Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 120-127

యాత్ర కీర్తన.

120 నేను కష్టంలో ఉన్నాను.
    సహాయం కోసం నేను యెహోవాకు మొరపెట్టాను.
    ఆయన నన్ను రక్షించాడు.
యెహోవా, మోసకరమైన నాలుకనుండి,
    నాకు వ్యతిరేకంగా అబద్ధం చెప్పిన వారినుండి నన్ను రక్షించుము.

అబద్దికులారా, యెహోవా మిమ్మల్ని ఎలా శిక్షిస్తాడో మీకు తెలుసా?
    మీరేమి పొందుతారో మీకు తెలుసా?
మిమ్మల్ని శిక్షించటానికి దేవుడు సైనికుని వాడిగల బాణాన్ని,
    మండుతున్న నిప్పులను ఉపయోగిస్తాడు.

అబద్ధికులారా, మీ దగ్గర్లో నివసించటం మెషెకులో నివసించటంలాగే ఉంటుంది.
    అది కేదారు[a] గుడారాల్లో నివసించినట్టే ఉంటుంది.
శాంతిని ద్వేషించే ప్రజలతో నేను చాలా ఎక్కువ కాలం జీవించాను.
నాకు శాంతి కావాలి. అయితే, నేను చెప్పినట్లు ఆ ప్రజలకు యుద్ధం కావాలి.

యాత్ర కీర్తన.

121 కొండల తట్టు నేను చూసాను.
    కాని నిజానికి నా సహాయం ఎక్కడనుండి వస్తుంది?
భూమిని, ఆకాశాన్ని సృష్టించిన యెహోవా దగ్గరనుండి
    నాకు సహాయం వస్తుంది.
దేవుడు నిన్ను పడిపోనివ్వడు.
    నిన్ను కాపాడేవాడు నిద్రపోడు.
ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు.
    దేవుడు ఎన్నడూ నిద్రపోడు.
యెహోవాయే నిన్ను కాపాడేవాడు.
    యెహోవా తన మహా శక్తితో నిన్ను కాపాడుతాడు.
పగటి సూర్యుడు నీకు బాధ కలిగించడు.
    రాత్రివేళ చంద్రుడు నీకు బాధ కలిగించడు.
ప్రతి అపాయం నుండి యెహోవా నిన్ను కాపాడుతాడు.
    యెహోవా నీ ప్రాణాన్ని కాపాడుతాడు.
నీవు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు యెహోవా నీకు సహాయంగా ఉంటాడు.
    ఇప్పుడు, ఎల్లప్పుడూ యెహోవా నీకు సహాయంగా ఉంటాడు.

దావీదు యాత్ర కీర్తన.

122 “మనం యెహోవా ఆలయానికి వెళ్దాం” అని ప్రజలు
    నాతో చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను.
ఇక్కడ యెరూషలేము ద్వారాల దగ్గర మనం నిలిచిఉన్నాము.
కొత్త యెరూషలేము
    ఒకే ఐక్యపట్టణంగా మరల కట్టబడింది.
దేవునికి చెందిన గోత్రాల వారు అక్కడికి వెళ్తారు.
    యెహోవా నామాన్ని స్తుతించుటకు ఇశ్రాయేలు ప్రజలు అక్కడికి వెళ్తారు.
ప్రజలకు న్యాయం తీర్చడానికి, రాజులు వారి సింహాసనాలు వేసుకొనే స్థలం అది.
    దావీదు వంశపు రాజులు వారి సింహాసనాలు అక్కడే వేసుకొన్నారు.

యెరూషలేములో శాంతి కోసం ప్రార్థించండి.
    “యెరూషలేమును ప్రేమించే ప్రజలకు అక్కడ శాంతి లభిస్తుందని నేను ఆశిస్తున్నాను.
    నీ ప్రాంగణాలలో శాంతి ఉంటుందని నేను ఆశిస్తున్నాను.
    నీ మహాభవనాల్లో భద్రత ఉంటుందని నేను ఆశిస్తున్నాను.”

నా పొరుగువారు, ఇతర ఇశ్రాయేలీయులు క్షేమంగాను,
    శాంతితోను ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను.
మన యెహోవా దేవుని ఆలయక్షేమం కోసం
    ఈ పట్టణానికి మంచి సంఘటనలు సంభవించాలని నేను ప్రార్థిస్తున్నాను.

యాత్ర కీర్తన.

123 దేవా, నేను నీవైపు చూచి ప్రార్థిస్తున్నాను.
    నీవు పరలోకంలో రాజుగా కూర్చుని ఉన్నావు.
బానిసలు వారి అవసరాల కోసం వారి యజమానుల మీద ఆధారపడతారు.
    బానిస స్త్రీలు వారి యజమానురాండ్ర మీద ఆధారపడతారు.
అదే విధంగా మేము మా దేవుడైన యెహోవా మీద ఆధారపడతాము.
    దేవుడు మా మీద దయ చూపించాలని మేము ఎదురుచూస్తాము.
యెహోవా, మా మీద దయ చూపించుము.
    మేము చాలాకాలంగా అవమానించబడ్డాము. కనుక దయ చూపించుము.
ఆ గర్విష్ఠుల ఎగతాళితో మా ప్రాణం అధిక భారాన్ని పొందింది.
    మా హింసకుల తిరస్కారంతో వారు సుఖంగా వున్నారు.

దావీదు యాత్ర కీర్తన.

124 గత కాలంలో యెహోవాయే మన పక్షంగా ఉండకపోతే మనకు ఏమి జరిగి ఉండేదో?
    ఇశ్రాయేలూ, నాకు జవాబు చెప్పుము.
గత కాలంలో యెహోవాయే మన పక్షంగా ఉండకపోతే మాకు ఏమి జరిగి ఉండేదో?
    ప్రజలు మనమీద దాడి చేసినప్పుడు ఏమి జరిగి ఉండేదో?
అప్పుడు మన శత్రువులకు మన మీద కోపం వచ్చినప్పుడల్లా
    వాళ్లు మనల్ని సజీవంగా మింగేసి ఉండేవాళ్లు.
అప్పుడు మన శత్రుసైన్యాలు మనల్ని కొట్టుకుపోయే ప్రవాహంలా,
    మనల్ని ముంచివేసే నదిలా ఉండేవి.
అప్పుడు ఆ గర్విష్ఠులు నోటి వరకూ పొంగుతూ
    మనల్ని ముంచి వేసే నీళ్లలా పొంగుతూ ఉండేవాళ్లు.

యెహోవాను స్తుతించండి. మన శత్రువులు
    మనల్ని పట్టి చంపకుండునట్లు యెహోవా చేశాడు.

మనం వలలో పట్టబడి తర్వాత తప్పించుకొన్న పక్షిలా ఉన్నాము.
    వల తెగిపోయింది. మనం తప్పించుకొన్నాము.
మనకు సహాయం యెహోవా దగ్గర నుండే వచ్చింది.
    భూమిని, ఆకాశాన్ని యెహోవా చేశాడు.

యాత్ర కీర్తన.

125 యెహోవాను నమ్ముకొనేవారు సీయోనుకొండలా ఉంటారు.
    వారు ఎన్నటికీ కదలరు.
    వారు శాశ్వతంగా కొనసాగుతారు.
యెరూషలేము చుట్టూరా పర్వతాలు ఉన్నాయి.
    అదే విధంగా యెహోవా తన ప్రజల చుట్టూరా ఉన్నాడు. యెహోవా తన ప్రజలను నిరంతరం కాపాడుతాడు.
దుర్మార్గులు మంచి ప్రజల దేశాన్ని శాశ్వతంగా వశం చేసుకోరు.
    దుర్మార్గులు అలా చేస్తే అప్పుడు మంచి మనుష్యులు కూడా చెడ్డ పనులు చేయటం మొదలుపెడతారేమో.

యెహోవా, మంచి మనుష్యులకు మంచివాడవుగా ఉండుము.
    పవిత్ర హృదయాలు గల మనుష్యులకు మంచివాడవుగా ఉండుము.
యెహోవా, దుర్మార్గులను నీవు శిక్షించుము.
    వాళ్లు వక్రమైన పనులు చేస్తారు.

ఇశ్రాయేలులో శాంతి ఉండనిమ్ము.

యాత్ర కీర్తన.

126 యెహోవా మమ్మల్ని దేశ బహిష్కరణ నుండి
    తిరిగి వెనుకకు తీసుకొని వచ్చినప్పుడు అది ఒక కలలా ఉంది!
మేము నవ్వుకుంటున్నాము.
    మరియు మేము అకస్మాత్తుగా సంతోషగానాలు పాడటం మొదలుపెట్టేవాళ్లము.
    “దేవుడు ఇశ్రాయేలు ప్రజల కొరకు గొప్ప కార్యాలు చేశాడు.”
ఇతర రాజ్యాల ప్రజలు దాన్ని గూర్చి చెప్పుకొన్నారు. “ఇశ్రాయేలు ప్రజల కోసం యెహోవా మాకు ఆశ్చర్యకరమైన పనులు చేశాడు” అని ఆ ప్రజలు చెప్పారు. మేము చాలా ఆనందంగా ఉన్నాము!

యెహోవా మేము ఖైదీలముగా ఉన్నాము.
    ఇప్పుడు ఎడారిని వికసింప చేసే నీటి ప్రవాహంలా మమ్మల్ని తిరిగి స్వతంత్రులుగా చేయుము.
విత్తనాలు నాటేటప్పుడు ఒకడు దుఃఖముగా ఉండవచ్చు,
    కాని పంట కూర్చుకొనేటప్పుడు సంతోషంగా ఉంటాడు.
అతడు బయట పొలాల్లోనికి విత్తనం మోసికొని పోవునప్పుడు ఏడ్వవచ్చు,
    కాని పంటను ఇంటికి తెచ్చునప్పుడు అతడు సంతోషిస్తాడు.

సొలొమోను యాత్ర కీర్తన.

127 ఇల్లు కట్టేవాడు యెహోవా కాకపోయినట్లయితే
    కట్టేవాడు తన పనిని వ్యర్థంగా చేస్తున్నట్టు.
పట్టణాన్ని కాపలా కాసేవాడు యెహోవా కాకపోతే
    కాపలావాళ్లు వారి సమయం వృధా చేసుకొంటున్నట్టే.

నీవు వేకువనే లేవటం, చాలా ఆలస్యంగా పనిచేయటం కేవలం నీవు తినే ఆహారం కోసమే అయితే
    నీవు నీ సమయం వృధా చేనుకొంటున్నట్టే.
దేవుడు తనకు ప్రియమైనవాళ్ల విషయం శ్రద్ధ తీసుకొంటాడు.
    వారు నిద్రపోతున్నప్పుడు కూడా ఆయన శ్రద్ధ తీసుకొంటాడు.

పిల్లలు యెహోవానుండి లభించే కానుక.
    వారు తల్లి గర్భమునుండి వచ్చే బహుమానం.
యువకుని కుమారులు, సైనికుని బాణాల సంచిలోని బాణాల్లాంటివారు.
తన బాణాల సంచిని కుమారులతో నింపుకొనే వాడు చాలా సంతోషంగా ఉంటాడు.
    ఆ మనిషి ఎన్నటికీ ఓడించబడడు. బహిరంగ స్థలాల్లో[b] అతని కుమారులు అతని శత్రువులనుండి అతణ్ణి కాపాడుతారు.

నహూము 1:1-13

ఎల్కోషువాడైన నహూముకు కలిగిన దర్శనాన్ని వివరించే గ్రంథం. ఇది నీనెవె నగరాన్ని గూర్చిన దుఃఖకరమైన సమాచారం.

నీనెవె పట్ల యెహోవా కోపం

యెహోవా రోషంగల దేవుడు!
    యెహోవా నేరస్తులను శిక్షంపబోతున్నాడు.
యెహోవా తన శత్రువులను శిక్షిస్తాడు.
    ఆయన తన శత్రువులపై తన కోపాన్ని నిలుపుతాడు.
యెహోవా ఓర్పు గలవాడు.
    కాని ఆయన మిక్కిలి శక్తిమంతుడు.
యెహోవా నేరం చేసిన జనులను శిక్షిస్తాడు.
    ఆయన వారిని ఊరికే వదిలి పెట్టడు.
దుష్టజనులను శిక్షంచటానికి యెహోవా వస్తున్నాడు. ఆయన తన శక్తిని చూపటానికి సుడిగాలులను, తుఫానులను ఉపయోగిస్తాడు.
    మానవుడు నేలమీద మట్టిలో నడుస్తాడు. కాని యెహోవా మేఘాలపై నడుస్తాడు!
యెహోవా సముద్రంతో కోపంగా మాట్లాడితే, అది ఎండిపోతుంది.
    ఆయన నదులన్నీ ఇంకిపోయేలా చేస్తాడు!
బాషానులోని, కర్మెలులోని సారవంతమైన భూములన్నీ ఎండి, నశించి పోతాయి.
    లెబానోనులోని పుష్పాలన్నీ వాడి పోతాయి.
యెహోవా వస్తాడు.
    పర్వతాలన్నీ భయంతో కంపిస్తాయి.
    కొండలు కరిగిపోతాయి.
యెహోవా వస్తాడు.
    భయంతో భూమి కంపిస్తుంది.
ఈ ప్రపంచం, అందులో నివసించే
    ప్రతివాడూ భయంతో వణుకుతాడు.
యెహోవా మహాకోపం ముందు ఎవ్వరూ నిలువలేరు.
    ఆయన భయంకర కోపాన్ని ఎవ్వరూ భరించలేరు.
ఆయన కోపం అగ్నిలా దహించి వేస్తుంది.
    ఆయన రాకతో బండలు బద్దలై చెదిరిపోతాయి.
యెహోవా మంచివాడు,
    ఆపద సమయంలో తలదాచుకోటానికి ఆయన సురక్షిత స్థలం.
    ఆయనను నమ్మినవారిపట్ల ఆయన శ్రద్ధ తీసుకుంటాడు.
ఆయన తన శత్రువులను సర్వనాశనం చేస్తాడు.
    ఆయన వరదలా వారిని తుడిచి పెడతాడు.
    ఆయన తన శత్రువులను అంధకారంలోకి తరిమి వేస్తాడు.
యూదా, యెహోవాపై కుట్రలు ఎందుకు పన్నుతున్నావు?
    కాని ఆయన వారి పన్నాగాలన్నిటినీ వమ్ము చేస్తాడు.
    కష్టం రెండవసారి రాదు.
10 చిక్కుపడిన ముండ్లపొదలా
    నీ శత్రువు నాశనం చేయబడతాడు.
ఎండిన కలుపు మొక్కల్లా
    వారు వేగంగా కాలిపోతారు.

11 అష్షూరూ, నీలోనుండి ఒక మనిషి వచ్చాడు. అతడు యెహోవాకు వ్యతిరేకంగా దుష్ట పథకాలు వేశాడు.
    అతడు చెడు సలహా ఇచ్చాడు.
12 యెహోవా ఈ విషయాలు యూదాకు చెప్పాడు:
“అష్షూరు ప్రజలు పూర్తి బలం కలిగి ఉన్నారు.
    వారికి చాలామంది సైనికులున్నారు. కాని వారంతా నరికి వేయబడతారు.
    వారంతా అంతం చేయబడతారు.
నా ప్రజలారా, మీరు బాధ పడేలా చేశాను.
    కాని ఇక మిమ్మల్ని బాధపడనీయను.
13 అష్షూరు అధికారాన్నుండి ఇప్పుడు మిమ్మల్ని విడిపిస్తాను.
    మీ మెడమీదనుండి ఆ కాడిని తీసివేస్తాను.
    మిమ్మల్నిబంధించిన గొలుసులను తెంచి వేస్తాను.”

1 పేతురు 1:13-25

పవిత్రంగా జీవించండి

13 అందుచేత కార్యసిద్ధికోసం మీ మనసుల్ని సిద్ధం చేసికొంటూ మిమ్మల్ని అదుపులో పెట్టుకోండి. యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీ కందివ్వబోయే అనుగ్రహంపై సంపూర్ణమైన ఆశాభావంతో ఉండండి. 14 మీరు అజ్ఞానంతో జీవించినప్పుడు దురాశలకు లోనై జీవించారు. ఇప్పుడావిధంగా జీవించకుండా చిన్న పిల్లలవలే విధేయతతో జీవించండి. 15 మిమ్మల్ని పిలిచినవాడు ఏ విధంగా పవిత్రుడో అదేవిధంగా మీరు కూడా పవిత్రమైన కార్యాలను చేస్తూ పవిత్రంగా జీవించండి. 16 ఎందుకంటే ధర్మశాస్త్రంలో, “నేను పవిత్రుణ్ణి; కనుక మీరు కూడా పవిత్రంగా ఉండండి”(A) అని వ్రాయబడిఉంది.

17 పక్షపాతము చూపకుండా ఒక వ్యక్తి చేసిన కార్యాలను బట్టి తీర్పు చెప్పే దేవుణ్ణి మీరు “తండ్రి” అని పిలుస్తారు కనుక మీరు భయభక్తులతో పరదేశీయులుగా మీ జీవితాలను గడపండి. 18 ఎందుకంటే, మీ పూర్వికులు వంశపారంపర్యంగా మీ కందించిన వ్యర్థజీవితం నుండి మీకు విడుదల కలుగలేదు. నశించిపోయే వెండి, బంగారం వంటి వస్తువుల వల్లనూ కలుగలేదు. ఈ విషయం మీకు తెలుసు. 19 ఏ లోపమూ, మచ్చాలేని గొఱ్ఱెపిల్లయైన క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తం ద్వారా మీకు విముక్తి కలిగింది. 20 ఈ ప్రపంచానికి పునాది వేయకముందే దేవుడు క్రీస్తును ఎన్నుకున్నాడు. కాని మీకోసం ఈ చివరి రోజుల్లో ఆయన్ను వ్యక్తం చేసాడు. 21 ఆయన కారణంగా మీరు దేవుణ్ణి విశ్వసిస్తున్నారు. ఆయన్ని బ్రతికించి మహిమ గలవానిగా చేసాడు. తద్వారా మీకు దేవుని పట్ల విశ్వాసము, ఆశ కలిగాయి.

22 సత్యాన్ని విధేయతతో ఆచరించటంవల్ల మీ జీవితాలు పవిత్రమయ్యాయి. తద్వారా మీ సోదరుల పట్ల మీకు నిజమైన ప్రేమ కలిగింది. పరస్పరం హృదయపూర్వకంగా[a] చిరకాలం ప్రేమించుకుంటూ ఉండండి. 23 నశించిపోయే సంతానంగా మీరు తిరిగి పుట్టలేదు, గాని నశించని సంతానంగా సజీవమైన దేవుని వాక్యం ద్వారా తిరిగి పుట్టారు. 24 ఎందుకంటే,

“మానవులు గడ్డిపోచల్లాంటి వాళ్ళు. వాళ్ళ కీర్తి
    గడ్డి పువ్వులాంటిది. గడ్డి ఎండిపోతుంది, పువ్వురాలిపోతుంది,
25 కాని, ప్రభువు సందేశం చిరకాలం నిలిచిపోతుంది.”(B)

మీకు ప్రకటింపబడిన సందేశం యిదే!

మత్తయి 19:13-22

యేసు చిన్నపిల్లల్ని దీవించటం

(మార్కు 10:13-16; లూకా 18:15-17)

13 యేసు తన చేతుల్ని చిన్న పిల్లల తలలపై ఉంచి వాళ్ళకోసం ప్రార్థించాలని కొందరు వ్యక్తులు వాళ్ళను ఆయన దగ్గరకు పిలుచుకొని వచ్చారు. కాని ఆ పిలుచుకు వచ్చిన వాళ్ళను శిష్యులు చివాట్లు పెట్టారు. 14 కాని యేసు, “దేవుని రాజ్యం అలాంటి వాళ్ళదే కనుక వాళ్ళను నా దగ్గరకు రానివ్వండి! వాళ్ళనాపకండి!” అని అన్నాడు. 15 వాళ్ళ తలలపై చేతులుంచాక యేసు అక్కడనుండి ముందుకు సాగిపొయ్యాడు.

ధనవంతుడు యేసును వెంబడించుటకు నిరాకరించటం

(మార్కు 10:17-31; లూకా 18:18-30)

16 ఒక వ్యక్తి యేసు దగ్గరకు వచ్చి, “భోధకుడా! నిత్యజీవం పొందాలంటే నేను ఏ మంచి పని చెయ్యాలి?” అని అడిగాడు.

17 యేసు, “మంచిని గురించి నన్నెందుకు అడుగుతున్నావు? ఒకే ఒక మంచి వాడున్నాడు. నీవు నిత్యజీవం పొందాలంటే ఆజ్ఞల్ని పాటించు!” అని అన్నాడు.

18 “ఏ ఆజ్ఞలు?” ఆ వ్యక్తి అడిగాడు.

యేసు, “హత్యచేయరాదు, వ్యభిచరించ రాదు. దొంగతనం చెయ్యరాదు. దొంగసాక్ష్యం చెప్పరాదు. 19 తల్లితండ్రుల్ని గౌరవించాలి.(A) మీ పొరుగువాళ్ళను మిమ్మల్మి మీరు ప్రేమించుకొన్నంతగా ప్రేమించాలి” అని సమాధానం చెప్పాడు.(B)

20 ఆ యువకుడు, “నేనవన్నీ చేస్తూనే ఉన్నాను. యింకా ఏం చెయ్యాలి?” అని అడిగాడు.

21 యేసు, “నీవు పరిపూర్ణత పొందాలని అనుకుంటే వెళ్ళి నీ దగ్గరున్నవన్నీ అమ్మేసి పేదవాళ్ళకివ్వు! అలా చేస్తే నీకు పరలోకంలో ధనం లభిస్తుంది. ఆ తదుపరి నన్ను అనుసరించు” అని సమాధానం చెప్పాడు.

22 ఆ యువకుని దగ్గర చాలా ధనముంది కనుక యేసు చెప్పింది విని విచారంతో వెళ్ళిపోయాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International