Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 118

118 యెహోవా దేవుడు గనుక ఆయనకు కృతజ్ఞత తెలపండి.
    నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది.
“నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది”
    అని ఇశ్రాయేలూ, నీవు చెప్పుము.
“నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది”
    అని యాజకులారా, మీరు చెప్పండి.
“నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది”
    అని యెహోవాను ఆరాధించే ప్రజలారా, మీరు చెప్పండి.

నేను కష్టంలో ఉన్నాను. గనుక సహాయం కోసం నేను యెహోవాకు మొర పెట్టాను,
    యెహోవా నాకు జవాబిచ్చి, నన్ను విముక్తుని చేశాడు.
యెహోవా నాతో ఉన్నాడు గనుక నేను భయపడను.
    నన్ను బాధించుటకు మనుష్యులు ఏమీ చేయలేరు.
యెహోవా నా సహాయకుడు;
    నా శత్రువులు ఓడించబడటం నేను చూస్తాను.
మనుష్యులను నమ్ముకొనుటకంటే
    యెహోవాను నమ్ముట మేలు.
మీ నాయకులను నమ్ముకొనుట కంటే
    యెహోవాను నమ్ముకొనుట మేలు.

10 అనేకమంది శత్రువులు నన్ను చుట్టుముట్టారు.
    యెహోవా శక్తితో నేను నా శత్రువులను ఓడించాను.
11 శత్రువులు మరల మరల నన్ను చుట్టుముట్టారు.
    యెహోవా శక్తితో నేను వారిని ఓడించాను.
12 తేనెటీగల దండులా శత్రువులు నన్ను చుట్టుముట్టారు.
    కాని వేగంగా కాలిపోతున్న పొదలా వారు అంతం చేయబడ్డారు.
యెహోవా శక్తితో నేను వారిని ఓడించాను.

13 నా శత్రువు నా మీద దాడి చేసి దాదాపుగా నన్ను నాశనం చేశాడు.
    కాని యెహోవా నాకు సహాయం చేశాడు.
14 యెహోవా నా బలం, నా విజయ గీతం!
    యెహోవా నన్ను రక్షిస్తాడు!
15 మంచివాళ్ల ఇండ్లలో విజయ ఉత్సవం మీరు వినగలరు.
    యెహోవా తన మహా శక్తిని మరల చూపించాడు.
16 యెహోవా చేతులు విజయంతో పైకి ఎత్తబడ్డాయి.
    యెహోవా తన మహా శక్తిని మరల చూపించాడు.

17 నేను జీవిస్తాను! కాని మరణించను.
    మరియు యెహోవా చేసిన వాటిని గూర్చి నేను చెబుతాను.
18 యెహోవా నన్ను శిక్షించాడు,
    కాని ఆయన నన్ను చావనియ్య లేదు.
19 మంచి గుమ్మములారా, నా కోసం తెరచుకోండి,
    నేను లోనికి వచ్చి యెహోవాను ఆరాధిస్తాను.
20 అవి యెహోవా గుమ్మాలు.
    ఆ గుమ్మాలలో నుండి మంచివాళ్లు మాత్రమే వెళ్లగలరు.
21 యెహోవా, నా ప్రార్థనకు జవాబు ఇచ్చినందుకు నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
    నన్ను రక్షించినందుకు నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.

22 ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి
    మూలరాయి అయ్యింది.
23 ఇలా జరుగునట్లు యెహోవా చేశాడు.
    అది ఆశ్చర్యంగా ఉందని అనుకొంటున్నాము.
24 ఈ వేళ యెహోవా చేసిన రోజు.
    ఈ వేళ మనం ఆనందించి సంతోషంగా ఉందాము!

25 ప్రజలు ఇలా చెప్పారు, “యెహోవాను స్తుతించండి.
    దేవుడు, మమ్మల్ని రక్షించెను. దేవా, దయచేసి మమ్మల్ని వర్ధిల్లజేయుము.
26     యెహోవా నామమున వస్తున్న వానికి స్వాగతం చెప్పండి.”

యాజకులు ఇలా జవాబు ఇచ్చారు, “యెహోవా ఆలయానికి మేము నిన్ను ఆహ్వానిస్తున్నాము!
27 యెహోవాయే దేవుడు. ఆయన మనలను అంగీకరిస్తాడు.
    బలి కోసం గొర్రెపిల్లను కట్టివేయండి. బలిపీఠపు కొమ్ముల[a] వద్దకు గొర్రెపిల్లను మోసికొని రండి.”

28 యెహోవా, నీవు నా దేవుడవు. నేను నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను.
    నేను నిన్ను స్తుతిస్తున్నాను.
29 యెహోవా మంచివాడు గనుక ఆయనకు కృతజ్ఞత తెలపండి.
    నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.

కీర్తనలు. 145

దావీదు ప్రార్థన.

145 నా దేవా, నా రాజా, నిన్ను నేను స్తుతిస్తాను.
    నిరంతరం నిన్ను నేను స్తుతిస్తాను.
ప్రతిరోజూ నిన్ను నేను స్తుతిస్తాను.
    ఎప్పటికీ నీ నామాన్ని నేను స్తుతిస్తాను.
యెహోవా గొప్పవాడు. ప్రజలు ఆయనను ఎంతో స్తుతిస్తారు.
    ఆయన చేసే గొప్ప కార్యాలన్నింటినీ మనం లెక్కించలేము.
యెహోవా, ఒక తరం నీ పనులను స్తుతిస్తూ ఇంకొక తరానికి అందిస్తారు.
    నీవు చేసే గొప్ప కార్యాలను గూర్చి ప్రజలు ఇతర ప్రజలతో చెబుతారు.
ఆశ్చర్యకరమైన నీ ఘనత, మహిమను గూర్చి మనుష్యులు చెప్పుకొంటారు.
    నీ అద్భుతాలను గూర్చి నేను చెబుతాను.
యెహోవా, నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి మనుష్యులు చెప్పుకొంటారు.
    నీవు చేసే గొప్ప సంగతుల్ని గూర్చి నేను చెబుతాను.
నీవు చేసే మంచి పనులను గూర్చి ప్రజలు చెప్పుకొంటారు.
    యెహోవా, ప్రజలు నీ మంచితనం గూర్చి పాడుకొంటారు.

యెహోవా దయగలవాడు, కరుణగలవాడు.
    యెహోవా సహనంగలవాడు, ప్రేమపూర్ణుడు.
యెహోవా, అందరి యెడలా మంచివాడు.
    దేవుడు చేసే ప్రతిదానిలో తన కరుణ చూపిస్తాడు.
10 యెహోవా, నీవు చేసే పనులు నీకు స్తుతి కలిగిస్తాయి.
    నీ అనుచరులు నిన్ను స్తుతిస్తారు.
11 ఆ ప్రజలు నీ మహిమ రాజ్యం గూర్చి చెప్పుకొంటారు.
    నీవు ఎంత గొప్పవాడవో ఆ ప్రజలు చెప్పుకొంటారు.
12 కనుక యెహోవా, నీవు చేసే గొప్ప కార్యాలను గూర్చి ఇతర జనులు ఈ రీతిగా నేర్చుకొంటారు.
    మహా ఘనమైన నీ మహిమ రాజ్యం గూర్చి ప్రజలు చెప్పుకొంటారు.
13 యెహోవా, నీ రాజ్యం శాశ్వతంగా ఉంటుంది.
    నీవు శాశ్వతంగా పాలిస్తావు.

14 పడిపోయిన మనుష్యులను యెహోవా లేవనెత్తుతాడు.
    కష్టంలో ఉన్న మనుష్యులకు యెహోవా సహాయం చేస్తాడు.
15 యెహోవా, జీవిస్తున్న సకల ప్రాణులూ వాటి ఆహారం కోసం నీవైపు చూస్తాయి.
    సకాలంలో నీవు వాటికి ఆహారం యిస్తావు.
16 యెహోవా, నీవు నీ గుప్పిలి విప్పి,
    జీవిస్తున్న సకల ప్రాణులకు కావాల్సినవన్నీ యిస్తావు.
17 యెహోవా చేసే ప్రతీదీ మంచిది.
    యెహోవా చేసే ప్రతి దానిలోనూ ఆయన తన నిజప్రేమను చూపిస్తాడు.
18 యెహోవా సహాయం కోసం తనను పిలిచే ప్రతి యొక్కనికీ సమీపంగా ఉన్నాడు.
    యెహోవాను యదార్థంగా ఆరాధించే ప్రతి వ్యక్తికీ ఆయన సమీపంగా ఉన్నాడు.
19 ఆయన జరిగించాలని ఆయన అనుచరులు కోరేవాటినే యెహోవా జరిగిస్తాడు.
    యెహోవా తన అనుచరుల మొర విని వారిని రక్షిస్తాడు.
    మరియు యెహోవా వారి ప్రార్థనలకు జవాబిచ్చి, వారిని రక్షిస్తాడు.
20 యెహోవాను ప్రేమించే ప్రతి వ్యక్తినీ ఆయన కాపాడుతాడు.
    దుర్మార్గులను యెహోవా నాశనం చేస్తాడు.
21 నేను యెహోవాను స్తుతిస్తాను!
    ప్రతి మనిషీ సదా ఆయన పవిత్ర నామాన్ని స్తుతించాలని నా కోరిక!

యెషయా 19:19-25

19 ఆ కాలంలో ఈజిప్టు కేంద్రంలో యెహోవాకు ఒక బలిపీఠం ఉంటుంది. యెహోవాకు సన్మాన సూచకంగా ఈజిప్టు సరిహద్దులో ఒక స్తంభం ఉంటుంది. 20 సర్వశక్తిమంతుడైన యెహోవా శక్తివంతమైన పనులు చేస్తాడు అని చూపించేందుకు ఇది ఒక సంకేతం. యెహోవా దగ్గర్నుండి సహాయం కావాలని ప్రజలు మొర పెట్టినప్పుడల్లా, యెహోవా సహాయం పంపిస్తాడు. ప్రజలను రక్షించి, కాపాడుటకు ఒక వ్యక్తిని యెహోవా పంపిస్తాడు. ఆ ప్రజలకు అక్రమమైన వాటిని జరిగించే మనుష్యుల బారినుండి ఆ వ్యక్తి వారిని విమోచిస్తాడు.

21 ఆ సమయంలో ఈజిప్టులోని ప్రజలు యెహోవాను వాస్తవంగా తెలుసుకొంటారు. ఈజిప్టు ప్రజలు దేవుణ్ణి ప్రేమిస్తారు. ప్రజలు దేవుణ్ణి సేవిస్తారు, అనేక బలులు అర్పిస్తారు. వారు యెహోవాకు ప్రమాణాలు చేస్తారు. వారు ఆ ప్రమాణాలను నిలబెట్టుకొంటారు. 22 ఈజిప్టు ప్రజలను యెహోవా శిక్షిస్తాడు. మరియు అప్పుడు ఆయన వారిని స్వస్థపరుస్తాడు. (క్షమిస్తాడు) వారు యెహోవా దగ్గరకు తిరిగి వస్తారు. యెహోవా వారి ప్రార్థనలు వింటాడు, వారిని స్వస్థపరుస్తాడు. (క్షమిస్తాడు).

23 ఆ కాలంలో ఈజిప్టు నుండి అష్షూరుకు రాజమార్గం ఉంటుంది. అప్పుడు ప్రజలు అష్షూరు నుండి ఈజిప్టు వెళ్తారు, ఈజిప్టు నుండి ప్రజలు అష్షూరు వెళ్తారు. ఈజిప్టు అష్షూరుతో కలిసి పనిచేస్తుంది. 24 ఆ కాలంలో ఇశ్రాయేలు, అష్షూరు, ఈజిప్టు కలిసి దేశాన్ని తమ ఆధీనంలో ఉంచుకొంటారు. ఇది దేశానికి ఆశీర్వాదం. 25 సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ దేశాలను ఆశీర్వదిస్తాడు. “ఈజిప్టూ, మీరే నా ప్రజలు అష్షూరూ, నిన్ను నేను సృష్టించాను. ఇశ్రాయేలూ, నీవు నా స్వంతం. మీరంతా ఆశీర్వదించబడిన వాళ్లు” అని ఆయన అంటాడు.

రోమీయులకు 15:5-13

మనలో సహనము, ప్రోత్సాహము కలుగచేసే దేవుడు, యేసు క్రీస్తు ద్వారా మీ మధ్య ఐకమత్యము కలుగచేయునుగాక! అప్పుడు మనము ఒకే హృదయంతో, ఒకే నాలుకతో మన యేసు క్రీస్తు ప్రభువుకు తండ్రి అయినటువంటి దేవుణ్ణి స్తుతించగలుగుతాము. దేవునికి ఘనత కలగాలని క్రీస్తు మిమ్మల్ని అంగీకరించినట్లే మీరు కూడా ఇతర్లను అంగీకరించండి. మూలపురుషులకు దేవుడు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టాలని, దేవుడు సత్యవంతుడని నిరూపించాలని, క్రీస్తు యూదుల సేవకుడు అయ్యాడు. యూదులు కానివాళ్ళు దేవుని అనుగ్రహం కోసం ఆయన్ని స్తుతించాలని క్రీస్తు ఉద్దేశ్యం. ఈ సందర్భాన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది:

“ఈ కారణంగానే యూదులు కాని వాళ్ళతో కలిసి నిన్ను స్తుతిస్తాను.
    నీ పేరిట భక్తి గీతాలు పాడతాను.”(A)

10 మరొక చోట:

“యూదులు కాని ప్రజలారా!
    మీరు కూడా దేవుని ప్రజలతో ఆనందించండి.”(B)

11 ఇంకొక చోట ఇలా వ్రాయబడి వుంది:

“యూదులు కాని ప్రజలారా! ప్రభువును స్తుతించండి.
    ఆయన్ని స్తుతిస్తూ గీతాలు పాడండి!”(C)

12 యెషయా ఒక చోట ఈ విధంగా అన్నాడు:

“యెష్షయి వంశ వృక్షం యొక్క వేరు చిగురిస్తుంది.
    ఆయన దేశాలను పాలిస్తాడు.
    యూదులు కానివాళ్ళు ఆయనలో నిరీక్షిస్తారు.”(D)

13 రక్షణ లభిస్తుందని నిరీక్షణ కలిగించే ఆ దేవుడు మీలో ఉన్న విశ్వాసం ద్వారా మీకు సంపూర్ణమైన ఆనందాన్ని, శాంతిని కలుగ చేయుగాక! అప్పుడు మీలో ఉన్న నిరీక్షణ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పొంగి పొర్లుతుంది.

లూకా 19:11-27

పది మీనాల ఉపమానం

(మత్తయి 25:14-30)

11 ప్రజలు ఆయన చెబుతున్న విషయాలు వింటూ ఉన్నారు. ఆయన యెరూషలేము దగ్గరగా ఉండటం వల్ల ప్రజలు దేవుని రాజ్యం రాబోతొందని అనుకున్నారు. కనుక ఆయన వాళ్ళకు ఈ ఉపమానం చెప్పాడు: 12 “గొప్ప కుంటుంబంలో పుట్టినవాడొకడు దూర దేశానికి వెళ్ళి తన దేశానికి రాజుగా నియమింపబడ్డాక తిరిగి రావాలనుకొన్నాడు. 13 వెళ్ళేముందు తన సేవకుల్ని పది మందిని పిలిచి ఒక్కొక్కనికి ఒక మీనాయిచ్చి, ‘నేను తిరిగి వచ్చేదాకా ఈ డబ్బుతో వ్యాపారం చెయ్యండి’ అని అన్నాడు. 14 అతని ప్రజలకు అతడంటే యిష్టం ఉండేది కాదు. కనుక వాళ్ళు తమ ప్రతినిధుల్ని పంపి, ‘ఇతడు మా రాజుగా ఉండటం మాకిష్టం లేదు’ అని చెప్పనంపారు.

15 “అయినా అతడు రాజుగా నియమింపబడ్డాడు. ఆ తర్వాత అతడు తన దేశానికి తిరిగి వచ్చాడు. తాను డబ్బిచ్చిన సేవకులు ఎంత సంపాదించారో కనుక్కోవటానికి వాళ్ళను పిలిపించాడు. 16 మొదటి వాడు వచ్చి, ‘ప్రభూ! మీరిచ్చిన మీనాతో మరొక పది మీనాలు సంపాదించాను’ అని అన్నాడు. 17 ‘మంచిది! నీవు మంచి సేవకుడివి. నీవు చిన్న వాటిలో కూడా ఇంత నమ్మకంగా ఉన్నందుకు పది గ్రామాలపై నీకు అదికారం ఇస్తున్నాను’ అని ఆ రాజు అన్నాడు.

18 “రెండవ వాడు వచ్చి, ‘ప్రభూ! మీరిచ్చిన మీనాతో ఐదు మీనాలు సంపాదించాను’ అని అన్నాడు. 19 ‘నిన్ను ఐదు గ్రామాలపై అధికారిగా నియమిస్తున్నాను’ అని ఆ రాజు అన్నాడు.

20 “మూడవవాడు వచ్చి, ‘ప్రభూ! ఇదిగో మీరిచ్చిన మీనా. దాన్ని నేను ఒక గుడ్డలో చుట్టి దాచి ఉంచాను. 21 మీరు చాలా కఠినాత్ములు కనుక మీరంటే నాకు భయం. మీరు మీవి కానివాటిని లాక్కుంటారు; విత్తకుండానే కోయాలంటారు’ అని అన్నాడు.

22 “ఆ రాజు, ‘ఓరి, దుర్మార్గుడా! నిన్ను శిక్షించటానికి నీ మాటలే ఉపయోగిస్తాను. నేను కఠినాత్ముడనని నీకు తెలుసునన్నమాట. నేను ఇవ్వని వాటిని లాక్కుంటానన్నమాట. విత్తనం వేయకుండా ఫలం పొందుతానన్నమాట. 23 అలాంటప్పుడు నా డబ్బు వడ్డీకి ఎందుకు యివ్వలేదు? అలా చేసివుంటే నేను తిరిగి వచ్చినప్పుడు నా డబ్బు వడ్డీతో సహా నాకు లభించేది కదా!’ అని అన్నాడు. 24 ఆ తర్వాత అక్కడ నిలుచున్న వాళ్ళతో ‘వాని నుండి ఆ మీనా తీసుకొని పదిమీనాలున్న వానికి ఇవ్వండి!’ అని అన్నాడు.

25 “‘అయ్యా! అతని దగ్గర పదిమీనాలున్నాయి కదా!’ అని వాళ్ళు అన్నారు.

26 “అతడు, ‘వున్నవానికి యింకా ఎక్కువ ఇవ్వబడుతుంది. ఏమిలేని వాని నుండి అతని దగ్గర ఉన్నవి కూడా తేసివేయబడతాయి. 27 ఇక నేను తమ రాజుగా ఉండటానికి నిరాకరించిన శత్రువుల్ని పిలుచుకు వచ్చి నా ముందు చంపండి’” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International