Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 25

దావీదు కీర్తన.

25 యెహోవా, నేను నీకు నన్ను అర్పించుకొంటాను.
నా దేవా, నేను నిన్ను నమ్ముకొంటున్నాను.
    నేను నిరాశచెందను.
    నాశత్రువులు నన్ను చూచి నవ్వరు.
నిన్ను నమ్ముకొనే ఏ మనిషి నిరాశచెందడు.
    కాని నమ్మక ద్రోహులు నిరాశపడతారు.
    వారికి ఏమీ దొరకదు.

యెహోవా, నీ మార్గాలు నేర్చుకొనుటకు నాకు సహాయం చేయుము.
    నీ మార్గాలను ఉపదేశించుము.
నన్ను నడిపించి, నీ సత్యాలు నాకు ఉపదేశించుము.
    నీవు నా దేవుడవు, నా రక్షకుడవు.
    రోజంతా నేను నిన్ను నమ్ముతాను.
యెహోవా, నా యెడల దయ చూపుటకు జ్ఞాపకం ఉంచుకొనుము.
    నీవు ఎల్లప్పుడూ చూపిస్తూ వచ్చిన ఆ ప్రేమను నా యెడల చూపించుము.
నేను యౌవ్వనంలో ఉన్నప్పుడు చేసిన పాపాలు చెడు కార్యాలు జ్ఞాపకం చేసుకోవద్దు.
    యెహోవా, నీ నామ ఘనతకోసం ప్రేమతో నన్ను జ్ఞాపకం చేసుకొనుము.

యెహోవా నిజంగా మంచివాడు.
    జీవించాల్సిన సరైన మార్గాన్ని పాపులకు ఆయన ఉపదేశిస్తాడు.
దీనులకు ఆయన తన మార్గాలను ఉపదేశిస్తాడు.
    న్యాయంగా ఆయన వారిని నడిపిస్తాడు.
10 యెహోవా ఒడంబడికను, వాగ్దానాలను అనుసరించే మనుష్యులందరికి
    ఆయన మార్గాలు దయగలవిగా, వాస్తవమైనవిగా ఉంటాయి.

11 యెహోవా, నేను ఎన్నెన్నో తప్పులు చేసాను.
    కాని, నీ మంచితనం చూపించుటకు గాను, నేను చేసిన ప్రతి దానిని నీవు క్షమించావు.

12 ఒక వ్యక్తి యెహోవాను అనుసరించాలని కోరుకొంటే
    అప్పుడు శ్రేష్ఠమైన జీవిత విధానాన్ని దేవుడు ఆ వ్యక్తికి చూపిస్తాడు.
13 ఆ వ్యక్తి మేళ్లను అనుభవిస్తాడు.
    అతనికిస్తానని దేవుడు వాగ్దానం చేసిన భూమిని ఆ వ్యక్తి పిల్లలు వారసత్వంగా పొందుతారు.
14 యెహోవా తన అనుచరులకు తన రహస్యాలు చెబుతాడు.
    ఆయన తన అనుచరులకు తన ఒడంబడికను ఉపదేశిస్తాడు.
15 నా కళ్లు సహాయం కోసం ఎల్లప్పుడూ యెహోవా వైపు చూస్తున్నాయి.
    ఆయన నన్ను ఎల్లప్పుడూ నా కష్టాల్లో నుంచి విడిపిస్తాడు.

16 యెహోవా, నేను బాధతో ఒంటరిగా ఉన్నాను.
    నా వైపు తిరిగి, నాకు నీ కరుణ ప్రసాదించుము.
17 నా కష్టాలనుంచి నన్ను విడిపించుము.
    నా సమస్యలు పరిష్కరించబడుటకు నాకు సహాయం చేయుము.
18 యెహోవా, నా పరీక్షలు, కష్టాలు చూడుము.
    నేను చేసిన పాపాలు అన్నింటి విషయంలో నన్ను క్షమించుము.
19 నాకు ఉన్న శత్రువులు అందరినీ చూడుము,
    నా శత్రువులు నన్ను ద్వేషిస్తూ, నాకు హాని చేయాలని కోరుతున్నారు.
20 దేవా, నన్ను కాపాడుము, నన్ను రక్షించుము.
    నేను నిన్ను నమ్ముకొన్నాను కనుక నన్ను నిరాశపర్చవద్దు.
21 దేవా, నీవు నిజంగా మంచివాడివి. నిన్ను నేను నమ్ముకొన్నాను.
    కనుక నన్ను కాపాడుము.
22 దేవా, ఇశ్రాయేలు ప్రజలను, వారి కష్టములనుండి రక్షించుము.

కీర్తనలు. 9

సంగీత నాయకునికి: ముత్లబ్బేను రాగం. దావీదు కీర్తన.

పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతిస్తాను.
    యెహోవా, నీవు చేసిన అద్భుతకార్యాలన్నింటిని గూర్చి నేను చెబుతాను.
నీవు నన్ను ఎంతగానో సంతోషింపజేస్తున్నావు.
    మహోన్నతుడవైన దేవా, నీ నామానికి నేను స్తుతులు పాడుతాను.
నా శత్రువులు నీ నుండి పారిపోయేందుకు మళ్లుకొన్నారు.
    కాని వారు పడిపోయి, నాశనం చేయబడ్డారు.

నీవే మంచి న్యాయమూర్తివి. న్యాయమూర్తిగా నీవు నీ సింహాసనం మీద కూర్చున్నావు.
    యెహోవా, నీవు నా వ్యాజ్యెం విన్నావు. మరియు నన్ను గూర్చి న్యాయ నిర్ణయం చేశావు.
యూదులు కాని ఆ మనుష్యులతో నీవు కఠినంగా మాట్లాడావు.
    యెహోవా, ఆ చెడ్డ మనుష్యుల్ని నీవు నాశనం చేశావు.
    బతికి ఉన్న మనుష్యుల జాబితాలో నుండి శాశ్వతంగా ఎప్పటికి వారి పేర్లను నీవు తుడిచి వేసావు.
శత్రువు పని అంతం అయిపోయింది.
    యెహోవా, వారి పట్టణాలను నీవు నాశనం చేశావు.
    ఇప్పుడు శిథిల భవనాలు మాత్రమే మిగిలి ఉన్నాయి.
    ఆ దుర్మార్గపు ప్రజలను జ్ఞాపకం చేసుకొనేటట్టు చేసేది ఏమీ మిగల్లేదు.

అయితే యెహోవా శాశ్వతంగా పరిపాలిస్తాడు.
    యెహోవా తన రాజ్యాన్ని బలమైనదిగా చేసాడు. లోకానికి న్యాయం చేకూర్చేందుకు ఆయన దీనిని చేశాడు.
భూమి మీద మనుష్యులందరికీ యెహోవా న్యాయంగా తీర్పు తీరుస్తాడు.
    యెహోవా రాజ్యాలన్నింటికి ఒకే విధంగా తీర్పు తీరుస్తాడు.
అనేకమంది ప్రజలకు అనేక కష్టాలు ఉన్నాయి
    గనుక వారు చిక్కుబడి, బాధ పొందుతున్నారు.
ఆ ప్రజలు వారి సమస్యల భారంతో నలిగిపోతున్నారు.
    యెహోవా, వారు పారిపోవుటకు భద్రతాస్థలంగా ఉండుము.

10 నీ నామం తెలిసిన ప్రజలు
    నీమీద విశ్వాసం ఉంచాలి.
యెహోవా, ప్రజలు నీ దగ్గరకు వస్తే
    సహాయం చేయకుండా నీవు వారిని విడిచి పెట్టవు.

11 సీయోనులో నివసిస్తున్న ప్రజలారా, మీరు యెహోవాకు స్తుతులు పాడండి.
    యెహోవా చేసిన గొప్ప కార్యాలను గూర్చి ఇతర దేశాలతో చెప్పండి.
12 సహాయం కోసం యెహోవా దగ్గరకు వెళ్లిన వారిని
    ఆయన జ్ఞాపకం చేసుకొన్నాడు.
ఆ దీన ప్రజలు సహాయం కోసం మొరపెట్టారు.
    మరి యెహోవా వారిని మరచిపోలేదు.

13 దేవుణ్ణి నేను ఇలా ప్రార్థించాను: “యెహోవా, నా మీద దయ చూపుము.
    నా శత్రువులు నాకు హాని చేస్తున్న విధం చూడుము.
    ‘మరణ ద్వారాల’ నుండి నన్ను రక్షించుము.
14 తర్వాత యెరూషలేము గుమ్మాల దగ్గర, యెహోవా, నేను నీకు స్తుతులు పాడగలను.
    నీవు నన్ను రక్షించావు గనుక నేను చాలా సంతోషంగా ఉంటాను.”

15 యూదులు కాని ఆ ప్రజలు, ఇతరులను ఉచ్చులో వేయుటకు గోతులు త్రవ్వారు.
    కాని, యూదులుకాని ఆ ప్రజలు, వారి ఉచ్చులో వారే పడ్డారు.
    ఆ మనుష్యులు ఇతరులను పట్టడానికి వలలు మాటున పెట్టారు.
    కాని, వారి పాదాలే ఆ వలల్లో చిక్కుబడ్డాయి.
16 యెహోవా న్యాయం జరిగిస్తాడని ప్రజలు తెలుసుకొన్నారు.
    యెహోవా చేసినదాని మూలంగా ఆ దుర్మార్గులు పట్టుబడ్డారు. దాని విషయం ఆలోచించుము. హిగ్గాయోన్[a]

17 దేవుని మరచే ప్రజలు దుష్టులు.
    ఆ మనుష్యులు చచ్చినవారి చోటికి వెళ్తారు.
18 పేదలకు ఇక నిరీక్షణ లేదేమో అన్నట్లు కనిపిస్తుంది.
    కాని నిజంగా దేవుడు వారిని శాశ్వతంగా మరచిపోడు.

19 యెహోవా, లేచి దేశాలకు తీర్పు తీర్చుము.
    వారే శక్తిగలవారు అని ప్రజలను తలంచనీయకుము.
20 ప్రజలకు పాఠం నేర్పించు.
    వారు కేవలం మానవ మాత్రులేనని వారిని తెలుసుకోనిమ్ము.

కీర్తనలు. 15

దావీదు కీర్తన.

15 యెహోవా, నీ పవిత్ర గుడారంలో ఎవరు నివసించగలరు?
    నీ పవిత్ర పర్వతం మీద ఎవరు నివసించగలరు?
ఎవరైతే పరిశుద్ధ జీవితం జీవించగలరో, మంచి కార్యాలు చేయగలరో తమ హృదయంలో నుండి సత్యం మాత్రమే మాట్లాడుతారో
    అలాంటి వ్యక్తులు మాత్రమే నీ పర్వతం మీద నివసించగలరు.
అలాంటి వ్యక్తి ఇతరులను గూర్చి చెడు సంగతులు మాట్లాడడు.
    ఆ మనిషి తన పొరుగు వారికి కీడు చేయడు.
    ఆ మనిషి తన స్వంత కుటుంబం గూర్చి సిగ్గుకరమైన విషయాలు చెప్పడు.
ఆ మనిషి దేవుని చేత నిరాకరింపబడిన ప్రజలను గౌరవించడు.
    అయితే యెహోవాను సేవించేవారందరినీ ఆ మనిషి గౌరవిస్తాడు.
ఆ మనిషి గనుక తన పొరుగువానికి ఒక వాగ్దానం చేస్తే
    అతడు ఏమి చేస్తానన్నాడో దాన్ని నెరవేరుస్తాడు.
ఆ మనిషి ఎవరికైనా అప్పిస్తే
    అతడు దాని మీద వడ్డీ తీసుకోడు.
నిర్దోషులకు కీడు చేయుటకుగాను అతడు డబ్బు తీసుకోడు.
    ఒక మనిషి ఆ మంచి వ్యక్తిలాగ జీవిస్తే, అప్పుడు ఆ మనిషి ఎల్లప్పుడూ దేవునికి సన్నిహితంగా ఉంటాడు.

ఆమోసు 7:1-9

మిడుతలను గూర్చిన దర్శనం

యెహోవా నాకిది చూపించాడు: రెండవ పంట పెరగటం ప్రారంభమైనప్పుడు ఆయన మిడుతలను పుట్టిస్తున్నాడు. రాజు మొదటి పంట కోసాక పెరిగే రెండవ పంట ఇది. మిడుతలు దేశంలో వున్న గడ్డినంతా తినివేశాయి. దాని తరువాత నేనిలా అన్నాను: “నా ప్రభువైన యెహోవా, మమ్మల్ని క్షమించుమని నేను అర్థిస్తున్నాను! యాకోబు బతకలేడు! అతడు చాలా చిన్నవాడు!”

అప్పుడు యెహోవా ఈ విషయంలో తన మనస్సు మార్చుకొని “అది జరగదు” అని అన్నాడు.

అగ్నిని గూర్చిన దర్శనం

నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు నాకు చూపించాడు: దేవుడైన యెహోవా అగ్నిచేత తీర్పు తీర్చటానికి పిలవటం నేను చూశాను. ఆ అగ్ని గొప్ప అగాధ జలాన్ని నశింపజేసింది. ఆ అగ్ని భూమిని తినివేయటం ప్రారంభించింది. కాని నేనిలా అన్నాను, “దేవుడవైన ఓ యెహోవా, ఇది ఆపివేయి. నిన్ను నేను అర్థిస్తున్నాను! యాకోబు బతకలేడు! అతడు మిక్కిలి చిన్నవాడు!”

పిమ్మట యెహోవా ఈ విషయంలో తన మనస్సు మార్చుకొని “అది కూడా జరగదు” అని అన్నాడు!

మట్టపుగుండు దర్శనం

యెహోవా దీనిని నాకు చూపించాడు: మట్టపుగుండు[a] (మట్టపు గోడ నిటారుగా వచ్చేలా సరి చూడబడుతుంది)ను చేతబట్టుకొని యెహోవా ఒక గోడవద్ద నిలబడ్డాడు. “ఆమోసూ, నీవు ఏమి చూస్తున్నావు?” అని యెహోవా నన్ను అడిగాడు.

“ఒక మట్టపు గుండును” అని నేనన్నాను.

అప్పుడు నా ప్రభువు ఇలా అన్నాడు: “చూడు, నా ప్రజలైన ఇశ్రాయేలీయులమధ్య ఒక మట్టపుగుండు పెడతాను. వారి ‘దుష్టత్వాన్ని’ ఇక ఎంత మాత్రం నేను చూసి చూడనట్లు వదలను. (ఆ దుష్ట భాగాలను నేను తొలగిస్తాను). ఇస్సాకు వంశస్థులు ఏర్పాటు చేసిన ఉన్నత ప్రదేశాలు నాశనం చేయబడతాయి. ఇశ్రాయేలు పవిత్ర స్థలాలన్నీ రాళ్ల గుట్టల్లా మార్చబడతాయి. నేను యరొబాము వంశంమీద పడి వారిని కత్తులతో చంపుతాను.”

ప్రకటన 1:1-8

తొలి పలుకు

దేవుడు త్వరలోనే జరగనున్న వాటిని తన సేవకులకు తెలియచేయుమని యేసు క్రీస్తుకు చెప్పాడు. యేసు తన దూతను, తన భక్తుడైన యోహాను దగ్గరకు పంపి ఈ విషయాలు తెలియచేసాడు. ఈ గ్రంథంలో ఆ విషయాలు ఉన్నాయి. యోహాను దేవుని సందేశాన్ని, యేసు క్రీస్తు చెప్పినదాన్ని దివ్య దర్శనంలో చూసాడు. అందులో చూసినవన్నీ చెప్పాడు. ఈ దైవసందేశంలో ఉన్నవాటిని చదివేవాడు, వాటిని విని, వాటిలో వ్రాయబడినవాటిని ఆచరించేవాళ్ళు ధన్యులు. సమయం దగ్గరగానున్నది.

శుభాకాంక్షలు

యోహాను నుండి,

ఆసియ ప్రాంతంలో ఉన్న ఏడు సంఘాలకు,

భూత భవిష్యత్ వర్తమానకాలాల్లో ఉన్నవాడు, ఆయన సింహాసనం ముందున్న ఏడు ఆత్మలు మీకు తమ అనుగ్రహాన్ని, శాంతిని ప్రసాదించుగాక! మరియు, చనిపోయి బ్రతికింపబడిన వాళ్ళలో మొదటివాడు, నిజమైన విషయాలు చెప్పేవాడు రాజులకు రాజైన యేసు క్రీస్తు మీకు అనుగ్రహం, శాంతి ప్రసాదించుగాక!

ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. ఆయనే తన రక్తంతో మనల్ని మన పాపాలనుండి రక్షించాడు. మనల్ని ఒక రాజ్యంగా స్థాపించాడు. మనము ఆయన తండ్రియైన దేవుని సేవ చేయాలని మనల్ని యాజకులుగా చేసాడు. ఆయనకు చిరకాలం మహిమ శక్తి కలుగుగాక! ఆమేన్.

చూడు! ఆయన మేఘాలతో వస్తున్నాడు. ప్రతి నేత్రము ఆయన్ని చూస్తుంది. ఆయన్ని పొడిచినవాళ్ళు[a] కూడా ఆయన్ని చూస్తారు. ప్రపంచంలోని ప్రజలందరూ ఆయన్ని చూచి భయాందోళనలతో దుఃఖిస్తారు. అలాగే జరుగుగాక! ఆమేన్.

భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉండేవాడు, సర్వశక్తి సంపన్నుడైనవాడు, మన ప్రభువైన దేవుడు “ఆదియు, అంతమును[b] నేనే” అని అన్నాడు.

మత్తయి 22:23-33

కొందరు సద్దూకయ్యులు యేసును మోసగించుటకు ప్రయత్నించటం

(మార్కు 12:18-27; లూకా 20:27-40)

23 అదే రోజు పునరుత్ధానంలేదని వాదించే సద్దూకయ్యులు యేసు దగ్గరకు వచ్చి ఇలా అన్నారు: 24 “బోధకుడా! ఒక వ్యక్తి సంతానం లేకుండా మరణిస్తే, అతని సోదరుడు ఆ వితంతువును వివాహమాడి చనిపోయిన సోదరునికి సంతానం కలిగించాలని మోషే అన్నాడు. 25 మాలో ఏడుగురు సోదరులున్న ఒక కుటుంబం ఉండింది. మొదటివాడు వివాహం చేసుకొని సంతానం లేకుండా మరణించాడు. కనుక ఆ వితంతువును చనిపోయిన వాని సోదరుడు వివాహం చేసుకొన్నాడు. 26 రెండవవాడు, మూడవవాడు, ఏడవవాని దాకా అదేవిధంగా ఆమెను పెళ్ళి చేసుకొని మరణించారు. 27 చివరకు ఆ స్త్రీ కూడా మరణించింది. 28 ఆ ఏడుగురు ఆ స్త్రీని వివాహం చేసుకొన్నారు కదా, మరి పునరుత్ధానం తర్వాత ఆమె ఆ ఏడుగురిలో ఎవరి భార్యగా ఉంటుంది?”

29 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “మీకు లేఖనాలు తెలియవు. దేవుని శక్తి గురించి మీకు తెలియదు. అందువల్ల మీరు పొరబడుతున్నారు. 30 పునరుత్థానమందు పెళ్ళి చేసుకోవటం కాని, చెయ్యటం కాని ఉండదు. వాళ్ళు పరలోకంలోని దేవదూతల్లా ఉంటారు. 31 ఇక చనిపోయిన వారు బ్రతకడాన్ని గురించి దేవుడు మీకేం చెప్పాడో మీరు చదువలేదా? 32 ‘నేను అబ్రాహాముకు దేవుణ్ణి, ఇస్సాక్కు దేవుణ్ణి, యాకోబుకు దేవుణ్ణి’(A) అని అన్నాడు. ఆయన చనిపోయిన వాళ్ళ దేవుడు కాదు. జీవిస్తున్న వాళ్ళ దేవుడు.”

33 ప్రజలు ఈ బోధన విని ఆశ్చర్యపొయ్యారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International