Book of Common Prayer
కోరహు కుమారుల స్తుతి కీర్తన. సంగీత నాయకునికి: బాధాకరమైన ఒక వ్యాధిని గూర్చి ఎజ్రాహివాడైన హేమాను ధ్యాన గీతం.
88 యెహోవా దేవా, నీవు నా రక్షకుడవు.
రాత్రింబగళ్లు నేను నిన్ను ప్రార్థిస్తున్నాను.
2 దయచేసి నా ప్రార్థనలను గమనించుము.
కరుణకోసం నేను చేస్తున్న ప్రార్థనలు ఆలకించుము.
3 నా కష్టాలు అన్నింటితో నేను విసిగిపోయాను.
మరణించుటకు నేను సిద్ధంగా ఉన్నాను.
4 జీవించుటకు బహు బలహీనుడివలె, చనిపోయిన మనిషివలె
ప్రజలు నాతో వ్యవహరిస్తున్నారు.
5 మరణించుటకు నేను ఒంటరిగా విడువబడ్డాను.
నేను సమాధిలో ఉన్న శవంలా ఉన్నాను.
నీనుండీ, నీ కాపుదలనుండి నీవు వేరుచేసిన మృతులలో ఒకనివలె నేనున్నాను.
మనుష్యులు వారిని పూర్తిగా మరచిపోతారు.
6 యెహోవా, నీవు నన్ను భూమి క్రింద సమాధిలో ఉంచావు.
నీవు నన్ను ఆ చీకటి స్థలంలో ఉంచావు.
7 నీవు నా మీద కోపగించావు.
నీవు నన్ను శిక్షించావు.
8 నా స్నేహితులు నన్ను విడిచిపెట్టేశారు.
అంటరాని మనిషిలా వారంతా నన్ను తప్పించి వేస్తారు.
నేను యింటిలో బంధించబడ్డాను, నేను బయటకు వెళ్లలేను.
9 నా బాధ అంతటిని గూర్చి ఏడ్చి నా కళ్లు నొప్పిగా ఉన్నాయి.
యెహోవా, నేను ఎడతెగకుండా నిన్ను ప్రార్థిస్తున్నాను.
ప్రార్థనలో నేను నీకు నా చేతులు జోడిస్తున్నాను.
10 యెహోవా, చనిపోయినవారి కోసం నీవు అద్భుతాలు చేస్తావా? లేదు!
దురాత్మలు లేచి నిన్ను స్తుతిస్తాయా? లేదు!
11 చనిపోయినవాళ్లు వారి సమాధుల్లో నీ ప్రేమను గూర్చి మాట్లాడలేరు.
చనిపోయినవారు మృతుల లోకంలో ఉండి నీ నమ్మకత్వం గూర్చి మాట్లాడలేరు.
12 చీకటిలో పడివున్న మృతులు నీవు చేసే అద్భుత కార్యాలు చూడలేరు.
మరచిపోయిన వారి లోకంలో ఉన్న మృతులు నీ మంచితనం గూర్చి మాట్లాడలేరు.
13 యెహోవా, నాకు సహాయం చేయుమని నేను నిన్ను అడుగుతున్నాను.
ప్రతి వేకువ జామునా నేను నిన్ను ప్రార్థిస్తాను.
14 యెహోవా, నీవెందుకు నన్ను విడిచిపెట్టేశావు?
నానుండి నీ ముఖాన్ని ఎందుకు దాచుకొంటున్నావు?
15 నేను బాలుడిగా ఉన్నప్పటినుండి నేను బలహీనుడను, రోగిని.
నేను నీ కోపాన్ని అనుభవించాను, నేను నిస్సహాయుడను.
16 యెహోవా, నీవు నా మీద చాలా కోపగించావు.
శిక్ష నన్ను చంపేస్తుంది.
17 నాకు నొప్పులు, బాధలు ఎల్లప్పుడూ ఉన్నాయి.
నా నొప్పులు, బాధల్లో నేను మునిగిపోతున్నట్టుగా నాకు అనిపిస్తుంది.
18 మరియు యెహోవా, నా స్నేహితులు, నా ప్రియులు అంతా నన్ను విడిచిపెట్టివేసేటట్టుగా నీవు చేశావు.
చీకటి మాత్రమే నాకు మిగిలింది.
91 మహోన్నతుడైన దేవుని ఆశ్రయంలో నివసించే వాడు
సర్వశక్తిమంతుడైన దేవుని నీడలో విశ్రాంతి తీసుకొంటాడు.
2 “నీవే నా క్షేమ స్థానం, నా కోట. నా దేవా, నేను నిన్నే నమ్ముకొన్నాను.”
అని నేను యెహోవాకు చెబుతాను.
3 దాగి ఉన్న అపాయాలన్నింటి నుండి దేవుడు నిన్ను రక్షిస్తాడు.
ప్రమాదకరమైన రోగాలన్నింటినుండి దేవుడు నిన్ను రక్షిస్తాడు.
4 కాపుదలకోసం నీవు దేవుని దగ్గరకు వెళ్లవచ్చు.
పక్షి తన రెక్కలతో దాని పిల్లలను కప్పునట్లు ఆయన నిన్ను కాపాడుతాడు.
దేవుడు కేడెంగా, నిన్ను కాపాడే గోడలా ఉంటాడు.
5 రాత్రివేళ నీవు దేనికి భయపడవు.
పగటివేళ శత్రువు బాణాలకు నీవు భయపడవు.
6 చీకటిలో దాపురించే రోగాలకు గాని
మధ్యాహ్నం వేళ దాపురించే వ్యాధులకుగాని నీవు భయపడవు.
7 నీ ప్రక్కన వేయిమంది,
నీ కుడి ప్రక్కన పది వేలమంది శత్రుసైనికులను ఓడిస్తావు.
నీ శత్రువులు నిన్ను కనీసం తాకలేరు.
8 ఊరికే చూడు, ఆ దుర్మార్గులు శిక్షించబడినట్లుగా
నీకు కనబడుతుంది.
9 ఎందుకంటే నీవు యెహోవాను నమ్ముకొన్నావు గనుక.
సర్వోన్నతుడైన దేవుణ్ణి నీ క్షేమ స్థానంగా చేసుకొన్నావు గనుక.
10 కీడు ఏమీ నీకు జరగదు.
నీ ఇంట ఎలాంటి వ్యాధి ఉండదు.
11 ఎందుకంటే నిన్ను కనిపెట్టుకొని ఉండుటకు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీవు ఎక్కడికి వెళ్లినా వారు నిన్ను కాపాడుతారు.
12 నీ పాదం రాయికి తగులకుండా
దేవదూతలు వారి చేతులతో నిన్ను పైకి ఎత్తుతారు.
13 సింహాల మీద, విషసర్పాల మీద
నడిచే శక్తి నీకు ఉంటుంది.
14 యెహోవా చెబుతున్నాడు: “ఒక వ్యక్తి నన్ను నమ్ముకొంటే, నేను అతన్ని రక్షిస్తాను.
నా పేరు అతనికి తెలుసు కనుక నేను కాపాడుతాను.
15 నా అనుచరులు సహాయంకోసం నాకు మొరపెడ్తారు.
నేను వారికి జవాబు ఇస్తాను.
వారికి కష్టం కలిగినప్పుడు నేను వారితో ఉంటాను. నేను వారిని తప్పించి, ఘనపరుస్తాను.
16 నా అనుచరులకు నేను దీర్ఘాయుష్షు యిస్తాను.
నేను వాళ్లను రక్షిస్తాను.”
సబ్బాతుకోసం స్తుతి కీర్తన.
92 యెహోవాను స్తుతించుట మంచిది.
సర్వోన్నతుడైన దేవా, నీ నామాన్ని కీర్తించుట మంచిది.
2 ఉదయం నీ ప్రేమను గూర్చి పాడటం,
రాత్రివేళ నీ నమ్మకత్వాన్ని గూర్చి పాడటం మంచిది.
3 దేవా, పదితంత్రుల వాయిద్యాలను స్వరమండల ములను నీ కోసం వాయించటం మంచిది.
సితారా మీద నీ కోసం సంగీతనాదం చేయటం మంచిది.
4 యెహోవా, నీవు చేసిన పనుల మూలంగా నిజంగా నీవు మమ్మల్ని సంతోషింపచేస్తావు.
నీవు చేసిన వాటిని గూర్చి మేము సంతోషంగా పాడుకొంటాం.
5 యెహోవా, నీవు గొప్ప కార్యాలు చేశావు.
నీ తలంపులు మేము గ్రహించటం మాకు ఎంతో కష్టతరం.
6 నీతో పోల్చినట్లయితే మనుష్యులు బుద్ధిలేని జంతువుల్లాంటి వారు.
మేము ఏదీ గ్రహించలేని బుద్ధిలేని వాళ్లలా ఉన్నాము.
7 దుర్మార్గులు గడ్డిలా మొలిచినా,
చెడ్డవాళ్లు అభివృద్ధి చెందినా వారు శాశ్వతంగా నాశనం అవుతారు.
8 కాని యెహోవా, నీవు శాశ్వతంగా గౌరవించబడతావు.
9 యెహోవా, నీ శత్రువులు అందరూ నాశనం చేయబడతారు.
చెడు కార్యాలు చేసే ప్రజలందరూ నాశనం చేయబడతారు.
10 కాని నీవు నన్ను బలపరుస్తావు. బలమైన కొమ్ములుగల పొట్టేలువలె నీవు నన్ను చేస్తావు.
సేదదీర్చే నీ తైలాన్ని నీవు నా మీద పోశావు.
11 నా శత్రువుల పతనాన్ని నా కండ్లారా చూచాను.
నా శత్రువుల నాశనాన్ని నా చెవులారా విన్నాను.
12 నీతిమంతులు ఖర్జూరపు చెట్టులా అభివృద్ధి చెందుతారు.
వారు లెబానోనులోని దేవదారు వృక్షంలా పెరుగుతారు.
13 మంచి మనుష్యులు యెహోవా ఆలయంలో నాటబడిన మొక్కలవలె బలంగా ఉంటారు.
వారు మన దేవుని ఆలయంలో బలంగా ఎదుగుతారు.
14 వారు వృద్ధులైన తరువాత కూడా ఫలిస్తూనే ఉంటారు.
వారు ఆరోగ్యంగా ఉన్న పచ్చని మొక్కల్లా వుంటారు.
15 యెహోవా మంచివాడని నేను చెబుతున్నాను.
ఆయనే నా బండ.
ఆయనలో అవినీతి లేదు.
తెల్లటి గుర్రంపై రౌతు
11 నేను తెరుచుకొని ఉన్న పరలోకాన్ని చూసాను. నా ముందు ఒక తెల్లటి గుఱ్ఱం కనిపించింది. దాని రౌతు నమ్మకమైన వాడని, సత్యవంతుడని పేరున్న వాడు. అతడు నీతిగా తీర్పు చెబుతాడు. న్యాయంగా యుద్ధం చేస్తాడు. 12 ఆయన కళ్ళు నిప్పులా మండుతూ ఉన్నాయి. ఆయన తలమీద ఎన్నో కిరీటాలు ఉన్నాయి. ఆయన మీద ఒక పేరు వ్రాయబడి ఉంది. ఆయనకు తప్ప మరెవ్వరికీ ఆ పేరు తెలియదు. 13 ఆయన రక్తంలో ముంచబడిన వస్త్రాన్ని ధరించి ఉన్నాడు. ఆయన పేరు దేవుని వాక్యం. 14 తెల్లగా పరిశుద్ధంగా ఉన్న సున్నితమైన దుస్తులు వేసుకొని పరలోకంలో ఉన్న సైనికులు తెల్లటి గుర్రాలపై స్వారీ చేస్తూ ఆయన్ని అనుసరించారు. 15 దేశాలను ఓడించటానికి ఆయన నోటినుండి పదునైన కత్తి బయటకు వచ్చింది. ఆయన దేశాలను గొప్ప అధికారంతో పాలిస్తాడు. ఆయన సర్వశక్తి సంపన్నుడైన దేవుని ఆగ్రహమనబడే ద్రాక్షా గానుగను త్రొక్కుతాడు. ఆ ఆగ్రహం తీవ్రమైనది. 16 ఆయన వస్త్రంమీద, ఆయన తొడమీద:
రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు
అని వ్రాయబడి ఉంది.
యేసే క్రీస్తు
(మార్కు 8:27-30; లూకా 9:18-21)
13 యేసు ఫిలిప్పు స్థాపించిన కైసరయ పట్టణ ప్రాంతానికి వచ్చాక తన శిష్యులతో, “మనుష్య కుమారుణ్ణి గురించి ప్రజలేమనుకుంటున్నారు?” అని అడిగాడు.
14 వాళ్ళు, “కొందరు బాప్తిస్మమిచ్చు యోహాను అంటున్నారు. కొందరు ఏలీయా అంటున్నారు. కొందరు యిర్మీయా అంటున్నారు. మరి కొందరు ప్రవక్తల్లో ఒకడై ఉండవచ్చని అంటున్నారు” అని అన్నారు.
15 యేసు, “కాని మీ విషయమేమిటి? నేనెవరని మీరనుకొంటున్నారు?” అని వాళ్ళనడిగాడు.
16 సీమోను పేతురు, “నీవు క్రీస్తువు! సజీవుడైన దేవుని కుమారుడవు!” అని అన్నాడు.
17 యేసు సమాధానం చెబుతూ, “యోనా కుమారుడా! ఓ! సీమోనూ, నీవు ధన్యుడవు! ఈ విషయాన్ని నీకు మానవుడు చెప్పలేదు. పరలోకంలో వున్న నా తండ్రి చెప్పాడు. 18 నీవు పేతురువని నేను చెబుతున్నా. ఈ బండ మీద నేను నా సంఘాన్ని నిర్మిస్తాను. మృత్యులోకపు శక్తులు సంఘాన్ని ఓడించలేవు. 19 దేవుని రాజ్యం యొక్క తాళం చెవులు నేను నీకిస్తాను. ఈ ప్రపంచంలో నీవు నిరాకరించిన వాళ్ళను పరలోకంలో కూడా నిరాకరిస్తాను. ఈ ప్రవంచంలో నీవు అంగీకరించిన వాళ్ళను పరలోకంలో కూడా అంగీకరిస్తాను” అని అన్నాడు.
20 ఆ తర్వాత, తాను క్రీస్తు అన్న విషయం ఎవ్వరికీ చెప్పవద్దని శిష్యులతో చెప్పాడు.
© 1997 Bible League International