Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 147

147 యెహోవా మంచివాడు గనుక ఆయనను స్తుతించండి.
    మన దేవునికి స్తుతులు పాడండి.
    ఆయనను స్తుతించుట మంచిది, అది ఎంతో ఆనందం.
యెహోవా యెరూషలేమును నిర్మించాడు.
    బందీలుగా తీసికొనిపోబడిన ఇశ్రాయేలు ప్రజలను దేవుడు వెనుకకు తీసికొనివచ్చాడు.
పగిలిన వారి హృదయాలను దేవుడు స్వస్థపరచి,
    వారి గాయాలకు కట్లు కడతాడు.
దేవుడు నక్షత్రాలను లెక్కిస్తాడు.
    వాటి పేర్లనుబట్టి వాటన్నిటినీ ఆయన పిలుస్తాడు.
మన ప్రభువు చాలా గొప్పవాడు. ఆయన చాలా శక్తిగలవాడు.
    ఆయన పరిజ్ఞానానికి పరిమితి లేదు.
పేదలను యెహోవా బలపరుస్తాడు.
    కాని చెడ్డ ప్రజలను ఆయన ఇబ్బంది పెడతాడు.
యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి.
    స్వరమండలాలతో మన దేవుణ్ణి స్తుతించండి.
దేవుడు ఆకాశాన్ని మేఘాలతో నింపుతాడు.
    భూమి కోసం దేవుడు వర్షాన్ని సృష్టిస్తాడు.
పర్వతాల మీద దేవుడు గడ్డిని మొలిపిస్తాడు.
జంతువులకు దేవుడు ఆహారం యిస్తాడు.
    పక్షి పిల్లల్ని దేవుడు పోషిస్తాడు.
10 యుద్ధాశ్వాలు, బలంగల సైనికులు ఆయనకు ఇష్టం లేదు.
11 యెహోవాను ఆరాధించే ప్రజలు ఆయనకు సంతోషాన్ని కలిగిస్తారు.
    ఆయన నిజమైన ప్రేమను నమ్ముకొనే ప్రజలు యెహోవాకు సంతోషం కలిగిస్తారు.
12 యెరూషలేమా, యెహోవాను స్తుతించుము.
    సీయోనూ, నీ దేవుని స్తుతించుము!
13 యెరూషలేమా, దేవుడు నీద్వారబంధాలను బలపరుస్తాడు.
    నీ పట్టణంలోని ప్రజలను దేవుడు ఆశీర్వదిస్తాడు.
14 నీ దేశానికి దేవుడు శాంతి కలిగించాడు. కనుక యుద్ధంలో నీ శత్రువులు నీ ధాన్యం తీసుకొని పోలేదు.
    ఆహారం కోసం నీకు ధాన్యం సమృద్ధిగా ఉంది.
15 దేవుడు భూమికి ఒక ఆజ్ఞ ఇస్తాడు.
    దానికి వెంటనే అది లోబడుతుంది.
16 నేల ఉన్నిలా తెల్లగా అయ్యేంతవరకు మంచు కురిసేటట్టు దేవుడు చేస్తాడు.
    ధూళిలా గాలిలో మంచు విసిరేటట్టు చేస్తాడు.
17 దేవుడు ఆకాశం నుండి బండలవలె వడగండ్లు పడేలా చేస్తాడు.
    ఆయన పంపే చలికి ఎవడూ నిలువ జాలడు.
18 అప్పుడు, దేవుడు మరో ఆజ్ఞ ఇస్తాడు. వెచ్చటి గాలి మరల వీస్తుంది.
    మంచు కరిగిపోతుంది. నీళ్లు ప్రవహించటం మొదలవుతుంది.

19 దేవుడు యాకోబుకు (ఇశ్రాయేలు) తన ఆజ్ఞ ఇచ్చాడు.
    దేవుడు ఇశ్రాయేలుకు తన న్యాయచట్టాలు, ఆదేశాలు ఇచ్చాడు.
20 దేవుడు యిలా మరి ఏ దేశానికీ చెయ్యలేదు.
    ఇతర మనుష్యులకు దేవుడు తన న్యాయ చట్టం ఉపదేశించలేదు.

యెహోవాను స్తుతించండి!

ద్వితీయోపదేశకాండము 26:1-11

ప్రథమ పంట

26 “మీరు నివసించేందుకు మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో మీరు త్వరలో ప్రవేశిస్తారు. మీరు అక్కడ మీ నివాసం ఏర్పరచుకొన్నప్పుడు మీరు ప్రథమ ఫలాలు కొన్ని తీసుకొని ఒక బుట్టలో పెట్టాలి. యెహోవా మీకు ఇస్తున్న దేశంలో అది మీకు లభించిన ప్రథమ పంట అవుతుంది. ఈ ప్రథమ పంట కొంత ఉన్న ఆ బుట్టను తీసుకొని, మీ దేవుడైన యెహోవా నిర్ణయించే స్థలానికి వెళ్లండి. అది యెహోవా తనకోసం ప్రత్యేక ఆలయంగా ఉండేందుకు ఏర్పాటు చేసుకొనే స్థలం. అప్పటికి అక్కడ పరిచర్య చేస్తుండే యాజకుని దగ్గరకు మీరు వెళ్లాలి. ‘యెహోవా మనకు ఇస్తానని మన పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశంలోనికి నేను వచ్చేసానని నా దేవుడైన యెహోవాకు నేడు నేను ప్రకటిస్తాను’ అని నీవు ఆతనితో చెప్పాలి.

“అప్పుడు నీ చేతిలోని బుట్టను యాజకుడు తీసుకొంటాడు. నీ దేవుడైన యెహోవా బలిపీఠం ఎదుట అతడు దానిని క్రింద ఉంచుతాడు. అప్పుడు అక్కడ నీ దేవుడైన యెహోవా ఎదుట నీవు ఇలా చెప్పాలి: ‘నా పూర్వీకుడు ఒక సంచార అరామీయుడు. అతడు ఈజిప్టులోనికి వెళ్లి, అక్కడ నివసించాడు. అతడు అక్కడికి వెళ్లినప్పుడు అతని కుటుంబంలో కొద్ది మంది మాత్రమే ఉన్నారు. అయితే అక్కడ ఈజిప్టులో అతడు అనేకమంది ప్రజలుగా, శక్తివంతమైన ఒక గొప్ప జనంగా తయారయ్యాడు. ఈజిప్టువాళ్లు మమ్మల్ని నీచంగా చూశారు. వాళ్లు మమ్మల్ని కష్టపెట్టి, బానిస పని బలవంతంగా మాతో చేయించారు. అప్పుడు మేము మా పూర్వీకుల దేవుడైన యెహోవాకు మొర్ర పెట్టి, వారిని గూర్చి ఆరోపణ చేసాము. యెహోవా మా మొర్ర విన్నాడు. మా కష్టం, మా కఠినమైన పని, మా శ్రమ ఆయన చూశాడు. అప్పుడు యెహోవా తన మహా శక్తి, ప్రభావాలతో ఈజిప్టు నుండి మమ్మల్ని బయటకు తీసుకొని వచ్చాడు. గొప్ప అద్భుతాలు, మహాత్యాలు ఆయన చేశాడు. భయంకరమైన సంగతులు జరిగేటట్టు ఆయన చేసాడు. కనుక ఆయనే మమ్మల్ని ఈ దేశానికి తీసుకొనివచ్చాడు. పాలు, తేనెలు ప్రవహించుచున్న ఈ మంచి దేశాన్ని ఆయన మాకు యిచ్చాడు. 10 ఇప్పుడు యెహోవా, నీవు మాకు యిచ్చిన దేశంలోని ప్రథమ పంటను నీకు తెచ్చాను.’

“తర్వాత నీ పంటను నీ దేవుడైన యెహోవా ఎదుట క్రింద పెట్టాలి. మరియు మీరు ఆయనను ఆరాధించాలి. 11 అప్పుడు మీ దేవుడైన యెహోవా మీకూ, మీ కుటుంబానికీ ఇచ్చిన మంచి పదార్థాలన్నింటినీ మీరు తిని ఆనందించవచ్చును. మీ మధ్య నివసించే లేవీయులు, విదేశీయులతో మీరు వాటిని పంచుకోవాలి.

యోహాను 6:26-35

26 యేసు, “ఇది నిజం. అద్భుతాల్ని చూసినందువలన నన్ను మీరు వెతకటం లేదు. రొట్టెలు తిని మీ కడుపులు నింపుకొన్నందుకు నా కోసం వెతుకుతున్నారు. 27 చెడిపోయే ఆహారం కోసం పాటు పడకండి. చిరకాలం ఉండే ఆహారం కోసం పాటు పడండి. దాన్ని మనుష్యకుమారుడు మీకిస్తాడు. ఆయన పై తండ్రి ఆయన దేవుడు తన అంగీకార ముద్రవేశాడు” అని చెప్పాడు.

28 వాళ్ళు ఆయన్ని, “దైవకార్యం చెయ్యాలంటే మేము ఏమి చెయ్యాలి?” అని అడిగారు.

29 యేసు, “ఆయన్నిపంపిన వాణ్ణి నమ్మటమే దైవకార్యం” అని సమాధానం చెప్పాడు.

30 కనుక వాళ్ళు ఆయనతో చెప్పారు, “అలాగైతే, మేము నమ్మేటట్లు ఏ అద్భుత కార్యాన్ని చేసి చూపిస్తారు? 31 మా ముత్తాతలు ఎడారుల్లో మన్నాను[a] తిన్నారు. దీన్ని గురించి గ్రంథాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది, ఆయన, వాళ్ళు తినటానికి పరలోకం నుండి ఆహారం యిచ్చాడు.”

32 యేసు జవాబు చెబుతూ, “ఇది నిజం. పరలోకం నుండి నిజమైన ఆహారం ఇచ్చింది మోషే కాదు. దాన్ని యిచ్చేవాడు నా తండ్రి. 33 ఆ జీవాహారం పరలోకం నుండి దిగి వచ్చిన క్రీస్తే. ఆయన లోకానికి జీవాన్నిస్తాడు” అని అన్నాడు.

34 వాళ్ళు, “అయ్యా! యికనుండి ఈ ఆహారం మాకివ్వండి!” అని అన్నారు.

35 యేసు ఈ విధంగా చెప్పాడు: “నేను జీవాన్నిచ్చే ఆహారాన్ని, నా దగ్గరకు వచ్చినవాడు ఆకలితో పోడు. నన్ను నమ్మినవానికి ఎన్నడూ దాహం కలుగదు.

కీర్తనలు. 145

దావీదు ప్రార్థన.

145 నా దేవా, నా రాజా, నిన్ను నేను స్తుతిస్తాను.
    నిరంతరం నిన్ను నేను స్తుతిస్తాను.
ప్రతిరోజూ నిన్ను నేను స్తుతిస్తాను.
    ఎప్పటికీ నీ నామాన్ని నేను స్తుతిస్తాను.
యెహోవా గొప్పవాడు. ప్రజలు ఆయనను ఎంతో స్తుతిస్తారు.
    ఆయన చేసే గొప్ప కార్యాలన్నింటినీ మనం లెక్కించలేము.
యెహోవా, ఒక తరం నీ పనులను స్తుతిస్తూ ఇంకొక తరానికి అందిస్తారు.
    నీవు చేసే గొప్ప కార్యాలను గూర్చి ప్రజలు ఇతర ప్రజలతో చెబుతారు.
ఆశ్చర్యకరమైన నీ ఘనత, మహిమను గూర్చి మనుష్యులు చెప్పుకొంటారు.
    నీ అద్భుతాలను గూర్చి నేను చెబుతాను.
యెహోవా, నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి మనుష్యులు చెప్పుకొంటారు.
    నీవు చేసే గొప్ప సంగతుల్ని గూర్చి నేను చెబుతాను.
నీవు చేసే మంచి పనులను గూర్చి ప్రజలు చెప్పుకొంటారు.
    యెహోవా, ప్రజలు నీ మంచితనం గూర్చి పాడుకొంటారు.

యెహోవా దయగలవాడు, కరుణగలవాడు.
    యెహోవా సహనంగలవాడు, ప్రేమపూర్ణుడు.
యెహోవా, అందరి యెడలా మంచివాడు.
    దేవుడు చేసే ప్రతిదానిలో తన కరుణ చూపిస్తాడు.
10 యెహోవా, నీవు చేసే పనులు నీకు స్తుతి కలిగిస్తాయి.
    నీ అనుచరులు నిన్ను స్తుతిస్తారు.
11 ఆ ప్రజలు నీ మహిమ రాజ్యం గూర్చి చెప్పుకొంటారు.
    నీవు ఎంత గొప్పవాడవో ఆ ప్రజలు చెప్పుకొంటారు.
12 కనుక యెహోవా, నీవు చేసే గొప్ప కార్యాలను గూర్చి ఇతర జనులు ఈ రీతిగా నేర్చుకొంటారు.
    మహా ఘనమైన నీ మహిమ రాజ్యం గూర్చి ప్రజలు చెప్పుకొంటారు.
13 యెహోవా, నీ రాజ్యం శాశ్వతంగా ఉంటుంది.
    నీవు శాశ్వతంగా పాలిస్తావు.

14 పడిపోయిన మనుష్యులను యెహోవా లేవనెత్తుతాడు.
    కష్టంలో ఉన్న మనుష్యులకు యెహోవా సహాయం చేస్తాడు.
15 యెహోవా, జీవిస్తున్న సకల ప్రాణులూ వాటి ఆహారం కోసం నీవైపు చూస్తాయి.
    సకాలంలో నీవు వాటికి ఆహారం యిస్తావు.
16 యెహోవా, నీవు నీ గుప్పిలి విప్పి,
    జీవిస్తున్న సకల ప్రాణులకు కావాల్సినవన్నీ యిస్తావు.
17 యెహోవా చేసే ప్రతీదీ మంచిది.
    యెహోవా చేసే ప్రతి దానిలోనూ ఆయన తన నిజప్రేమను చూపిస్తాడు.
18 యెహోవా సహాయం కోసం తనను పిలిచే ప్రతి యొక్కనికీ సమీపంగా ఉన్నాడు.
    యెహోవాను యదార్థంగా ఆరాధించే ప్రతి వ్యక్తికీ ఆయన సమీపంగా ఉన్నాడు.
19 ఆయన జరిగించాలని ఆయన అనుచరులు కోరేవాటినే యెహోవా జరిగిస్తాడు.
    యెహోవా తన అనుచరుల మొర విని వారిని రక్షిస్తాడు.
    మరియు యెహోవా వారి ప్రార్థనలకు జవాబిచ్చి, వారిని రక్షిస్తాడు.
20 యెహోవాను ప్రేమించే ప్రతి వ్యక్తినీ ఆయన కాపాడుతాడు.
    దుర్మార్గులను యెహోవా నాశనం చేస్తాడు.
21 నేను యెహోవాను స్తుతిస్తాను!
    ప్రతి మనిషీ సదా ఆయన పవిత్ర నామాన్ని స్తుతించాలని నా కోరిక!

1 థెస్సలొనీకయులకు 5:12-24

చివరి మాట

12 సోదరులారా! మేము ప్రస్తుతం కోరేదేమిటంటే, కష్టపడి పని చేస్తూ ప్రభువు సేవలో మీకు దారి చూపుతూ మీకు బోధిస్తున్న వాళ్ళను గౌరవించండి. 13 వాళ్ళు మంచి కార్యం చేస్తున్నారు కనుక వాళ్ళను అందరికన్నా ఎక్కువగా ప్రేమించి గౌరవించండి.

శాంతంగా జీవించండి. 14 సోదరులారా! సోమరులను వారించండి. పిరికి వాళ్ళకు ధైర్యం చెప్పండి. అందరి పట్ల శాంతంగా ఉండండి. బలహీనుల్ని బలపర్చండి. ఇది మా విజ్ఞాపన. 15 కీడు చేసిన వాళ్ళకు తిరిగి కీడు చేసే వాళ్ళను గమనిస్తూ వాళ్ళను అలా చేయనీయకుండా జాగ్రత్త పడండి. పరస్పరం దయ కలిగి యితర్ల పట్ల దయచూపుతూ ఉండండి.

16 ఎప్పుడూ ఆనందంగా వుండండి. విడువకుండా ప్రార్థించండి. 17 దైవ నియమాన్ని తప్పక పాటించండి. 18 అన్ని వేళలా దేవునికి కృతజ్ఞతతో ఉండండి. యేసు క్రీస్తు వల్ల కలిగిన జీవితంలో మీరు ఈ విధంగా ఉండాలని దేవుని కోరిక.

19 ఆత్మ వెలిగించిన జ్యోతిని ఆర్పివేయకండి. 20 ప్రవక్తలు చెప్పినవాటిని తూలనాడకండి. 21 అన్నిటినీ పరీక్షించండి. మంచిని విడువకండి. 22 చెడుకు దూరంగా ఉండండి.

23 శాంతిని ప్రసాదించే ఆ దేవుడు మిమ్మల్ని పూర్తిగా పవిత్రం చెయ్యనీయండి. మన యేసు క్రీస్తు ప్రభువు వచ్చేరోజు, మీ అంతరాత్మ, ప్రాణం, దేహం ఏ అపకీర్తి లేకుండా ఉండుగాక! 24 మిమ్మల్ని పిలిచేవాడు విశ్వసింపదగ్గవాడు. ఆయన మేము కోరింది తప్పక చేస్తాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International