Beginning
9 ఇశ్రాయేలు ప్రజల పేర్లన్నీ వారి వారి వంశ చరిత్రల్లో పొందుపర్చబడ్డాయి. ఆ వంశ చరిత్రలన్నీ ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో చేర్చబడ్డాయి.
యెరూషలేము ప్రజలు
యూదా ప్రజలు బందీలుగా పట్టుబడి బలవంతంగా బబులోనుకు తీసుకొని పోబడ్డారు. దేవునికి వారు విశ్వాసపాత్రులు కానందువల్ల వారికి అలా జరిగింది. 2 మొట్టమొదటి సారిగా తమ స్థలాలకు, పట్టణాలకు తిరిగి వచ్చిన వారిలో కొందరు ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు, ఆలయ సేవకులు ఉన్నారు.
3 యెరూషలేములో నివసించిన యూదా, బెన్యామీను, ఎఫ్రాయిము, మనష్షే వంశాల ప్రజలు ఎవరనగా:
4 అమీహూదు కుమారుడు ఊతై. అమీహూదు తండ్రి పేరు ఒమ్రీ. ఒమ్రీ తండ్రి పేరు ఇమ్రీ. ఇమ్రీ తండ్రి బానీ. పెరెసు సంతతి వాడు బానీ. యూదా కుమారుడు పెరెసు.
5 యెరూషలేములో నివసించిన షిలోనీయులెవరనగా: షిలోనీయులలో మొదటివాడైన ఆశాయా మరియు అతని కుమారులు.
6 యెరూషలేములో నివసించిన జెరహు వంశం వారిలో యెవుయేలు, అతని బంధువులు వున్నారు. వారంతా మొత్తం ఆరువందల తొంబదిమంది వున్నారు.
7 మెషుల్లాము కుమారుడు సల్లు; మెషుల్లాము తండ్రి హోదవ్యా; హోదవ్యా తండ్రి హసెనూయా అనేవారు యెరూషలేములో నివసించిన బెన్యామీను సంతతివారు. 8 యెహోరాము కుమారుడు ఇబ్నెయా. ఉజ్జీ కుమారుడు ఏలా. మిక్రి కుమారుడు ఉజ్జీ. షెఫట్యా కుమారుడు మెషుల్లాము. రగూవేలు కుమారుడు షెఫట్యా. ఇబ్నీయా కుమారుడు రగూవేలు. 9 యెరూషలేములో తొమ్మిది వందల ఏబదిఆరు మంది బెన్యామీనీయులు ఉన్నట్లు వారి వంశ చరిత్ర తెలుపుతుంది. వీరంతా ఆయా కుటుంబ పెద్దలు.
10 యెరూషలేములో నివసించిన యాజకులు ఎవరనగా: యెదాయా, యెహోయారీబు, యాకీను, 11 మరియు హిల్కీయా కుమారుడైన అజర్యా. మెషుల్లాము కుమారుడు హిల్కీయా. సాదోకు కుమారుడు మెషుల్లాము. మెరాయోతు కుమారుడు సాదోకు. అహీటూబు కుమారుడు మెరాయోతు. ఆలయ నిర్వహణలో అహీటూబు ముఖ్యమైన అధికారి. 12 యెరోహాము కుమారుడు అదాయా అనువాడొకడున్నాడు. యెరోహాము తండ్రి పేరు పసూరు. పసూరు తండ్రి పేరు మల్కీయా. అదీయేలు కుమారుడు మశై అను వాడొకడున్నాడు. అదీయేలు తండ్రి పేరు యహజేరా. యహజేరా తండ్రి పేరు మెషుల్లాము. మెషుల్లాము తండ్రి పేరు మెషిల్లేమీతు. మెషిల్లేమీతు తండ్రి పేరు ఇమ్మెరు.
13 యాజకులంతా మొత్తం పదిహేడు వందల అరవై మంది. వారంతా వారి వారి కుటుంబ పెద్దలు. ఆలయంలో పూజాది కార్యక్రమ నిర్వహణ బాధ్యత వారిదే.
14 యెరూషలేములో నివసించిన లేవీ గోత్రపు వారెవరనగా: హష్షూబు కుమారుడు షెమయా. హష్షూబు తండ్రి పేరు అజ్రీకాము. అజ్రీకాము తండ్రి పేరు హషబ్యా. హషబ్యా మెరారీ సంతతి వాడు. 15 బకబక్కరు, హెరెషు, గాలాలు మరియు మత్తన్యా కూడా యెరూషలేములో నివసించారు. మత్తన్యా తండ్రి పేరు మీకా. మీకా తండ్రి పేరు జిఖ్రీ. జిఖ్రీ తండ్రి ఆసాపు. 16 ఓబద్యా తండ్రి పేరు షెమయా. షెమయా తండ్రి గాలాలు. గాలాలు తండ్రి యెదూతూను, మరియు ఆసా కుమారుడు బెరక్యా. ఆసా తండ్రి పేరు ఎల్కానా. నెటోపాతీయులు నివసించిన గ్రామాలలోనే ఎల్కానా కూడ నివసించాడు.
17 యెరూషలేములో నివసించిన ద్వారపాలకులు ఎవరనగా: షల్లూము, అక్కూబు, టల్మోను, అహీమాను మరియు వారి బంధువులు. షల్లూము వారికి నాయకుడు. 18 తూర్పు దిశలో రాజు ప్రవేశించే దేవాలయ ద్వారం వద్ద వీరు నిలబడేవారు. వారు లేవి సంతతికి చెందిన ద్వారపాలకులు. 19 షల్లూము తండ్రి పేరు కోరే. కోరే తండ్రి ఎబ్యాసాపు. ఎబ్యాసాపు తండ్రి కోరహు. షల్లూము, అతని సోదరులు ద్వారపాలకులే. వారు కోరహు వంశం వారు. పవిత్ర గుడారపు ద్వారాన్ని కాపలా కాయటం వారిపని. వారి పూర్వీకులు[a] చేసిన విధంగానే వీరుకూడ ఆ పని నిర్వర్తించారు. వారి పూర్వీకులు పవిత్ర గుడారపు ద్వారాన్ని కాపలా కాస్తూ వుండేవారు. 20 గతంలో ద్వారపాలకుల అధిపతిగా ఫీనెహాసు వ్యవహరించాడు. ఫీనెహాసు తండ్రి పేరు ఎలియాజరు. ఫీనెహాసుకు యెహోవా కృప ఉంది. 21 పవిత్ర గుడారపు ద్వారానికి జెకర్యా కూడ కావలి ఉన్నాడు.
22 పవిత్ర గుడారం ద్వారపాలకులుగా మొత్తం రెండు వందల పన్నెండు మంది ఎంపిక చేయబడ్డారు. వారి గ్రామాలలో వారి కుటుంబ చరిత్రలలో వారి పేర్లన్నీ వ్రాయబడినాయి. దావీదు, ప్రవక్తయగు సమూయేలు వారిని ఎంపికచేశారు. ఎందువల్లననగా వారు మిక్కిలి నమ్మకస్తులు. 23 యెహోవా నివాసమైన పవిత్ర గుడారపు ద్వారాలను కాపలా కాసే బాధ్యత ద్వార పాలకులది వారి సంతతి వారిదైయున్నది. 24 తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ద్వారాలు నాలుగు పక్కలా ఉన్నాయి. 25 పరిసర గ్రామాలలో నివసించే ఈ ద్వారా పాలకుల బంధువులు అప్పుడప్పుడు వచ్చి వారికి సహాయపడేవారు. వచ్చినప్పుడల్లా వారు ద్వారపాలకులకు ఏడేసి రోజులు సహాయంగా ఉండేవారు.
26 ద్వారపాలకులందరి మీద నలుగురు ద్వార పాలకులు నాయకత్వం వహించేవారు. వారు లేవీయులు. దేవుని నివాసంలో అన్ని గదుల అజమాయిషీ, ధనాగారాల పరిరక్షణ గావించేవారు. 27 వారు రాత్రంతా దేవాలయాన్ని కాపలా కాసేవారు. పైగా ప్రతిరోజూ ఉదయం ఆలయం ద్వారం తెరచే పని కూడ వారిదే.
28 దేవాలయ ఆరాధనలో వాడే పనిముట్ల విషయమై శ్రద్ధ తీసుకొనే ద్వారపాలకులు కొందరున్నారు. ఆ వస్తుసామగ్రిని లోనికి తెచ్చినపుడు వారు లెక్కపెట్టేవారు. మళ్లీ వాటిని బయటకు తీసుకొని వెళ్లేటప్పుడు కూడ లెక్క పెట్టేవారు. 29 మరికొందరు ద్వారపాలకులు గర్భగుడిలో సామాన్లు, ఉపకరణాల విషయంలో శ్రద్ధ తీసుకోవటం కోసం ఎంపికచేయబడ్డారు. పిండి, ద్రాక్షారసం, నూనె, ధూపద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాల సరఫరా విషయంలో కూడ వారు తగిన శ్రద్ధ తీసుకొనేవారు. 30 కాని సుగంధ ద్రవ్యాలను కలిపే పని మాత్రం యాజకులది.
31 నైవేద్యంగా వినియోగించే రొట్టె చేయటానికి మత్తిత్యా అనే లేవీయుడు నియమించబడ్డాడు. షల్లూము పెద్ద కుమారుడు మత్తిత్యా. షల్లూము అనే వాడు కోరహు సంతతివాడు. 32 విశ్రాంతి దినాన దైవ సన్నిధికి సమర్పించే నైవేద్యపు రొట్టె తయారు చేయటానికి కోరహు సంతతి ద్వార పాలకులలో కొందరు నియమించబడ్డారు.
33 లేవీయులలో దేవాలయ గాయకులుగా వున్న వారు, వారి కుటుంబ పెద్దలు దేవాలయపు గదులలో నివసించేవారు. వారు రాత్రింబవళ్లు దేవాలయ పనిలో నిమగ్నమై వుండుటచేత మరొక పని చేసేవారు కాదు.
34 ఈ లేవీయులంతా వారి వారి కుటుంబ పెద్దలు. వారి వంశ చరిత్రల్లో పొందుపర్చబడిన విధంగా వారంతా పెద్దలు. వారు యెరూషలేములో నివసించారు.
సౌలు రాజు కుటుంబ చరిత్ర
35 గిబియోను తండ్రి పేరు యెహీయేలు. యెహీయేలు గిబియోను పట్టణంలో నివసించాడు. యెహీయేలు భార్య పేరు మయకా. 36 యెహీయేలు పెద్ద కుమారుడు అబ్దోను. అతని మిగిలిన కుమారులు సూరు, కీషు, బయలు, నేరు, నాదాబు, 37 గెదోరు, అహ్యో, జెకర్యా మరియు మిక్లోతు. 38 మిక్లోతు కుమారుడు షిమ్యాను. యెహీయేలు కుటుంబం వారు యెరూషలేములో తమ బంధువుల వద్దనే నివసించారు.
39 నేరు కుమారుని పేరు కీషు. కీషు కుమారుని పేరు సౌలు. సౌలు కుమారులు యోనాతాను, మల్కీషూవ, అబీనాదాబు, ఎష్బయలు.
40 యోనాతాను కుమారుని పేరు మెరీబ్బయలు. మెరీబ్బయలు కుమారుడు మీకా.
41 మీకా కుమారులు పీతోను, మెలెకు, తరేయ మరియు ఆహాజు. 42 ఆహాజు యెహోయద్దాకు తండ్రి. యెహోయద్దా కుమారుని పేరు యరా. యరా కుమారుల పేర్లు ఆలెమెతు, అజ్మావెతు మరియు జిమ్రీ. జిమ్రీ కుమారుడు మోజా, 43 మోజా కుమారుడు బిన్యా. బిన్యా కుమారుడు రెఫాయా. రెఫాయా కుమారుడు ఎలాశా. ఎలాశా కుమారుడు ఆజేలు.
44 ఆజేలుకు ఆరుగురు కుమారులు. వారు అజ్రీకాము, బోకెరు, ఇష్మాయేలు, షెయర్యా, ఓబద్యా మరియు హానాను. వారంతా ఆజేలు కుమారులు.
సౌలు రాజు మరణం
10 ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేశారు. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల నుండి పారిపోయారు. అనేకమంది ఇశ్రాయేలు ప్రజలు గిల్బోవ పర్వతం మీద చంపబడ్డారు. 2 ఫిలిష్తీయులు సౌలును, అతని కుమారులను తరుముకుంటూ పోయి, వారిని పట్టుకుని చంపివేశారు. సౌలు కుమారులు యోనాతాను, అబీనాదాబు, మల్కీషూవలను ఫిలిష్తీయులు చంపివేశారు. 3 సౌలు చుట్టూ యుద్ధం ముమ్మరంగా సాగింది. విలుకాండ్రు సౌలుపై బాణాలు వదిలి గాయపర్చారు.
4 అప్పుడు తన ఆయుధాలు మోసే వానితో[b] సౌలు ఇలా చెప్పాడు: “నీ కత్తి దూసి నన్ను చంపివేయి. నీవలా చేస్తే ఆ పరదేశీయులు[c] వచ్చి నన్ను హింసించి ఎగతాళి చేయరు.”
కాని ఆయుధాలు మోసే సౌలు సేవకుడు భయపడ్డాడు. సౌలును చంపటానికి నిరాకరించాడు. అప్పుడు సౌలు తన కత్తినే ఉపయోగించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన కత్తి మొనపై అతను పడి తనను తాను చంపుకున్నాడు. 5 సౌలు చనిపోవటం ఆయుధాలు మోసేవాడు చూసాడు. తర్వాత అతను కూడా తన కత్తి మొనపై పడి తనను తాను చంపుకున్నాడు. 6 ఆ విధంగా సౌలు, అతని ముగ్గురు కుమారులు మరణించారు. పైగా సౌలు కుటుంబం వారంతా కలిసి చనిపోయారు.
7 లోయలో నివసిస్తున్న ఇశ్రాయేలు ప్రజలంతా తమ సైన్యం పారిపోవటం చూసారు. సౌలు, అతని కుమారులు చనిపోవటం ప్రజలు చూసారు. దానితో వారు కూడ భయపడి తమ పట్టణాలను వదలి పారిపోయారు. తరువాత ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులు వదిలిపోయిన పట్టణాలకు వచ్చి, అక్కడ నివసించసాగారు.
8 శవాలనుండి విలువైన వస్తువులను సేకరించటానికి ఫిలిష్తీయులు మరునాడు వచ్చారు. వారు గిల్బోవ పర్వతం మీద సౌలు శవాన్ని, అతని ముగ్గురు కుమారుల శవాలను చూసారు. 9 ఫిలిష్తీయులు సౌలు శరీరంమీద విలువైన వస్తువులను తీసుకొన్నారు. వారు సౌలు తలను, అతని ఆయుధాలను తీసుకొన్నారు. పిమ్మట వారు తమ దేశం నలుమూలలా ఉన్న బూటకపు దేవుళ్ల గుళ్లకు, ప్రజలకు ఈ వార్తను అందజేయటానికి దూతలను పంపారు. 10 సౌలు ఆయుధాలను ఫిలిష్తీయులు తమ బూటకపు దేవుళ్ల గుళ్లల్లో దాచారు. సౌలు తలను వారు దాగోను[d] గుడిలో వేలాడదీసారు.
11 యాబేష్గిలాదు పట్టణంలో నివసించే వారంతా ఫిలిష్తీయులు సౌలుకు చేసినదంతా విన్నారు. 12 యాబేష్గిలాదులో వున్న యోధులంతా వెళ్లి సౌలు, అతని కుమారుల శవాలను యాబేష్గిలాదుకు తిరిగి తెచ్చారు. ఆ యోధులు సౌలు, అతని కుమారుల ఎముకలను యాబేషులో ఒక పెద్ద చెట్టు క్రింద పాతిపెట్టారు. తర్వాత వారు ఏడు రోజులు ఉపవాసమున్నారు.
13 సౌలు మరణానికి ముఖ్య కారణం అతను యెహోవాపట్ల విశ్వాసంగా లేకపోవటం. సౌలు యెహోవా మాటను లెక్కపెట్టలేదు. 14 యెహోవాకు ప్రార్థన చేయకుండా తన సంశయాలను నివారించుకొనటానికి, కర్ణ పిశాచిగల స్త్రీని ఆశ్రయించాడు. అందువల్ల యెహోవా సౌలును చంపి, రాజ్యాన్ని దావీదుకు అప్పగించాడు. దావీదు తండ్రి పేరు యెష్షయి.
ఇశ్రాయేలుకు దావీదు రాజవటం
11 ఇశ్రాయేలు ప్రజానీకం హెబ్రోను పట్టణంలో దావీదు వద్దకు వెళ్లారు. వారు దావీదుతో ఇలా అన్నారు: “మేము నీ రక్త మాంసాలను పంచుకు పుట్టిన వాళ్లం (బంధువులం). 2 గతంలో మమ్మల్ని నీవు యుద్ధంలో నడిపించావు. సౌలు రాజుగా వున్నప్పటికీ మమ్మల్ని నడిపిన వాడవు నీవే! యెహోవా నీతో, ‘దావీదూ, ఇశ్రాయేలీయులైన నా ప్రజల కాపరివి నీవే. నా ప్రజలకు నీవు నాయకుడివవుతావు’ అని అన్నాడు.”
3 ఇశ్రాయేలు పెద్దలంతా హెబ్రోను పట్టణంలో దావీదు రాజువద్దకు వచ్చారు. యెహోవా సన్నిధిలో ఆ పెద్దలతో దావీదు ఒక ఒడంబడిక చేసుకొన్నాడు. పెద్దలు దావీదు తలమీద నూనె పోసి అభిషిక్తుని చేశారు. ఆ పని దావీదు ఇశ్రాయేలు రాజు అయినట్లు తెలుపుతుంది. ఇది జరుగుతుందని యెహోవా మాటయిచ్చాడు. ఈ వాగ్దానం యెహోవా సమూయేలు ద్వారా చేశాడు.
దావీదు యెరూషలేమును జయించటం
4 దావీదు, ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి యెరూషలేముకు వెళ్లారు. ఆ కాలంలో యెరూషలేము “యెబూసు” అని పిలువబడేది. ఆ నగరంలో నివసించే ప్రజలంతా యెబూసీయులనబడేవారు. ఆ నగరవాసులు 5 దావీదుతో, “నీవు మా నగర ప్రవేశం చేయకూడదు” అని అన్నారు. అయినప్పటికి దావీదు ఆ ప్రజలను ఓడించాడు. సీయోను కొండ[e] మీది కోటను దావీదు వశం చేసుకొన్నాడు. ఈ ప్రదేశమే దావీదు నగరమని పిలువబడింది.
6 “మీలో ఎవరు సైన్యాన్ని యెబూసీయుల మీదికి విజయవంతంగా నడిపిస్తారో అతడు నా సైన్యానికంతటికి ముఖ్య అధిపతి అవుతాడు” అని దావీదు ప్రకటించాడు. అది విని యోవాబు దండయాత్రకు నాయకత్వం వహించి నిర్వహించాడు. యోవాబు తండ్రిపేరు సెరూయా. యోవాబు సైన్యాధిపతయ్యాడు.
7 దావీదు తన నివాసం కోటలో ఏర్పరచుకొన్నాడు. అందువల్ల దానికి దావీదు నగరం అని పేరు వచ్చింది. 8 కోట చుట్టూ దావీదు నగరాన్ని నిర్మించాడు. మిల్లో[f] నుండి బయటి ప్రాకారం వరకు అతడు నగరాన్ని నిర్మించాడు. యోవాబు ఆ నగరంలో ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేయించాడు. 9 రోజురోజుకు దావీదు గొప్పతనం పెరుగుతూ వచ్చింది. సైన్యాలకు అధిపతియైన యెహోవా దావీదుకు తోడైయున్నాడు.
దావీదు యొక్క ముగ్గురు వీర నాయకులు
10 దావీదు సైన్యంలో మహావీరులున్నారు. దావీదులాగానే వీరుకూడా శక్తిమంతులయ్యారు. ఇశ్రాయేలు ప్రజలంతా దావీదు రాజ్యానికి మంచి మద్దతు ఇచ్చారు. ఈ మహావీరులూ, ఇశ్రాయేలు ప్రజానీకం కలసి దావీదును రాజుగా చేశారు. దేవుడు ఇది జరుగుతుందని వాగ్దానం చేశాడు.
11 దావీదు సైన్యంలో మహాయోధులు ఎవరనగా:
హక్మనీయులకు చెందిన యాషాబాము ఒకడు. యాషాబాము అధికారులకు పై అధికారి.[g] అతడు తన ఈటెనుపయోగించి మూడు వందల మందిని ఎదిరించాడు. ఆ మూడువందల మందిని ఒక్క వేటుతో చంపివేశాడు.
12 దావీదు యోధులలో ఎలియాజరు మరొకడు. ఎలియాజరు తండ్రి పేరు దోదో. దోదో అహోహీయుల వంశంవాడు. ముగ్గురు మహా యోధుల్లో ఎలియాజరు ఒకడు. 13 పస్దమ్మీములో ఎలియాజరు దావీదుతో వున్నాడు. ఫిలిష్తీయులు ఆ ప్రదేశానికి యుద్ధానికి సిద్ధమై వచ్చారు. ఆ ప్రాంతంలో విరగపండిన యవల చేనువుంది. ఫిలిష్తీయులకు భయపడి ఇశ్రాయేలీయులు ఈ ప్రదేశానికి పారిపోయి వచ్చారు. 14 కాని వారా చేను మధ్యలో నిలబడి పంటను కాపాడుతూ ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వారిని చంపివేశారు. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయులకు ఘనవిజయం చేకూర్చాడు.
15 ముప్పై మంది నాయకులలో ముగ్గురు దావీదు వద్దకు వెళ్లారు. ఆ సమయంలో దావీదు అదుల్లాము గుహగల కొండ వద్ద ఉన్నాడు. అదే సమయంలో ఫిలిష్తీయుల సైనికులు కొందరు రెఫాయిము లోయలో గుడారాలు వేశారు.
16 అప్పుడు దావీదు కోటలో వున్నాడు. ఫిలిష్తీయుల సైన్యం బేత్లెహేములో దిగివుంది. 17 దావీదుకు అప్పుడు దాహం వేసింది. అతడు, “ఓహో, ఇప్పుడు నాకెవరైనా బేత్లెహేము[h] నగర ద్వారం వద్దగల బావి నీరు తాగటానికి తెచ్చి ఇవ్వాలని కోరుకుంటున్నాను!” (దావీదు నిజంగా దీనిని కోరుకోలేదు) అని అన్నాడు. 18 అప్పుడు ఆ ముగ్గురు యోధులు ఫిలిష్తీయుల సైన్యాన్ని ఛేదించుకుంటూపోయి, బేత్లెహేము నగర ద్వారంవద్ద గల బావినుండి నీరు తీసుకొన్నారు. ఆ ముగ్గురు యోధులు నీటిని తెచ్చి దావీదుకు ఇచ్చారు. కాని దావీదు ఆ నీటిని తాగ నిరాకరించాడు. ఆ నీటిని యెహోవాకి అర్పణగా పారపోశాడు. 19 దావీదు ఇలా అన్నాడు, “యెహోవా నన్ను ఈ నీటిని తాగకుండా చేయుగాక! ఈ నీటిని నేను తాగటం సరియైనది కాదు. ఎందువల్లననగా ఈ మనుష్యులు ఈ నీటిని తేవటానికి తమ ప్రాణాలను లెక్క చేయలేదు. వారు మృత్యుముఖంలో పడి బయటపడ్డారు.” అందువల్ల దావీదు ఆ నీటిని తాగలేదు. ఆ విధంగా ఆ ముగ్గురు మహాయోధులు వీరోచిత కార్యాలు సాధించారు.
దావీదు యొక్క ముగ్గురు వీరులు
20 ముగ్గురు యోధుల దళానికి యోవాబు సోదరుడు అబీషై నాయకుడు. అతడు మూడు వందల మందిని తన ఈటెతో ఎదిరించి చంపాడు. ఆ ముగ్గురు యోధుల్లాగా అబీషై కీర్తి గడించాడు. 21 కాని అతనికి మిగిలిన వారికంటె ఎక్కువ గౌరవం దక్కింది. ముగ్గురిలో ఒకడు కాకపోయినా అతడు అధిపతి అయ్యాడు.
22 యోహోయాదా కుమారుడు బెనాయా ఒక పరాక్రమవంతుని కుమారుడు. అతడు కబ్సెయేలు వంశంవాడు. అతడు కొన్ని సాహస కార్యాలు నెరవేర్చాడు. మోయాబు దేశానికి చెందిన ఇద్దరు గొప్ప యోధులను చంపాడు. అతడు భూమిలో పెద్ద గోతిలోకి వెళ్లి అక్కడ ఒక సింహాన్ని చంపాడు. అది బాగా మంచుపడే రోజున జరిగింది. 23 ఈజిప్టుకు చెందిన బలవంతుడైన సైనికుని కూడ బెనాయా చంపాడు. ఆ మనుష్యుడు ఏడున్నర అడుగుల ఎత్తుగల వాడు. ఆ ఈజిప్టు వాని వద్ద అతి పెద్దదయిన, బరువైన ఒక ఈటె వుంది. అది నేత నేయువాని మగ్గం దోనెవలె వుంది. బెనాయా వద్ద ఒక గదలాంటి ఆయుధం మాత్రమే వుంది. కాని బెనాయా ఆ ఈజిప్టు వాని వద్ద నుండి ఈటెను లాక్కున్నాడు. దానితోనే వానిని చంపివేశాడు. 24 ఇవన్నీ యోహోయాదా కుమారుడు బెనాయా చేసిన పనులు. ముగ్గురు యోధుల్లాగా బెనాయా పేరు పొందిన వ్యక్తి అయ్యాడు. 25 ఆ ముగ్గురి యోధుల కంటె బెనాయాకు ఎక్కువ గౌరవం లభించింది. కాని అతడు ఆ ముగ్గురిలో చేర్చబడలేదు. దావీదు తన అంగరక్షకులకు అధిపతిగా బెనాయాను నియమించాడు.
ముఫ్పై మంది వీరులు
26 ముఫ్పై మంది వీరులైన సైనికులెవరనగా:
యోవాబు సోదరుడైన ఆశాహేలు.
దోదో కుమారుడైన ఎల్హానాను. ఎల్హానాను బేత్లెహేము నివాసి.
27 హరోరీయుడైన షమ్మోతు.
పెలోనీయుడైన హేలెస్సు.
28 ఇక్కీషు కుమారుడైన ఈరా. ఈరా తెకోవ పట్టణానికి చెందినవాడు.
అనాతోతీయుడైన అబీయెజెరు.
29 హుషాతీయుడైన సిబ్బెకై.
అహోహీయుడైన ఈలై.
30 నెటోపాతీయుడగు మహరై, బయనా కుమారుడగు హేలెదు.
హేలెదు కూడ నెటోపాతీయుడు.
31 రీబయి కుమారుడైన ఈతయి. ఈతయి అనేవాడు బెన్యామీను దేశంలోని గిబియా పట్టణవాసి.
పిరాతోనీయుడైన బెనాయా,
32 గాయషులోయవాడైన హురై,
అర్బాతీయుడైన అబీయేలు,
33 బహరూమీయుడైన అజ్మావెతు.
షయిల్బోనీయుడైన ఎల్యాహ్బా
34 హాషేము కుమారులు గిజోనీయుడుగు షాగే కుమారుడు యోనాతాను. యోనాతాను హరారీయుడు.
35 శాకారు కుమారుడు అహీయాము. అహీయాము హరారీయుడు.
ఊరు కుమారుడు ఎలీపాలు.
36 మెకేరాతీయుడైన హెపెరు.
పెలోనీయుడగు అహీయా.
37 కర్మెలీయుడైన హెజ్రో.
ఎజ్బయి కుమారుడైన నయరై.
38 నాతాను సోదరుడైన యోవేలు.
హగ్రీ కుమారుడగు మిబ్హారు.
39 అమ్మోనీయుడగు జెలెకు.
బెరోతీయుడగు నహరై. యోవాబు ఆయుధాలు మోసేవాడు. యోవాబు తండ్రి పేరు సెరూయా.
40 ఇత్రీయుడైన ఈరా.
ఇత్రీయుడగు గారేబు.
41 హిత్తీయుడైన ఊరియా.
అహ్లయి కుమారుడు జాబాదు.
42 షీజా కుమారుడు అదీనా. షీజా అనేవాడు రూబేనీయుడు. అదీనా రూబేను వంశంలో పెద్ద. అతను తనతోవున్న ముగ్గురు యోధులకు నాయకుడు.
43 మయకా కుమారుడు హానాను.
మిత్నీయుడైన యెహోషాపాతు.
44 ఆష్తెరాతీయుడైన ఉజ్జీయా.
హోతాము కుమారులు షామా, యెహీయేలు. హోతాము అరోయేరీయుడు.
45 షిమ్రీ కుమారుడు యెదీయవేలు.
తిజీయుడగు యోహా. యెదీయవేలు సోదరుడు యోహా.
46 మహవీయుడగు ఎలీయేలు.
ఎల్నయము కుమారులైన యెరీబై, యోషవ్యా. మోయాబీయుడైన ఇత్మా.
47 ఎలీయేలు, ఓబేదు, మరియు మెజోబాయా వాడైన యహశీయేలు.
© 1997 Bible League International