Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 119:145-176

ఖాఫ్

145 యెహోవా, నా హృదయపూర్తిగా నేను నీకు మొరపెడ్తున్నాను.
    నాకు జవాబు ఇమ్ము. నేను నీ ఆజ్ఞలకు విధేయుడను.
146 యెహోవా, నేను నీకు మొరపెట్టుతున్నాను. నన్ను రక్షించుము.
    నేను నీ ఒడంబడికకు విధేయుడనవుతాను.
147 యెహోవా, నిన్ను ప్రార్థించుటకు నేను వేకువనే మేల్కొన్నాను. నీ మాటకోసం నేను వేచియుంటాను.
    నీవు చెప్పేవాటియందు నేను నమ్మకముంచుతాను.
148 నీ వాక్యాన్ని ధ్యానించుటకు
    నేను చాలా రాత్రివరకు మెళకువగా ఉన్నాను.
149 నీవు దయతో నా మాట విను.
    యెహోవా, నీ న్యాయ శాస్త్రానుసారముగా నన్ను జీవింపనిమ్ము.
150 మనుష్యులు నాకు విరోధంగా కీడు పథకాలు వేస్తున్నారు.
    యెహోవా, ఆ మనుష్యులు నీ ఉపదేశాలను అనుసరించరు.
151 యెహోవా, నీవు నాకు సన్నిహితంగా ఉన్నావు.
    నీ ఆజ్ఞలు అన్నీ నమ్మదగినవి.
152 నీ ఉపదేశాలు శాశ్వతంగా కొనసాగుతాయని
    చాలా కాలం క్రిందట నీ ఒడంబడిక నుండి నేను నేర్చుకొన్నాను.

రేష్

153 యెహోవా, నా శ్రమను చూచి, నన్ను తప్పించుము.
    నీ ఉపదేశాలను నేను మరువలేదు.
154 యెహోవా, నాకోసం నా పోరాటం నీవు పోరాడి, నన్ను రక్షించుము.
    నీ వాగ్దానం ప్రకారం నన్ను జీవించనిమ్ము.
155 దుష్టులు జయించరు. ఎందుకంటే,
    వారు నీ న్యాయ చట్టాలను అనుసరించరు.
156 యెహోవా, నీవు చాలా దయగలవాడవు.
    నీవు చెప్పే సరియైన వాటిని చేసి, నన్ను జీవించనిమ్ము
157 నన్ను బాధించుటకు ప్రయత్నిస్తున్న శత్రువులు నాకు చాలామంది ఉన్నారు.
    కాని నేను మాత్రం నీ ఒడంబడికను అనుసరించటం ఆపివేయలేదు.
158 ఆ ద్రోహులను నేను చూస్తున్నాను.
    ఎందుకంటే యెహోవా, వారు నీ మాటకు విధేయులు కారు.
159 చూడుము, నీ ఆజ్ఞలకు విధేయుడనగుటకు నేను కష్టపడి ప్రయత్నిస్తాను.
    యెహోవా, నీ ప్రేమ అంతటితో నన్ను జీవించనిమ్ము.
160 యెహోవా, ఆది నుండి నీ మాటలు అన్నీ నమ్మదగినవి.
    నీ మంచి ధర్మశాస్త్రం శాశ్వతంగా నిలుస్తుంది.

షీన్

161 ఏ కారణం లేకుండానే బలమైన నాయకులు నా మీద దాడి చేశారు.
    కాని నేను మాత్రం నీ ధర్మశాస్త్రానికే భయపడి, దాన్ని గౌరవిస్తాను.
162 యెహోవా, అప్పుడే ఐశ్వర్యపు నిధి దొరకిన వానికి ఎంత సంతోషమో,
    నీ వాక్యం నన్ను అంత సంతోష పరుస్తుంది.
163 అబద్ధాలంటే నాకు అసహ్యం! నేను వాటిని తృణీకరిస్తాను.
    యెహోవా, నీ ఉపదేశాలు నాకు ఇష్టం.
164 నీ మంచి న్యాయ చట్టాలను బట్టి
    నేను రోజుకు ఏడుసార్లు నిన్ను స్తుతిస్తాను.
165 నీ ఉపదేశాలను ప్రేమించే మనుష్యులకు నిజమైన శాంతి లభిస్తుంది.
    ఆ మనుష్యులను ఏదీ పడగొట్టలేదు.
166 యెహోవా, నీవు నన్ను రక్షించాలని నేను కనిపెడ్తున్నాను.
    నేను నీ ఆజ్ఞలకు విధేయుడనయ్యాను.
167 నేను నీ ఒడంబడికను అనుసరించాను.
    యెహోవా, నీ న్యాయ చట్టాలు అంటే నాకు ఎంతో ప్రేమ.
168 నీ ఒడంబడికకు, నీ ఆజ్ఞలకు నేను విధేయుడనయ్యాను.
    యెహోవా, నేను చేసింది ప్రతిది నీకు తెలుసు.

తౌ

169 యెహోవా, నా సంతోష గీతం ఆలకించుము.
    నీ వాగ్దాన ప్రకారం నన్ను జ్ఞానం గలవానిగా చేయుము.
170 యెహోవా, నా ప్రార్థన వినుము.
    నీవు వాగ్దానం చేసినట్టే, నన్ను రక్షించుము.
171 నీవు నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించావు
    కనుక నేను స్తుతి గీతాలతో ఉప్పొంగిపోతాను.
172 నీ మాటలకు నన్ను జవాబు చెప్పనిమ్ము.
    నా పాట నన్ను పాడనిమ్ము. యెహోవా, నీ న్యాయచట్టాలన్నీ మంచివి.
173 నేను నీ ఆజ్ఞలను అనుసరించాలని నిర్ణయించుకొన్నాను
    గనుక నన్ను ఆదుకొని, నాకు సహాయం చేయుము.
174 యెహోవా, నీవు నన్ను రక్షించాలని నేను కోరుతున్నాను.
    కాని నీ ఉపదేశాలు నన్ను సంతోష పరుస్తాయి.
175 యెహోవా, నన్ను జీవించనిమ్ము. నిన్ను స్తుతించనిమ్ము.
    నీ న్యాయ చట్టాలు నాకు సహాయం చేయనిమ్ము.
176 నేను తప్పిపోయిన గొర్రెలా తిరిగాను.
    యెహోవా, నా కోసం వెదకుతూ రమ్ము.
నేను నీ సేవకుడను.
    మరియు నేను నీ ఆజ్ఞలను మరువలేదు.

కీర్తనలు. 128-130

యాత్ర కీర్తన.

128 యెహోవా అనుచరులందరూ సంతోషంగా ఉంటారు.
    ఆ ప్రజలు యెహోవా కోరిన విధంగా జీవిస్తారు.

నీవు వేటికోసం పని చేస్తావో వాటిలో ఆనందిస్తావు.
    ఎవ్వరూ వాటిని నీ వద్దనుండి తీసుకోలేరు. నీవు సంతోషంగా ఉంటావు. మంచి విషయాలు నీకు సంభవిస్తాయి.
ఇంట్లో నీ భార్య ఫలించే ద్రాక్షావల్లిలా ఉంటుంది.
    బల్లచుట్టూరా నీ పిల్లలు, నీవు నాటిన ఒలీవ మొక్కల్లా ఉంటారు.
యెహోవా తన అనుచరులను నిజంగా ఈ విధంగా ఆశీర్వదిస్తాడు.
యెహోవా సీయోనులోనుండి నిన్ను ఆశీర్వదిస్తాడని నేను ఆశిస్తున్నాను.
    నీవు నీ జీవిత కాలమంతా యెరూషలేములో ఆశీర్వాదాలు అనుభవిస్తావని నేను ఆశిస్తున్నాను.
నీవు నీ మనుమలను, మనుమరాండ్రను చూచేంతవరకు జీవిస్తావని నేను ఆశిస్తాను.

ఇశ్రాయేలులో శాంతి ఉండునుగాక.

యాత్ర కీర్తన.

129 నా జీవిత కాలమంతా నాకు ఎంతోమంది శత్రువులు.
    ఇశ్రాయేలూ, ఆ శత్రువులను గూర్చి మాకు చెప్పుము.
నా జీవిత కాలమంతా నాకు ఎంతో మంది శత్రువులు ఉన్నారు
    కాని వారు ఎన్నడూ జయించలేదు.
నా వీపుమీద లోతైన గాయాలు అయ్యేంతవరకు వారు నన్ను కొట్టారు.
    నాకు చాలా పెద్ద, లోతైన గాయాలు అయ్యాయి.
అయితే దయగల యెహోవా తాళ్ళను తెగకోసి
    ఆ దుర్మార్గులనుండి నన్ను విడుదల చేసాడు.
సీయోనును ద్వేషించిన మనుష్యులు ఓడించబడ్డారు.
వారు పోరాటం మానివేసి పారిపోయారు.
ఆ మనుష్యులు ఇంటి కప్పు మీద మొలిచిన గడ్డిలాంటి వాళ్లు.
    ఆ గడ్డి ఎదుగక ముందే వాడిపోతుంది.
పని వానికి ఆ గడ్డి గుప్పెడు కూడా దొరకదు.
    ధాన్యపు పన కట్టేందుకు కూడా అది సరిపోదు.
ఆ దుర్మార్గుల పక్కగా నడుస్తూ వెళ్లే మనుష్యులు, “యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక” అని చెప్పరు.
    “యెహోవా నామమున మేము మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాము” అని చెబుతూ మనుష్యులు వారిని ఏమీ అభినందించరు.

యాత్ర కీర్తన.

130 యెహోవా, నేను గొప్ప కష్టంలో ఉన్నాను.
    కనుక సహాయం కోసం నిన్ను పిలుస్తున్నాను.
నా ప్రభువా, నా మాట వినుము.
    సహాయం కోసం నేను చేస్తున్న మొర వినుము.
యెహోవా, మనుష్యులను వారి పాపాలన్నిటిని బట్టి నీవు శిక్షిస్తే
    ఒక్క మనిషి కూడా మిగలడు.
యెహోవా, నీ ప్రజలను క్షమించుము.
    అప్పుడు నిన్ను ఆరాధించుటకు మనుష్యులు ఉంటారు.

యెహోవా నాకు సహాయం చేయాలని నేను కనిపెడుతున్నాను.
    నా ఆత్మ ఆయన కోసం కనిపెడుతుంది.
    యెహోవా చెప్పేది నేను నమ్ముతున్నాను.
నా ప్రభువు కోసం నేను కనిపెడుతున్నాను.
    ఎప్పుడు తెల్లారుతుందా అని ఆశతో కనిపెడుతున్న కావలివాండ్లలా నేను ఉన్నాను.
ఇశ్రాయేలూ, యెహోవాను నమ్ముకో.
    నిజమైన ప్రేమ యెహోవా దగ్గర మాత్రమే కనబడుతుంది.
యెహోవా మనలను మరల, మరల రక్షిస్తాడు.
    మరియు యెహోవా ఇశ్రాయేలీయుల పాపాలు అన్నింటి విషయంలో వారిని క్షమిస్తాడు.

మీకా 2

ప్రజల దుష్ట పథకాలు

పాపం చేయటానికి ఉపాయం పన్నేవారికి ఆపదలు వస్తాయి.
    ఆ ప్రజలు తమ పాన్పులపై పడుకొని పాపం చేయటానికి పథకాలు వేస్తారు.
తెల్లవారగానే, ఈ ప్రజలు తమ పథకం ప్రకారం చెడు పనులు చేస్తారు.
    ఎందుకంటే వాటిని చేయటానికి వారికి శక్తి ఉంది.
వారు భూములను ఆశించి, వాటిని తీసుకుంటారు.
    వారు ఇండ్లను కోరి వాటిని ఆక్రమిస్తారు.
వారొక వ్యక్తిని మోసపుచ్చి వాని ఇంటిని తీసుకుంటారు.
    వారొక వ్యక్తిని మోసగించి అతని వస్తువులను కాజేస్తారు.

ప్రజలను శిక్షించటానికి యెహోవా పథకం

అందువల్ల యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు:
“చూడండి, ఈ వంశం మీదికి ఆపద తీసుకురావటానికి నేను పథకం వేస్తున్నాను.
    మిమ్మల్ని మీరు రక్షించుకోలేరు.
మీరు గర్వంగా నడవలేరు.
    ఎందుకంటే అది కీడుమూడే సమయం.
ఆ సమయంలో ప్రజలు మిమ్మల్ని గురించి పాటలు పాడుకుంటారు.
    ప్రజలు మిమ్మల్ని గురించి దుఃఖ సూచకపాటలు ఆలపిస్తారు. మీరు ఇలా అంటారు:
‘మేము నాశనమయ్యాము!
    యెహోవా నా ప్రజల భూమిని తీసుకున్నాడు. ఆయన దానిని అన్యజనులకు ఇచ్చాడు.
అవును, నా భూమిని ఆయన నానుండి తీసుకున్నాడు.
    యెహోవా మా పొలాలను మా శత్రువులమధ్య విభజించాడు.
ప్రజలు మీ భూమిని కొలవలేరు.
    భూమిని యెహోవా ప్రజల మధ్య విభజించటానికి ప్రజలు చీట్లు వేయలేరు.
    ఎందుకంటే, ఆ భూమి మీకు చెందియుండదు!’”

మీకాను ఇక బోధించవద్దనటం

ప్రజలు ఇలా అంటారు: “మాకు బోధించవద్దు.
    మా గురించి ఆ చెడు విషయాలు చెప్పవద్దు.
మాకు ఏ కీడూ జరుగబోదు.”

కాని, యాకోబు వంశీయులారా!
    నేనీ విషయాలు చెప్పాలి.
మీరు చేసిన పనుల పట్ల
    యెహోవా కోపగిస్తున్నాడు.
మీరు ధర్మంగా ప్రవర్తిస్తే
    నేను మిమ్మల్ని గురించి మంచి మాటలు చెప్పేవాడిని.
కాని, ఇటీవల నా ప్రజలే నా శత్రువులయ్యారు.
    దారిన పోయే వారివద్దనుండి మీరు బట్టలు దొంగిలిస్తారు.
ఆ జనులు మాత్రం సురక్షితంగా ఉన్నామనుకున్నారు.
    కాని వారు యుద్ధ ఖైదీలు అన్నట్లు, వారి వస్తువులు మీరు తీసుకుంటారు.
నా ప్రజల స్త్రీలను వారి అందమైన,
    సౌకర్యాలు గల ఇండ్లనుండి మీరు వెళ్లగొట్టారు.
వారి చిన్నపిల్లల మధ్యనుండి
    నా మహిమను మీరు తీసివేశారు.
10 లేచి వెళ్లిపొండి!
    ఎందుకంటే, ఇది విశ్రాంతి తీసుకొనే స్థలం కాదు. మీరు ఈ స్థలాన్ని పాడు చేశారు!
మీరు దీన్ని అపవిత్రం చేశారు. కనుక అది నాశనం చేయబడుతుంది!

11 ఒక బూటకపు ప్రవక్త వచ్చి, అబద్ధాలు చెప్పవచ్చు. అతడు,
    “నాకు ద్రాక్షారసం, మద్యం ఇవ్వండి. నేను మీకు మంచి విషయాలు చెపుతాను” అని అనవచ్చు.
అతడు వారికి ఆ విధంగా బోధకుడవుతాడు!

యెహోవా తన ప్రజలను ఒక్క చోటికి చేర్చటం

12 అవును, యాకోబు వంశీయులారా, నేను మీ అందరినీ ఒక్కచోటికి తీసుకువస్తాను.
    ఇశ్రాయేలు ప్రజలలో మిగిలిన వారందరినీ సమకూర్చుతాను.
దొడ్డిలోని గొర్రెల్లా, పచ్చిక బీడులోని మందల్లా, వారిని నేను సమకూర్చుతాను.
    అప్పుడు ఆ స్థలమంతా అనేకమందిచేసే ధ్వనులతో నిండిపోతుంది.
13 “ఒక వ్యక్తి” ముందుకు తోసుకు వచ్చి, తన ప్రజల ముందుకు వస్తాడు.
    ఆయన ద్వారాలను పడదోసుకుపోతాడు. ప్రజలు ఆ నగరాన్ని వదలివేస్తారు.
వారి రాజు వారిముందు నడుస్తాడు.
    యెహోవా తన ప్రజల ముందు ఉంటాడు.

అపొస్తలుల కార్యములు 23:23-35

పౌలును కైసరియకు పంపటం

23 తదుపరి తన శతాధిపతుల్ని యిద్దర్ని పిలిచి, “రెండు వందల సైనికుల్ని, డెబ్బైమంది గుఱ్ఱపు రౌతుల్ని, బళ్ళేలు ఉపయోగించే రెండు వందల సైనికుల్ని మీ వెంట తీసుకొని ఈ రాత్రి తొమ్మిది గంటలకు కైసరియకు వెళ్ళండి. 24 పౌలుకు గుర్రాన్నిచ్చి రాష్ట్రాధిపతియైన ఫేలిక్సు దగ్గరకు క్షేమంగా పంపండి” అని ఆజ్ఞాపించాడు. 25 సహస్రాధిపతి యిలా ఒక ఉత్తరం వ్రాసి ఇచ్చాడు:

26 గౌరవనీయులైన ఫేలిక్సు రాష్ట్రాధిపతికి,

క్లౌదియ లూసియ అభివందనాలు చెప్పి వ్రాయునది,

27 ఇతణ్ణి యూదులు పట్టుకొని చంపబొయ్యారు. కాని, నేను యితడు రోమా పౌరుడు అని తెలుసుకొని నా దళాలతో వెళ్ళి అతణ్ణి రక్షించాను. 28 వాళ్ళెందుకు అతణ్ణి అపరాధి అంటున్నారో తెలుసుకోవాలని అతణ్ణి వాళ్ళ మహాసభకు పిలుచుకు వెళ్ళాను. 29 వాళ్ళు, తమ ధర్మశాస్త్రం విషయంలో యితణ్ణి అపరాధి అంటున్నారని నాకు తెలిసింది. కారాగారంలో ఉంచవలసిన నేరం కాని, మరణదండన వేయవలసిన నేరం కాని ఇతడు చేయలేదు. 30 వాళ్ళు ఇతణ్ణి చంపటానికి కుట్ర పన్నుతున్నారని తెలిసింది. అందువలన వెంటనే మీ దగ్గరకు పంపుతున్నాను. ఇతనిపై నేరారోపణ చేసినవాళ్ళతో ఆ నేరారోపణ మీ సమక్షంలో చెయ్యవచ్చని చెప్పాను.

31 సహస్రాధిపతి ఆజ్ఞాపించినట్లు సైనికులు పౌలును రాత్రి వేళ తమతో పిలుచుకు వెళ్ళి అంతిపత్రికి చేరుకున్నారు. 32 మరుసటి రోజు రౌతుల్ని పౌలు వెంట పంపి, సైనికులు కోటకు తిరిగి వచ్చారు. 33 పౌలుతో వెళ్ళినవాళ్ళు కైసరియ చేరుకొని ఆ ఉత్తరాన్ని, పౌలును, రాష్ట్రాధిపతికి అప్పగించారు.

34 రాష్ట్రాధిపతి ఆ ఉత్తరాన్ని చదివి, “నీవు ఏ ప్రాంతం వాడవు?” అని పౌలును అడిగాడు. అతడు కిలికియ వాడని తెలుసుకొని, 35 “నీపై నేరారోపణ చేసినవాళ్ళు యిక్కడికి వచ్చాక నీ విషయం విచారిస్తాను” అని అన్నాడు. ఆ తర్వాత పౌలును హేరోదు భవనంలో ఉంచి కాపలా కాయమని భటులతో చెప్పాడు.

లూకా 7:18-35

యోహాను అడగటానికి పంపిన ప్రశ్న

(మత్తయి 11:2-19)

18 యోహాను శిష్యులు యోహానుకు వీటన్నిటిని గురించి చెప్పారు. 19 అతడు తన శిష్యుల్లో యిద్దర్ని పిలిచి, “రానున్నది మీరేనా? లేక మరొకరి కోసం మేము ఎదురు చూడాలా?” అని ప్రభువును అడిగిరమ్మని పంపాడు.

20 వాళ్ళు యేసు దగ్గరకు వచ్చి, “బాప్తిస్మము నిచ్చి, ఉపదేశం చేసే యోహాను ఈ విధంగా అడిగి రమ్మని మమ్మల్ని పంపాడు: ‘రానున్నది మీరేనా? మరొకరి కోసం మేము ఎదురుచూడాలా?’” అని అన్నారు.

21 వాళ్ళు అక్కడ ఉండగా యేసు రోగగ్రస్తులకు, బాధితులకు, దయ్యాలు పట్టిన వాళ్లకు నయం చేశాడు. చాలా మంది గ్రుడ్డి వాళ్ళకు దృష్టినిచ్చాడు. 22 యేసు, ఆ వర్తమానం తెచ్చిన వాళ్ళతో, “వెళ్ళి యోహానుతో గ్రుడ్డివాళ్ళకు దృష్టి లభిస్తొందని, కుంటివాళ్ళు నడుస్తున్నారని, కుష్టురోగులకు నయమౌతుందని, చెవిటి వాళ్ళు వింటున్నారని, పేదవాళ్ళకు దైవ సందేశము బోధింపబడ్తోందని చెప్పండి. మీరు చూసిన వాటిని, విన్నవాటిని అతనికి చెప్పండి. 23 నన్ను విశ్వసించటానికి వెనుకంజ వెయ్యని వాడు ధన్యుడు” అని అన్నాడు.

24 ఆ వార్త తెచ్చిన వాళ్ళు వెళ్ళి పొయ్యాక యేసు అక్కడ సమావేశమైన ప్రజలకు యోహానును గురించి ఈ విధంగా చెప్పటం మొదలు పెట్టాడు: “ఎడారి ప్రాంతాలకు ఏం చూడాలని వెళ్ళారు? రెల్లు గాలికి కదలటం చూడాలని వెళ్ళారా? 25 ఏమి చూడాలని వెళ్ళారు? విలువైన వస్త్రాల్ని ధరించిన వాళ్ళనా? విలువైన వస్త్రాలను ధరించేవారు రాజగృహాల్లో ఉంటారు. 26 మరి ఏమి చూడాలని వెళ్ళారు? ప్రవక్తనా? ఔను, యోహాను ప్రవక్త కన్నా గొప్పవాడని మీతో చెప్పుచున్నాను. 27 యోహానును గురించి లేఖనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది:

‘ఇతడు నా దూత, ఇతణ్ణి నీ కన్నా ముందుగా పంపుతాను.
    ఇతడు నీ కోసం దారి సిద్ధం చేస్తాడు.’(A)

28 యోహాను ప్రపంచములో పుట్టిన మానవులందరి కన్నా గొప్పవాడు. కాని దేవుని రాజ్యంలో అందరికన్నా అల్పుడు యోహాను కన్నా గొప్పవాడని నేను చెబుతున్నాను.”

29 (యోహాను బోధనలు విని ప్రజలు, చివరకు పన్నులు వసూలు చేసేవాళ్ళు కూడా, యోహాను ద్వారా బాప్తిస్మము పొందారు. తద్వారా వాళ్ళు దేవుడు సంకల్పించినట్లు చేసారు. 30 కాని పరిసయ్యులు, శాస్త్రులు యోహాను చేత బాప్తిస్మము పొందటానికి నిరాకరించారు. తద్వారా వాళ్ళు దేవుడు తమకోసం సంకల్పించిన దాన్ని నిరాకరించారు.)

31 “మరి ఈ కాలపు ప్రజల్ని నేను దేనితో పోల్చాలి? వాళ్ళు ఏ విధంగా ఉంటారు? 32 వాళ్ళు సంతలో కూర్చొని,

‘మేము మీకోసం పిల్లన గ్రోవి ఊదాము.
    కాని మీరు నాట్యం చేయలేదు.
మేము చనిపోయిన వానికోసం పాట పాడాము.
    కాని మీరు దుఃఖించలేదు.’

అని మాట్లాడుకొంటున్న చిన్న పిల్లల్లాంటి వాళ్ళు. 33 బాప్తిస్మమునిచ్చే యోహాను ఆహారం తినలేదు. ద్రాక్షారసం త్రాగలేదు. మీరు అతనికి దయ్యం పట్టిందన్నారు. 34 మనుష్యకుమారుడు తింటూ, త్రాగుతూ వచ్చాడు. ఆయన్ని మీరు తిండిపోతు, త్రాగుపోతు అని అన్నారు. పన్నులు వసూలు చేసే వాళ్ళతో, పాపులతో స్నేహం చేస్తాడని ఆయన్ని విమర్శించారు. 35 జ్ఞానము దానిని పొందినవాని ద్వారా సరైనదని ఋజువు చేయబడుతుంది.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International