Book of Common Prayer
ఆసాపు కీర్తనలలో ఒకటి.
50 దేవాధి దేవుడు యెహోవా మాట్లాడాడు.
సూర్యోదయ దిక్కు నుండి సూర్యాస్తమయ దిక్కు వరకు భూమి మీది ప్రజలందరినీ ఆయన పిలుస్తున్నాడు.
2 సీయోను నుండి దేవుడు ప్రకాశిస్తున్నాడు. ఆ పట్టణపు అందము పరిపూర్ణమైనది.
3 మన దేవుడు వస్తున్నాడు, ఆయన మౌనంగా ఉండడు.
ఆయన యెదుట అగ్ని మండుతుంది.
ఆయన చుట్టూరా గొప్ప తుఫాను ఉంది.
4 తన ప్రజలకు తీర్పు చెప్పుటకు పైన ఆకాశాన్ని,
క్రింద భూమిని ఆయన పిలుస్తున్నాడు.
5 “నా అనుచరులను నా చుట్టూరా చేర్చండి.
వారు బలియర్పణ ద్వారా నాతో ఒడంబడిక చేసుకున్నారు” అని ఆయన అంటాడు.
6 అప్పుడు ఆకాశాలు ఆయన న్యాయాన్ని చెప్పాయి.
ఎందుకంటే, దేవుడే న్యాయమూర్తి.
7 దేవుడు చెబుతున్నాడు: “నా ప్రజలారా, నా మాట వినండి.
ఇశ్రాయేలు ప్రజలారా, మీకు విరోధంగా నా రుజువును కనపరుస్తాను.
నేను దేవుణ్ణి, మీ దేవుణ్ణి.
8 నేను మీ బలుల విషయంలో మిమ్ములను సరిచేయటంలేదు. గద్దించటంలేదు.
ఇశ్రాయేలు ప్రజలారా, మీరు మీ దహన బలులను ఎల్లప్పుడూ తెస్తున్నారు. ప్రతిరోజు వాటిని మీరు నాకిస్తున్నారు.
9 మీ ఇంటినుండి ఎద్దులను తీసుకోను.
మీ శాలలనుండి మేకలు నాకవసరం లేవు.
10 ఆ జంతువులు నాకు అవసరం లేదు. అరణ్యంలో ఉన్న జంతువులన్నీ ఇది వరకే నా సొంతం.
వేలాది పర్వతాల మీద జంతువులన్నీ ఇది వరకే నా సొంతం.
11 కొండల్లో ఉండే ప్రతి పక్షి నాకు తెలుసు.
పొలాల్లో చలించే ప్రతిదీ నా సొంతం
12 నాకు ఆకలి వేయదు! నాకు ఆకలిగా ఉంటే ఆహారం కోసం నేను మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు
ప్రపంచం, అందులో ఉన్న సమస్తమూ, నా సొంతం.
13 నేను ఎద్దుల మాంసం తినను. నేను మేకల రక్తం త్రాగను.”
14 దేవునికి కృతజ్ఞతార్పణలను ఇవ్వండి. మహోన్నతుడైన దేవునికి మీ మొక్కుబడిని చెల్లించండి,
దేవుడు ఇలా అన్నాడు: మీరు వాగ్దానం చేసినది ఇవ్వండి.
15 “ఇశ్రాయేలు ప్రజలారా, మీకు కష్టాలు వచ్చినప్పుడు నన్ను ప్రార్థించండి!
నేను మీకు సహాయం చేస్తాను. అప్పుడు మీరు నన్ను గౌరవించవచ్చు.”
16 దుర్మార్గులతో దేవుడు చెబుతున్నాడు,
“నా న్యాయ విధులను చదువుటకు,
నా ఒడంబడికకు బద్ధులమని ప్రకటించుటకును మీకేమి హక్కున్నది?[a]
17 కనుక నేను మిమ్మల్ని సరిదిద్దినప్పుడు దానిని మీరు ద్వేషిస్తారు.
నేను మీతో చెప్పే సంగతులను మీరు నిరాకరిస్తారు.
18 మీరు ఒక దొంగను చూస్తారు, వానితో చేయి కలపడానికి పరుగెడతారు.
వ్యభిచార పాపం చేసే మనుష్యులతో పాటు మీరు మంచం మీదికి దూకుతారు.
19 మీరు చెడు సంగతులు చెబుతారు, అబద్ధాలు పలుకుతారు.
20 మీరు మీ సహోదరుని గూర్చి ఎడతెగక చెడ్డ సంగతులు చెబుతారు.
మీరు మీ తల్లి కుమారుని అపనిందలపాలు చేస్తారు.
21 మీరు ఈ చెడ్డ విషయాలు చేసారు. నేను మౌనంగా ఉండిపోయాను
నేను మీలాంటివాడినని మీరనుకొన్నారు.
కాని నేనిప్పుడు మిమ్ములను కోపంతో గద్దిస్తాను.
మరియు మీ ముఖంమీద నిందమోపుతాను.
22 నేను మిమ్ములను చీల్చివేయకముందే,
దేవుని మరచిన జనాంగమైన మీరు,
ఈ విషయమును గూర్చి ఆలోచించాలి.
అదే కనుక జరిగితే, ఏ మనిషి మిమ్మల్ని రక్షించలేడు.
23 ఒక వ్యక్తి కృతజ్ఞత అర్పణను చెల్లిస్తే, అప్పుడు అతడు నన్ను గౌరవిస్తాడు.
నా మార్గాన్ని అనుసరించే వానికి రక్షించగల దేవుని శక్తిని నేను చూపిస్తాను.”
సంగీత నాయకునికి: “నాశనం చేయవద్దు” రాగం. దావీదు అనుపదగీతం. దావీదును చంపేందుకు అతని యింటిని చూచి రమ్మని సౌలు తన మనుష్యులను పంపిన సందర్భం.
59 దేవా, నా శత్రువుల నుండి నన్ను రక్షించుము
నాతో పోరాడేందుకు నా మీదికి వచ్చే మనుష్యులను జయించేందుకు నాకు సహాయం చేయుము.
2 కీడు చేసే మనుష్యుల నుండి నన్ను రక్షించుము.
ఆ నరహంతకుల నుండి నన్ను రక్షించుము.
3 చూడు, బలాఢ్యులు నా కోసం కనిపెట్టి ఉన్నారు.
నన్ను చంపేందుకు వారు కనిపెట్టుకున్నారు.
నేను పాపం చేసినందువలన లేక ఏదో నేరం చేసినందువలన కాదు.
4 వారు నన్ను తరుముతున్నారు. నేను మాత్రం ఏ తప్పు చేయలేదు.
యెహోవా, వచ్చి నీ మట్టుకు నీవే చూడు!
5 నీవు సర్వశక్తిమంతుడవైన దేవుడవు, ఇశ్రాయేలీయుల దేవుడవు.
లేచి జనాంగములన్నిటినీ శిక్షించుము.
ఆ దుర్మార్గపు ద్రోహులకు ఎలాంటి దయా చూపించకుము.
6 ఆ దుర్మార్గులు సాయంకాలం పట్టణములోకి వస్తారు.
వారు మొరిగే కుక్కల్లా పట్టణమంతా తిరుగుతారు.
7 వారి బెదరింపులు, అవమానపు మాటలు వినుము.
వారు అలాంటి క్రూరమైన సంగతులు చెబుతారు.
వాటిని వింటున్నది ఎవరో వారికి అనవసరం.
8 యెహోవా, వారిని చూసి నవ్వుము.
ఆ జనాలను గూర్చి ఎగతాళి చేయుము.
9 దేవా, నీవే నా బలం, నేను నీకోసం కనిపెట్టుకొన్నాను.
దేవా, నీవే పర్వతాలలో ఎత్తయిన నా క్షేమస్థానం.
10 దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. జయించుటకు ఆయనే నాకు సహాయం చేస్తాడు.
నా శత్రువులను జయించుటకు ఆయనే నాకు సహాయం చేస్తాడు.
11 దేవా, వారిని ఊరకనే చంపివేయకు. లేదా నా ప్రజలు మరచిపోవచ్చును.
నా ప్రభువా, నా సంరక్షకుడా, నీ బలంతో వారిని చెదరగొట్టి, వారిని ఓడించుము.
12 ఆ దుర్మార్గులు శపించి అబద్ధాలు చెబుతారు.
వారు చెప్పిన విషయాలను బట్టి వారిని శిక్షించుము.
వారి గర్వం వారిని పట్టుకొనేలా చేయుము.
13 నీ కోపంతో వారిని నాశనం చేయుము.
వారిని పూర్తిగా నాశనం చేయుము.
అప్పుడు యాకోబు ప్రజలనూ, సర్వప్రపంచాన్నీ
దేవుడు పాలిస్తున్నాడని మనుష్యులు తెలుసుకొంటారు.
14 ఆ దుర్మార్గులు సాయంకాలం పట్టణంలోకి వచ్చి
మొరుగుతూ పట్టణం అంతా తిరుగే కుక్కల్లాంటివారు.
15 వారు తినుటకు ఏమైనా దొరుకుతుందని వెదకుతూ పోతారు.
వారికి ఆహారం దొరకదు. నిద్రించుటకంత స్థలం దొరకదు.
16 మరి నేనైతే,,,,,,,,,, నీకు స్తుతి గీతాలు పాడుతాను.
ఉదయాలలో నీ ప్రేమయందు ఆనందిస్తాను.
ఎందుకంటే ఎత్తయిన పర్వతాలలో నీవే నా క్షేమ స్థానం,
కష్టాలు వచ్చినప్పుడు నేను నీ దగ్గరకు పరుగెత్తగలను.
17 నేను నీకు నా స్తుతిగీతాలు పాడుతాను.
ఎందుకంటే ఎత్తయిన పర్వతాలలో నీవే నా క్షేమస్థానం.
నీవు నన్ను ప్రేమించే దేవుడవు.
సంగీత నాయకునికి: “ఒప్పందపు లిల్లి పుష్పం” రాగం. దావీదు అనుపదగీతం. ఉపదేశించదగినది. దావీదు అరమ్నహరాయీమీయులతోను, అరమోజబాయీలతోను యుద్ధం చేయగా యోవాబు ఉప్పు లోయలో 12,000 మంది ఎదోమీయులను చంపి తిరిగి వచ్చినప్పటిది.
60 దేవా, నీవు మమ్మల్ని విడిచి పెట్టేశావు.
నీవు మమ్మల్ని ఓడించావు. మా మీద నీవు కోపగించావు.
దయచేసి మమ్ములను ఉద్ధరించుము.
2 భూమి కంపించి పగిలి తెరచుకొనేలా నీవు చేశావు.
మా ప్రపంచం పగిలిపోతోంది.
దయచేసి దాన్ని బాగు చేయుము.
3 నీ ప్రజలకు నీవు చాలాకష్టాలు కలిగించావు.
త్రాగుబోతు మనుష్యుల్లా మేము తూలి పడిపోతున్నాము.
4 నీకు భయపడే వారికి నీ సత్యమైన వాగ్దానాలను
స్థిరపరచుటకు ఒక ధ్వజమునెత్తావు.
5 నీ మహాశక్తిని ప్రయోగించి మమ్మల్ని రక్షించు,
నా ప్రార్థనకు జవాబు యిచ్చి, నీవు ప్రేమించే ప్రజలను రక్షించుము.
6 దేవుడు తన ఆలయంలో నుండి[a] మాట్లాడుతున్నాడు.
“నేను గెలుస్తాను, ఆ విజయం గూర్చి సంతోషిస్తాను.
నా ప్రజలతో కలిసి ఈ దేశాన్ని నేను పంచుకొంటాను.
షెకెము, సుక్కోతు లోయలను నేను విభజిస్తాను.
7 గిలాదు, మనష్షేనాది. ఎఫ్రాయిము నా శిరస్త్రాణము.
యూదా నా రాజదండము.
8 మోయాబును నా పాదాలు కడుక్కొనే పళ్లెంగా నేను చేస్తాను.
ఎదోము నా చెప్పులు మోసే బానిసగా ఉంటుంది. ఫిలిష్తీ ప్రజలను నేను ఓడిస్తాను.”
9 బలమైన భద్రతగల పట్టణానికి నన్ను ఎవరు తీసుకొని వస్తారు?
ఎదోముతో యుద్ధం చేయుటకు నన్ను ఎవరు నడిపిస్తారు?
10 దేవా, వీటిని చేసేందుకు నీవు మాత్రమే నాకు సహాయం చేయగలవు.
కాని నీవు మమ్మల్ని విడిచిపెట్టేసావు. దేవుడు మాతోను, మా సైన్యాలతోను వెళ్లడు.
11 దేవా, మా శత్రువులను ఓడించుటకు సహాయం చేయుము.
మనుష్యులు మాకు సహాయం చేయలేరు.
12 కాని దేవుని సహాయంతో మేము జయించగలం.
దేవుడు మా శత్రువులను ఓడించగలడు.
33 మంచి మనుష్యులారా, యెహోవాయందు ఆనందించండి.
నమ్మకమైన మంచి మనుష్యులారా, ఆయనను స్తుతించండి.
2 సితారా వాయిస్తూ, యెహోవాను స్తుతించండి.
యెహోవాకు పదితంతుల స్వరమండలాన్ని వాయించండి.
3 ఆయనకు ఒక క్రొత్త కీర్తన పాడండి.
ఆనంద గీతాన్ని ఇంపుగా పాడండి.
4 దేవుని మాట సత్యం!
ఆయన చేసే ప్రతిదాని మీద నీవు ఆధారపడవచ్చును.
5 నీతిన్యాయాలను దేవుడు ప్రేమిస్తాడు.
యెహోవా భూమిని తన ప్రేమతో నింపాడు.
6 యెహోవా ఆజ్ఞ ఇవ్వగానే లోకం సృష్టించబడింది.
భూమి మీద ఉన్న సమస్తాన్నీ దేవుని నోటి నుండి వచ్చే శ్వాస సృజించింది.
7 సముద్రంలోని నీరు అంతటినీ దేవుడు ఒక్కచోట రాశిగా కూర్చాడు.
మహా సముద్రాన్ని దాని స్థానంలో ఆయనే ఉంచాడు.
8 భూమి మీద ప్రతి మనిషీ యెహోవాకు భయపడి ఆయనను గౌరవించాలి.
ఈ లోకంలో జీవించే మనుష్యులందరూ ఆయనకు భయపడాలి.
9 ఎందుకంటే దేవుడు ఆదేశించిన తక్షణం దాని ప్రకారం నెరవేరుతుంది.
ఏదైనా “నిలిచిపోవాలని” ఆయన ఆజ్ఞ ఇస్తే, అప్పుడు అది ఆగిపోతుంది.
10 జనసమూహాల పథకాలను పనికిమాలినవిగా యెహోవా చేయగలడు.
వారి తలంపులన్నింటినీ ఆయన నాశనం చేయగలడు.
11 అయితే యెహోవా సలహా శాశ్వతంగా మంచిది.
ఆయన తలంపులు తర తరాలకు మంచివి.
12 యెహోవా ఎవరికి దేవుడుగా ఉంటాడో ఆ ప్రజలు ధన్యులు.
దేవుడే వారిని తన స్వంత ప్రజలుగా ఏర్పాటు చేసుకొన్నాడు.
13 యెహోవా పరలోకం నుండి క్రిందికి చూసాడు.
మనుష్యులందరిని ఆయన చూశాడు.
14 భూమి మీద నివసిస్తున్న మనుష్యులందరినీ
ఆయన తన ఉన్నత సింహాసనం నుండి చూశాడు.
15 ప్రతి మనిషి మనస్సునూ దేవుడు సృష్టించాడు.
ప్రతి మనిషి ఏమి చేస్తున్నాడో అది అయన గ్రహిస్తాడు.
16 ఒక రాజు తన స్వంత గొప్ప శక్తితో రక్షించబడడు.
ఒక సైనికుడు తన స్వంత గొప్ప బలంతో రక్షించబడడు.
17 యుద్ధంలో గుర్రాలు నిజంగా విజయం తెచ్చిపెట్టవు.
తప్పించుకొనేందుకు వాటి బలం నిజంగా నీకు సహాయపడదు.
18 యెహోవాను అనుసరించే మనుష్యులను ఆయన కాపాడుతాడు,
ఆయన నిజమైన ప్రేమయందు నిరీక్షణయుంచు వారిని జాగ్రత్తగా చూస్తాడు. ఆయన మహా ప్రేమ, ఆయనను ఆరాధించే వారిని కాపాడుతుంది.
19 ఆ మనుష్యులను మరణం నుండి రక్షించేవాడు దేవుడే.
ఆ మనుష్యులు ఆకలిగా ఉన్నప్పుడు ఆయన వారికి బలాన్ని యిస్తాడు.
20 అందుచేత మనం యెహోవా కోసం కనిపెట్టుకుందాము.
ఆయన మనకు సహాయం, మన డాలు.
21 దేవుడు నన్ను సంతోషపరుస్తాడు,
నేను నిజంగా ఆయన పవిత్ర నామాన్ని నమ్ముకొంటాను.
22 యెహోవా, మేము నిజంగా నిన్ను ఆరాధిస్తున్నాము.
కనుక నీ గొప్ప ప్రేమ మాకు చూపించుము.
దీపస్తంభం-రెండు ఒలీవ చెట్లు
4 పిమ్మట నాతో మాట్లాడుతూవున్న దేవదూత నా వద్దకు వచ్చి నన్ను లేపాడు. నేను నిద్ర నుండి మేల్కొంటున్న వ్యక్తివలె ఉన్నాను. 2 “నీవు ఏమి చూస్తున్నావు?” అని దేవదూత నన్ను అడిగాడు.
నేను ఇలా చెప్పాను: “ఒక గట్టి బంగారు దీపస్తంభాన్ని చూస్తున్నాను. ఆ స్తంభం మీద ఏడు దీపాలు (ప్రమిదెలు) ఉన్నాయి. దీపస్తంభం మీద ఒక గిన్నెఉంది. గిన్నెనుండి ఏడు గొట్టాలు వచ్చాయి. ప్రతి దీపానికీ ఒక గొట్టం చొప్పున వెళ్లాయి. ఆ గొట్టాలు దీపాలకు కావలసిన నూనెను గిన్నెనుండి చేరవేస్తున్నాయి. 3 గిన్నె పక్కగా కుడి వైవున ఒకటి, ఎడమవైపున ఒకటి ఒలీవ చెట్లు ఉన్నాయి.” 4 తరువాత నాతో మాట్లాడుతూవున్న దేవదూతను, “అయ్యా, ఈ వస్తువులు ఏమి తెలియజేస్తున్నాయి?” అని అడిగాను.
5 “ఈ వస్తువులు ఏమిటో నీకు తెలియదా?” అని నాతో మాట్లాడుతూ ఉన్న దేవదూత అన్నాడు.
“లేదయ్యా” అని నేను చెప్పాను.
6 అతడు నాతో ఇలా అన్నాడు: “యెహోవానుంచి జెరుబ్బాబెలుకు వచ్చిన వర్తమానం ఇది: ‘నీ శక్తి సామర్థ్యాలవల్ల నీకు సహాయం రాదు. నీ సహాయం నా ఆత్మ నుండి వస్తుంది.’ సర్వశక్తిమంతుడైన యెహోవా ఆ విషయాలు చెప్పాడు! 7 ఆ ఎత్తైన పర్వతం జెరుబ్బాబెలుకు సమమైన ప్రదేశంగా ఉంటుంది. అతడు ఆలయ నిర్మాణం చేస్తాడు. దానికి చివరి రాయి పెట్టబడినప్పుడు, ‘అందంగా ఉంది! అందంగా ఉంది!’ అని ప్రజలు కేకలు పెడతారు.”
8 నాకు వచ్చిన యెహోవా వర్తమానం ఇంకా ఇలా చెప్పింది: 9 “నా ఆలయానికి జెరుబ్బాబెలు పునాదులు నిర్మిస్తాడు. మరియు జెరుబ్బాబెలు ఆలయ నిర్మాణం పూర్తిచేస్తాడు. అప్పుడు సర్వశక్తిమంతుడైన యెహోవా తన ప్రజలైన మీ వద్దకు నన్ను పంపినట్టు మీరు తెలుసుకుంటారు. 10 సామాన్యంగా ప్రారంభించబడే పనులపట్ల ప్రజలు సిగ్గుచెందరు. జెరుబ్బాబెలు గుండు, దారం తీసికొని, తయారైన భవనాన్ని తనిఖీచేసి, కొలవటం చూసినప్పుడు, ప్రజలు నిజంగా సంతోషిస్తారు. ఆ రాతికి మీరు ఇప్పుడు చూసిన ఏడు పక్కలు యెహోవా యొక్క ఏడు కండ్లకు చిహ్నాలుగా ఉండి, అన్ని దిశలకూ చూస్తూ ఉంటాయి. అవి భూమి మీద ప్రతిదాన్నీ చూస్తాయి.”
11 పిమ్మట నేను (జెకర్యా) అతనికి చెప్పాను: “దీపస్తంభానికి కుడి పక్కన ఒక ఒలీవ చెట్టును, ఎడమ పక్కన మరొక చెట్టును నేను చూశాను. ఆ రెండు ఒలీవ చెట్ల అర్థం ఏమిటి?” 12 నేనింకా ఇలా అన్నాను: “బంగారు రంగుగల నూనె ప్రవహించే బంగారు గొట్టాలవద్ద నేను రెండు ఒలీవ కొమ్మలు చూశాను. వీటి అర్థం ఏమిటి?”
13 తరువాత దేవదూత నాతో, “వీటి అర్థం ఏమిటో నీకు తెలియదా?” అని అన్నాడు.
“లేదయ్యా” అని నేను చెప్పాను.
14 “ఈ సర్వజగత్తుకు ప్రభువైన యెహోవాను సేవించటానికి ఎంపిక చేయబడిన ఇద్దరు మనుష్యులను అవి సూచిస్తాయి,” అని అతడు చెప్పాడు.
9 సింహాసనంపై కూర్చొన్నవానికి, చిరకాలం జీవించేవానికి, మహిమ, గౌరవము కలగాలని అంటూ ఈ ప్రాణులు తమ కృతజ్ఞతలు తెలుపుతూ పాడాయి. 10 అవి ఆ విధంగా పాడినప్పుడు ఆ యిరవై నాలుగు మంది పెద్దలు ఆ సింహాసనంపై కూర్చొన్నవానిముందు సాష్టాంగపడి చిరకాలం జీవించే ఆయన్ని స్తుతించారు. తమ కిరీటాల్ని సింహాసనం ముందువేసి,
11 “మా ప్రభూ! దైవమా!
నీవు తేజమును, గౌరవమును, శక్తిని పొందతగిన యోగ్యుడవు,
నీవు అన్నిటినీ సృష్టించావు.
అవి నీ యిష్టానుసారం సృష్టింపబడి జీవాన్ని పొందాయి”
అని అన్నారు.
గ్రంథము, గొఱ్ఱెపిల్ల
5 ఆ తర్వాత, సింహాసనంపై కూర్చొన్నవాని కుడి చేతిలో చుట్టబడియున్న ఒక గ్రంథాన్ని చూసాను. దాని యిరువైపులా ఏదో వ్రాయబడి ఉంది. దానిపై ఏడు ముద్రలు ఉన్నాయి. 2 శక్తివంతమైన ఒక దేవదూత నాకు కనిపించాడు. అతడు పెద్ద స్వరంతో, “ఆ ముద్రలను విప్పి ఆ గ్రంథాన్ని తెరువగల యోగ్యుడెవరు?” అని ప్రకటించటం నేను చూసాను. 3 పరలోకంలోగాని, భూమ్మీదగాని, పాతాళంలోగాని ఆ గ్రంథాన్ని తెరువగలవాడు, దాని లోపలవున్నది చూడగలవాడు ఎవ్వడూ నాకు కనిపించలేదు. 4 ఆ గ్రంథాన్ని తెరువగలవాడు దాని లోపల ఏముందో చూడగల యోగ్యుడు కనిపించనందుకు నేను చాలా విలపించాను. 5 అప్పుడు ఆ పెద్దల్లో ఒకడు నాతో, “విలపించవద్దు. యూదాతెగకు చెందిన సింహము, దావీదు వంశాంకురము విజయం పొందాడు చూడు. ఆ గ్రంథాన్ని, దాని ఏడు ముద్రల్ని తెరువగలవాడు ఆయనే!” అని అన్నాడు.
పది మంది కన్యకల ఉపమానం
25 “దేవుని రాజ్యం ఇలా ఉంటుంది: పది మంది కన్యకలు తమ తమ దీపాలు తీసుకొని పెళ్ళి కుమారుణ్ణి కలవటానికి వెళ్ళారు. 2 వాళ్ళలో ఐదుగురు తెలివిలేని వాళ్ళు; ఐదుగురు తెలివిగల వాళ్ళు. 3 తెలివి లేని కన్యలు దీపాలు తీసుకెళ్ళారు కాని తమ వెంట నూనె తీసుకు వెళ్ళలేదు. 4 తెలివిగల కన్యలు తమ దీపాలతో పాటు పాత్రలో నూనె కూడా తీసుకు వెళ్ళారు. 5 పెళ్ళి కుమారుడు రావటం ఆలస్యం అయింది. అందరికి కునుకు వచ్చి నిద్దుర పొయ్యారు.
6 “అర్థరాత్రి వేళ, ‘అదిగో పెళ్ళి కుమారుడు! వచ్చి చూడండీ!’ అని ఎవరో బిగ్గరగా కేక వేసారు.
7 “వెంటనే ఆ కన్యకలందరూ లేచి తమ దీపాల్ని సరి చేసుకొన్నారు. 8 తెలివి లేని కన్యలు ‘మీ నూనె కొద్దిగా మాకివ్వండి; మా దీపాలలో నూనంతా అయిపోయింది!’ అని తెలివిగల కన్యల్ని అడిగారు.
9 “తెలివి గల కన్యలు, ‘ఈ నూనె మనకందరికి సరిపోదేమో! దుకాణానికి వెళ్ళి మీకోసం కొద్ది నూనె కొనుక్కురండి’ అని సమాధానం చెప్పారు.
10 “కాని వాళ్ళు నూనె కొనుక్కురావటానికి వెళ్ళినప్పుడు పెళ్ళి కుమారుడు వచ్చాడు. సిద్ధంగా ఉన్న కన్యలు పెళ్ళి విందుకు అతనితో కలసి లోపలికి వెళ్ళారు. ఆ తదుపరి తలుపు వేయబడింది.
11 “మిగతా కన్యలు వచ్చి, ‘అయ్యా! అయ్యా! తలుపు తెరవండి’ అని అడిగారు.
12 “కాని అతడు, ‘నేను నిజం చెబుతున్నాను; మీరెవరో నాకు తెలియదు’ అని సమాధానం చెప్పాడు.
13 “మీకు ఆ రోజు, ఆ ఘడియ ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక మెలకువతో ఉండండి.
© 1997 Bible League International