Print Page Options
Previous Prev Day Next DayNext

Beginning

Read the Bible from start to finish, from Genesis to Revelation.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 దినవృత్తాంతములు 9-12

షేబదేశపు రాణి సొలొమోనును దర్శించటం

షేబ దేశపు రాణి సొలొమోను కీర్తిని గురించి విన్నది. కఠినమైన, చిక్కు ప్రశ్నలు వేసి సొలొమోనును పరీక్షించాలని ఆమె యెరూషలేముకు వచ్చింది. షేబ రాణి తన వెంట అనేకమంది మనుష్యులను తీసుకొని వచ్చింది. సుగంధ ద్రవ్యాలు, బంగారం, విలువైన రత్నాలు మోసుకొని వచ్చిన ఒంటెలు ఆమెతో వున్నాయి. ఆమె సొలమోను వద్దకు వచ్చి అతనితో మాట్లాడింది. ఆమె వద్ద సొలొమోనును అడగటానికి ఎన్నో ప్రశ్నలున్నాయి. ఆమె ప్రశ్నలన్నిటికీ సొలొమోను సమాధాన మిచ్చాడు. వివరించి చెప్పటానికిగాని, సమాధాన మివ్వటానికిగాని సొలొమోనుకు కష్టమైనదేదీ కన్పించలేదు. సొలొమోను జ్ఞానాన్ని, అతడు నిర్మించిన భవంతులను షేబ దేశపు రాణి స్వయంగా చూసింది. సొలొమోను బల్లమీద రాజ భోజన పదార్థాలను, అతని ముఖ్య అధికారులనేకమందిని ఆమె చూసింది. అతని సేవకులు పనిచేసే తీరును, వారు ధరించే దుస్తులను ఆమె చూసింది. సొలొమోనుకు ద్రాక్షరసము వడ్డించే వారిని, వారి దుస్తులను ఆమె చూసింది. ఆలయంలో సొలొమోను అర్పించిన దహన బలులను కూడ ఆమె చూసింది. షేబ దేశపు రాణి వాటన్నింటినీ చూసినప్పుడు ఆమె ఆశ్చర్యపడింది!

అప్పుడామె రాజైన సొలొమోనుతో యిలా అన్నది: “నీ ఘనమైన కార్యాలను గురించి, నీ అద్భుతమైన తెలివితేటల గురించి నేను నా దేశంలో విన్న విషయాలన్నీ నిజమని తెలుసుకున్నాను. నేనిక్కడికి వచ్చి, నా కన్నులతో స్వయంగా చూచేవరకు నేనా విషయాలను నమ్మలేదు. ఆహా! నీకున్న మహాజ్ఞానంలో కనీసం సగం కూడ నాకు చెప్పబడలేదు! నేను విన్న విషయాలను మించి వున్నావు నీవు! నీవు, నీ భార్యలు, అధికారులు చాలా అదృష్టవంతులు! నీకు సేవ చేస్తూనే నీ జ్ఞాన వాక్కులను వారు వినగలరు! నీ దేవుడైన ప్రభువుకు వందనాలు! నీ పట్ల ఆయన సంతోషంగా వున్నాడు. అందువల్ల ఆయన తరపున రాజ్యమేలటానికి సింహాసనంపై నిన్ను కూర్చోపెట్టాడు. నీ దేవుడు ఇశ్రాయేలును ప్రేమిస్తున్నాడు. ఆయన సహాయం ఇశ్రాయేలుకు శాశ్వతంగా వుంటుంది. అందువల్లనే ఏది న్యాయమైనదో, ఏది మంచిదో అది చేయటానికి యెహోవా నిన్ను ఇశ్రాయేలుకు రాజుగా చేశాడు.”

తరువాత షేబ దేశపు రాణి సొలొమోను రాజుకు నాలుగున్నర టన్నుల (రెండు వందల నలబై మణుగులు) బంగారం, లెక్కకు మించి సుగంధ ద్రవ్యాలు, విలువైన రత్నాలు ఇచ్చింది. షేబ దేశపు రాణి ఇచ్చినట్లు రాజైన సొలొమోనుకు ఎవ్వరూ అటువంటి మేలి రకపు సుగంధ ద్రవ్యాలను ఇచ్చివుండలేదు.

10 హీరాము సేవకులు, సొలొమోను సేవకులు ఓఫీరు[a] నుండి బంగారం తీసుకొని వచ్చారు. వారింకా చందనపు కర్రను, విలవైన రత్నాలను తెచ్చారు. 11 ఆలయంలో మెట్ల నిర్మాణానికి, రాజభవన నిర్మాణంలోను రాజైన సొలొమోను చందనపు కర్రను ఉపయోగించాడు. సంగీత విధ్వాంసుల కొరకు తంబురలు, సితరాలు చేయటానికి కూడ సొలొమోను ఈ కర్రను వినియోగించాడు. యూదాలో చందనపు కర్రతో చేయబడిన చిత్రవిచిత్ర కళాఖండాలను ఎవ్వరూ ముందెన్నడూ చూసి వుండలేదు.

12 రాజైన సొలొమోను కూడ షేబ దేశపు రాణికి ఆమెకు కావలసిన వాటిని, అడిగిన ప్రతి దానిని ఇచ్చాడు. తనకు ఇవ్వటానికి ఆమె తెచ్చిన దానికంటె ఎక్కువగానే సొలొమోను ఇచ్చాడు. తరువాత షేబ దేశపు రాణి, ఆమె పరివారం తమ దేశానికి వెళ్లిపోయారు.

సొలొమోను మహా సంపద

13 ఒక్క సంవత్సరంలో సొలొమోను సేకరించిన బంగారం ఇరవై ఐదు టన్నులు (ఒక వెయ్యి మూడు వందల ముప్పై రెండు మణుగులు) తూగింది. 14 సంచార వర్తకులు, వ్యాపారులు సొలొమోనుకు చాలా బంగారం తెచ్చారు. అరబీ రాజులందురూ, దేశంలో ప్రాంతీయ పాలకులూ సొలొమోనుకు వెండి బంగారాలు తెచ్చియిచ్చారు.

15 బంగారు రేకులు తాపిన రెండు వందల పెద్దడాళ్లను సొలొమోను చేయించాడు. ప్రతి డాలుకూ సుమారు ఏడున్నర పౌనుల (ఆరు వందల తులాల) సాగగొట్టిన బంగారం పట్టింది. 16 బంగారు రేకులు వేయించి మూడు వందల చిన్న డాళ్లను కూడ సొలొమోను చేయించాడు. సుమారు మూడు ముప్పాతిక పౌనుల (మూడ వందల తులాల) బంగారం ఒక్కొక్క డాలుకు పట్టింది. లెబానోను అరణ్యంలో కట్టిన భవనంలో రాజైన సొలొమోను ఈ డాళ్లను వుంచాడు.

17 ఒక పెద్ద దంతపు సింహాసనాన్ని సొలొమోను రాజు చేయించాడు. మేలిమి బంగారపు రేకులు దానికి తాపించాడు. 18 సింహాసనానికి ఆరు మెట్లున్నాయి. బంగారంతో చేయించిన కాలిపీట దాని ముందు వుంది. సింహాసనానికిరుపక్కల చేతులు ఆనించటానికి తగిన ఆసరా ఏర్పాటు వుంది. చేతి ఆసరాలకు రెండు పక్కలా రెండు సింహపు విగ్రహాలున్నాయి. 19 ప్రతి మెట్టుకూ అటు ఇటు రెండేసి సింహాల విగ్రహాలు చొప్పున ఆరు మెట్లకు పన్నెండు సింహాపు విగ్రహాలు అమర్చబడ్డాయి. ఏ యితర సామ్రాజ్యంలోనూ ఈ రకమైన సింహాసనం చేయించబడలేదు.

20 సొలొమోను రాజు తాగే గిన్నెలన్నీ బంగారంతో చేసినవే. “లెబానోను అరణ్య” భవనంలో వాడే వస్తుసామగ్రి అంతా శుద్ధ బంగారంతో చేయబడింది. సొలొమోను కాలంలో వెండి విలువైన లోహంగా చూడబడలేదు.

21 తర్షీషు[b] వరకు ప్రయాణం చేసిన ఓడలు సొలొమోను రాజుకు వున్నాయి. హీరాము మనుష్యులు సొలొమోను ఓడలను నడిపేవారు. మూడు సంవత్సరాల కొకసారి ఓడలు వెండి బంగారాలు, ఏనుగు దంతాలు, కోతులు, నెమళ్లు మొదలగు వాటిని తీసుకొని సొలొమోను రాజ్యానికి తిరిగి వచ్చేవి.

22 భూలోకంలో వున్న రాజులందరికంటె సొలొమోను భాగ్యంలోను, తెలివితేటలలోను గొప్ప వాడయ్యాడు. 23 ప్రపంచ దేశాల రాజులంతా సొలొమోను వివేకవంతమైన న్యాయ నిర్ణయాలను వినటానికి అతనిని దర్శించేవారు. సొలొమోనుకు ఆ తెలివితేటలను దేవుడే ప్రసాదించాడు. 24 ప్రతి సంవత్సరం సొలొమోనును దర్శించటానికి వచ్చే రాజులందరూ కానుకలు తెచ్చేవారు. వారు వెండి బంగారు వస్తువులు, బట్టలు, కవచాలు, సుగంధ ద్రవ్యాలు, గుర్రాలు, కంచరగాడిదలను తెచ్చేవారు.

25 సొలొమోనుకు గుర్రాలను, రథాలను వుంచటానికి నాలుగువేల శాలలున్నాయి. అతనికి పన్నెండు వేలమంది రథసారధులున్నారు. రథాలకు ప్రత్యేక నగరాలను ఏర్పాటుచేసి, మరికొన్ని తనతో యెరూషలేములో వుంచుకున్నాడు. 26 యూఫ్రటీసు నది మొదలు ఫిలిష్తీయుల దేశం, మరియు ఈజిప్టు సరిహద్దు వరకు వున్న రాజులందరికీ సొలొమోను రాజైయున్నాడు. 27 సొలొమోను రాజు వద్ద నిలవవున్న వెండి యెరూషలేములో కొండ గుట్టల్లా పడివుంది. అతని వద్ద పల్లపు ప్రాంతంలో[c] వున్న మేడిచెట్లంత విస్తారంగా దేవదారు చెట్ల కలపవుంది. 28 ఈజిప్టు నుండి, తదితర దేశాలనుండి ప్రజలు సొలొమోనుకు గుర్రాలను తెచ్చి యిచ్చేవారు.

సొలొమోను మరణం

29 మొదటినుండి చివరివరకు సొలొమోను చేసిన పనులన్నీ ప్రవక్తయైన నాతాను ప్రవచనాలలోను, షిలో హువాడైన అహీయా ప్రవచనాలలోను మరియు దీర్ఘదర్శి అయిన ఇద్దో దర్శనాలలోను పొందుపర్చబడినాయి. అహీయా షిలోనీయుడు. ఇద్దో దీర్ఘదర్శి (ప్రవక్త). ఇద్దో యరొబామును గురించి రాశాడు. యరొబాము నెబాతు కుమారుడు. 30 సొలొమోను నలబై యేండ్లపాటు యెరూషలేము నుండి ఇశ్రాయేలంతటినీ పాలించాడు. 31 పిమ్మట సొలొమోను చనిపోయాడు.[d] తన తండ్రి దావీదు నగరంలో ప్రజలతనిని సమాధి చేశారు. సొలొమోను స్థానంలో అతని కుమారుడైన రెహబాము నూతన రాజయ్యాడు.

రెహబాము మూర్ఖంగా ప్రవర్తించటం

10 రెహబాము షెకెము పట్టణానికి వెళ్లాడు. ఎందువల్లననగా ఇశ్రాయేలు ప్రజలంతా రెహబామును రాజుగా అభిషిక్తుని చేయటానికి అక్కడికి వెళ్లారు. యరొబాము అప్పుడు ఈజిప్టులో వున్నాడు. అతడు ఇంతకు పూర్వము సొలొమోను రాజుకు భయపడి పారిపోయి ఈజిప్టులో దాక్కున్నాడు. యరొబాము తండ్రిపేరు నెబాతు. రెహబాము కొత్త రాజు కాబోతున్నట్లు యరొబాము విన్నాడు. అందుకని యరొబాము ఈజిప్టునుండి తిరిగి వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు తమతో రమ్మని యరొబామును పిలిచారు.

అప్పుడు యరొబాము, ఇశ్రాయేలు ప్రజలు అంతా కలిసి రెహబాము వద్దకు వెళ్లారు. వారతనితో యీలా అన్నారు: “రెహబామూ, నీ తండ్రి మాకు జీవితం కష్టమయం చేశాడు. అది మాకు మోయలేని భారమయ్యింది. నీవు మాకాబరువును తేలిక చెయ్యి. అప్పుడు నీకు మేము సేవచేస్తాము.”

రెహబాము వారితో “మూడు రోజుల తరువాత మళ్లీ నా వద్దకు రండి” అని అన్నాడు. అందుకని ప్రజలు వెళ్లిపోయారు.

రాజైన రెహబాము గతంలో తన తండ్రిగా సొలొమోను వద్ద సేవచేసిన పెద్దలను సంప్రదించాడు. “ఆ ప్రజలకు నేనేమి సమాధానం చెప్పాలని మీరు నాకు సలహా యిస్తున్నారు?” అని అడిగాడు.

పెద్దలు రెహబాముతో యిలా అన్నారు: “నీవు గనుక ఆ ప్రజల పట్ల దయగలిగి వుంటే, వారిని సంతోషపెట్టి మంచిమాటలు మాట్లాడితే, వారు నీకు సదా సేవ చేస్తారు.”

కాని రెహబాము పెద్దల సలహా పాటించలేదు. పైగా రెహబాము తనతో పెరిగి తనకు సేవచేస్తున్న తన స్నేహితులను సంప్రదించాడు. రెహబాము వారితో యీలా అన్నాడు: “మీరు నాకు ఏమి సలహాయిస్తున్నారు? ఆ ప్రజలకు మనం ఎలా సమాధానం చెప్పాలి? వారు తమ పనిని తేలిక చేయమని నన్ను అడిగారు. నా తండ్రి వారిపై వుంచిన భారాన్ని తగ్గించమని వారు నన్ను కోరుతున్నారు.”

10 అప్పుడు రెహబాముతో పెరిగిన యువకులు అతనికి యిలా సలహా యిచ్చారు: “నీతో మాట్లాడిన ప్రజలకు నీవు చెప్పవలసినది యిది: ‘నీ తండ్రి మా బ్రతుకు భారం చేశాడు. అది పెద్ద బరువు మోసినట్లుగా వుంది. కాని ఆ బరువును తగ్గించమని మేము నిన్ను కోరుతున్నాము’ అని వారన్నారు గదా. కాని రెహబామూ, నీ సమాధానం యిలా వుండాలి: ‘నా చిటికెన వ్రేలు నా తండ్రి నడుముకంటె లావుగా వుంటుంది! 11 నా తండ్రి మీపై చాలా భారం వేశాడు. కాని నేను ఆ బరువును మరింత ఎక్కువ చేస్తాను. నా తండ్రి మిమ్మల్ని కొరడాలతో కొట్టాడు. కాని నేను లోహపు కొక్కెములున్న కొరడాలతో కొట్టిస్తాను’” అని చెప్పమన్నారు.

12 మూడు రోజుల తరువాత యరొబాము, ప్రజలు కలిసి రెహబాము వద్దకు వచ్చారు. “మూడు రోజులలో మీరు నా వద్దకు రండి,” అని రెహబాము చెప్పిన దానికి అనుగుణంగా వారు వెళ్లారు. 13 అప్పుడు రెహబాము రాజు వారితో అల్పబుద్ధితో మాట్లాడాడు. రెహబాము రాజు పెద్దల సలహాను పెడ చెవిని పెట్టాడు. 14 యువకులు తనకు సలహా యిచ్చిన రీతిగా రెహబాము రాజు ప్రజలతో మాట్లాడాడు. “నా తండ్రి మీ బరువు ఎక్కువ చేశాడు. కాని నేను దానిని మరింత ఎక్కువ చేస్తాను. నా తండ్రి మిమ్మల్ని కొరడాలతో శిక్షించాడు. కాని నేను మిమ్మల్ని లోహపు కొక్కెములున్న కొరడాలతో శిక్షిస్తాను” అని అన్నాడు. 15 ఆ విధంగా రాజైన రెహబాము ప్రజల విన్నపాన్ని వినలేదు. ప్రజలగోడు అతడు వినని కారణమేమనగా, పరిస్థితులలో ఈ మార్పు దేవుడు కల్పించటమే. దేవుడే ఇది జరిపించాడు. అహీయా ద్వారా యరొబాముకు దేవుడు చెప్పించిన దానిని నిజం చేసేలా ఇది జరిగింది. అహీయా షిలోనీయుడు. యరొబాము తండ్రి పేరు నెబాతు.

16 రెహబాము రాజు తమ మనవి ఆలకించలేదని ఇశ్రాయేలు ప్రజలు అర్థం చేసుకున్నారు. అప్పుడు వారు రాజుతో యిలా అన్నారు: “మేము దావీదు కుటుంబంలో భాగస్తులమా? కాదు! యెష్షయి భూముల్లో మాకేమైనా వస్తుందా? రాదు! అందుకని ఇశ్రాయేలీయులారా, మనం మన ఇండ్లకు వెళ్లిపోదాం పదండి. దావీదు సంతతి వాడిని తన ప్రజల్ని ఏలుకో నీయండి!” తరువాత ఇశ్రాయేలు ప్రజలంతా తమ తమ ఇండ్లకు వెళ్లిపోయారు. 17 కాని యూదా పట్టణాలలో ఇంకా కొంతమంది ఇశ్రాయేలీయులు నివసిస్తూ వున్నారు. రెహబాము వారికి కూడ రాజుగానే వున్నాడు.

18 బలవంతంగా పని చేయించబడే జనులమీద అధికారిగా హదోరాము వున్నాడు. రెహబాము అతనిని ఇశ్రాయేలు ప్రజల వద్దకు పంపాడు. కాని ఇశ్రాయేలు ప్రజలు హదోరామును రాళ్లతో కొట్టి చంపివేశారు. దానితో రెహబాము తన రథంలోనికి దుమికి తప్పించు కున్నాడు. అతడు యెరూషలేముకు పారిపోయాడు. 19 అప్పటి నుండి ఇప్పటి వరకు ఇశ్రాయేలీయులు దావీదు కుటుంబానికి[e] వ్యతిరేకులై వున్నారు.

11 రెహబాము యెరూషలేముకు వచ్చిన పిమ్మట ఒక లక్షాఎనబై వేలమంది కాకలు తీరిన సైనికులను సమీకరించాడు. ఈ సైనికులను యూదా, బెన్యామీను వంశాల నుండే ఎంపిక చేశాడు. వీరందరినీ ఇశ్రాయేలుపై దాడి చేసి ఆ రాజ్యాన్ని తిరిగి తన ఏలుబడిలోకి తీసుకొని రావటానికి సమీకరించాడు. కాని యెహోవా వాక్కు షెమయాకు వినవచ్చింది. షెమయా దైవజ్ఞుడు. యెహోవా యిలా చెప్పాడు: “షెమయా, నీవు వెళ్లి సొలొమోను కుమారుడు, యూదా రాజు అయిన రెహబాముతో మాట్లాడుము. యూదాలోను, బెన్యామీను ప్రాంతంలోను నివసిస్తున్న ఇశ్రాయేలీయులందరితో కూడా మాట్లాడుము. వారికి యీలా చెప్పుము: యెహోవా తెలియజేయునదేమనగా: ‘మీరు మీ సోదరులతో యుద్ధం చేయరాదు! ప్రతి ఒక్కడూ తన ఇంటికి తిరిగి వెళ్లిపోవాలి. ఇది యిలా జరిగేలా నేనే చేశాను’” కావున రాజైన రెహబాము, అతని సైన్యం యెహోవా మాట విని వెనుకకు వెళ్లి పోయారు. వారు యరొబాముపై దాడి చేయలేదు.

రెహబాము యూదాను బలపర్చటం

రెహబాము యెరూషలేములో నివసించాడు. పరాయి రాజుల దండయాత్రల నుండి రక్షణగా అతడు యూదాలో బలమైన నగరాలను నిర్మించాడు. బేత్లెహేము, ఏతాము, తెకోవ, బేత్సూరు, శోకో, అదుల్లాము, గాతు, మారేషా, జీపు, అదోరయీము, లాకీషు, అజేకా, 10 జొర్యా, అయ్యాలోను, మరియు హెబ్రోనులో గల నగరాలను బాగుచేయించాడు. యూదాలోను, బెన్యామీనులోనుగల ఈ నగరాలు బలమైనవిగా తీర్చిదిద్దబడ్డాయి. 11 రెహబాము ఈ నగరాలను బలపర్చిన తరువాత, వాటిలో అధిపతులను, నియమించాడు. ఆ నగరాలకు ఆహార పదార్థాలు, నూనె, ద్రాక్షారసం సరఫరాలను ఏర్పాటు చేశాడు. 12 రెహబాము ప్రతి నగరంలో డాళ్లను, ఈటెలను కూడ వుంచి వాటిని చాలా బలమైనవిగా చేశాడు. యూదా, బెన్యామీను ప్రజల, నగరాలను రెహబాము తన అధీనంలో వుంచుకున్నాడు.

13 ఇశ్రాయేలులో వున్న యాజకులు, లేవీయులు అంతా రెహబాముతో ఒక అవగాహనకు వచ్చి, అతనితో కలిశారు. 14 లేవీయులు తమ పచ్చిక బీళ్లను, వారి స్వంత పొలాలను వదిలి యూదాకు, యెరూషలేముకు వచ్చారు. లేవీయులు ఇది ఎందుకు చేశారనగా యరొబాము, అతని కుమారులు తమను యెహోవా సేవలో, యాజకులుగా పని చేయటానికి తిరస్కరించారు.

15 ఉన్నత స్థలాలలో ఆరాధనలకై యరొబాము తన స్వంత యాజకులను ఎంపిక చేసుకొన్నాడు. ఆ గుట్టల మీద అతడు తాను చేసిన మేక, గిత్త దూడల విగ్రహాలను ప్రతిష్ఠించాడు. 16 లేవీయులు ఇశ్రాయేలును వదిలి పెట్టడంతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాలో విశ్వాసమున్న ఇశ్రాయేలు గోత్రాలవారంతా యెరూషలేముకు వచ్చారు. వారు తమ పూర్వీకుల దేవునికి బలులు అర్పించటానికి వచ్చారు. 17 వారంతా యూదా రాజ్యాన్ని బలమైనదిగా చేశారు. వారు సొలొమోను కుమారుడు రెహబాముకు మూడు సంవత్సరాలపాటు మద్దతు యిచ్చారు. ఆ విధంగా చేయటానికి కారణమేమనగా ఆ సమయంలో వారు దావీదు సొలొమోను నడిచిన రీతిగా నడుచుకున్నారు.

రెహబాము కుటుంబం

18 రెహబాము మహలతు అనే స్త్రీని వివాహం చేసికొన్నాడు. ఆమె తండ్రి పేరు యెరీమోతు. ఆమె తల్లి పేరు అబీహాయిలు. యెరీమోతు తండ్రి పేరు దావీదు. అబీహాయిలు తండ్రిపేరు ఏలీయాబు. ఏలీయాబు తండ్రిపేరు యెష్షయి. 19 రెహబాముకు మహలతు ద్వారా యూషు, షెమర్యా, జహము అనే కుమారులు పుట్టారు. 20 పిమ్మట రెహబాము మయకాను వివాహం చేసికొన్నాడు. మయకా అబ్షాలోము మనుమరాలు.[f] రెహబాముకు మయకావల్ల అబీయా, అత్తయి, జీజా, షెలోమీతు అనువారు పుట్టారు. 21 తన ఇతర భార్యల కన్న, దాసీల కన్న, రెహబాము మయకాను ఎక్కువగా ప్రేమించాడు. మయకా అబ్షాలోము మనుమరాలు. రెహబాముకు పద్ధెనిమిది మంది భార్యలు, అరవై మంది దాసీలు వున్నారు. రెహబాముకు ఇరవై ఎనిమిది మంది కుమారులు, ఇరవై మంది కుమార్తెలు వున్నారు.

22 అబీయాను అతని సోదరులపై నాయకునిగా రెహబాము నియమించాడు. అబీయాను రాజుగా చేసే వుద్దేశంతోనే రెహబాము ఈ పని చేశాడు. 23 రెహబాము చాలా తెలివిగా ప్రవర్తించాడు. తన కుమారులందరినీ యూదా, బెన్యామీను ప్రాంతాలలో వున్న బలమైన నగారాలన్నిటికీ పంపాడు. రెహబాము తన కుమారులకు ఆహారాది వస్తువులను పుష్కలంగా సరఫరా చేశాడు. తన కుమారులకు భార్యలను కూడా అతడు ఎంపిక చేశాడు.

ఈజిప్టు రాజు షీషకు యెరూషలేముపై దండెత్తుట

12 రెహబాము చాలా శక్తివంతుడైన రాజయ్యాడు. అతడు తన రాజ్యాన్ని కూడ చాలా బలపర్చాడు. ఆ తరువాత రెహబాము, యూదా వంశంవారు యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించటం మాని వేశారు.

రెహబాము రాజయ్యాక ఐదవ సంవత్సరంలో షీషకు యెరూషలేముపై దండెత్తాడు. షీషకు ఈజిప్టుకు రాజు. రెహబాము, యూదా ప్రజలు యెహోవాకు విశ్వాసపాత్రంగా లేకపోవుటచే ఇది జరిగింది. షీషకు వద్ద పన్నెండువేల రథాలు, అరవై వేల మంది గుర్రపు స్వారీ చేయగలవారు, మరియు ఎవ్వరూ లెక్క పెట్టలేనంత మంది సైనికులు వున్నారు. షీషకు యొక్క మహా సైన్యంలో లిబ్యా సైనికులు (లూబీయులు), సుక్కీయులు, ఇథియోఫియనులు (కూషీయులు) వున్నారు. షీషకు యూదాలోని బలమైన నగరాలను ఓడించాడు. పిమ్మట షీషకు తన సైన్యాన్ని యెరూషలేముకు నడిపించాడు.

తరువాత ప్రవక్తయగు షెమయా రెహబాము వద్దకు, యూదా నాయకుల వద్దకు వచ్చాడు. ఆ యూదా నాయకులంతా షీషకుకి భయపడి యెరూషలేములో సమావేశమయ్యారు. షెమయా రెహబాముతోను, యూదా నాయకుల తోను యీలా చెప్పాడు, “యెహోవా ఈ విధంగా తెలియజేస్తున్నాడు: ‘రెహబామూ, నీవు మరియు యూదా ప్రజలు నన్ను వదిలి పెట్టారు. నా ధర్మశాస్త్రాన్ని పాటించటానికి నిరాకరించారు. ఇప్పుడు మిమ్మల్ని నా సహాయం లేకుండా షీషకును ఎదుర్కోటానికి వదిలి పెడుతున్నాను.’”

అది విన్న యూదా నాయకులు, రాజైన రెహబామును విచారించి, తమను తాము తగ్గించుకొని విధేయులయ్యారు. “యెహోవా న్యాయమైనవాడు” అని అన్నారు.

రాజు, యూదా పెద్దలు విధేయులైనట్లు యెహోవా గమనించాడు. పిమ్మట షెమయాకు యెహోవా వర్తమానం ఒకటి వినవచ్చింది. యెహోవా షెమయాతో యీలా చెప్పాడు: “రాజు, నాయకులు తమను తాము తగ్గించుకున్నారు. కావున వారిని నేను నాశనం చేయను. పైగా వారికి వెంటనే రక్షణ కల్పిస్తాను. యెరూషలేము మీద నా కోపాగ్నిని కురిపించటానికి నేను షీషకును వినియోగించను. కాని యెరూషలేము ప్రజలు మాత్రం షీషకుయొక్క సేవకులౌతారు. నాకు సేవచేయటం ఇతర దేశాల రాజులను సేవించటంకంటె భిన్నమైనదని వారు తెలిసి కొనేటందుకే ఇది యీలా జరుగుతుంది.”

షీషకు యెరూషలేముపై దండెత్తి ఆలయాన్ని కొల్లగొట్టాడు. షీషకు ఈజిప్టు రాజు. అతడింకా రాజభవనంలో వున్న ఖజానాను కూడ కొల్లగొట్టాడు. షీషకు దొరికిన ప్రతి వస్తువును తీసుకొని, ధనరాశులను పట్టుకుపోయాడు. అతడింకా సొలొమోను చేయించిన బంగారు డాళ్లనుకూడా పట్టుకుపోయాడు. 10 రాజైన రెహబాము బంగారు డాళ్ల స్థానంలో కంచు డాళ్లను చేయించాడు. రాజభవన ప్రధాన ద్వారం వద్ద కాపలాదారుల అధిపతులకు రెహబాము కంచు డాళ్లను యిచ్చాడు. 11 రాజు ఆలయ ప్రవేశం చేసినప్పుడు ద్వారపాలకులు కంచు డాళ్లను వెలికితీసి వాడేవారు. పిమ్మట వారు మళ్ళీ ఆ కంచు డాళ్లను ఆయుధాగారంలో వుంచేవారు.

12 రెహబాము తనను తాను తగ్గించుకున్న తరువాత, యెహోవా అతని పట్ల తన కోపాన్ని ఉపసంహరించుకున్నాడు. అందువల్ల యెహోవా రెహబామును పూర్తిగా నాశనం చేయలేదు. యూదాలో ఇంకా కొంత మంచితనం మిగిలివుంది.

13 యెరూషలేములో రెహబాము చాలా శక్తివంతమైన రాజుగా రూపొందాడు. అతడు రాజయ్యేనాటికి నలబై ఒక్క సంవత్సరాలవాడు. రెహబాము రాజుగా యెరూషలేములో పదిహేడు సంవత్సరాలు వున్నాడు. ఇశ్రాయేలు తెగలన్నిటిలో యెహోవా తనపేరు ప్రతిష్ఠాపనకు యెరూషలేమునే ఎన్నుకున్నాడు. రెహబాము తల్లి పేరు నయమా. నయమా అమ్మోను దేశస్తురాలు. 14 దేవుడైన యెహోవాను అనుసరించటం మాని రెహబాము చెడుకార్యాలకు పాల్పడ్డాడు. ఎందుకంటే అతడు యెహోవాని అనుసరించాలని హృదయమందు తీర్మానించు కొనలేదు.

15 రెహబాము రాజైనప్పటి నుండి అతని పాలన అంతమయ్యేవరకు అతను చేసిన విషయాలన్నీ షెమయా రచనలలోను, ఇద్దో రచనలలోను పొందుపర్చబడ్డాయి. షెమయా ఒక ప్రవక్త. ఇద్దో ఒక దీర్ఘదర్శి వీరిద్దరూ కుటుంబ చరిత్రలు రాశారు. రెహబాము, యరొబాము రాజులిద్దరూ పాలించిన కాలంలో వారిద్దరి మధ్య యుద్ధాలు జరిగాయి, 16 రెహబాము చనిపోగా అతనిని దావీదు నగరంలో సమాధిచేశారు. పిమ్మట రెహబాము కుమారుడు అబీయా కొత్తగా రాజయ్యాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International