Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 5-6

సంగీత నాయకునికి: పిల్లన గ్రోవులతో పాడదగిన దావీదు కీర్తన

యెహోవా, నా మాటలు ఆలకించుము.
    నేను నీకు చెప్పటానికి ప్రయత్నిస్తున్నదాన్ని వినుము.
నా రాజా, నా దేవా
    నా ప్రార్థన ఆలకించుము.
యెహోవా, ప్రతి ఉదయం నేను నా కానుకను నీ ముందు ఉంచుతాను.
    సహాయం కోసం నేను నీ వైపు చూస్తాను.
మరి నీవు నా ప్రార్థనలు వింటావు.

యెహోవా, నీవు దుష్టులను నీ దగ్గర ఉండడానికి ఇష్టపడవు,
    చెడ్డవాళ్లు నీ మందిరంలో నిన్ను ఆరాధించేందుకు రావటం నీకు ఇష్టం లేదు.
గర్విష్ఠులు, అహంకారులు నీ దగ్గరకు రాలేరు.
    ఎప్పుడూ చెడ్డపనులు చేసే మనుష్యులను నీవు అసహ్యించుకొంటావు.
అబద్ధాలు చెప్పే మనుష్యులను నీవు నాశనం చేస్తావు.
    ఇతరులకు హాని చేయుటకు రహస్యంగా పథకాలు వేసే మనుష్యులను యెహోవా అసహ్యించుకొంటాడు.

యెహోవా, నేను నీ మందిరానికి వస్తాను. నీవు చాలా దయగల వాడవని నాకు తెలుసు.
    యెహోవా, నీ పవిత్ర మందిరం వైపు నేను వంగినప్పుడు, నీకు నేను భయపడతాను. నిన్ను గౌరవిస్తాను.
యెహోవా, ప్రజలు నాలో బలహీనతల కోసం చూస్తున్నారు.
    కనుక నీ నీతికరమైన జీవిత విధానం నాకు చూపించుము.
నేను ఎలా జీవించాలని నీవు కోరుతావో
    అది నాకు తేటగా చూపించుము.
ఆ మనుష్యులు సత్యం చెప్పరు.
    వాళ్లు జనాన్ని నాశనం చేయకోరుతారు.
వారి నోళ్ళు ఖాళీ సమాధుల్లా ఉన్నాయి.
    ఆ మనుష్యులు ఇతరులకు చక్కని మాటలు చెబుతారు. కాని వాళ్లను చిక్కుల్లో పెట్టుటకు మాత్రమే వారు ప్రయత్నిస్తున్నారు.
10 దేవా! వారిని శిక్షించుము.
    వారి ఉచ్చులలో వారినే పట్టుబడనిమ్ము.
ఆ మనుష్యులు నీకు విరోధంగా తిరిగారు
    కనుక వారి విస్తార పాపాల నిమిత్తం వారిని శిక్షించుము.
11 అయితే దేవునియందు విశ్వాసం ఉంచే ప్రజలందరినీ సంతోషించనిమ్ము.
    ఆ ప్రజలను శాశ్వతంగా సంతోషించనిమ్ము. దేవా, నీ నామమును ప్రేమించే ప్రజలకు భద్రత, బలం ప్రసాదించుము.
12 యెహోవా, మంచి మనుష్యులకు నీవు మంచివాటిని జరిగిస్తే
    అప్పుడు నీవు వారిని కాపాడే గొప్ప కేడెంలా ఉంటావు.

సంగీత నాయకునికి: అష్టమ శృతిమీద తంతి వాయిద్యాలతో పాడదగిన దావీదు కీర్తన

యెహోవా, కోపగించి నన్ను గద్దించవద్దు.
    కోపగించి నన్ను శిక్షించవద్దు.
యెహోవా, నా మీద దయ ఉంచుము.
    నేను రోగిని, బలహీనుడిని నన్ను స్వస్థపరచుము. నా ఎముకలు వణకుతున్నాయి.
    నా శరీరం మొత్తం వణకుతోంది.
యెహోవా నన్ను నీవు స్వస్థపర్చటానికి ఇంకెంత కాలం పడుతుంది.?
యెహోవా, మరల నన్ను విముక్తుని చేయుము.
    నీవు చాలా దయగలవాడవు గనుక, నన్ను రక్షించుము.
చనిపోయిన వాళ్లు, వారి సమాధుల్లో నిన్ను జ్ఞాపకం చేసుకోరు.
    సమాధుల్లోని ప్రజలు నిన్ను స్తుతించరు. అందుచేత నన్ను స్వస్థపరచుము.

యెహోవా, రాత్రి అంతా, నిన్ను ప్రార్థించాను.
    నా కన్నీళ్లతో నా పడక తడిసిపోయింది.
నా పడకనుండి కన్నీటి బొట్లు రాలుతున్నాయి.
    నీకు మొరపెట్టి నేను బలహీనంగా ఉన్నాను.
నా శత్రువులు నాకు చాలా కష్టాలు తెచ్చిపెట్టారు.
    ఇది నన్ను విచారంతో చాలా దుఃఖపెట్టింది.
    ఏడ్చుటవల్ల ఇప్పుడు నా కండ్లు నీరసంగాను, అలసటగాను ఉన్నాయి.

చెడ్డ మనుష్యులారా, వెళ్లిపొండి!
    ఎందుకంటె నేను ఏడ్వటం యెహోవా విన్నాడు గనుక.
యెహోవా నా ప్రార్థన విన్నాడు. మరియు యెహోవా నా ప్రార్థన అంగీకరించి, జవాబు ఇచ్చాడు.

10 నా శత్రువులంతా తలక్రిందులై, నిరాశపడతారు.
    వారు త్వరగా సిగ్గుపడతారు కనుక వారు తిరిగి వెళ్లిపోతారు.

కీర్తనలు. 10-11

10 యెహోవా, నీవెందుకు అంత దూరంగా ఉంటావు?
    కష్టాల్లో ఉన్న ప్రజలు నిన్ను చూడలేరు.
గర్విష్ఠులు, దుష్టులు వారి దుష్ట పథకాలు వేస్తారు.
    మరియు పేద ప్రజలను వారు బాధిస్తారు.
దుష్టులు వారికి కావలసిన వాటిని గూర్చి అతిశయపడతారు.
    లోభులు యెహోవాను దూషిస్తారు. ఈ విధంగా దుష్టులు యెహోవాను ద్వేషిస్తున్నట్టు వ్యక్తం చేస్తారు.
ఆ దుర్మార్గులు చాలా గర్విష్ఠులు కనుక దేవున్ని అనుసరించరు.
    వాళ్లు తమ పాపిష్టి పథకాలన్నీ తయారు చేస్తారు. పైగా దేవుడే లేడు అన్నట్టు వారు ప్రవర్తిస్తారు.
ఆ దుర్మార్గులు ఎల్లప్పుడూ వంకర పనులే చేస్తుంటారు.
    కనీసం నీ చట్టాలను, వివేకవంతమైన నీ ఉపదేశాలను కూడా వారు పట్టించుకోరు.
    దేవుని శత్రువులు ఆయన బోధనలను నిర్లక్ష్యం చేస్తారు.
వాళ్లకు కీడు ఎన్నటికీ జరగదని ఆ మనుష్యులు తలుస్తారు.
    “మాకు ఎన్నడూ కష్ట సమయాలు ఉండవు” అని వారు అంటారు.
ఆ మనుష్యులు ఎల్లప్పుడూ దూషిస్తారు. ఇతరుల విషయంలో వారు ఎల్లప్పుడూ చెడు సంగతులే చెబుతారు.
    దుష్టకార్యాలు చేసేందుకే వారు ఎల్లప్పుడూ పథకం వేస్తుంటారు.
ఆ మనుష్యులు రహస్య స్థలాల్లో దాగుకొని ప్రజలను పట్టుకొనేందుకు కనిపెడతారు.
    ప్రజలను బాధించుటకు వారికోసం చూస్తూ దాగుకుంటారు.
    నిర్దోషులను వారు చంపుతారు.
తినవలసిన జంతువులను పట్టుకోవటానికి ప్రయత్నించే సింహాలవలె వారుంటారు.
    ఆ దుర్మార్గులు, పేదల మీద దాడిచేస్తారు. దుష్టులు వేసే ఉచ్చులలో పేదలు చిక్కుకొంటారు.
10 పేదలను, బాధపడేవారిని,
    ఆ దుష్టులు మరల, మరల బాధిస్తారు.
11 అందుచేత ఆ పేదలు ఈ సంగతులను ఇలా ఆలోచించటం మొదలు పెడ్తారు: “దేవుడు మమ్ముల్ని మరచిపోయాడు!
    దేవుడు మానుండి శాశ్వతంగా విముఖుడయ్యాడు!
    మాకు ఏమి జరుగుతుందో దేవుడు చూడటం లేదు!”

12 యెహోవా, లేచి ఏదైనా చేయుము!
    దేవా, దుష్టులను శిక్షించుము!
    పేదలను మాత్రం మరువకుము!

13 దుష్టులు ఎందుకు దేవునికి వ్యతిరేకంగా ఉంటారు?
    ఎందుకంటే దేవుడు వారిని శిక్షించడు అనుకొంటారు గనుక.
14 యెహోవా, దుర్మార్గులు చేసే కృ-రమైన చెడ్డ సంగతులను నీవు నిజంగా చూస్తున్నావు.
    నీవు వాటిని చూచి వాటి విషయమై ఏదో ఒకటి చేయుము.
ఎన్నో కష్టాలతో ప్రజలు నీ దగ్గరకు సహాయం కోసం వస్తారు.
    యెహోవా, తల్లి దండ్రులు లేని పిల్లలకు సహాయం చేసే వాడివి నీవే. కనుక వారికి సహాయం చేయుము.

15 యెహోవా, దుర్మార్గులను నాశనం చేయుము.
16 యెహోవా నిరంతరం రాజైయున్నాడు.
    ఆ ప్రజలు ఆయన దేశంలోనుండి నశించెదరు గాక!
17 యెహోవా, పేదలు కోరుకొనే వాటిని గూర్చి నీవు విన్నావు.
    నీవు వారిని ప్రోత్సాహ పరచెదవు. వారి ప్రార్థనలు ఆలకించెదవు.
18 యెహోవా, అనాథ పిల్లలను కాపాడుము. దుఃఖంలో ఉన్న వారిని ఇంకా ఎక్కువ కష్టాలు పడనీయకుము.
    దుర్మార్గులు ఇక్కడ ఉండకుండుటకు చాలా భయపడేటట్టుగా చేయుము.

సంగీత నాయకునికి: దావీదు కీర్తన.

11 నేను యెహోవాను నమ్ముకొన్నాను గదా! నన్ను పారిపోయి, దాగుకోమని మీరెందుకు నాకు చెప్పారు?
    “పక్షిలాగ, నీ పర్వతం మీదికి ఎగిరిపో” అని మీరు నాతో చెప్పారు!

వేటగానిలా, దుర్మార్గులు విల్లు ఎక్కుపెడ్తారు.
    వారి బాణాలను వారు గురి చూస్తారు.
    మరియు చీకటిలోనుండి దుర్మార్గులు నీతి, నిజాయితీగల ప్రజల గుండెల్లోనికి బాణాలు కొట్టుటకు సిద్ధంగా ఉన్నారు.
నీతి అంతటిని వారు నాశనం చేస్తే ఏమవుతుంది?
    అప్పుడు నీతిమంతులు ఏమి చేస్తారు?

యెహోవా తన పవిత్ర స్థలంలో ఉన్నాడు.
    యెహోవా పరలోకంలో తన సింహాసనం మీద కూర్చున్నాడు.
మరియు జరిగే ప్రతీది యెహోవా చూస్తున్నాడు.
    మనుష్యులు మంచివాళ్లో, చెడ్డవాళ్లో చూసేందుకు యెహోవా కళ్లు ప్రజలను నిశితంగా చూస్తాయి.
యెహోవా మంచివారి కొరకు అన్వేషిస్తాడు. చెడ్డవాళ్లు ఇతరులను బాధించటానికి ఇష్టపడతారు.
    కృ-రమైన ఆ మనుష్యులను యెహోవా అసహ్యించుకొంటాడు.
వేడి నిప్పులు, మండుతున్న గంధకం, ఆ దుర్మార్గుల మీద వర్షంలాగ పడేటట్టు యెహోవా చేస్తాడు.
    ఆ దుర్మార్గులకు లభించేది అంతా మండుతున్న వేడి గాలి మాత్రమే.
అయితే దయగల యెహోవా మంచి పనులను చేసే ప్రజలను ప్రేమిస్తాడు.
    మంచి మనుష్యులు ఆయన ముఖ దర్శనం చేసుకొంటారు.

ఆమోసు 3:1-11

ఇశ్రాయేలుకు హెచ్చరిక

ఇశ్రాయేలు ప్రజలారా, ఈ వర్తమానం వినండి! ఇశ్రాయేలూ, నిన్ను గురించి యెహోవా ఈ విషయాలు చెప్పాడు. ఈజిప్టునుండి ఆయన తీసుకొని వచ్చిన ఇశ్రాయేలు వంశాల వారందరిని గూర్చినదే ఈ వర్తమానం. “భూమిమీద అనేక వంశాలున్నాయి. కాని మిమ్మల్ని మాత్రమే నేను ఎంపికచేసి ప్రత్యేకంగా ఎరిగియున్నాను. అయితే, మీరు నాపై తిరుగుబాటు చేశారు. కావున మీ పాపాలన్నిటికీ నేను మిమ్మల్ని శిక్షిస్తాను.”

ఇశ్రాయేలు శిక్షకు కారణం

అంగీకారం లేకుండా
    ఇద్దరు వ్యక్తులు కలిసి నడవలేరు.
అడవిలో ఉన్న సింహం ఒక జంతువును
    పట్టుకున్న తరువాతనే గర్జిస్తుంది.
తన గుహలో వున్న ఒక యువ కిశోరం గర్జిస్తూ ఉందంటే,
    అది ఏదో ఒక దానిని పట్టుకున్నదని అర్థం.
బోనులో ఆహారం లేకపోతే ఒక పక్షి ఆ బోనులోకి ఎగిరిరాదు.
    బోను మూసుకుపోతే, అది అందులో చిక్కుతుంది.
హెచ్చరిక చేసే బూరనాదం వినబడితే
    ప్రజలు భయంతో వణుకుతారు.
ఒక నగరానికి ఏదైనా ముప్పు వాటిల్లిందంటే,
    దానిని యెహోవాయే కలుగ జేసినట్లు.

నా ప్రభువైన యెహోవా ఏదైనా చేయటానికి నిర్ణయించవచ్చు. కాని ఆయన ఏదైనా చేసేముందు ఆయన తన పథకాలను తన, సేవకులైన ప్రవక్తలకు తెలియజేస్తాడు. ఒక సింహం గర్జిస్తే ప్రజలు భయపడతారు. యెహోవా మాట్లాడితే, ప్రవక్తలు దానిని ప్రవచిస్తారు.

9-10 అష్డోదు, ఈజిప్టులలో ఉన్న ఎత్తయిన బురుజులు ఎక్కి ఈ వర్తమానం ప్రకటించండి: “మీరు సమరయ (షోమ్రోను) పర్వతాల మీదికి రండి. అక్కడ మీరు ఒక పెద్ద గందరగోళ పరిస్థితిని చూస్తారు. ఎందుకంటే, సవ్యమైన జీవితం ఎలా గడపాలో ఆ ప్రజలకు తెలియదు. సాటి ప్రజలపట్ల వారు క్రూరంగా వ్యవహరించారు. అన్యజనులనుండి వారు వస్తువులను తీసుకొని వాటిని ఎత్తయిన బురుజులలో దాచివేశారు. యుద్ధంలో తీసుకున్న వస్తువులతో వారి ఖజానాలు నిండివున్నాయి.”

11 కావున యెహోవా చెపుతున్నదేమంటే: “దేశంమీదికి ఒక శత్రువు వస్తాడు. ఆ శత్రువు మీ బలాన్ని హరిస్తాడు. మీ ఎత్తయిన బురుజులలో దాచిన వస్తువులన్నీ అతడు తీసుకుంటాడు.”

2 పేతురు 1:12-21

12 వీటిని గురించి మీకిదివరకే తెలుసు. ప్రస్తుతం మీరంగీకరించిన సత్యంలో మీకు దృఢమైన విశ్వాసముంది. అయినా ఈ విషయాల్ని గురించి మీకు ఎప్పుడూ జ్ఞాపకం చేస్తూ ఉంటాను. 13 గుడారమనే ఈ శరీరంలో ప్రాణమున్నంతవరకు, మీకు జ్ఞాపకం చేయటం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. 14 ఎందుకంటే, మన యేసు క్రీస్తు ప్రభువు ముందే స్పష్టం చేసినట్లు, నేను త్వరలోనే ఈ దేహాన్ని వదిలివేస్తానని నాకు తెలుసు.[a] 15 నేను వెళ్ళాక కూడా మీరీ విషయాల్ని ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకొనేటట్లు నేను అన్ని విధాలా పాటుపడతాను.

ప్రవచన వాక్యం

16 యేసు క్రీస్తు ప్రభువు రాకను గురించి, ఆయన శక్తిని గురించి తెలివిగా అల్లిన కథల ద్వారా మేము మీకు చెప్పలేదు. మేము ఆయన గొప్పతనాన్ని కళ్ళారా చూసాము. 17 ఆయన తన తండ్రి అయిన దేవుని నుండి కీర్తిని, మహిమను పొందుతుండగా, గొప్ప బలముగల స్వరము వినిపించింది: “ఈయన నా కుమారుడు. ఈయన పట్ల నాకు చాలా ప్రేమ ఉంది. ఈయన కారణంగా నాకు చాలా ఆనందం కలుగుతోంది”[b] అని, 18 పవిత్రమైన పర్వతంపై మేము ఆయనతో ఉన్నప్పుడు పరలోకంనుండి ఈ స్వరం వినిపించటం మేము స్వయంగా విన్నాము.[c]

19 అందువల్ల, ప్రవక్తలు చెప్పిన సందేశమంటే మాకు యింకా ఎక్కువ విశ్వాసం కలిగింది. మీరు ఆ సందేశాన్ని గమనించటం మంచిది. ఆ సందేశం చీకటిలో వెలిగే వెలుగులాంటిది. సూర్యోదయమయ్యే వరకూ, వేకువ చుక్క మీ హృదయాల్లో ఉదయించే వరకూ ఆ వెలుగును మీరు గమనిస్తూ ఉండాలి. 20 అన్నిటికన్నా ముఖ్యంగా మీరు తెలుసుకోవలసినది ఏమిటంటే, ప్రవచనాల్లో వ్రాయబడిన విషయాలు, ప్రవక్తలు తమ వ్యక్తిగత అభిప్రాయాలతో వ్రాయలేదు. 21 ఎందుకంటే, “ప్రవచనం” మానవులు తమ యిష్ట ప్రకారం పలికింది కాదు. పవిత్రాత్మచే ప్రేరేపణ పొంది వాళ్ళు దేవుణ్ణుండి సందేశాన్ని పలికారు.

మత్తయి 21:12-22

యేసు ఆలయంలోనికి వెళ్ళటం

(మార్కు 11:15-19; లూకా 19:45-48; యోహాను 2:13-22)

12 యేసు ఆలయంలోకి వెళ్ళి, అక్కడ అమ్ముతున్న వాళ్ళను, కొంటున్న వాళ్ళను బయటికి వెళ్ళగొట్టాడు. డబ్బు మారకం చేస్తున్న వర్తకుల బల్లలను, పావురాలు అమ్ముతున్న వర్తకుల పీఠల్ని క్రింద పడవేసాడు. 13 ఆయన వాళ్ళతో, “‘నా ఆలయం ప్రార్థనాలయం అనిపించుకుంటుంది’(A) అని వ్రాసారు. కాని దాన్ని మీరు దోపిడి దొంగల గుహగా మార్చారు” అని అన్నాడు.

14 గ్రుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు ఆలయంలో ఉన్న ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన వాళ్ళకును నయం చేసాడు. 15 ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆయన చేసిన అద్భుతాలను చూసారు. మందిరావరణంలో ఉన్న పిల్లలు, “దావీదు కుమారునికి హోసన్నా!” అని కేకలు వేయటం విన్నారు. వాళ్ళకు కోపం వచ్చింది.

16 “చిన్న పిల్లలేమంటున్నారో నీవు విన్నావా?” అని వాళ్ళు యేసును ప్రశ్నించారు.

యేసు, “విన్నాను. ‘చిన్న పిల్లలు, పసిపాపలు కూడా నిన్ను స్తుతించేటట్లు చేసావు!’(B) అని వ్రాసారు. ఇది మీరు ఎన్నడూ చదువలేదా?” అని అన్నాడు.

17 ఆయన వాళ్ళను వదిలి, పట్టణం బయట ఉన్న బేతనియ గ్రామానికి వెళ్ళి ఆ రాత్రి అక్కడ గడిపాడు.

యేసు విశ్వాస శక్తిని చూపటం

(మార్కు 11:12-14, 20-24)

18 ఉదయం ఆయన పట్టణానికి తిరిగి వెళ్తుండగా ఆయనకు ఆకలి వేసింది. 19 యేసు దారిప్రక్కనున్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని దగ్గరకు వెళ్ళాడు. కాని ఆయనకు దానిపై ఆకులు తప్ప మరి ఏమియూ కనిపించలేదు. ఆయన ఆ చెట్టుతో, “ఇక మీదట నీకు ఫలం కలుగకుండా వుండుగాక!” అని అన్నాడు. వెంటనే ఆ చెట్టు ఎండిపోయింది.

20 శిష్యులు ఇది చూసి చాలా ఆశ్చర్యపడి, “అంజూరపు చెట్టు ఇంత త్వరగా ఎట్లా ఎండిపోయింది?” అని అడిగారు.

21 యేసు, “ఇది సత్యం. మీరు అనుమానం చెందకుండా విశ్వశిస్తే నేను అంజూరపు చెట్టుకు చేసినట్టు మీరు కూడా చేయగలరు. అంతే కాకుండా మీరీ పర్వతంతో ‘వెళ్ళి సముద్రంలో పడు’ అని అంటే అది అలాగే చేస్తుంది. 22 దేవుడు మీరడిగినవి యిస్తాడని విశ్వసించి ప్రార్థించండి. అప్పుడు మీరేవి అడిగితే అవి లభిస్తాయి” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International