Beginning
యూదాకు అబీయాము రాజగుట
15 నెబాతు కుమారుడు యరొబాము ఇశ్రాయేలును పాలిస్తూ వుండెను. అతని పాలనలో పదునెనిమిదో సంవత్సరం గడుస్తూ వుండగా, అబీయాము యూదాకు రాజు అయ్యాడు. 2 అబీయాము మూడు సంవత్సరాలు పాలించాడు. అతని తల్లి పేరు మయకా. ఆమె అబీషాలోము కుమార్తె.
3 పూర్వం తన తండ్రి చేసిన తప్పులన్నీ అతను కూడా చేశాడు. తన తాత దావీదు తన ప్రభువైన యెహోవాకు యథార్థుడై వున్నట్లు, అబీయాము యెహోవాకు విశ్వాసపాత్రుడై వుండలేదు. 4 యెహోవా దావీదును ప్రేమించాడు. అందువల్ల అబీయాముకు యెరూషలేములో ఒక రాజ్యాన్ని ఇచ్చాడు. అతనికి ఒక కుమారుని కూడ కలుగజేశాడు. యెహోవా ఇంకా యెరూషలేమును సురక్షితంగా వుండేలా చేశాడు. ఇదంతా యెహోవా దావీదు కొరకు చేశాడు. 5 యెహోవా కోరిన ప్రకారం దావీదు అన్నీ సవ్యమైన పనులు చేశాడు. యెహోవా ఆజ్ఞలను సదా పాటించాడు. హిత్తీయుడైన ఊరియా పట్ల తను చేసిన పాపం ఒక్కటి తప్ప, దావీదు యెహోవాకు సదా విధేయుడైయున్నాడు.
6 రెహబాము, యరొబాము ఇద్దరూ ఒకరితో ఒకరు ఎల్లప్పుడు యుద్ధం చేస్తూనే వున్నారు.[a] 7 అబీయాము చేసిన ఇతరమైన పనులన్నీ యూదా రాజుల చరిత్రలో వ్రాయబడ్డాయి.
అబీయాము పరిపాలించే సమయంలో అబీయాముకు, యరొబాముకు యుద్ధం జరిగింది. 8 అబీయాము చనిపోయినప్పుడు అతడు దావీదు నగరంలో సమాధి చేయబడ్డాడు. అబీయాము కుమారుని పేరు ఆసా. అబీయాము స్థానంలో ఆసా రాజయ్యాడు.
యూదా రాజుగా ఆసా
9 యరొబాము పాలన మొదలై ఇరవైయవ సంవత్సరం జరుగుతూండగా, ఆసా రాజ్యానికి వచ్చాడు. 10 ఆసా యెరూషలేములో నలుబది యొక్క సంవత్సరాలు పాలించాడు. అతని తల్లి పేరు మయకా. మయకా అబ్షాలోము కుమార్తె.
11 ఆసా తన పూర్వికుడైన దావీదువలె యెహావా దృష్టిలో యథార్థమైన వాటిని చేసాడు. 12 ఆ రోజులలో కూడా లైంగిక వాంఛలకై తమ శరీరాలను ఆరాధనా స్థలాలలో అమ్ముకుని చిల్లర దేవుళ్లను పూజించే పురుషులున్నారు. అటువంటి పురుషగాములను ఆసా దేశంనుండి వెళ్ళగొట్టాడు. మరియు ఆసా తన పూర్వికులు తయారు చేసిన విగ్రహాలన్నిటినీ తీసి వేశాడు. 13 తన తల్లి మయకాను రాణి పదవి నుంచి ఆసా తొలగించాడు. కారణ మేమంటే మయకా ఒక హేయమైన అషేరా దేవతా విగ్రహాన్ని తయారు చేయించింది. ఈ భయంకర విగ్రహాన్ని ముక్కలు చేసి ఆసా వాటిని కిద్రోనులోయలో తగులబెట్టాడు. 14 కాని ఆసా ఉన్నత స్థలాలను నాశనం చేయలేదు. తన జీవిత కాలమంతా ఆసా యెహోవాకు విశ్వాస పాత్రుడుగా ఉన్నాడు. 15 ఆసా తండ్రి కొన్ని వస్తువులను యెహోవాకు సమర్పించాడు. ఆసా కూడ కొన్ని కానుకలను యెహోవాకు సమర్పించాడు. వారు బంగారం, వెండి, తదితర వస్తు సామగ్రిని కానుకలుగా సమర్పించారు. అవన్నీ ఆసా దేవాలయంలో వుంచాడు.
16 యూదా రాజుగా ఆసా కొనసాగినంత కాలం, ఇశ్రాయేలు రాజైన బయెషాతో యుద్ధాలు కొనసాగించాడు. 17 బయెషా యూదా వారితో యుద్ధం చేశాడు. ఆసా రాజ్యమైన యూదాకు ప్రజల రాకపోకలను నిలిపివేయమని బయెషా సంకల్పించాడు. అందువల్ల రామానగరాన్ని అతడు చాలా పటిష్ఠపర్చినాడు. 18 దేవాలయం ఖజానా నుండి, రాజభవనం నుండి ఆసా వెండి, బంగారాలను తీశాడు. అతని సేవకులకు వాటినిచ్చి అరాము రాజైన బెన్హదదుకు పంపాడు. (బెన్హదదు తండ్రి పేరు టబ్రిమ్మోను, టబ్రిమ్మోను తండ్రిపేరు హెజ్యోను) అతడు దమస్కు నగరంలో వుంటున్నాడు. 19 అతనికి ఆసా ఇలా వర్తమానం పంపాడు, “నా తండ్రికి, నీ తండ్రికి మధ్య ఒక శాంతి ఒడంబడిక జరిగింది. ఇప్పుడు నీతో నేను కూడ శాంతి ఒడంబడిక నొకదానిని చేసుకోదలిచాను. నీకు వెండి బంగారాలు కానుకలుగా పంపుతున్నాను. ఇశ్రాయేలు రాజైన బయెషాతో నీకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవలసిందిగా కోరుతున్నాను. అప్పుడు బయెషా నా రాజ్యం వదిలిపోతాడు.”
20 రాజైన బెన్హదదు ఆసా రాజు కోరిన దానికి ఒప్పుకున్నాడు. కావున ఇశ్రాయేలు పట్టణాలమీదికి తన సైన్యాలను పంపాడు. ఈయోను, దాను, ఆబేల్బేత్మయకా, కిన్నెరెతు పట్టణాలను ఓడించాడు. కిన్నెరెతు, నఫ్తాలీలను అతడు పూర్తిగా ఓడించాడు. 21 ఈ దండయాత్రలను గురించి బయెషా విన్నాడు. దానితో అతడు రామా నగరాన్ని కట్టు దిట్టం చేయటం మానివేశాడు. అతడు రామా నగరాన్ని వదిలి తిర్సాకు తిరిగి వెళ్లాడు. 22 అప్పుడు రాజైన ఆసా యూదా ప్రజలందరి సహకారాన్ని కోరుతూ ఒక అభ్యర్థన చేశాడు. వారంతా బయెషా రామా నగరాన్ని పటిష్ఠం చేయటానికి వినియోగిస్తున్న రాళ్లను, కలపను తీసుకొనిపోయారు. వాటిని బెన్యామీనీయుల నగరమైన గెబకు, మరియు మిస్పాకు చేరవేశారు. రాజైన ఆసా ఆ రెండు నగరాలను పటిష్టంగా పునర్నిర్మించాడు. 23 ఆసా చేసిన ఇతరమైన అన్ని పనులు, అతని బలం, అతను నిర్మించిన నగరాల విషయం యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి. ఆసా ముసలివాడైనప్పుడు, అతని పాదాలలో జబ్బు ఏర్పడింది. 24 ఆసా చనిపోయినప్పుడు, అతని పూర్వికుడైన దావీదు నగరంలో సమాధి చేయబడ్డాడు. తరువాత ఆసా కుమారుడు యెహోషాపాతు అతని స్థానంలో రాజు అయ్యాడు.
ఇశ్రాయేలు రాజుగా నాదాబు
25 యూదాకు రాజైన ఆసా పాలన రెండవ సంవత్సరం గడుస్తూ వుండగా యరొబాము కుమారుడు నాదాబు ఇశ్రాయేలుకు రాజయ్యాడు. నాదాబు ఇశ్రాయేలును రెండు సంవత్సరాలు పాలించాడు. 26 యెహోవా దృష్టిలో అతను చాలా తప్పులు చేశాడు. తన తండ్రి యరొబాము చేసిన తప్పులన్నీ ఇతడూ చేశాడు. యరొబాము ఇశ్రాయేలు ప్రజలు కూడ పాపం చేయటానికి కారకుడయ్యాడు.
27 బయెషా అహీయా కుమారుడు. వారు ఇశ్శాఖారు వంశస్థులు. రాజైన నాదాబును చంపి వేయటానికి బయెషా పధకం వేశాడు. అది నాదాబు, ఇశ్రాయేలు వారంతా కలిసి గిబ్బెతోను నగరంపై దాడి జరుపుతున్న సమయం. గిబ్బెతోను ఫిలిష్తీయుల నగరం. అక్కడ నాదాబును బయెషా హత్య చేశాడు. 28 యూదాపై ఆసా పాలన మూడవ సంవత్సరం జరుగుతుండగా ఇది జరిగింది. ఇశ్రాయేలుకు తరువాత బయెషా రాజు అయ్యాడు.
ఇశ్రాయేలు రాజుగా బయెషా
29 బయెషా రాజైన పిమ్మట అతడు యరొబాము కుటుంబాన్ని హతమార్చాడు. యరొబాము కుటుంబంలో ఒక్కడిని కూడా బయెషా ప్రాణంతో వదలలేదు. యెహోవా ఎలా జరుగుతుందని సెలవిచ్చాడో, అదే రీతిలో ఇదంతా జరిగింది. షిలోహులో తన సేవకుడైన అహీయా ద్వారా యెహోవా ఇది పలికాడు. 30 ఇదంతా ఎందుకు జరిగినదనగా రాజైన యరొబాము చాలా పాపకార్యాలు చేశాడు. అంతే కాకుండా, ఇశ్రాయేలు ప్రజలు కూడా పాపకార్యాలు చేయటానికి యరొబాము కారకుడయ్యాడు. హేయమైన తన పనులతో యరొబాము ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మిక్కిలి కోపం కల్గించాడు.
31 నాదాబు చేసిన ఇతర కార్యాలన్నీ ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి. 32 బయెషా ఇశ్రాయేలును యేలినంత కాలం యూదా రాజైన ఆసాతో యుద్ధాలు చేస్తూనేవున్నాడు.
33 ఆసా యూదా రాజ్యాన్ని మూడవ సంవత్సరం పాలిస్తూండగా, అహీయా కుమారుడైన బయెషా ఇశ్రాయేలుకు రాజయ్యాడు. బయెషా ఇరువది నాలుగు సంవత్సరాలు తిర్సాలో పరిపాలించాడు. 34 కాని బయెషా యెహోవాకు వ్యతిరేకంగా అనేక దుష్టకార్యాలు చేశాడు. యరొబాము చేసిన పాపాలే ఇతడు కూడ చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా పాపం చేయటానికి యరొబాము కారకుడయ్యాడు.
16 తరువాత యెహోవా హనానీ కుమారుడైన యెహూతో మాట్లాడాడు. యెహోవా రాజైన బయెషాకు వ్యతిరేకంగా మాట్లాడాడు. 2 “నిన్నొక ముఖ్యమైన వ్యక్తిగా నేను చేశాను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలపై నిన్ను యువరాజుగా చేశాను. నీవు కూడా యరొబాము మార్గాన్నే అనుసరించావు. నా ప్రజలైన ఇశ్రాయేలీయులు తప్పుదారి పట్టేలా చేశావు. వారి పాపకార్యాలతో వారు నాకు కోపం కలుగజేశారు. 3 కావున ఓ బయెషా, నిన్ను నీ కుటుంబాన్ని నేను నాశనం చేస్తాను. నెబాతు కుమారుడైన యరొబాము కుటుంబానికి చేసినదంతా నీ కుటుంబానికి కూడా చేస్తాను. 4 నీ కుటుంబం వారు నగర వీధుల్లో పడి చనిపోతారు. వారి శవాలను కుక్కలుతింటాయి. నీ సంతతిలో కొందరు పొలాల్లో చనిపోతారు. వారి శవాలను పక్షులు తిని పోతాయి.”
5 బయెషా చేసిన ఇతర విషయాలన్నిటిని గురించి, అతని సైనిక బలం గురించి ఇశ్రాయేలు రాజుల చరిత గ్రంధంలో వ్రాయబడింది. 6 బయెషా చనిపోయినప్పుడు అతనిని తిర్సాలో సమాధి చేశారు. అతని కుమారుడు ఏలా అతని స్థానంలో రాజు అయ్యాడు.
7 కావున ప్రవక్తయగు యెహూకు యెహోవా ఒక వర్తమానం అందించాడు. ఆ వర్తమానం బయెషాకు, అతని కుటుంబానికి వ్యతిరేకంగా వుంది. యెహోవా దృష్టిలో నీచమైన కార్యాలనేకం బయెషా చేశాడు. ఇది యెహోవాకు కోపకారణమయ్యింది. అతనికి ముందు యరొబాము సంతతి వారు చేసిన పనులే బయెషా కూడ చేశాడు. బయెషా యరొబాము కుటుంబం వారినందరినీ చంపివేసినందుకు కూడా యెహోవా కోపంగా వున్నాడు.
ఇశ్రాయేలు రాజుగా ఏలా
8 యూదా రాజుగా ఆసా పాలన ఇరువది ఆరవ సంవత్సరం గడుస్తూ వుండగా ఏలా ఇశ్రాయేలుకు రాజు అయ్యాడు. ఏలా అనువాడు బయెషా కుమారుడు. అతడు తిర్సాలో రెండేండ్లు పరిపాలించాడు.
9 రాజైన ఏలా కింది అధికారులలో జిమ్రీ ఒకడు. ఏలా యొక్క రథబలంలో సగానికి జిమ్రీ అధిపతి. కాని ఏలాకు వ్యతిరేకంగా జిమ్రీ కుట్ర పన్నాడు. రాజైన ఏలా తిర్సాలో ఉన్నాడు. అతడు అర్సాఇంటిలో బాగా మద్యపానం చేసి మత్తుగా ఉన్నాడు. తిర్సాలో వున్న రాజుభవన నిర్వాహకుడు అర్సా. 10 జీమ్రీ ఆ ఇంటిలో ప్రవేశించి రాజైన ఏలాను చంపేశాడు. ఆసా పాలన యూదాలో ఇరువది ఏడవ సంవత్సరం జరుగుతూ వుండగా ఇది జరిగింది. తరువాత ఏలా స్థానంలో జిమ్రీ ఇశ్రాయేలుకు రాజు అయ్యాడు.
ఇశ్రాయేలు రాజుగా జిమ్రీ
11 జిమ్రీ రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించగానే, అతడు బయెషా కుటుంబం వారినందరినీ సంహరించాడు. బయెషా వంశంలోని మగవారినెవ్వరినీ అతడు ప్రాణాలతో వదలలేదు. బయెషా స్నేహితులను కూడ జిమ్రీ చంపేశాడు. 12 జిమ్రీ ఆ విధంగా బయెషాయొక్క వంశనాశనం గావించాడు. ప్రవక్తయైన యెహూ ద్వారా బయెషాకు వ్యతిరేకంగా ఏమి జరుగుతుందని యెహోవా పలికాడో ఆ రీతిగా ఇది జరిగింది.
13 బయెషా, అతని కుమారుడు ఏలా చేసిన పాపాల ఫలితంగా ఇది జరిగింది. వారు పాపం చేయటమే కాకుండా, ఇశ్రాయేలీయులు పాపం చేయటానికి కూడా వారు కారకులయ్యారు. వారు విగ్రహాలను చేయటానికి పాల్పడినందుకు కూడా యెహోవా కోపగించాడు.
14 ఏలా చేసిన ఇతర కార్యాలన్నీ ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి.
15 ఆసా పాలన యూదాలో ఇరువది ఏడవ సంవత్సరం జరుగుతూ వుండగా, జిమ్రీ ఇశ్రాయేలుకు రాజయ్యాడు. జిమ్రీ తిర్సాలో ఏడు రోజులు పాలించాడు. అసలు జరిగిన విషయమేమనగా: ఫిలిష్తీయుల నగరమైన గిబ్బెతోను వద్ద ఇశ్రాయేలు సైన్యం దిగియుండెను. 16 రాజుకు వ్యతిరేకంగా జిమ్రీకుట్ర పన్నుతున్నాడని సైనికులు విన్నారు. అతడు రాజును చంపివేశాడని కూడ విన్నారు. అదే రోజున ఇశ్రాయేలీయులు ఒమ్రీని రాజుగా అదే శిబిరంలోనే ప్రకటించారు. ఒమ్రీ సైన్యాధ్యక్షుడు. 17 తరువాత ఒమ్రీ, ఇశ్రాయేలు సైన్యం గిబ్బెతోనును వదిలి తిర్సాపైకి దండెత్తి వెళ్లారు. 18 నగరాన్ని ముట్టడించి పట్టుకున్నారని జిమ్రీ తెలుసుకున్నాడు. అతడు రాజభవనంలోకి వెళ్లి దానికి నిప్పుపెట్టాడు. అతడు భవనంతో పాటు కాలిపోయాడు. 19 జిమ్రీ పాపం చేయబట్టి అతడు నాశనమయ్యాడు. అతడు పాపం చేశాడు. యెహోవా దృష్టిలో అనేక చెడు కార్యాలు చేశాడు. యరొబాము మాదిరిగానే అతను కూడా పాపం చేశాడు. యరొబాము ఇశ్రాయేలు ప్రజలు కూడా పాపం చేయటానికి కారకుడయ్యాడు.
20 జిమ్రీ పన్నిన కుట్ర విషయం, అతను చేసిన తదితర కార్యాలు ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంధంలో వ్రాయబడ్డాయి. జిమ్రీ రాజైన ఏలాకి వ్యతిరేకంగా తిరిగి నప్పుడు జరిగిన సంఘటనలు కూడ ఆ గ్రంథంలో పొందు పర్చబడ్డాయి.
ఇశ్రాయేలు రాజుగా ఒమ్రీ
21 ఇశ్రాయేలు ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గం గీనతు కుమారుడైన తిబ్నీని బలపర్చి, అతనిని రాజుగా చేయ సంకల్పించింది. రెండవ వర్గం ఒమ్రీని అనుసరించింది. 22 ఒమ్రీ అనుచరులు గీనతు కుమారుడైన తిబ్నీ వర్గం వారికంటె బలంగా వున్నారు. అందువల్ల తిబ్నీ చంపబడ్డాడు. ఒమ్రీ రాజయ్యాడు.
23 ఆసా పాలన యూదాలో ముప్పైయొకటో సంవత్సరం జరుగుతూ వుండగా, ఒమ్రీ ఇశ్రాయేలుకు రాజయ్యాడు. ఒమ్రీ ఇశ్రాయేలును పన్నెండు సంవత్సరాలు పాలించాడు. అందులో ఆరు సంవత్సరాలు తిర్సాలో వుండి ఏలాడు. 24 కాని ఒమ్రీ షోమ్రోను కొండను కొన్నాడు. దానిని షెమెరు అను వానియొద్ద నాలుగు మణుగుల[b] వెండి నిచ్చి కొన్నాడు. ఆ కొండ మీద ఒమ్రీ ఒక నగరాన్ని కట్టాడు. ఆ కొండ యజమానియైన షెమెరు జ్ఞాపకార్థం ఆ నగరానికి షోమ్రోను[c] అని పేరు పెట్టాడు.
25 కాని ఒమ్రీ యెహోవా దృష్టిలో అనేక దుష్ట కార్యాలు చేశాడు. తనకు ముందు యేలిన రాజులందరి కంటె అతడు ఎక్కువ పాపం చేశాడు. 26 అతడు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన తప్పులన్నీ చేశాడు. ఇశ్రాయేలీయులు పాపకార్యాలు చేయటానికి యరొబాము కారకుడయ్యాడు. కావున వారంతా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు మిక్కిలి కోపం కలుగజేశారు. యెహోవాకు కోపం రావటానికి కారణ మేమనగా వారు పనికిమాలిన విగ్రహారాధన చేశారు.
27 ఒమ్రీ చేసిన ఇతర కార్యాలు, తన సైనికబలం మొదలగు విషయాలన్నీ ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంధంలో వ్రాయబడ్డాయి. 28 ఒమ్రీ చనిపోయాడు. అతనిని షోమ్రోనులో సమాధి చేశారు. అతని కుమారుడు అహాబు అతని స్థానంలో రాజు అయ్యాడు.
ఇశ్రాయేలు రాజుగా అహాబు
29 యూదాలో ఆసా పాలన ముప్పై ఎనిమిదవ సంవత్సరం జరుగుతూండగా ఒమ్రీ కుమారుడైన అహాబు ఇశ్రాయేలుకు రాజైనాడు. షోమ్రోను నుండి ఇరువది రెండు సంవత్సరాల పాటు ఇశ్రాయేలును పాలించాడు. 30 అహాబు యెహోవా చేయవద్దన్న కార్యాలను చేశాడు. తనకు ముందు పాలించిన వారందరికంటె అహాబు ఎక్కువ చెడుకార్యాలు చేశాడు. 31 నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపక్రియలు అహాబుకు చాలా సామాన్యమైనవిగా కన్పించాయి. ఆ తప్పులు చాలవన్నట్లు అతడు ఎత్బయలు కుమార్తెయగు యెజెబెలును వివాహం చేసుకున్నాడు. ఎత్బయలు సీదోనుకు రాజు. దానితో అహాబు బయలు దేవతను కొలవటం మొదలు పెట్టాడు. అహాబు అతనిని ఆరాధించాడు. 32 షోమ్రోనులో బయలు ఆరాధనకు ఒక ఆలయాన్ని కట్టించాడు. ఆ ఆలయంలో ఒక బలిపీఠం ఏర్పాటు చేశాడు. 33 అషేరా దేవతను ఆరాధించటానికి అహాబు ఒక ప్రత్యేక స్తంభాన్ని నిర్మించాడు. తనకు ముందు యేలిన రాజులందరి కంటె అహాబు ఎక్కువ పాపం చేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మిక్కిలి కోపాన్ని కలుగజేశాడు.
34 అహాబు రాజ్యం చేసే కాలంలో బేతేలు వాడైన హీయేలు యెరికో పట్టణాన్ని మరల నిర్మించాడు. హీయేలు నగర నిర్మాణపు పనిని మొదలు పెట్టగానే, అతని పెద్ద కుమారుడగు అబీరాము చనిపోయాడు. హీయేలు నగర ద్వారాలు నిర్మించేటప్పుడు అతని చిన్న కుమారుడగు సెగూబు చనిపోయాడు. నూను కుమారుడైన యెహోషువ ద్వారా ఏది ఎలా జరుగుతుందని యెహోవా చెప్పాడో ఇదంతా ఆ విధంగా జరిగింది.[d]
ఏలీయా మరియు వర్షాభావ పరిస్థితి
17 ప్రవక్తయైన ఏలీయా గిలాదులోని తిష్బీ నగరానికి చెందినవాడు. ఏలీయా వచ్చి రాజైన అహాబుతో ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేను సేవిస్తాను. ఆయన శక్తితో నేను నిశ్చయంగా చెప్పేదేమనగా రాబోవు కొద్ది సంవత్సరాలలో మంచుగాని, వర్షంగాని కురియదు. నేను ఆజ్ఞ ఇస్తేగాని వర్షం పడదు.”
2 తరువాత యెహోవా ఏలీయాతో, 3 “నీవు ఈ ప్రదేశాన్ని వదిలి తూర్పుదిశగా వెళ్లి, కెరీతు వాగువద్ద దాగి వుండు. ఆ వాగు యోర్దాను నదికి తూర్పున ఉన్నది. 4 నీవు ఆ వాగు నీటిని తాగవచ్చు. నీకు ఆహారాన్ని అక్కడికి చేరవేయమని నేను కాకోలములకు[e] ఆజ్ఞ ఇచ్చాను” అని అన్నాడు. 5 కావున యెహోవా చెప్పిన విధంగా ఏలీయా చేశాడు. యోర్దాను నదికి తూర్పున వున్న కెరీతువాగు దగ్గర నివసించటానికి అతడు వెళ్లాడు. 6 బొంత కాకులు ప్రతి ఉదయం రొట్టెను, ప్రతి సాయంత్రం మాంసాన్ని తెచ్చి ఇచ్చేవి. ఏలీయా వాగు నీటిని తాగేవాడు.
7 వర్షాలు పడక పోవటంతో, కొంత కాలానికి వాగు ఎండిపోయింది. 8 అప్పుడు యెహోవా ఏలీయాతో ఇలా అన్నాడు: 9 “సీదోనులోని సారెపతు అను పట్టణానికి వెళ్లి, అక్కడ నివసించు. ఆ ప్రదేశంలో ఒక విధవరాలు నివసిస్తూవుంది. నీకు ఆహారం ఇవ్వమని ఆమెను ఆదేశించాను.”
10 కావున ఏలీయా సారెపతు అను పట్టణానికి వెళ్లాడు. అతడు నగర ద్వారం వద్దకు వెళ్లే సరికి అతనక్కడ ఒక విధవ స్త్రీని చూశాడు. ఆమె వంటకైపుల్లలు ఏరుకొంటూ వుంది. ఏలీయా ఆమెను, “నాకు తాగటానికి ఒక చెంబుతో నీరు తెచ్చి పెడతావా?” అని అడిగాడు. 11 అతనికి నీరు తేవటానికి ఆమె వెళ్తూండగా, “నాకో రొట్టె ముక్క కూడా దయచేసి తీసుకురా” అని ఏలీయా అన్నాడు.
12 “నీ దేవుడైన యెహోవా సాక్షిగా నేను చెబుతున్నాను. నా వద్ద రొట్టె లేదు. ఒక జాడీలో కొద్దిపిండి మాత్రం వుంది. కూజాలో కొంచెం ఒలీవ నూనెవుంది. నిప్పు రాజేయటానికి రెండు పుల్లలు ఏరుకోడానికి నేనిక్కడికి వచ్చాను. నేనవి తీసుకొని వెళ్లి మా ఆఖరి వంట చేసుకోవాలి. నేను, నా కుమారుడు అది తిని, తరువాత ఆకలితో మాడి చనిపోతాము” అని ఆ స్త్రీ అన్నది.
13 ఏలీయా ఆమెతో ఇలా అన్నాడు: “ఏమీ బాధపడకు. నేను చెప్పిన రీతిలో నీవు ఇంటికి వెళ్లి వంట చేసుకో. కాని నీ వద్దవున్న పిండిలో నుంచి ఒకచిన్న రొట్టె ముందుగా చేసి, దానిని నాకు తెచ్చి పెట్టు. తర్వాత నీ కొరకు, నీ బిడ్డ కొరకు వంట చేసుకో. 14 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇలా అన్నాడు: ‘ఆ పిండి జాడీ ఎప్పుడూ ఖాళీ కాదు. ఆ కూజాలో నూనె ఎప్పుడూ తరిగిపోదు. ఈ రాజ్యంమీద యెహోవా వర్షం కురింపించే వరకు ఇది కొనసాగుతుంది.’”
15 అందువల్ల ఆ స్త్రీ ఇంటికి వెళ్లింది. ఏలీయా ఆమెకు ఏమి చేయమని చెప్పాడో అదంతా చేసింది. ఏలీయా, ఆ స్త్రీ, ఆ కుమారుడు చాలా దినముల వరకు సరిపడు ఆహారం కలిగియున్నారు. 16 పిండిజాడీ, నూనె కూజా ఎన్నడూ ఖాళీ కాలేదు. యెహోవా ఎలా జరుగుతుందని చెప్పాడో, అంతా అలానే జరిగింది. ఈ విషయాలన్నీ యెహోవా ఏలీయా ద్వారా చెప్పాడు.
17 కొంత కాలం తరువాత ఆ విధవ స్త్రీ కుమారునికి జబ్బు చేసింది. జబ్బు రోజురోజుకు తీవ్రమయ్యింది. చివరిగా అతని శ్వాస ఆగిపోయింది. 18 ఆమె ఏలీయా వద్దకు వచ్చి, “నీవు దైవజనుడవు కదా! నీవు నా బిడ్డకు సహాయం చేయగలవా? లేక కేవలం నేను చేసిన తప్పులన్నిటినీ నాకు జ్ఞాపకం చేయటానికే నీవు ఇక్కడికి వచ్చావా? నా కుమారుడు చనిపోయేలా చేయటానికే నీవు వచ్చావా?” అని అడిగింది.
19 “నీవు నీ కుమారుని నాకు ఇవ్వు” అని ఏలీయా ఆమెతో అన్నాడు. ఏలీయా ఆమె వద్ద నుండి బిడ్డను తీసుకుని పై అంతస్తుకు వెళ్లాడు. తను ఉంటున్న గదిలో పక్కమీద బాలుని పడుకోబెట్టాడు. 20 తరువాత ఏలీయా ఇలా ప్రార్థన చేశాడు: “ఓ నా ప్రభువైన దేవా! ఈ విధవరాలు తన ఇంటిలో నాకు ఆశ్రయమిచ్చింది. అటువంటి స్త్రీకి ఇటువంటి ఆపద నీవు కలుగజేస్తావా? ఆమె కుమారుడు చనిపోయేలా చేస్తావా?” 21 పిమ్మట ఏలీయా ఆ బాలుని మీద మూడు సార్లు పడి, “ఓ నా ప్రభువైన దేవా! ఈ బాలుడు మరల జీవించేలా చేయు” మని ప్రార్థించాడు.
22 యెహోవా ఏలీయా ప్రార్థన ఆలకించాడు. బాలుడు శ్వాసపీల్చటం ప్రారంభించాడు. వాడు బతికాడు. 23 ఏలీయా బాలుని కిందికి తీసుకుని వచ్చాడు. బాలుని అతని తల్లికి ఇస్తూ, “చూడు! నీ కుమారుడు బతికాడు” అని ఏలీయా అన్నాడు.
24 “నీవు నిజంగా దైవజనుడవేనని నేను ఇప్పుడు విశ్వసిస్తున్నాను. నిజంగా యెహోవా నీద్వారా మాట్లాడుతున్నాడని నేను తెలుసుకున్నాను” అని ఆ స్త్రీ అన్నది.
© 1997 Bible League International