Beginning
22 “యెహోవా దేవుని ఆలయం మరియు దహనబలులకు బలిపీఠం ఇశ్రాయేలు ప్రజల ఉపయోగార్థం ఇక్కడ నిర్మింపబడతాయి” అని దావీదు అన్నాడు.
ఆలయ నిర్మాణానికి దావీదు ప్రణాళిక
2 ఇశ్రాయేలులో వుంటున్న అన్యజాతి వారందరినీ ఒకచోట చేరుమని దావీదు ఉత్తరువు ఇచ్చాడు. వారిలో నుండి రాళ్లు కొట్టే వారిని ఎంపిక చేశాడు. దేవాలయ నిర్మాణానికి రాళ్లు చెక్కి సిద్ధం చేయటం వారి పని. 3 దేవాలయ ద్వారపు తలుపులకు, బందులకు, మేకులకు కావలసిన ఇనుమును దావీదు సేకరించాడు. బరువు తూకం వేయలేనంత కంచును కూడ దావీదు సమకూర్చాడు. 4 దావీదు ఇంకా లెక్కలేనన్ని దేవదారు దూలాలను కూడా తెప్పించాడు. సీదోను, తూరు నగర ప్రజలు దావీదుకు చాలా దేవదారు కలప పంపారు.
5 దావీదు ఇలా అన్నాడు: “మనం యెహోవాకు ఒక గొప్ప ఆలయం కడదాము. నా కుమారుడు సొలొమోను చిన్నవాడు కావటంతో, అతను నేర్చుకోవాల్సిన విషయాలు ఇంకా నేర్చుకోలేదు. యెహోవా ఆలయం చాలా గొప్పదై వుండాలి. దాని అందచందాలలోను, ఔన్నత్యంలోను ఆ దేవాలయం సాటి రాజ్యాలన్నిటిలోను మేటిదై వుండాలి. అందువల్ల దేవాలయ నిర్మాణానికి అవసరమైన అనేక ఏర్పాట్లు చేస్తాను.” తాను చనిపోయే ముందు దేవాలయ నిర్మాణానికి దావీదు అనేక ఏర్పాట్లు చేశాడు.
6 పిమ్మట దావీదు తన కుమారుడైన సొలొమోనును పిలిచాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ఒక ఆలయాన్ని కట్టుమని దావీదు సొలొమోనుకు చెప్పాడు. 7 సొలొమోనుతో దావీదు ఇలా అన్నాడు: “నా కుమారుడా! నా దేవుడైన యెహోవా నామమున నేనొక ఆలయం కట్టించాలనుకున్నాను. 8 కాని యెహోవా నాతో, ‘దావీదూ, నీవు చాలా యుద్ధాలు చేసి అనేకమందిని చంపావు. కావున నా పేరుమీద నీవు ఆలయం కట్టించలేవు. 9 కాని నీకొక శాంతి పరుడైన కుమారుడున్నాడు. నీ కుమారునికి శాంతియుత వాతావరణాన్ని కల్పిస్తాను. తనచుట్టూ వున్న అతని శత్రువులు అతనిని ఏమీ బాధపెట్టరు. అతని పేరు సొలొమోను.[a] సొలొమోను రాజుగా వున్న కాలంలో ఇశ్రాయేలు శాంతి, సౌభాగ్యాలతో విలసిల్లేలా చేస్తాను. 10 నా పేరు మీద సొలొమోను ఒక ఆలయాన్ని నిర్మిస్తాడు. సొలొమోను నాకు కుమారినిలా వుంటాడు. నేనతనికి తండ్రిలా వుంటాను. నేను సొలొమోను రాజ్యాన్ని బలపరుస్తాను. పైగా అతని కుటుంబంలో నుండి ఎవ్వరో ఒక్కరు శాశ్వతంగా రాజవుతూనే వుంటారు!’”
11 దావీదు ఇంకా ఇలా అన్నాడు: “కుమారుడా ఇప్పుడు యెహోవా నీకు తోడై వుండుగాక! యెహోవా నీవు నిర్మిస్తావని చెప్పినట్లు, దేవాలయ నిర్మాణంలో నీవు విజయం సాధించెదవుగాక! 12 యెహోవా నిన్ను ఇశ్రాయేలుకు రాజుగా చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలను సమర్థవంతంగా పాలించే విధంగా యెహోవా నీకు తెలివితేటలు, అవగాహన యిచ్చు గాక! నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించు. 13 ఇశ్రాయేలు సంక్షేమం కొరకు దేవుడు మోషేకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని, నియమాలను నీవు పాటించే జాగ్రత్త తీసుకొంటే, నీవు విజయం సాధిస్తావు. నీవు శక్తిమంతుడవై, ధైర్యంగావుండు. నీవు భయపడవద్దు.
14 “సొలొమోనూ! యెహోవా ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు చేయటంలో నేను చాలా కష్టపడ్డాను. నేను మూడువేల ఏడువందల ఏభై టన్నుల బంగారాన్ని, ముఫై ఏడువేల ఐదువందల టన్నుల వెండిని, తూకం వేయటానికి సాధ్యం కానంత కంచును, ఇనుమును ఇచ్చాను. కలపను, రాయిని కూడ ఇచ్చాను. సొలొమోనూ, నేనిచ్చిన దానికి తోడు నీవింకా కొంత సామగ్రిని సమకూర్చవచ్చు. 15 నీ వద్ద చాలా మంది రాతిని చెక్కే శిల్పులు, వడ్రంగులు వున్నారు. ప్రతి పనిలోనూ నిపుణులైన వారు నీకున్నారు. 16 బంగారం, వెండి, కంచు, ఇనుము పనులలో నేర్పరులు, అనుభవం వున్న వారు నీవద్ద వున్నారు. ప్రవీణతగల పనివారు నీ వద్ద లెక్కకు మించి వున్నారు. ఇప్పుడు పని మొదలు పెట్టు. యెహోవా నీకు తోడై ఉండుగాక!”
17 తరువాత ఇశ్రాయేలు పెద్దలందరికీ తన కుమారుడు సొలొమోనుకు సహాయపడుమని దావీదు ఆజ్ఞ ఇచ్చాడు. 18 ఆ పెద్దలందరికీ దావీదు యిలా చెప్పాడు: “మీ దేవుడైన యెహోవా మీతో వున్నాడు. ఆయన మీకు శాంతి నెలకొన్న కాలాన్ని ప్రసాదించాడు. మన చుట్టూ వున్న దేశాలను ఓడించేలా యెహోవా నాకు సహాయం చేశాడు. యెహోవా, ఆయన ప్రజలు ఇప్పుడీ దేశంమీద ఆధిపత్యం వహించి వున్నారు. 19 యెహోవా సంకల్పం నెరవేరటానికి మీరంతా హృదయపూర్వకంగా ఆయనకు అంకితమవ్వండి. యెహోవా దేవునికి పవిత్ర ఆలయాన్ని నిర్మించండి. యెహోవా పేరున ఆలయ నిర్మాణం చేయండి. పిమ్మట ఒడంబడిక పెట్టెను, ఇతర పవిత్ర పరికరాలను ఆలయంలోకి తీసుకురండి.”
ఆలయ సేవకై లేవీయులకు ఏర్పాట్లు
23 దావీదు ముసలివాడయ్యాడు. అందువల్ల అతడు తన కుమారుడైన సొలొమోనును ఇశ్రాయేలుకు కొత్త రాజుగా చేసాడు. సొలొమోను దావీదు కుమారుడు. 2 ఇశ్రాయేలు పెద్దలందరినీ దావీదు పిలిపించాడు. అతడు యాజకులను, లేవీయులను కూడ పిలిచాడు. 3 లేవీయులలో ముఫైయేండ్ల వారిని, అంతకు పైబడిన వయస్సు వారిని దావీదు లెక్కించాడు. ఆ లేవీయులు మొత్తం ముప్పై ఎనిమిది వేలమంది వున్నారు. 4 దావీదు ఇలా చెప్పాడు: “ఇరవై నాలుగు వేలమంది లేవీయులు దేవాలయ నిర్మాణ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. ఆరువేల మంది రక్షక భటులుగాను, న్యాయాధిపతులుగాను వ్యవహరిస్తారు. 5 నాలుగు వేల మంది లేవీయులు ద్వారపాలకులుగా పనిచేస్తారు. మరి నాలుగు వేలమంది లేవీయులు ఆలయ గాయకులుగా వుంటారు. వారికొరకు నేను ప్రత్యేక వాద్యపరికరాలను సిద్ధం చేశాను. వారా వాద్య విశేషాలను యెహోవాను స్తుతించటానికి వినియోగిస్తారు.”
6 దావీదు లేవీయులను మూడు వర్గాలుగా విభజించాడు. ఆ మూడు వర్గాలకు లేవీ ముగ్గురు కుమారులు ఆధిపత్యం వహించారు. గెర్షోను, కహాతు, మెరారి అని ఆ ముగ్గురు కుమారుల పేర్లు.
గెర్షోను వంశం
7 లద్దాను, షిమీ అనేవారు గెర్షోను వంశంలోని వారు. 8 లద్దానుకు ముగ్గురు కుమారులు. అతని పెద్ద కుమారుని పేరు యెహీయేలు. అతని మిగిలిన కుమారుల పేర్లు జేతాము, యోవేలు. 9 షిమీ కుమారులు షెలోమీతు, హజీయేలు, హారాను అనువారు. ఈ ముగ్గురు కుమారులు లద్దాను వంశంలో పెద్దలు.
10 షిమీకి మరి నలుగురు కుమారులు. వారి పేర్లు యహతు, జీజా,[b] యూషు, బెరీయా. 11 యహతు పెద్ద కుమారుడు. జీజా రెండువవాడు. కాని యూషుకు, బెరీయాకు ఎక్కువ మంది పిల్లలు లేరు. కావున యూషు, బెరీయా లిరువురూ ఒకే కుటుంబంగా పరిగిణింపబడ్డారు.
కహాతు సంతతివారు
12 కహాతుకు నలుగురు కుమారులు. వారు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. 13 అమ్రాము కుమారుల పేర్లు అహరోను, మోషే. అహరోను చాలా ప్రత్యేకమైన వ్యక్తిగా చూడబడ్డాడు. అహరోను, అతని సంతతి వారు ఎల్లకాలమూ ప్రత్యేకమైన వ్యక్తులుగానే ఎంపిక చేయబడ్డారు. వారు శాశ్వత ప్రాతిపదికపై యాజకులుగా వుండటానికి ప్రత్యేకింపబడ్డారు. అందువల్లనే వారు శాశ్వతంగా వేరుచేయబడ్డారు. అహరోను, అతని సంతతి వారు యెహోవా ముందు ధూపం వేయటానికి నియమితులయ్యారు. వారు యాజకులుగా యెహోవా సేవకు నియమితులయ్యారు. వారు యాజకులుగా యెహోవా సేవకు నియమితులయ్యారు. ఎల్లకాలమూ యెహోవా పేరుమీద వారు ప్రజలను ఆశీర్వదించటానికి ఎంపిక చేయబడ్డారు.
14 మోషే దైవజనుడు. మోషే కుమారులు కూడ లేవి వంశానికి చెందినవారుగానే పరిగణింపబడ్డారు. 15 గెర్షోము, ఎలీయెజెరు అనువారు మోషే కుమారులు. 16 గెర్షోము పెద్ద కుమారుని పేరు షూబాయేలు.[c] 17 ఎలీయెజెరు మొదటి కుమారుని పేరు రెహబ్యా. ఎలీయెజెరుకు కుమారులు మరెవ్వరూ లేరు. కాని రెహబ్యాకు మాత్రం చాలామంది కుమారులు కలిగారు.
18 ఇస్హారు పెద్ద కుమారుని పేరు షెలోమీతు.
19 హెబ్రోను పెద్ద కుమారుని పేరు యెరీయా. హెబ్రోను రెండవ కుమారుడు అమర్యా. మూడవవాడు యహజీయేలు. నాల్గవవాని పేరు యెక్మెయాము.
20 ఉజ్జీయేలు పెద్ద కుమారుని పేరు మీకా. రెండవవాడు యెషీయా.
మెరారి సంతతివారు
21 మెరారి కుమారులు మహలి, మూషి అనేవారు. మహలి కుమారుల పేర్లు ఎలియాజరు, కీషు. 22 ఎలియాజరు కుమారులు లేకుండగనే మరణించాడు. అతనికి కేవలం కుమార్తెలు మాత్రం వున్నారు. ఎలియాజరు కుమార్తెలు తమ బంధువులనే వివాహమాడారు. కీషు కుమారులు వారి బంధువులు. 23 మూషి కుమారులు మహలి, ఏదెరు, యెరీమోతు అనే ముగ్గురు.
లేవీయుల పని
24 లేవి సంతతివారు వారి వారి వంశకర్తలననుసరించి లెక్కింపబడ్డారు. వారు తమ తమ కుటుంబాలకు పెద్దలు. ప్రతి ఒక్కని పేరు పట్టికలో వ్రాయబడింది. అలా ఎంచబడిన వారిలో ఇరవై ఏండ్లవారు, అంతకు పైబడిన వయస్సువారు వున్నారు. వారు దేవాలయంలో సేవ చేశారు.
25 దావీదు ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడగు యెహోవా తన ప్రజలకు శాంతి సమకూర్చిపెట్టాడు. యెహోవా ఇశ్రాయేలులో శాశ్వతంగా వుండటానికి వచ్చాడు. 26 కావున లేవీయులు ఇక మీదట పవిత్ర గుడారాన్ని గాని, దేవుని సేవలో వినియోగించే ఇతర పరికరాలను గాని మోసే పనిలేదు.”
27 దావీదు ఇశ్రాయేలు వారికి లేవి వంశంవారిని లెక్కించుమని చివరిసారిగా ఆజ్ఞ ఇచ్చాడు. వారు లేవీయులలో ఇరవై ఏండ్లు, అంతకు పైబడిన వారిని లెక్కించారు.
28 అహరోను సంతతివారికి లేవీయులు ఆలయంలో యెహోవా సేవలో తోడ్పడేవారు. వారు ఆలయ ఆవరణ, పక్క గదుల పరిశుభ్రత విషయంలో కూడ శ్రద్ధ తీసుకొనేవారు. అన్ని పవిత్ర వస్తువులను అపవిత్రపడకుండ చూసేవారు. ఆ విధంగా దేవాలయంలో సేవ చేయటం వారి పని. 29 ప్రత్యేకంగా తయారుచేసిన రొట్టెను అర్పణగా ఆలయంలో బల్ల మీద వుంచటం వారి బాధ్యత. పిండి తయారు చేయటం, ధాన్యార్పణను చెల్లించటం, పులియనిరొట్టె తయారుచేయటం కూడ వారి బాధ్యత. రొట్టెలుచేసే పెనాలు, రకరకాల కలగలుపు అర్పణల విషయంలో వారు శ్రద్ధ తీసుకొనేవారు. ఆయా ద్రవ్యాల కొలతల విషయంలో కూడ వారు జాగ్రత్త తీసుకొనే వారు. 30 లేవీయులు ప్రతి ఉదయం నిలబడి యెహోవాకి కృతజ్ఞతాస్తుతులు అర్పించి, స్తుతి పాటలు పాడేవారు. వారలా ప్రతి సాయత్రం కూడ చేసేవారు. 31 ప్రత్యేక విశ్రాంతి దినాలలోను, అమావాస్య విందుల సమయంలోను మరియు ప్రత్యేక సెలవు దినాలలోను లేవీయులు యెహోవాకి దహన బలులు సమర్పించే వారు. వారు నిత్యం యెహోవా సన్నిధిలో సేవ చేసేవారు. ప్రతిసారీ ఎంతమంది లేవీయులు సేవ చేయాలి అనే విషయంలో వారికి ప్రత్యేక నియమాలుండేవి. 32 కావున తాము ఏఏ పనులు చేయాలో అవన్నీ లేవీయులు నిర్వహించేవారు. వారు పవిత్ర గుడారం, పవిత్ర స్థలాల విషయంలో కూడ తగిన జాగ్రత్తలు తీసుకొనేవారు. ఆ విధంగా వారి బంధువులగు అహరోను వంశీయులకు వారు సహాయపడ్డారు. అహరోను సంతతివారెవరనగా యాజకులు, ప్రధాన యాజకులు. ఆలయంలో యెహోవా సేవలో ఈ యాజకులకు లేవీయులు సహాయపడ్డారు.
యాజకులకు సేవను కేటాయించడం
24 అహరోను వంశంవారు ఎవరనగా: నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. 2 కాని నాదాబు, అబీహులిద్దరూ తమ తండ్రి కంటె ముందుగానే చనిపోయారు. పైగా నాదాబు, అబీహులకు కుమారులు కలుగలేదు. కావున ఎలియాజరు మరియు ఈతామారులిద్దరూ యాజకులుగా సేవచేశారు. 3 ఎలియాజరు, ఈతామారు వంశం వారిని దావీదు రెండు గుంపులుగా విభజించాడు. వారి వారి కార్యాలను సక్రమంగా నిర్వహించటానికి వీలుగా దావీదు వారిని రెండు గుంపులుగా ఏర్పాటు చేశాడు. సాదోకు, అహీమెలెకుల సహాయంతో దావీదు ఈ పనిచేశాడు. సాదోకు ఎలియాజరు సంతతివాడు. అహీమెలెకు ఈతామారు సంతతివాడు. 4 ఈతామారు వంశంలో కంటె ఎలియాజరు సంతతివారిలో ఎక్కువమంది నాయకులున్నారు. ఎలియాజరు సంతతి వారిలో పదహారు మంది నాయకులుండగా, ఈతామారు సంతతివారిలో ఎనిమిది మంది నాయకులు మాత్రమే వున్నారు. 5 ప్రతి వంశంలో నుండి మనుష్యులు ఎన్నుకోబడ్డారు. వారు చీట్లు వేసి ఎంపిక నిర్వహించారు. పవిత్ర స్థలాన్ని అధీనంలో వుంచుకొనేందుకు కొంత మందిని ఎన్నుకొన్నారు. మరికొంత మంది యాజకులుగా సేవచేయటానికి ఎంపిక చేయబడ్డారు. వీరంతా ఎలియాజరు, ఈతామారు వంశాలలోని వారు.
6 షెమయా కార్యదర్శి. ఇతడు నెతనేలు కుమారుడు. షెమయా లేవి సంతతివాడు. షెమయా ఆయా సంతతుల వారి పేర్లన్నీ రాశాడు. రాజైన దావీదు ముందు, వారి పెద్దల ముందు అతడు పేర్లు వ్రాశాడు. యాజకుడైన సాదోకు, అహీమెలెకు, యాజకుల కుటుంబాలలో పెద్దలు, ఇతర లేవీయుల పేర్లు వున్నాయి. అబ్యాతారు కుమారుడు అహీమెలెకు. చీట్లు వేసిన ప్రతిసారీ వారొక మనుష్యుని ఎంపిక చేశారు. ఆ మనుష్యుని పేరు షెమయా వ్రాసేవాడు. కావున ఎలియాజరు, ఈతామారు వంశాలలోని మనుష్యుల మధ్య పని విభజన జరిగింది.
7 మొదట ఎంపిక చేయబడినది యెహోయారీబు వంశంవారు.
రెండవ చీటీలో యెదాయా వంశం వారు ఎంపిక చేయబడ్డారు.
8 మూడవ వంశం హారీము వారు.
నాల్గవ వంశం శెయొరీము వారు.
9 ఐదవ వంశం మల్కీయాకు చెందినది.
ఆరవది మీయామిను వంశానికి చెందినది.
10 ఏడవ చీటీ హక్కోజు వంశానికి పడింది.
ఎనిమిదవ చీటీలో అబీయా వంశం ఎంపిక చేయబడింది.
11 తొమ్మిదవ చీటీలో యేషూవ వంశం ఎంపిక అయ్యింది.
పదవ వంశం షెకన్యాది.
12 పదకొండవ చీటీ ఎల్యాషీబు వంశానికి పడింది.
పన్నెండవది యాకీము వంశానికి వచ్చింది.
13 పదమూడవ చీటీలో హుప్పా వంశం ఎంపిక చేయబడింది.
పదునాల్గవ చీటీ యెషెబాబు వంశానికి వచ్చింది.
14 పదిహేనవ చీటి బిల్గా వంశానికి పడింది
పదహారవ చీటి ఇమ్మేరు వంశం వారికి వచ్చింది.
15 పదిహేడవ చీటి హెజీరు వంశానికి పడింది.
పద్దెనిమిదవది హప్పిస్సేను వంశానికి వచ్చింది.
16 పందొమ్మిదవ చీటీలో పెతహయా వంశం వారు ఎన్నుకోబడ్డారు.
ఇరవయ్యో చీటి యెహెజ్కేలు వంశానికి వచ్చింది.
17 ఇరవై ఒకటవ చీటి, యాకీను వంశానికి వచ్చింది.
ఇరవై రెండవది గామూలు వర్గానికి వచ్చింది.
18 ఇరవై మూడవ చీటి దెలాయ్యా వంశానికి పడింది.
ఇరవై నాల్గవది మయజ్యా వంశానికి వచ్చింది.
19 ఈ వంశాల వారంతా ఆలయంలో సేవ చేయటానికి ఎంపిక చేయబడ్డారు. ఆలయపు సేవలో అహరోను ఆదేశ సూత్రాలను వారు పాటించారు. ఆ నియమాలను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అహరోనుకు ఇచ్చాడు.
ఇతర లేవీయులు
20 మిగిలిన లేవి సంతతివారి పేర్లు ఇలా వున్నాయి:
అమ్రాము సంతానం నుండి షూబాయేలు.
షూబాయేలు సంతానం నుండి యెహెద్యాహు.
21 రెహబ్యా వంశం నుండి పెద్దవాడైన ఇష్షీయా.
22 ఇస్హారీ వంశం నుండి షెలోమోతు.
షెలోమోతు వంశం నుండి యహతు.
23 హెబ్రోను పెద్ద కుమారుడు యెరీయా.
హెబ్రోను రెండవ కుమారుడు అమర్యా.
మూడవ వాడు యహజీయేలు.
నాల్గవ కుమారుడు యెక్మెయాము.
24 ఉజ్జీయేలు కుమారుడు మీకా.
మీకా కుమారుడు షామీరు.
25 మీకా సోదరుడు ఇష్షీ, ఇష్షీ కుమారుడు జెకర్యా.
26 మెరారీ[d] సంతతి వారు మహలి, మూషి మరియు అతని కుమారుడైన యహజీయాహు.
27 మెరారి కుమారుడు యహజీయాహునకు షోహాము, జక్కూరు అను కుమారులు గలరు.
28 మహలి కుమారుడు ఎలియాజరు. కాని ఎలియాజరుకు కుమారులు లేరు.
29 కీషు కుమారుడు యెరహ్మెయేలు.
30 మూషి కుమారులు మహలి, ఏదెరు మరియు యెరీమోతు.
వారంతా లేవీయుల కుటుంబాలలో పెద్దలు. వారి పేర్లు వారి కుటుంబాల ప్రకారం వ్రాయబడ్డాయి. 31 వారంతా ప్రత్యేక కార్యాలు నిర్వహించటానికి ఎంపిక చేయబడ్డారు. యాజకులైన వారి బంధువుల వలెనే వారుకూడ చీట్లు వేశారు. వారు రాజైన దావీదు, సాదోకు, అహీమెలెకు, యాజకుల, లేవీయుల పెద్దల ముందు చీట్లు వేశారు. వారి వారి పనులను కేటాయించేటప్పుడు వారి పెద్ద కుటుంబాలకు, చిన్న కుటుంబాలకు ఒకే రీతి చీట్లు వేయబడ్డాయి.
© 1997 Bible League International