Beginning
సౌలు తన తండ్రి గాడిదలను వెదకబోవటం
9 బెన్యామీను గోత్రమునకు చెందిన వారిలో కీషు చాలా ముఖ్యడు. అతను అబీయేలు కుమారుడు. అబీయేలు సెరోరు కుమారుడు. సెరోరు బెకోరతు పుత్రుడు. బెకోరతు బెన్యామీనీయుడైన అఫీయ కుమారుడు. 2 కీషుకు సౌలు అనే ఒక కుమారుడు ఉన్నాడు. సౌలు చాలా అందగాడు. సౌలుకంటె ఎక్కువ అందగాడు మరొకడు లేడు. ఇశ్రాయేలీయులందరిలోనూ అతడు ఆజానుబాహుడు.
3 ఒకనాడు కీషు గాడిదలు తప్పిపోయాయి. కనుక “సేవకులలో ఒకరిని తీసుకుని గాడిదలను వెదకవలసిందిగా” కీషు తన కుమారుడైన సౌలుతో చెప్పాడు. 4 ఎఫ్రాయిము కొండలు, షాలిషా దేశమంతా వెదికారు. కాని సౌలు, అతని సేవకుడు గాడిదలను కనుక్కోలేకపోయారు. వారు షయలీము ప్రాంతానికి వెళ్లారు. అక్కడ కూడా గాడిదలు లేవు. సౌలు బెన్యామీనీయుల దేశ ప్రాంతంలో కూడ తిరిగి వెదికాడు. అయినా అవి దొరకలేదు.
5 చివరికి సౌలు, అతని సేవకుడు కలసి సూపు పట్టణానికి వచ్చారు. సౌలు, “ఇంటికి వెళ్లి పోదామని తన సేవకునితో అన్నాడు. తన తండ్రి గాడిదల విషయం మర్చిపోయి తమను గురించి కంగారు (చింత) పడతాడని” అన్నాడు సౌలు.
6 “మనము ఈ పట్టణంలోనికి వెళ్దాము. ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు. ప్రజలు అతనిని చాలా గౌరవిస్తారు, ఆయన చెప్పేది నెరవేరుతుంది. ఒకవేళ మనం యిప్పుడు ఎక్కడికి వెళ్లాల్సిందీ అతను చెప్పగలడేమో” అని సేవకుడు సౌలుతో అన్నాడు.
7 “సరే మంచిది. మనం పట్టణంలోనికి వెళ్దాము. కానీ ఆ దైవజనుడికి మనము ఏమి ఇవ్వగలం? మన సంచుల్లో ఆహారం అయిపోయింది. ఆయనకు ఇచ్చేందుకు మన దగ్గర మరి ఏ కానుకలూ లేవు. అందుచేత మనము ఏమి ఇవ్వగలము?” అని సౌలు అన్నాడు.
8 “చూడండి, నా దగ్గర కొంత డబ్బు ఉంది. దానిని ఆ దైవజనుడికి ఇద్దాము. అప్పుడాయన మన ప్రయాణ విషయమై చెపుతాడు” అన్నాడు సేవకుడు.
9-11 “ఇది మంచి ఆలోచన! వెళదాం పద” అన్నాడు సౌలు. కనుక వారిద్దరూ కలసి దైవ జనుడుండే పట్టణం వైపు బయలుదేరి వెళ్లారు.
సౌలు, “సేవకుడు ఆ పట్టణానికి కొండ ఎక్కి వెళ్తున్నారు. మార్గంలో వారు కొందరు యువతులను కలుసుకొన్నారు. వారు నీళ్లకోసం బయటికి వస్తున్నారు.” “దీర్ఘదర్శి ఇక్కడ ఉన్నాడా?” అని వారు ఆ యువతులను అడిగారు. (గతంలో ఇశ్రాయేలీయులు ప్రవక్తను, “దీర్ఘదర్శి” అని పిలిచేవారు. అందుచేత దేవుని నుండి వారు ఏదైనా అడిగి తెలుసుకోవాలనుకొంటే, “దీర్ఘదర్శి దగ్గరకు పోదాం పదండి” అనే వాళ్లు).
12 అది విన్న యువతులు, “అవును ఆ దీర్ఘదర్శి ఇక్కడే ఉన్నాడు. ఆయన ఈ వేళే పట్టణంలోకి వచ్చాడు. వీధిలో ఉన్నాడు ఆరాధనా స్థలంలో సమాధాన బలిలో పాలుపుచ్చుకొనేందుకు కొందరు ప్రజలు ఈ వేళ సమావేశం అవుతున్నారు. 13 మీరు పట్టణంలోకి ప్రవేశించగానే ఆయనను చూడగలరు. మీరు త్వరపడి వెళ్తే, ఆరాధన స్థలంలో ఆయన భోజనానికి వెళ్లక ముందే మీరు ఆయనను చూడగలుగుతారు. దీర్ఘదర్శి వచ్చి బలి పదార్థాలను ఆశీర్వదించే వరకూ ప్రజలు భోజనాలు మొదలు పెట్టరు. వెంటనే వెళ్తే మీరు ఆయనను చూడగలరు” అని ఆ కన్యకలు చెప్పారు.
14 సౌలు, అతని సేవకుడు పట్టణానికి వెళ్లారు. పట్టణంలోకి వెళ్లగానే వారు సమూయేలును చూసారు. ఆరాధనకు వెళ్లే నిమిత్తం సమూయేలు పట్టణంలోనుండి బయటకు వస్తూ వారికి ఎదురయ్యాడు.
15 ఒకరోజు ముందు యెహోవా సమూయేలుతో ఇలా అన్నాడు: 16 “రేపు ఇంచుమించు ఇదే సమయానికి నేను నీ వద్దకు ఒక వ్యక్తిని పంపుతాను. అతడు బెన్యామీనువాడు. నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద నాయకునిగా ఉండేందుకు నీవు అతనిని అభిషేకించాలి[a] నా ప్రజల బాధ నేను గమనించాను. నా ప్రజల రోదన నేను విన్నాను గనుక ఫిలిష్తీయుల బారినుండి నా ప్రజలను అతడు రక్షిస్తాడు.”
17 సమూయేలు ప్రథమంగా సౌలును చూసినప్పుడు యెహోవా అతనితో, “నేను నీకు చెప్పిన వ్యక్తి ఇతడే; నా ప్రజలను పాలించువాడితడే” అన్నాడు.
18 సౌలు పట్టణ ద్వారం దగ్గర సమూయేలుకు కనబడెను. “దీర్ఘదర్శి ఇల్లెక్కడ?” అని సౌలు సమూయేలును అడిగాడు.
19 “నేనే దీర్ఘదర్శిని. నాకు ముందుగా నడుస్తూ ఆరాధనా స్థలానికి వెళ్లు. ఈ రోజు నీవు, నీ సేవకుడు నాతో కలిసి భోజనం చేయాలి. రేపటి ఉదయం నీ ప్రశ్నలన్నింటికీ జవాబు చెప్పి నిన్ను ఇంటికి పంపుతాను. 20 మూడు రోజులనుండి మీరు పోగొట్టుకున్న గాడిదలను గురించి బాధ పడవద్దు. అవి దొరికాయి. ఇప్పుడు ఇశ్రాయేలు కోరుకుంటున్నది ఎవరిని? నీ తండ్రి కుటుంబాన్ని కదా?” అన్నాడు సమూయేలు.
21 అది విన్న సౌలు, “నేను బెన్యామీను వంశానికి చెందిన వాడిని! ఇశ్రాయేలు అంతటిలో నావంశం చిన్నదిగదా! అందులో నా ఇంటివారు అతి తక్కువ సంఖ్యలో వున్నారే! అలాంటి నన్ను ఇశ్రాయేలు కోరుతూ వుందని ఎందుకు చెబుతున్నావు?” అని అడిగాడు.
22 అప్పుడు సమూయేలు సౌలును, అతని సేవకుని భోజనాలు పెట్టే చోటికి తీసుకుని వెళ్లాడు. భోజనాల బల్లవద్ద సౌలుకి, అతని సేవకునికి ప్రముఖ స్థానాలను సమూయేలు ఇచ్చాడు. భోజనాల స్థలంలో సమాధాన అర్పణలో పాలుపుచ్చుకొనేందుకు సుమారు ముప్పది మంది ఆహ్వానించబడ్డారు. 23 వంటవానితో సమూయేలు, “నేను నీకిచ్చిన మాంసాన్ని తీసుకునిరా. ప్రత్యేకంగా భద్రపర్చమని నీతో చెప్పిన మాంస భాగం అది” అన్నాడు.
24 వంటవాడు తొడ మాంసాన్ని[b] తెచ్చి సౌలు ముందు బల్లమీద పెట్టాడు. అప్పుడు సమూయేలు, ఆ మాంసం అతని కోసం ప్రత్యేకించబడిందని సౌలుతో చెప్పాడు. ఈ ప్రత్యేకమైన సందర్భానికోసం అతని కొరకే ఈ మాంసం భద్రపర్చబడింది. కనుక సౌలును దాన్ని స్వీకరించుమని సమూయేలు చెప్పాడు. కావున సౌలు ఆ రోజు సమూయేలుతో కలిసి భోజనం చేశాడు.
25 భోజనాలు అయిన తరువాత వారు ఆరాధనా స్థలం నుండి క్రిందికి దిగి పట్టణంలోకి వెళ్లారు. ఒక మిద్దెమీద సౌలుకు పడక ఏర్పాటు చేసారు. అక్కడ సౌలు నిద్రపోయాడు.
26 మరునాడుతెల్లవారుఝామున సమూయేలు లేచి మిద్దెమీద ఉన్న సౌలును మేల్కొలిపాడు. “బయల్దేరు, నిన్ను నీ దారిని నేను పంపిస్తాను” అన్నాడు సమూయేలు. సౌలు లేచి సమూయేలుతో కలిసి బయటికి వెళ్లాడు.
27 సౌలు, అతని సేవకుడు సమూయేలుతో కలిసి ఊరి బయటకు రాగానే సమూయేలు సౌలును పిలిచి, “నీ సేవకుణ్ణి మనకు ముందు నడుస్తూ వుండ మని చెప్పు. నేను నీకు చెప్పాల్సిన దేవుని సందేశం ఒకటి ఉంది” అని చెప్పాడు.
సమూయేలు సౌలును అభిషేకించుట
10 సమూయేలు ఒక పాత్రలో ప్రత్యేక నూనె తీసుకుని సౌలు తలమీద పోసాడు. సమూయేలు సౌలును ముద్దు పెట్టుకొని, “యెహోవా తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు నిన్ను నాయకునిగా ఉండేందుకు అభిషేకించాడు. నీవు దేవుని ప్రజలకు ఆధిపత్యం వహించాలి. చుట్టూరా వున్న శత్రువుల బారినుండి వారిని నీవు కాపాడతావు. యెహోవా తన ప్రజల మీద పాలకునిగా ఉండేందుకు నిన్ను అభిషేకించాడు. ఇది సత్యమని ఋజువు చేసే గుర్తు ఇది. 2 ఈ రోజు నీవు నా వద్దనుండి వెళ్లగానే బెన్యామీను సరిహద్దుల్లో సెల్సహు వద్దనున్న రాహేలు సమాధి దగ్గర నీవు ఇద్దరు వ్యక్తులను కలుస్తావు. ‘నీవు వెదకబోయిన గాడిదలు దొరుకుతాయి. నీ తండ్రి గాడిదలను గూర్చి చింత పడటం మానేసాడు. ఇప్పుడు ఆయన నీ విషయంలో చింతిస్తున్నాడు. నా కుమారుని సంగతి నేనేమి చేయాలి? అని ఆయన అంటున్నాడు’” అని ఆ ఇద్దరు మనుష్యులు నీతో అంటారు.
3 “ఆ తరువాత తాబోరు వద్ద సింధూర మహా వృక్షంవరకూ నీవు ఆగకుండా ప్రయాణం చేస్తావు. అక్కడ మళ్లీ ముగ్గురు మనుష్యులు నిన్ను కలుస్తారు. వారు బేతేలు పట్టణంలో దేవుని ఆరాధించటానికి వెళుతూఉంటారు. వారిలో ఒకడు మూడు మేక పిల్లలను మోసుకొని వస్తాడు. రెండవ వానివద్ద మూడు రొట్టెలు ఉంటాయి. మూడవ వానివద్ద ఒక తిత్తినిండా ద్రాక్షారసం ఉంటుంది. 4 ఆ ముగ్గురు వ్యక్తులూ నిన్ను పలకరించి రెండు రొట్టెలు నీకు ఇస్తారు. ఆ రెండిటినీ వారినుండి నీవు తీసుకుంటావు. 5 తరువాత నీవు ఫిలిష్తీయుల కోటవున్న గిబియ-ఎలోహిముకు[c] వెళతావు. నీవు ఆ పట్టణం దరిచేరగానే ఒక ప్రవక్తల గుంపు బయటకు రావటం నీవు చూస్తావు. వీరు ఆరాధనా స్థలంనుండి వస్తూ ఉంటారు. వీణలు, తంబూరా, వేణువు, తంతి వాయిద్యాలను ముందు వాయిస్తూ దేవుని గూర్చిన విషయాలు చెబుతూ వస్తారు. 6 యెహోవా ఆత్మ నీ మీదకు బలంగా వస్తుంది. నీలో గొప్ప పరివర్తనవస్తుంది. ఆ ప్రవక్తలతో పాటు నీవు కూడా దేవుని విషయాలు చెబుతావు. 7 ఈ సూచనలన్నీ ఋజువయ్యాక, నీ ఇష్టం వచ్చినట్లు చేయవచ్చును. దేవుడు నీకు తోడై ఉంటాడు.
8 “నాకంటె ముందుగా నీవు గిల్గాలుకు వెళ్లు. నేను తరువాత వచ్చి నిన్ను కలుస్తాను. అప్పుడు నేను దహన బలులు, సమాధాన బలులు అర్పిస్తాను. కానీ, నీవు ఏడు రోజులు ఆగవలసి వుంటుంది. అప్పుడు నిన్ను కలిసి నీవు ఏమి చేయాలో చెబుతాను” అన్నాడు.
సౌలు ప్రవక్తలా మాట్లాడుట
9 సమూయేలును వదిలి సౌలు వెళ్లిపోవటానికి మరలగానే దేవుడు సౌలుకు హృదయ పరివర్తన కలుగచేసాడు. అతనికి చెప్పబడిన గుర్తులన్నీ ఆ రోజు నిజమయ్యాయి. 10 సౌలు, అతని సేవకుడు గిబియ-ఎలోహిముకు చేరగానే సౌలు కొంతమంది ప్రవక్తలను కలిసాడు. దేవుని ఆత్మ సౌలు మీదికి అతి శక్తివంతంగా దిగాడు. మిగిలిన ప్రవక్తలతో కలసి సౌలుకూడ దేవుని విషయాలు చెప్పసాగాడు. 11 ఇదివరకు సౌలును ఎరిగిన ప్రజలు అతడు ఇతర ప్రవక్తలతో కలసి ప్రవక్తలా మాట్లాడటం చూసారు. వారంతా “కీషు కొడుకు సౌలుకు ఏమయ్యిందో ఏమో! సౌలుకూడా ప్రవక్తలలో ఒకడయ్యాడా?” అంటూ ఆశ్చర్యపోయారు.
12 గిబియ-ఎలోహిములో నివసిస్తున్న ఒకడు, “అవును, అతడు వారి నాయకుడిలా[d] కనబడుతున్నాడు” అన్నాడు. అందుకే, “సౌలుకూడా ప్రవక్తల్లో ఒకడా?” అనే నానుడి ప్రసిద్ధికెక్కింది.
సౌలు ఇల్లు చేరుట
13 దేవుని విషయాలు ప్రవచించటం అయిన తర్వాత సౌలు తన ఇంటివద్ద ఉన్న ఆరాధనా స్థలం దగ్గరకు వచ్చాడు.
14 సౌలు తన సేవకుని కలిసి ఇంటికి వెళ్లగానే అతని పినతండ్రి, “ఎక్కడికి పోయారు” అని వారిని అడిగాడు.
“గాడిదలను వెదకటానికి వెళ్లాము. అవి దొరకక పోయేసరికి సమూయేలును చూడటానికి వెళ్లాము.” అని సౌలు చెప్పాడు.
15 “సమూయేలు నీకు ఏమి చెప్పాడో దయచేసి నాకు చెప్పు” అన్నాడు సౌలు పినతండ్రి.
16 “గాడిదలు దొరికినట్లు వెల్లడి చేశాడని సౌలు అన్నాడు.” అంతేగాని రాజ్యాన్ని గురించి సమూయేలు చెప్పినదేదీ సౌలు తన పినతండ్రికి చెప్పలేదు.
సౌలును రాజుగా సమూయేలు ప్రకటించుట
17 మిస్పావద్ద యెహోవాను కలుసుకొనేందుకు ఇశ్రాయేలీయులంతా సమావేశం కావాలని సమూయేలు పిలుపునిచ్చాడు. 18 సమూయేలు ఇలా అన్నాడు: “నేను ఇశ్రాయేలును ఈజిప్టునుంచి బయటకు తీసుకుని వచ్చాను. ‘నేను మిమ్మల్ని ఈజిప్టు బంధంనుండి విడుదల చేశాను. మిమ్మల్ని బాధించటానికి ప్రయత్నించిన ఇతర రాజ్యాలనుండి కూడా మిమ్మల్ని రక్షించాను.’ అని ఇశ్రాయేలీయుల యెహోవా దేవుడు చెప్పాడు: 19 మళ్లీ ఇశ్రాయేలీయులతో సమూయేలు ఇలా అన్నాడు: ‘మీ అందరి కష్టనష్టాల నుండి మీ దేవుడు మిమ్మల్ని కాపాడుతూ వస్తూనే వున్నాడు. కానీ నేడు మీరు మీ దేవుని తిరస్కరించారు. మిమ్మల్ని పాలించటానికి మీకో రాజు కావాలని అడుగుతున్నారు.’ సరే. రండి! మీమీ వంశాల వారీగా, కుటుంబాల వారీగా దేవుని ముందర నిలబడండి.”
20 ఇశ్రాయేలు వంశాల వారినందరినీ సమూయేలు ఒక చోట చేర్చాడు. వారిలో బెన్యామీను వంశం ఎన్నుకోబడింది. 21 బెన్యామీను వంశంలో వున్న కుటుంబాల వారందరినీ గుంపు గుంపుగా వరుసగా నడిపించాడు. వాటిలో మథ్రీ కుటుంబం ఎన్నుకోబడింది. మరల మథ్రీ కుటుంబంలోని వారందరినీ వరుసుగా నడిపించాడు. వారిలో కీషు కుమారుడు సౌలు ఎంపిక చేయబడ్డాడు.
సౌలును చూడాలని వచ్చిన ప్రజలు అతనికోసం వెదకగా అతడు కనిపించలేదు. 22 “ఆ మనిషి ఇక్కడ ఉన్నాడా?” అని ప్రజలు అడిగారు.
“సౌలు సామానుల వెనుక దాగి ఉన్నాడని” యెహోవా చెప్పాడు.
23 జనం పరుగెత్తుకుంటూ పోయి సామాన్ల వెనుక దాగుకొని ఉన్న సౌలును తీసుకుని వచ్చారు. సౌలు వారందరిలో నిలబడి ఉన్నపుడు అతను అందరికంటె ఎత్తుగా, ఆజానుబాహుడుగా కనబడ్డాడు.
24 “ఇదిగో చూడండి, యెహోవా ఎంపిక చేసిన మనిషి, ప్రజలలో సౌలువంటివాడు ఒక్కడూ లేడు.” అని సమూయేలు ప్రజలందరితో అన్నాడు.
అప్పుడు ప్రజలు, “రాజు దీర్ఘకాలం జీవించునుగాక!” అని అరిచారు.
25 నూతన రాజ్యంలో నిబంధనావళిని సమూయేలు ప్రజలకు వివరించాడు. రాజ్యపరిపాలన నియమాలను, నిబంధనలను ఒక పుస్తకంలో వ్రాసి సమూయేలు యెహోవా ముందర ఉంచాడు. అలా చేసి సమూయేలు ప్రజలను తమ తమ ఇండ్లకు వెళ్లమన్నాడు.
26 సౌలు గిబియాలో వున్న తన ఇంటికి వెళ్లిపోయాడు. దేవుడు అక్కడ వున్న ధైర్యవంతుల హృదయాలను ప్రేరేపించాడు. ఈ ధీరులంతా సౌలు వెంట వెళ్లారు. 27 కాని పనికిమాలినవారు కొందరు “ఈ వ్యక్తి మనలను ఎలా రక్షించగలడు” అని అంటూ సౌలును చులకనగా చేసి, అతనికి కానుకలను పట్టుకు వెళ్లటానికి నిరాకరించారు. సౌలు ఏమీ పలకలేదు.
అమ్మోనీయుల రాజు నాహాషు
అమ్మోనీయుల రాజైన నాహాషు గాదీయులను, రూబేనీయులను క్రూరంగా బాధిస్తూండేవాడు. వారిలో ప్రతి ఒక్కడి కుడి కంటినీ రాజు తీసివేస్తూండేవాడు. వారిని ఎవరైనా రక్షించటం కూడా అతడు సహించలేదు. అమ్మోనీయుల రాజైన నాహాషు యొర్దాను నదికి కుడి వైపున ఉన్న ఇశ్రాయేలీయులలో ప్రతి ఒక్కరి కుడి కన్నూ తోడివేసాడు. కాని ఏడువేలమంది అమ్మోనీయుల నుండి పారిపోయి యాబేష్గిలాదుకు చేరారు.
11 ఒకనెల గడిచింది. తరువాత అమ్మోనీయుడైన నాహాషు తన సైన్యంతో వచ్చి యాబేష్గిలాదు నగరాన్ని ముట్టడించాడు. “నీవు మాతో ఒడంబడిక చేసుకొంటే మేము నీ సేవ చేస్తాము” అని యాబేషు ప్రజలు నాహాషుతో చెప్పారు.
2 “మీలోని ప్రతి ఒక్కని కుడి కంటినీ తోడివేయనిస్తే మీతో సంధికి ఒప్పుకుంటానన్నాడు నాహాషు.” అలా చేస్తే నేను ఇశ్రాయేలునంతటినీ అవమాన పర్చి నట్లువుతుందన్నాడు.
3 అది విన్న యాబేషు ప్రజల నాయకులు “ఏడు రోజులు గడువు ఇవ్వమని అడిగారు. ఇశ్రాయేలు నలుమూలలకు దూతలను పంపుతామనీ, ఎవ్వరూ సహాయం చేయటానికి ముందుకు రాకపోతే లొంగిపోతామనీ” వారు నాహాషుతో అన్నారు.
సౌలు యాబేషు గిలాదును రక్షించుట
4 వార్తాహరులు సౌలు నివసిస్తున్న గిబియాకు వెళ్లారు. అక్కడి ప్రజలకు ఆ వార్త అందజేశారు. ప్రజలు ఘోరంగా విలపించారు. 5 సౌలు అప్పుడే తన పొలములోని తన పశువుల దగ్గరనుండి ఇంటికి వస్తూనే ప్రజల రోదన విన్నాడు. “ప్రజలకేమయ్యింది? వారెందుకు విలపిస్తున్నారు?” అని అడిగాడు.
అప్పుడు ప్రజలు యాబేషునుండి వచ్చిన దూతలు చెప్పినదంతా వినిపించారు. 6 అది వినగానే సౌలు మీదకు దేవుని ఆత్మ శక్తివంతంగా వచ్చి ఆవరించింది. అతనికి పట్టరాని కోపం వచ్చింది. 7 సౌలు ఒక జత కాడి ఎద్దులను తీసుకొని, వాటిని నరికి ముక్కలు చేసి, వాటిని ఆ వచ్చిన దూతలకు ఇచ్చి, వాటిని ఇశ్రాయేలు నలు మూలలకూ తీసుకొని వెళ్లమన్నాడు. వార్తాహరులు ఆ ఎడ్ల మాంస ఖండాలను వాడ వాడలా తిప్పుతూ “సౌలును, సమూయేలును వెంబడించని వారి ఎడ్లన్నిటికీ ఇదే గతి పడుతుందని చాటి చెప్పారు.”
యెహోవా భయం ప్రజలందరికీ ముంచు కొచ్చింది. వారంతా ఒక్కటై బయటికి వచ్చారు. 8 సౌలు బెజెకు వద్ద వారిని సమావేశపరచినప్పుడు అక్కడ మూడులక్షల మంది ఇశ్రాయేలీయులు, ముప్పదివేలమంది యూదా వారు ఉన్నారు.
9 “గిలాదులో ఉన్న యాబేషుకు వెళ్లండి. ఆ ప్రజలు రేపు మధ్యాహ్నంలోగా రక్షించబడతారని ఆ ప్రజలతో చెప్పండి” అని సౌలు, అతని సైనికులు యాబేషునుండి వచ్చిన మనుష్యులకు చెప్పారు.
సౌలు సమాచారాన్ని యాబేషు ప్రజలకు ఆ దూతలు తెలియజేసినప్పుడు వారు చాలా ఆనందపడ్డారు. 10 యాబేషు ప్రజలు, “రేపు లొంగిపోతామనీ, అప్పుడు వారిని తనకు ఇష్టం వచ్చినట్లు చేయవచ్చనీ” అమ్మోనీయుడైన నాహాషుకు తెలియజేశారు.
11 అ మరునాటి ఉదయం సౌలు తన సైన్యాన్ని మూడు గుంపులుగా విభజించాడు. సూర్యోదయానికి సౌలు సైన్యం అమ్మోనీయుల శిబిరాన్ని చేరింది. అమ్మోనీయుల గస్తీ తిరిగే జట్టు మారుతున్నప్పుడు సౌలు వారిమీద దాడి చేసాడు. సౌలు, అతని సైనికులు అమ్మోనీయులను ఓడించారు. చావగా మిగిలిన అమ్మో నీయులు చెల్లాచెదురై పోయారు. ఏ ఇద్దరూ కూడ కలిసి ఉండే అవకాశం వారికి లేకుండా పోయింది.
12 “సౌలు రాజుగా ఉండటానకి అంగీరకించని వాళ్లెవరు? వారిని ఇక్కడకి తీసుకొని రండి. వారిని చంపేస్తాము” అని ప్రజలు సమూయేలుతో అన్నారు.
13 “వద్దు. ఈ వేళ ఇశ్రాయేలీయులను రక్షించినవాడు యెహోవా. అందుచేత ఈ వేళ ఏ ఒక్కరూ చంపబడకూడదు” అని సౌలు చెప్పాడు.
14 “గిల్గాలుకు వెళదాం రండి. అక్కడ సౌలు రాజరికాన్ని తిరిగి కొనసాగేలా చేద్దాము” అన్నాడు సమూయేలు ప్రజలతో.
15 జనమంతా గిల్గాలుకు వెళ్లారు. అక్కడ యెహోవా ఎదుట వారు సౌలును మళ్లీ రాజుగా ఎన్నుకున్నారు. వారు యెహోవాకు సమాధాన బలులు కూడ అర్పించారు. సౌలు, ఇశ్రాయేలు ప్రజలు గొప్ప సంబరం జరుపుకొన్నారు.
రాజు విషయం సమూయేలు మాట్లాడుట
12 సమూయేలు ఇశ్రాయేలు ప్రజలనుద్దేశించి ఇలా అన్నాడు: “మీరు నన్ను కోరినదంతా చేశాను. మీకు ఒక రాజు కావాలంటే ఇచ్చాను. 2 ఇప్పుడు మీకు నాయకత్వం వహించటానికి ఒక రాజు ఉన్నాడు. నేను తల నెరసి ముసలివాడనై పోయాను. నా కుమారులు మీతోనే ఉన్నారు. నా చిన్ననాటి నుంచీ మీకు నేను ఆధిపత్యం వహించాను. 3 ఇప్పుడు నేను మీ సమక్షంలోనే ఉన్నాను. నేనేదైనా తప్పు చేసివుంటే మీరు నాకు వ్యతిరేకంగా వాటిని దేవునికి, ఆయన ఏర్పరచిన రాజుకు చెప్పండి. నేను ఎవరి ఎద్దునే గాని, గాడిదనే గాని దొంగిలించానా? నేనెవరినైనా భాధించటంగాని, మోసగించటంగాని జరిగిందా? నేనెప్పుడైన డబ్బుగాని, ఒక జత చెప్పులుగాని తప్పుపని చేయటానికి తీసుకున్నానా? ఇటువంటి పనులేవైనా చేసి ఉంటే నేను వాటిని తిరిగి ఇచ్చి తప్పు సరిదిద్దుకుంటాను.”
4 “నీవు మమ్ములను మోసం చేయలేదు; బాధపెట్టనూ లేదు. నీవు ఎవరి వద్దా లంచాలు కూడ తీసుకోలేదు” అని ఇశ్రాయేలు జనం అన్నారు.
5 “యెహోవా, ఆయన ఎంపిక చేసిన రాజు కూడ ఈ రోజు మీరు చెప్పిన దానిని విన్నారు. మీరు నాలో ఏ తప్పూ కనుగొనలేదనే దానికి వారిద్దరూ సాక్షులు” అన్నాడు సమూయేలు. అంతట ప్రజలు, “అవును! ఇది సత్యం” అని చెప్పారు.
6 అప్పుడు ప్రజలనుద్దేశించి సమూయేలు, “ఆ దేవుడే సాక్షి. ఆయనే మోషేను, అహరోనును ఎంపికచేసాడు. మీ పూర్వీకులను ఈజిప్టు నుండి ఆయనే విముక్తులను చేసాడు. 7 మీరంతా ఇప్పుడు ఇక్కడ నిలబడండి. ఆ యెహోవా మీ కోసం, మీ పూర్వీకుల సంక్షేమం కోసం చేసిన పనులను వివరిస్తాను.
8 “యాకోబు వెళ్లిన తర్వాత ఈజిప్టు ప్రజలు ఆయన వంశీకుల జీవితాన్ని కష్టతరం చేశారు. కావున వారు యెహోవా సహాయం అర్థించారు. వారి మొర ఆలకించిన యెహోవా మోషేను, అహరోనును అక్కడికి పంపించాడు. వారిద్దరూ మీ పూర్వీకులను ఈజిప్టు నుండి బయటకు తీసుకుని వచ్చి ఈ ప్రాంతానికి నడిపించారు.
9 “కానీ మీ పూర్వీకులు వారి దేవుడైన యెహోవాను మర్చిపోయారు. అప్పుడు యెహోవా వారిని హాసోరు పట్టణ సైన్యాధిపతి సీసెరాకు బానిసలయ్యేలా చేశాడు. తరువాత ఫిలిష్తీయులకు, మోయాబు రాజుకు కూడ యెహోవా వారిని బానిసలు కానిచ్చాడు. వారంతా మీ పూర్వీకులకు వ్యతిరేకంగా పోరాడారు. 10 అయితే మీ పూర్వీకులు సహాయంకోసం యెహోవాకు మొరపెట్టారు. ‘మేము పాపం చేసాము. మేము యెహోవాను విడిచిపెట్టి బయలు, అష్తారోతు అనే బూటకపు దేవతలను సేవించాము. అయితే ఇప్పుడు మమ్మల్ని మా శత్రువుల బారినుండి రక్షించు. మేము నిన్ను సేవిస్తాము’ అని చెప్పారు.
11 “యెరుబ్బయలు (గిద్యోను) బెదానను (బారాకు) యెఫ్తా, సమూయేలును పంపి, మీ చుట్టూ ఉన్న శత్రువులనుండి యెహోవా మిమ్మల్ని రక్షించాడు. మీరు క్షేమంగా జీవిస్తున్నారు. 12 కానీ అమ్మోనీయుల రాజైన నాహాషు మీమీద యుద్ధానికి రావటం మీరు చూచినప్పుడు, మీకు మీ దేవుడైన యెహోవా రాజుగా ఉన్నప్పటికీ ‘మమ్ము పాలించటానికి మాకు ఒక రాజు కావాలని’ మీరు కోరుకున్నారు! 13 మీరు ఎంపిక చేసుకొన్న రాజు మీరు కోరుకున్న రాజు ఇదిగో ఇక్కడ ఉన్నాడు. మీమీద ఒక రాజును యెహోవా నియమించాడు. 14 మీరు యెహోవాను ఘనపరచి, ఆయనను సేవించాలి. ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా మీరు పోరాడకూడదు. మరియు మీరు, మిమ్మల్ని పాలిస్తున్న రాజు, మీ దేవుడైన యెహోవాను వెంబడించాలి. మీరు ఆ పనులు చేస్తే, అప్పుడు దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. 15 కానీ మీరు యెహోవాకు విధేయులు కాకపోతే, ఆయన ఆజ్ఞలను తిరస్కరిస్తే, ఆయన మీకు వ్యతిరేకి అవుతాడు. ప్రభువు మిమ్మల్ని, మీ రాజును సర్వనాశనం చేస్తాడు.
16 “ఇప్పుడు మీరు నిశ్శబ్ధంగా, నిశ్చలంగా నిలబడండి మీ కళ్లముందే యెహోవా చేసే ఒక మహిమాన్విత కార్యం చూడండి. 17 ఇప్పుడు గోధుమ పంట[e] కోతకు వచ్చింది. ఫెళఫెళమనే ఉరుములు, మెరుపులతో వర్షం కురిపించుమని నేను దేవుని ప్రార్థిస్తాను. అప్పుడు మీరు రాజు కావాలని అడిగి, యెహోవాపట్ల ఎంత పాపం చేశారో మీరే తెలుసుకుంటారు,” అని వివరంగా చెప్పాడు.
18 అలా చెప్పి, సమూయేలు యెహోవాను ప్రార్థించాడు. అదే రోజున యెహోవా ఉరుములతో కూడిన వర్షం పంపించాడు. దానితో యెహోవా అనిన, సమూయేలు అనిన ప్రజలకు విపరీతమైన భయం ఏర్పడింది. 19 ప్రజలు సమూయేలుతో, “నీ సేవకులమైన మాకోసం దేవుడైన యెహోవాను ప్రార్థించు. మమ్మల్ని చనిపోనీయవద్దు. మా పాపాల మూటకుతోడు రాజు కావాలని అడిగే దురాచారాన్ని కూడ సంతరించుకున్నాం” అని వాపోయారు.
20 భయపడవద్దని సమూయేలు వారికి ధైర్యం చెప్పాడు. “మీరు తప్పు చేసిన మాట నిజమే. అయినా యెహోవాకు దూరం కావద్దు. మీ హృదయ పూర్వకంగా యెహోవాకు సేవ చేయండి. 21 విగ్రహాలు వట్టి బొమ్మలే. అవి మీకు సహాయం చేయలేవు. కావున వాటిని పూజించవద్దు. విగ్రహాలు మీకు సహాయము చెయ్యలేవు, కాపాడనూలేవు. విగ్రహాలు కేవలం వ్యర్థము!
22 “అయితే యెహోవా తన ప్రజలను విడిచి పెట్టడు. యెహోవా మిమ్మల్ని తన స్వంత ప్రజలుగా చేసుకొనేందుకు ఆనందించాడు. అందుచేత తనమంచి పేరుకోసం ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు. 23 కావున మీ కోసం ప్రార్థన చేయకుండా నేను మాని వేస్తే అది నా తప్పు అవుతుంది. ఒకవేళ నేను అలా మానివేస్తే యెహోవాకు విరుద్ధంగా పాపం చేసినవాణ్ణి అవుతాను. సరైన మంచి జీవన మార్గాన్ని నేను మీకు ప్రబోధిస్తాను. 24 అయితే మీరు యెహోవా ఎడల భయభక్తులతో ఉండాలి. మీ పూర్ణ హృదయంతో మీరు వాస్తవంగా ఆయనను సేవించాలి. ఆయన మీ కోసం చేసిన ఆశ్చర్యకరమైన పనులన్నీ జ్ఞాపకం చేసుకోండి! 25 మీరు మొండి వైఖరితో చెడుచేస్తూనే ఉంటే ఆయన మిమ్మల్నీ, మీ రాజునూ చీపురుతో ఊడ్చి పారవేసినట్లు విసిరేస్తాడు” అని సమూయేలు వారికి వివరించి చెప్పాడు.
© 1997 Bible League International