Print Page Options
Previous Prev Day Next DayNext

Beginning

Read the Bible from start to finish, from Genesis to Revelation.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
తీతుకు 1-3

దేవుని సేవకుడును, యేసు క్రీస్తు యొక్క అపొస్తలుడును అయినటువంటి పౌలు వ్రాయుచున్న పత్రిక. దేవుడు తానెన్నుకున్న ప్రజల విశ్వాసాన్ని దృఢపరచడానికి, వాళ్ళను భక్తి కల్గించే మన సత్యం వైపు మళ్ళించటానికి నన్ను ఎన్నుకొన్నాడు. ఈ సత్యం, అనంత జీవితం లభిస్తుందని విశ్వసించటంపై ఆధారపడి ఉంది. అబద్ధం ఆడని దేవుడు మనకీ జీవితం యిస్తానని కాలానికి ముందే వాగ్దానం చేసాడు. సరియైన సమయానికి దాన్ని తన సందేశం ద్వారా మనకు తెలియచేసాడు. ఈ సందేశం నాకప్పగింపబడింది. మన రక్షకుడైనటువంటి దేవుడు దాన్ని మీకు ప్రకటించమని ఆజ్ఞాపించాడు. కనుక దాన్ని మీకు ప్రకటిస్తున్నాను.

మనలో ఉన్న విశ్వాసం మూలంగా నా ప్రియ కుమారునిగా భావిస్తున్న తీతుకు వ్రాయటమేమనగా, మన తండ్రియైన దేవుని నుండి, మన రక్షకుడైన యేసు క్రీస్తునుండి నీకు శాంతి, కృప లభించుగాక!

క్రేతులో తీతు చేయవలసిన పని

అసంపూర్ణంగా వదిలి వేయబడిన వాటిని పూర్తి చేయటానికి, నేను ఆదేశించిన విధంగా ప్రతి పట్టణంలో పెద్దలను నియమించటానికి నిన్ను క్రేతులో వదిలి వచ్చాను. క్రీస్తు సంఘంలోనున్న అధ్యక్షుడు నిందారహితుడై, ఏకపత్నీవ్రతుడై ఉండాలి. తన పిల్లలు అవిధేయతగా ఉండక, అవినీతిగా ఉండక, చెడ్డపేరు లేకుండా, విశ్వసించిన వాళ్ళుగా ఉండాలి. సంఘాధ్యక్షుడు దైవకార్యాన్ని నడిపించే బాధ్యత కలవాడు కనుక అతడు నిందారహితుడై ఉండాలి. అతనిలో గర్వము ఉండరాదు. ముక్కోపి కాకూడదు. త్రాగుబోతు కాకూడదు. పోట్లాడరాదు. అధర్మంగా లాభాలు సంపాదించ రాదు. అతిథులను పరామర్శించే వాడైయుండాలి. మంచి పనులు చెయ్యాలి. మనో నిగ్రహం, నీతి, పవిత్రత, క్రమశిక్షణ మొదలగు గుణాలు అతనిలో ఉండాలి. తనకు బోధింపబడిన సందేశాన్ని విశ్వాసంతో ఆచరించాలి. అప్పుడే యితరులకు ఈ గొప్ప సత్యాన్ని చెప్పి వాళ్ళను కూడా ప్రోత్సాహపరచగలడు. ఈ సందేశాన్ని అంగీకరించనివాళ్ళకు వాళ్ళు చేస్తున్న తప్పు చూపగలడు.

10 తాము అవిధేయతగా ఉంటూ, అధికంగా మాట్లాడి నమ్మించాలని ప్రయత్నించే మోసగాళ్ళు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా సున్నతి అవసరమని వాదించే యూదులు ఈ విధంగా చేస్తున్నారు. 11 అన్యాయంగా లాభం గడించటానికి బోధించరాని విషయాలు బోధించి కుటుంబాల్ని నాశనం చేస్తున్నారు. వాళ్ళను ఆపటం అవసరం. 12 “క్రేతీయులు అబద్ధాలాడుతున్నారనీ, క్రూర మృగాల్లాంటివాళ్ళనీ, సోమరిపోతులనీ, తిండి పోతులనీ” క్రేతీయులలో ప్రవక్తలలో ఒకడు అన్నాడు. 13 ఈ సాక్ష్యము నిజము. వాళ్ళను గట్టిగా వారించటం అవసరం. అలా చేస్తే, వాళ్ళ విశ్వాసం దృఢమౌతుంది. 14 అప్పుడు వాళ్ళు యూదుల కల్పిత కథలను మరిచిపోయి, మన సత్యాన్ని నిరాకరించే వాళ్ళ బోధలను లెక్క చెయ్యరు.

15 పవిత్రంగా ఉన్నవాళ్ళకు అన్నీ పవిత్రంగా కనిపిస్తాయి. కాని దుష్టులకు, విశ్వాసం లేనివాళ్ళకు ఏదీ పవిత్రంగా కనిపించదు. వాళ్ళ బుద్ధులు, మనస్సులు చెడుతో నిండి ఉంటాయి. 16 వాళ్ళు తమకు దేవుని గురించి తెలుసునంటారు కాని, వాళ్ళ ప్రవర్తన ఆ దేవుణ్ణి నిరాకరిస్తున్నట్లు చూపిస్తుంది. వాళ్ళు ద్వేషంతో, అవిధేయతతో ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళు మంచి పని చేయటానికి అంగీకరించరు.

మంచి బోధ

ఉత్తమ సిద్ధాంతాల ప్రకారం సత్యాన్ని అనుసరించమని ప్రజలకు బోధించు. వృద్ధులకు శాంతంగా ఉండమని, గౌరవంగా జీవించుని, ఆత్మనిగ్రహం, సంపూర్ణమైన విశ్వాసం, ప్రేమ, సహనము కలిగి ఉండమని బోధించు.

అదే విధంగా వృద్ధ స్త్రీలకు పవిత్రంగా జీవించమని, ఇతర్లను దూషించకూడదని, త్రాగుబోతులు కాకూడదని, మంచిని మాత్రమే ఉపదేశమిమ్మని చెప్పు. అలా చేస్తే వాళ్ళు యౌవన స్త్రీలకు తమ భర్తల్ని, తమ పిల్లల్ని ప్రేమించాలని, ఆత్మనిగ్రహం కలిగి ఉండి పవిత్రంగా జీవించాలని, తమ గృహనిర్వాహక కర్తవ్యాలను పూర్తి చెయ్యాలని, దయను అలవరచుకోవాలని, వారి భర్తలకు విధేయతగా ఉండాలని ఉపదేశించి శిక్షణనిస్తారు. అప్పుడు దైవసందేశాన్ని ఎవ్వరూ విమర్శించరు.

అదే విధంగా మనోనిగ్రహం కలిగి ఉండమని యువకులకు బోధించు. నీవు స్వయంగా ఉత్తమ కార్యాలు చేస్తూ వాళ్ళకు ఆదర్శంగా ఉండాలి. నీవు బోధించేటప్పుడు మనస్పూర్తిగా, గంభీరంగా బోధించు. విమర్శకు గురికాకుండా జాగ్రత్తగా బోధించు. అప్పుడు నీ శత్రువు విమర్శించటానికి ఆస్కారం దొరకక సిగ్గుపడతాడు.

బానిసలు తమ యజమానుల యిష్టానుసారం నడుచుకోవాలని బోధించు. తమ యజమానులకు ఆనందం కలిగేటట్లు మసలుకోవాలనీ, వాళ్ళకు ఎదురు తిరిగి మాట్లాడరాదని వాళ్ళకు బోధించు. 10 తమ యజమానులనుండి దొంగిలించరాదనీ, తమ యజమానులు తమను విశ్వసించేటట్లు నడుచుకోవాలనీ బోధించు. అప్పుడే మన రక్షకుడైన దేవుని గురించి నేర్చుకొన్నవి సార్థకమౌతాయి.

11 ఎందుకంటే, మానవులకు రక్షణ కలిగించే దైవానుగ్రహం అందరికి ప్రత్యక్షమైంది. 12 అది నాస్తికత్వాన్ని, ఐహిక దురాశల్ని మానివేయమని బోధిస్తుంది. మనోనిగ్రహం కలిగి, క్రమశిక్షణతో, ఆత్మీయంగా ఈ ప్రపంచంలో జీవించమని బోధిస్తుంది, 13 మనం ఆశిస్తున్న ఆ గొప్ప రోజు వస్తుందని, ఆ రోజున మన దేవుడునూ మన రక్షకుడునూ అయినటువంటి యేసు క్రీస్తు కనిపిస్తాడని నిరీక్షిస్తూ ఉన్నాము. 14 అన్ని పాపాలనుండి మనకు విముక్తి కలగాలని యేసు క్రీస్తు తనను తాను అర్పించుకొన్నాడు. సత్కార్యాలు చెయ్యాలని ఉత్సాహపడుతున్న ఈ ప్రజలు ఈ యేసు క్రీస్తుకు చెందినవాళ్ళు. ఆయన వాళ్ళను తనకోసం పవిత్రంగా చేసాడు.

15 నీవు ఈ విషయాలను బోధించాలి. సంపూర్ణమైన అధికారంతో ప్రజలను ఉత్సాహపరుస్తూ, ఖండిస్తూ, నిన్ను ఎవ్వరూ ద్వేషించకుండా జాగ్రత్త పడు.

విశ్వాసులు చేయవలసిన విధులు

పాలకులు, అధికారులు ఆజ్ఞాపించినట్లు నడుచుకోమని ప్రజలకు జ్ఞాపకం చేయి. విధేయతగా ఉండమని, సత్కార్యాలు చేయటానికి సిద్ధంగా ఉండమని బోధించు. ఇతర్లను దూషించకుండా శాంతిని, మంచితనాన్ని అలవర్చుకోమని, అందరిపట్ల దయ చూపమని బోధించు.

గతంలో మనం కూడా మూర్ఖంగా, అవిధేయంగా ఉంటిమి. తప్పులు చేస్తూ, మానసిక వాంఛలకు, సుఖాలకు లోనై, అసూయతో యితర్ల చెడును కోరుతూ, ద్వేషిస్తూ, ద్వేషింపబడుతూ జీవించాము. అలాంటి సమయంలో మన రక్షకుడైనటువంటి దేవుని దయ, ప్రేమ మనకు కనిపించాయి. మనం నీతికార్యాలు చేసినందుకు ఆయన మనలను రక్షించలేదు కాని తన కృప ద్వారానే మనల్ని పవిత్రపరచి, మనకు పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మీయ పునర్జన్మ కల్గించాడు. క్రొత్త జీవితాన్నిచ్చి, మనల్ని రక్షించాడు. పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ధారాళంగా మనపై కురిపించాడు. ఆయన అనుగ్రహం వల్ల మనం నీతిమంతులంగా వారసులం కావాలని ఆయన ఉద్దేశ్యం. ఈ విధంగా మనమాశిస్తున్న అనంత జీవితం పొందగలుగుతాము. ఇది నిజం. నీవు ఈ విషయాన్ని నొక్కి చెప్పాలి.

అలా చేస్తే దేవుణ్ణి విశ్వసించినవాళ్ళు జాగ్రత్తగా ఉండి, మంచి చేయటంలో నిమగ్నులౌతారు. ఇది మంచిది. దాని వలన ప్రజలకు లాభం కలుగుతుంది.

కాని మూర్ఖంగా వాదించేవాళ్ళకు, వంశ చరిత్రల్ని చర్చించేవాళ్ళకు, ధర్మశాస్త్రాన్ని గురించి వాదించేవాళ్ళకు, పోట్లాడేవాళ్ళకు దూరంగా ఉండు. అలాంటి చర్చలవల్ల ఉపయోగమేమీ ఉండదు. వాటివల్ల లాభం కలుగదు. 10 చీలికలు కలిగించేవాణ్ణి ఒకటి రెండు సార్లు గద్దించు. ఆ తర్వాత అతనితో సంబంధం తెంపుకో. 11 అలాంటివాడు దుర్మార్గుడని, పాపి అని నీకు బాగా తెలుసు. అతడు తనకు తాను శిక్ష విధించుకొన్నాడు.

చివరి మాట

12 అర్తెమానును, తుకికును నీ దగ్గరకు పంపిన తక్షణం నీవు నికొపొలికి వచ్చి నన్ను కలుసుకో. ఈ చలికాలం నేనక్కడ గడపదలిచాను. 13 న్యాయవాది జేనా, అపొల్లోల ప్రయాణానికి కావలసినవన్నీ సమకూర్చి వాళ్ళకు సహాయం చెయ్యి. 14 మనవాళ్ళు సత్కార్యాలు చేయటానికి నేర్చుకొని వాటిలో నిమగ్నులై ఉండాలి. తమ నిత్యావసరాలకు కావలిసినవి సంపాదించుకోవాలి. వ్యర్థంగా జీవించకూడదు.

15 నాతో ఉన్నవాళ్ళు నీకు వందనాలు తెలుపుతున్నారు. విశ్వాసం మూలంగా మన స్నేహితులైనవాళ్ళకు నా శుభాకాంక్షలను తెలుపుము.

మీ అందరిపై దేవుని కృప ఉండునుగాక!

ఫిలేమోనుకు

యేసు క్రీస్తు కోసం ఖైదీనైన పౌలును మరియు మన సోదరుడైన తిమోతియు, మా ప్రియ జతపనివాడైన ఫిలేమోనుకు, మరియు మన సోదరి అప్ఫియకు, మనతో సహా పోరాటం సాగిస్తున్న అర్ఖిప్పుకు, మీ యింట్లో సమావేశమయ్యే సంఘానికి వ్రాస్తున్న సంగతులు:

మన తండ్రియైన దేవుడు, మన యేసు క్రీస్తు ప్రభువు మిమ్మల్ని అనుగ్రహించి మీకు శాంతి ప్రసాదించు గాక!

ప్రార్థన, కృతజ్ఞత

కాబట్టి నేను ప్రార్థనలను చేసినప్పుడెల్లా నిన్ను జ్ఞాపకం పెట్టుకొని నా దేవునికి కృతజ్ఞతలు చెప్పుకొనుచున్నాను. యేసు ప్రభువు పట్ల నీకున్న భక్తిని గురించి, భక్తులపట్ల నీకున్న ప్రేమను గురించి నేను విన్నాను. క్రీస్తు మనకు చేసిన మంచిని నీవు పూర్తిగా అర్థం చేసుకోవాలనీ, తద్వారా మన విశ్వాసాన్ని నీవు యితరులతో ఉత్సాహంగా పంచుకోగల్గాలనీ నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. సోదరా! నీవు భక్తులకు సహాయం చేసి వాళ్ళను ఆనందపరిచావు. కనుక నీ ప్రేమ నాకు చాలా ఆనందమును, తృప్తిని కల్గించింది.

ఒనేసిము కొరకు విజ్ఞప్తి

క్రీస్తు పేరిట నీవు చేయవలసిన కర్తవ్యాలను ఆజ్ఞాపించగల అధికారం నాకున్నా, నేను ప్రేమతో నీకు విజ్ఞప్తి చేస్తున్నాను. పౌలను నేను, వయస్సు మళ్ళిన వాణ్ణిగా, యేసు క్రీస్తు ఖైదీని. 10 నా కుమారునితో సమానమైన ఒనేసిము విషయంలో నిన్ను ఒకటి వేడుకొంటున్నాను. నేను ఖైదీగా ఉన్నప్పుడు అతడు నా కుమారుడయ్యాడు. 11 గతంలో అతనివలన నీకు ఉపయోగం లేదు. కాని యిప్పుడు అతనివలన నీకూ, నాకూ, యిద్దరికీ ఉపయోగం ఉంది.

12 నా గుండెలాంటివాడైన అతణ్ణి తిరిగి నీ దగ్గరకు పంపుతున్నాను. 13 నేను సువార్త కారణంగా ఖైదీగా ఉన్నాను. ఈ సమయంలో నీ స్థానంలో అతడు నాకు సహాయం చేయాలని నా అభిలాష, కనుక అతణ్ణి నా దగ్గరే ఉంచుకోవాలనుకొన్నాను. 14 కాని నీ అనుమతి లేకుండా నేనిది చేయదలచుకోలేదు. నీవు చేసే ఈ సహాయం నా ఒత్తిడివల్ల కాకుండా నీ యిష్ట ప్రకారం చెయ్యాలని నా ఉద్దేశ్యం.

15 ఒనేసిము నీ నుండి కొంతకాలం దూరం అయ్యాడు. చిరకాలం నీ దగ్గర ఉండాలని యిలా జరిగిందేమో. 16 అతడు యిప్పుడు దాసుడు మాత్రమే కాదు. క్రీస్తును నమ్మిన మన ప్రియ సోదరుడు. అతడు నాకు చాలా దగ్గరి వాడు. తోటి మనిషిగా, ప్రభువువల్ల కలిగిన బంధంలో ఒక సోదరునిగా, అతన్ని నీవు యింకా దగ్గరివానిగా భావిస్తావు.

17 నీవు నన్ను నీ భాగస్వామిగా భావిస్తూన్నట్లయితే నాకు స్వాగతం చెప్పినట్లే, అతనికి కూడా స్వాగతం చెప్పు. 18 అతడు నీ పట్ల ఏదైనా అపరాధం చేసి ఉంటే, లేక అతడు నీకు ఏదైనా అప్పు ఉంటే అది నా లెక్కలో వ్రాయి. 19 నేను ఆ అప్పును తీరుస్తానని పౌలు అను నేను నా స్వహస్తంతో వ్రాస్తున్నాను. కాని నీవు నీ జీవితంతో సహా నాకు బాకీ ఉన్నావని చెప్పనవసరం లేదు. 20 కనుక నా సోదరా! ప్రభువు కోసం దయచేసి నాకీ సహాయం చేయి. క్రీస్తు కారణంగా మనం సోదరులం కనుక నాకీ తృప్తి కలిగించు. 21 నీ విధేయతపై నాకు నమ్మకం ఉంది. నేను అడిగిన దానికన్నా ఎక్కువే చేస్తావని నాకు తెలుసు. అందుకే నీకు వ్రాస్తున్నాను.

22 మరొక విషయం. అతిథుల కోసం ఉంచిన గదిని నా కోసం సిద్ధంగా ఉంచు. నీ ప్రార్థలను విని దేవుడు నన్ను నీ దగ్గరకు పంపుతాడని ఆశిస్తున్నాను.

చివరి వందనాలు

23 యేసు క్రీస్తు నిమిత్తం నాతో సహా కారాగారంలో ఉన్న ఎపఫ్రా నీకు వందనాలు తెలుపమన్నాడు. 24 నాతో పని చేస్తున్న మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా కూడా నీకు వందనాలు తెలుపుతున్నారు.

25 యేసు క్రీస్తు ప్రభువు యొక్క అనుగ్రహం మీ ఆత్మకు తోడుగా ఉండుగాక!

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International