Beginning
నెహెమ్యా ప్రార్థన
1 హకల్యా కుమారుడైన నెహెమ్య మాటలు ఇవి: నెహెమ్యా అనే నేను కిస్లేవు నెలలో రాజధాని నగరమైన షూషనులో ఉన్నాను. అర్తహషస్త రాజ్య పాలన ఇరవయ్యవ ఏట ఇది జరిగింది. 2 నేను షూషనులో వుండగా, నా సోదరుల్లో ఒకడైన హనానీయ, మరి కొందరు యూదా నుంచి వచ్చారు. అక్కడ నివసిస్తున్న యూదులను గురించి నేను వాళ్లని అడిగాను. వాళ్లు చెరనుంచి తప్పించుకొని, ఇంకా యూదాలోనే నివసిస్తున్న యూదులు. నేను వాళ్లని యెరూషలేము నగరం గురించి కూడా అడిగాను.
3 హనానీయ, అతనితో ఉన్న వాళ్లూ ఇలా చెప్పారు: “నెహెమ్యా, చెరనుంచి తప్పించుకొనిపోయి యింకా యూదాలోనే ఉన్న యూదులు చాలా యిబ్బందుల్లో వున్నారు. వాళ్లకి అనేక సమస్యలు ఎదురౌతున్నాయి. వాళ్లు చాలా సిగ్గుతోను, అనేక కష్టాలతోను వుంటున్నారు. ఎందుకంటే, యెరూషలేము ప్రాకారం కూల్చబడింది. దాని ద్వారాలు దగ్ధం చేయబడ్డాయి.”
4 యెరూషలేము ప్రజలను గురించి, ప్రాకారం గురించీ ఈ విషయాలు విన్నాక, నేను చాలా కలత చెందాను. నేను కూర్చుండి విలపించాను. నా విచారానికి అవధి లేకపోయింది. నేను కొన్ని రోజులపాటు ఉపవాసం వుండి, పరలోక దేవునికి ప్రార్థనలు చేశాను. 5 తర్వాత ఈ క్రింది ప్రార్థన చేశాను:
పరలోక దేవా, యెహోవా ప్రభూ, నీవు అత్యంత శక్తిశాలివైన మహా దేవుడివి. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలు పాటించే మనుష్యులను నీవు కటాక్షించి వారితో ప్రేమ ఒడంబడికను అమలుపరుస్తావు.
6 దయచేసి నీవు కళ్లు తెరిచి, చెవులొగ్గి ఈ నీ సేవకుడు రాత్రింబగళ్లు నీ సన్నిధియందు చేస్తున్న ప్రార్థనలను విను. నేను నీ సేవకులైన ఇశ్రాయేలీయుల కోసం ప్రార్థిస్తున్నాను. మేము నీకు వ్యతిరేకంగా పాపాలు చేశామన్న విషయాన్ని నేను ఒప్పుకొంటున్నాను. నేనూ, నా తండ్రి కుటుంబంలోని ఇతరులూ నీకు వ్యతిరేకంగా పాపం చేశామని ఒప్పుకొంటున్నాను. 7 ఇశ్రాయేలు ప్రజలమైన మేము నీపట్ల చాలా చెడుగా వ్యవహరించాము. నీవు నీ సేవకుడైన మోషే ద్వారా యిచ్చిన ఆజ్ఞలనూ, బోధనలనూ, విధులనూ మేము తృణీకరించాము.
8 నీవు నీ సేవకుడైన మోషేకి ఇచ్చిన ఉపదేశాన్ని దయచేసి గుర్తుచేసుకొనుము. దేవా, నీవు అతనికి “మీ ఇశ్రాయేలు ప్రజలు విశ్వసనీయంగా వ్యవహరించక పోయినట్లయితే, మిమ్మల్ని యితర దేశాల మధ్యకు చెదరగొడ్తాను. 9 అలాకాక, మీ ఇశ్రాయేలీయులు నా వద్దకు తిరిగి వచ్చి, నా ఆదేశాలను పాటించినట్లయితే, అప్పుడు నేనిలా చేస్తాను: మీ ప్రజలు తమ ఇళ్లు వాకిళ్లు వదలటానికి బలవంతం చేయబడినా, భూలోకపు అంచులదాకా పోయినా సరే, నేను వాళ్లని అక్కడనుంచి తిరిగి ఒక్కచోట చేరుస్తాను. ఎక్కడైతే నా నామాన్ని ఉంచుటకు ఏర్పాటు చేసుకున్నానో అక్కడికి తిరిగి వాళ్లని నేను తీసుకొస్తాను” అని చెప్పావు.
10 ఇశ్రాయేలు ప్రజలు నీ సేవకులు, నీ ప్రజలు. నీవు నీ గొప్ప శక్తిని వినియోగించి, వాళ్లని విడిపించావు. 11 కాబట్టి ప్రభువా, నా ప్రార్థన ఆలకించు. నేను నీ దాసుడను. నీ నామం పట్ల గౌరవం ప్రదర్శించాలని ఇష్టపడే నీ సేవకుల ప్రార్థనలు దయచేసి ఆలకించు. ప్రభూ, నేను రాజుకి ద్రాక్షారసం అందించే సేవకుణ్ణి.[a] ఈ విషయం నీకు తెలుసు. అందుకని దేవా, నాకు ఈ నాడు సహాయం చెయ్యి. నేను రాజు సహాయాన్ని అర్థిస్తున్నాను. ఈ నా ప్రయత్నంలో నాకు విజయం చేకూర్చు. రాజుకు నా పట్ల అభిమానం కలిగేలా చెయ్యి.
అర్తహషస్త నెహెమ్యాను యెరూషలేముకు పంపటం
2 అర్తహషస్త రాజు పాలన ఇరవయ్యవ సంపత్సరం, నీసాను నెలలో,[b] ఎవరో కొంత ద్రాక్షారసం తెచ్చి ఇచ్చారు. నేను ముందు దాన్ని తాగి, పరిక్షించి, తర్వాత దాన్ని రాజుకు అందించాను. నేను రాజు సమక్షంలో వున్నప్పుడెప్పుడూ విచారంగా లేను, కాని అప్పుడు విచారంగా వున్నాను. 2 దానితో, రాజు నన్ను, “నీ ఒంట్లో బాగాలేదా, ఎందుకలా విచారంగా కనిపిస్తున్నావు? నీ గుండెల్లో విచారం గూడు కట్టుకుందన్నట్లు అనిపిస్తోంది” అని ప్రశ్నించాడు.
అప్పుడు నేను చాలా భయపడ్డాను. 3 అయితేనేమి, నేను భయపడినా కూడా, రాజుతో, “రాజు చిరంజీవిగా వర్ధిల్లాలి! నా పూర్వీకులు సమాధి చేయబడిన నగరం శిథిలమైంది. ఆ నగర ప్రాకార ద్వారాలు దగ్ధం చేయబడ్డాయి” అని విన్నవించాను.
4 అప్పుడు రాజు, “నీకు నావల్ల ఏ సహాయం కావాలి?” అని నన్ను అడిగాడు.
జవాబిచ్చేందుకు ముందు, నేను పరలోక దేవుణ్ణి ప్రార్థించి. 5 రాజుకు ఇలా సమాధానమిచ్చాను. “రాజుకు దయ కలిగితే, నేను తమపట్ల మంచిగా ప్రవర్తించివుంటే, దయచేసి నన్ను నా పూర్వీకులు సమాధి చేయబడిన యెరూషలేము నగరానికి పంపండి. నేను అక్కడికి పోయి, ఆ నగరాన్ని తిరిగి నిర్మించాలని కోరుకొంటున్నాను.”
6 అప్పుడు రాణి రాజు పక్కనే కూర్చుని వుంది. రాజు మరియు రాణి, “నీ ప్రయాణానికి ఎన్ని రోజులు పడుతుంది? నువ్విక్కడకి తిరిగి ఎప్పుడు వస్తావు?” అని అడిగారు.
అందుకని, ఇంత సమయము పట్టును అని చెప్పాను, నన్ను పంపేందుకు రాజుగారు సంతోషంగా ఒప్పుకున్నారు. 7 నేను రాజుతో ఇంకా యిలా మనవి చేసుకున్నాను: “రాజురు దయదలిస్తే మరో కోరిక కూడా కోరుకుంటాను. యూఫ్రటీసు నది పశ్చిమ ప్రాంతపు పాలనాధికార్లకు కొన్ని ఉత్తరువు లేఖలు ఇప్పించండి. నేను యూదాకి పోయే మార్గంలో వారివారి ప్రాంతాల్లో క్షేమంగా పోయేందుకు ఆ పాల నాధికార్లు నాకు అనుమతి ఇచ్చేందుకు ఈ లేఖలు నాకు అవసరము. 8 నగర ప్రాకార ద్వారాలకూ, గోడలకూ, ఆలయ ప్రాకారానికీ,[c] నా యింటికీ కలప కావాలి. తమ అడవులకు బాధ్యుడైన అధికారి ఆసాపుకి ఒక లేఖ ఇవ్వండి.”
రాజు నాకు లేఖలే కాకుండా, నేను కోరినవన్నీ ఇచ్చాడు. నా పట్ల దేవుని దయ కారణంగా రాజు ఇవన్నీ చేశాడు.
9 సరే, నేను యూఫ్రటిసు నది పశ్చిమ ప్రాంతాల పాలనాధికారి వద్దకు వెళ్లాను. నేను రాజురి లేఖలు వారికి యిచ్చాను. రాజు నాకు తోడుగా కొందరు సైనికోద్యోగులను, అశ్విక సైనికులను కూడా పంపాడు. 10 నేను చేస్తున్నదేమిటో చూసినవాళ్లు ఇద్దరు, సన్బల్లటు, టోబీయా. వాళ్లు కలత చెందారు. ఇశ్రాయేలు ప్రజలకి తోడ్పడేందుకు ఎవరో వచ్చినందుకు వాళ్లకి కోపం కలిగింది. సన్బల్లటు హారోనీయుడు, టోబీయా అమ్మోనీయుడు.
నెహెమ్యా చేత యెరూషలేము గోడల తనిఖీ
11-12 నేను యెరూషలేముకు పోయి, అక్కడ మూడు రోజులు వున్నాను. తర్వాత రాత్రిపూట కొద్దిమందిని వెంటతీసుకొని బయల్దేరాను. యెరూషలేముకు నేను ఏమి చేయాలన్న సంకల్పం నాకు దేవుడు నా హృదయంలో కలిగించిన దానిని గురించి నేను ఎవరికీ ఏమీ చెప్పలేదు. నేను సవారీ చేస్తున్న గుర్రం తప్పనాకు వేరే గుర్రాలేమీ లేవు. 13 చీకట్లో నేను లోయ ద్వారం గుండా బయటికి వెళ్లాను. నేను నక్కల బావి దిక్కున సవారీచేస్తూ పోయి, బూడిద రాశుల ద్వారం దగ్గరికి పోయాను. నేను యెరూషలేము గోడలు తనిఖీ చేస్తూ పోయాను. గోడలు శిథిలమయ్యాయి, ద్వారాలు కాలిపోయి వున్నాయి. 14 తర్వాత నేను నీటిబుగ్గ ద్వారంవద్దకు, రాజ కోనేరుల దిశగా సవారీ చేస్తూ పోయాను. నేను దగ్గరికి పోయేసరికి అక్కడి మార్గం నా గుర్రం పోలేనంతటి యిరుకుగా వుండటం గమనించాను. 15 అందుకని నేను చీకట్లో గోడని పరిశీలిస్తూ లోయపైకి పోయాను. చివరికి నేను వెనక్కి తిరిగి, లోయ ద్వారం గుండా లోనికి పోయాను. 16 అధికారులకు, ఇశ్రాయేలులోని ప్రముఖులకు నేనెక్కడికి వెళ్లానో తెలియదు. నేనేమి చేస్తున్నానో తెలియదు. యూదులకు, యాజకులకు, రాజ కుటుంబీకులకు, ఉద్యోగులకు, లేక పని చేయబోయే ఏ యితరులకు నేను అప్పటికింకా ఏమీ చెప్పలేదు.
17 తర్వాత నేను వాళ్లందరికీ యిలా చెప్పాను: “మనకు ఇక్కడున్న ఇబ్బందేమిటో మీరు చూడగలరనుకుంటున్నాను. యెరూషలేము శిథిలాల గుట్టలావుంది. దాని ద్వారాలు మంటలకి కాలిపొయాయి. రండి, యెరూషలేము ప్రాకారాన్ని తిరిగి కట్టెదము. అప్పుడిక మనం ఎప్పటికీ సిగ్గుపడము.” 18 అప్పుడు నేను వాళ్లకి దేవుడు నాపట్ల ఎలాదయ చూపాడో చెప్పాను. రాగారు నాతో అన్న మాటలుచె ప్పాను. అప్పుడు వాళ్లు, “ఇప్పుడే పని ప్రారంభిద్దాం పదండి!” అన్నారు. దానితో మేము ఈ మంచి పని ప్రారంభించాము. 19 హారోనీయుడైన సన్బల్లటు, అమ్మోనీయ ఉద్యోగి టోబీయా, అరబీయుడైన గెషెము మేము తిరిగి నిర్మాణం సాగిస్తున్నామన్న విషయం విన్నారు. వాళ్లు మమ్మల్ని, “ఏమిటి మీరు చేస్తున్న పని? రాజు మీదే తిరుగుబాటు చెయ్యబోతున్నారా?” అంటూ చెడుగా ఎగతాళి చేశారు.
20 అయితే, నేను వాళ్లకిలా బదులు చెప్పాను: “పరలోకమందున్న దేవుడే మా పనిలో మాకు విజయం చేకూరుస్తాడు. దేవుని దాసులమైన మేము ఈ నగరాన్ని తిరిగి నిర్మిస్తున్నాము. ఈ కృషిలో మాకు మీరు సహాయం చెయ్యలేరు. మీ కుటుంబంలో ఏ ఒక్కరూ ఇక్కడ యెరూషలేములో నివసించలేదు. ఈ నేలలో కొంచెం స్థలం కూడా మీకు చెందదు. మీకు యిక్కడ వుండే హక్కు బొత్తిగా లేదు!”
ప్రాకార నిర్మాతలు
3 ప్రధాన యాజకుని పేరు ఎల్యాషీబు. ఎల్యాషీబూ, యాజకులైన అతని సోదరులూ పనిలోకి పోయి, గొర్రెల ద్వారాన్ని నిర్మించారు. వాళ్లు ప్రార్థనలు జరిపి యెహోవా పేరిట ఆ ద్వారమును ప్రతిష్ఠ చేశారు. దాని ద్వారాలను ప్రాకారంలో సరైన చోట వుంచారు. ఆ యాజకులు యెరూషలేము ప్రాకారాన్ని హమ్మేయా గోపురం దాకా, హనన్యే గోపురుం దాకా నిర్మించి, అక్కడ ప్రార్థనలు జరిపి, ప్రతిష్ఠించారు.
2 యాజకులు కట్టిన గోడ భాగానికి ప్రక్కనే యెరికోవాసులు గోడను కట్టారు. ఇమ్రీ కుమారుడైన జక్కూరు యెరికోవాసులు కట్టినదానికి ప్రక్కగా గోడ భాగమును కట్టాడు.
3 హస్సెనాయా కుమారులు మత్స్య ద్వారాన్ని నిర్మించారు. వాళ్లు కొయ్య దూలాలను సరిగ్గా అమర్చి, కట్టడానికి తలుపులు పెట్టి, తర్వాత ఆ తలుపులకు గడియలు, తాళాలు అమర్చారు.
4 ఊరియా కుమారుడు మెరేమోతు గోడలో తర్వాత భాగాన్ని నిర్మించాడు. (ఊరియా హక్కోజు కుమారుడు).
బెరెక్య కుమారుడు మెషుల్లాము గోడలో తర్వాత భాగాన్ని కట్టాడు. (బెరెక్యా మెషేజబెయేలు కుమారుడు.)
బయనా కొడుకు సాదోకు గోడలో తర్వాత భాగము కట్టాడు.
5 తెకోవీయులు గోడలో తర్వాతి భాగాన్ని కట్టారు. అయితే, తెకోవా నాయకులు తమ పాలనాధికారి నెహెమ్యా కోసం పని చేసేందుకు అంగీకరించలేదు.
6 పాసెయ కుమారుడు యెహోయాదా, బెసోద్యా కుమారుడు మెషుల్లాము పాతద్వారం మరమ్మతు చేశారు. వాళ్లు దూలాలను సరిగ్గా ఉంచి, తలుపులను కీలు గుడిదెల మీద నిలిపి, తలుపులకు గడియలు, తాళాలు అమర్చారు. 7 గిబ్యోను వాళ్లూ, మిస్పా వాళ్లూ గోడలో తర్వాత భాగాన్ని నిర్మించారు. గిబ్యోనుకు చెందిన మెలట్యా, మేరోనోతుకు చెందిన యాదోనూ పనిచేశారు. గిబ్యోను, మేరోనోతులు యూఫ్రటిసు నది వశ్చిమ ప్రాంత పాలనాధికారుల అజమాయిషీలో వున్నాయి.
8 హర్శయా కుమారుడు ఉజ్జీయేలు గోడలో తర్వాత భాగాన్ని మరమ్మతు చేశాడు. ఉజ్జీయేలు బంగారపుపని చేసేవాడు. హనన్యా అత్తర్ల తయారీదారు. వీళ్లు వెడల్పు గోడవరకు యెరూషలేమును కట్టి, నిలిపారు.
9 వీరి ప్రక్కన హూరు కుమారుడు రెఫాయా గోడలో తదుపరి భాగాన్ని నిర్మించాడు. రెఫాయా యెరూషలేములో సగం భాగానికి పాలనాధికారి.
10 హరూమఫు కొడుకు యెదాయా గోడలో తర్వాత భాగాన్ని నిలిపాడు. యెదాయా నిలిపిన గోడ భాగం అతని యింటి ప్రక్కనే వుంది. హషన్నేయా కొడుకు హట్టూషు తర్వాత గోడ భాగాన్ని మరమ్మతు చేశాడు. 11 హారీము కొడుకు మల్కీయా, పహత్మోయాబు కొడుకు హష్షూబు తర్వాత భాగాన్నీ, అగ్ని గుండపు గోపురాన్నీ మరమ్మతు చేశారు.
12 గోడలో తర్వాత భాగాన్ని హల్లోహెషు కొడుకు షల్లూము తన కుమార్తెల సాయంతో మరమ్మతు చేశాడు. షల్లూము యెరూషలేము రెండవ భాగానికి పాలనాధికారి.
13 హానూను అనేవాడు, జానోవా పట్టణ వాసులూ కలిసి లోయద్వారాన్ని పునర్నిర్మించారు. వాళ్లు దాని తలుపులను కీలుల మీద నిలిపారు. తర్వాత ఆ తలుపులకు వాళ్లు గడియలు, తాళాలు బిగించారు. అంతేకాక, వాళ్లు 500 గజాల గోడను కూడా బాగుచేశారు. వాళ్లు బూడిద రాశి ద్వారందాకా ఉన్న గోడను బాగు చేశారు.
14 రేకాబు కొడుకు మల్కీయా పెంట గుమ్మాన్ని సరిచేశాడు. మల్కీయా, బేత్ హక్కెరెము ప్రాంతానికి అధిపతి. అతను ఆ ద్వారాన్ని నిలిపి, దాని తలుపులను కీలులమీద తగిలించి, వాటికి గడియలను, తాళాలను అమర్చాడు.
15 కొల్హోజె కొడుకు షల్లూము ఇంటి ద్వార గుమ్మాన్ని బాగుచేశాడు. ఇతను మిస్పా ప్రాంతపు అధిపతి. అతను ఆ ద్వారాన్ని బాగుచేసి, దానికి పైకప్పు వేయించాడు. అతను కీలుల మీద తలుపులు నిలిపి, వాటికి గడియలు, తాళాలు అమర్చాడు. రాజు తోట ప్రక్కన వున్న సిలోయము కోనేరువరకు వున్న గోడ భాగాన్ని కూడా షల్లూము బాగుచేశాడు. దావీదు నగరం నుంచి క్రిందికి పోయే మెట్లవరకు వున్న గోడను కూడా అతనే బాగుచేశాడు.
16 అజ్జూకు కొడుకు నెహెమ్యా గోడలో తర్వాత భాగాన్ని బాగుచేసాడు. ఈ నెహెమ్య బేత్సూరు సగం ప్రాంతానికి అధిపతి. అతను దావీదు సమాధికి ఎదుట పున్న స్థలంలోని కోనేరును, యుద్ధ వీరుల భవనాన్నీ బాగుచేశాడు.
17 తర్వాత భాగాన్ని లేవి వంశీములు బాగు చేశారు. ఆ లేవీయులు బానీ కుమారుడు రెహూము అజమాయిషీలో పనిచేశారు. కెయిలా ప్రాంతంలో సగం భాగానికి అధిపతి అయిన హషబ్యా తర్వాత భాగాన్ని బాగుచేశాడు. అతను తన సొంత ప్రాంతానికి చెందిన వాటినే బాగుచేశాడు.
18 వాళ్ల సోదరులు తర్వాత భాగాన్ని బాగుచేశారు. వాళ్లు హేనాదాదు కుమారుడు బవ్వై పర్యవేక్షణలో పని చేశారు. కెయిలా ప్రాంతపు సగంభాగానికి ఈ బవ్వై అధిపతి.
19 యేషూవ కుమారుడు ఏజెరు తర్వాత భాగాన్ని బాగుచేశాడు. ఏజెరు మిస్పా అధిపతి. అతను ఆయుధాగారం నుంచి ప్రాకారం మూలదాకా వున్న భాగాన్ని బాగుచేశాడు. 20 జబ్బయి కుమారుడు బారూకు గోడలో తదుపరి భాగాన్ని బాగుచేశాడు. బారూకు విశేషంగా శ్రమించి, ప్రాకారం మూలనుంచి ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు ఇంటిదాకా వున్న గోడ భాగాన్ని బాగుచేశాడు. 21 హక్కోజు మనుమడు, ఊరియా కుమారుడు అయిన మెరేమోతు ఎల్యాషీబు ఇంటి ముఖ ద్వారం నుంచి, ఆ ఇంటి చివరిదాకా వున్న గోడ భాగాన్ని బాగుచేశాడు. 22 ప్రాకారపు తదుపరి భాగాన్ని ఆ ప్రాంతంలో[d] నివసించే యాజకులు బాగుచేశారు.
23 బెన్యామీను, హష్షూబులు తమ ఇంటి ముందర గోడ భాగాన్ని బాగుచేశారు. అనన్యా కుమారుడు, మయశేయా కొడుకు అయిన అజర్యా తన ఇంటి ప్రక్కన వున్న గోడ భాగాన్ని బాగుచేశాడు.
24 హేనాదాదు కొడుకు బిన్నూయి అజర్యా ఇంటి దగ్గర్నుంచి ప్రాకారపు మలుపుదాకా, అక్కణ్నుంచి మూలదాకా గోడభాగాన్ని బాగుచేశాడు.
25 ఊజై కుమారుడు పాలాలు ప్రాకారపు మలుపు నుంచి గోపురం దాకా పనిచేశాడు. రాజు పై అంతస్తు దగ్గర, అది రాజుగారి రక్షకభటుల ఆవరణానికి దగ్గర వున్న గోవురం. పరోషు కొడుకు పెదాయా పొలాలు పక్కన పని చేశాడు.
26 ఆలయ సేవకులు ఓపెలు కొండమీద నివసించేవారు. వాళ్లు జలద్వారం దాకా, దాని దగ్గరవున్న గోపురం దాకా ఉన్న గోడ తదుపరి భాగాన్ని బాగు చేశారు.
27 పెద్ద గోపురం దగ్గర్నుంచి ఓపెలు గోడదాకా ఉన్న ప్రాకార భాగమంతటినీ తెకోవీయులు బాగు చేశారు.
28 తమ ఇండ్లకి ఎదురుగా గుర్రపు గుమ్మానికి పైనున్న ప్రాకార భాగాన్ని యాజకులు బాగుచేశారు. ప్రతి ఒక్క యాజకుడూ తన స్వగృహానికి ఎదుట ఉన్న గోడ భాగాన్ని బాగుచేశాడు. 29 ఇమ్మేరు కొడుకైన సాదోకు తన ఇంటి ముందరి గోడ భాగాన్ని బాగు చేశాడు. షెకన్యా కొడుకైన షెమయా గోడలో అటు తర్వాత భాగాన్ని బాగుచేశాడు. షెమయా తూర్పు ద్వార రక్షకుడు.
30 షలెమ్యా కొడుకు హనన్యా, జాలాఫు కొడుకు హానూనూ గోడలో మిగిలిన భాగాన్ని బాగుచేశారు. (హానూను జాలాపు ఆరవ కొడుకు).
బెరెక్యా కొడుకు మెషుల్లాము తన ఇంటి ముందరి గోడ భాగాన్ని బాగుచేశాడు. 31 ఆలయ సేవకుల, వ్యాపారస్తుల ఇళ్లదాకా ఉన్న తదుపరి గోడ భాగాన్ని మల్కీయా బాగుచేశాడు. అంటే, తనిఖీ ద్వారం దగ్గర్నుంచి అన్నమాట. ప్రాకారపు మూలలో ఉన్న గదిదాకా ఉన్న గోడ భాగమంతటినీ మల్కీయా బాగు చేశాడు. మల్కీయా బంగారంపని చేసేవాడు. 32 స్వర్ణకారులూ, వ్యాపారస్థలూ మూలనున్న గదినుంచి గొర్రెల ద్వారం దాకా ఉన్న గోడ భాగాన్ని బాగుచేశారు.
© 1997 Bible League International