Beginning
సొలొమోను జ్ఞానం కోసం అడుగుట
3 సొలొమోను ఈజిప్టు రాజైన ఫరో కుమార్తెను వివాహం చేసుకున్నాడు. అతనితో ఒక ఒడంబడిక చేసుకున్నాడు. సొలొమోను ఆమెను దావీదు నగరానికి తీసుకొనివచ్చాడు. ఆ సమయంలో సొలొమోను తన భవనాన్ని, దేవాలయాన్ని నిర్మింపచేస్తూనేవున్నాడు. సొలొమోను యెరూషలేము నగరం చుట్టూ ఒక గోడకూడా నిర్మిస్తున్నాడు. 2 దేవాలయం ఇంకా పూర్తి కాలేదు. అందువల్ల అప్పటి వరకు ప్రజలు తమ బలులను గుట్టలపై[a] వున్న బలిపీఠాల వద్దనే అర్పిస్తూండేవారు. 3 యెహోవాను ప్రేమించినట్లుగా సొలొమోను నిరూపించుకున్నాడు. తన తండ్రియగు దావీదు చెప్పిన విషయాలన్నీ నియమంగా పాటించాడు. కాని సొలొమోను ఒక్క విషయంలో మాత్రం తన తండ్రి చెప్పనిది చేశాడు. అదేమనగా సొలొమోను గుట్టలపై బలులు అర్పించటం, ధూపం వేయటం, కొనసాగించాడు.
4 సొలొమోను రాజు బలులు అర్పించుటకు గిబియోనుకు వెళ్లాడు. అది బలి అర్పణచేసే ప్రదేశాలన్నిటిలో చాలా పేరు గాంచిన గుట్ట. సొలొమోను ఆ బలిపీఠం మీద ఒక వెయ్యి బలులు అర్పించాడు. 5 సొలొమోను గిబియోను వద్ద వున్నప్పుడు యెహోవా అతనికి స్వప్నంలో దర్శన మిచ్చాడు. “నీవేదైనా కోరుకో. నీ కోరిక నెరవేర్చుతాను” అని యెహోవా అన్నాడు.
6 సొలొమోను ఇలా అన్నాడు: “నీ సేవకుడగు నా తండ్రి దావీదుకు నీవు మిక్కిలి దయ చూపావు. అతను నిన్ననుసరించాడు. అతను కూడా మంచివాడై, ధర్మంగా జీవించాడు. నీవతని కుమారుని రాజ్యా సింహాసనానికి అర్హుణ్ణి చేసినప్పుడు, నీవు అతనికి అపూర్వమైన కరుణ చూపావు. 7 నా ప్రభువైన దేవా! నా తండ్రి స్థానంలో రాజ్యపాలన చేసేలా నాకు అనుమతి ఇచ్చావు. కాని నేనింకా పసివానిలా వున్నాను. నేను నిర్వర్తించవలసిన పనులు నెరవేర్చటానికి తగిన వివేకం నాకు కొరతగా ఉంది. 8 నీ సేవకుడనైన నేను నీచేత ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన ప్రజల మధ్య వున్నాను. వారి జనాభా పెద్దది. వారు లెక్కపెట్టలేనంత ఎక్కువగా వున్నారు. కావున పాలకుడైన వాడు వారి విషయంలో అనేకమైన నిర్ణయాలు తీసుకోవలసి వుంటుంది. 9 అందువల్ల ఈ ప్రజానీకంపై ధర్మపరిపాలన చేయగల న్యాయ నిర్ణయం చేయగల దక్షత, పరిజ్ఞానము నాకు దయచేయుమని నిన్ను వేడుకుంటున్నాను. ఈ జ్ఞానమువల్ల నేను మంచి చెడుల నిర్ణయం చేయగలుగుతాను. ఈ మహా పరిజ్ఞానము లేకుండ, ఈ గొప్ప ప్రజానీకాన్ని పరిపాలించటం అసాధ్యమైన పని.”
10 సొలొమోను ఇది అడిగినందుకు యెహోవా చాలా సంతోషించాడు. 11 అతనితో దేవుడిలా అన్నాడు: “నీవు నీకు దీర్ఘాయుష్షు యిమ్మని అడుగలేదు. నీవు నీ కొరకై ధనదాన్యాదులిమ్మని అడుగలేదు. నీ శత్రునాశనం కూడ నీవు కోరుకోలేదు. మంచిచెడుల విచక్షణా జ్ఞానం, న్యాయనిర్ణయం చేయగల దక్షత నీవు అడిగావు. 12 కావున నీవడిగిన దానిని నీకు దయచేస్తాను. నీకు విజ్ఞానాన్ని, వివేకాన్ని ఇస్తాను. గతంలో నీవంటి వాడెవ్వడూ లేనట్లుగా నీకు జ్ఞానాన్ని కలుగజేస్తాను. భవిష్యత్తులో కూడ నీకు సాటి మరి ఎవ్వడూ వుండడు. 13 పైగా, నీకు పారితోషికంగా నీవు అడుగనవి కూడ నీకు ఇస్తున్నాను. నీ జీవితాంతం నీకు ధనధాన్యాలు, గౌరవ మర్యాదలు లభిస్తాయి. నీయంతటి గొప్పవాడు ఈ ప్రపంచంలో మరో రాజు వుండడు. 14 నాకు విధేయుడవై వుండుమనీ, నా న్యాయమార్గాన్ని, నా ఆజ్ఞలను పాటించుమని నిన్ను నేనడుగుతున్నాను. నీ తండ్రి దావీదువలె నీవు కూడ నడుచుకో. నీవు ఆ విధంగా చేస్తే నీకు దీర్ఘాయుష్షు కూడ నేనిస్తాను.”
15 సొలొమోను మేల్కొన్నాడు. దేవుడు అతనితో కలలో మాట్లాడినట్లు తెలుసుకొన్నాడు. సొలొమోను తరువాత యెరూషలేముకు వెళ్లి యెహోవా ఒడంబడిక పెట్టె ముందు నిల్చున్నాడు. సొలొమోను యెహోవాకు ఒక దహనబలి ఇచ్చాడు. అతనింకా సమాధాన బలులు కూడా దేవునికి చెల్లించాడు. తరువాత అతని పరిపాలనలో అతనికి చేదోడు వాదోడుగావున్న నాయకులకు, అధికారులందరికీ విందు ఇచ్చాడు.
సొలొమోను జ్ఞానం రుజువగుట
16 ఒక రోజు ఇద్దరు వేశ్యా స్త్రీలు సొలొమోను వద్దకు వచ్చారు. వారు రాజు ముందు నిలబడ్డారు. 17 ఆ ఇద్దరిలో ఒక స్త్రీ ఇలా అన్నది, “అయ్యా, ఈమె, నేను ఒకే ఇంట్లో నివసిస్తూ వుంటాము. మేమిద్దరం గర్భవతుల మైనాము. కాన్పు నెలలు వచ్చాయి. నేనొక బిడ్డను ప్రసవించాను. అప్పుడు ఈమె నా పక్కనేవుంది. 18 మూడు రోజుల తరువాత ఈమె కూడ ఒక బిడ్డను కన్నది. మా ఇద్దరితో పాటు ఇంటిలో మరెవ్వరూ లేరు. కేవలం మేమిద్దరమే వుంటున్నాము. 19 ఒక రోజు రాత్రి ఈ స్త్రీ తన బిడ్డతో నిద్రిస్తూండగా, ఆ బిడ్డ చనిపోయింది. 20 అప్పుడు ఆమె ఆ రాత్రి సమయంలో నేను నిద్రిస్తూండగా నా పక్కలో నుండి నా బిడ్డను తీసుకొన్నది. నా బిడ్డను ఆమె తన పక్కలో వేసుకొన్నది. చనిపోయిన బిడ్డను నా పక్కమీద వుంచింది. 21 మరునాటి ఉదయం నేను లేచి నా బిడ్డకు పాలివ్వబోయాను. కాని బిడ్డ చనిపోయినట్లు గమనించాను. నేను బిడ్డకేసి తేరిపార చూడగా ఆ బిడ్డ నా బిడ్డ కాదని కనుగొన్నాను.”
22 కాని ఆ రెండవ స్త్రీ, “కాదు! బ్రతికివున్న బిడ్డే నా బిడ్డ, చనిపోయిన బిడ్డే నీ బిడ్డ” అని అన్నది.
అందుకు మొదటి స్త్రీ ఇలా అన్నది, “కాదు! నీవు పొరాపాటు పడుతున్నావు! చనిపోయిన బిడ్డే నీది. బ్రతికివున్న బిడ్డ నాది!” ఇలా ఆ యిద్దరు స్త్రీలు రాజు ముందు వాదోపవాదాలు చేసుకొన్నారు.
23 ఇదంతా విన్న సొలొమోను, “మీ ఇద్దరిలో ప్రతి ఒక్కరూ బతికివున్న బిడ్డ ‘నాదే’ అంటున్నారు. మీలో ప్రతి ఒక్కరు చనిపోయిన బిడ్డ ఎదుటి వ్యక్తిదని అంటున్నారు” అని అన్నాడు. 24 అప్పుడు సొలొమోను రాజు తన సేవకుడిని పంపి ఒక కత్తి తెప్పించాడు. 25 సొలొమోను రాజు ఇలా అన్నాడు, “ఇప్పుడు మనం ఈ రకంగా చేద్దాం. బ్రతికి వున్న బిడ్డను రెండు ముక్కలుగా నరికేద్దాం. ఆ ఇద్దరు స్త్రీలకు చెరియొక ముక్క ఇద్దాం!”
26 ఇది విన్న ఆ రెండవ స్త్రీ, “ఈ పని చాలా బాగుంటుంది. బిడ్డను రెండు ముక్కలు చేయండి, అప్పుడు మా ఇద్దరిలో ఎవ్వరికీ ఆ బిడ్డ రాకుండా పోతుంది” అని అన్నది. కాని బిడ్డయొక్క నిజమైన తల్లియగు మొదటి స్త్రీ తన బిడ్డపట్ల నిండైన ప్రేమతో రాజుతో, “అయ్యా, దయచేసి బిడ్డను చంపవద్దు! బిడ్డను ఆమెకే ఇవ్వండి,” అని అన్నది.
27 సొలొమోను రాజు అప్పుడిలా అన్నాడు, “బిడ్డను చంపకండి! బిడ్డను మొదటి స్త్రీకి ఇవ్వండి, అసలైన తల్లి ఆమెయే!”
28 ఇశ్రాయేలు ప్రజలు సొలొమోను రాజు తీర్పును విన్నారు. ఆయన చాలా తెలివైనవాడు కావున అతనిని ప్రజలు చాలా గౌరవించారు. న్యాయ నిర్ణయం చేయుటలో ఆయనకు దేవుడిచ్చిన వివేకం[b] ఉన్నట్లు వారు గమనించారు.
సొలొమోను రాజ్యం
4 ఇశ్రాయేలు ప్రజలందరి పైన సొలొమోను రాజు పరిపాలన సాగించాడు. 2 తన పరిపాలనలో అతనికి సహాయ పడిన ప్రముఖమైన అధికారుల పేర్లు ఇవి:
సాదోకు కుమారుడైన అజర్యా ప్రధాన యాజకుడు.
3 షీషా కుమారులైన ఎలీహోరెపు మరియు అహీయా న్యాయస్థానాలలో జరిగే వాగ్వాదములు, తీర్పులు మొదలగు వాటిని గ్రంధస్థం చేసే లేఖకులు.
అహీలూదు కుమారుడైన యెహోషాపాతు చరిత్రకారుడు.
4 యెహోయాదా కుమారుడైన బెనాయా సైన్యాధ్యక్షుడు.
సాదోకు, అబ్యాతారు యాజకులు.
5 నాతాను కుమారుడు అజర్యా మండలాధిపతుల మీద అధికారి.
నాతాను కుమారుడైన జాబూదు అంతఃపుర యాజకుడే గాక రాజైన సొలొమోనుకు సలహాదారుడు.
6 అహీషారు రాజు యొక్క ఇంటి నిర్వహణలో అన్ని జాగ్రత్తలు తీసుకొనేవాడు.
అబ్దా కుమారుడైన అదోనిరాము బానిసలకు అధిపతి.
7 ఇశ్రాయేలురాజ్య పరిపాలనా సౌలభ్యం కొరకు మండలాల పేరుతో పన్నెండు ప్రాంతాలుగా విభజించారు. ప్రతి మండల పాలనకు రాజైన సొలొమోను ఒక పాలకుని ఎంపిక చేశాడు. ఈ పన్నెండుగురు మండలాధిపతులు రాజుకు, రాజ కుటుంబానికి ఆహారధాన్యాలు, తదితర తిను బండారాలు సేకరించి పంపేలా ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఈ పన్నెండుగురు పాలకులలో ఒక్కొక్కడు సంవత్సరంలో ఒక్కొక్క నెల చొప్పున ఆహర పదార్థాలు సేకరించి రాజుకు పంపే బాధ్యత వహిస్తాడు. 8 ఆ పన్నెండుగురు మండలాధిపతుల పేర్లు ఇవి: బెన్-హూరు కొండల ప్రాంతమైన ఎఫ్రాయిమునందు పాలకుడు:
9 బెన్-దెకెరు అనునతను మాకస్సు, షయల్బీము, బేత్షెమెషులోను మరియు ఏలోన్భెధానానులోను;
10 బెన్-హెసెదు అనువాడు అరుబ్భోతు, శోకో మరియు హెపెరులోను;
11 బెన్-అబీనాదాబు నఫోతు దోరులోను (ఇతడు సొలొమోను కుమారైయగు టాపాతును వివాహ మాడాడు);
12 అహీలూదు కుమారుడైన బయనా అనువాడు తానాకు, మెగిద్దో మరియు సారెతాను పక్కనున్న బేత్షెయాను ప్రాంతమంతటికీ; (ఈ ప్రాంతం యెజ్రెయేలు దిగువ బేత్షెయాను మొదలుకొని ఆబేల్మేహోలా వరకు యొక్నెయాముకు అడ్డముగా వ్యాపించి ఉన్నది)
13 బెన్-గెబెరు అనునతను రామోత్గిలాదులోను; (ఇతడు గిలాదులోని మనష్షే కుమారుడైన యాయీరు పట్టణాలు, గ్రామాలపైన పాలకుడు. ఇతనింకా బాషానులో ఉన్న అర్గోబు మండల ప్రాంత మునకు కూడా పాలకుడుగా నియమింపబడ్డాడు. ఈ ప్రాంతంలో చుట్టూ ప్రాకారాలున్న అరువది నగరాలున్నాయి. ఈ నగరాలన్నిటికీ ద్వారాల మీద కంచు కడ్డీలు ఏర్పాటు చేయబడ్డాయి).
14 ఇద్దో కుమారుడైన అహీనాదాబు మహనయీములోను;
15 అహీమయస్సు అనునతడు నఫ్తాలీములోను, ఇతడు సొలొమోను కుమార్తెయగు బాశెమతును వివాహమాడాడు;
16 హూషై కుమారుడగు బయనా ఆషేరులోను, ఆలోతులోను;
17 పరూయహు కుమారుడగు యెహోషాపాతు ఇశ్శాఖారు ప్రాంతంలోను;
18 ఏలా కుమారుడగు షిమీ బెన్యామీనులోను;
19 ఊరి కుమారుడైన గెబెరు అనునతడు గిలాదులోను అధిపతులుగా నియమింపబడ్డారు. (గిలాదు ప్రాంతంలో అమోరీయులకు రాజైన సీహోను, బాషాను రాజైన ఓగు నివసించేవారు). కాని ఆ ప్రాంత మంతటికీ గెబెరు ఒక్కడు మాత్రమే పాలకుడుగా నియమితుడయ్యాడు.
20 యూదాలోను, ఇశ్రాయేలులోను జనాభా విపరీతంగా పెరిగింది. సముద్రతీరాన ఇసుక రేణువులా ప్రజానీకం విస్తరించింది. ప్రజలంతా సుఖసంతోషాలతో తింటూ, తాగుతూ, విలాసంగా జీవిస్తూవున్నారు.
21 యూఫ్రటీసు నది మొదలుకొని ఫిలిష్తీయుల రాజ్యం వరకుగల రాజ్యాలన్నిటిపైన సొలొమోను పరిపాలన సాగించాడు. అతని రాజ్యం ఈజిప్టు సరిహద్దుల వరకు వ్యాపించింది. ఈ సామ్రాజ్యాధిపతులంతా సొలొమోను ఆధిపత్యాన్ని అతని జీవితాంతంవరకు అంగీకరించి అతనికి పన్ను చెల్లిస్తూ వచ్చారు.[c]
22-23 సొలొమోను రాజుకు, ఆయన బల్ల వద్ద భోజనం చేసే వారికి సరిపడు దినసరి ఆహార పదార్థాలు ఈ విధంగా వున్నాయి: ఆరువందల తూముల[d] మెత్తని గోధుమ పిండి; పన్నెండు వందల తూముల ముతక పిండి; మంచి మేపులో ఉన్న పది ఆవులు; పొలాల్లో మేసే ఇరువది ఆవులు; వంద గొర్రెలు; మూడురకాల దుప్పులు; ప్రత్యేకంగా ఎంపిక చేసిన బాతులు మొదలగు పక్షిజాతులు.
24 యూఫ్రటీసు నదికి పశ్చిమ ప్రాంతాన గల రాజ్యాలన్నిటినీ సొలొమోను పరిపాలించాడు. ఈ ప్రాంతం తిప్సహు మొదలు గాజా వరకు వ్యాపించి వున్నది. సొలొమోను సామ్రాజ్యంలో నలుమూలలా శాంతి నెలకొన్నది. 25 సొలొమోను జీవించినంత కాలం యూదాలోను, ఇశ్రాయేలులోని దాను నుండి బెయేర్షెబా వరకు ప్రజలంతా శాంతి భద్రతలతో నివసించారు. ప్రజలు తమ తమ అంజూరపు చెట్ల క్రింద, ద్రాక్షాలతల క్రిందను కూర్చుని సుఖశాంతులతో జీవితం గడిపారు.
26 సొలొమోను తన రథాలను లాగే నాలుగు వేల గుర్రాలను ఉంచుటకు తగిన శాలలు ఏర్పాటు చేశాడు. అతనికి పండ్రెండు వేల గుర్రాలు వున్నాయి. తన రథాశ్వములకై సొలొమోను నాలుగు వేల[e] గుర్రపు శాలలు కలిగియున్నాడు. సొలొమోనుకు పండ్రెండు వేల మందిగల గుర్రపు దళం కూడా వున్నది. 27 ప్రతినెల పన్నెండు మంది మండలాధిపతులలో ఒక్కొక్కడు చొప్పున సొలొమోను రాజుకు కావలసిన సరుకులన్నిటినీ సమకూర్చి పెట్టేవాడు. రాజు బల్ల వద్ద తినే వారందరికీ ఇవన్నీ సరిపోయేవి. 28 రాజు యొక్క రథాశ్వములకు, స్వారి గుర్రాలకు తగినంత పచ్చగడ్డిని, యవధాన్యమును మండలాధిపతులు సేకరించి సరఫరా చేసేవారు. ప్రతి ఒక్కడూ ఈ ధాన్యాన్ని నియమిత స్థానాలకు చేరవేసేవాడు.
సొలొమోను జ్ఞానం
29 సొలొమోనుకు దేవుడు మిక్కిలి జ్ఞానాన్ని ప్రసాదించాడు. సొలొమోను అనేక విషయాలను సూక్ష్మంగా గమనించేవాడు. అతని జ్ఞానం ఊహకందనిది.[f] 30 తూర్పుదేశపు మానవులందరి వివేక జ్ఞానాలకంటె, సొలొమోను జ్ఞాన సంపద మిక్కిలి అతిశయించినది. ఈజిప్టులోనున్న వారి తెలివితేటల కంటె అతని శక్తి యుక్తులు మించినవి. 31 ఈ భూమి మీద ప్రజలందరికంటె అతను తెలివైనవాడు. అతడు ఎజ్రాహీయుడైన ఏతాను కంటె, మహోలు కుమారులైన హేమాను, కల్కోలు, దర్ద అనువారి కంటె మిక్కిలి తెలివైనవాడు. రాజైన సొలొమోను కీర్తి ఇశ్రాయేలు, యూదాల చుట్టు పక్కలనున్న దేశాలకు కూడ వ్యాపించింది. 32 తన జీవిత కాలంలో రాజైన సొలొమోను మూడు వేల సామెతలను రాశాడు.[g]
33 సొలొమోను ప్రకృతిని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాడు. సొలొమోను అనేక వృక్షజాతులను గూర్చి చెప్పాడు. లెబానోనులోని గొప్ప దేవదారు వృక్షములనుండి, గోడలలో పుట్టి పాకే లతజాతుల మొక్కల వరకు అతనికి తెలుసు. రాజైన సొలొమోను జంతువులను గూర్చి, పక్షులను గూర్చి, పాములు తదితర పాకే క్రిమికీటకాదులు, బల్లులు, చేపలు మొదలగు వాటిని గూర్చి కూడా చెప్పాడు. 34 రాజైన సొలొమోను జ్ఞానమును వినటానికి అన్ని దేశాల నుంచి ప్రజలు వచ్చేవారు. ఇతర దేశాల రాజులు తమ తమ పండితులను, శాస్త్రజ్ఞులను రాజైన సొలొమోను చెప్పే విషయాలను వినటానికి పంపేవారు.
సొలొమోను, హీరాము
5 హీరాము అనునతను తూరు దేశానికి రాజు. అతను దావీదుకు చిరకాల స్నేహితుడు. దావీదు స్థానంలో సొలొమోను రాజ్యానికి వచ్చాడని విన్న హీరాము తన సేవకులను సొలొమోను వద్దకు పంపాడు. 2 సొలొమోను వారిద్వారా రాజైన హీరాముకు ఇలా చెప్పి పంపాడు:
3 “నా తండ్రియగు రాజైన దావీదు చుట్టుప్రక్కల రాజ్యాల వారితో అనేక యుద్ధాలు చేసినట్లు నీకు తెలుసు. అందువల్ల యెహోవాయగు తన దేవుని ఘనపరిచేలా ఒక దేవాలయం నిర్మించ లేకపోయాడు. తన శత్రువులందరినీ యెహోవా తాను ఓడించేలా చేసే వరకు రాజైన దావీదు వేచివున్నాడు. 4 కాని ఇప్పుడు యెహోవా దేవుడు నా రాజ్యం నలుమూలలా శాంతి నెలకొనేలా చేశాడు. ప్రస్తుతం నాకు శత్రువులు లేరు. నా ప్రజలు నిర్భయంగా వున్నారు.
5 “యెహోవా నా తండ్రియగు దావీదుకు ఒక మాట ఇచ్చాడు. యెహోవా ఇలా అన్నాడు, ‘నీ తరువాత నీ కుమారుని రాజును చేస్తాను. నీ కుమారుడు నా పట్ల గౌరవ సూచకంగా ఒక దేవాలయం నిర్మిస్తాడు.’ కావున ఇప్పుడు నా యెహోవా దేవునికి ఘనంగా ఒక దేవాలయం నిర్మింపజేస్తున్నాను. 6 అందువల్ల ఈ విషయంలో నీ సహాయం కోరుతున్నాను. నీ మనుష్యులను లెబానోనుకు పంపించు. వారక్కడ నా కొరకు దేవదారు వృక్షాలను పడగొట్టాలి. నా పనివాళ్లు నీ పనివారితో కలిసి పని చేస్తారు. నీ పనివాళ్లకు వేతనంగా నీవు ఎంత నిర్ణయిస్తే అది నేను చెల్లిస్తాను. కాని నీ సహాయం మాత్రం నాకు కావాలి. మా వడ్రంగులు[h] సీదోను వడ్రంగులకు సాటిరారు.”
7 సొలొమోను అడిగినదంతా విన్న హీరాము చాలా సంతోషపడ్డాడు. “ఆ మహా సామ్రాజ్యానికి రాజుగా వ్యవహరించటానికి దావీదుకు ప్రజ్ఞాశాలియైన కుమారుని ప్రసాదించినందుకు దేవునికి ఈ రోజు నమస్కరిస్తున్నాను!” అని రాజైన హీరాము అన్నాడు. 8 అప్పుడు హీరాము ఒక సమాచారాన్ని సొలొమోనుకు యిలా పంపాడు:
“నీవు అడిగిన విషయాలన్నీ నేను విన్నాను. నీవు కోరినన్ని దేవదారు వృక్షాలను, సరళపు చెట్లను నీకు యిస్తాను. 9 నా పనివాళ్లు ఆ దూలాలన్నిటినీ లెబానోను నుండి సముద్రతీరానికి చేరవేస్తారు. వాటిని నేను తెప్పలుగా కట్టించి సముద్రంలో వేయించి నీవు కోరిన స్థలానికి చేరేలా చేస్తాను. అక్కడ ఆ దూలాలను విడివిడిగా తీస్తాను. వాటిని నీవు తీసుకోవచ్చు. ఈ సందర్భంగా నీవు నా మాట మన్నించి నా రాజకుటుంబ పోషణకు తగిన ఆహార పదార్థాలను సమకూర్చుతావని ఆశిస్తున్నాను.”
10 ఆ విధంగా హీరాము దేవదారు, సరళపు చెట్ల కలపను సొలొమోనుకు సరఫరా చేయసాగాడు.
11 సొలొమోను కూడ హీరాముకు అతని ఇంటి వారి పోషణకు రెండు లక్షల తూముల గోధుమలు, మూడు వేల ఎనిమిది వందల[i] పడుల స్వచ్ఛమైన ఒలీవ నూనెను ప్రతియేటా పంపాడు.
12 యెహోవా చేసిన వాగ్దానం ప్రకారం ఆయన సొలొమోనుకు గొప్ప జ్ఞానాన్ని కలుగజేశాడు. హీరాము, సొలొమోనుల మధ్య శాంతి, సామరస్యాలు నెలకొన్నాయి. ఆ ఇద్దరు రాజులు ఒక ఒడంబడిక చేసుకున్నారు.
13 రాజైన సొలొమోను ముప్పదివేల మంది ఇశ్రాయేలీయులను ఈ పనిలో సహాయపడటానికి బలవంతంగా కూలిపనికి చేర్చుకున్నాడు. 14 వీరిపై అధికారిగా అదోనీరాము అను వానిని రాజైన సొలొమోను నియమించాడు. సొలొమోను వారిని మూడు జట్లుగా విభజించాడు. ప్రతి జట్టులోను పదివేల మంది వున్నారు. ప్రతి జట్టు లెబానోనులో ఒక నెలపాటు పనిచేసి, రెండు నెలలు ఇంటివద్ద ఉండేవారు. 15 సొలొమోను ఎనుబది వేల మందిని కొండ ప్రాంతంలో పనిచేయటానికి బలవంతపర్చాడు. వీరు రాళ్లు కొట్టి చెక్కాలి. కొట్టిన రాళ్లను చేరవేయటానికి డెబ్బది వేల మంది వున్నారు. 16 ఈ పని చేసే వారిపై పర్యవేక్షణకై మూడు వేల మూడు వందల మంది నియమితులయ్యారు. 17 రాజైన సొలొమోను దేవాలయ పునాదులకు పనికి వచ్చే విలువైన పెద్ద బండలు చెక్కమని పనివారికి ఆజ్ఞ ఇచ్చాడు. ఈ రాళ్లు అతి నేర్పుగా కొట్టబడేవి. 18 సొలొమోను యొక్క, హీరాము యొక్క శిల్పులు, మరియు బిబ్లోసు[j] నుండి వచ్చన వారును రాళ్లను చెక్కారు. ఈ కట్టడపు పనివారంతా రాళ్లను, దూలాలను, దేవాలయ నిర్మాణానికి తయారు చేశారు.
© 1997 Bible League International