Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 30

దావీదు కీర్తన. ఆలయ ప్రతిష్ఠ కీర్తన.

30 యెహోవా, నా కష్టాల్లో నుంచి నీవు నన్ను పైకి ఎత్తావు.
    నా శత్రువులు నన్ను ఓడించి, నన్ను చూచి నవ్వకుండా నీవు చేశావు. కనుక నేను నిన్ను ఘనపరుస్తాను.
యెహోవా, నా దేవా నేను నిన్ను ప్రార్థించాను.
    నీవు నన్ను స్వస్థపరచావు.
సమాధిలో నుండి నీవు నన్ను పైకి లేపావు.
    నీవు నన్ను బ్రతకనిచ్చావు. చచ్చిన వాళ్లతోబాటు నేను గోతిలొ[a] ఉండవలసిన పనిలేదు.

దేవుని అనుచరులారా! యెహోవాకు స్తుతులు పాడండి.
    ఆయన పవిత్ర నామాన్ని స్తుతించండి.
దేవునికి కోపం వచ్చింది కనుక “మరణం” నిర్ణయం చేయబడింది. కాని ఆయన తన ప్రేమను చూపించాడు.
    నాకు “జీవం” ప్రసాదించాడు.
రాత్రి పూట, నేను ఏడుస్తూ పండుకొంటాను.
    మర్నాటి ఉదయం నేను సంతోషంగా పాడుతూ ఉంటాను.

ఇప్పుడు నేను ఇది చెప్పగలను, ఇది సత్యం అని నాకు గట్టిగా తెలుసు.
    నేను ఎన్నటికీ ఓడించబడను.
యెహోవా, నీవు నామీద దయ చూపావు.
    బలమైన పర్వతంలా నీవు నన్ను నిలువబెట్టావు.
కొద్దికాలంపాటు, నీవు నా నుండి తిరిగిపోయావు.
    మరి నేను చాలా భయపడిపోయాను.
దేవా, నేను మరల, నిన్ను ప్రార్థించాను.
    నామీద దయ చూపించమని నేను నిన్ను అడిగాను.
“దేవా, నేను మరణించి,
    సమాధిలోకి దిగిపోతే ఏమి లాభం?
ధూళి నిన్ను స్తుతిస్తుందా?
    అది నీ నమ్మకమును గూర్చి చెబుతుందా?
10 యెహోవా, నా ప్రార్థన విని నామీద దయ చూపించుము.
    యెహోవా, నాకు సహాయం చేయుము” అని అడిగాను.

11 నేను ప్రార్థించినప్పుడు, నీవు నాకు సహాయం చేశావు.
నా ఏడ్పును నీవు నాట్యంగా మార్చావు. నా దుఃఖ వస్త్రాలను నీవు తీసివేశావు.
    నీవు నాకు సంతోషమనే వస్త్రాలు ధరింపజేశావు.
12 యెహోవా, నా దేవా, నిన్ను నేను శాశ్వతంగా స్తుతిస్తాను.
    ఎన్నటికీ మౌనంగా ఉండను. నా దేవా! నిన్ను ఎల్లప్పుడూ స్తుతిస్తాను.

కీర్తనలు. 32

దావీదు దైవధ్యాన కీర్తన.

32 పాపాలు క్షమించబడినవాడు ధన్యుడు.
    తన పాపాలు తుడిచి వేయబడినవాడు ధన్యుడు.
అపరాధి అని యెహోవా చేత ప్రకటించబడనివాడు ధన్యుడు.
    తన పాపాలను దాచిపెట్టేందుకు ప్రయత్నించనివాడు ధన్యుడు.

దేవా, నేను నీతో మరల మరల మాట్లాడాను.
    కాని నా రహస్య పాపాలను గూర్చి నేను చెప్పలేదు.
    నేను ప్రార్థించిన ప్రతిసారీ నేను బలహీనుడను మాత్రమే అయ్యాను.
దేవా, నీవు రాత్రింబవళ్లు నా జీవితాన్ని నాకు మరింత కష్టతరమైనదిగా చేశావు.
    తీవ్రమైన వేసవిలో బాగా ఎండిపోయిన భూమిలా నేను తయారయ్యాను.

అయితే అప్పుడు నేను నా పాపాలన్నిటినీ యెహోవా దగ్గర ఒప్పుకోవాలని నిర్ణయించుకొన్నాను.
    కనుక యెహోవా, నా పాపాలను గూర్చి నేను నీతో చెప్పుకొన్నాను.
    నా దోషాన్ని ఏదీ నేను దాచిపెట్టలేదు.
    మరియు నీవు నా పాపాలను క్షమించావు.
దేవా, ఈ కారణంచేత నీ అనుచరులు అందరూ నీకు ప్రార్థించాలి.
    కష్టాలు మహా ప్రవాహంలా వచ్చినాసరే, నీ అనుచరులు నిన్ను ప్రార్థించాలి.
దేవా, నేను దాగుకొనేందుకు నీవే ఆశ్రయం.
    నా కష్టాల నుండి నీవే నన్ను విడిపించుము.
నీవు నన్ను ఆవరించి, కాపాడుము.
    నీవు నన్నురక్షించిన విధమును గూర్చి నేను పాటలు పాడతాను.
యెహోవా చెబతున్నాడు, “నీవు పోవాల్సిన మార్గం గూర్చి
    నేను నీకు నేర్చించి, నడిపిస్తాను.
    నేను నిన్ను కాపాడుతాను, నీకు మార్గదర్శిగా ఉంటాను.
కనుక గుర్రంలా, గాడిదలా తెలివి తక్కువగా ఉండకుము.
    ఆ జంతువులు కళ్లెంతోను, వారుతోను నడిపించబడతాయి.
నీవు కళ్లెంను, వారును ఉపయోగిస్తే గాని ఆ జంతువులు నీ దగ్గరకు రావు.”

10 చెడ్డవాళ్లకు ఎన్నో బాధలు కలుగుతాయి.
    కాని యెహోవాను నమ్ముకొనేవారిని ప్రేమ ఆవరిస్తుంది.
11 మంచి మనుష్యులారా, యెహోవాయందు ఆనందించండి, బాగుగా సంతోషించండి.
పవిత్ర హృదయాలుగల మనుష్యులారా మీరంతా ఆనందించండి.

కీర్తనలు. 42-43

రెండవ భాగం

(కీర్తనలు 42–72)

సంగీత నాయకునికి: కోరహు కుటుంబంవారి దైవధ్యానం

42 దప్పిగొన్న దుప్పి, చల్లటి సెలయేటి ఊటల్లో నీళ్లు త్రాగాలని ఆశిస్తుంది.
    అలాగే దేవా, నీకోసం నా ఆత్మ దాహంగొని ఉంది.
సజీవ దేవుని కోసం, నా ఆత్మ దాహంగొని ఉంది.
    ఆయనను కలుసుకొనుటకు నేను ఎప్పుడు రాగలను?
నా కన్నీళ్లే రాత్రింబవళ్లు నా ఆహారం.
    నా శత్రువు ఎంతసేపూను “నీ దేవుడు ఎక్కడ?” అంటూనే ఉన్నాడు.

కనుక నన్ను వీటన్నిటినీ జ్ఞాపకం ఉంచుకోనిమ్ము.
    నా ఆత్మను కుమ్మరించనిమ్ము. దేవుని ఆలయానికి నడవటం,
ప్రజల గుంపులను నడిపించటం నాకు జ్ఞాపకం.
    అనేకమంది ప్రజలు పండుగ చేసుకొంటూ సంతోష స్తుతిగానాలు పాడటం నాకు జ్ఞాపకం.

నేను ఎందుకు అంత విచారంగా ఉన్నాను?
    ఎందుకు నేనంత తల్లడిల్లిపోయాను?
దేవుని సహాయం కోసం నేను వేచి ఉండాలి.
    ఆయనను ఇంకా స్తుతించుటకు నాకు అవకాశం దొరుకుతుంది.
    ఆయన నన్ను కాపాడుతాడు.
నాకు సహాయమైన దేవా! నా మనస్సులో నేను కృంగియున్నాను.
    కనుక నేను నిన్ను యొర్దాను ప్రదేశమునుండియు, హెర్మోను ప్రాంతంనుండియు, మీసారు కొండనుండియు జ్ఞాపకం చేసుకొంటున్నాను.
నీ జలపాతాల ఉరుము ధ్వని అఘాధంలోనుండి పిలుస్తోంది.
    నీ అలలు అన్నియు నామీదుగా దాటియున్నవి.

ప్రతిరోజూ యెహోవా తన నిజమైన ప్రేమను చూపిస్తాడు.
    అప్పుడు రాత్రిపూట నేను ఆయన పాటలు పాడుతాను. నా సజీవ దేవునికి నేను ప్రార్థన చేస్తాను.
ఆశ్రయ బండ అయిన నా దేవునితో,
    “యెహోవా! నీవు నన్ను ఎందుకు మరిచావు?
    నా శత్రువుల కృ-రత్వాన్ని బట్టి నేనెందుకు విచారంగా ఉండాలి?” అని నేను వేడుకుంటాను.
10 నా శత్రువులు నన్ను చంపుటకు ప్రయత్నించారు.
    “నీ దేవుడు ఎక్కడ?” అని వారు అన్నప్పుడు వారు నన్ను ద్వేషిస్తున్నట్టు వారు చూపెట్టారు.

11 నేను ఎందుకు ఇంత విచారంగా ఉన్నాను?
    నేను ఎందుకు ఇంతగా తల్లడిల్లిపోయాను?
దేవుని సహాయం కోసం నేను వేచి ఉండాలి.
    నేను ఇంకా ఆయన్ని స్తుతించే అవకాశం దొరుకుతుంది.
    నా సహాయమా! నా దేవా!

43 దేవా, నిన్ను వెంబడించని ప్రజలమీద నా ఆరోపణను ఆలకించుము.
నా వివాదం ఆలకించి, ఎవరిది సరిగ్గా ఉందో నిర్ధారించుము.
ఆ మనుష్యులు అబద్ధాలు చెబుతున్నారు.
ఆ ప్రజలు వంకర మనుష్యులు.
దేవా, ఆ మనుష్యుల నుండి నన్ను రక్షించుము.
దేవా, నీవే నా క్షేమ స్థానం.
    నీవు నన్నెందుకు విడిచిపెట్టావు?
నా శత్రువుల కృ-రత్వాన్ని బట్టి
    నేనెందుకు విచారంగా ఉండాలి?
దేవా, నీ సత్యము, నీ వెలుగును నా మీద ప్రకాశింపనిమ్ము.
    నీ వెలుగు, సత్యాలు నన్ను నడిపిస్తాయి. నీ పరిశుద్ధ పర్వతానికి నన్ను నడిపించుము. నీ ఇంటికి నన్ను చేర్చుము.
దేవుని బలిపీఠం దగ్గరకు నేను వస్తాను.
    దేవుని దగ్గరకు నేను వస్తాను.
ఆయన నన్ను సంతోషింపజేస్తాడు.
    దేవా, నా దేవా, సితారాతో నిన్ను స్తుతిస్తాను.

నేనెందుకు ఇంత విచారంగా ఉన్నాను?
    నేనెందుకు ఇంతగా తల్లడిల్లిపోతున్నాను?
దేవుని సహాయం కోసం నేను కనిపెట్టి ఉండాలి.
    నేను ఇంకను దేవుని స్తుతించే అవకాశం లభిస్తుంది.
    నా దేవుడే నాకు సహాయము.

హగ్గయి 2:1-9

యెహోవా ప్రజలను ప్రోత్సహించటం

దేవుడైన యెహోవా వాక్కు ఏడవనెల ఇరవై ఒకటో రోజున హగ్గయికి వినవచ్చింది. ఆ వాక్కు ఇలా చెప్పింది: ఇప్పుడు షయల్తీయేలు కుమారుడు, యూదారాజ్య పాలనాధికారి అయిన జెరుబ్బాబెలుతోను, యెహోజాదాకు కుమారుడు, ప్రధాన యాజకుడు అయిన యెహోషువాతోను, మరియు జనులందరితోను మాట్లాడి ఇలా చెప్పు: “ఈ ఆలయంయొక్క గత వైభవాన్ని చూసినవారు మీలో ఎవ్వరు మిగిలారు? ఇప్పుడు మీకు ఇది ఎలా కనిపిస్తు ఉంది? చాలా సంవత్సరాలక్రితం ఉన్న ఆలయంతో పోల్చిచూస్తే, మీ కండ్లకు ఇప్పటిది ఎందుకూ పనికిరానిదిగా ఉన్నట్లు అనిపిస్తూవుందా?” కాని ఇప్పుడు యెహోవా చెపుతున్నాడు, “జెరుబ్బాబెలూ! అధైర్యపడవద్దు. యెహోజాదాకు కుమారుడు, ప్రధాన యాజకడవునైన యెహోషువా! అధైర్యపడవద్దు. ఈ దేశనివాసులైన మీరందరు అధైర్యపడవద్దు అని యెహోవా చెపుతున్నాడు. ఈ పనిని కొనసాగించండి, ఎందుకంటే, నేను మీతో ఉన్నాను అని సర్వశక్తిమంతుడైన ప్రభువు ఈ విషయాలు చెప్పాడు!

“మీరు ఈజిప్టులోనుండి బయటికి వచ్చినప్పుడు నేను మీతో చేసిన ఒడంబడిక ప్రకారం, నా ఆత్మ మీ మధ్య ఉంది. భయపడవద్దు! ఎందువల్లనంటే సర్యశక్తిమంతుడైన యెహోవా ఇది చెపుతున్నాడు! ‘కొద్ది వ్యవధిలో మరొక్కసారి పరలోకాలను, భూమిని, సముద్రాన్ని, ఎండిన నేలను కంపించేలా చేస్తాను. దేశాలన్నింటినీ కుదిపివేస్తాను. వారంతా, వివిధ దేశాలలోవున్న ధనసంపదతో వస్తారు. అప్పుడు ఈ ఆలయాన్ని మహిమతో నింపుతాను.’ సర్వశక్తిమంతుడైన యెహోవా ఇది చెపుతున్నాడు. ‘వెండి నాది. బంగారంనాది.’ సర్వశక్తిమంతుడైన యెహోవా ఇది చెపుతున్నాడు. ‘ఈ ప్రస్తుత ఆలయంయొక్క మహిమ మొదటి ఆలయ మహిమకంటె ఇనుమడించి ఉంటుంది.’ సర్వశక్తిమంతుడైన యెహోవా ఇది చెపుతున్నాడు. ‘మరియు ఈ ప్రదేశంలో నేను శాంతి నెలకొల్పుతాను అని’ సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు!”

ప్రకటన 3:1-6

సార్దీసులోని సంఘానికి

“సార్దీసులోని సంఘానికి చెందిన దూతకు ఈ విధంగా వ్రాయి:

“దేవుని ఏడు ఆత్మలను, ఏడు నక్షత్రాలను తన ఆధీనంలో ఉంచుకొన్నవాడు ఈ విధంగా చెబుతున్నాడు:

“నీవు చేస్తున్న పనులు నాకు తెలుసు. ప్రజలు నీవు బ్రతికి ఉన్నావని అనుకొంటున్నారు. కాని నీవు నిజానికి చనిపోయిన వానితో సమానము. నా దేవుని దృష్టిలో నీవు చేస్తున్న పనులు యింకా పూర్తి కాలేదు. ఇది నేను గమనించాను. కనుక జాగ్రత్త. నీలో ఉన్న శక్తి పూర్తిగా నశించకముందే నీ శక్తిని కాపాడుకో. నీకు లభించినదాన్ని, నీవు విన్నదాన్ని జ్ఞాపకం తెచ్చుకో. ఆచరించు. మారుమనస్సు పొందు. కాని నీవు జాగ్రత్తగా ఉండకపోతే నేను ఒక దొంగలా వస్తాను. నేను ఎప్పుడు వస్తానో నీవు తెలుసుకోలేవు.

“మలినంకాని కొందరు వ్యక్తులు అక్కడ సార్దీసులో నీ దగ్గరున్నారు. వాళ్ళు యోగ్యులు కనుక, తెల్లని దుస్తులు ధరించి నాతో సహా నడుస్తారు. విజయం సాధించిన వాళ్ళలా తెల్లని దుస్తులు ధరించండి. అలా చేసినవాని పేరును నేను జీవగ్రంథంనుండి తుడిచివేయను. అతణ్ణి నా తండ్రి ముందు, దేవదూతల ముందు అంగీకరిస్తాను. సంఘాలకు ఆత్మ చెబుతున్నదాన్ని ప్రతివాడు వినాలి.

మత్తయి 24:1-14

యేసు అంత్య కాలాన్ని గురించి హెచ్చరించటం

(మార్కు 13:1-31; లూకా 21:5-33)

24 యేసు దేవాలయాన్ని వదిలి వెళ్తుండగా ఆయన శిష్యులు దగ్గరకు వచ్చి ఆ దేవాలయపు కట్టడాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. యేసు, “ఇవన్నీ చూస్తున్నారుగా! ఇది సత్యం. రాయి మీద రాయి నిలువకుండా వాళ్ళు అన్నీ పడగొడ్తారు” అని అన్నాడు.

యేసు ఒలీవ చెట్ల కొండ మీద కూర్చొన్నాడు. ఆయన శిష్యులు ఆయన దగ్గరకు ప్రత్యేకంగా వచ్చి, “చెప్పండి; ఇది ఎప్పుడు సంభవిస్తుంది? మీరు రావటానికి ముందు, ఈ యుగం అంతమవటానికి ముందు ఏ సూచన కనిపిస్తుంది?” అని అడిగారు.

యేసు సమాధానంగా, “మిమ్మల్నెవరూ మోసం చెయ్యకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే చాలా మంది నా పేరిట వచ్చి ‘నేను క్రీస్తును’ అని చెప్పుకొంటూ అనేకుల్ని మోసం చేస్తారు. యుద్ధాలను గురించి, యుద్ధముల వదంతుల్ని గురించి విన్నప్పుడు మీరు దిగులు పడకండి. అవి తప్పక సంభవిస్తాయి. కాని ‘అంతం’ అప్పుడే రాదు. దేశం మీదికి దేశం యుద్ధానికి వస్తుంది. రాజ్యం మీదికి రాజ్యం యుద్ధానికి వస్తుంది. పలుప్రాంతాల్లో క్షామాలు, భూకంపాలు సంభవిస్తాయి. అంటే, ప్రసవవేదనలు ఆరంభం అయ్యాయన్నమాట.

“ఆ తర్వాత వాళ్ళు మిమ్మల్ని అధికారులకు అప్పగిస్తారు. ఆ అధికారులు మిమ్మల్ని హింసించి చంపుతారు. నా కారణంగా దేశాలన్నీ మిమ్మల్ని ద్వేషిస్తాయి. 10 ఆ సమయంలో అనేకులు ఈ విశ్వాసాన్ని వదిలి వేస్తారు. పరస్పరం ద్వేషించు కొంటారు. 11 దొంగ ప్రవక్తలు అనేకులు వచ్చి ప్రజల్ని మోసం చేస్తారు. 12 పాపం పెరగటంవల్ల అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది. 13 కాని చివరి దాకా పట్టుదలతో నిలుచున్న వాణ్ణి దేవుడు రక్షిస్తాడు. 14 ఈ రాజ్యాన్ని గురించి చేప్పే సువార్త ప్రపంచమంతా ప్రకటింప బడుతుంది. ఆ సువార్త దేశాలన్నిటికిని ఒక ఋజువుగా ఉంటుంది. అప్పుడు అంతం వస్తుంది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International