిమ్మల్ని తప్పు దారి పట్టించాయి. తద్వారా మీ గత జీవితం మిమ్మల్ని నాశనం చేసింది. 23 మీ బుద్ధులు, మనస్సులు మారి మీలో నూతనత్వం రావాలి. 24 దేవుడు తన పోలికలతో సృష్టించిన క్రొత్త మనిషిగా మీరు మారాలి. ఆ క్రొత్త మనిషిలో నిజమైన నీతి, పవిత్రత ఉన్నాయి.
25 మనమంతా ఒకే శరీరానికి చెందిన వాళ్ళము కనుక అబద్ధం చెప్పటం మానుకోవాలి. సత్యమే మాట్లాడాలి. 26 మీరు మీ కోపంలో పాపం చెయ్యకండి. ఒకవేళ కోప్పడినా సూర్యాస్తమయం కాకముందే మీ కోపం తగ్గిపోవాలి. 27 సాతానుకు అవకాశమివ్వకండి. 28 దొంగలు యికమీదట దొంగతనం చెయ్యరాదు. వాళ్ళు తమ చేతుల్ని మంచి పనులు చెయ్యటానికి ఉపయోగించాలి. అప్పుడు వాళ్ళు పేదవాళ్ళకు సహాయం చెయ్యగలుగుతారు.
29 దుర్భాషలాడకండి. ఇతర్ల అభివృద్ధికి తోడ్పడే విధంగా, వాళ్ళకు అవసరమైన విధంగా మాట్లాడండి. మీ మాటలు విన్నవాళ్ళకు లాభం కలగాలి. 30 మీకు విమోచన కలిగే రోజుదాకా మీలో ముద్రింపబడిన దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. 31 మీలో ఉన్న కక్షను, కోపాన్ని, పోట్లాడే గుణాన్ని, దూషించే గుణాన్ని మీ నుండి తరిమివేయండి. మీలో ఎలాంటి చెడుగుణం ఉండకూడదు. 32 దయాదాక్షిణ్యాలు అలవరచుకోండి. దేవుడు క్రీస్తు ద్వారా మిమ్మల్ని క్షమించినట్లు మీరు కూడా యితరులను క్షమించండి.
5 మీరు దేవుని సంతానం. మీరు ఆయనకు ప్రియమైన బిడ్డలు. కనుక ఆయన వలె ఉండటానికి ప్రయత్నించండి. 2 క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మనకోసం దేవునికి తనను తాను ధూపంగా, బలిగా అర్పించుకొన్నాడు. మీరు ఆయనలా మీ తోటివాళ్ళను ప్రేమిస్తూ జీవించండి.
3 కాని మీరు వ్యభిచారాన్ని గురించి గాని, అపవిత్రతను గురించి గాని, దురాశను గురించి గాని మాట కూడా ఎత్తకూడదు. ఇలాంటి దుర్గుణాలు విశ్వాసుల్లో ఉండకూడదు. 4 అంతేకాక మీరు బూతు మాటలు, అర్థంలేని మాటలు పలుకకూడదు. అసభ్యమైన పరిహాసాలు చేయకూడదు. వీటికి మారుగా అన్ని వేళలా దేవునికి కృతజ్ఞతతో ఉండండి. 5 ఒకటి మాత్రం తథ్యమని గ్రహించండి. అవినీతి పరులు, అపవిత్రులు, అత్యాశాపరులు, నిజానికి ఇలాంటి వాళ్ళు విగ్రహారాధకులతో సమానము, ఇలాంటి వాళ్ళు దేవుడు మరియు క్రీస్తు పాలిస్తున్న రాజ్యానికి వారసులు కాలేరు.
6 వట్టిమాటలతో మిమ్మల్నెవరూ మోసం చెయ్యకుండా జాగ్రత్తపడండి. దేవుని పట్ల అవిధేయత ఉన్నవాళ్ళు శిక్షింపబడతారు. 7 వాళ్ళు చేస్తున్న పనుల్లో పాల్గొనకండి. 8 ఒకప్పుడు మీరు చీకట్లో జీవించారు. కాని ప్రభువులో ఐక్యత కలిగినందువల్ల ప్రస్తుతం వెలుగులో జీవిస్తున్నారు. వెలుగు సంతానంవలె జీవించండి. 9 ఎందుకంటే వెలుగునుండి మంచితనము, నీతి అనే ఫలాలు లభిస్తాయి. 10 ప్రభువుకు ఏది ఇష్టమో తెలుసుకొని ఆ ప్రకారము వెలుగు సంబంధులవలే చేయండి. 11 చీకటికి సంబంధించిన కార్యాలు చెయ్యకండి. వాటి వల్ల ఉపయోగం లేదు. అలాంటి కార్యాలు చేస్తున్నవాళ్ళను గురించి అందరికీ చెప్పండి. 12 అవిధేయులు రహస్యంగా చేసినవాటిని గురించి మాట్లాడటం కూడా అవమానకరం. 13 వాటిని వెలుగులోకి తెస్తే వాటి నిజస్వరూపం బయటపడుతుంది. 14 వెలుగు అన్నీ కనిపించేలా చేస్తుంది. అందువల్లే ఈ విధంగా వ్రాయబడింది:
“నిద్రిస్తున్న ఓ మనిషీ, మేలుకో!
బ్రతికి లేచిరా!
క్రీస్తు నీపై ప్రకాశిస్తాడు.”
15 మీరు ఏ విధంగా జీవిస్తున్నారో జాగ్రత్తగా గమనించండి. బుద్ధిహీనుల్లాకాక, బుద్ధిగలవారిలా జీవించండి. 16 ఇవి మంచి రోజులు కావు. కనుక వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకోండి. 17 మూర్ఖంగా ప్రవర్తించకండి. ప్రభువు ఆంతర్యాన్ని తెలుసుకోండి. 18 మత్తు పదార్థాలు త్రాగుతూ, త్రాగుబోతుల్లా జీవించకండి. త్రాగుబోతుతనం వ్యభిచారానికి దారితీస్తుంది. కనుక దానికి మారుగా పరిశుద్ధాత్మతో నింపబడండి. 19 స్తుతిగీతాలతో, పాటలతో, ఆత్మీయ సంకీర్తనలతో హెచ్చరింపబడుతూ, ప్రభువును మీ మనస్సులలో కీర్తిస్తూ, స్తుతిగీతాలు, పాటలు పాడండి. 20 మన ప్రభువైన యేసు క్రీస్తు పేరిట తండ్రియైన దేవునికి అన్ని వేళలా కృతజ్ఞతలు చెల్లించండి.
భార్యాభర్తలు
21 మీకు క్రీస్తు పట్ల భయభక్తులు ఉన్నాయి. కనుక ఒకరికొకరు లోబడి ఉండండి.
22 స్త్రీలు మీరు ప్రభువుపట్ల విశ్వాసం కనబరచండి. అలాగే మీ భర్తలపట్ల కూడా గౌరవము కనబరుస్తూ జీవించండి. 23 క్రీస్తు సంఘానికి శిరస్సు. సంఘము ఆయనకు శరీరంలాంటిది. ఆయన దాన్ని రక్షిస్తున్నాడు. అదే విధంగా భర్త భార్యకు శిరస్సులాంటివాడు. 24 సంఘం క్రీస్తుకు విధేయతగా ఉన్నట్లే భార్య తన భర్తకు అన్ని విషయాల్లో విధేయతగా ఉండాలి.
25 క్రీస్తు తన సంఘాన్ని ప్రేమించి దాని కోసం తనను అర్పించుకున్నట్లే భర్త తన భార్యను ప్రేమించి తనను అర్పించుకోవటానికి సిద్ధంగా ఉండాలి. 26 క్రీస్తు తన సంఘాన్ని పవిత్రం చేయాలని తనను తాను అర్పించుకున్నాడు. ఆ సంఘాన్ని దేవుని వాక్యమను నీళ్ళతో కడిగాడు; సువార్త సందేశంతో దాన్ని శుద్ధీకరించాడు. 27 దాన్ని తేజోవంతంగా, పవిత్రంగా మరకా మచ్చా లేకుండా, మరే తప్పూ లేకుండా, అపకీర్తి లేకుండా చేసేందుకు ఆ సంఘం కోసం తనకు తానే అర్పించుకొన్నాడు.
28 అదే విధంగా భర్త తన భార్యను తన శరీరంగా భావించి ప్రేమించాలి. తన భార్యను ప్రేమిస్తే తనను తాను ప్రేమించుకొన్నదానితో సమానము. 29 సహజంగా ఎవ్వరూ తమ శరీరాన్ని ద్వేషించరు. అందరూ తమ శరీరాన్ని పోషించుకొంటూ రక్షించుకొంటారు. 30 అదే విధంగా మనము క్రీస్తు శరీరంలో భాగాలము. కనుక ఆయన సంఘంగా ఉన్న మనల్ని ఆయన పోషించి రక్షిస్తాడు. 31 “ఈ కారణంగా పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి తన భార్యతో కలిసి జీవిస్తాడు. వాళ్ళిద్దరూ ఒకే శరీరంగా జీవిస్తారు.”(B) 32 ఇది గొప్ప రహస్యం. కాని నేను క్రీస్తును గురించి, ఆయన సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాను. 33 ఏది ఏమైనా ప్రతి ఒక్కడూ తనను తాను ప్రేమించుకొన్నంతగా తన భార్యను ప్రేమించాలి. భార్య తన భర్తను గౌరవించాలి.
తల్లిదండ్రుల్ని గౌరవించండి
6 బిడ్డలారా! ప్రభువు ఆజ్ఞాపించిన విధంగా మీరు మీ తల్లిదండ్రుల్ని గౌరవించండి. ఇది మంచిపని, 2 “మీ తల్లిదండ్రుల్ని గౌరవించండి”(C) అన్న దేవుని ఆజ్ఞ వాగ్దానముతో కూడినవాటిలో మొదటిది. 3 “మీకు శుభం కలుగుతుంది. భూలోకంలో మీ ఆయువు అభివృద్ధి చెంది ఆనందంగా జీవిస్తారు.”(D)
4 తండ్రులు తమ పిల్లలకు కోపం కలిగించరాదు. దానికి మారుగా ప్రభువు చెప్పిన మార్గాన్ని వాళ్ళకు బోధించి, అందులో శిక్షణనిచ్చి వాళ్ళను పెంచాలి.
బానిసలు, యజమానులు
5 బానిసలు తమ యజమానుల పట్ల విధేయతతో ఉండాలి. వాళ్ళకు మనస్ఫూర్తిగా క్రీస్తుకు విధేయులైనట్లు సేవ చెయ్యాలి. 6 వాళ్ళ అభిమానం సంపాదించాలనే ఉద్దేశ్యంతో వాళ్ళు గమనిస్తున్నప్పుడు మాత్రమే కాక అన్ని వేళలా మీ పనులు మీరు చెయ్యాలి. మీరు క్రీస్తు బానిసలు. కనుక మనస్ఫూర్తిగా దైవేచ్ఛానుసారం చెయ్యండి. 7 సంతోషంగా సేవ చెయ్యండి. మానవుల సేవ చేస్తున్నామని అనుకోకుండా ప్రభువు సేవ చేస్తున్నట్లు భావించండి. 8 ప్రభువు మనిషి చేసిన సేవను బట్టి ప్రతిఫలం ఇస్తాడు. అతడు బానిస అయినా సరే. లేక యజమాని అయినా సరే. ఇది మీరు జ్ఞాపకం ఉంచుకోండి.
9 యజమానులు బానిసలపట్ల మంచిగా ఉండాలి. యజమానులు బానిసలను భయపెట్టరాదు. మీ యజమాని, వాళ్ళ యజమాని పరలోకంలో ఉన్నాడు. ఆయన పక్షపాతం చూపడు.
దేవుడు యిచ్చిన ఆయుధాలు
10 చివరకు చెప్పేదేమిటంటే ప్రభువుతో మీకు లభించిన ఐక్యత మీకు అధిక బలాన్నిస్తుంది. ఆయనలో ఉన్న శక్తి మీకు శక్తినిస్తుంది. 11 సాతాను పన్నే పన్నాగాలను ఎదిరించటానికి దేవుడిచ్చిన ఆయుధాలన్నిటిని ధరించండి. 12 మనం పోట్లాడుతున్నది మానవులతో కాదు. చీకటిని పాలించే వాళ్ళతో, దానిపై అధికారమున్న వాళ్ళతో, చీకటిలోని శక్తులతో ఆకాశంలో కనిపించని దుష్టశక్తులతో మనం పోరాడుతున్నాము. 13 కనుక దేవుడిచ్చిన ఆయుధాలను ధరించండి. అప్పుడు ఆ దుర్దినమొచ్చినప్పుడు మీరు శత్రువును ఎదిరించ గలుగుతారు. చివరిదాకా పోరాడాక కూడా మీ యుద్ధరంగంలో మీరు నిలబడగలుగుతారు.
14 కనుక ధైర్యంగా నిలబడండి. సత్యమనే దట్టి నడుముకు చుట్టుకొని, నీతి అనే కవచాన్ని ధరించండి. 15 శాంతి సందేశమనే పాదరక్షల్ని ధరించి సిద్ధంగా ఉండండి. 16 వీటితో పాటు విశ్వాసమనే డాలును ధరించి సాతాను ప్రయోగించే అగ్నిబాణాల్ని ఆర్పటానికి సిద్ధంకండి. 17 రక్షణ అనే శిరస్త్రాణము, ఆత్మ యిచ్చిన వాక్యమనే దేవుని ఖడ్గాన్ని ధరించండి. 18 ప్రార్థనలు, విన్నపాలు, పరిశుద్ధాత్మ ద్వారా చెయ్యండి. అన్ని వేళలా ప్రార్థించండి. మెలకువతో ఉండండి. దేవుని ప్రజలకోసం ప్రార్థించటం మానవద్దు. వాళ్ళ కోసం అన్ని వేళలా ప్రార్థించండి.
19 నేను నా నోరు కదల్చినప్పుడు దేవుడు తన వాక్యాన్ని నాకందివ్వాలని నాకోసం కూడ ప్రార్థించండి. అప్పుడు నేను దైవసందేశంలో ఉన్న రహస్యాన్ని ధైర్యంగా చెప్పగలుగుతాను. 20 సంకెళ్ళలోవున్న నేను ఈ సందేశం బోధించటానికి రాయబారిగా వచ్చాను. నేను ధైర్యంగా ప్రకటించాలి కనుక ఆ ధైర్యం నాలో కలిగేటట్లు నాకోసం ప్రార్థించండి.
చివరి వందనాలు
21 ప్రభువును విశ్వసిస్తున్న సేవకుడు, మన ప్రియ సోదరుడు అయిన “తుకికు” మీకు అన్నీ చెబుతాడు. అతని ద్వారా మీకు నేను ఎలా ఉన్నానో, ఏమి చేస్తున్నానో తెలుస్తుంది. 22 మేము ఏ విధంగా ఉన్నామో మీరు తెలుసుకోవాలని మరియు అతడు మీకు ప్రోత్సాహం కలిగించాలని అతణ్ణి నేను మీ దగ్గరకు పంపుతున్నాను.
23 సోదరులందరికీ తండ్రియైన దేవుని నుండి, యేసు క్రీస్తు ప్రభువు నుండి విశ్వాసంతో పాటు శాంతి, ప్రేమ లభించుగాక! 24 మన యేసు క్రీస్తు ప్రభువును ప్రేమించేవాళ్ళకు ఆయన అనుగ్రహం ఎల్లప్పుడూ లభించుగాక!
© 1997 Bible League International