Print Page Options
Previous Prev Day Next DayNext

Beginning

Read the Bible from start to finish, from Genesis to Revelation.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 దినవృత్తాంతములు 32-34

అష్షూరు రాజు హిజ్కియాను దుఃఖపెట్టుట

32 హిజ్కియా ఈ పనులన్నీ విశ్వసనీయంగా చేసిన పిమ్మట, అష్షూరు రాజైన సన్హెరీబు యూదా రాజ్యం మీదికి దండెత్తి వచ్చాడు. సన్హెరీబు అతని సైన్యంతో వచ్చి కోటలను మట్టడించి సైనిక స్థావరాలు ఏర్పాటు చేశాడు. అలా చేసి ఆ పట్టణాలను తాను జయించాలని అతడు పన్నాగం పన్నాడు. సన్హెరీబు ఆ పట్టణాలను తాను స్వయంగా గెలవాలని అనుకున్నాడు. యెరూషలేముపై దాడిచేయాటానికే సన్హెరీబు వచ్చాడని హిజ్కియాకు తెలుసు. అప్పుడు హిజ్కియా తన పరిపాలనాధికారులతోను, సైనికాధికారులతోను సంప్రదించాడు. వారు నగరం వెలుపల జలవనరుల నుండి నీటి ప్రవాహాన్ని నిలిపివేయాలని నిర్ణయించారు. పాలనాధికారులు, సైనికాధికారులు హిజ్కియాకు తోడ్పడ్డారు. అనేకమంది ప్రజలు కలిసి జలవనరులన్నీ ఆపివేశారు. దేశం మధ్యగా ప్రవహించే కాలువకు కూడ అడ్డకట్టలు వేశారు. “అష్షూరు రాజు ఇక్కడికి వచ్చినప్పుడు అతనికి కావలసినంత నీరు ఇక్కడ దొరకదు” అని వారనుకున్నారు. హిజ్కియా యెరూషలేమును బలమైన నగరంగా తీర్చిదిద్దాడు. అతడు చేసిన పని ఏమనగా: గోడలు పడిపోయిన చోటల్లా అతడు తిరిగి కట్టించాడు. అతడు గోడలమీద బురుజులు నిర్మింపజేసాడు. మొదటి గోడకు బయటగా మరో గోడను కూడ అతడు నిర్మించాడు. పాత యెరూషలేములో తూర్పు భాగాన అతడు మళ్లీ కోటలు నిర్మించాడు. అతడు అనేక ఆయుధాలను, డాళ్లను తయారు చేయించాడు. 6-7 ప్రజలను నడిపించటానికి వారిపై సైనికాధికారులను నియమించాడు. నగర ద్వారం వద్ద బహిరంగ ప్రదేశంలో అతడీ అధికారులను కలుసుకొన్నాడు. హిజ్కియా ఆ అధికారులతో మాట్లాడి, వారిని ప్రోత్సహించాడు. వారితో అతడిలా అన్నాడు. “మీరు బలంగా, ధైర్యంగా వుండండి. భయపడకండి. అష్షూరు రాజు విషయంలోగాని, అతని మహా సైన్యం విషయంలోగాని మీరు కలత చెందవద్దు. అష్షూరు వారి బలం కంటే మనవద్ద మహాశక్తి సంపద వుంది. అష్షూరు రాజు వద్ద కేవలం మనుష్యల బలమే వుంది. కాని మనవద్ద యెహోవా దైవబలం వుంది. మన దేవుడు మనకు సహాయపడతాడు. మన యుద్ధాలు ఆయనే నిర్వహిస్తాడు!” ఆ విధంగా యూదా రాజైన హిజ్కియా ప్రజలను ఉత్సహపర్చి వారి ధైర్యాన్ని తట్టి లేపాడు.

అష్షూరు రాజైన సన్హెరీబు, అతని సైన్యం లాకీషు నగరం దగ్గరగా స్థావరం ఏర్పాటు చేసి దానిని ఓడించాలని వున్నారు. పిమ్మట యూదా రాజైన హిజ్కియా వద్దకు, యెరూషలేములో వున్న యూదా ప్రజల వద్దకు సన్హెరీబు తన సేవకులను పంపాడు. సన్హెరీబు సేవకులు హిజ్కియాకు, యెరూషలేము ప్రజలకు వర్తమానాన్ని పట్టుకు వెళ్లారు.

10 ఆ సేవకులు ఈ విధంగా ప్రకటించారు: “అష్షూరు రాజైన సన్హెరీబు యిలా చెప్పుచున్నాడు: యెరూషలేము ముట్టడిలో వుండగా మీరు దేనిని నమ్ముకొని ఇంకా అక్కడ వుంటున్నారు? 11 హిజ్కియా మిమ్మల్ని మూర్ఖులనుగా చేస్తున్నాడు. యెరూషలేములోనే వుండి ఆకలి దప్పులతో మాడి చనిపోయే విధంగా మీరు మోసగింపబడుతున్నారు. ‘అష్షూరు రాజు నుండి మనల్ని మన ప్రభువైన యెహోవా రక్షిస్తాడు,’ అని హిజ్కియా మీకు చెప్పుచున్నాడు. 12 హిజ్కియా తనకై తాను యెహోవా ఉన్నత స్థలాలను, బలిపీఠాలను తొలగించి వేశాడు. కాని యూదా, యెరూషలేము ప్రజలైన మీకు ఒకే బలిపీఠం మీద పూజచేసి, ధూపం వేయండని చెప్పుచున్నాడు. 13 నిజానికి నేను, నా పూర్వీకులు ఇతర దేశాల ప్రజలకు ఏమి చేసినదీ మీయందరికీ తెలిసినదే. అన్యదేశాల దేవుళ్లు వారి ప్రజలను కాపాడలేక పోయారు. నేను వారి ప్రజలను నాశనం చేయకుండా ఆ దేవుళ్లు నన్ను ఆపలేకపోయారు. 14 నా పూర్వీకులు ఆ రాజ్యలను నాశనం చేశారు. తన ప్రజలను నాశనం చేయకుండా నన్నాపగల దేవుడెవ్వడూ లేడు. కావున మీ దేవుడు నానుండి మిమ్మల్ని కాపాడగలడని మీరనుకుంటున్నారా? 15 హిజ్కియా మిమ్మల్ని మూర్ఖులను చేయటంగాని, మోసపుచ్చటంగాని చేయనీయవద్దు. మీరతనిని నమ్మవద్దు. ఎందువల్లననగా ఏ దేశపు దేవుడే గాని, ఏ రాజ్యపు దేవుడేగాని అతని ప్రజలను నానుండి నా పూర్వీకుల నుండి సురక్షితంగా వుండేలా ఎన్నడూ కాపాడలేడు. కావున మీ దేవుడు మిమ్మల్ని నాశనం చేయకుండ నన్ను ఆపుతాడని మీరు అనుకోవద్దు.”

16 ప్రభువగు యెహోవాకు, దేవుని సేవకుడగు హిజ్కియాకు వ్యతిరేకంగా అష్షూరు రాజు సేవకులు చాలా నీచంగా మాట్లడారు. 17 ఇశ్రాయేలు దేవుడగు యెహోవాను అవమానపరుస్తూ అష్షూరు రాజు లేఖలు కూడ వ్రాశాడు. ఆ లేఖలలో అష్షూరు రాజు యిలా వ్రాశాడు: “నేను అన్యదేశాల ప్రజలను నాశనం చేసేటప్పుడు వారి దేవుళ్లు నన్నాపలేకపోయారు. అలాగే హిజ్కియా దేవుడు కూడ ఆయన ప్రజలను నాశనం చేయకుండ నన్ను ఆపలేడు.” 18 తరువాత అష్షూరు రాజు సేవకులు నగర గోడమీద వున్న యెరూషలేము ప్రజలను చూసి కేకలు పెట్టి అరిచారు. గోడమీద జనాన్ని చూసి ఆ సేవకులు వారికి తెలిసేలా హెబ్రీ భాషలో తిట్టి అరిచారు. అష్షూరు రాజు సేవకులు యెరూషలేము ప్రజలను భయపెట్టేటందుకే అలా చేసారు. యెరూషలేము నగరాన్ని కైవసం చేసికోవాలనే వారలా చేసారు. 19 ప్రపంచ దేశాల ప్రజలు పూజించే దేవుళ్లపట్ల కూడ ఆ సేవకులు చెడుగా మాట్లడారు. కాని ఆ దేవుళ్లు కేవలం మనుష్యులు తమ చేతులతో చేసిన బొమ్మలు. అదేరీతిలో ఆ సేవకులు యెరూషలేము దేవునిపట్ల కూడ నీచంగా మాట్లడారు.

20 రాజైన హిజ్కియా మరియు ఆమోజు కుమారుడు. ప్రవక్తయునగు యెషయా ఈ సమస్య విషయంలో దేవుని ప్రార్థించారు. వారు ఆకాశంవైపు తిరిగి దేవునికి తమ గోడు కష్టాలు చెప్పుకున్నారు. 21 అప్పుడు యెహోవా తన దూత నొకనిని అష్షూరు రాజు ఉండే స్థలానికి పంపించినాడు. ఆ దేవదూత అష్షూరు సైన్యంలోని అందరు సైనికులను, నాయకులను, అధికారులను చంపివేశాడు. దానితో అష్షూరు రాజు పలాయనం చిత్తగించి తన దేశంలోగల తన ఇంటికి పోయాడు. ప్రజలు అతనిని చూసి సిగ్గుపడ్డారు. అతడు తన దేవుని ఆలయానికి వెళ్లగా అక్కడ తన స్వంత కుమారులలో కొందరు అతనిని కత్తులతో నరికి చంపివేశారు. 22 ఆ రకంగా యెహోవా హిజ్కియాను, యెరూషలేము ప్రజలను అష్షూరు రాజైన సన్హెరీబు బారినుండి, ఇతర శత్రువుల బారినుండి రక్షించాడు. యెహోవా హిజ్కియాపట్ల యెరూషలేము ప్రజలపట్ల తగిన శ్రద్ధ తీసుకొన్నాడు. 23 అనేక మంది ప్రజలు యెహోవాకు కానుకలు తీసికొని యెరూషలేముకు వచ్చారు. యూదా రాజైన హిజ్కియాకు కూడా వారు అనేక విలువైన వస్తువులు తెచ్చియిచ్చారు. అప్పటి నుండి హిజ్కియాను అన్ని దేశాల వారు గౌరవించటం మొదలు పెట్టారు.

24 ఆ రోజులలోనే హిజ్కయాకు తీవ్రంగా జబ్బుచేసి చనిపోయే స్థితిలో వున్నాడు. అతడు దేవుని ప్రార్థించాడు. యెహోవా హిజ్కియాతో మాట్లాడి, అతనికి ఒక సూచన[a] ఇచ్చినాడు. 25 కాని హిజ్కియా హృదయం గర్విపడింది. అందువల్ల అతనికి దేవుడు చేసిన మేలుకు అతడు కృతజ్ఞతలు తెలుపలేదు. ఈ కారణంవల్ల దేవుడు హిజ్కియా పట్ల మరియు యూదా, యెరూషలేము ప్రజలపట్ల కోపగించినాడు. 26 కాని హిజ్కియా, యెరూషలేము ప్రజలు మళ్లీ మనస్సు మార్చుకొనినవారై, తమ జీవితాలు మార్చుకున్నారు. వారు విదేయులై గర్వించటం మానుకున్నారు. అందువల్ల హిజ్కియా బ్రతికినంత కాలం దేవుని కోపం వారి మీదికి రాలేదు.

27 హిజ్కియా మహా భాగ్యవంతుడయ్యాడు. గొప్ప గౌరవం లభించింది. వెండి బంగారాలు, విలువైన ఆభరణాలు, సుగంధ ద్రవ్యాలు, డాళ్లు, తదితర వస్తువులు భద్రపర్చటానికి అతడు తగిన స్థానాలు ఏర్పాటు చేశాడు. 28 ధాన్యం, క్రొత్త ద్రాక్షారసం, ప్రజలు తనకు పంపిన నూనెను నిల్వచేయటానికి హిజ్కియా గిడ్డంగులు నిర్మించాడు. అన్ని రకాల పశువులశాలలు, గొఱ్ఱెలకు కొట్టములు కూడ నిర్మించాడు. 29 హిజ్కియా చాలా కొత్త పట్టణాలు నిర్మించాడు. పశుసంపద గొఱ్ఱెల మందలు ఎక్కువగా అభివృద్ధి చేశాడు. యెహోవా హిజ్కియాకు లెక్కలేనంత ఐశ్వర్యాన్ని సమకూర్చినాడు. 30 యెరూషలేములో గిహోను ఎగువ కాలువ ప్రవాహానికి అడ్డుకట్టలు వేసి, నీటిని దావీదు నగరంలో పడమటి దిశన తిన్నగా ప్రవహించేలా మళ్లించినవాడు హిజ్కియాయే. హిజ్కియా చేపట్టిన ప్రతి పనిలోను విజయం సాధించాడు.

31 ఒక పర్యాయం బబులోను పెద్దలు హిజ్కియా వద్దకు దూతలను పంపారు. అప్పుడు దేశాలలో సంభవించిన ఒక అధ్బుత సంఘటన[b] గురించి అడిగి తెలిసికొన్నారు. వారు వచ్చినప్పుడు హిజ్కియా మనస్సులో[c] ఏమున్నదో పరీక్షించి పూర్తిగా తెలిసికొనటానికి అతనిని యెహోవా ఒంటరిగా వదిలినాడు.

32 హిజ్కియా పాలనలో అతడు చేసిన ఇతర కార్యములను గురించి, అతని భక్తి కార్యక్రమాల గురించి యూదా, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథం మరియు ప్రవక్త ఆమోజు కుమారుడైన యెషయా దర్శనాలలో వ్రాయబడినాయి. 33 హిజ్కియా చనిపోగా అతడు తన పూర్వీకుల వద్ద సమాధి చేయబడినాడు. దావీదు పూర్వీకుల సమాధులున్న కొండమీద ప్రజలు హిజ్కియాను సమాధి చేశారు. హిజ్కియా చనిపోయినప్పుడు యూదా ప్రజలందరు, మరియు యెరూషలేములో నివసిస్తున్నవారు అతనికి ఘనంగా నివాళులర్పించారు. హిజ్కియా స్థానంలో మనష్షే కొత్త రాజయ్యాడు. మనష్షే హిజ్కియా కుమారుడు.

యూదా రాజుగా మనష్షే

33 మనష్షే యూదా రాజయ్యేనాటికి పన్నెండు సంవత్సరాలవాడు. యెరూషలేములో అతడు ఏబైయైదు సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. యెహోవా దృష్టికి చెడ్డవైన పనులన్నీ మనష్షే చేశాడు. అన్యదేశాల వారి భయంకరమైన, పాప భూయిష్టమైన ఆచారాలన్నిటినీ అతడు అనుసరించాడు. ఆ రాజ్యాల వారిని ఇశ్రాయేలీయుల ఎదుటనుండి యెహోవా బయటకు వెడల గొట్టినాడు. తన తండ్రి హిజ్కియా తొలగించిన ఉన్నత స్థలాలన్నీ మనష్షే మళ్లీ నిర్మించాడు. బయలు దేవతలకు పూజా పీఠాలను, అషేరా దేవతా స్తంభాలను మనష్షే నిర్మించాడు. నక్షత్ర మండలాలకు ప్రణమిల్లి, వాటిని అతడు ఆరాధించాడు. యెహోవా ఆలయంలో బూటకపు దేవతలకు మనష్షే బలిపీఠాలు నిర్మించాడు. కాని “నా నామము యెరూషలేములో శాశ్వతంగా వుంటుంది” అని యెహోవా తన ఆలయ విషయంలో చెప్పియున్నాడు. రెండు ఆలయ ఖాళీ స్థలాలలోను ప్రతి నక్షత్ర మండలానికి ఒక్కొక్కటి చొప్పున మనష్షే బలిపీఠాలను నిర్మించాడు. బెన్‌హిన్నోము లోయలో[d] మనష్షే తన స్వంత పిల్లలను కూడ దేవతలకు బలియిచ్చాడు. మనష్షే భవిష్యత్తును తెలిసికోవటానికి మంత్రతంత్ర విద్యలను ఆశ్రయించి, సోదె చెప్పు వారిని, చిల్లంగి వాండ్రను సంప్రదించాడు. కర్ణపిశాచి విద్యలను పాటించే వారిని సోదెచెప్పు వారిని ప్రోత్సహించి వారి సలహాలు తీసికొన్నాడు. దేవుని దృష్టిలో చాలా హేయమైన పనులు చేశాడు. మనష్షే పాపాలు యెహోవాకు కోపం వచ్చేటట్లు చేశాయి. అతడు ఒక దేవతా విగ్రహాన్ని కూడ చేయించి దానిని ఆలయంలో నెలకొల్పాడు. ఈ ఆలయాన్ని గురించి యెహోవా దావీదుకు, అతని కుమారుడు సొలొమోనుకు యిలా చెప్పినాడు: “ఈ ఆలయంలోను, యెరూషలేములోను నా నామమును స్థిరంగా ప్రతిష్టించుతాను. ఇశ్రాయేలు కుటుంబాల వారుంటున్న స్థానములన్నిటిలోను నేను యెరూషలేమును ఎంపిక చేసికొన్నాను. ఇశ్రాయేలీయుల పూర్వీకులకు యివ్వడానికి నిశ్చయించిన ఈ రాజ్యంనుండి మరెన్నడూ నేను వారిని బయటకు వెళ్ల గొట్టను. కాని వారికి నేను ఆజ్ఞాపించిన విషయాలన్నిటినీ వారు తప్పక పాటించాలి. ఇశ్రాయేలు ప్రజలకు అందజేయమని నేను మోషేకు ఇచ్చిన ధర్మాశాస్త్రాన్ని, నియమ నిబంధనలను, ఆజ్ఞలను వారు తప్పక అనుసరించాలి.”

యూదా ప్రజలను, యెరూషలేము వాసులను తప్పుడు పనులు చేయటానికి మనష్షే ప్రోత్సహించాడు. ఇశ్రాయేలీయుల ముందు నుండి యెహోవా చేత బలవంతంగా వెళ్లగొట్టబడి నాశనం గావింపబడిన వారి కంటె వారు ఎక్కువ పాపాలు చేశారు.

10 యెహోవా మనష్షేతోను, అతని ప్రజలతోను మాట్లాడినాడు గాని, వారు దేవుని మాట వినటానికి నిరాకరించారు. 11 అందువల్ల అష్షూరు రాజు సైన్యాధికారులను యూదాపై దండెత్తటానికి యెహోవా రప్పించాడు. ఆ అధికారులు మనష్షేను పట్టుకుని, అతనికి సంకెళ్లు వేశారు. మనష్షే చేతులకు వారు ఇత్తడి గొలుసులు తగిలించారు. వారతనిని బందీగా బబులోనుకు పట్టుకుపోయారు.

12 మనష్షే చాలా బాధ అనుభవించాడు. ఆ సమయంలో తన దేవుడగు యెహోవాను వేడుకున్నాడు. తన పితరుల దేవుని ముందర మనష్షే మిక్కిలి విధేయుడైనాడు 13 మనష్షే దేవునికి ప్రార్థన చేసి, తనకు సహాయపడమని వేడుకున్నాడు. యెహోవా మనష్షే మనవి ఆలకించి, అతని విషయంలో బాధపడినాడు. యెహోవా అతనిని యెరూషలేముకు తిరిగి వచ్చి తన సింహాసనాన్ని మళ్లీ అలకరించేలా చేసినాడు. యెహోవాయే నిజమైన దేవుడని మనష్షే అప్పుడు తెలిసికొన్నాడు.

14 ఇది జరిగిన పిమ్మట మనష్షే దావీదు నగరానికి బయట ఒక గోడ కట్టించాడు. (కిద్రోను) లోయలో మత్స్యద్వారం ముంగిట నున్న గిహోను నీటి బుగ్గకు పశ్చిమంగా ఈ గోడవుంది. మనష్షే ఈ గోడను ఓపెలు కొండ చుట్టూ కట్టించాడు. ఈ గోడ చాలా ఎత్తుగా కట్టించాడు. పిమ్మట యూదాలో వున్న కోటలన్నిటిలో అతడు సైనికాధికారులను నియమించాడు. 15 ఇతర దేవుళ్ల విగ్రహాలన్నిటినీ మనష్షే తీసి పారవేశాడు. ఆలయంలో వున్న విగ్రహాన్ని అతడు తీసివేశాడు. యెరూషలేములో ఆలయ ప్రాకారం మీద అతను నెలకొల్పిన బలిపీఠాలన్నీ తొలగించాడు. ఆ బలిపీఠాలన్నిటినీ యెరూషలేము నగరంనుండి తీసి బయట పారవేశాడు. 16 పిమ్మట అతడు యెహోవా బలిపీఠాన్ని ప్రతిష్ఠించి దాని మీద సమాధానబలులు, కృతజ్ఞతార్పణలు సమర్పించాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ఘనంగా ఆరాధించుమని మనష్షే యూదా ప్రజలందరికి ఆజ్ఞాపించాడు. 17 ప్రజలు ఉన్నత స్థలాలలో బలులు యివ్వటం కొనసాగించారు గాని వారు అవన్నీ వారి దేవుడగు యెహోవాకే అర్పించారు.

18 మనష్షే చేసిన ఇతర విషయాలు, దేవునికి అతడు చేసిన ప్రార్థన, ఇశ్రాయేలు దేవుని తరపున దీర్ఘదర్శలు అతనిని గురించి చెప్పిన విషయాలు అన్నీ ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడినాయి. 19 మనష్షే దేవునికి చేసిన ప్రార్థన, దేవుడు దానిని విన్న విధము, అది విని దేవుడు బాధపడిన విషయములు దీర్ఘదర్శులు రచించిన గ్రంథంలో వ్రాయబడినాయి. మనష్షే తనకు తాను విధేయుడు కాక పూర్వం అతడు చేసిన పాపాలు, పొరపాట్లు, అతను ఎక్కడెక్కడ ఇతర దేవుళ్లకు ఉన్నత స్థలాలు, అషేరా దేవతా స్తంభాలు నిలిపిన విషయాలు దీర్ఘదర్శుల గ్రంథంలో వ్రాయబడ్డాయి. 20 మనష్షే చనిపోయినప్పుడు అతనిని తన పూర్వీకులతోపాటు సమాధిచేశారు. ప్రజలతనిని తన స్వంత రాజ గృహంలోనే సమాధి చేశారు. మనష్షే స్థానంలో ఆమోను కొత్తగా రాజయ్యాడు. ఆమోను మనష్షే కుమారుడు.

యూదా రాజుగా ఆమోను

21 యూదాకు రాజయ్యేనాటికి ఆమోను ఇరువదిరెండేండ్లవాడు. యెరూషలేములో అతడు రెండేండ్లపాటు రాజుగా ఉన్నాడు. 22 దేవుని సన్నిధిలో ఆమోను అన్నీ నీచకార్యాలే చేశాడు. తన తండ్రి మనష్షే చేసిన విధంగా, దేవుడు అతని నుండి ఆశించిన పవిత్ర కార్యాలేవీ ఆమోను చేయలేదు. తన తండ్రి మనష్షే చేయించి వుంచిన చెక్కడపు (నగిషీ) బొమ్మల విగ్రహాలకు ఆమోను బలులు అర్పించాడు. ఆమోను ఆ విగ్రహాలను ఆరాధించాడు. 23 తన తండ్రి మనష్షే పరివర్తన చెందినట్లు, ఆమోను దేవుని ముందు వీధేయుడై మెలగలేదు. పైగా ఆమోను రోజు రోజుకు మరింత పాపం చేయసాగాడు. 24 ఆమోను సేవకులు అతనిపై కుట్రపన్నారు. వారు ఆమోనును అతని స్వంత ఇంటిలోనే హత్యచేశారు. 25 కాని యూదా ప్రజలు రాజైన ఆమోనుపై కుట్ర పన్నిన సేవకులందరీని చంపివేశారు. తరువాత ప్రజలు కొత్త రాజుగా యోషీయాను ఎంపిక చేశారు. యోషీయా ఆమోను కుమారుడు.

యూదా రాజుగా యోషీయా

34 యోషీయా రాజయ్యేనాటికి ఎనిమిది సంవత్సరాలవాడు. అతడు యెరూషలేములో ముప్పై యొక్క సంవత్సరాలు రాజుగా వున్నాడు. ఏది న్యాయమైనదో అది యోషీయా చేశాడు. యెహోవా చేయుమని చెప్పినవన్నీ అతడు చేశాడు. తన పూర్వీకుడైన దావీదువలె అతడు మంచి కార్యాలు చేశాడు. యోషీయా మంచిపనులు చేయటానికి ఎన్నడూ వెనుకాడలేదు. యోషీయా రాజైన పిమ్మట ఎనిమిదవ సంవత్సరం నుండి తన పూర్వీకుడైన దావీదు కొలిచిన దేవుడినే ఆరాధించాడు. దేవుని అనుసరించే నాటికి యోషీయా ఇంకా చిన్నవాడే. రాజుగా యోషీయా పన్నెండవ సంవత్సరంలో వుండగా యూదా, యెరూషలేములలో వున్న ఉన్నత స్థలాలను, అషేరా దేవతా స్తంభాలను, చెక్కిన, పోతపోసిన విగ్రహాలను నాశనం చేయటం మొదలు పెట్టాడు. బయలు దేవతలకు నిర్మించిన బలిపీఠాలన్నిటినీ ప్రజలు పగులగొట్టారు. వారీపని యోషీయా ఎదుటనే చేశారు. ప్రజలకు అందనంత ఎత్తుగా వున్న ధూప పీఠాలను పిమ్మట యోషీయా పడగొట్టాడు. చెక్కిన విగ్రహాలను, పోత విగ్రహాలను అతడు పగులగొట్టాడు. అతడా విగ్రహాలన్నిటినీ చూర్ణం చేశాడు. తరువాత యోషీయా ఆ చూర్ణాన్ని బయలుదేవతలను ఆరాధించి, బలులు అర్పించిన వారి సమాధులపై చల్లాడు. బయలు దేవతలకు సేవ చేసిన యాజకుల ఎముకలను ఆ బలిపీఠాలపైనే యోషీయా కాల్చినాడు. ఈ రకంగా యోషీయా యూదాలోను, యెరూషలేములోను విగ్రహాలను, విగ్రహారాధనను తుడిచివేశాడు. మనష్షే, ఎఫ్రాయిము, షిమ్యోను దేశాలలో వున్న పట్టణాలలోను, నఫ్తాలి వరకుగల పట్టణాలలో కూడ యోషీయా ఇదేరకంగా చేశాడు. ఆ పట్టణాల పరిసరాలలో వున్న పాడుబడ్డ ప్రదేశాలలో కూడ అతడీ పని చేశాడు. యోషీయా పీఠాలన్నీ పగులగొట్టి, అషేరా దేవతా స్తంభాలను పడగొట్టినాడు. విగ్రహాలన్నిటినీ పిండిగా పగుల గొట్టాడు. ఇశ్రాయేలులో బయలు దేవతలకు నిర్మించిన ధూప పీఠాలన్నిటినీ అతడు పిండిగా పగులగొట్టాడు. పిమ్మట యోషీయా యెరూషలేముకు తిరిగి వెళ్లాడు.

యోషీయా తన యూదా రాజ్యపాలనలో పదునెనిమిదవయేట షాఫాను, మయశేయా, మరియు యోవాహును పాడవుతున్న యెహోవా ఆలయాన్ని పునరుద్ధరించటానికి పంపాడు. షాఫాను తండ్రిపేరు అజల్యా. మయశేయా నగర పాలకుడు. యోవాహు తండ్రిపేరు యోహాహాజు. యోవాహు లేఖికుడు. జరిగిన వృత్తాంతములన్నిటినీ సేకరించి పుస్తకములో ఎక్కించువాడు.

యోషీయా ఆలయాన్ని పునరుద్ధరించి యూదాను, యెరూషలేమును మళ్లీ పవిత్ర పర్చటానికి పూనుకొన్నాడు. ఆ మేరకు ఆజ్ఞలు ఇచ్చాడు. ప్రధాన యాజకుడు హిల్కీయా వద్దకు వారు వచ్చారు. ప్రజలు ఆలయానికి ఇచ్చిన కానుకల ధనాన్ని వారు హిల్కీయాకు ఇచ్చారు. ద్వారపాలకులుగా ఉన్న లేవీయులు ఈ ధనాన్ని మనష్షే ఎఫ్రాయిము ప్రజల నుండి మరియు దేశంలో ఇంకను మిగిలియున్న ఇశ్రాయేలీయుల వద్దనుండి సేకరించారు. ఈ ధనాన్ని వారు యూదా, బెన్యామీను ప్రజల నుండి యెరూషలేము ప్రజల నుండి కూడ సేకరించారు. 10 ఆలయపు పనిని పర్యవేక్షించే ఉద్యోగులకు వారు ఈ ధనాన్ని ఇచ్చారు. ఈ అధికారులు ధనాన్ని తిరిగి ఆలయాన్ని తిరిగి కడుతున్న పనివారికి చెల్లించారు.

11 ఆ ధనాన్ని వారు వడ్రంగులకు, శిల్పులకు, చెక్కిన రాళ్లను, కలపను కొనటానికి ఇచ్చారు. భవనాలను తిరిగి నిర్మించటానికి, భవనాలకు కావలసిన దూలాలు తయారు చేయటానికి, ఈ కలపను వినియోగించారు. ఆలయ భవనాల విషయంలో యూదా రాజులు గతంలో తగిన శ్రద్ధ వహించలేదు. ఆ భవనాలన్నీ పాతవై శిధిలాలవస్థలో వున్నాయి. 12-13 పనివారంతా విశ్వాసంగా పనిచేశారు. వారిపై తనిఖీ అధికారుల పేర్లు యహతు, ఓబద్యా. యహతు, ఓబద్యా లిరువురూ లేవీయులు. వారు మెరారీ వంశీయులు. మిగతా పర్యవేక్షకులు జెకర్యా మరియు మెషుల్లాము. వారు కహాతీయులు. సంగీత వాద్య విశేషములను వాయించుటలో నేర్పురులైన లేవీయులు కూడా బరువులు మోసే కూలీల మీద, ఇతర పనివారిమీద తనిఖీ దారులుగా పనిచేశారు. మరికొందరు లేవీయులు కార్యదర్శులుగాను, అధికారులుగాను, ద్వారపాలకులుగాను పనిచేశారు.

ధర్మశాస్త్ర గ్రంథాన్ని కనుగొనుట

14 ఆలయంలో వున్న ధనాన్ని లేవీయులు బయటకు తెచ్చారు. ఆ సమయంలో యాజకుడగు హిల్కీయా ప్రభువైన యెహోవా మోషేద్వారా అందజేసిన ధర్మశాస్త్ర గ్రంథాన్ని కనుగొన్నాడు. 15 హిల్కీయా కార్యదర్శియగు షాఫానుతో, “ఆలయంలో నేను ధర్మశాస్త్ర గ్రంథాన్ని కనుగొన్నా” నని చెప్పాడు. హిల్కీయా గ్రంథాన్ని షాఫానుకు ఇచ్చాడు. 16 షాఫాను ఆ గ్రంథాన్ని రాజైన యోషీయా వద్దకు తెచ్చాడు. షాఫాను రాజు వద్దకు వచ్చి ఆలయ పనిపై తన నివేదిక ఈ విధంగా సమర్పించాడు: “మీ సేవకులు మీరు చెప్పిన విధంగా పని కొనసాగిస్తున్నారు. 17 వారు ఆలయంలోవున్న ధనాన్ని తీసి పనిమీద తనిఖీదారులకు, పనివారికి చెల్లిస్తున్నారు.” 18 తరువాత షాఫాను రాజైన యోషీయాతో, “యాజకుడగు హిల్కీయా నాకొక గ్రంథమిచ్చాడు” అని చెప్పాడు. పిమ్మట షాఫాను ఆ గ్రంథం నుండి రాజుముందు చదవటం మొదలుపెట్టాడు. 19 రాజైన యోషీయా ధర్మశాస్త్ర విషయాలు విన్నప్పుడు తన బట్టలు చింపుకున్నాడు.[e] 20 తరువాత రాజు హిల్కీయాకు, షాఫాను కుమారుడు అహీకాముకు, మీకా కుమారుడు అబ్దోనుకు, కార్యదర్శి షాఫాను మరియు సేవకుడైన ఆశాయాకును ఒక ఆజ్ఞ యిచ్చాడు. 21 రాజు యిలా చెప్పాడు: “మీరు వెళ్లి నా తరుపున ఇశ్రాయేలులోను, యూదాలోను మిగిలివున్న ప్రజల తరపున యెహోవాను మనకు దొరికిన ధర్మశాస్త్రంలో వ్రాయబడిన విషయాలను గురించి అడగండి. మన పూర్వీకులు యెహోవా ఆజ్ఞలను పాటించని కారణంగా ఆయన మనపట్ల ఎక్కువ కోపంగా వున్నాడు. ఈ గ్రంథం బోధించిన విషయాలను వారు పాటించలేదు!”

22 హిల్కీయా, రాజసేవకులు[f] కలిసి ప్రవాదిని హుల్దా వద్దకు వెళ్లారు. హుల్దా, షల్లూము భార్య. షల్లూము తాఖతు (తిక్వా) కుమారుడు. తాఖతు హస్రహూ (హస్రా) యొక్క కుమారుడు. హర్హహు (హస్రా) రాజవస్త్రాల విషయంలో శ్రద్ధ తీసికొనే అధికారి. హుల్దా క్రొత్త యెరూషలేములో నివసిస్తూ వుండేది. హిల్కీయా, రాజ సేవకులు జరిగిన సంగతంతా హుల్దాకు తెలిపారు. 23 హుల్దా వారితో యిలా చెప్పింది: “ఇశ్రాయేలు దేవుడగు యెహోవా యిలా తెలియజేస్తున్నాడు రాజైన యోషీయాకు తెలియజేయుము. 24 యెహోవా యిలా చెప్పుచున్నాడు: ‘ఈ ప్రదేశానికి, ఇక్కడ నివసిస్తున్న ప్రజలకు నేను కష్టాలు తెచ్చి పెడతాను. యూదా రాజు ముందర చదివిన పుస్తకంలో వ్రాసిన విధంగా భయంకర పరిస్థితులు తీసికొని వస్తాను. 25 ఇలా ఎందుకు చేస్తాననగా ప్రజలు నన్ను వదిలి అన్య దేవతలకు ధూపం వేయసాగారు. వారు చేసిన నీచ కార్యాలన్నిటితో వారు నాకు కోపం కలుగజేశారు. అందువల్ల ఈ ప్రదేశం మీద నా కోపాన్ని కుమ్మరిస్తాను. బడబాగ్నిలా[g] నా కోపం చల్లారదు!’

26 “కాని ఈ విషయం యూదా రాజైన యోషీయాకు చెప్పండి. దేవుని అడుగమని అతడు మిమ్మల్ని పంపాడు. ఇంతకు ముందు మీరు విన్న విషయాలపై ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యిలా చెప్పుచున్నాడు: 27 ‘యోషీయా, నీవు పశ్చాత్తాప పడినావు. నిన్ను నీవు తగ్గించుకొని, నీ దుస్తులు చింపుకున్నావు. నాముందు నీవు విలపించావు. నీ హృదయం మారినది గనుక, 28 నేను నిన్ను నీ పూర్వీకుల వద్దకు[h] తీసుకొని వెళతాను. నీవు నీ సమాధికి ప్రశాంతంగా వెళతావు. ఈ ప్రాంతం మీదికి, ఇక్కడ నివసించే ప్రజల మీదికి నేను రప్పించే గొప్ప నాశనం నీవు చూడవు.’” హిల్కీయా మరియు రాజు సేవకులు ఈ సందేశాన్ని రాజైన యోషీయాకు. అందజేశారు.

29 రాజైన యోషీయా యూదా, యెరూషలేము పెద్దలందరినీ తనను వచ్చి కలవమని పిలిచాడు. 30 రాజు యోహోవా ఆలయానికి వెళ్ళాడు. యూదా ప్రజలందరు, యెరూషలేము వాసులు, యాజకులు, లేవీయులు, ప్రముఖులు, సామాన్య ప్రజానీకం అంతా యోషీయావద్దకు వచ్చారు. ఒడంబడిక గ్రంథంలో వున్న విషయాలన్నీ యోషీయా ప్రజలకు చదివి వినిపించాడు. ఆ గ్రంథం ఆలయంలో దొరికింది. 31 తరువాత రాజు తన స్థానంలో లేచి నిలబడినాడు. అతడు యెహోవాతో ఒక ఒడంబడిక చేసికొన్నాడు. యెహోవాను అనుసరించటానికి, ఆయన ఆజ్ఞలు, ధర్మాశాస్త్రాన్ని నియమాలను పాటించటానికి అతడు అంగీకరించాడు. హృదయపూర్వకంగా, ఆత్మ పూర్వకంగా అనుసరించటానికి యోషీయా అంగీకరించాడు. ఈ గ్రంథంలో వ్రాసిన ఒడంబడికలోని అంశాలను పాటించటానికి యోషీయో అంగీకరించాడు. 32 పిమ్మట యెరూషలేము, బెన్యామీను ప్రజలందరూ ఈ ఒడంబడికను అంగీకరించేలా వారిచే యోషియా ప్రమాణం చేయించాడు. తమ పూర్వీకులు విధేయులైవున్న దేవుని ఒడంబడికకు యెరూషలేము ప్రజలు బద్ధులయ్యారు. 33 పైగా ఇశ్రాయేలీయులకు సంబంధించిన స్థలాలలో వున్న విగ్రహాలన్నిటినీ యోషీయా తీసిపారవేశాడు. దేవుడు ఆ విగ్రహాలను అసహ్యించు కున్నాడు. యోషీయా రాజు ఇశ్రాయేలులో ప్రతి ఒక్కడిని వారి దేవుడగు యెహోవాను ఆరాధించునట్లు చేసెను. యోషీయా జీవించినంతకాలం ప్రజలు తమ పూర్వీకుల దేవుడగు యెహోవాను ఆరాధించటం మానలేదు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International