Beginning
ఏలీయా మరియు బయలు ప్రవక్తలు
18 వర్షాలు లేకుండా పోయి మూడు సంవత్సరాలయ్యింది. అప్పుడు యెహోవా ఏలీయాతో, “నీవు వెళ్లి రాజైన అహాబును కలుసుకో. నేను త్వరలో వర్షం కురిసేలా చేస్తాను” అని చెప్పాడు. 2 కావున ఏలీయా అహాబును కలిసేటందుకు వెళ్లాడు.
అప్పుడు షోమ్రోనులో క్షామం నెలకొన్నది. 3 రాజైన అహాబు ఓబద్యాను పిలిపించాడు. ఓబద్యా రాజభవన నిర్వాహకుడుగా పని చేస్తున్నాడు. (ఓబద్యా యెహోవాకు నిజమైన అనుచరుడు.) 4 ఒకసారి యెజెబెలు యెహోవా ప్రవక్తలందరినీ చంపటం మొదలు పెట్టింది. అప్పుడు ఓబద్యా నూరుమంది ప్రవక్తలను చేరదీసి, వారిని రెండు గుహలలో దాచాడు. ఓబద్యా ఏబది మందిని ఒక గుహలోను, మరో ఏబది మందిని ఒక గుహలోను దాచాడు. ఓబద్యా వారికి ఆహార పానీయాలు ఇచ్చి కాపాడాడు. 5 రాజైన అహాబు ఓబద్యాతో ఇలా అన్నాడు: “నాతో కలిసిరా. మనిద్దరం దేశంలో వున్న నీటి వనరులన్నీ పరిశీలిద్దాము. మన గుర్రాలు, కంచర గాడిదలు బతకటానికి తగిన పచ్చగడ్డి దొరుకుతుందేమో చూద్దాం. అప్పుడు మన పశువులను చంపే అవసరము వుండదు.” 6 నీటి వనరులు వెదకటానికి ఎవరేదిశకు వెళ్లాలో వారు నిర్ణయించుకున్నారు. వారిద్దరూ దేశమంతా తిరగనారంభించారు. అహాబు ఒక దిశలో వెళ్లాడు. ఓబద్యా మరోదిశలో వెళ్లాడు. 7 ఓబద్యా ప్రయాణం చేస్తూండగా అతడు ఏలీయాను కలిశాడు. ఏలీయాను చూడగానే, అతనెవరో ఓబద్యా తెలుసుకున్నాడు. ఓబద్యా ఏలీయాకు సాష్టాంగ నమస్కారం చేసి, “నీవు నా యజమానివైన ఏలీయావే గదా?” అని అడిగాడు.
8 “అవును నేనే. నీవు వెళ్లి నేనిక్కడ వున్నానని నీ యజమానియగు రాజుకు తెలియజేయి” అని ఏలీయా సమాధానం చెప్పాడు.
9 అందుకు ఓబద్యా ఇలా అన్నాడు: “నేను అహాబుతో నీవెక్కడ వున్నదీ నాకు తెలుసునని చెప్పితే అతడు నన్ను చంపుతాడు! నీ పట్ల నేనేమీ అపచారం చేయలేదు! నేను చనిపోవాలని నీవెందుకు కోరు కుంటున్నావు? 10 నీ దేవుడైన యెహోవా సాక్షిగా చెబుతున్నాను. రాజు నీ కొరకై ప్రతి చోటా చూస్తూన్నాడు! నిన్ను వెదకమని తన మనుష్యులను అన్ని దేశాలకు పంపాడు. ఏ పాలకుడైనా తన దేశంలో నీవు లేవని చెపితే అహాబు అంతటితో ఆగక నీవతని రాజ్యంలో లేవని ప్రమాణం చేయమని బలవంతపెట్టు తున్నాడు. 11 ఈ పరిస్థితుల్లో నేను వెళ్లి నీవిక్కడ వున్నావని చెప్పమంటున్నావా? 12 ఒకవేళ నేను పోయి రాజైన అహాబుతో నీవిక్కడ వున్నావని చెపితే, ఈ లోపు యెహోవా నిన్ను ఇక్కడ నుంచి మరో చోటికి తీసుకుని పోవచ్చు. రాజైన అహాబు వచ్చి నీవిక్కడ లేకపోవటం చూచి, నన్ను చంపేస్తాడు! నేను నా బాల్యం నుండి యెహోవాను ఆశ్రయించియున్నాను. 13 నేను ఏమి చేశానో నీవు వినే వుంటావు! యెజెబెలు యెహోవా యొక్క ప్రవక్తలందరినీ చంపుతూండగా, నేను వంద మంది ప్రవక్తలను గుహలలో దాచాను. ఏభై మంది ప్రవక్తలను ఒక గుహలోను, మరో ఏభై మందిని వేరొక గుహలోను దాచాను. వారికి అన్న పానాదులిచ్చి ఆదుకున్నాను. 14 ఇప్పుడు నన్ను వెళ్లి నీవిక్కడ వున్నట్లు రాజుతో చెప్పమంటున్నావు. రాజు నన్ను చంపేస్తాడు!”
15 అది విన్న ఏలీయా, “సర్వశక్తిమంతుడైన యెహోవా సాక్షిగా ఈ రోజు నేను రాజు ముందు నిలుస్తానని ప్రమాణం చేస్తున్నాను” అని అన్నాడు.
16 అందువల్ల ఓబద్యా రాజైన అహాబు వద్దుకు వెళ్లాడు. ఏలీయా ఎక్కడ వున్నదీ అతనికి చెప్పాడు. రాజైన అహాబు ఏలీయాను చూడటానికి వెళ్లాడు.
17 ఏలీయాను అహాబు చూచి, “నీవేనా? ఇశ్రాయేలులో కల్లోలం సృష్టించే వాడివి నీవే కదా!” అని అన్నాడు.
18 ఏలీయా ఇలా అన్నాడు, “నేను ఇశ్రాయేలులో కల్లోలం సృష్టించటం లేదు. కష్టాలన్నీ నీ మూలంగా, నీ తండ్రి కుటుంబం వారివల్ల వచ్చినవే. యెహోవా ఆజ్ఞలను తిరస్కరిస్తూ, బూటకపు దేవుళ్లను పూజిస్తూ, నీవే ఈ కష్టాలన్నిటికీ కారకుడవయ్యావు. 19 ఇశ్రాయేలీయులందరినీ ఇప్పుడు కర్మెలు పర్వతం వద్ద నన్ను కలవమని సమాచారం పంపు. పైగా నాలుగు వందల ఏభై మంది బయలు దేవత ప్రవక్తలను, నాలుగు వందల మంది బూటకపు దేవత అషేరా ప్రవక్తలను అక్కడికి తీసుకొనిరా. రాణీ యెజెబెలు ఈ ప్రవక్తలందరినీ పోషిస్తూ[a] వున్నది.”
20 పిమ్మట అహాబు ఇశ్రాయేలు వారందరినీ, ఆ ప్రవక్తలను కర్మెలు పర్వతం వద్దకు పిలువనంపాడు. 21 ఆ ప్రజలందరి వద్దకు ఏలీయా వచ్చాడు. అతడు వారినుద్దేశించి, “మీరంతా ఎవరిని అనుసరించాలనేది ఎప్పుడు నిర్ణయిస్తారు? యెహోవా నిజమైన దేవుడైతే మీరాయనను అనుసరించండి. బయలు నిజమైన దేవత అయితే మీరా దేవతను అనుసరించండి” అని అన్నాడు.
ప్రజలు ఏమీ మాట్లాడలేదు. 22 అందువల్ల ఏలీయా ఇలా అన్నాడు: “ఇక్కడ నేనొక్కడినే యెహోవాయొక్క వ్రవక్తను. నేను ఒంటరిగా వున్నాను. కాని నాలుగు వందల ఏభై మంది బయలు ప్రవక్తలున్నారు. 23 కావున మీరు రెండు ఆబోతులను తీసుకునిరండి. వాటిలో ఒక దానిని బయలు ప్రవక్తలను తీసుకోనివ్యండి. వారు దానిని చంపి ముక్కలు చేయనీయండి. ఆ మాంసాన్ని ఒక చితిపై వుంచండి. కాని ఆ చితికి నిప్పు పెట్టవద్దు. నేను కూడ ఆ రెండవ ఆబోతును అలాగే చేస్తాను. నేనూ ఆ చితికి నిప్పు అంటించను. 24 బయలు దేవత ప్రపక్తలారా! మీరు మీ దేవునికి ప్రార్థించండి. నేను నా యెహోవాను ప్రార్థిస్తాను. ఏ దేవుడైతే ప్రార్థనలను ఆలకించి, చితిని రగిలింప చేస్తాడో అతడే నిజమైన దేవుడు.”
ప్రజలంతా ఇది మంచి ఆలోచన అని ఒప్పుకున్నారు.
25 బయలు ప్రవక్తలతో మళ్లీ ఏలీయా ఇలా అన్నాడు: “మీరు చాలా మంది వున్నారు. కనుక పని మీరు ముందు మొదలు పెట్టండి. ఒక ఆబోతును ఎన్నుకుని తయారు చెయ్యండి. కాని నిప్పు మాత్రం రగల్చకండి.”
26 కావున ఆ ప్రవక్తలు తమకివ్వబడిన ఆబోతును తీసుకున్నారు. దానిని తయారు చేశారు. వారు బయలు దేవతకు మధ్యాహ్నం వరకు ప్రార్థనలు చేశారు. “ఓ బయలు దేవతా! మా ప్రార్థనలు ఆలకించు!” అని వేడుకున్నారు. కాని ఎటువంటి చప్పుడూ లేదు. ఎవ్వరూ సమాధాన మియ్యలేదు. వారు నిర్మించిన బలిపీఠం చుట్టూ ప్రవక్తలు నాట్యం చేశారు. కానీ నిప్పు రాజలేదు.
27 మధ్యాహ్నమైనప్పుడు ఏలీయా వారిని హేళన చేయనారంభించాడు: “బయలు నిజంగా దైవమైతే మీరు బిగ్గరగా ప్రార్థన చేయాల్సివుంటుందేమో! బహుశః అతడు ఆలోచిస్తూ ఉండవచ్చు! లేక అతడు చాలా పని ఒత్తిడిలో ఉండవచ్చు. లేక అతను ప్రయాణం చేస్తూ ఉండవచ్చు! అతడు నిద్రపోతూ ఉండవచ్చు! బహుశః మీరతనిని లేపవలసి ఉంటుంది!” అంటూ అపహాస్యం చేశాడు ఏలీయా. 28 అందువల్ల ఆ ప్రవక్తలు బిగ్గరగా ప్రార్థనలు చేయనారంభించారు. వారు కత్తులతోను, ఈటెలతోను శరీరమంతా చీరుకున్నారు. (అది వారి ఆరాధనా తీరు) వారు రక్తం కారేలాగు ఒళ్లు చీరుకున్నారు. 29 మధ్యాహ్న సమయం దాటి పోయింది. అయినా నిప్పు అంటుకోలేదు. సాయంత్రపు బలుల సమయం అయ్యేవరకు ఆ ప్రవక్తలు తమ భయానక చేష్టలు[b] సాగించారు. బయలు వద్దనుండి సమాధానం లేదు. చితికి ఏమీ జరగలేదు.[c]
30 అప్పుడు ఏలీయా ప్రజలతో, “నా వద్దకు రండి” అని అన్నాడు. వారంతా ఏలీయా చుట్టూ చేరారు. బేతేలులో ఉన్న యెహోవా యొక్క బలిపీఠం నాశనం చేయబడింది. ఏలీయా దానిని మళ్లీ నిర్మించాడు. 31 ఏలీయా పన్నెండు రాళ్లను తీసుకున్నాడు. ఒక్కొక్క గోత్రానికి ఒక్కోక్క రాయి చొప్పున ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలకు పన్నెండు రాళ్లను తీశాడు. యాకోబు పన్నెండు మంది కుమారుల పేర్లతో ఈ గోత్రాలు పిలవబడుతూ వున్నాయి. యాకోబునే యెహోవా ఇశ్రాయేలని పిలిచాడు. 32 ఏలీయా ఈ రాళ్లను యెహోవా గౌరవార్థం బలిపీఠాన్ని నిర్మించటానికి ఉపయోగించాడు. పీఠం చుట్టూ ఏలీయా చిన్న కందకం తవ్వించాడు. అది రెండు షియాల[d] విత్తనాలు నీటితో సహా పట్టేటంత వెడల్పు, లోతుకలిగివుంది. 33 అప్పుడు ఏలీయా కట్టెనంతా బలిపీఠంపై వుంచాడు. అతడు ఆబోతును ముక్కలుగా నరికి, వాటిని పేర్చిన కట్టెలపై వుంచాడు. 34 తరువాత ఏలీయా ప్రజలను నాలుగు జాడీలతో నీరు తీసుకుని మాంసం మీద, కట్టెల మీద చల్లమన్నాడు. వారిని అదే విధంగా మళ్లీ చేయమన్నాడు. ఆయన వారితో మూడవ సారి కూడా అలానే చేయమన్నాడు. 35 ఆ నీరు బలిపీఠం నుండి జారి చుట్టూవున్న కందకాన్ని నింపేసింది.
36 సాయంకాలపు బలులు ఇచ్చే వేళ అయ్యింది. ప్రవక్తయగు ఏలీయా పీఠం వద్దకు వెళ్లి ఇలా ప్రార్థించాడు: “ఓ ప్రభువా! అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవా! ఇశ్రాయేలీయుల దైవం నీవేనని నిరూపించమని నేనిప్పుడు నిన్నడుగుతున్నాను. నేను నీ సేవకుడనని నిరూపించు. ఈ పనులన్నీ చేయమని నన్ను నీవే ఆదేశించినట్లు కూడ ఈ ప్రజలకు తెలియజేయి. 37 ఓ ప్రభువా, నా ప్రార్థన ఆలకించు. ప్రభూ! నీవే దేవుడవని ఈ ప్రజలకు నిరూపించు. అప్పుడు ఈ ప్రజలందరినీ మరల నీవు నీ దగ్గరకు చేర్చుకుంటున్నావని వీరు తెలుసుకుంటారు.”
38 అప్పుడు యెహోవా అగ్ని పంపించాడు. బలిమాంసాన్ని, కట్టెలను, రాళ్లను, బలిపీఠం చుట్టూవున్న ప్రదేశాన్ని అగ్ని దహించి వేసింది. కందకంలో వున్న నీరు కూడ అగ్నివల్ల ఇగిరి పోయింది. 39 ప్రజలంతా ఇది చూశారు. వారు భూమి మీద సాగిలపడి. “యెహోవాయే దేవుడు! యెహోవాయే దేవుడు! అని స్తుతించసాగారు.”
40 అప్పుడు ఏలీయా, “బయలు దేవత ప్రవక్తలందరినీ పట్టుకొనండి. ఒక్కడినీ పారి పోనీయవద్దు!” అని అన్నాడు. ప్రవక్తలందరినీ ప్రజలు పట్టుకున్నారు. ఏలీయా వారందరినీ కీషోను వాగు దగ్గరకు తీసుకుని వెళ్లాడు. అక్కడ ఆ ప్రవక్తలందరినీ చెంపేశాడు.
తిరిగి వర్షాలు పడటం
41 ఏలీయా రాజైన అహాబుతో, “నీవు ఇప్పుడు వెళ్లి అన్నపానాదులు స్వీకరించు. ఒక భారీ వర్షం పడబోతూ వుంది” అని అన్నాడు. 42 రాజైన అహాబు భోజనానికి వెళ్లాడు. అదే సమయంలో ఏలీయా కర్మెలు పర్వతం మీద అతడు వంగి తన మోకాళ్లమధ్య తలను పెట్టాడు. 43 అప్పుడు ఏలీయా తన సేవకునితో సముద్రం చూడమన్నాడు. సముద్రం కనపడే చోటుకు సేవకుడు వెళ్లాడు.
“నేనేమీ చూడలేడు” అని సేవకుడు తిరిగి వచ్చి చెప్పాడు. మళ్లీ వెళ్లి చూడమని ఏలీయా అన్నాడు. ఈ విధంగా ఏడుసార్లు జరిగింది. 44 ఏడవసారి నౌకరు తిరిగి వచ్చి ఒక పిడికెడంత మబ్బును చూసినట్లు చెప్పాడు. అది సముద్రం మీది నుంచి వస్తున్నదని అన్నాడు.
ఏలీయా తన సేవకునితో, “రాజైన అహాబు వద్దకు వెళ్లి తన రథం సిద్ధం చేసుకొని వెంటనే ఇంటికి వెళ్లమని చెప్పు. అతనిప్పుడు వెళ్లకపోతే వర్షం అతనిని ఆపేస్తుంది” అని అన్నాడు.
45 ఆ తరువాత కొద్ది సేవటికే ఆకాశంలో కారుమేఘాలు కమ్ముకొచ్చాయి. భయంకరంగా గాలి, వాన ప్రారంభమైనాయి. అహాబు తన రథమెక్కి యెజ్రెయేలుకు తిరుగు ప్రయాణం సాగించాడు. 46 యెహోవా శక్తి ఏలీయా మీదికి వచ్చింది. ఏలీయా తన బట్టలను నడుముకు బిగించి కట్టి రాజైన అహాబుకంటె ముందుగా యెజ్రెయేలుకు పరుగెత్తికొని వెళ్లాడు.
సీనాయి పర్వతంపై ఏలీయా
19 ఏలీయా చేసిన పనులన్నీ రాజైన అహాబు తన భార్యయగు రాణీ యెజెబెలుకు చెప్పాడు. కత్తి పట్టి ఎలా ప్రవక్తలందరినీ ఏలీయా చంపాడో అహాబు ఆమెకు వివరించాడు. 2 అది విన్న యెజెబెలు ఒక దూతను ఏలీయా వద్దకు పంపింది. ఆమె వర్తమానం ఇలా వుంది: “రేపు ఈ పాటికి నీవు ప్రవక్తలను చంపిన విధంగా నిన్ను నేను చంపుతానని ప్రమాణం చేస్తున్నాను. నేనా పనిలో విజయం సాధించలేని పక్షంలో దేవతలు నన్ను చంపుగాక!”
3 ఇది విన్న ఏలీయా భయపడ్డాడు. తన ప్రాణం కాపాడుకొనేందుకు పారిపోయాడు. అతనితో తన నౌకరును తీసుకుని వెళ్లాడు. వారు యూదాలోని బెయేర్షెబాకు వెళ్లారు. బెయేర్షెబాలో తన నౌకరును ఏలీయా వదిలాడు. 4 తరువాత ఒక రోజంతా ప్రయాణం చేసి ఏలీయా ఎడారిలోకి వెళ్లాడు. ఏలీయా ఒక పొదకింద కూర్చున్నాడు. అతడు చనిపోవాలని కోరుకున్నాడు. ఏలీయా యెహోవానిలా ప్రార్థించాడు: “ప్రభువా, నాకిది చాలు, ఇక నన్ను తీసికొనుము. నా పూర్వికుల కంటె నేను ఉన్నతమైనవాడిని కాను.”
5 ఏలీయా తరువాత చెట్టు కింద పడుకొని నిద్ర పోయాడు. యెహోవా దూత వచ్చి ఏలీయాను తట్టాడు. “నిద్ర లేచి, అహారం తీసుకో!” అన్నాడు దేవదూత. 6 ఏలీయా తన వద్ద నిప్పుల మీద కాల్చిన రొట్టె, ఒక కూజాలో నీరు వున్నట్లు చూశాడు. ఏలీయా ఆ రొట్టెను తిని, నీరు తాగాడు. అతను మరల నిద్రపోయాడు.
7 యెహోవా దేవదూత మళ్లీ అతని వద్దకు వచ్చి, “లేచి ఆహారం తీసుకో, నీవు భోజనం చేయకపోతే నీవు చేయవలసిన వ్రయాణం నీవు నడవలేనంతగా వుంటుంది” అని అన్నాడు. 8 అందుచేత ఏలీయా లేచి అన్న పానాదులు స్వీకరించాడు. ఏలీయా తిన్న ఆహారం అతనికి నలభై రోజులు రాత్రింబగళ్లు నడవగలిగే శక్తి నిచ్చింది. అతడు దేవుని పర్వతం అనబడే హోరేబు పర్వతం వద్దకు వచ్చాడు. 9 అక్కడ ఏలీయా ఒక గుహలోకి వెళ్లి ఆ రాత్రి తలదాచుకున్నాడు.
అక్కడ యెహోవా ఏలీయాతో మాట్లాడి, “ఏలీయా! నీవిక్కడెందుకున్నావు!” అని అడిగాడు.
10 ఏలీయా ఇలా సమాధానం చెప్పాడు: “సర్వశక్తిమంతుడవైన యెహోవా, నేను నిన్ను సదా సేవిస్తూ వచ్చాను. నా శక్తికొలదీ నేను నిన్ను ఆరాధించాను. కాని ఇశ్రాయేలు ప్రజలు నీతో చేసుకున్న ఒడంబడికను భంగపర్చారు. నీ బలిపీఠాలను వారు నాశనం చేశారు. వారు నీ ప్రవక్తలను చంపేశారు. నేనొక్కడినే ప్రవక్తగా ఇంకా జీవించి వున్నాను. ఇప్పుడు వారు నన్నూ చంప జూస్తున్నారు!”
11 అందుకు యెహోవా ఏలీయాతో: “నీవు వెళ్లి పర్వతం మీద నా ముందు నిలబడు. నేను నీ పక్కగా వెళతాను” అని అన్నాడు. యెహోవా అలా చేయగా, ఒక పెనుగాలి వీచింది. ఆ గాలి కొండలను రెండుగా చీల్చివేసింది. యెహోవా ముందు ఆ గాలి పెద్దగుట్టలను పిండి చేసింది. కాని ఆ పెనుగాలి యెహోవా మాత్రం కాదు! గాలి తగ్గిన పిమ్మట ఒక భూకంపం వచ్చింది. ఆ భూకంపం కూడా యెహోవా కాదు. 12 ఆ భూకంపం పోయిన పిమ్మట అగ్ని పుట్టింది. ఆ అగ్నికూడా యెహోవా కాదు. అగ్ని తరువాత ప్రశాంతత నెలకొనగా, ఒక మృదువైన శబ్దం వినవచ్చింది.
13 ఏలీయా ఆ శబ్దాన్ని విన్నప్పుడు తన అంగీతో తన ముఖం కప్పుకున్నాడు. అతను గుహ ద్వారం వద్దకు వెళ్లి నిలబడ్డాడు. ఇంతలో “ఏలీయా, ఇక్కడెందుకున్నావు?” అంటున్న ఒక కంఠ స్వరం విన్నాడు.
14 ఏలీయా ఇలా అన్నాడు: “సర్వశక్తిమంతుడవైన యెహోవా దేవా, శక్తి వంచన లేకుండా నేను నిన్ను సదా సేవిస్తూవచ్చాను. కాని ఇశ్రాయేలు ప్రజలు వారు నీతో చేసుకున్న ఒప్పందానికి విఘాతం కలుగజేశారు. నీకై నిర్మించిన బలిపీఠాలను నాశనం చేశారు. నీ ప్రవక్తలను చంపేశారు. జీవించియున్న ప్రవక్తలు మరెవ్వరూ లేరు నేను మినహా. వారిప్పుడు నన్ను చంపజూస్తున్నారు.”
15 యెహోవా ఇలా అన్నాడు: “నీవు వచ్చిన దారిలోనే తిరిగి దమస్కు ఎడారికి వెళ్లు. నగరంలో ప్రవేశించి హజాయేలును అరాము దేశానికి (సిరియా) రాజుగా అభిషేకించు. 16 పిమ్మట నింషీ కుమారుడైన యెహూను ఇశ్రాయేలుపై రాజుగా అభిషిక్తుని చేయి. తరువాత, ఆబేల్మె హోలావాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు నీ తర్వాత ప్రవక్తగా అభిషేకంచేయి. 17 హజాయేలు ఖడ్గమునుండి తప్పించుకున్న ప్రతివాడినీ యెహూ సంహరిస్తాడు. యెహూ కత్తి పోటునుంచి తప్పించుకున్న ప్రతివాడినీ హజాయేలు చంపేస్తాడు. 18 ఇశ్రాయేలులో ఏడువేల మందిని నేను వదిలి పెడతాను. ఈ ఏడువేల మంది బయలు ముందు ఎన్నడూవంగి నమస్కరించ లేదు. బయలు విగ్రహాల నెన్నడూ వారు ముద్దు పెట్టుకోలేదు.”
ఎలీషా ప్రవక్త అవటం
19 కావున ఏలీయా ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్లాడు షాపాతు కుమారుడైన ఎలీషాను చూశాడు. ఎలీషా ఎద్దులను కట్టి 12 ఎకరాల పొలం దున్నుతున్నాడు. ఏలీయా వచ్చినప్పుడు ఎలీషా చివరి ఎకరాన్ని దున్నుచుండెను. ఏలీయా సరాసరి ఎలీషా వద్దకు వచ్చాడు. ఏలీయా తన అంగీని తీసి ఎలీషా మీద కప్పాడు. 20 అప్పుడు ఎలీషా పొలంలోవున్న తన ఎద్దులను వదిలి పెట్టాడు. అతడు పరుగెత్తి ఏలీయా వద్దకు వెళ్లి, “నన్ను వెళ్లి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని వారి వద్ద వీడ్కోలు తీసుకోనిమ్ము. తరువాత నేను మీతో వస్తాను” అని అన్నాడు.
“అది చాలా మంచిది. వెళ్లు. నిన్ను నేనాపను”[e] అని ఏలీయా అన్నాడు.
21 ఎలీషా వెళ్లి తన ఇంటి వారితో ఒక ప్రత్యేకమైన విందారగించాడు. ఎలీషా వెళ్లి తన ఎద్దులను చంపాడు. ఎడ్లకు కట్టిన కాడి కర్రతో నిప్పుచేసి, ఎడ్ల మాంసాన్ని ఉడకబెట్టాడు. ఆ మాంసాన్ని అందరికీ ఇచ్చాడు. వారంతా ఆ మాంసాన్ని తిన్నారు. ఎలీషా తరువాత ఏలీయాను అనుసరించి వెళ్లాడు. ఎలీషా ఏలీయాకు సహాయకుడయ్యాడు.
బెన్హదదు, అహాబు యుద్ధానికి తలపడుట
20 బెన్హదదు సిరియా రాజు, అతడు తన సైన్యాలన్నిటినీ సమీకరించాడు. తనతో ముప్పై ఇద్దరు రాజులున్నారు. వారికి రథాలు, గుర్రాలు వున్నాయి. వారు సమరియను (షోమ్రోను) ముట్టడించి యుద్ధం చేశారు. 2 ఇశ్రాయేలు రాజైన అహాబు వద్దకు సిరియా రాజు దూతలను పంపాడు. 3 వారు బెన్హదదు మాటగా అహాబుతో ఇలా అన్నారు: “నీవు నీ యొక్క వెండి బంగారాలను నాకు ఇచ్చేయాలి. అంతేగాక నీ భార్యలను, పిల్లలను కూడ తప్పక నాకు ఇచ్చేయాలి.”
4 ఇశ్రాయేలు రాజు ఇలా అన్నాడు: “నా యజమానియైన ఓ రాజా, నేను నీ వాడనని ఒప్పుకుంటున్నాను. నాకున్నప్రతిదీ నీకు చెందినదే.”
5 దూతలు మరల అహాబు వద్దకు వచ్చారు. వారు బెన్హదదు తరుపున ఇలా అన్నారు, “నీవు నీ వెండి బంగారాలను, నీ భార్యలను, పిల్లలను నాకు ఇవ్వాలని నేనింతకు ముందే చెప్పాను. 6 నేనిప్పుడు నా మనుష్యులను పంపి నీ భవనాన్ని, నీ కింది పాలకుల ఇండ్లను వెదికించాలనుకుంటున్నాను. నా మనుష్యలకు ఏది నచ్చితే అది తీసుకుని వస్తారు.”
7 ఇది విని, రాజైన అహాబు తన దేశంలో వున్న పెద్దల (నాయకుల)తో ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. వారితో ఇలా అన్నాడు: “చూడండి! బెన్హదదు కయ్యానికి సిద్దమవుతున్నాడు. నా భార్యలను, పిల్లలను, నా వెండి బంగారాలను నేనతనికి ఇవ్వాలని ముందుగా చెప్పాడు. అవన్నీ ఇవ్వటానికి నేను ఒప్పుకున్నాను. కాని ఇప్పుడతను సర్వం తీసుకోవాలని చూస్తున్నాడు.”
8 ఇది విన్న పెద్దలు (నాయకులు), ఇతర ప్రజలు “బెన్హదదును లెక్క చేయవద్దనీ, అతను చెప్పినట్లు చేయవద్దనీ” అన్నారు.
9 బెన్హదదుకు తిరుగు సమాధానంలో అహాబు ఇలా అన్నాడు: “నేను నీవు ముందు చెప్పిన విధంగా చేస్తాను. కాని నీవు రెండవసారి ఆజ్ఞ ఇచ్చినట్లుగా నేను చేయజాలను.”
రాజైన బెన్హదదు మనుష్యులు ఈ సమాచారాన్ని అతనికి అందజేశారు. 10 బెన్హదదు నుంచి మరో వర్తమానం తీసుకుని దూతలు మళ్లీ వచ్చారు. ఆ సమాచారం ఇలా వుంది, “నేను షోమ్రోనును పూర్తిగా నాశనం చేస్తాను. ఆ నగరంలో ఏదీ మిగిలి వుండదని నేను ప్రమాణం చేసి చెబుతున్నాను! నా మనుష్యులు గుర్తుగా[f] ఇంటికి తెచ్చుకోవటానికి కూడ అక్కడ ఏమీ మిగలదు. నేనిది చేయకపోతే దేవుడు నన్ను సర్వనాశనం చేయుగాక!”
11 రాజైన అహాబు ప్రత్యుత్తరమిస్తూ “బెన్హదదుకు ఇలా చెప్పండి. కవచాన్ని ధరించువాడు దానిని ధరించి విప్పిన వానివలె గొప్పలు చెప్పరాదు”[g] అని చెప్పమన్నాడు.
12 రాజైన బెన్హదదు ఇతర పాలకులతో కలిసి తన డేరాలో వున్నాడు. ఆ సమయంలో అతని దూతలు తిరిగి వచ్చి రాజైన అహాబు ఇచ్చిన సమాధానాన్ని అతనికి అందజేశారు. రాజైన బెన్హదదు నగరాన్ని ముట్టడించటానికి సన్నద్ధులు కండని తన మనుష్యులకు ఆజ్ఞ ఇచ్చాడు. కావున వారంతా తమ తమ స్థానాలకు వెళ్లారు.
13 అదే సమయంలో ఒక ప్రవక్త రాజైన అహాబు వద్దకు వెళ్లి యెహోవా ఇలా అంటున్నాడని చెప్పాడు: “ఆ పెద్ద సైన్యాన్ని నీవు చూస్తున్నావు గదా! దేవుడనైన నేను నీవు ఆ మహా సైన్యాన్ని ఈ రోజు ఓడించేలా చేస్తాను. అప్పుడు నేనే నిత్యుడనైన యెహోవానని నీవు గుర్తిస్తావు.”
14 “వారిని ఓడించటానికి నీవు ఎవరిని ఉపయోగిస్తావు?” అని అహాబు అడిగాడు. “యువకులైన ప్రభుత్వాధికారులను” అని యెహోవా సెలవిస్తున్నాడని ప్రవక్త అన్నాడు. “ప్రధాన సైన్యాన్ని ఎవరు నడుపుతారు?” అని రాజు అడిగాడు.
“నీవే” అని ప్రవక్త అన్నాడు.
15 కావున అహాబు యువ ప్రభుత్వాధికారులను సమాయత్తపరచాడు. వారు రెండు వందల ముప్పై రెండుమంది ఉన్నారు. ఇశ్రాయేలు సైన్యాన్నంతటినీ రాజు సమీకరించాడు. వారంతా ఏడు వేల మందివున్నారు.
16 మధ్యాహ్నమయ్యింది. రాజైన బెన్హదదు, అతనికి తోడుగా ఉన్న మొప్పైరెండు మంది పాలకులు వారి గుడారాలలో బాగా మద్యపానం చేసి మైకంలో వున్నారు. ఈ సమయంలో రాజైన అహాబు దండయాత్ర మొదలయ్యింది. 17 యువ ప్రభుత్వాధికారులు ముందుగా ఎదుర్కొన్నారు. రాజైన బెన్హదదు మనుష్యులు అతనితో షోమ్రోను నుండి కొందరు సైనికులు బయటికి వచ్చినట్లు చెప్పారు. 18 “అయితే వారు యుద్ధానికి వస్తూ వుండవచ్చు. లేదా వారు సంధి నిమిత్తమై వస్తూ వుండవచ్చు. ఏది ఏమైనా వారిని సజీవంగా పట్టుకోండి” అని బెన్హదదు అన్నాడు.
19 రాజైన అహాబు యొక్క యువసైనికులు దండయాత్రను నడుపుతున్నారు. ఇశ్రాయేలు సైన్యంవారిని అనుసరిస్తూవుంది. 20 ఇశ్రాయేలు అధికారులలో ప్రతియొక్కడూ తనని ఎదుర్కొన్న శత్రువును చంపివేశాడు. కావున అరామునుండి వచ్చినవారు పారిపోయారు. ఇశ్రాయేలు సైన్యం వారిని తరిమికొట్టింది. రాజైన బెన్హదదు ఒక రథాశ్వము నెక్కి తప్పించుకున్నాడు.
21 రాజైన అహాబు తన సైన్యాన్ని నడిపించి అరాము సైనికుల గుర్రాలను, రథాలను స్వాధీన పర్చుకున్నాడు. ఆ విధంగా రాజైన అహాబు చేతిలో సిరియను సైన్యం ఘోర పరాజయం పొందింది.
22 అప్పుడు ప్రవక్త రాజైన అహాబు వద్దకు వెళ్లి ఇలా అన్నాడు, “ఆరాము రాజైన బెన్హదదు రాబోయే వసంతకాలం నాటికి మళ్లీ నీమీదికి యుద్ధానికి వస్తాడు. ఇప్పుడు నీవు నీ నివాసానికి వెళ్లి నీ సైన్యాన్ని బాగా బలపర్చుకో. అతని దండయాత్ర నుంచి నిన్ను నీవు రక్షించుకోవటానికి తగిన వ్యూహాలు సిద్ధం చేయి.”
బెన్హదదు తిరిగి యుద్ధానికి వచ్చుట
23 రాజైన బెన్హదదు సేవకులు కొందరు వచ్చి అతనికి ఇలా సలహా ఇచ్చారు, “ఇశ్రాయేలు దేవతలు కొండ దేవతలు. మనం యుద్ధం పర్వత ప్రాంతంలో నిర్వహించాం. అందువల్ల ఇశ్రాయేలు ప్రజలు గెలిచారు. కావున ఈ సారి మనం మైదాన ప్రాంతంలో యుద్ధం నిర్వహించాలి. అప్పుడు మనం గెలుస్తాం. 24 ఇప్పుడు నీవొకటి చేయాలి. ఈ ముప్పది యిద్దరు పాలకులను సైన్యాలను నడిపించేందుకు అనుమతించద్దు. వారి స్థానంలో దళాధిపతులను నియమించు. 25 తర్వాత నీవు పోగొట్టుకున్నటువంటి సైన్యాన్ని మళ్లీ నీవు భర్తీ చేయాలి. పూర్వపు సైన్యంలో వున్నట్లుగా గుర్రాలను, రథాలను మళ్లీ సేకరించు. అప్పుడు ఇశ్రాయేలు సైన్యాన్ని మైదాన ప్రాంతంలో మనం ఎదుర్కొందాం. అప్పుడు విజయం మనదే!” బెన్హదదు వారి సలహా పాటించాడు. వారు చెప్పిందంతా చేశాడు.
26 వసంత కాలం వచ్చే సరికి బెన్హదదు అరాము ప్రజలను సమీకరించాడు. ఇశ్రాయేలుతో యుద్ధం చేయటానికి అతడు ఆఫెకు నగరానికి వెళ్లాడు.
27 ఇశ్రాయేలీయులు కూడా యుద్ధానికి తయారైనారు. ఇశ్రాయేలు ప్రజలు అరాము సైన్యంతో పోరాడటానికి వెళ్లారు. అరాము సైనికులు దిగిన చోటికి ఎదురుగానే ఇశ్రాయేలు సైనికులు మకాంవేశారు. అరామీయులు ఆ ప్రదేశాన్నంతా ఆక్రమించియుండగా, ఇశ్రాయేలీయులు కేవలం రెండు మేకల మందలవలెవున్నారు.
28 ఇశ్రాయేలు రాజు వద్దకు దైవజనుడొకడు వర్తమానాన్ని తెచ్చాడు. యెహోవా ఇలా చెప్పాడు: “అరాము ప్రజలు ప్రభువునైన నన్ను ఒక కొండ దేవతగా చిత్రీకరించారు. నేను లోయలకు కూడ దేవుడనేనని వారు భావించలేదు. కావున నీవు ఈ పెద్ద సైన్యాన్ని ఓడించేలా చేస్తాను. అప్పుడు సర్వత్రా నేనే ప్రభువునని నీవు తెలుసుకుంటావు.”
29 ఇరు సైన్యాలు ఎదురెదురుగా ఏడు రోజుల పాటు మోహరించి వున్నాయి. ఏడవరోజు యుద్ధం మొదలయ్యింది. ఇశ్రాయేలీయులు ఒక్క రోజులో ఒక లక్ష మంది అరాము సైనికులను చంపేశారు. 30 మిగిలిన వారు ఆఫెకు నగరానికి పారిపోయారు. నగర ప్రాకారపు గోడ విరిగి పడగా ఇరవై ఏడువేల మంది సైనికులు చనిపోయారు. బెన్హదదు కూడ నగరానికి పారిపోయాడు. అతడొక గదిలో దాక్కున్నాడు. 31 ఈ లోపు కొందరు సేవకులు అతనితో ఇలా అన్నారు: “ఇశ్రాయేలు రాజులు కనికరం చూపనున్నట్లు మేము విన్నాం. మనం గోనెబట్టలు ధరించి, తాళ్లు తలకు చుట్టుకుని[h] ఇశ్రాయేలు రాజు వద్దకు వెళ్దాం. బహుశః అతడు మనల్ని బ్రతకనివ్వొచ్చు.”
32 వారు గోనెపట్టలు చుట్టుకుని, తలపై తాళ్లు వేసుకున్నారు. వారు ఇశ్రాయేలు రాజు వద్దకు వచ్చి, “మీ సేవకుడు బెన్హదదు దయచేసి తనను బ్రతకనివ్వమని అడుగుతున్నాడు” అని చెప్పారు.
“అయితే అతడింకా బ్రతికే వున్నాడా? అతడు నా సహోదరుడే!” అన్నాడు అహాబు.
33 బెన్హదదు మనుష్యులు రాజైన అహాబు నిజంగా దయచూపి బెన్హదదును చంపనని నిరూపించే విధంగా ఏదైనా చెప్పాలని కోరుకున్నారు. ఎప్పుడయితే బెన్హదదును నా సహోదరుడని అహాబు అన్నాడో, వచ్చిన మనుష్యులు వెంటనే,
“అవును! బెన్హదదు నీ సోదరుడే!” అని అన్నారు. “అతనిని నా వద్దకు తీసుకుని రండి” అని అహాబు అన్నాడు. తరువాత బెన్హదదు రాజైన అహాబు ముందుకు వచ్చాడు. అహాబు అతనిని తనతో తన రథం ఎక్కమన్నాడు.
34 బెన్హదదు అతనితో ఇలా అన్నాడు: “అహాబూ, నా తండ్రి నీ తండ్రి వద్ద నుండి తీసుకున్న పట్టణాలన్నిటినీ నేను నీకు తిరిగి ఇస్తాను. నా తండ్రి షోమ్రోనులో చేసిన విధంగా, దమస్కులో నీవు కొన్ని వీధులను నిర్మించి, వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేయవచ్చు.” అది విన్న అహాబు,
“నీవు ఇందుకు ఒప్పుకుంటే నేను నిన్ను వదిలి పెడతాను” అని అన్నాడు. తరువాత ఆ రాజులిద్దరూ ఒక శాంతి ఒడంబడిక కుదుర్చుకున్నారు. రాజైన అహాబు రాజైన బెన్హదదును స్వేచ్ఛగా వదిలాడు.
ఒక ప్రవక్త అహాబుకు వ్యతిరేకంగా మాట్లాడుట
35 ప్రవక్తలలో ఒకడు మరో ప్రవక్తతో, “నన్ను కొట్టు!” అని అన్నాడు. యెహోవా వలన ప్రేరేపించబడి అతనలా అన్నాడు. కాని ఆ రెండవ ప్రవక్త అతనిని కొట్ట నిరాకరించాడు. 36 అందుచే మొదటి ప్రవక్త ఇలా అన్నాడు; “నీవు యెహోవా ఆజ్ఞను పాటించలేదు. నీవు ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్లగానే ఒక సింహం నిన్ను చంపేస్తుంది.” ఆ రెండవ ప్రవక్త ఆ ప్రదేశం వదిలి వెళ్లగానే ఒక సింహం వచ్చి అతనిని చంపేసింది.
37 మొదటి ప్రవక్త మరో వ్యక్తి వద్దకు వెళ్లి, “నన్ను కొట్టు!” అన్నాడు.
ఈ వ్యక్తి వానిని కొట్టాడు. ప్రవక్తకు బాగా దెబ్బతగిలింది.
38 అందుచే ఆ ప్రవక్త ఒక బట్టతో తన ముఖం కప్పుకున్నాడు. దానివల్ల అతనెవరైనదీ ఎవ్వరూ గుర్తు పట్టలేదు. ప్రవక్త వెళ్లి రాజు కొరకు బాటపై నిలబడ్డాడు. 39 రాజు వచ్చినప్పుడు ప్రవక్త అతనితో ఇలా అన్నాడు: “నేను యుద్ధం చేయటానికి వెళ్లాను. మనలో ఒకడు శత్రుసైనికునొకణ్ణి నా వద్దకు తీసుకుని వచ్చాడు. ఆ శత్రు సైనికునికి కాపలా వుండమనీ, వాడు గనుక పారిపోతే అతని స్థానంలో నేను నా ప్రాణాలను ఇవ్వవలసి వుంటుందనీ మన సైనికుడు నాతో చెప్పాడు. లేదా రెండు మణుగుల[i] వెండి చెల్లించవలసి వుంటుందని అన్నాడు. 40 కాని నేను వేరే పనిలో నిమగ్నమై వుండగా ఆ శత్రుసైనికుడు పారిపోయాడు.”
ఇశ్రాయేలు రాజు ఇలా అన్నాడు: “నీవా సైనికుని ఒదిలిపెట్టిన నేరం చేసినట్లు ఒప్పుకున్నావు. దానికి సమాధానం కూడా నీకు తెలుసు. ఆ వ్యక్తి చెప్పినట్లే నీవు చేయాలి.”
41 అప్పుడా ప్రవక్త తన ముఖము మీది బట్టను తీసేశాడు. ఇశ్రాయేలు రాజు వానిని చూచి, అతడు ప్రవక్తలలో ఒకడని తెలుసుకున్నాడు. 42 ప్రవక్త యెహోవా వర్తమానాన్ని రాజుకిలా చెప్పాడు: “చంపబడాలని నేను నిర్దేశించిన వ్యక్తిని నీవు వదిలి పెట్టావు. కావున వాని స్థానంలో నీ ప్రాణం తీసుకోబడుతుంది. అతని ప్రజల స్థానంలో నీ ప్రజలు చనిపోవలసి వుంటుంది.”
43 రాజు షోమ్రోనులో వున్న తన ఇంటికి వెళ్లి పోయాడు. అతని మనస్సు బాగా కలత పడింది. అతడు చింతాక్రాంతుడయ్యాడు.
© 1997 Bible League International