Beginning
అష్షూరీయులు యూదాను ముట్టడించుట
36 యూదాకు హిజ్కియా రాజు. అష్షూరుకు సన్హెరీబు రాజు. హిజ్కియా రాజైన పదునాలుగవ సంవత్సరంలో సన్హెరీబు యూదా పట్టణాల మీద యుద్ధం చేశాడు. మరియు సన్హెరీబు ఆ పట్టణాలను ఓడించేశాడు. 2 యెరూషలేము మీద యుద్ధం చేయటానికి సన్హెరీబు తన సైన్యాధిపని పంపించాడు. ఆ సైన్యాధిపతి లాకీషును విడిచి, యెరూషలేములోని హిజ్కియా దగ్గరకు వెళ్లాడు. ఆ సైన్యాధిపతి బలమైన తన సైన్యాన్ని తనతో కూడా నడిపించాడు. ఆ సైన్యాధిపతి, అతని సైన్యం చాకలివాని పొలం దగ్గర ఉన్న దారికి వెళ్లారు. మెట్ట మీది కొలను నుండి వచ్చే జంట కాల్వల దగ్గర ఈ మార్గం ఉంది.
3 ఆ సైన్యాధిపతితో మాట్లాడుటకు ముగ్గురు మనుష్యులు యెరూషలేము నుండి బయటకు వెళ్లారు. వీరు హిల్కీయా కుమారుడు ఎల్యాకీము, ఆసాపు కుమారుడు యోవాహు, షెబ్నా, ఎల్యాకీము రాజభవన సంరక్షకుడు. యెహోవా అధికార పత్రాలు భద్రపరచేవాడు; షెబ్నా రాజ్యపు కార్యదర్శి.
4 సైన్యాధిపతి వారితో చెప్పాడు, “మీరు రాజైన హిజ్కియాతో ఈ సంగతులు చెప్పండి:
“మహారాజు, అష్షూరు రాజు చెబుతున్నాడు, మీ సహాయం కోసం మీరు దేనిని నమ్ముకొంటున్నారు? 5 మీరు గనుక మీ బలాన్నీ, తెలివిగల మీ యుద్ధ తంత్రాలనూ నమ్ముకొంటే అవన్నీ నిష్ప్రయోజనమే అని నేను చెబుతున్నాను. అవి వట్టి మాటలు తప్ప ఇంకేమీ లేదు. కనుక మీరు నాకు విరోధంగా ఎందుకు యుద్ధం చేస్తారు? 6 ఇప్పుడు నేను మళ్లీ అడుగుతున్నాను, మీ సహాయం కోసం మీరు ఎవరిని నమ్ముకొంటున్నారు? మీ సహాయం కోసం మీరు ఈజిప్టు మీద ఆధారపడ్తున్నారా? ఈజిప్టు విరిగిపోయిన కర్రలా ఉంది. ఆధారంగా మీరు దానిమీద ఆనుకొంటే, అది మీకు బాధ మాత్రమే కలిగిస్తుంది, మీ చేతికి గాయం చేస్తుంది. ఈజిప్టు రాజు ఫరో సహాయంకోసం అతని మీద ఆధారపడే వాళ్లెవ్వరూ అతణ్ణి నమ్మలేరు.
7 “అయితే మీరు అనవచ్చు, ‘మా సహాయం కోసం మేం మా దేవుడు యెహోవాను విశ్వసిస్తున్నాం’ అని. అయితే యెహోవా బలిపీఠాలను, ఆరాధించే ఉన్నత స్థలాలను హిజ్కియా నాశనం చేసేశాడు అని నేనంటున్నాను. ఇది నిజం, అవునా? యూదాకు, యెరూషలేముకు హిజ్కియా ఈ సంగతులు చెప్పటం సత్యం, ‘ఇక్కడ యెరూషలేములో ఒకే బలిపీఠం దగ్గర మీరు ఆరాధిస్తారు.’
8 “అయినా మీరు ఇంకా యుద్ధం చేయాలనే అనుకొంటే, నా ప్రభువు, అష్షూరు రాజు మీతో ఈ ఒడంబడిక చేస్తాడు! యుద్ధ రంగంలో స్వారీ చేయగల రెండువేల మంది మీకు ఉంటే, నేను మీకు అన్ని గుర్రాలు ఇస్తాను. 9 అలాగైనా సరే, నా యజమాని బానిసల్లో ఒక్కడిని, చివరికి ఒక చిన్న అధికారిని కూడా మీరు ఓడించలేరు. అందుచేత ఈజిప్టు సైనికుల మీద రథాల మీద ఎందుకు మీరు ఆధారపడతారు?
10 “మరియు నేను వచ్చి ఈ దేశంలో యుద్ధం చేసినప్పుడు యెహోవా నాతో ఉన్నాడని కూడ జ్ఞాపకం ఉంచుకోండి. నేను పట్ణణాలను నాశనం చేసినప్పుడు యెహోవా నాతో ఉన్నాడు. ‘లేచి నిలబడే ఈ దేశానికి వెళ్లి, దీన్ని నాశనం చేయి’” అని యెహోవా నాతో చెప్పాడు.
11 ఎల్యాకీము, షెబ్నా, యోవాహు, “దయచేసి సిరియా భాషలో మాతో మాట్లాడు. మా యూదా భాషలో మాతో మాట్లాడవద్దు. నీవు యూదా భాషలో మాట్లాడితే, నగరం గోడమీద మనుష్యులు అర్థం చేసుకొంటారు” అని ఆ సైన్యాధిపతితో చెప్పారు.
12 కానీ సైన్యాధిపతి, “మీకూ, మీ యజమానుడు హిజ్కియాకూ మాత్రమే చెప్పమని మా యజమాని నన్ను పంపించలేదు. ఆ గోడల మీద కూర్చొన్న మనుష్యులతో కూడ చెప్పమని నా యజమాని నన్ను పంపించాడు. ఆ మనుష్యులకు ఆహారంగాని భోజనం గాని ఉండదు. వాళ్లు కూడా మీలాగే, వారి మల మూత్రాలనే తిని, త్రాగుతారు” అని చెప్పాడు.
13 అప్పుడు సైన్యాధికారి లేచి, పెద్ద స్వరంతో మాట్లాడాడు. అతడు యూదా భాషలో మాట్లాడాడు. 14 సైన్యాధికారి చెప్పాడు, “మహారాజు అష్షూరు రాజు మాటలు వినండి:
“హిజ్కియా మిమ్మల్ని మోసం చేయనివ్వకండి. అతడు మిమ్మల్ని రక్షించలేడు. 15 ‘యెహోవా మీద విశ్వాసం ఉంచండి, యోహోవా మనలను రక్షిస్తాడు. అష్షూరు రాజు మన పట్టణం గెలవకుండా యెహోవా చేస్తాడు’ అని హిజ్కియా చెప్పినప్పుడు అతని మాటలు నమ్మవద్దు.
16 “హిజ్కియా చెప్పే ఆ మాటలు వినవద్దు. అష్షూరు రాజు మాట వినండి. అష్షూరు రాజు చెబుతున్నాడు, ‘మనం ఒక ఒడంబడిక చేసుకొందాం. ప్రజలారా, మీరు పట్టణం వదలి పెట్టి నా దగ్గరకు రండి. అప్పుడు ప్రతి ఒక్కరు స్వతంత్రులుగా ఇంటికి వెళ్లవచ్చును. ప్రతి ఒక్కరు తన స్వంత ద్రాక్షవల్లినుండి ద్రాక్షపండ్లు తినేందుకు స్వేచ్ఛ ఉంటుంది. ప్రతి వ్యక్తీ తన స్వంత అంజూరపు చెట్టు ఫలాలు తినే స్వేచ్ఛ ఉంటుంది. ప్రతి వ్యక్తీ తన స్వంత బావి నుండి నీళ్లు తాగే స్వేచ్ఛ ఉంటుంది. 17 నేను వచ్చి, మీ స్వంత దేశంలాంటి దేశానికి మిమ్మల్ని ఒక్కొక్కరిని తీసుకొని వెళ్లేంత వరకు మీరు ఇలా చేయవచ్చు. ఆ క్రొత్త దేశంలో మీకు మంచి ధాన్యం, క్రొత్త ద్రాక్షరసం ఉంటాయి. ఆ దేశంలో భోజనం, ద్రాక్షవనాలు ఉంటాయి.’
18 “హిజ్కియా మిమ్మల్ని వెర్రి వాళ్లనుగా చేయనియ్యకండి. ‘యెహోవా మనలను రక్షిస్తాడు.’ అని అతడు అంటాడు. అయితే యితర రాజ్యాల్లోని యితర దేవుళ్లు ఎవరైనా సరే వారిని అష్షూరు బలంనుండి రక్షించారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. లేదు. 19 ఆ ప్రజల్లో ప్రతి ఒక్కరినీ మేము ఓడించాం. హమాతు, అర్పదు దేవుళ్లు ఏమయ్యారు? వారు ఓడించబడ్డారు. సెపర్యయీం దేవతలు ఎక్కడ? వారు ఓడించబడ్డారు. సమరయ దేవుళ్లు ఆ ప్రజలను నా బలంనుండి రక్షించారా? లేదు. 20 ఆ రాజ్యాలన్నింటిలో నా బలం నుండి తన ప్రజలను రక్షించగలిగిన ఒక్క దేవుని పేరు నాకు చెప్పండి. నేను వాళ్లందర్నీ ఓడించేశాను. అందుచేత నా బలంనుండి యెహోవా యెరూషలేమును రక్షించజాలడు.”
21 యెరూషలేములోని ప్రజలు చాలా మౌనంగా ఉన్నారు. ఆ సైన్యాధికారికి వారు జవాబు చెప్పలేదు. (హిజ్కియా ప్రజలకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. “ఆ సైన్యాధికారికి జవాబు చెప్పవద్దు” అని హిజ్కియా ఆజ్ఞాపించాడు.)
22 అప్పుడు రాజభవన అధికారి (హిజ్కియా కుమారుడు ఎల్యాకీము) రాజ్య కార్యదర్శి (షెబ్నా) అధికార పత్రాలు భద్రపరిచే అధికారి (ఆసాపు కుమారుడు యోవాహు) వారి బట్టలు చింపివేశారు. (వారు చాలా విచారించినట్టు ఇది సంకేతం) ఆ ముగ్గురు మనుష్యులూ హిజ్కియా దగ్గరకు వెళ్లి, సైన్యాధికారి తమతో చెప్పిన సంగతులన్నీ అతనితో చెప్పారు.
హిజ్కియా దేవుణ్ణి సహయం చేయమని అడుగుట
37 సైన్యాధికారి సందేశం హిజ్కియా విన్నాడు. ఆ సందేశం అతడు విన్నప్పుడు, హిజ్కియా తన బట్టలు చింపేసుకొన్నాడు. అప్పుడు హిజ్కియా సంతాప సూచకమైన ప్రత్యేక వస్త్రాలు ధరించి యెహోవా మందిరానికి వెళ్లాడు.
2 రాజభవన అధికారిని (ఎల్యాకీము), రాజ్య కార్యదర్శిని (షెబ్నా), యాజకుల్లో పెద్దలను, ఆమోజు కుమారుడు యెషయా దగ్గరకు హిజ్కియా పంపించాడు. ఈ ముగ్గురు మనుష్యులూ సంతాప వస్త్రాలు ధరించారు. 3 ఈ మనుష్యులు యెషయాతో చెప్పారు: “ఈ రోజు దుఃఖం, విచారం వ్యక్తం చేసే ప్రత్యేక సంతాపదినంగా ఉండాలని హిజ్కియా రాజు ఆదేశించాడు. ఇది చాలా విచారకరమైన రోజుగా ఉంటుంది. ఆ రోజు శిశువు జన్మించాల్సినప్పటికీ, తల్లిలో నుండి బయటకు వచ్చే శక్తి లేక అది బయటకు రాని రోజులా అది ఉంటుంది. 4 ఒక వేళ, మీ దేవుడు యెహోవా, ఆ సైన్యాధికారి చెప్పిన సంగతులు వింటాడేమో జీవంగల దేవుణ్ణి గూర్చి చాలా చెడ్డ మాటలు మాట్లాడేందుకు అష్షూరు రాజు సైన్యాధికారిని పంపించాడు. మరియు మీ దేవుడు యెహోవా ఆ చెడు సంగతులు విన్నాడు. మిగిలి ఉన్న కొద్దిమంది ఇశ్రాయేలు ప్రజల కోసం దయచేసి ప్రార్థించండి.”
5 హిజ్కియా సేవకులు యెషయా దగ్గరకు వెళ్లారు. 6 యెషయా వాళ్లతో చెప్పాడు: “మీ యజమానియైన హిజ్కియాకు ఈ విషయాలు చెప్పండి: యెహోవా చెప్పునదేమనగా, ‘సైన్యాధిపతి నుండి విన్న మాటలకు మీరు భయపడవద్దు. అష్షూరు రాజు దగ్గర నుండి వచ్చిన ఆ “కుర్రవాళ్లు” నన్ను గూర్చి చెప్పిన చెడు విషయాలు నమ్మవద్దు. 7 చూడండి, అష్షూరుకు విరోధంగా నేను ఒక ఆత్మను పంపిస్తాను. అష్షూరు రాజు యొక్క దేశానికి ఒక ప్రమాదం గూర్చి హెచ్చరిక చేస్తూ అతనికి సమాచారం అందుతుంది. కనుక అతడు తిరిగి తన దేశం వెళ్లిపోతాడు. ఆ సమయంలో అతని స్వంత దేశంలోనే నేను అతణ్ణి ఒక ఖడ్గంతో చంపేస్తాను.’”
అష్షూరు సైన్యం యెరూషలేమును విడచుట
8-9 అష్షూరు రాజుకు సమాచారం అందింది. “ఇథియోపియా రాజు తిర్హాకా నీతో యుద్ధం చేయటానికి వస్తున్నాడు” అని ఆ సమాచారం తెలియజేసింది. కనుక అష్షూరు రాజు లాకీషు పట్టణం విడిచి లిబ్నాకు వెళ్లాడు. సైన్యాధికారి ఇది విని, అష్షూరు రాజు యుద్ధం చేస్తున్న లిబ్నా పట్టణం వెళ్లాడు.
అప్పుడు సైన్యాధికారి హిజ్కియా దగ్గరకు సందేశకులను పంపించాడు. సైన్యాధికారి చెప్పాడు. 10 “యూదా రాజు హిజ్కియాతో మీరు ఈ సంగతులు చెప్పండి:
‘నీవు నమ్ముకొన్న దేవుని ద్వారా వెర్రివాడవు కావద్దు. “అష్షూరు రాజు చేత యెరూషలేమును దేవుడు ఓడిపోనివ్వడు!” అని చెప్పవద్దు. 11 వినండి, అష్షూరు రాజులను గూర్చి మీరు విన్నారు. ప్రతి దేశంలోని ప్రజలను వారు ఓడించారు. మరియు అష్షూరు రాజు నిన్నుకూడ ఓడించి, చంపుతాడు. 12 ఆ ప్రజల దేవుళ్లు వాళ్లను రక్షించారా? లేదు. నా తండ్రులు (పూర్వీకులు) వారిని నాశనం చేశారు. గోజాను, హారాను, రెజెపు పట్టణాలను, తెలశ్శారులో నివసిస్తున్న ఏదేను ప్రజలను నా ప్రజలు ఓడించారు. 13 హమాతు, అర్పాదు రాజులు ఎక్కడ? సెపర్వయీము రాజు ఎక్కడ? హేన, ఇవ్వా రాజులు ఎక్కడ? వారి పని అయిపోయింది. వాళ్లంతా నాశనం చేయబడ్డారు.’”
హిజ్కియా దేవునికి ప్రార్థించుట
14 హిజ్కియా ఆ మనుష్యుల దగ్గర నుండి ఆ ఉత్తరం అందుకొని, దానిని చదివాడు. అప్పుడు హిజ్కియా యెహోవా మందిరానికి వెళ్లాడు. హిజ్కియా ఉత్తరం తెరిచి, దానిని యెహోవా ముందర దానిని పరిచాడు. 15 హిజ్కియా యెహోవాను ప్రార్థించటం మొదలు పెట్టాడు. హిజ్కియా చెప్పాడు: 16 సర్వశక్తిమంతుడైన యెహోవా, ఇశ్రాయేలీయుల దేవా, కెరూబు దూతల మధ్య నీవు రాజుగా ఆసీనుడవయ్యావు. భూలోక రాజ్యాలన్నింటినీ పాలించే దేవుడవు నీవు ఒక్కడవే, భూమ్యాకాశాలను నీవే చేశావు. 17 నా ప్రార్థన ఆలకించు! నీ నేత్రాలు తెరచి, సన్హెరీబు పంపిన ఈ వార్త చూడు. సన్హెరీబు నాకు ఈ సందేశం పంపించాడు జీవముగల దేవుడవైన నిన్ను గూర్చి చెడు విషయాలను ఈ సందేశం చెబుతోంది. 18 యెహోవా, అష్షూరు రాజులు నిజంగానే అన్ని దేశాలనూ, వాటి స్థలాలనూ నాశనం చేశారు. 19 ఆ దేశాల దేవుళ్లను అష్షూరు రాజులు కాల్చివేశారు. అయితే అవి నిజమైన దేవుళ్లు కారు. అవి కేవలం మనుష్యులు చేసిన విగ్రహాలే. అవి కేవలం రాయి, చెక్క మాత్రమే. అందుకే వాటిని వారు నాశనం చేయగలిగారు. 20 కానీ నీవు యెహోవా, మా దేవుడివి. కనుక అష్షూరు రాజు బలంనుండి దయతో మమ్మల్ని రక్షించు. అప్పుడు నీవే యెహోవా అని, నీవు మాత్రమే దేవుడవు అని మిగిలిన రాజ్యాలన్నీ తెలుసుకొంటాయి.
హిజ్కియాకు దేవుని జవాబు
21 అప్పుడు ఆమోజు కుమారుడు యెషయా హిజ్కియాకు ఒక సందేశం పంపించాడు. యెషయా చెప్పాడు, “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు నీవు ప్రార్థన చేశావు, ‘సన్హెరీబు దగ్గర్నుండి వచ్చిన సందేశాన్ని గూర్చి నీవు ప్రార్థించావు.’
22 “యెహోవా నీ ప్రార్థన విన్నాడు, నన్ను నీ దగ్గరకు రమ్మన్నాడు. ఇదే యెహోవా నుండి వచ్చిన సందేశం:
‘ఓ సీయోను పెండ్లి కుమార్తె (యెరూషలేము) ప్రజలు నీ దగ్గర దొంగిలించారు
ప్రజలు నిన్ను ఎగతాళి చేశారు.
యెరూషలేము కుమారీ ప్రజలు నిన్ను గూర్చి
చెడు విషయాలు తలచారు.
23 ఓ అష్షూరు రాజా, నన్ను గూర్చి నీవు చెడు విషయాలు చెప్పావు.
నీవు నాకు విరోధంగా మాట్లాడావు. నేను ఎవరినో నీకు తెలుసా?
నీ కళ్లు పైకెత్తి ఆకాశం వైపు చూడు.
ఇశ్రాయేలీయుల పరిశుద్ధుణ్ణి గూర్చి నీవు చెడు విషయాలు చెప్పినట్టు నీవు చూస్తావు.
24 యెషయా ఇంకా ఇలా చెప్పాడు, నా ప్రభువు యెహోవాను గూర్చి చెడు సంగతులు చెప్పడానికి నీవు నీ సేవకులను వాడుకొన్నావు.
నీవు ఇలా అన్నావు:
“నేను చాలా శక్తిమంతుణ్ణి. నాకు ఎన్నెన్నో రథాలు ఉన్నాయి.
లెబానోను మహాపర్వతాల మీదుగా దాటించి నా రథాలను నేను తీసుకొని వచ్చాను.
లెబానోను మహా వృక్షాలను (సైన్యాలను)
అన్నింటినీ నేను నరికివేశాను.
25 ఈజిప్టులోని ప్రతి నదికీ నేను వెళ్లాను. ఆ నదులన్నింటి నీళ్లతో నేను నా చేతులు నింపుకొన్నాను. నేను ఆ నీళ్లు తాగాను.
నా స్వంత శక్తితో, ఈజిప్టులోని
నదులన్నింటినీ (శక్తిని) నేను నాశనం చేశాను.”
26 “‘అని నీవు చెప్పావు. అయితే నేను చెప్పినది నీవు వినలేదా?
అష్షూరు రాజా, దేవుడనైన నేనే ఆ సంగతులను చేశానని నిశ్చయంగా నీవు ఎప్పుడో విన్నావు.
చాలాకాలం క్రిందట నేను అష్షూరును చేశాను. ఇప్పుడు నిన్ను ఇక్కడికి నేనే తీసుకొని వచ్చాను.
మిగిలిన ఇతర పట్టణాలను నిన్ను నాశనం చేయనిచ్చాను.
నా పనిలో నేనే నిన్ను వాడుకొని,
ఆ పట్టణాలను రాళ్ల కుప్పలుగా చేశాను.
27 ఆ పట్టణాల్లో జీవించిన మనుష్యులు బలహీనులు.
ప్రజలు భయపడేవాళ్లు, సిగ్గుపడేవాళ్లు.
ఆ మనుష్యులు పొలంలో
గడ్డిలాంటి వాళ్లు.
వారు ఇండ్ల కప్పుల మీద మొలకెత్తే గడ్డిలాంటి వారు.
ఆ గడ్డి ఎదుగక ముందే వేడి ఎడారి గాలికి కాలిపోతుంది.
28 నీ సైన్యం, నీ యుద్ధాలు అన్నింటిని గూర్చి నాకు తెలుసు.
నీవు ఎప్పుడు విశ్రాంతి తీసుకొన్నావో నాకు తెలుసు.
నీవు ఎప్పుడు యుద్ధానికి వెళ్లావో నాకు తెలుసు.
యుద్ధంనుండి నీవు ఇంటికి ఎప్పుడు తిరిగి వచ్చావో నాకు తెలుసు.
నీవు నా మీద కోపంగా ఉన్నావని నాకు తెలుసు.
29 నీవు నా మీద కోపంగా ఉన్నవు,
నన్ను గూర్చి చెడ్డగా మాట్లాడావు. నీవు చెప్పిన విషయాలు నేను విన్నాను.
కనుక నిన్ను నేను శిక్షిస్తాను. నీ ముక్కుకు నేను గాలం వేస్తాను;
నీ నోటికి నేను కళ్లెం వేస్తాను.
అప్పుడు నీవు నా దేశాన్ని విడిచి, నీవు వచ్చిన దారినే పోయేట్టు
నేను నిన్ను వెళ్లగొడతాను.’”
హిజ్కియాకు యెహోవా సందేశం
30 అప్పుడు యెహోవా హిజ్కియాతో చెప్పాడు: “హిజ్కియా, ఈ మాటలు సత్యమని నీకు చూపించటానికి నీకు నేను ఒక గురుతు ఇస్తాను. ఈ సంవత్సరం తినేందుకు మీరు ధాన్యపు గింజలు నాటారు. కనుక పోయిన సంవత్సరపు పంటనుండి విచ్చలవిడిగా పండిన ధాన్యాన్ని ఈ సంవత్సరం మీరు తింటారు. కానీ మూడు సంవత్సరాలకు మీరు నాటుకొన్న ధాన్యం మీరు తింటారు. ఆ పంటలను మీరు కోస్తారు. తినేందుకు మీకు సమృద్ధిగా ఉంటుంది. మీరు ద్రాక్ష వల్లులు నాటి, వాటి ఫలాలు తింటారు.
31 “యూదా వంశంలో కొంతమంది ప్రజలు రక్షించబడతారు. ఆ కొద్దిమంది మనుష్యులు చాలా పెద్దరాజ్యంగా తయారవుతారు. ఆ ప్రజలు భూమిలో లోతుగా వేర్లు తన్ని, బలంగా ఎదిగే మొక్కల్లా ఉంటారు. అప్పుడు ప్రజలకు నేలమీద విస్తారమైన ఫలం (పిల్లలు) ఉంటుంది. 32 ఎందుకంటే, యెరూషలేము నుండి కొద్ది మంది మనుష్యులు బ్రతికివస్తారు. సీయోను కొండనుండి బ్రతికిన వారు వస్తారు.” సర్వశక్తిమంతుడైన యెహోవా బలీయమైన ప్రేమ దీనిని చేస్తుంది.
33 కనుక అష్షూరు రాజు గురించి యెహోవా చెబుతున్నాడు,
“నీవు ఈ పట్టణంలో ప్రవేశించవు.
నీవు ఈ పట్టణం మీద ఒక బాణంకూడ వేయవు.
నీ డాళ్లతో నీవు ఈ పట్టణం మీద యుద్ధానికి కదలిరాలేవు.
పట్టణం గోడలకు నీవు ఒక్క దిబ్బను కూడ కట్టలేవు.
34 నీవు వచ్చిన దారినే నీ దేశానికి తిరిగి వెళ్లిపోతావు.
నీవు ఈ పట్టణం లో ప్రవేశించవు.
ఈ సందేశం యెహోవా దగ్గర్నుండి వచ్చింది.
35 ఈ పట్టణాన్ని నేను కాపాడి, రక్షిస్తాను.
నా కోసమూ, నా సేవకుడు దావీదు కోసమూ నేను దీనిని చేస్తాను.”
అష్షూరు సైన్యం నాశనమయింది
36 కనుక యెహోవా దూత వెళ్లి, అష్షూరి వారి బసలో ఒక లక్ష ఎనభై అయిదు వేలమంది మనుష్యులను చంపేశాడు. మర్నాడు ఉదయం మనుష్యులు లేచి చూడగా, వారి చుట్టూ చచ్చిన శవాలే వారికి కనబడ్డాయి. 37 కనుక అష్షూరు రాజు నీనెవెకు తిరిగి వెళ్లి అక్కడే ఉండిపోయాడు.
38 ఒక రోజు సన్హెరీబు అతని దేవుడు నిస్రోను గుడిలో పూజిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అతని ఇద్దరు కుమారులు, అద్రమ్మెలెకు, షెరెజెరు కత్తితో అతనిని చంపేశారు. తర్వాత ఆ కుమారులు అరారాతుకు పారిపోయారు. అందుచేత సన్హెరీబు కుమారుడు ఎసర్హద్దోను అష్షూరుకు క్రొత్త రాజు అయ్యాడు.
హిజ్కియా జబ్బు
38 ఆ కాలంలో హిజ్కియాకు జబ్బు చేసింది. అతనికి దాదాపు మరణ పరిస్థితి ఏర్పడింది. ఆమోజు కుమారుడు యెషయా ప్రవక్త అతన్ని చూడటానికి వెళ్లాడు. “నేను ఈ సంగతులు నీతో చెప్పాలని యెహోవా నాకు చెప్పాడు. ‘త్వరలోనే నీవు మరణిస్తావు. కనుక నీవు చనిపోయినప్పుడు నీ కుటుంబం వారు ఏం చేయాలో నీవు వారితో చెప్పాలి. నీవు మళ్లీ బాగుపడవు’ అని యెషయా రాజుతో చెప్పాడు.”
2 హిజ్కియా దేవాలయపు గోడ తట్టు తిరిగి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. అతడు చెప్పాడు, 3 “యెహోవా, నేను నీ యెదుట ఎల్లప్పుడూ నమ్మకమైన పవిత్ర హృదయంతో జీవించానని దయచేసి జ్ఞాపకం చేసికొనుము. నీవు మంచివి అనే పనులే నేను చేశాను.” తర్వాత హిజ్కియా గట్టిగా ఏడ్వటం మొదలు బెట్టాడు.
4 యెహోవా దగ్గర్నుండి యెషయా ఈ సందేశాన్ని స్వీకరించాడు; 5 “హిజ్కియా దగ్గరకు వెళ్లి అతనితో చెప్పు, నీ పూర్వీకుడైన దావీదు దేవుడు, యెహోవా చెప్పే సంగతులు ఇవి, ‘నీ ప్రార్థనలు నేను విన్నాను, నీ దుఃఖపు కన్నీళ్లు నేను చూశాను. నేను నీ ఆయుష్షు పదిహేను సంవత్సరాలు ఎక్కువ చేస్తాను. 6 అష్షూరు రాజు నుండి నిన్ను నేను కాపాడుతాను. నిన్ను, ఈ పట్టణాన్ని నేను రక్షిస్తాను.’”
7 యెహోవా చెప్పిన వాటిని చేస్తాడని నీకు చూపించేందుకు యిదే సంకేతం. 8 “చూడు, ఆహాజు మెట్ల మీద ఉన్న ఎండ గడియారము నీడను పది అడుగులు వెనుకకు వెళ్లేటట్టు నేను చేస్తున్నాను. దిగిపోయిన సూర్యుని నీడ పది అడుగులు వెనుకకు వెళ్తుంది.”
హిజ్కియా పాట
9 హిజ్కియా రోగమునుండి స్వస్థత పొందినప్పుడు వ్రాసిన గీతం:
10 నేను వృద్ధుడనయ్యేంత వరకు బ్రతుకుతానని నాలో నేను అనుకొన్నాను.
కానీ నేను పాతాళ ద్వారాలగుండా వెళ్లాల్సిన సమయం అది. ఇప్పుడు నేను నా సమయమంతా అక్కడే గడపాలి.
11 కనుక నేను చెప్పాను: “సజీవుల దేశంలో ప్రభువైన యెహోవాను నేను మరల చూడను.
భూమిమీద మనుష్యులు జీవించుట నేను మరల చూడను.
12 నా ఇల్లు, నా గొర్రెల కాపరి గుడారం లాగివేయబడి నానుండి తీసివేయబడుతుంది.
మగ్గమునుండి ఒకడు బట్టను చుట్టి కత్తిరించినట్టు నా పని అయిపోయింది.
ఒక్క రోజులో ఉదయంనుండి రాత్రి వరకు నీవు నన్ను ఇంతవరకు తీసుకొనివచ్చావు.
13 రాత్రి అంతా నేను సింహంలా గట్టిగా అరిచాను.
అయితే సింహం ఎముకలు నమిలినట్టు నా ఆశలు అణగ ద్రొక్కబడ్డాయి.
ఒక్క రోజులో ఉదయంనుండి రాత్రి వరకు నీవు నన్ను ఇంతవరకు తీసుకొని వచ్చావు.
14 నేను గువ్వలా మూల్గాను.
నేను పక్షిలా ఏడ్చాను.
నా కళ్లు క్షీణించాయి
కానీ నేను ఆకాశం తట్టు చూస్తూనే ఉన్నాను.
నా ప్రభువా, నాకు కష్టాలు ఉన్నాయి.
నాకు సహాయం చేస్తానని వాగ్దానం చేయుము.”
15 నేనేం చెప్పగలను?
జరిగేదేమిటో నా ప్రభువు నాకు చెప్పాడు.
నా యజమాని దానిని జరిగిస్తాడు.
నా ఆత్మలో నాకు ఈ కష్టాలు కలిగాయి.
కనుక ఇప్పుడు నేను జీవితాంతం దీనుడనుగా ఉంటాను.
16 నా ప్రభూ, నా ఆత్మ మరల జీవించేట్టుగా ఈ కష్ట సమయాన్ని ఉపయోగించు
నా ఆత్మ బలపడి, ఆరోగ్యంగా ఉండేందుకు సహాయం చేయుము.
నేను బాగుపడేందుకు సహాయం చేయి.
మరల జీవించేందుకు నాకు సహాయం చేయుము.
17 చూడండి, నా కష్టాలు తొలగి పోయాయి.
ఇప్పుడు నాకు శాంతి ఉంది.
నీవు నన్ను ఎంతో ప్రేమిస్తున్నావు.
నీవు నన్ను సమాధిలో మురిగి పోనివ్వలేదు.
నీవు నా పాపాలన్నీ క్షమించావు.
నీవు నా పాపాలను దూరంగా పారవేశావు.
18 చచ్చినవాళ్లు నీకు స్తుతులు పాడరు.
పాతాళంలోని ప్రజలు నిన్ను స్తుతించరు.
చచ్చినవాళ్లు సహాయం కోసం నిన్ను నమ్ముకోరు. వారు భూగర్భంలోనికి వెళ్తారు, మరల ఎన్నటికీ మాట్లాడరు.
19 నేడు నాలాగే బ్రతికి ఉన్న మనుష్యులే
నిన్ను స్తుతించేవారు.
నీవు నమ్మదగిన వాడవని ఒక తండ్రి తన పిల్లలతో చెప్పాలి.
20 కనుక నేను అంటాను: “యెహోవా నన్ను రక్షించాడు
కనుక మా జీవిత కాలమంతా మేము యెహోవా ఆలయంలో పాటలు పాడి, వాయిద్యాలు వాయిస్తాం.”
21 అప్పుడు యెషయా, “నీవు అంజూరపు పండ్లను దంచి, నీ పుండ్ల మీద వేయాలి, అప్పుడు, నీవు స్వస్థపడతావు” అని హిజ్కియాతో చెప్పాడు.
22 కానీ హిజ్కియా, “నేను బాగవుతానని రుజువు చేసేందుకు యెహోవా దగ్గర్నుండి వచ్చే గురుతు ఏమిటి? నేను యెహోవా మందిరానికి వెళ్ల గలుగుతానని రుజువుచేసే సంకేతం ఏమిటి?” అని యెషయాను అడిగాడు.
బబులోను నుంచి సందేశహరులు
39 ఆ కాలంలో బలదాను కుమారుడు మెరోదక్బలదాను బబులోనుకు రాజు. మెరోదక్ ఉత్తరాలు, కానుకలు హిజ్కియాకు పంపించాడు. హిజ్కియా జబ్బుపడి బాగయ్యాడని విన్నందువల్ల మెరోదక్ కానుకలు పంపించాడు. 2 ఈ కానుకలు హిజ్కియాకు చాలా సంతోషం కలిగించాయి. అందుచేత హిజ్కియా, మెరోదక్ మనుష్యులను తన రాజ్యంలోని ప్రత్యేక వస్తువులను చూడనిచ్చాడు. తన సకల ఐశ్వర్యాలు, వెండి, బంగారం, ఖరీదైన తైలాలు, పరిమళాలు ఆ మనుష్యులకు హిజ్కియా చూపించాడు. యుద్ధంలో ఉపయోగించే కత్తులు, డాళ్లు హిజ్కియా చూపించాడు. హిజ్కియా దాచి ఉంచినవన్నీ వారికి చూపించాడు. తన ఇంట్లో, రాజ్యంలో ఉన్నవి అన్నీ హిజ్కియా వారికి చూపించాడు.
3 ప్రవక్త యెషయా, హిజ్కియా దగ్గరకు వెళ్లి, “ఈ మనుష్యులు ఏమన్నారు? వాళ్లు ఎక్కడ్నుంచి వచ్చారు?” అని అతన్ని అడిగాడు.
“ఈ మనుష్యులు చాలా దూరదేశం నుండి నా దగ్గరకు వచ్చారు. ఈ మనుష్యులు బబులోను నుండి వచ్చారు.” అని హిజ్కియా చెప్పాడు.
4 కనుక యెషయా, “నీ రాజ్యంలో వాళ్లు ఏమి చూశారు?” అని అతణ్ణి అడిగాడు.
“నా రాజభవనంలో సమస్తమూ వాళ్లు చూశారు. నా ఐశ్వర్యాలన్నీ నేను వారికి చూపించాను” అని చెప్పాడు హిజ్కియా.
5 హిజ్కియాతో యెషయా ఇలా చెప్పాడు: “సర్వ శక్తిమంతుడైన యెహోవా మాటలు ఆలకించు. 6 భవిష్యత్తులో, నీకు ఉన్నదంతా బబులోనుకు తీసుకొని పోబడుతుంది. ధనం అంతా తీసుకొని పోబడుతుంది. ఏమీ విడువబడదు. సర్వశక్తిమంతుడైన యెహోవా చెప్పాడు ఇది. 7 బబులోను రాజు నీ కుమారులను నీనుండి పుట్టే కుమారులను తీసుకొని పోతాడు. నీ కుమారులు బబులోను రాజభవనంలో అధికారులు అవుతారు.”
8 హిజ్కియా, “యెహోవానుండి వచ్చిన ఈ మాటలు వినుటకు నాకు ఇంపుగా ఉన్నాయి” అని యెషయాతో చెప్పాడు. (“నేను రాజుగా ఉన్నంత వరకు కష్టం ఏమీ ఉండదు, శాంతి ఉంటుంది” అనుకొన్నందువల్ల హిజ్కియా ఇలా చెప్పాడు.)
ఇశ్రాయేలు శిక్ష ముగుస్తుంది
40 మీ దేవుడు చెబుతున్నాడు,
“ఆదరించండి, నా ప్రజలను ఆదరించండి!
2 యెరూషలేముతో దయగా మాట్లాడండి.
‘నీ సేవాసమయం అయిపోయింది
నీ పాపాలకు విలువ నీవు చెల్లించావు’ అని యెరూషలేముతో చెప్పండి
యెరూషలేము చేసిన ప్రతి పాపానికి రెండేసి సార్లు యెహోవా యెరూషలేమును శిక్షించాడు.”
3 వినండి! ఒక మనిషి గట్టిగా ఎడారిలో బోధిస్తున్న శబ్దం మీరు వినగలరు.
“యెహోవా మార్గాన్ని సిద్ధం చేయండి.
ఎడారిలో మన దేవుని కోసం తిన్ననిదైన ఒక రాజమార్గాన్ని వేయండి.
4 ప్రతి లోయనూ పూడ్చండి
ప్రతి పర్వతాన్ని కొండను చదును చేయండి.
వంకర మార్గాలను చక్కగా చేయండి.
కరకు నేలను సమనేలగా చేయండి.
5 అప్పుడు యెహోవా మహిమ కనబడుతుంది
మనుష్యులందరూ కలిసి యెహోవా మహిమను చూస్తారు.
సాక్షాత్తూ యెహోవాయే ఈ సంగతులు చెప్పాడు కనుక ఇది జరుగుతుంది.”
6 ఒక స్వరం పలికింది, “మాట్లాడు” అని.
కనుక ఆ మనిషి అన్నాడు, “నేనేమి చెప్పను?”
ఆ స్వరం అంది, “ఇలా చెప్పు: మనుష్యులు అందరూ గడ్డిలా ఉన్నారు.
మనుష్యుల మంచి తనం క్రొత్త గడ్డి పరకలా ఉంది.
7 యెహోవా నుండి ఒక బలమైన గాలి గడ్డిమీద వీస్తుంది.
ఆ గడ్డి ఎండిపోయి, చస్తుంది.
సత్యం ఏమిటంటే: మనుష్యులంతా గడ్డి.
8 గడ్డి చచ్చిపోయి ఎండిపోతుంది.
కానీ మన దేవుని మాటలు శాశ్వతంగా నిలిచి ఉంటాయి.”
రక్షణః దేవుని శుభ వార్త
9 సీయోనూ, నీవు చెప్పాల్సిన శుభవార్త ఉంది.
ఎత్తయిన పర్వతం మీదకు ఎక్కి గట్టిగా ప్రకటించు.
యెరూషలేమూ, నీవు చెప్పాల్సిన శుభవార్త ఉంది.
భయపడవద్దు. గట్టిగా మాట్లాడు.
యూదా పట్టణాలన్నింటికి ఈ విషయాలు చెప్పు:
“చూడు, ఇదిగో మీ దేవుడు!
10 చూడు, యెహోవా, నా ప్రభువు శక్తితో వస్తున్నాడు.
మనుష్యులందరినీ పాలించుటకు ఆయన తన శక్తిని ప్రయోగిస్తాడు.
యెహోవా తన ప్రజలకు ప్రతిఫలం తెస్తాడు.
వారి జీతం యెహోవా దగ్గర ఉంది.
11 గొర్రెల కాపరి తన గొర్రెలను నడిపించినట్టు యెహోవా తన ప్రజలను నడిపిస్తాడు.
యెహోవా తన హస్తాన్ని (శక్తిని) ఉపయోగించి తన గొర్రెలను ఒక చోట చేరుస్తాడు.
గొర్రెపిల్లలను యెహోవా పట్టుకొని వాటిని ఆయన తన చేతుల్లో ఎత్తుకొంటాడు. వాటి తల్లులు ఆయన చెంత నడుస్తాయి.”
దేవుడు లోకాన్ని చేశాడు; దాన్ని ఆయన పరిపాలిస్తాడు
12 మహా సముద్రాలను తన పిడికిటిలో కొలిచింది ఎవరు?
ఆకాశాన్ని కొలిచేందుకు తన చేతిని ఉపయోగించింది ఎవరు?
భూమిమీద ధూళి అంతటినీ కొలిచేందుకు పాత్రను ఉపయోగించింది ఎవరు?
పర్వతాలను, కొండలను తూకం వేసేందుకు త్రాసులను ఉపయోగించింది ఎవరు? యెహోవాయే.
13 యెహోవా చేయాల్సింది ఏమిటో ఆయన ఆత్మకు ఎవరూ చెప్పలేదు.
యెహోవా చేసిన వాటిని ఎలా చేయాలో ఆయనకు చెప్పిన వారెవరూ లేరు.
14 యెహోవా ఎవరి సహాయమైనా అడిగాడా?
న్యాయంగా ఉండటం ఎలా అనేది ఎవరైనా యెహోవాకు నేర్పించారా?
యెహోవాకు ఎవరైనా తెలివిని ఉపదేశించారా?
యెహోవా జ్ఞానాన్ని వినియోగించటం ఆయనకు ఎవరైనా నేర్పించారా?
లేదు. ఇవన్నీ యెహోవాకు ముందే తెలుసు.
15 చూడండి, యెహోవా లోకంలో రాజ్యాలన్నీ ఒక చిన్న భాగమే. రాజ్యాలు చేదలోనుంచి జారే ఒక బొట్టు వంటివి.
దూర దేశాలన్నింటినీ యెహోవా తీసుకొని ఆయన వాటిని తన త్రాసులో వేస్తే
అవి చిన్న ధూళి కణాల్లా ఉంటాయి.
16 యెహోవాకు సమిధలుగా లెబానోను చెట్లన్నీ చాలవు.
లెబానోను జంతువులన్నీ యెహోవాకు బలి అర్పణగా చాలవు.
17 లోక రాజ్యాలన్నింటినీ దేవునితో నీవు పోలిస్తే రాజ్యాలు శూన్యం
దేవునితో పోలిస్తే రాజ్యాలన్నీ కలిసి ఏ మాత్రం విలువ చేయవు.
దేవుడు ఎలాంటివాడవి ప్రజలు ఊహించలేరు
18 నీవు దేనినైనా దేవునితో పోల్చగలవా?
లేదు నీవు దేవుని పటము చేయగలవా? లేదు.
19 కానీ కొందరు మనుష్యులు బండనుండి చెక్కనుండి విగ్రహాలు చేసి
వాటికి దేవుళ్లని పేరుపెడుతున్నారు.
ఒక పనివాడు ఒక విగ్రహం చేస్తాడు.
బంగారం పనివాడు ఆ విగ్రహానికి బంగారం పూత పూస్తాడు. అప్పుడు అతడు ఆ విగ్రహానికి వెండి గొలుసులు చేస్తాడు.
20 పేదవాడు ఖరీదైన ఆ విగ్రహాలు కొనలేడు.
కనుక పేదవాడు కుళ్లిపోని ఒక చెట్టును చూస్తాడు.
తర్వాత ఒక మనిషికి డబ్బిచ్చి దానిమీద ఒక దేవుని బొమ్మ చెక్కిస్తాడు.
అదీ, పేదవాని దేవుడు. మరి ఆ “దేవుడు” కనీసం కదలడు.
21 తప్పకుండా సత్యం నీకు తెలుసు కదూ?
తప్పక అది నీవు విన్నావు.
ఆదిలోనే ఎవరో ఒకరు నీతో సత్యం చెప్పారు.
భూమిని చేసింది ఎవరో తప్పక నీకు తెలుసు.
22 నిజమైన దేవుడు భూగోళానికి పైగా కూర్చుని ఉంటాడు.
ఆయనతో పోల్చి చూస్తే మనుష్యులు మిడతల్లా ఉంటారు.
ఆయన ఆకాశాలను బట్ట తెరచినట్టు తెరిచాడు.
ఆయన ఆకాశాలను ఒక గుడారంలా దాని క్రింద కూర్చునేందుకు పరిచాడు.
23 నిజమైన దేవుడు పరిపాలకులను ప్రాముఖ్యత లేనివారినిగా చేస్తాడు.
ఆయన ఈ లోకపు న్యాయమూర్తులను పూర్తిగా నిష్ప్రయోజకులనుగా చేస్తాడు.
24 ఆ పరిపాలకులు మొక్కల్లా ఉన్నారు వారు భూమిలో నాటబడ్డారు
కానీ వారు నేలలో వేరు తన్నుకొనక ముందే
దేవుడు ఆ మొక్కల మీద గాలి విసరజేస్తాడు.
దాంతో అవి చచ్చి, ఎండి పోతాయి.
గాలి వాటిని గడ్డి పరకల్లా కొట్టుకొని పోజేస్తుంది.
25 పరిశుద్ధుడు (దేవుడు) చెబుతున్నాడు: “నన్ను నీవు ఎవరితోనైనా పోల్చగలవా?
లేదు. నాకు ఎవరు సమానం కాదు.”
26 పైన ఆకాశాలను చూడు.
ఆ నక్షత్రాలన్నింటినీ ఎవరు సృష్టించారు?
ఆకాశంలోని ఆ “సైన్యాలు” అన్నింటిని ఎవరు సృష్టించారు?
ప్రతి నక్షత్రం దాని పేరుతో సహా ఎవరికి తెలుసు?
సత్యవంతుడైన దేవుడు చాలా బలం, శక్తి గలవాడు,
అందుచేత ఈ నక్షత్రాల్లో ఒక్కటి కూడ తప్పిపోదు.
27 యాకోబూ, ఇది నిజం!
ఇశ్రాయేలూ, దీనిని నీవు నమ్మాలి!
“నేను జీవించే విధము యెహోవా చూడలేదు
దేవుడు నన్ను కనుగొని శిక్షించాడు అని నీవెందుకు చెపుతున్నావు?”
28 యెహోవా అలసిపోడు, ఆయనకు విశ్రాంతి అవసరంలేదు.
భూమిమీద దూర స్థలాలన్నింటినీ యెహోవాయే సృష్టించాడు. యెహోవా నిత్యమూ జీవిస్తాడు.
29 బలహీనులు బలంగా ఉండేటట్టు యెహోవా సహాయం చేస్తాడు.
శక్తిలేని వాళ్లను ఆయన శక్తి మంతులుగా చేస్తాడు.
30 యువకులు అలసిపోతారు, వారికి విశ్రాంతి కావాలి.
చివరికి బాలురు కూడ తొట్రిల్లి, పడిపోతారు.
31 కాని యెహోవా మీద విశ్వాసం ఉంచి, ఆయన మీద ఆధారపడే మనుష్యులు తిరిగి బలంగల వాళ్లవుతారు. అది వారు పక్షి రాజులా రెక్కలు కలిగి ఉన్నట్టుగా ఉంటుంది.
వారు విశ్రాంతి అవసరం లేకుండా పరుగుల మీద పరుగులు తీస్తూ ఉంటారు.
వారు అలసి పోకుండా నడుస్తారు.
యెహోవా శాశ్వతమైన సృష్టికర్త
41 యెహోవా చెబుతున్నాడు:
“దూర దేశాల్లారా, మౌనంగా ఉండి నా దగ్గరకు రండి.
దేశాల్లారా, ధైర్యంగా ఉండండి.
నా దగ్గరకు వచ్చి మాట్లాడండి.
మనం కలిసికొందాం.
ఎవరిది సరియైనదో నిర్ణయించేద్దాం.
2 ఈ ప్రశ్నలకు నాకు జవాబు చెప్పండి: తూర్పునుండి వస్తోన్న ఆ మనిషిని మేల్కొలిపింది ఎవరు?
మంచితనం నాతో కూడ నడుస్తుంది.
అతడు తన ఖడ్గం ఉపయోగించి రాజ్యాలను ఓడిస్తాడు.
వారు ధూళి అవుతారు. అతడు తన విల్లును ఉపయోగించి రాజులను జయిస్తాడు.
వారు గాలికి కొట్టుకొని పోయే పొట్టులా పారిపోతారు.
3 అతడు సైన్యాలను తరుముతాడు, ఎన్నడూ బాధనొందడు.
అతడు అంతకు ముందు ఎన్నడూ వెళ్లని స్థలాలకు వెళ్తాడు.
4 ఈ సంగతులు జరిగేట్టు చేసింది ఎవరు? ఇది ఎవరు చేశారు?
ఆదినుండి మనుష్యులందరినీ పిలిచింది ఎవరు?
యెహోవాను నేనే ఈ సంగతులను చేశాను.
యెహోవాను నేనే మొట్ట మొదటి వాడ్ని ఆరంభానికి ముందే నేను ఇక్కడ ఉన్నాను.
అన్నీ ముగింపు అయన తర్వాత కూడ నేను ఇక్కడ ఉంటాను.
5 దూర దూర స్థలాలూ, మీరంతా
చూచి భయపడండి.
భూమ్మీద దూరంగా ఉన్న స్థలాలూ,
మీరంతా భయంతో వణకండి.
మీరంతా దగ్గరగా రండి,
నా మాటలు వినండి.
6 “పనివాళ్లూ, ఒకరికి ఒకరు సహాయం చేసుకొంటారు. ఒకరిని ఒకరు బలపర్చుకొంటారు. 7 ఒక పనివాడు ఒక విగ్రహం చేసేందుకు కర్ర కోస్తాడు. ఆ వ్యక్తి కంసాలికి ప్రోత్సాహాన్ని ఇస్తాడు. మరో మనిషి సుత్తెతో లోహాన్ని మెత్తగా చేస్తాడు. అప్పుడు ఆ పనివాడు దాగలితో పని చేసేవాడ్ని ప్రోత్సహిస్తాడు. ‘ఈ పని బాగుంది, లోహం ఊడిపోదు’ అంటాడు ఈ చివరి పనివాడు. అందుచేత అతడు ఆ విగ్రహాన్ని ఒక పీటకు మేకులతో బిగిస్తాడు. విగ్రహం పడిపోదు. అది ఎప్పటికీ కదలదు.”
యెహోవా మాత్రమే మనలను రక్షించగలడు
8 యెహోవా చెబుతున్నాడు: “ఇశ్రాయేలూ, నీవు నా సేవకుడివి
యాకోబూ, నిన్ను నేను ఏర్పరచుకొన్నాను.
నీవు అబ్రాహాము వంశంవాడివి. అబ్రాహామును నేను ప్రేమించాను.
9 భూమిమీద నీవు చాలా దూరంగా ఉన్నావు.
నీవు చాలా దూర దేశంలో ఉన్నావు.
అయితే నేను నిన్ను పిలిచి,
నీవు నా సేవకుడివి.
నేను నిన్ను ఏర్పరచుకొన్నాను.
నేను నీకు విరోధంగా తిరుగలేదు అని చెప్పాను.
10 దిగులుపడకు, నేను నీతో ఉన్నాను.
భయపడకు, నేను నీ దేవుణ్ణి.
నేను నిన్ను బలంగా చేశాను.
నేను నీకు సహాయం చేస్తాను.
నేను మంచితనపు కుడిహస్తంతో నిన్ను బలపరుస్తాను.
11 చూడు, కొంతమంది మనుష్యులు నీ మీద కోపంగా ఉన్నారు.
కానీ వాళ్లు సిగ్గుపడతారు.
నీ శత్రువులు అదృశ్యమై నశిస్తారు.
12 నీ విరోధుల కోసం నీవు వెదకుతావు.
కానీ నీవు వారిని కనుగొనలేవు.
నీకు విరోధంగా యుద్ధం చేసినవాళ్లు
పూర్తిగా కనబడకుండా పోతారు.
13 నేను యెహోవాను,
నీ దేవుణ్ణి నేను నీ కుడిచేయి పట్టుకొన్నాను.
నీవు భయపడవద్దు, నేను నీకు సహాయం చేస్తాను.
అని నేను నీతో చెబుతున్నాను.
14 ప్రశస్తమైన యూదా, భయపడకు. ప్రియమైన నా ఇశ్రాయేలు ప్రజలారా భయపడవద్దు.
నిజంగా నేను మీకు సహాయం చేస్తాను.”
సాక్షాత్తూ యెహోవాయే ఆ మాటలు చెప్పాడు.
“ఇశ్రాయేలు పరిశుద్ధుడు (దేవుడు),
నిన్ను రక్షించేవాడు ఈ సంగతులు చెప్పాడు:
15 చూడు, నిన్ను నేను ఒక క్రొత్త నూర్పిడి చెక్కగా చేశాను. ఈ పనిముట్టుకు పదునైన పండ్లు చాలా ఉన్నాయి.
ధాన్యపు గింజల గుల్లలు పగులగొట్టుటకు రైతులు దీనిని ఉపయోగిస్తారు.
నీవు పర్వతాలను అణగ దొక్కి, చితుక గొడ్తావు. కొండలను నీవు పొట్టులా చేస్తావు.
16 వాటిని గాలిలో విసిరివేస్తావు.
గాలి దానిని విసరి, చెదరగొడ్తుంది.
అప్పుడు నీవు యెహోవాయందు సంతోషంగా ఉంటావు.
ఇశ్రాయేలీయుల పరిశుద్ధుని (దేవుని) గూర్చి నీవు ఎంతగానో అతిశయిస్తావు.
17 “పేదలు, అక్కరలో ఉన్నవారు నీళ్లకోసం వెదకుతారు.
కానీ వారికి ఏమీ దొరకవు.
వారు దాహంతో ఉన్నారు. వారి నాలుకలు పిడచకట్టాయి.
నేను వారి ప్రార్థనలకు జవాబిస్తాను.
నేను వాళ్లను విడువను, చావనివ్వను.
18 ఎండిపోయిన కొండల మీద నేను నదులను ప్రవహింపజేస్తాను.
లోయలో నీటి ఊటలను నేను ప్రవహింపజేస్తాను.
అరణ్యాన్ని నీటి సరసుగా నేను చేస్తాను.
ఎండిన భూములలో నీటి బుగ్గలు ఉబుకుతాయి.
19 అరణ్యంలో వృక్షాలు పెరుగుతాయి.
దేవదారు వృక్షాలు, తుమ్మ చెట్లు గొంజి చెట్లు, తైలవృక్షాలు తమాల వృక్షాలు, సరళ వృక్షాలు అక్కడ ఉంటాయి.
20 ఈ సంగతులు జరగడం ప్రజలు చూస్తారు. యెహోవా శక్తిచేత ఇవి జరిగాయని వారు తెలుసుకొంటారు.
ప్రజలు ఈ సంగతులు చూస్తారు.
వారు గ్రహించటం మొదలుబెడతారు.
ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు (దేవుడు)
ఈ సంగతులను చేసినట్టు వారు తెలుసుకొంటారు.”
అబద్దపు దేవతలకి యెహోవా సవాలు
21 యాకోబు రాజు, యెహోవా చెబుతున్నాడు: “రండి మీ వివాదాలు నాతో చెప్పండి. మీ రుజువులు చూపించండి, సరియైన విధంగా మనం నిర్ణయంచేద్దాం. 22 జరుగుతోన్న వాటిని గూర్చి, మీ విగ్రహాలు (అబద్ధపు దేవతలు) వచ్చి మాతో చెప్పాలి. మొదట్లో ఏమి జరిగింది? భవిష్యత్తులో ఏమి జరుగుతుంది? మాతో చెప్పండి. మేము జాగ్రత్తగా వింటాం. అప్పుడు తర్వాత ఏమి జరుగుతుంది అనేది మాకు తెలుస్తుంది. 23 ఏమి జరుగుతుందో తెలుసుకొనేందుకు గాను మేము ఎదురు చూడాల్సిన వాటిని గూర్చి చెప్పండి. అప్పుడు మీరు నిజంగానే దేవుళ్లు అని మేము నమ్ముతాం. ఏదో ఒకటి చేయండి. ఏదైనా సరే మంచిగాని చెడుగాని చేయండి. అప్పుడు మీరు బ్రతికే ఉన్నారని మాకు తెలుస్తుంది. మేము మిమ్మల్ని వెంబడించగలుగుతాం.
24 “చూడండి, తప్పుడు దేవుళ్లారా, మీరు శూన్యం కంటె తక్కువ. మీరు ఏమీ చేయలేరు. ఉత్త పనికి మాలిన మనిషి మాత్రమే మిమ్మల్ని పూజించాలనుకొంటాడు.”
యెహోవా తానొక్కడే దేవుడని ఋజువు చేయటం
25 “ఉత్తరాన నేను ఒక మనిషిని మేల్కొలిపాను.
సూర్యోదయమయ్యే తూర్పు దిశనుండి అతడు వస్తున్నాడు.
అతడు నా నామాన్ని ఆరాధిస్తాడు.
కుమ్మరి మట్టి ముద్దను తొక్కుతాడు. అదే విధంగా ఈ ప్రత్యేక మనిషి రాజులను అణగదొక్కుతాడు.
26 “ఇది జరుగక ముందే దీనినిగూర్చి మాతో ఎవరు చెప్పారు?
ఆయన్ను మనం దేవుడు అని పిలవాలి.
మీ విగ్రహాల్లో ఒకటి ఈ సంగతులను మాకు చెప్పిందా? లేదు.
ఆ విగ్రహాల్లో ఏదీ మాకేమీ చెప్పలేదు. ఆ విగ్రహాలు ఒక్క మాట కూడ చెప్పలేదు.
మరియు మీరు చెప్పే ఒక్క మాట కూడ ఆ అబద్ధపు దేవుళ్ళు వినలేవు.
27 ఈ విషయాలను గూర్చి యెహోవాను, నేనే మొట్టమొదట సీయోనుకు చెప్పాను.
‘చూడండి, మీ ప్రజలు తిరిగి వస్తున్నారు’ అనే ఒక సందేశం ఇచ్చి
ఒక సందేశహరుని యెరూషలేముకు నేను పంపించాను.”
28 ఆ తప్పుడు దేవుళ్లను నేను చూశాను.
వారిలో ఎవరూ ఏమీ చెప్పగల తెలివి లేనివాళ్లు.
వాళ్లను నేను ప్రశ్నలు అడిగాను.
కానీ వారు ఒక్క మాట కూడా పలుకలేదు.
29 ఆ దేవుళ్లంతా శూన్యంకంటె తక్కువ.
వాళ్లు ఏమీ చేయలేరు.
ఆ విగ్రహాలు బొత్తిగా పనికి మాలినవి.
© 1997 Bible League International