Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 2

యూదులు కాని ప్రజలకు అంత కోపం ఎందుకు వచ్చింది?
    ఆ రాజ్యాలు తెలివి తక్కువ పథకాలు ఎందుకు వేస్తున్నట్టు?
యెహోవాకు, ఆయన ఏర్పరచుకొన్న రాజుకు,
    వ్యతిరేకంగా ఉండేందుకు ఆ దేశాల రాజులు, నాయకులు ఒకటిగా సమావేశం అవుతున్నారు.
“దేవునికిని, ఆయన ఏర్పాటు చేసికొన్న రాజుకు, వ్యతిరేకంగా మనం తిరుగుబాటు చేద్దాం.
    మనలను బంధించిన తాళ్లను, గొలుసులను తెంపిపారవేద్దాం.” అని ఆ నాయకులు చెప్పుకొన్నారు.

కాని నా ప్రభువు, పరలోకంలో ఉన్న రాజు
    ఆ ప్రజలను చూచి నవ్వుతున్నాడు.
5-6 దేవుడు కోపగించి, ఆ ప్రజలతో చెబుతున్నాడు:
    “రాజుగా ఉండేందుకు నేను ఈ మనిషిని నిర్ణయించాను.
అతడు సీయోను కొండమీద ఏలుబడి చేస్తాడు, సీయోను నా ప్రత్యేక పర్వతం.”
    మరియు అది ఆ యితర నాయకులను భయపడేలా చేస్తుంది.

యెహోవా ఒడంబడికను గూర్చి ఇప్పుడు నేను నీతో చెబుతాను.
యెహోవా నాతో చెప్పాడు, “నేడు నేను నీకు తండ్రినయ్యాను!
    మరియు నీవు నా కుమారుడివి.
నీవు నన్ను అడిగితే నేను నీకు రాజ్యాలనే యిస్తాను.
    భూమి మీద మనుష్యులంతా నీవాళ్లవుతారు!
ఒక ఇనుప కడ్డీ, మట్టి కుండను పగులగొట్టినట్లు
    ఆ రాజ్యాలను నాశనం చేయటానికి నీకు శక్తి ఉంటుంది.”

10 అందుచేత రాజులారా, మీరు తెలివిగా ఉండండి.
    పాలకులారా, మీరంతా ఈ పాఠం నేర్చుకోండి.
11 అధిక భయంతో యెహోవాకు విధేయులుగా ఉండండి.
12 మరియు మీరు దేవుని కుమారునికి విశ్యాస పాత్రులుగా ఉన్నట్టు చూపించండి[a]
    మీరు ఇలా చేయకపోతే అప్పుడాయన కోపగించి, మిమ్ములను నాశనం చేస్తాడు.
యెహోవాయందు విశ్వాసం ఉంచేవారు సంతోషిస్తారు.
    కాని ఇతరులు జాగ్రత్తగా ఉండాలి. ఆయన తన కోపం చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు.

కీర్తనలు. 85

సంగీత నాయకునికి: కోరహు కుమారుల స్తుతి కీర్తన

85 యెహోవా, నీ దేశం మీద దయ చూపించుము.
    యాకోబు ప్రజలు విదేశంలో ఖైదీలుగా ఉన్నారు. ఖైదీలను తిరిగి వారి దేశానికి తీసుకొని రమ్ము.
యెహోవా, నీ ప్రజలను క్షమించుము!
    వారి పాపాలు తుడిచివేయుము.

యెహోవా, కోపంగాను,
    ఆవేశంగాను ఉండవద్దు.
మా దేవా, రక్షకా, మా మీద కోపగించటం మానివేసి,
    మమ్మల్ని మరల స్వీకరించు.
నీవు మామీద శాశ్వతంగా కోపగిస్తావా?
దయచేసి మమ్మల్ని మరల బ్రతికించుము!
    నీ ప్రజలను సంతోషింపజేయుము.
యెహోవా, నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నట్టుగా మాకు చూపించుము.
    మమ్మల్ని రక్షించుము.

దేవుడు చెప్పేది నేను వింటున్నాను.
    తన ప్రజలకు శాంతి కలుగుతుందని యెహోవా చెబుతున్నాడు.
    ఆయన అనుచరులు వారి అవివేక జీవిత విధానాలకు తిరిగి వెళ్లకపోతే వారికి శాంతి ఉంటుంది.
దేవుడు తన అనుచరులను త్వరలో రక్షిస్తాడు.
    మేము త్వరలోనే మా దేశంలో గౌరవంగా బ్రతుకుతాము.
10 దేవుని నిజమైన ప్రేమ ఆయన అనుచరులకు లభిస్తుంది.
    మంచితనం, శాంతి ఒకదానితో ఒకటి ముద్దు పెట్టుకొంటాయి.
11 భూమి మీద మనుష్యులు దేవునికి నమ్మకంగా ఉంటారు.
    పరలోకపు దేవుడు వారికి మేలు అనుగ్రహిస్తాడు.
12 యెహోవా మనకు అనేకమైన మంచివాటిని ఇస్తాడు.
    భూమి అనేక మంచి పంటలను ఇస్తుంది.
13 మంచితనం దేవునికి ముందర నడుస్తూ
    ఆయన కోసం, దారి సిద్ధం చేస్తుంది.

కీర్తనలు. 110

దావీదు స్తుతి కీర్తన.

110 “నీ శత్రువులను నీ పాదాల కింద పీఠంగా నేను ఉంచేవరకు ఇక్కడ నా కుడి పక్కన కూర్చో.”
    అని నా ప్రభువుతో యెహోవా చెప్పాడు.

నీ రాజ్యం విస్తరించేలా యెహోవా సహాయం చేస్తాడు. నీ రాజ్యం సీయోను వద్ద మొదలై నీవు నీ శత్రువులను
    వారి స్వంత దేశాలలో పాలించునంత వరకు అది విస్తరిస్తుంది.
నీవు రాజువైన రోజుననే నీ ప్రజలు నీతో కలుస్తారు.
    నీవు పుట్టినప్పటినుండి పవిత్రమైన అందం నీకు ఉంది.
ఇప్పుడు నీ బాల్యం నుండి నీకు ఉన్న ఆ ఆశీర్వాదం
    రాజుగా నీ కొత్త జీవితంలోనికి వస్తుంది.[a]

యెహోవా ఒక వాగ్దానం చేసాడు.
    యెహోవా తన మనస్సు మార్చుకోడు.
“నీవు నిత్యము యాజకుడివే గాని అహరోను కుటుంబ వర్గం నుండి కాదు.
    నీది వేరైన యాజకత్వం. అది మెల్కీసెదెక్ వర్గానికి చెందిన యాజకునిలా ఉన్నట్లు ఉంది.”

నా ప్రభువు నీ కుడి పక్కన వున్నాడు.
    ఆయన కోపముతో రాజులను చితకగొడతాడు.

దేవుడు రాజ్యాలకు తీర్పు తీర్చాడు.
    చచ్చిన వారి శవాలతో నేలనిండి పోతుంది!

మార్గంలోని సెలయేటినుండి[b] రాజు మంచినీరు తాగుతాడు.
    శక్తివంతమైన రాజ్యాల నాయకులను దేవుడు శిక్షిస్తాడు.
    ఆయన నిజంగా తన తల ఎత్తుతాడు, చాలా శక్తివంతంగా ఉంటాడు.

కీర్తనలు. 132

యాత్ర కీర్తన.

132 యెహోవా, దావీదు శ్రమపడిన విధానం జ్ఞాపకం చేసుకొమ్ము.
కాని దావీదు యెహోవాకు ఒక ప్రత్యేక ప్రమాణం చేసాడు.
    ఇశ్రాయేలీయుల మహత్తర శక్తిగల దేవునికి దావీదు ఒక ప్రత్యేక ప్రమాణం చేసాడు.
దావీదు చెప్పాడు, “నేను నా యింట్లోకి వెళ్లను.
    నేను నా పడక మీద పండుకొనను,
నేను నిద్రపోను,
    నేను నా కండ్లకు విశ్రాంతినివ్వను,
యెహోవా కోసం నేను ఒక మందిరాన్ని కనుగొనేంత వరకు ఆ పనుల్లో ఏదీ నేను చేయను!
    ఇశ్రాయేలీయుల మహా శక్తిగల దేవునికి నేనొక గృహం చూస్తాను!”

ఎఫ్రాతాలో[a] మేము దాన్ని గూర్చి విన్నాం.
    ఒడంబడిక పెట్టెను కిర్యత్యారీము[b] దగ్గర మేము కనుగొన్నాము.
మనం పవిత్ర గుడారానికి వెళ్దాం రండి.
    దేవుడు తన పాదాలు పెట్టుకొనే పీఠం దగ్గర మనము ఆయనను ఆరాధించుకొందాం.
యెహోవా, నీ విశ్రమ స్థానం నుండి లెమ్ము.
    యెహోవా, నీవు నీ శక్తిగల ఒడంబడిక పెట్టెతో రమ్ము.
యెహోవా, నీ యాజకులు నీతిని వస్త్రాలుగా ధరించనిమ్ము.
    నీ అనుచరులు చాలా సంతోషంగా ఉన్నారు.
10 నీ సేవకుడైన దావీదు కోసం
    నీవు ఏర్పరచుకొన్న రాజును నిరాకరించవద్దు.
11 యెహోవా దావీదుతో ఒక స్థిర ప్రమాణం చేశాడు. యెహోవా దావీదుతో వెనుక తిరుగని ప్రమాణం చేశాడు.
    దావీదు వంశం నుండి రాజులు వస్తారని యెహోవా ప్రమాణం చేశాడు.
12 “దావీదూ, నీ పిల్లలు నా ఒడంబడికకు, నేను వారికి నేర్పించే నా న్యాయ చట్టాలకు విధేయులయితే
    అప్పుడు నీ వంశంలో నుండి ఎవరో ఒకరు ఎల్లప్పుడూ రాజుగా ఉంటాడు” అని యెహోవా చెప్పాడు.

13 యెహోవా, తన ఆలయ స్థానంగా ఉండుటకు సీయోనును ఎంచుకున్నాడు.
    తన నివాసస్థలంగా దాన్ని కోరుకొని యున్నాడు.
14 యెహోవా చెప్పాడు, “శాశ్వతంగా ఇదే నా స్థలం.
    నేను ఉండే చోటుగా ఈ స్థలాన్ని ఎంచుకొంటున్నాను.
15 సమృద్ధిగా ఆహారం యిచ్చి నేను ఈ పట్టణాన్ని ఆశీర్వదిస్తాను.
    ఇక్కడ పేదవాళ్లకు కూడా తినుటకు సమృద్ధిగా ఉంటుంది.
16 యాజకులకు నేను రక్షణను ధరింపచేస్తాను.
    మరియు నా అనుచరులు ఇక్కడ చాలా సంతోషంగా ఉంటారు.
17 ఈ స్థలంలో, దావీదుకు ఒక కొమ్ము లేచేలా చేస్తాను.
    నేను ఏర్పాటు చేసుకొన్న రాజుకు నేను ఒక దీపాన్ని సిద్ధం చేస్తాను.
18 దావీదు శత్రువులను నేను అవమానంతో కప్పుతాను.
    కాని దావీదు కిరీటం దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది.”

మీకా 4:1-5

యెరూషలేమునుండి న్యాయం రావటం

చివరి రోజులలో ఇలా జరుగుతుంది.
    పర్వతాలన్నిటిలో దేవుడైన యెహోవా ఆలయమున్న పర్వతం మిక్కిలి ప్రాముఖ్యంగలది అవుతుంది.
అది కొండలన్నిటిలో ఉన్నతంగా చేయబడుతుంది.
    అన్యదేశాల ప్రజలు దానివద్దకు ప్రవాహంలా వస్తారు.
అనేక దేశాలవారు వచ్చి ఇలా అంటారు:
    “రండి, మనం యెహోవా పర్వతంమీదికి వెళదాం!
    యాకోబు దేవుని ఆలయానికి వెళదాం!
యెహోవా తన ధర్మాన్ని మనకు నేర్పుతాడు.
    ఆయన మార్గంలో మనం నడుద్దాం.”

ఎందువల్లనంటే దేవుని బోధలు సీయోనునుండి వస్తాయి.
    యెహోవా వాక్కు యెరూషలేమునుండి వస్తుంది!
యెహోవా అనేక జనుల మధ్య తీర్పు తీర్చుతాడు.
    బహు దూరానగల బలమైన దేశాల ప్రజలకు ఆయన తీర్పు ఇస్తాడు.
అప్పుడు వారు తమ కత్తులను సాగగొట్టి వాటిని నాగలికర్రులుగా చేస్తారు.
    ఆ జనులు తమ ఈటెలను సాగగొట్టి చెట్లను నరికే పనిముట్లుగా చేస్తారు.
జనులు ఒకరితో ఒకరు కత్తులతో యుద్ధం చేయటం మాని వేస్తారు.
    వారిక ఎన్నడూ యుద్ధ వ్యూహాలను అధ్యయనం చేయరు!
లేదు, ప్రతి ఒక్కడూ తన ద్రాక్షాచెట్లక్రింద,
    అంజూరపు చెట్లక్రింద కూర్చుంటాడు.
వారిని ఎవ్వరూ భయపడేలా చేయరు!
    ఎందువల్లనంటే సర్వశక్తిమంతుడైన యెహోవా ఇది చెప్పాడు!

అన్యదేశాల ప్రజలు తమతమ దేవుళ్లను అనుసరిస్తారు.
    కానీ మనం మాత్రం మన దేవుడైన యెహోవా నామాన్ని సదా స్మరించుకుంటాం!

మీకా 5:2-4

బెత్లెహేములో మెస్సీయ పుట్టుక

కాని, బేత్లెహేము ఎఫ్రాతా,
    నీవు యూదాలో అతి చిన్న గ్రామానివి.
నీ వంశం లెక్కపెట్టటానికి కూడా అతి చిన్నది.
    అయినప్పటికీ, నీ నుండే నా “ఇశ్రాయేలు పాలకుడు” వస్తాడు.
ఆయన ఆరంభం (ఉనికి) పురాతన కాలంనుండి,
    అనాది కాలంనుండి ఉంటూవుంది.
యెహోవా తన ప్రజలను బబులోను (బాబిలోనియా)లో ఉండనిస్తాడు.
    స్త్రీ[a] ప్రసవించేదాకా వారక్కడ ఉంటారు.
అప్పుడు ఇంకా బతికివున్న అతని సోదరులు తిరిగివస్తారు.
    వారు ఇశ్రాయేలు ప్రజలవద్దకు తిరిగివస్తారు.
అప్పుడు ఇశ్రాయేలును పాలించేవాడు నిలబడి తన మందను మేపుతాడు.
    యెహోవా తన శక్తితోను; దేవుడైన యెహోవా తన అద్భుత నామ మహత్తుతోను వారిని నడిపించుతాడు.
వారు నిర్భయంగా జీవిస్తారు.
    ఎందువల్లనంటే, ఆ సమయంలో ఆయన గొప్పతనం భూమి అంచులదాకా వ్యాపిస్తుంది.

1 యోహాను 4:7-16

దేవుడు ప్రేమా స్వరూపుడు

ప్రియ మిత్రులారా! ప్రేమ దేవునినుండి వస్తుంది. కనుక మనం పరస్పరం ప్రేమతో ఉందాం. ప్రేమించే వ్యక్తి దేవుని వలన జన్మిస్తాడు. అతనికి దేవుడు తెలుసు. దేవుడు ప్రేమస్వరూపం గలవాడు. ప్రేమలేనివానికి దేవుడెవరో తెలియదు. మనం కుమారునిద్వారా జీవించాలని దేవుడు తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఈ ప్రపంచంలోకి పంపి తన ప్రేమను మనకు వెల్లడి చేసాడు. 10 మనం ఆయన్ని ప్రేమిస్తున్నందుకు ఆయన ఈ పని చెయ్యలేదు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక, మన ప్రాయశ్చిత్తానికి బలిగా తన కుమారుణ్ణి పంపాడు. ఇదే ప్రేమ.

11 ప్రియ మిత్రులారా! దేవుడు మనల్ని యింతగా ప్రేమించాడు కనుక మనం కూడా పరస్పరం ప్రేమతో ఉండాలి. 12 దేవుణ్ణి ఎవ్వరూ చూడలేదు. మనం పరస్పరం ప్రేమతో ఉంటే దేవుడు మనలో నివసిస్తాడు. ఆయన ప్రేమ మనలో పరిపూర్ణత చెందుతుంది.

13 ఆయన తన ఆత్మను మనకిచ్చాడు. తద్వారా మనము ఆయనలో జీవిస్తున్నామని, ఆయన మనలో జీవిస్తున్నాడని మనం తెలుసుకోగలుగుతున్నాము. 14 దేవుడు తన కుమారుణ్ణి ప్రపంచాన్ని రక్షించటానికి పంపాడు. ఆయన్ని మేము చూసాము, కాబట్టి సాక్ష్యం చెపుతున్నాము. 15 యేసు దేవుని కుమారుడని అంగీకరించినవానిలో దేవుడు నివసిస్తాడు. దేవునిలో వాడు నివసిస్తున్నాడు. 16 దేవునికి మనపట్ల ప్రేమ ఉందని మనం నమ్ముతున్నాము. ఆ ప్రేమ మనకు తెలుసు.

దేవుడే ప్రేమ. ప్రేమలో జీవించేవాడు దేవునిలో జీవిస్తాడు. దేవుడు అతనిలో జీవిస్తాడు.

యోహాను 3:31-36

పరలోకమునుండి వచ్చువాడు

31 “పై నుండి వచ్చినవాడు అందరికన్నా గొప్పవాడు. ఈ ప్రపంచంలో పుట్టినవాడు ఈ ప్రపంచానికి చెందుతాడు. అలాంటి వాడు ప్రాపంచిక విషయాల్ని గురించి మాట్లాడుతాడు. పరలోకం నుండి వచ్చినవాడు అందరికన్నా గొప్పవాడు. 32 ఆయన తాను చూసిన వాటిని గురించి, విన్నవాటిని గురించి సాక్ష్యం చెబుతాడు. కాని ఆయన సాక్ష్యాన్ని ఎవ్వరూ అంగీకరించరు. 33 దాన్ని అంగీకరించిన మనిషి దేవుడు సత్యవంతుడని అంగీకరిస్తాడు. 34 ఎందుకంటే దేవుడు పంపిన వాడు దేవుడు చెప్పిన మాటలు చెబుతాడు. ఆయనకు దేవుడు పవిత్రాత్మను అపరిమితంగా ఇస్తాడు. 35 తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు. అందువలన అంతా ఆయన చేతుల్లో ఉంచాడు. 36 ఆ కుమారుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కడూ అనంత జీవితం పొందుతాడు. కాని ఆ కుమారుణ్ణి తృణీకరించినవాడు అనంత జీవీతం పొందలేడు. దేవుని కోపం నుండి ఎవడూ తప్పించుకోలేడు” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International