Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 26

దావీదు కీర్తన.

26 యెహోవా, నాకు తీర్పు తీర్చుము, నేను పవిత్ర జీవితం జీవించినట్టు రుజువు చేయుము.
    యెహోవాను నమ్మకోవటం నేనెన్నడూ మానలేదు.
యెహోవా, నన్ను పరిశోధించి, నన్ను పరీక్షించి.
    నా హృదయంలోనికి, నా మనసులోనికి నిశితంగా చూడుము.
నేను ఎల్లప్పుడూ నీ ప్రేమను చూస్తాను.
    నీ సత్యాల ప్రకారం నేను జీవిస్తాను.
పనికిమాలిన ఆ మనుష్యుల్లో
    నేను ఒకడ్ని కాను.
ఆ దుర్మార్గపు ముఠాలంటే నాకు అసహ్యం.
    ఆ దుష్టుల ముఠాలలో నేను చేరను.

యెహోవా, నేను నా చేతులు కడుగుకొంటాను.
    నేను నీ బలిపీఠం దగ్గరకు వస్తాను.
యెహోవా, నేను నీకు స్తుతి కీర్తనలు పాడుతాను.
    నీవు చేసిన అద్భుత విషయాలను గూర్చి నేను పాడుతాను.
యెహోవా, నీ గుడారం అంటే నాకు ప్రేమ.
    మహిమగల నీ గుడారాన్ని నేను ప్రేమిస్తున్నాను.

యెహోవా, ఆ పాపులతో నన్ను జత చేయకుము.
    ఆ హంతకులను నీవు చంపేటప్పుడు, నన్ను చంపకుము.
10 ఆ మనుష్యులకు దుష్ట పథకాలున్నాయి.
    చెడుకార్యాలు చేయటానికి ఆ మనుష్యులు లంచం తీసుకొంటారు.
11 కాని నేను నిర్దోషిని.
    కనుక దేవా, నన్ను కరుణించి, రక్షించుము.
12 నేను సురక్షితమైన స్థలాల్లో నిలుస్తాను.
    యెహోవా, నీ అనుచరులు సమావేశమైనప్పుడు నేను నిన్ను స్తుతిస్తాను.

కీర్తనలు. 28

దావీదు కీర్తన.

28 యెహోవా, నీవే నా బండవు.
సహాయం కోసం నేను నిన్ను పిలుస్తున్నాను.
    నా ప్రార్థనలకు నీ చెవులు మూసుకోవద్దు.
సహాయంకోసం పిలుస్తున్న నా పిలుపుకు నీవు జవాబు ఇవ్వకపోతే
    అప్పుడు నేను సమాధిలోనున్న శవాల్లాగే ఉంటాను.
యెహోవా, నీ అతి పవిత్ర స్థలం వైపు నేను నా చేతులు ఎత్తి, ప్రార్థిస్తున్నాను.
    నేను నిన్ను వేడుకొన్నప్పుడు, నా మాట ఆలకించుము.
    నా మీద దయ చూపించుము.
యెహోవా, నేను చెడ్డవాళ్లవలె ఉన్నానని తలంచవద్దు. చెడు కార్యాలు చేసే దుర్మార్గుల్లోకి నన్ను లాగకుము.
    ఆ మనుష్యులు వారి పొరుగువారిని “షాలోం”[a] అని అభినందిస్తారు. కాని వారి హృదయాల్లో వారి పొరుగువారిని గూర్చి వారు చెడ్డ పథకాలు వేస్తున్నారు.
యెహోవా, ఆ మనుష్యులు ఇతరులకు కీడు చేస్తారు.
    కనుక వారికి కూడ కీడు జరిగేటట్టుగా చేయుము.
    ఆ చెడ్డవాళ్లు శిక్షించబడాల్సిన విధంగా వారిని శిక్షించుము.
యెహోవా చేసే మంచి పనులను చెడ్డవాళ్లు గ్రహించరు.
    ఆయన చేసే మంచి వాటిని వారు చూడరు, అర్థం చేసుకోరు.
    వారు నాశనం చేయటానికి ప్రయత్నిస్తారు.

యెహోవాను స్తుతించండి.
    కరుణించుమని నేను చేసిన నా ప్రార్థన ఆయన విన్నాడు.
యెహోవా నా బలం, ఆయనే నా డాలు.
    నేను ఆయనను నమ్ముకొన్నాను.
ఆయన నాకు సహాయం చేసాడు. నేను చాలా సంతోషంగా ఉన్నాను.
    మరియు నేను ఆయనకు స్తుతి కీర్తనలు పాడుతాను.
యెహోవా తన ప్రజలకు బలమైయున్నాడు.
    ఆయన ఏర్పాటు చేసుకొన్నవానికి[b] శక్తి, విజయాలను ఆయన ఇస్తాడు.

దేవా, నీ ప్రజలను రక్షించుము.
    నీకు చెందిన ప్రజలను ఆశీర్వదించుము.
    కాపరిలా వారిని నిత్యం నడిపించుము.

కీర్తనలు. 36

సంగీత నాయకునికి: యెహోవా సేవకుడైన దావీదు కీర్తన.

36 “నేను దేవునికి భయపడను, గౌరవించను” అని దుర్మార్గుడు తనలో తాను చెప్పుకొన్నప్పుడు
    అతడు చాలా చెడ్డ పని చేస్తున్నాడు.
ఆ మనిషి తనకు తానే అబద్ధం చెప్పుకొంటున్నాడు.
    ఆ మనిషి తన సొంత తప్పులను చూడడు.
    కనుక అతడు క్షమాపణ వేడుకోడు.
అతని మాటలు కేవలం పనికిమాలిన అబద్ధాలే.
    అతడు తెలివిగలవాడు కాజాలడు, మేలు చేయడం నేర్చుకోలేడు.
రాత్రిపూట, అతడు పనికిమాలిన సంగతులు తలుస్తూంటాడు.
    అతడు మేల్కొన్నప్పుడు, ఏ మేలూ చేయడు.
    ఏ చెడు కార్యాం చేయటానికైనా అతడు నిరాకరించడు.

యెహోవా, నీ నిజమైన ప్రేమ ఆకాశాల కంటె ఉన్నతమైనది.
    నీ నమ్మకత్వం మేఘాలకంటె ఉన్నతం.
యెహోవా, నీ నీతి “దేవతల పర్వతాల కంటె ఉన్నతమైనది.”
    నీ న్యాయం లోతైన మహాసముద్రం కంటె లోతైనది.
యెహోవా, నీవు మానవులను, జంతువులను కాపాడుతావు.
ప్రేమగల నీ దయకంటె ఎక్కువ ప్రశస్తమైనది ఇంకేది లేదు.
    కాపుదల కోసం మనుష్యులు, దేవ దూతలు నీ దగ్గరకు వస్తారు.
యెహోవా, నీ ఇంటిలోని సమృద్ధియైన ఆహారంనుండి వారు నూతన బలం పొందుతారు.
    అధ్బుతమైన నీ నదిలోనుండి నీవు వారిని త్రాగనిస్తావు.
యెహోవా, జీవపు ఊట నీ నుండి ప్రవహిస్తుంది.
    నీ వెలుగు మమ్మల్ని వెలుగు చూడనిస్తుంది.
10 యెహోవా, వాస్తవంగా నిన్ను ఎరిగినవారిని ప్రేమించటం కొనసాగించుము.
    నీకు నమ్మకంగావుండే ప్రజలకు నీ మేలు కలుగనిమ్ము.
11 యెహోవా, గర్విష్ఠుల మూలంగా నన్ను పట్టుబడనివ్వకుము.
    దుర్మార్గుల చేత తరుమబడనియ్యకుము.

12 వారి సమాధుల మీద ఈ మాటలు చెక్కుము.
    “ఇక్కడే దుర్మార్గులు పడిపోయారు.
    వారు చితుకగొట్టబడ్డారు.
    వారు మళ్లీ ఎన్నటికీ లేచి నిలబడరు.”

కీర్తనలు. 39

సంగీత నాయకునికి, యెదూతూనునకు: దావీదు కీర్తన.

39 “నేను జాగ్రత్తగా నడచుకొంటాను.
    నా నాలుకతో నన్ను పాపం చేయనివ్వను” అని నేను అన్నాను.
    నేను దుర్మార్గులకు సమీపంగా ఉన్నప్పుడు నేను నా నోరు మూసుకొంటాను.[a]

మాట్లాడుటకు నేను తిరస్కరించాను.
    నేనేమి చెప్పలేదు.
    కాని నేను నిజంగా తల్లడిల్లిపోయాను.
నాకు కోపం వచ్చింది.
    దీని విషయం నేను తలంచిన కొలది నాకు మరింత కోపం వచ్చింది.
    కనుక నేను ఏదో అన్నాను.

యెహోవా, నాకు ఏమి జరుగుతుందో చెప్పుము.
    నేను ఎన్నాళ్లు జీవిస్తానో నాకు చెప్పుము.
    నిజానికి నా జీవితం ఎంత కొద్దిపాటిదో నాకు చెప్పుము.
యెహోవా, నీవు నాకు కొద్దికాలం జీవితం మాత్రమే ఇచ్చావు.
    నా జీవితం నీ ఎదుట శూన్యం.
ప్రతి మనిషి యొక్క జీవితం ఒక మేఘంలాంటిది మాత్రమే. ఏ మనిషి శాశ్వతంగా జీవించడు.

మేము జీవించే జీవితం అద్దంలోని ప్రతిబింబం వంటిది.
    మా ప్రయాసలన్నియు వ్యర్థము. మేము సామగ్రి సమకూర్చుకొంటూనే ఉంటాము.
    కాని ఆ సామగ్రి ఎవరికి దొరుకుతుందో మాకు తెలియదు.

కనుక ప్రభూ, నాకు ఏమి ఆశ ఉంది?
    నీవే నా ఆశ.
యెహోవా, నేను చేసిన చెడు కార్యాలనుండి నీవు నన్ను రక్షిస్తావు.
    దేవునియందు నమ్మకము లేనివానిలా, వెర్రివాడిలా నన్ను యితరులు చూడకుండా నీవు చేస్తావు.
నేను నా నోరు తెరవను.
    నేను ఏమీ చెప్పను.
    యెహోవా, నీవు చేయవలసింది చేశావు.
10 దేవా, నన్ను శిక్షించటం మానివేయుము.
    నీ శిక్షవల్ల నేను అలసిపోయాను.
11 యెహోవా, తప్పు చేసినవారిని నీవు శిక్షించుము. ప్రజలు జీవించాల్సిన సరైన విధానాన్ని నీవు అలా నేర్పిస్తావు.
    వారికి ప్రియమైన దాన్ని చిమ్మటవలె నీవు నాశనం చేస్తావు.
    మా జీవితాలు అంతలోనే మాయమయ్యే మేఘంలా ఉన్నాయి.

12 యెహోవా, నా ప్రార్థన ఆలకించుము.
    నేను నీకు మొరపెట్టే మాటలు వినుము.
    నా కన్నీళ్లు తెలియనట్లు ఉండవద్దు.
నేను దాటిపోతున్న ఒక అతిథిని.
    నా పూర్వీకులందరిలాగే నేను కూడా ఒక బాటసారిని.
13 యెహోవా, నా వైపు చూడకుము. నేను చనిపోక ముందు నన్ను సంతోషంగా ఉండనిమ్ము.
    కొంచెంకాలంలో నేను ఉండకుండా పోతాను.

ఆమోసు 7:10-17

ఆమోసు ప్రకటనలను అమజ్యా ఆపజూడటం

10 బేతేలులో ఒక యాజకుడైన అమజ్యా ఇశ్రాయేలు రాజైన యరొబాముకు ఈ వర్తమానం పంపాడు: “ఆమోసు నీమీద కుట్ర పన్నుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు నీ మీదకు తిరగబడేలా చేయటానికి అతడు ప్రయత్నిస్తున్నాడు. అతడు ఎంతగా మాట్లాడుతున్నాడంటే, ఈ దేశం అతని మాటల్ని సహించలేదు. 11 యరొబాము కత్తిచే చంపబడతాడనీ, ఇశ్రాయేలీయులు తమ దేశంనుండి బందీలుగా కొనిపోబడతారనీ ఆమోసు ప్రచారం చేస్తున్నాడు.”

12 ఆమోసుతో కూడ అమజ్యా ఇలా చెప్పాడు: “ఓ దీర్ఘదర్శీ (ప్రవక్తా), నీవు యూదాకు పారిపోయి అక్కడనే తిను. నీ బోధన అక్కడనే చేయి. 13 అంతేగాని, ఇక్కడ బేతేలులో ఎంతమాత్రమూ నీవు ప్రకటనలు చేయవద్దు. ఇది యరొబాము పవిత్ర స్థలం (రాజధాని). ఇది ఇశ్రాయేలు ఆలయం!”

14 అప్పుడు అమజ్యాకు ఆమోసు ఇలా సమాధానాం చెప్పాడు: “నేను వృత్తిరీత్యా ప్రవక్తను గాను. పైగా నేను ప్రవక్త వంశంనుండి వచ్చినవాడినీ కాను. నేను పశువులను కాస్తూ ఉంటాను. మేడి పండ్ల వృక్షాలను రక్షిస్తూ వుంటాను. 15 నేనొక గొర్రెల కాపరిని. అయితే యెహోవా నన్ను గొర్రెలను అనుసరించనీయకుండా పిలిచాడు. ‘నీవు వెళ్లి, నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు ప్రకటనలు చేయి’ అని యెహోవా నాతోచెప్పాడు. 16 కావున యెహోవా వర్త మానాన్ని విను. నీవు, ‘ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా ప్రకటించవద్దు. ఇస్సాకు వంశానికి వ్యతిరేకంగా బోధనలు చేయవద్దు’ అని నాకు చెపుతున్నావు. 17 కాని యెహోవా చెప్పేదేమంటే: ‘నీ భార్య నగరంలో వేశ్య అవుతుంది. నీ కుమారులు, కుమార్తెలు కత్తులతో చంపబడతారు. అన్యజనులు నీ రాజ్యాన్ని వ పర్చుకొని, తమలో తాము దానిని పంచుకుంటారు. నీవు పరదేశంలో చనిపోతావు. ఇశ్రాయేలు ప్రజలు నిశ్చయంగా ఈ దేశంనుండి బందీలుగా తీసికొనిపోబడతారు.’”

ప్రకటన 1:9-16

నేను యోహానును, మీ సోదరుణ్ణి. యేసుతో పొందిన ఐక్యత వల్ల మనము ఆయన రాజ్యంలో ఒకటిగా ఉన్నాము. సహనంతో కష్టాలు అనుభవిస్తున్నాము. యేసు చెప్పిన సత్యాన్ని దేవుని సందేశాన్ని ప్రకటించటం వల్ల నన్ను వాళ్ళు పత్మాసు ద్వీపంలో ఒంటరిగా ఉంచారు. 10 ఆదివారమునాడు నేను దేవుని ఆత్మపూర్ణుడనైయుండగా బూర ఊదినట్లు నా వెనుకనుండి ఒక పెద్ద శబ్దం వినిపించింది. 11 అది నాతో, “నీవు చూసినదాన్ని ఒక గ్రంథంగా వ్రాసి ఈ ఏడు సంఘాలకు అనగా, ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియ, లవొదికయకు పంపుము” అని అన్నది.

12 నాతో మాట్లాడుతున్న స్వరం ఎవరిదో చూడాలని వెనక్కు తిరిగి చూసాను. వెనక్కు తిరిగి చూడగా ఏడు బంగారు దీపస్తంభాలు కన్పించాయి. 13 వాటి మధ్య ఒక వ్యక్తి కనిపించాడు. ఆయన మనుష్యకుమారునిలా[a] ఉన్నాడు. ఆయన వేసుకొన్న అంగీ ఆయన పాదాల వరకు ఉంది. ఆయన రొమ్మునకు బంగారు దట్టి కట్టబడివుంది. 14 ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిలా ఉన్నాయి. ఆయన వెంట్రుకల్ని మంచుతో కూడా పోల్చవచ్చు. ఆయన కళ్ళు అగ్నిజ్వాలల్లా ఉన్నాయి. 15 ఆయన పాదాలు కొలిమిలో కాలే యిత్తడిలా ఉన్నాయి. ఆయన కంఠధ్వని జల ప్రవాహం చేసే శబ్దంలా ఉంది. 16 ఆయన తన కుడి చేతిలో ఏడు నక్షత్రాలను పట్టుకొని ఉన్నాడు. ఇరువైపులా పదునుగానున్న ఒక కత్తి ఆయన నోటి నుండి బయటకు వచ్చింది. ఆయన ముఖం దివ్యంగా ప్రకాశిస్తున్న సూర్యునిలా ఉంది.

మత్తయి 22:34-46

అతి ముఖ్యమైన ఆజ్ఞ ఏది?

(మార్కు 12:28-34; లూకా 10:25-28)

34 యేసు సద్దూకయ్యుల నోరు మూయించాడని విని పరిసయ్యులు అక్కడ సమావేశమయ్యారు. 35-36 వాళ్ళలో ఉన్న ధర్మశాస్త్ర పండితుడొకడు యేసును పరీక్షించాలని, “బోధకుడా! ధర్మశాస్త్రాల్లో ఉన్న ఆజ్ఞలన్నిటిలో ఏ ఆజ్ఞ గొప్పది?” అని ప్రశ్నించాడు.

37 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “మీ ప్రభువైన దేవుణ్ణి సంపూర్ణమైన హృదయంతో, సంపూర్ణమైన ఆత్మతో, సంపూర్ణమైన బుద్ధితో ప్రేమించండి.(A) 38 ఇది అన్ని ఆజ్ఞలకన్నా మొదటిది, గొప్పది. 39 రెండవ ఆజ్ఞ కూడా అట్టిదే. ‘నిన్ను నీవు ప్రేమించుకొన్నంతగా నీ పొరుగువాణ్ణి ప్రేమించు’(B) 40 ధర్మశాస్త్రాలలో ఉన్న వాటన్నిటికి, ప్రవక్తలు వ్రాసిన వాటన్నిటికి ఈ రెండు ఆజ్ఞలే ఆధారం.”

క్రీస్తు దావీదు కుమారుడా లేక దావీదుకు ప్రభువా?

(మార్కు 12:35-37; లూకా 20:41-44)

41 పరిసయ్యులు సమావేశమయ్యారు. యేసు వాళ్ళను 42 “మీరు క్రీస్తును గురించి ఏమనుకుంటున్నారు? ఆయన ఎవరి కుమారుడు?” అని అడిగాడు.

“దావీదు కుమారుడు” అని వాళ్ళు సమాధానం చెప్పారు.

43 యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు, “మరి దావీదు దేవుని ఆత్మద్వారా మాట్లాడుతూ క్రీస్తును ‘ప్రభూ!’ అని ఎందుకు పిలిచాడు? దావీదు,

44 ‘ప్రభువు, నా ప్రభువుతో నీ శత్రువుల్ని నీ కాళ్ళ ముందు పడవేసే దాకా,
నా కుడి వైపు కూర్చో’(C)

అని అనలేదా? 45 దావీదు క్రీస్తును ‘ప్రభూ’ అని అన్నాడు కదా. అలాంటప్పుడు క్రీస్తు దావీదు కుమారుడెట్లవుతాడు?”

46 ఎవ్వరూ ఏ సమాధానం చెప్పలేక పొయ్యారు. ఆ రోజు నుండి ఆయన్ని మరే ప్రశ్నలు అడగటానికి ఎవ్వరికి ధైర్యం చాలలేదు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International