Print Page Options
Previous Prev Day Next DayNext

Beginning

Read the Bible from start to finish, from Genesis to Revelation.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యోబు 5-7

“యోబూ, నీవు కావాలంటే గట్టిగా పిలువు. కాని నీకు ఎవ్వరూ జవాబు ఇవ్వరు!
    నీవు ఏ దేవదూతల తట్టూ తిరుగలేవు!
తెలివి తక్కువ మనిషి యొక్క కోపం వానినే చంపివేస్తుంది.
    బుద్ధిహీనుని అసూయ వానినే చంపివేస్తుంది.
బాగా వేరూనుకొని, వృద్ధిపొందుతున్న ఒక బుద్ధి హీనుణ్ణి చూశాను. (అతను బలంగా, క్షేమంగా ఉన్నా ననుకొన్నాడు).
    అయితే అకస్మాత్తుగా వాని ఇల్లు శపించబడింది.
ఆ బుద్ధిహీనుని పిల్లలు క్షేమంగా లేరు.
    (న్యాయ స్థానంలో) వారిని ఆదుకొనేందుకు నగరద్వారం వద్ద ఎవ్వరూలేరు.
ఆ బుద్ధిహీనుని పంటలను ఆకలిగొన్న ప్రజలు తీసుకొంటారు.
ఆకలిగొన్న ఆ మనుష్యలు ముండ్లలో పెరుగుతున్న ధాన్యపు గింజలను కూడా తీసుకొంటారు.
    ఆశగలవారు అతని ఐశ్వర్యాన్ని తీసుకొంటారు.
చెడ్డ కాలాలు మట్టిలోనుండి రావు.
    కష్టం నేలలో నుండి పెరగదు.
నిప్పులో నుండి రవ్వలు పైకి లేచినంత
    నిశ్చయంగా మనిషి కష్టం కోసమే పుట్టాడు.
కాని యోబూ, నేనే గనుక నీవైతే నేను దేవుని తట్టు తిరిగి
    నా సమస్య ఆయనతో చెబుతాను.
దేవుడు చేసే ఆశ్చర్యకరమైన వాటిని మనుష్యులెవ్వరు గ్రహించలేరు.
    దేవుడు చేసే అద్భుతాలకు అంతం లేదు.
10 దేవుడు భూమి మీద వర్షం కురిపిస్తాడు.
    ఆయన పొలాలకు నీళ్లు పంపిస్తాడు.
11 దీనుడైన మనిషిని దేవుడు లేవనెత్తుతాడు.
    దుఃఖంలో ఉన్న వ్యక్తిని ఆయన చాలా సంతోషపరుస్తాడు.
12 తెలివిగల దుర్మార్గులకు విజయం కలుగకుండా దేవుడు వారి పథకాలను నివారిస్తాడు.
13 దేవుడు తెలివిగల మనుష్యులను వారి కుయుక్తి పథకాల్లోనే పట్టేస్తాడు.
    అందుచేత తెలివిగల మనిషి యొక్క పథకాలు విజయవంతం కావు.
14 పగటివేళ సైతం ఆ తెలివిగల మనుష్యులు చీకటిలో వలె తడబడుతారు.
    మధ్యాహ్నపు వేళల్లో సైతం రాత్రిపూట ఒకడు తడబడునట్లు తడువులాడుతారు.
15 దేవుడు పేద ప్రజలను మరణం నుండి రక్షిస్తాడు.
    బలవంతుల హస్తాలనుండి పేదలను ఆయనే రక్షిస్తాడు.
16 కనుక పేద ప్రజలకు నిరీక్షణ ఉంది.
    న్యాయంగా లేని దుర్మార్గులను దేవుడు నాశనం చేస్తాడు.

17 “దేవుడు సరిదిద్దే మనిషి సంతోషంగా ఉంటాడు.
    కనుక సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను శిక్షించినప్పుడు, దానిని తోసిపుచ్చకు.
18 దేవుడు చేసిన గాయాలకు
    ఆయన కట్లు కడతాడు.
ఆయనే గాయపరుస్తాడు,
    కాని ఆయన చేతులే తిరిగి స్వస్థపరుస్తాయి.
19 ఆరు కష్టాలనుండి ఆయన నిన్ను రక్షిస్తాడు;
    అవును, ఏడు కష్టాల్లో కూడా నీవు బాధించబడవు.
20 కరువు వచ్చినప్పుడు దేవుడు నిన్ను
    మరణంనుండి రక్షిస్తాడు.
యుద్ధంలో దేవుడు నిన్ను
    మరణం నుండి కాపాడుతాడు.
21 మనుష్యులు వాడిగల తమ నాలుకలతో నిన్ను గూర్చి చెడుగా మాట్లాడినప్పుడు
    దేవుడు నిన్ను రక్షిస్తాడు.
నాశనం వచ్చినప్పుడు
    నీవు భయపడాల్సిన పనిలేదు.
22 నాశనం, కరువును చూసి నీవు నవ్వుతావు.
    అడవి జంతువులను చూసి నీవు భయపడాల్సిన అవసరం లేదు.
23 నీ ఒడంబడిక దేవునితో ఉంది కనుక నీవు దున్నే పొలాల్లో బండలు ఉండవు.
    మరియు అడవి మృగాలు ఎన్నటికీ నీ మీద పడవు.[a]
24 నీ గుడారం క్షేమంగా ఉంది గనుక
    నీవు శాంతంగా జీవిస్తావు.
నీవు నీ ఆస్తి లెక్కించగా
    ఏదీ పోయి ఉండదు.
25 నీకు చాలామంది పిల్లలు ఉంటారు.
    నేలమీద గడ్డి పరకల్లా నీ పిల్లలు చాలామంది ఉంటారు.
26 కోతకాలం వరకు సరిగ్గా పెరిగే గోధుమలా నీవు ఉంటావు.
    అవును, నీవు పక్వమయిన వృద్ధాప్యం వరకు జీవిస్తావు.

27 “యోబూ, ఈ విషయాలు మేము పరిశీలించాం. అవి సత్యమైనవని మాకు తెలుసు.
    అందుచేత యోబూ, మేము చెప్పు సంగతులను విని, నీ మట్టుకు నీవే వాటిని తెలుసుకో.”

యోబు ఎలీఫజుకు జవాబిచ్చుట

1-2 అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు:

“నా శ్రమే గనుక తూచబడితే,
    నా కష్టం అంతా త్రాసులో ఉంచబడితే,
సముద్రాల ఇసుక కంటె నా దుఃఖం ఎక్కువ బరువయిందని నీవు గ్రహిస్తావు!
    అందుకే నా మాటలు వెర్రిగా కనిపిస్తాయి.
సర్వశక్రిమంతుడైన దేవుని బాణాలు నాలో ఉన్నాయి.
    ఈ బాణాల విషం నా ఆత్మను తాకుతుంది.
    దేవుని దారుణ విషయాలు అన్నీ కలిపి నాకు విరోధంగా ఉంచబడ్డాయి.
(ఏ చెడుగూ జరగనప్పుడు మాటలాడడం సులభం) అడవి గాడిద తినేందుకు గడ్డి ఉంటే అదేమి గొడవ చెయ్యదు.
    ఆవుకు ఆహారం ఉంటే అది ఆరోపణ చెయ్యదు.
రుచిలేని భోజనం ఉప్పు లేకుండా తినగలమా?
    గ్రుడ్డులోని తెల్లసొన రుచిలేనిది.
(ఇప్పుడు నీ మాటలు వీటివలెనే ఉన్నాయి) దానిని నేను ముట్టుకోవటానికి కూడా ఒప్పుకోను;
    అలాంటి భోజనం నన్ను జబ్బు మనిషిలా చేస్తుంది.

“నేను అడిగింది నాకు దొరకాలని కోరుకుంటాను.
    నేను దేనికోసం కనిపెట్టుకొని ఉంటానో, దాన్ని దేవుడు నాకు ఇవ్వాలని కోరుకుంటాను.
దేవుడు నన్ను చితకగొట్టేందుకు ఇష్టపడి,
    నన్ను చంపివేస్తాడని నేను నిరీక్షిస్తున్నాను!
10 ఆయన నన్ను చంపివేస్తే, ఒక్క విషయంలో నేను ఆదరణ పొందుతాను.
    ఎడతెగని నా బాధల్లోనే నేను ఒక్క విషయంలో సంతోషిస్తాను. పరిశుద్ధుని ఆదేశాలకు విధేయత చూపేందుకు నేను తిరస్కరించలేదు.

11 “నా బలం క్షీణించిపోయింది, గనుక నేను ఇంకా బ్రతుకుతాను అనే ఆశాకిరణం నాకు లేదు.
    చివరికి నాకు ఏమి జరుగుతుందో నాకు తెలియదు. అందుచేత నేను సహనంగా ఉండాల్సిన కారణం ఏమీ లేదు.
12 బండలాంటి బలం నాకు లేదు.
    నా శరీరం కంచుతో చేయబడలేదు.
13 ఇప్పుడు నాకు నేను సహాయం చేసుకొనే శక్తినాకు లేదు.
    ఎందుకంటే విజయం నా వద్దనుండి తొలగించి వేయబడింది.

14 “ఒక మనిషి కష్టాల్లో ఉంటే, అతని స్నేహితులు అతని మీద దయ చూపాలి.
    ఒక మనిషి, తన స్నేహితుడు సర్వశక్తిమంతుడైన దేవుని నుండి దూరంగా పోయినా సరే అతడు ఆ స్నేహితునికి నమ్మకంగా ఉండాలి.
15 కానీ, నా సోదరులారా, మీరు నమ్మకస్థులు కారు. నేను మీ మీద ఆధారపడలేదు.
    ఒక్కొక్కప్పుడు ప్రవహించి, ఒక్కొక్కప్పుడు నిలిచిపోయే కాలువల్లా ఉన్నారు మీరు.
16 మంచు గడ్డలు కరిగిపోయే హిమం అడ్డుకొన్నప్పుడు పొంగి ప్రవహించే కాలువల్లా ఉన్నారు మీరు.
17 కానీ ఆ కాలువలు ఎండిపోయిన వేళ ప్రవహించవు.
    వేడిగాలి వీచినప్పుడు నీళ్లు ఉండవు.
    కాలువలు ప్రవహించవు.
18 వ్యాపారస్థులు వారి మార్గాలలోని మలుపుల మూలలు తిరిగి
    ఎడారిలోకి వెళ్లి అక్కడ మరణిస్తారు.
19 తేమా వర్తక బృందాలు నీళ్లకోసం వెదుకుతారు.
    షేబా ప్రయాణీకులు ఆశగా (నీళ్ల కోసం) చూస్తారు.
20 నీళ్లు దొరుకునని వారు గట్టిగా నమ్మారు.
    కానీ ఈసారి వారు అక్కడికి రాగానే నిరాశ చెందారు.
21 ఇప్పుడు మీరూ ఆ కాలువల్లా ఉన్నారు.
    మీరు సహాయం చేయరు. మీరు నా కష్టాలు చూచి భయపడుతున్నారు.
22 నాకు ఏమైనా ఇవ్వండి,
    మీ ఐశ్వర్యంలోనుండి నాకు ధనం ఇవ్వండి అని నేను ఎన్నడూ చెప్పలేదు.
23 ‘శత్రువు బలంనుండి నన్ను రక్షించండి.
    మూర్ఖులైన వారి నుండి నన్ను రక్షించండి’ అని నేను ఎన్నడూ చెప్పలేదు.

24 “కనుక, ఇప్పుడు నాకు నేర్పించండి. నేను నెమ్మదిగా ఉంటాను.
    నేను ఏమి తప్పు చేశానో నాకు చూపించండి.
25 నిజాయితీ మాటలు శక్తి గలవి.
    కానీ మీ వాదాలు దేనినీ రుజువు చేయవు.
26 నేను చెప్పే వాటిని మీరు విమర్శిస్తారా?
    మరింత నిరుత్సాహం కలిగించే మాటలు పలుకుతారా?
27 అవును, తండ్రులు లేని పిల్లలకు చెందిన వాటిని సంపాదించటం కోసం
    మీరు జూదమైనా సరే ఆడతారు.
    మీరు మీ స్నేహితుణ్ణి అమ్ముకొంటారు.
28 కానీ, ఇప్పుడు దయచేసి నా ముఖం పరిశీలించండి.
    నేను మీతో అబద్ధం చెప్పను.
29 కనుక ఇప్పుడు మీ మనసు మార్చుకోండి. అన్యాయంగా ఉండవద్దు.
    అవును, మళ్లీ ఆలోచించండి. నేను తప్పు ఏమీ చేయలేదు.
30 నేను అబద్ధం చెప్పటం లేదు.
    నా మాటల్లో చెడు ఏమీ లేదు. తప్పు, ఒప్పు నాకు తెలుసు.”

యోబు చెప్పాడు, “మనిషికి భూమి మీద కష్టతరమైన సంఘర్షణ ఉంది.
    అతని జీవితం రోజు కూలివానిదిలా ఉంది.
ఒక ఎండ రోజున కష్టపడి పనిచేసిన తర్వాత చల్లటి నీడ కావాల్సిన బానిసలా ఉన్నాడు మనిషి.
    జీతంరోజు కోసం ఎదురు చూసే కూలివానిలా ఉన్నాడు మనిషి.
అదే విధంగా నాకూ నెల తర్వాత నెల ఇవ్వబడుతోంది. ఆ నెలలు శూన్యంతో, విసుగుతో నిండి పోయి ఉంటాయి.
    శ్రమ రాత్రుళ్లు ఒకదాని వెంట ఒకటి నాకు ఇవ్వబడ్డాయి.
నేను పండుకొన్నప్పుడు, ఆలోచిస్తాను,
    ‘నేను లేచేందుకు ఇంకా ఎంత సమయం ఉంది?’ అని.
రాత్రి జరుగుతూనే ఉంటుంది.
    సూర్యుడు వచ్చేంతవరకు నేను అటూ యిటూ దొర్లుతూనే ఉంటాను.
నా శరీరం పురుగులతోనూ, మురికితోనూ కప్పబడింది.
    నా చర్మం పగిలిపోయి, రసి కారుతూన్న పుండ్లతో నిండిపోయింది.

“నేతగాని నాడెకంటె తొందరగా నా దినాలు గతిస్తున్నాయి.
    నిరీక్షణ లేకుండా నా జీవితం అంతం అవుతుంది.
దేవా, నా జీవితం కేవలం ఒక ఊపిరి మాత్రమే అని జ్ఞాపకం చేసుకో.
    నా కళ్లు మంచిదానిని దేనినీ మరల చూడవు.
నీవు నన్ను ఇప్పుడు చూస్తావు. కానీ నన్ను మరల చూడవు.
    నీవు నాకోసం చూస్తావు. కాని నేను చనిపోయి వుంటాను.
ఒక మేఘం కనబడకుండ మాయమవుతుంది.
    అదేవిధంగా మరణించిన ఒక మనిషి సమాదిలో పాతి పెట్టబడతాడు. మరల తిరిగిరాడు.
10 అతడు తన ఇంటికి ఎన్నటికీ తిరిగిరాడు.
    అతనిస్థలం అతన్ని ఇంకెంత మాత్రం గుర్తించదు.

11 “అందుచేత నేను మౌనంగా ఉండను.
    నేను గట్టిగా మాట్లాడతాను. నా ఆత్మ శ్రమ పడుతోంది.
    నా ఆత్మ వేదనపడుతోంది గనుక నేను ఆరోపణ చేస్తాను.
12 ఓ దేవా, నీ వెందుకు నాకు కాపలా కాస్తున్నావు?
    నేను ఏమైనా సముద్రాన్నా, లేక సముద్ర రాక్షసినా?
13 నా పడక నాకు విశ్రాంతి నివ్వాలి
    నా మంచం నాకు విశ్రాంతి, విరామాన్ని ఇవ్వాలి
14 కాని, దేవా! నీవు నన్ను కలలతో భయపెడుతున్నావు.
    దర్శనాలతో నన్ను భయపెడుతున్నావు.
15 అందుచేత బ్రతకటం కంటె
    చంపబడటం నాకు మేలు.
16 నా బ్రదుకు నాకు అసహ్యం.
    నేను శాశ్వతంగా జీవించాలని కోరను
నన్ను ఒంటరిగా ఉండనివ్వు.
    నా జీవితానికి అర్థం శూన్యం.
17 దేవా, ఎందుకు మనిషి అంటే నీకు ఇంత ముఖ్యం? నీవు అతనిని ఎందుకు గౌరవించాలి?
    మనిషికి నీవసలు గుర్తింపు ఎందుకు ఇవ్వాలి?
18 నీవు ప్రతి ఉదయం మనిషిని ఎందుకు దర్శిస్తావు,
    ప్రతిక్షణం ఎందుకు పరీక్షిస్తావు?
19 దేవా, నీవు ఎన్నడూ నన్ను విడిచి అవతలకు ఎందుకు చూడవు?
    ఒక క్షణమైన నీవు నన్ను ఒంటరిగా ఉండనియ్యవు?
20 మనుష్యులను గమనించువాడా,
    నేను పాపం చేశానంటావా, సరే, మరి నన్నేం చేయమంటావు?
దేవా, గురిపెట్టేందుకు ప్రయోగంగా నీవు నన్నెందుకు ఉపయోగించావు?
    నేను నీకు ఒక భారమై పోయానా?
21 నీవు నా తప్పిదాలు క్షమించి,
    నా పాపాలను ఎందుకు క్షమించకూడదు?
త్వరలోనే నేను చచ్చి సమాధిలో ఉంటాను.
    అప్పుడు నీవు నాకోసం వెదకుతావు. నేను పోయి ఉంటాను.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International