Book of Common Prayer
దావీదు కీర్తన. అతడు యూదా అరణ్యంలో ఉన్నప్పటిది.
63 దేవా, నీవు నా దేవుడవు.
నాకు నీవు ఎంతగానో కావాలి.
నా ఆత్మ, నా శరీరం నీళ్లులేక ఎండిపోయిన భూమిలా
నీకొరకు దాహంగొని ఉన్నాయి.
2 అవును, నీ ఆలయంలో నేను నిన్ను చూశాను.
నీ బలము నీ మహిమలను నేను చూశాను.
3 నీ ప్రేమ జీవం కన్నా గొప్పది.
నా పెదాలు నిన్ను స్తుతిస్తున్నాయి.
4 అవును, నా జీవితంలో నేను నిన్ను స్తుతిస్తాను.
నీ పేరట నేను నా చేతులెత్తి నీకు ప్రార్థిస్తాను.
5 శ్రేష్ఠమైన ఆహారం భుజించినట్లు నేను తృప్తిపొందుతాను.
నా నోరు నిన్ను స్తుతిస్తుంది.
6 నేను నా పడక మీద ఉండగా నిన్ను జ్ఞాపకం చేసుకొంటాను.
రాత్రి జాములలో నిన్ను నేను జ్ఞాపకం చేసుకొంటాను.
7 నీవు నిజంగా నాకు సహాయం చేశావు.
నీవు నన్ను కాపాడినందుకు నేను సంతోషిస్తున్నాను.
8 నా ఆత్మ నిన్ను హత్తుకొంటుంది.
నీ కుడిచెయ్యి నన్నెత్తి పట్టుకొంటుంది.
9 కొంతమంది మనుష్యులు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు. కాని వారు నాశనం చేయబడతారు.
వారు వారి సమాధుల్లోకి దిగిపోతారు.
10 ఖడ్గములతో వారు చంపబడతారు.
అడవి కుక్కలు వారి మృత దేహాలను తింటాయి.
11 అయితే రాజు తన దేవుని పట్ల సంతోషంగా ఉంటాడు.
ఆయనకు విధేయులుగా ఉంటామని ప్రమాణంచేసిన మనుష్యులంతా ఆయనను స్తుతిస్తారు. ఎందుకంటే ఆ అబద్ధీకులందరినీ ఆయన ఓడించాడు.
స్తుతి కీర్తన.
98 యెహోవా, నూతన అద్బుత క్రియలు చేశాడు
గనుక ఆయనకు ఒక క్రొత్త కీర్తన పాడండి.
ఆయన పవిత్ర కుడి హస్తం
ఆయనకు విజయం తెచ్చింది.
2 యెహోవా రక్షించగల తన శక్తిని రాజ్యాలకు చూపెట్టాడు.
యెహోవా తన నీతిని వారికి చూపించాడు.
3 ఇశ్రాయేలీయుల యెడల ఆయన తన దయను, నమ్మకమును జ్ఞాపకముంచుకొన్నాడు.
రక్షించగల మన దేవుని శక్తిని దూరదేశాల ప్రజలు చూసారు.
4 భూమి మీది ప్రతి జనము యెహోవాకు ఆనంద ధ్వని చేయండి.
త్వరగా స్తుతి కీర్తనలు పాడటం ప్రారంభించండి.
5 స్వరమండలములారా, యెహోవాను స్తుతించండి.
స్వరమండలసంగీతమా, ఆయనను స్తుతించుము.
6 బూరలు, కొమ్ములు ఊదండి.
మన రాజైన యెహోవాకు ఆనంద ధ్వని చేయండి.
7 భూమి, సముద్రం, వాటిలో ఉన్న
సమస్త జీవుల్లారా, బిగ్గరగా పాడండి.
8 నదులారా, చప్పట్లు కొట్టండి.
పర్వతములారా, ఇప్పుడు మీరంతా కలిసి గట్టిగా పాడండి.
9 యెహోవా ప్రపంచాన్ని పాలించుటకు వస్తున్నాడు
గనుక ఆయన ఎదుట పాడండి.
ఆయన ప్రపంచాన్ని న్యాయంగా పాలిస్తాడు.
నీతితో ఆయన ప్రజలను పాలిస్తాడు.
దావీదు కీర్తన.
103 నా ప్రాణమా! యెహోవాను స్తుతించుము.
నా సర్వ అంగములారా, ఆయన పవిత్ర నామాన్ని స్తుతించండి.
2 నా ప్రాణమా, యెహోవాను స్తుతించుము.
ఆయన నిజంగా దయగలవాడని మరచిపోకుము.
3 మనం చేసిన పాపాలన్నింటినీ దేవుడు క్షమిస్తున్నాడు.
మన రోగాలన్నింటినీ ఆయన బాగుచేస్తున్నాడు.
4 దేవుడు మన ప్రాణాన్ని సమాధి నుండి రక్షిస్తున్నాడు.
ఆయన ప్రేమ, జాలి మనకు ఇస్తున్నాడు.
5 దేవుడు మనకు విస్తారమైన మంచి వస్తువులు ఇస్తున్నాడు.
ఆయన మనలను యౌవన పక్షిరాజు వలె మరల పడుచువారినిగా చేస్తున్నాడు.
6 యెహోవా న్యాయం కలవాడు.
ఇతర మనుష్యుల ద్వారా గాయపరచబడి దోచుకొనబడిన ప్రజలకు దేవుడు న్యాయం జరిగిస్తాడు.
7 దేవుడు తన న్యాయ చట్టాలను మోషేకు నేర్పాడు.
తాను చేయగల శక్తివంతమైన పనులను ఇశ్రాయేలీయులకు దేవుడు చూపించాడు.
8 యెహోవా జాలిగలవాడు, దయగలవాడు.
దేవుడు సహనంగలవాడు, ప్రేమపూర్ణుడు.
9 యెహోవా ఎల్లప్పుడూ విమర్శించడు.
యెహోవా ఎల్లప్పుడూ మన మీద కోపంతో ఉండడు.
10 మనం దేవునికి విరోధంగా పాపం చేశాం.
కాని మనకు రావలసిన శిక్షను దేవుడు మనకివ్వలేదు.
11 భూమిపైన ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో
తన అనుచరుల యెడల దేవుని ప్రేమ అంత ఎత్తుగా ఉన్నది.
12 పడమటినుండి తూర్పు దూరంగా ఉన్నట్లు
దేవుడు మననుండి మన పాపాలను అంత దూరం పారవేశాడు.
13 తండ్రి తన పిల్లల యెడల దయగా ఉంటాడు.
అదే విధంగా, యెహోవా తన అనుచరులపట్ల కూడా దయగా ఉంటాడు.
14 మనల్ని గూర్చి దేవునికి అంతా తెలుసు.
మనం మట్టిలో నుండి చేయబడ్డామని దేవునికి తెలుసు.
15 మన జీవితాలు కొద్దికాలమని దేవునికి తెలుసు.
మన జీవితాలు గడ్డిలాంటివని ఆయనకు తెలుసు.
మనం ఒక చిన్న అడవి పువ్వులాంటి వాళ్లం అని దేవునికి తెలుసు.
16 ఆ పువ్వు త్వరగా పెరుగుతుంది. ఆ తరువాత వేడిగాలి వీస్తుంది; పువ్వు వాడిపోతుంది.
త్వరలోనే ఆ పువ్వు ఎక్కడికి ఎగిరిపోతుందో నీవు చూడలేకపోతావు.
17 కాని యెహోవా ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
దేవుడు తన అనుచరులను శాశ్వతంగా ప్రేమిస్తాడు.
దేవుడు వారి పిల్లలయెడల, వారి పిల్లల పిల్లలయెడల ఎంతో మంచివాడుగా ఉంటాడు.
18 దేవుని ఒడంబడికకు విధేయులయ్యేవారికి ఆయన మంచివాడు.
దేవుని ఆదేశాలకు విధేయులయ్యేవారికి ఆయన మంచివాడు.
19 దేవుని సింహాసనం పరలోకంలో ఉంది.
మరియు ఆయన సమస్తాన్నీ పరిపాలిస్తున్నాడు.
20 దేవదూతలారా, యెహోవాను స్తుతించండి.
దేవదూతలారా, మీరే దేవుని ఆదేశాలకు విధేయులయ్యే శక్తిగల సైనికులు.
మీరు దేవుని మాట విని ఆయన ఆదేశాలకు విధేయులవ్వండి.
21 యెహోవా సర్వసైన్యములారా, ఆయనను స్తుతించండి.
మీరు ఆయన సేవకులు,
దేవుడు కోరేవాటిని మీరు చేస్తారు.
22 అన్ని చోట్లా అన్నింటినీ యెహోవా చేశాడు. అన్నిచోట్లా సమస్తాన్నీ దేవుడు పాలిస్తాడు.
అవన్నీ యెహోవాను స్తుతించాలి!
నా ప్రాణమా, యెహోవాను స్తుతించుము!
రాజ్యాన్ని తిరిగి ఇచ్చేందుకు దేవుడు మాట ఇచ్చుట
11 “దావీదు గుడారం పడిపోయింది.
కాని నేను దానిని తిరిగి నిలబెడతాను.
గోడల కంతలు పూడ్చుతాను. శిథిలమైన భవనాలను తిరిగి నిర్మిస్తాను.
దానిని పూర్వమున్నట్లు నిర్మిస్తాను.
12 అప్పుడు ఎదోములో బతికివున్న ప్రజలు,
మరియు నా పేరుమీద పిలువబడే జనులందరూ సహాయం కొరకు యెహోవావైపు చూస్తారు.”
యెహోవా ఈ మాటలు చెప్పాడు.
అవి జరిగేలా ఆయన చేస్తాడు.
13 యెహోవా చెపుతున్నాడు: “పంటకోయువాని వెనుక భూమిని దున్నే రోజులు వస్తున్నాయి.
ద్రాక్షాపండ్లు తెంచేవాని వెనుకనే, పండ్లను తొక్కేవాడు వచ్చే సమయం రాబోతూవుంది.
కొండల నుంచి, పర్వతాల నుంచి
మధురమైన ద్రాక్షారసం పారుతుంది.
14 నా ప్రజలైన ఇశ్రాయేలీయులను చెరనుండి
తిరిగి తీసుకు వస్తాను.
వారు శిథిలమైన నగరాలను తిరిగి కడతారు.
ఆ నగరాలలో వారు మళ్లీ నివసిస్తారు.
వారు ద్రాక్షాతోటలు వేస్తారు.
ఆ తోటలనుంచి వచ్చిన ద్రాక్షారసాన్ని వారు తాగుతారు.
వారు తోటలను ఏర్పాటు చేస్తారు.
వారు ఆ తోటలనుండి వచ్చే ఫలాలను తింటారు.
15 నా ప్రజలను తమ దేశంలో మళ్లీ స్థిరపర్చుతాను.
నేను వారికిచ్చిన దేశాన్నుండి వారు మళ్లీ లాగి వేయబడరు.”
మీ దేవుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
పాప పురుషుడు
2 సోదరులారా! మన యేసు ప్రభువు రాకను గురించి, ఆయనతో జరుగబోయే సమావేశాన్ని గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. 2 ఎవరైనా వచ్చి తమకు మేము ఏదైనా ఉత్తరం వ్రాసినట్లు లేదా ప్రభువు రానున్న దినం వచ్చినట్లు తెలిసిందని చెప్పినా, లేక ఆత్మ ద్వారా ఆ విషయం తెలిసిందని చెప్పినా, లేక ఆ విషయాన్ని గురించి మిమ్మల్ని ఎవరైనా వారించినా భయపడకండి. దిగులు చెందకండి. 3 మిమ్మల్ని ఎవ్వరూ ఏ విధంగా మోసం చేయకుండా జాగ్రత్త పడండి. దేవుని పట్ల తిరుగుబాటు జరిగి, ఆ నాశన పుత్రుడు, దుష్టుడు కనిపించేదాకా ఆ రోజు రాదు.
బలంగా నిలబడండి
13 సోదరులారా! ప్రభువు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీ కోసం మేము దేవునికి అన్నివేళలా కృతజ్ఞతతో ఉండాలి. పరిశుద్ధాత్మ మిమ్మల్ని పరిశుద్ధ పరచుటవల్ల, సత్యంలో మీకున్న విశ్వాసం వల్ల దేవుడు మిమ్మల్ని రక్షించటానికి కాలానికి ముందే ఎన్నుకొన్నాడు. 14 మన యేసు క్రీస్తు ప్రభువు యొక్క మహిమలో మీరు భాగం పంచుకోవాలని, మీరు రక్షణ పొందాలనీ దేవుడు మా సువార్త ద్వారా మిమ్మల్ని పిలిచాడు. 15 సోదరులారా! మేము లేఖ ద్వారా మరియు మా బోధ ద్వారా బోధించిన సత్యాలను విడువకుండా నిష్ఠతో అనుసరించండి.
16 యేసు క్రీస్తు ప్రభువు, మనల్ని ప్రేమించిన మన తండ్రియైన దేవుడు మనల్ని అనుగ్రహించి మనకు అనంతమైన ధైర్యాన్ని, మంచి ఆశాభావాన్ని ఇచ్చారు. 17 దేవుడు మిమ్మల్ని ప్రోత్సాహపరిచి, మంచి పనులు చేయటానికి, మంచి మాటలు ఆడటానికి, మీకు ధైర్యం కలుగజేయునుగాక!
30 “నేను స్వయంగా ఏదీ చెయ్యలేను. నేను దేవుడు చెప్పమన్న తీర్పు చెబుతాను. అందువలన నా తీర్పు న్యాయమైనది. నెరవేర వలసింది నాయిచ్ఛ కాదు. నేను నన్ను పంపిన వాని యిచ్ఛ నెర వేర్చటానికి వచ్చాను.
యేసు యూదా నాయకులకు ఎక్కువ చెప్పటం
31 “నా పక్షాన నేను సాక్ష్యం చెబితే దానికి విలువ ఉండదు. 32 కాని నా పక్షాన సాక్ష్యం చెప్పేవాడు మరొకాయన ఉన్నాడు. నా విషయంలో ఆయన చెప్పే సాక్ష్యానికి విలువ ఉందని నాకు తెలుసు.
33 “మీరు మీ వాళ్ళను యెహాను దగ్గరకు పంపారు. అతడు న్యాయం పక్షాన మాట్లాడాడు. 34 మానవుని సాక్ష్యం నాకు కావాలని కాదు. మీరు రక్షింపబడాలని ఈ విషయం చెబుతున్నాను. 35 యోహాను ఒక దీపంలా మండుచూ. వెలుగు నిచ్చాడు. కొంతకాలం మీరా వెలుగు ద్వారా లాభంపొంది ఆనందించారు.
36 “నా దగ్గర యోహాను సాక్ష్యాని కన్నా గొప్ప సాక్ష్యం ఉంది. పూర్తి చెయ్యమని తండ్రి నాకు అప్పగించిన కార్యాల్ని నేను పూర్తి చేస్తున్నాను. ఈ కార్యాలు తండ్రి నన్ను పంపాడని నిరూపిస్తాయి. 37 నన్ను పంపిన తండ్రి స్వయంగా నన్ను గురించి చెప్పాడు. మీరాయన స్వరం ఎన్నడూ వినలేదు. ఆయన రూపాన్ని ఎప్పుడూ చూడలేదు. 38 అంతే కాక ఆయన పంపిన వాణ్ణీ మీరు నమ్మటంలేదు. కనుక, ఆయన బోధనలు మీ మనస్సులో నివసించటంలేదు. 39 లేఖనాల ద్వారా అనంత జీవితం లభిస్తుందని మీరు వాటిని పరిశోధిస్తారు. కాని ఆ లేఖనాలే నన్ను గురించి సాక్ష్యం చెపుతున్నాయి. 40 అయినా మీరు నా దగ్గరకు వచ్చి నానుండి క్రొత్త జీవితాన్ని పొందటానికి నిరాకరిస్తున్నారు.
41 “నాకు మానవుల పొగడ్తలు అవసరం లేదు. 42 కాని మీ గురించి నాకు తెలుసు. మీకు దేవునిపట్ల ప్రేమ లేదని నాకు తెలుసు. 43 నేను నా తండ్రి పేరిటవచ్చాను. నన్ను మీరు అంగీకరించలేదు. కాని ఒక వ్యక్తి స్వయంగా తన పేరిట వస్తే అతణ్ణి మీరు అంగీకరిస్తారు. 44 మీరు పరస్పరం పొగడుకుంటారు. కాని దేవుని మెప్పు పొందాలని ప్రయత్నించరు. అలాంటప్పుడు నన్ను ఎట్లా విశ్వసించగలరు? 45 నేను మిమ్మల్ని నా తండ్రి సమక్షంలో నిందిస్తానని అనుకోకండి. మీరు ఆధారంగా చేసుకొన్న మోషే మిమ్మల్ని నిందిస్తున్నాడు. 46 మీరు మోషేను నమ్మినట్లైతే, అతడు నన్ను గురించి వ్రాసాడు కనుక మీరు నన్ను కూడా నమ్మేవాళ్ళు. 47 అతడు వ్రాసింది మీరు నమ్మనప్పుడు నేను చెప్పింది ఎట్లా నమ్మగలరు?” అని అన్నాడు.
© 1997 Bible League International