Print Page Options
Previous Prev Day Next DayNext

Beginning

Read the Bible from start to finish, from Genesis to Revelation.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 రాజులు 12-14

యోవాషు పరిపాలన ప్రారంభించుట

12 ఇశ్రాయేలు రాజుగా యెహూ పాలన సాగించిన ఏడవ సంవత్సరంనుండి యోవాషు తన పరిపాలన ప్రారంభించాడు. యెరూషలేములో యోవాషు 40 సంవత్సరములు పాలించాడు. యోవాషు తల్లి బెయేర్షెబాకు చెందిన జిబ్యా. యెహోవా దృష్టికి సరి అయిన పనులు యోవాషు జరిగించాడు. జీవితాంతమూ యోవాషు యెహోవా పట్ల విధేయుడై వుండెను. యాజకుడైన యెహోయాదా తనకు నేర్పించిన పనులు అతను చేశాడు. కాని అతను ఉన్నత స్థానాలను నాశనం చెయ్యలేదు. ఆ ఆరాధనా స్థలాలలో ఆనాటికీ ప్రజలు బలులు అర్పిస్తున్నారు, ధూపం వేస్తున్నారు.

యోవాషు ఆలయ పునరుద్ధరణకు ఆజ్ఞాపించుట

4-5 “యెహోవా ఆలయంలో చాలా ధనం వున్నది. ప్రజలు ఆలయానికి కొన్ని వస్తువులు సమర్పించారు. వారిని లెక్కించినప్పుడు ప్రజలు ఆలయం పన్ను చెల్లించారు. డబ్బు ఇవ్వాలనే వుద్దేశ్యంతో వారు ఇచ్చారు. యాజకులైన మీరు ఆ ధనం తీసుకొని యెహోవా ఆలయాన్ని బాగు చేయండి. తాను సేవచేసే ప్రజలనుండి లభించే డబ్బును ప్రతి యాజకుడు వినియోగించాలి. యెహోవా ఆలయానికి ఆ డబ్బుతో మంచిపనులు చేయాలి” అని యాజకులకు యోవాషు చెప్పాడు.

కాని యాజకులు మరమ్మతులు చేయలేదు. యోవాషు రాజుగావున్న 23వ సంవత్సరమున, యాజకులు అప్పటికి మరమ్మతులు చేయలేదు. అందువల్ల యోవాషు రాజు యెహోయాదా యాజకుని, ఇతర యాజకులను పిలిపించుకున్నాడు. యెవాషు, యెహోయాదా, ఇతర యాజకులతో, “మీరెందుకు ఆలయాన్ని మరమ్మతు చేయలేదు? మీరు సేవించే మనుష్యుల వద్దనుండి మీరు డబ్బును తీసుకోవడం నిలిపివేయండి. ఆ డబ్బును వాడకండి. ఆలయాన్ని మరమ్మతు చేయుటకే అది వినియోగించ బడాలి” అని చెప్పాడు.

ప్రజలవద్ద నుండి డబ్బు వసూలు చేయడాన్ని ఆపివేయడానికి యాజకులు సమ్మతించారు. అయితే ఆలయాన్ని బాగు చేయకూడదని నిర్ణయించుకున్నారు. అందువల్ల యాజకుడైన యెహోయాదా ఒక పెట్టె తీసుకుని దానిమీద ఒక రంధ్రం చేశాడు. తర్వాత యెహోయాదా బలిపీఠపు దక్షిణ దిశగా పెట్టెను ఉంచాడు. ఈ పెట్టె యెహోవా ఆలయానికి ప్రజలు వచ్చే ద్వారానికి ప్రక్కగా వున్నది. కొందరు యాజకులు ఆలయంలోని ఆ ద్వారాన్ని కాపలా కాసారు. యెహోవాకి ప్రజలు సమర్పించిన డబ్బును ఆ యాజకులు తీసుకుని, ఆ పెట్టలో వేశారు.

10 తర్వాత ఆలయానికి వెళ్లినప్పుడల్లా ప్రజలు ఆ పెట్టెలో డబ్బు వేయడం మొదలుపెట్టారు. రాజుగారి కార్యదర్శి, ప్రధాన యాజకుడు ఆ పెట్టెలో డబ్బు చాలా ఉండడం చూసివప్పుడు, వారు ఆ పెట్టె నుండి డబ్బు తీసుకొని, ఆ డబ్బును సంచులలో వేసి లెక్కించారు. 11 యెహోవా ఆలయాన పనిచేసే వారికి వారు ఆ డబ్బు ఇచ్చి వేశారు. వడ్రంగులు మరి ఇతర ఆలయ కాపరులకు డబ్బు ఇచ్చారు. 12 రాళ్లు చెక్కే వారికి రాళ్లు మోసేవారికి ఇవ్వడానికి ఆ డబ్బు వినియోగించారు. మరియు కలపకొనడానికి, రాళ్లు ముక్కలు చేయడానికి, ఆలయ మరమ్మతు పనులకు వారు ఆ డబ్బు వినియోగించారు.

13-14 యెహోవా ఆలయానికి ప్రజలు డబ్బు ఇచ్చారు. కాని యాజకులు ఆ డబ్బును వెండి కప్పులు, దీపాలు వెలిగించేందుకు వుపయోగించే కప్పులు, గిన్నెలు, బూరలు, బంగారం, వెండి పాత్రలు చేసేందుకు వినియోగించలేక పోయారు. ఆ డబ్బు పనివారికి ఇవ్వబడింది. ఆ పని వారు యెహోవా ఆలయాన్ని బాగు చేశారు. 15 ఆ డబ్బునంతా ఎవ్వరూ లెక్కించలేదు. ఆ డబ్బు ఏమి చేయబడినదో చెప్పమని ఏ పనివానిని నిర్భంధించ లేదు. ఎందుకనగా పనివారు నమ్మకస్థులుగా ఉన్నారు.

16 అపరాధ పరిహారార్థ బలులు, పాపపరిహారార్థ బలులు సమర్పించు సమయములో ప్రజలు ఆ డబ్బు ఇచ్చారు. ఆ డబ్బు పనివారికి ఇవ్వబడడం జరిగేదికాదు. ఆ డబ్బు యాజకులకు చెందినది.

హాజాయేలు నుండి యోవాషు యెరూషలేమును రక్షించుట

17 సిరియారాజు హాజాయేలు. గాతు నగరానికి ప్రతికూలంగా యుద్ధం చేయడానికి హజాయేలు వెళ్లాడు. హజాయేలు గాతుని ఓడించాడు. తర్వాత అతను యెరూషలేముకు ప్రతికూలంగా యుద్ధం చేయడానికి నిశ్చయించాడు.

18 యెహోషాపాతు, యెహోరాము, అహజ్యాలు యూదా రాజులుగా వున్నారు. వారు యోవాషు పూర్వికులు. వారు యెహోవాకు చాలా వస్తువులు సమర్పించారు. ఆ వస్తువులు ఆలయంలో ఉంచబడ్డాయి. యోవాషు కూడా చాలా వస్తువులు యెహోవాకు సమర్పించాడు. యోవాషు ఆలయంలోవున్న అన్ని వస్తువులు, బంగారం తీసుకున్నాడు. తన యింట్లో ఉన్న వాటిని కూడా తీసుకున్నాడు. తర్వాత యోవాషు ఆ విలువగల వస్తువులను సిరియా రాజైన హజాయేలుకు పంపాడు. అప్పుడు హజాయేలు యెరూషలేమునుండి వెళ్లిపోయాడు.

యోవాషు మరణం

19 యోవాషు చేసిన అన్ని ఘనకార్యాలు “యూదా రాజుల చరిత్ర” అనే గ్రంథంలో వ్రాయబడినవి.

20 యోవాషు అధికారులు అతనికి విరుద్ధంగా పథకం వేశారు. వారు సిల్లాకి వెళ్లే మార్గమున ఉన్న మిల్లో అనే ఇంట్లో యోవాషును చంపివేశారు. 21 షిమాతు కుమారుడైన యోజాకారు[a], షోమేరు కుమారుడైన యెహోజాబాదు యోవాషు అధికారులు. వారు యోవాషుని చంపివేశారు.

దావీదు నగరంలో అతని పూర్వికులతో పాటుగా యోవాషుని సమాధి చేశారు. యోవాషు కుమారుడైన అమజ్యా అతని తర్వాత క్రొత్తగా రాజయ్యాడు.

యెహోయాహాజు తన పరిపాలన ప్రారంభించుట

13 యెహూ కుమారుడైన యెహోయాహాజు షోమ్రోనులోని ఇశ్రాయేలుకు రాజయ్యాడు. అహజ్యా కుమారుడైన యోవాషు యూదా రాజుగా ఉన్న 23వ సంవత్సరమున ఇది జరిగింది. యెహోయాహాజు 17 ఏళ్లపాటు పరిపాలించాడు.

యెహోయాహాజు యెహోవా తప్పు అని చెప్పిన పనులను చేశాడు. ఇశ్రాయేలును పాపానికి గురిచేసిన నెబాతు కుమారుడు యరొబాము పాపాలను యెహోయాహాజు అనుసరించాడు. యెహోయాహాజు వీటిని చేయడం మానలేదు. అప్పుడు యెహోవా ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా కోపగించెను. సిరియా రాజయిన హజాయేలు, హజాయేలు కుమారుడైన బెన్హదదులకు యెహోవా ఇశ్రాయేలు దేశపు అధికారాన్ని ఇచ్చెను.

ఇశ్రాయేలు ప్రజల మీద యెహోవా దయ

తర్వాత యెహోయాహాజు తనకు సహాయం చేయమని యెహోవాను ప్రార్ధించాడు. యెహోవా అతని మొర ఆలకించాడు. ఇశ్రాయేలు కష్టాలను యెహోవా చూశాడు. సిరియా రాజు ఇశ్రాయేలు వారిని ఎలా కష్టపెట్టెనో కూడా చూశాడు.

అందువల్ల ఇశ్రాయేలుని కాపాడేందుకు ఒక వ్యక్తిని యెహోవా పంపాడు. ఇశ్రాయేలువారు సిరియావారి నుండి విడిపింపబడ్డారు. అందువల్ల ఇశ్రాయేలువారు పూర్వం చేసినట్లుగా, తమ ఇళ్లకు పోయారు.

కాని ఇశ్రాయేలువారు ఇశ్రాయేలును పాపానికి గురి చేసిన యరొబాము కుటింబీకుల పాపాలను ఆపలేదు. యరొబాము చేసిన పాపాలను వారు కొనసాగించారు. వారు షోమ్రోనులో అషెరా స్తంభాలు ఉంచారు.

సిరియా రాజు యెహోయాహాజు యొక్క సైన్యాన్ని ఓడించి సైన్యంలోని చాలామందిని సిరియా రాజు నాశనం చేశాడు. అతను ఏబై మంది గుర్రాల సైనికులను, పదిరథాలను, పదివేలమంది సైనికులను మాత్రమే విడిచిపెట్టాడు. యెహోయాహాజు యొక్క సైనికులు నూర్పిడి సమయాన గాలికి చెదరకొట్టబడే పొట్టువంటి వారైనారు.

యెహోయాహాజు చేసిన ఘనకార్యాలన్నీ “ఇశ్రాయేలు రాజుల చరిత్ర” అనే గ్రంథంలో వ్రాయబడ్డాయి. యెహోయాహాజు మరణించగా, అతని పూర్వికులతో పాటు అతను సమాధి చేయబడ్డాడు. షోమ్రోనులో ప్రజలతనిని సమాధి చేశారు. యెహోయాహాజు కుమారుడు యెహోయాషు అతని తర్వాత క్రొత్తగా రాజయ్యాడు.

యెహోయాషు ఇశ్రాయేలుని పాలించుట

10 యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు షోమ్రోనులోని ఇశ్రాయేలుకు రాజయ్యాడు. యూదా రాజుగా యెహోయాషు పరిపాలించిన 37వ సంవత్సరంలో ఇది జరిగింది. యెహోయాషు ఇశ్రాయేలీయులను 16 సంవత్సరాలు పరిపాలించాడు. 11 యెహోవా తప్పు అని చెప్పిన కార్యాలను యెహోయాషు జరిగించాడు. నెబాతు కుమారుడైన యరొబాము ఇశ్రాయేలు పాపకార్యాలకు గురిచేసిన ఆ చెడు కార్యాలను అతను నివారించలేక పోయాడు. యెహోయాషు ఆ పాపాలు కొనసాగించాడు. 12 యెహోయాషు చేసిన ఆ ఘనకార్యాలు అతను యూదా రాజయిన అమాజ్యాకు ప్రతికూలంగా చేసిన యుద్ధాలు “ఇశ్రాయేలు రాజుల చరిత్ర” అనే గ్రంథంలో వ్రాయబడ్డాయి. 13 యెహోయాషు మరిణించగా, అతని పూర్వికులతో పాటుగా అతడు సమాధి చేయబడ్డాడు. యరొబాము క్రొత్తగా రాజయ్యాడు. యెహోయాషు సింహాసనం మీద యెరొబాము ఆసీనుడయ్యాడు. యెహోయాషు ఇశ్రాయేలు రాజులతో పాటు షోమ్రోనులో సమాధి చేయబడ్డాడు.

యెహోయాషు ఎలీషాని సందర్శించుట

14 ఎలీషా జబ్బు పడ్డాడు. తర్వాత ఎలీషా ఆ జబ్బుతో మరణించాడు. ఇశ్రాయేలు రాజయిన యెహోయాషు ఎలీషాని సందర్శించడానికి వెళ్లి, ఎలీషా కోసం విలపించాడు. “నా తండ్రీ, నా తండ్రీ! ఇశ్రాయేలువారి రథాలకు, గుర్రాలకు ఇది సమయమేనా?”[b] అని అడిగాడు.

15 యెహోయాషుతో, “విల్లు, కొన్ని బాణాలు తీసుకొనుము” అని ఎలీషా చెప్పాడు.

యెహోయాషు ఒక విల్లు, కొన్ని బాణాలు తీసుకున్నాడు. 16 అప్పుడు ఎలీషా ఇశ్రాయేలు రాజుతో ఇలా చెప్పాడు: “వింటిమీద నీ చేయి వేయుము.” యెహోయాషు వింటిమీద తన చేయి వేశాడు. తర్వాత ఎలీషా రాజు చేతులమీద తన చేతులు ఉంచాడు. 17 “తూర్పు కిటికి తెరువుము” అని ఎలీషా చెప్పాడు. యెహోయాషు కిటికి తెరిచాడు. తర్వాత, “గురిచూసి బాణం వదులుము” అని ఎలీషా చెప్పాడు.

యెహోయాషు బాణం వదిలాడు. అప్పుడు ఎలీషా, “అది యెహోవా యొక్క విజయాస్త్రం! సిరియా మీద విజయాస్త్రం. నీవు సిరియన్లను అఫెకు అనే చోట ఓడిస్తావు. మరియు వారిని నాశనం చేస్తావు” అని చెప్పాడు.

18 “బాణాలు తీసుకో” అని ఎలీషా చెప్పాడు. యెహోయాషు బాణాలు తీసుకున్నాడు. అప్పుడు ఇశ్రాయేలు రాజుతో, “నేల మీద కొట్టుము” అని ఎలీషా చెప్పాడు.

మూడుసార్లు యెహోయాషు నేలను కొట్టాడు. తర్వాత ఆపివేశాడు. 19 దైవజనుడు అయిన ఎలీషా యెహోయాషుపై కోపగించాడు. “నీవు ఐదు లేక ఆరుసార్లు కొట్టి వుండవలసింది. అప్పుడు నీవు సిరియాను నాశనమయ్యేంత వరకు ఓడించేవాడివి. కాని ఇప్పుడు నీవు సిరియాని మూడు సార్లు మాత్రమే ఓడించగలవు” అని ఎలీషా చెప్పాడు.

ఎలీషా సమాధిలో ఆశ్చర్యకరమైన విషయం

20 ఎలీషా మరణించగా, ప్రజలతనిని సమాధి చేశారు.

వసంత ఋతువులో ఒకసారి, మోయాబు సైనిక బృందం ఇశ్రాయేలుకు వచ్చింది. యుద్ధంలోని వస్తువులను తీసుకోడానికి వారు వచ్చారు. 21 కొందరు ఇశ్రాయేలువారు చనిపోయిన ఒక వ్యక్తిని సమాధి చేస్తూ ఉన్నారు. వారు సైనిక బృందాన్ని చూశారు. ఇశ్రాయేలు వారు ఆ చనిపోయిన వ్యక్తిని ఎలీషా సమాధిలోకి విసరివేసి పారిపోయారు. ఎలీషా ఎముకలను ఆ చనిపోయిన వ్యక్తి తాకగానే, సజీవుడయ్యాడు; తన కాళ్ల మీద నిలబడగలిగాడు!

యెహోయాషు ఇశ్రాయేలు నగరాలను జయించుట

22 యెహోయాషు పరిపాలించిన ఆ రోజులలో, సిరియా రాజయిన హజాయేలు ఇశ్రాయేలుకు ఇబ్బంది కలిగించాడు. 23 కాని యెహోవా ఇశ్రాయేలు వారిపట్ల దయ వహించాడు. యెహోవా దయాళుడు. ఇశ్రాయేలు వారివైపు తిరిగినాడు మరియు వారిని నాశనం చేయలేదు. ఎందుకంటే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన ఒడంబడిక వల్ల, యెహోవా ఇశ్రాయేలు వారిని నాశనం చేయడు; ఇకను వారిని విసర్జించడు.

24 సిరియా రాజయిన హజాయేలు మరణించాడు. అతని తర్వాత అతని కుమారుడు బెన్హదదు క్రొత్త రాజయ్యాడు. 25 అతను మరణించడానికి పూర్వం, యుద్ధంలో హజాయేలు కొన్ని నగరాలను యెహోయాషు తండ్రి అయిన యెహోయాహాజు నుండి తీసుకొనెను. కాని ఇప్పుడు యెహోయాషు హజాయేలు కుమారుడైన బెన్హదదు నుండి యీ నగరాలు మరల పొందెను. యెహోయాషు, బెన్హదదును మూడుసార్లు ఓడించి, ఇశ్రాయేలు నగరాలను మరల తీసుకున్నాడు.

అమాజ్యా యూదాలో తన పరిపాలన ప్రారంభించుట

14 యూదా రాజయిన యోవాషు కుమారుడైన అమాజ్యా యెహోయాహాజు కొడుకైన యోవాషు ఇశ్రాయేలు రాజుగా వున్న రెండవ సంవత్సరమున యూదాకు రాజయ్యాడు. అమాజ్యా పరిపాలన ప్రారంభించేనాటికి 25 యేళ్లవాడు. యెరూషలేములో అమాజ్యా 29 సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు యెహోయద్దాను. యెహోవా మెచ్చుకున్న పనులు అమాజ్యా జరిగించాడు. తన పూర్వికుడైన దావీదువలె అతను పూర్తిగా దేవుని అనుసరించలేదు. తన తండ్రి అయిన యోవాషు చేసిన పనులన్నీ అతను చేశాడు. అతను ఉన్నత స్థానాలను నాశనం చేయలేదు. ఆ ఆరాధనా స్థలాలలో ఆ నాటికీ ప్రజలు బలులు అర్పించుచూ, ధూపం వేస్తూ ఉన్నారు.

అమాజ్యాకు తన రాజ్యం మీద మంచి అదుపు వున్న ఆ సమయమున, తన తండ్రిని చంపిన అధికారులను అతను చంపాడు. కాని హంతకుల పిల్లలను అతను చంపలేదు. యెహోవా మోషే ధర్మశాస్త్రంలో ఈ ఆజ్ఞను ఇచ్చాడు; “తమ పిల్లలు చేసినదానికి వారి తల్లిదండ్రులను చంపకూడదు. తమ తల్లిదండ్రులు చేసిన దానికి వారి పిల్లలను చంపకూడదు. అతనే స్వయంగా చేసిన చెడు పనికి అతనినే చంపవలెను.”(A)

అమాజ్యా ఉప్పు లోయలో పదివేల మంది ఎదోము వాళ్లను చంపాడు. యుద్ధంలో అమాజ్యా సెలా అనే స్థలాన్ని “యొక్తయేలు” అని వ్యవహరించాడు. ఆ స్థలం నేటికీ “యొక్తయేలు” అని పిలువ బడుచున్నది.

అమాజ్యా యెహోయాషుకి ప్రతికూలంగా యుద్ధం కోరుకొనుట

అమాజ్యా యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు వద్దకు దూతల్ని పంపాడు. యెహోయాహాజు ఇశ్రాయేలు రాజయిన యెహూ కుమారుడు. “మనము ముఖాముఖిగా కలుసుకుని యుద్ధం చేద్దాము” అని అమాజ్యా సందేశం పంపించాడు.

ఇశ్రాయేలు రాజయిన యెహోయాషు యూదా రాజయిన అమాజ్యకు తిరిగి వ్రాశాడు. యెహోయాషు ఇలా చెప్పాడు. “లెబానోను దేవదారు చెట్టుకి లెబానోనులోని ముళ్లపొద ఒక సందేశం పంపింది. అది ఏమనగా, నీవు నీ కుమార్తెను నా కుమారుడికి పెళ్లి చేసుకునేందుకు యిమ్ము. కాని లెబానోనులోని ఒక దుష్ట మృగం ఆ త్రోవను వెళుతూ ముళ్లపొద మీద నడిచింది. నీవు ఎదోముని ఓడించిన మాట నిజమే. 10 కాని నీవు ఎదోము మీద పొందిన విజయానికి నీవు గర్వపడుతున్నావు. నీవు ఎదోములో వుండి మిడిసిపడుతున్నావు. ఇంతకు నీవు ఎందుకు ఆపద తెచ్చుకుంటావు. నీవు ఇలా చేస్తే, నీవు పతనంకాగలవు. మరియు యూదా నీతో పాటు నాశనం కాగలదు.”

11 కాని అమాజ్యా యెహోయాషు ఇచ్చిన హెచ్చరికను లెక్కచేయలేదు. అందువల్ల ఇశ్రాయేలు రాజైన యెహోయాషు యూదా రాజైన అమాజ్యాకు ప్రతి కూలంగా బేత్షెమెషు అనే చోట యుద్ధం చేయడానికి వెళ్లాడు. 12 ఇశ్రాయేలు యూదాను ఓడించాడు. యూదాకు చెందిన ప్రతి వ్యక్తి పారిపోయాడు. 13 బేత్షెమెషు వద్ద ఇశ్రాయేలు రాజైన యెహోయాషు యూదా రాజైన అమాజ్యాను బంధించాడు. అమాజ్యా యెవాషు కుమారుడు. అతను అహజ్యా కుమారుడు. యెహోయాషు అమాజ్యాను యెరూషలేముకు తీసుకువెళ్లాడు. యెహోయాషు ఎఫ్రాయీము ద్వారం నుంచి కోట ద్వారం, 600 అడుగుల యెరూషలేము ప్రాకారమును పగలగొట్టాడు. 14 తర్వాత యెహోయాషు యెహోవా ఆలయం లోని బంగారం, వెండి, వస్తువులను రాజభవనంలోని నిధులను తీసుకుపోయాడు. యెహోయాషు ప్రజలను కూడా తన బందీలుగా తీసుకుపోయాడు. తర్వాత అతను షోమ్రోనుకు తిరిగి వెళ్లాడు.

15 యెహోయాషు చేసిన ఘనకార్యములు యూదా రాజయిన అమాజ్యాతో అతను పోరాడిన విధంతో సహా “ఇశ్రాయేలు రాజ్య చరిత్ర” అనే గ్రంథంలో వ్రాయబడి వున్నవి. 16 యెహోయాషు మరణించగా, అతనిని అతని పూర్వికులతో పాటు సమాధి చేశారు. ఇశ్రాయేలు రాజులతో పాటుగా షోమ్రోనులో యెహోయాషు సమాధి చేయబడ్డాడు. యెహోయాషు కుమారుడు యరొబాము, అతని తర్వాత క్రొత్తగా రాజయ్యాడు.

అమాజ్యా మరణం

17 ఇశ్రాయేలు రాజైన యెహోయాహాజు కుమారుడు యెహోయాషు మరణించిన 15 సంవత్సరాల వరకు యూదా రాజయిన యెవాషు కుమారుడు అమాజ్యా బ్రదికాడు. 18 అమాజ్యా జరిగించిన ఘనకార్యాలన్నీ “యూదా రాజుల చరిత్ర” అనే గ్రంథంలో వ్రాయబడివున్నాయి. 19 యెరూషలేములో ప్రజలు అమాజ్యాకు ప్రతి కూలంగా ఒక పధకం వేశారు. అమాజ్యా లాకీషుకు పారిపోయాడు. కాని ప్రజలు లాకీషుకు అమాజ్యా వెనుకాల కొందరు వ్యక్తులను పంపారు. ఆ వ్యక్తులు లాకీషులో అమాజ్యాను చంపివేశారు. 20 ప్రజలు అమాజ్యా దేహాన్ని గుర్రాల మీద వెనక్కి తీసుకువచ్చి, దావీదు నగరంలో అతని పూర్వికులతో పాటు అమాజ్యాను సమాధి చేశారు.

అజర్యా యూదా మీద తన పరిపాలన ప్రారంభించుట

21 తర్వాత యూదాలోని మనుష్యులందురు అమాజ్యా కుమారుడైన అజర్యాను క్రొత్త రాజుగా చేశారు. అజర్యా 16 యేండ్లవాడు. 22 అమాజ్యా రాజు మరణించగా, అతని పూర్వికులతో పాటు అతనిని సమాధి చేశారు. తర్వాత అజర్యా ఏలతు పట్టణం మరల నిర్మించి, దానిని యూదాకు స్వాధీన పరిచాడు.

రెండవ యరొబాము ఇశ్రాయేలు మీద తన పరిపాలన ప్రారంభించుట

23 యూదా రాజుగా యోవాషు కుమారుడైన అమాజ్యా పరిపాలనలో 15వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజైన యెహోయాషు కుమారుడు యరొబాము సమరియాలో పరిపాలన ప్రారంభించెను. యరొబాము 41 సంవత్సరాలు పరిపాలించాడు. 24 యెహోవా తప్పు అని చెప్పిన కార్యములు ఈ యరొబాము చేశాడు. నెబాతు కుమారుడు యరొబాము ఇశ్రాయేలు పాపాలకు కారణమైన ఆ పాపకార్యములను యరొబాము ఆపలేదు. 25 హమాతు నుండి అరబా సముద్రం దాకా వ్యాపించిన ఇశ్రాయేలు దేశమును యరొబాము మరల తీసుకున్నాడు. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా తన భక్తుడైన అమిత్తయి కుమారుడు యోనాకు చెప్పినట్లు ఇది జరిగింది. అమిత్తయి గత్హేపెరు నుండి వచ్చిన ఒక ప్రవక్త. 26 ఇశ్రాయేలు వారందరికీ చాలా ఇబ్బందులున్నాయని యెహోవా చూశాడు. బానిసలు, స్వతంత్రులూ వున్నారని చూశాడు. ఇశ్రాయేలుకు సహాయం చేయదగిన వ్యక్తి ఎవరూ లేరు. 27 ప్రపంచంలో ఇశ్రాయేలు అన్న పేరుని తీసివేస్తానని యెహోవా చెప్పలేదు. అందువల్ల యెహోవా యెహోయాషు కుమారుడైన యరొబాముని ఇశ్రాయేలు ప్రజలను రక్షించేందుకు ఏర్పాటు చేసాడు.

28 యరొబాము చేసిన ఘనకార్యాలన్ని “ఇశ్రాయేలు రాజుల చరిత్ర” అనే గ్రంథంలో వ్రాయబడినవి. ఇశ్రాయేలుకు గాను దమస్కు మరియు హమాతులను యరొబాము తిరిగి పొందిన కథకూడా ఇందులో పొందుపరచబడింది. (ఈ నగరాలు యూదాకి చెందినవి). 29 యరొబాము మరణించగా, ఇశ్రాయేలీయుల రాజులైన అతని పూర్వికులతో పాటుగా అతను సమాధి చేయబడ్డాడు. యరొబాము కుమారుడైన జెకర్యా, అతని తర్వాత క్రొత్తగా రాజయ్యాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International