Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 119:97-120

మేమ్

97 నీ ధర్మశాస్త్రాన్ని నేనెంతగా ప్రేమిస్తానో!
    దినమంతా అదే నా ధ్యానం.
98 నీ ఆజ్ఞ నన్ను నా శత్రువులకంటే
    జ్ఞానవంతునిగా చేస్తుంది.
99 నా గురువులందరికంటే నాకు ఎక్కువ గ్రహింపు ఉన్నది.
    ఎందుకంటే నీ ఉపదేశాలే నా ధ్యానం కాబట్టి.
100 ముసలివారి కంటే నేనెక్కువ అర్థం చేసుకొంటాను.
    కారణం ఏమిటంటే, నేను నీ శాసనాలను అనుసరిస్తాను.
101 నీ వాక్కు ప్రకారం నడుచుకోటానికి
    ప్రతి చెడు మార్గంనుండి నేను తప్పించుకొంటాను.
102 యెహోవా, నీవు నా ఉపాధ్యాయుడవు
    కనుక నేను నీ న్యాయ చట్టాలకు విధేయుడనవటం మానను.
103 నీ మాటలు నా నోటికి తేనెకంటే మధురం.
104 నీ ఉపదేశాలు నన్ను తెలివిగలవాణ్ణి చేస్తాయి,
    అందుచేత తప్పుడు ఉపదేశాలు నాకు అసహ్యము.

నూన్

105 యెహోవా, నీ వాక్యాలు
    నా బాటను వెలిగించే దీపాల్లా ఉన్నాయి.
106 నీ న్యాయ చట్టాలు మంచివి.
    నేను వాటికి విధేయుడనవుతానని వాగ్దానం చేస్తున్నాను. మరియు నా వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాను.
107 యెహోవా, నేను చాలాకాలం శ్రమ అనుభవించాను.
    దయచేసి ఆజ్ఞయిచ్చి, నన్ను మరల జీవించనిమ్ము!
108 యెహోవా, నా స్తుతి అంగీకరించు.
    నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
109 నా జీవితం ఎల్లప్పుడూ ప్రమాదంలోనే ఉంది.
    కాని యెహోవా, నేను నీ ఉపదేశాలు మరచిపోలేదు.
110 దుర్మార్గులు నన్ను ఉచ్చులో పట్టాలని ప్రయత్నించారు
    కాని నేను నీ ఆజ్ఞలకు అవిధేయుడను కాలేదు.
111 యెహోవా, శాశ్వతంగా నేను నీ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తాను.
    అది నన్ను ఎంతో సంతోషింపజేస్తుంది.
112 నీ ఆజ్ఞలు అన్నిటికీ విధేయుడనగుటకు
    నేను ఎల్లప్పుడూ కష్టపడి ప్రయత్నిస్తాను.

సామెహ్

113 స్థిరమైన మనస్సు లేనివాళ్లంటే నాకు అసహ్యం.
    నేను నీ ఉపదేశాలను ప్రేమిస్తున్నాను.
114 నన్ను దాచిపెట్టి, కాపాడుము.
    యెహోవా, నీవు చెప్పే ప్రతిదీ నేను నమ్ముతాను.
115 యెహోవా, దుర్మార్గపు ప్రజలను నా దగ్గరకు రానీయకుము.
    నేను మాత్రం నా దేవుని ఆజ్ఞలకు విధేయుడనవుతాను.
116 యెహోవా, నీ వాగ్దానం ప్రకారం నాకు చేయూత నిమ్ము.
    నేను జీవిస్తాను. నేను నిన్ను నమ్ముకొన్నాను, నన్ను నిరాశపరచకు.
117 యెహోవా, నాకు సహాయం చేయుము. నేను రక్షించబడతాను.
    నీ ఆజ్ఞలను నేను నిరంతరం అధ్యయనం చేస్తాను.
118 యెహోవా, నీ ఆజ్ఞలను ఉల్లంఘించే ప్రతి మనిషినీ నీవు తిప్పికొడతావు.
    ఎందుకంటే ఆ మనుష్యులు నిన్ను అనుసరిస్తామని ఒడంబడిక చేసుకున్నప్పుడు అబద్ధం చెప్పారు.
119 యెహోవా, భూమి మీద దుష్టులను నీవు చెత్తలా చూస్తావు.
    కనుక నేను శాశ్వతంగా నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తాను.
120 యెహోవా, నీవంటే నాకు భయం,
    నీ చట్టాలకు నేను భయపడి వాటిని గౌరవిస్తాను.

కీర్తనలు. 81-82

సంగీత నాయకునికి: గిత్తీత్ రాగం. ఆసాపు కీర్తన.

81 సంతోషించండి, మన బలమైన దేవునికి గానం చేయండి.
    ఇశ్రాయేలీయుల దేవునికి సంతోషంతో కేకలు వేయండి.
సంగీతం ప్రారంభించండి.
    గిలక తప్పెట వాయించండి.
    స్వరమండలం, సితారాలను శ్రావ్యంగా వాయించండి.
నెలవంకనాడు గొర్రెపోతు కొమ్ము ఊదండి.
    పౌర్ణమినాడు[a] గొర్రెపోతు కొమ్ము ఊదండి. ఆనాడే మన పండుగ ఆరంభం.
అది ఇశ్రాయేలు ప్రజలకు న్యాయచట్టం.
    ఆ ఆదేశాన్ని యాకోబుకు దేవుడు ఇచ్చాడు.
ఈజిప్టునుండి యోసేపును[b] దేవుడు తీసుకొనిపోయిన సమయంలో
    దేవుడు వారితో ఈ ఒడంబడిక చేసాడు.
ఈజిప్టులో నేను గ్రహించని భాష విన్నాను.
దేవుడు ఇలా చెబుతున్నాడు: “మీ భుజంమీద నుండి బరువు నేను దింపాను.
    నేను మీ మోతగంప పడవేయనిచ్చాను.
మీరు కష్టంలో ఉన్నప్పుడు మీరు సహాయం కోసం వేడుకొన్నారు. నేను మిమ్మల్ని స్వతంత్రుల్ని చేశాను.
    తుఫాను మేఘాలలో దాగుకొని నేను మీకు జవాబు ఇచ్చాను.
    నీళ్ల వద్ద నేను మిమ్మల్ని పరీక్షించాను.”

“నా ప్రజలారా, నా మాట వినండి. నా ఒడంబడిక[c] నేను మీకు యిస్తాను.
    ఇశ్రాయేలూ, నీవు దయచేసి నా మాట వినాలి!
విదేశీయులు పూజించే తప్పుడు దేవుళ్ళను
    ఎవరినీ ఆరాధించవద్దు.
10 నేను యెహోవాను, నేనే మీ దేవుడను.
    మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకొని వచ్చిన దేవుడను నేనే.
ఇశ్రాయేలూ, నీ నోరు తెరువు,
    నేను దానిని నింపుతాను.

11 “కాని నా ప్రజలు నా మాట వినలేదు.
    ఇశ్రాయేలు నాకు విధేయత చూపలేదు.
12 కనుక వారు చేయగోరిన వాటిని నేను చేయనిచ్చాను.
    ఇశ్రాయేలీయులు వారి ఇష్టం వచ్చిందల్లా చేసారు.
13 ఒకవేళ నా ప్రజలు గనుక నిజంగా నా మాట వింటే ఇశ్రాయేలు జీవించాలని నేను కోరిన విధంగా గనుక వారు జీవిస్తే,
14     అప్పుడు నేను ఇశ్రాయేలీయుల శత్రువులను ఓడిస్తాను.
    ఇశ్రాయేలీయులకు కష్టాలు కలిగించే ప్రజలను నేను శిక్షిస్తాను.
15 యెహోవా శత్రువులు యెహోవాను కాదంటారు,
    అందుచేత వారు శిక్షించబడతారు.
16 దేవుడు తన ప్రజలకు శ్రేష్ఠమైన గోధుమలు ఇస్తాడు.
    తన ప్రజలకు తృప్తి కలిగేంతవరకు వారికి ఆ కొండ తేనె ఇస్తాడు.”

ఆసాపు స్తుతి కీర్తన.

82 దైవ సమాజంలో దేవుడు తన స్థానాన్ని తీసుకొన్నాడు. సమాజంలో దేవుడు నిలుచున్నాడు.
    ఆ దేవుళ్ళ సమాజంలో ఆయన తీర్పునిస్తాడు.
ప్రజలారా, “ఎంతకాలం మీరు అన్యాయపు తీర్పు తీరుస్తారు?
    దుర్మార్గులు శిక్షించబడకుండా ఎన్నాళ్లు తప్పించుకోనిస్తారు?” అని దేవుడు అంటున్నాడు.

“అనాధలను, పేద ప్రజలను కాపాడండి.
    న్యాయం జరగని పేద ప్రజల, అనాధుల హక్కులను కాపాడండి.
పేదలకు, నిస్సహాయ ప్రజలకు సహాయం చేయండి.
    దుర్మార్గుల బారినుండి వారిని రక్షించండి.

“ఏమి జరుగుతుందో ఇశ్రాయేలు ప్రజలకు తెలియదు.
    వారు గ్రహించరు.
వారు చేస్తున్నది ఏమిటో వారికి తెలియదు.
    వారి ప్రపంచం వారి చుట్టూరా కూలిపోతుంది.”
నేను (దేవుడు) మీతో చెప్పాను,
    “మీరు దైవాలు, మీరందరూ సర్వోన్నతుడైన దేవుని కుమారులు.
కాని మనుష్యులందరూ మరణించినట్టుగానే మీరు కూడా మరణిస్తారు.
    ఇతర నాయకులందరి వలెనే మీరు కూడా మరణిస్తారు.”

దేవా, లెమ్ము. నీవే న్యాయమూర్తివిగా ఉండుము!
    దేవా, రాజ్యములన్నీ నీకు చెందినవే.

నెహెమ్యా 7:73-8:3

73 ఈ విధంగా యాజకులు, లేవీయులు, ద్వార పాలకులు, గాయకులు, ఆలయ సేవకులు తమ తమ స్వంత పట్టణాలలో స్థిరపడ్డారు. కాగా, ఇతర ఇశ్రాయేలీయులందరూ తమ స్వంత పట్టణాల్లో స్థిరపడ్డారు. ఆ సంవత్సరం ఏడవ నెల[a] నాటికి ఇశ్రాయేలీయులందరూ తమ తమ పట్టణాల్లో స్థిరపడ్డారు.

ఎజ్రా ధర్మశాస్త్రాన్ని చదవటం

ఆ విధంగా, ఇశ్రాయేలీయులందరూ ఆ ఏడాది ఏడవ నెలలో సమావేశమయ్యారు. వాళ్లందరూ నీటి గుమ్మం ముందరి మైదానంలో ఏక మనస్కులై ఒకే మనిషి అన్నట్లు గుమికూడారు. వాళ్లు ఎజ్రా ఉపదేశకుణ్ణి మోషే ధర్మశాస్త్రాన్ని పైకి తీసి పఠించ వలసిందిగా కోరారు. ఇశ్రాయేలీయులకు యెహోవా ఇచ్చిన ధర్మశాస్త్రమది. యాజకుడైన ఎజ్రా సమావేశమైన జనం ముందుకి ధర్మశాస్త్రాన్ని తెచ్చాడు. అది నెల మొదటి రోజు. అది ఏడాదిలో ఏడవ నెల. ఆ సమావేశంలో స్త్రీలు, పురుషులు విని, అర్థం చేసుకోగల వయస్కులు వున్నారు. ఎజ్రా ఉదయాన్నుంచి మిట్ట మధ్యాహ్నంవరకు ధర్మశాస్త్రాన్ని చదివాడు. నీటి గుమ్మం ఎదుటవున్న మైదానానికి ఎదురుగా నిలబడి, ఎజ్రా స్త్రీలనీ, పురుషుల్నీ విని అర్థం చేసుకోగల వాళ్లందర్నీ ఉద్దేశించి చదివాడు. జనం అందరూ ధర్మశాస్త్ర గ్రంథం పట్ల భక్తి శ్రద్ధలతో విన్నారు.

నెహెమ్యా 8:5-18

అప్పుడు ఎజ్రా గ్రంథం విప్పాడు. ఎజ్రా ఎతైన వేదిక మీద నిలబడి ఉన్నందున జనులందరూ అతన్ని చూడగలుగుతున్నారు. ఎజ్రా ధర్మశాస్త్ర గ్రంథాన్ని తెరవగానే, జనం అందరూ గౌరవంగా లేచి నిలబడ్డారు. ఎజ్రా మహా దేవుడైన యెహోవాను స్తుతించాడు. జనులందరూ తమ చేతులు పైకెత్తి బిగ్గరగా, “ఆమేన్! ఆమేన్!” అన్నారు. తర్వాత జనులందరూ నేలమీదవంగి నమస్కరించి యెహోవాను ఆరాధించారు.

జనం అక్కడ నిలబడి వుండగా లేవీయులు ధర్మశాస్త్ర నియమాలను జనానికి బోధించారు. అలా బోధించిన లేవీయులు: యేషూవ, బానీ, షేరేబ్యా, యామీను, అక్కూబు, షబ్బెతై, హూదీయా, మయశాయా, కెలీటా, అజర్యా, యెజాబాదు, హానాను, పెలాయా. ఆ లేవీయులు దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివారు. వాళ్లు జనానికి అర్థం వివరించి దాన్ని సులభం చేశారు. చదివినదాన్ని జనం తేలిగ్గా అర్థం చేసుకోగలిగేందుకు గాను వాళ్లు తాత్పర్యాలను వివరించి చెప్పారు.

తర్వాత పాలనాధికారి నెహెమ్యా, యాజకుడును, ఉపదేశకుడునైన ఎజ్రా, జనానికి బోధిస్తున్న లేవీయులు మాట్లాడారు. వాళ్లు, “ఈ రోజు మీ దేవుడైన యెహోవాకి ప్రత్యేక దినం[a] మీరు విచారంగా వుండకండి, ఏడ్వకండి!” అని చెప్పారు. ధర్మశాస్త్రంలోని సందేశాలను వింటూ జనం అందరూ రోదించనారంభించిన మూలంగా వాళ్లీ మాటలు చెప్పారు.

10 నెహెమ్యా ఇలా చెప్పాడు: “పోయి కొవ్విన మాంసంతో భోజనం చేయండి, మధుర ద్రాక్షారసం సేవించండి. ఏ ఆహారమూ తయారు చేసుకోని వాళ్లకికొంత ఆహారమూ పానీయాలూ ఇవ్వండి. ఈ రోజు యెహోవాకి ప్రత్యేకమైన రోజు. విచారాన్ని విడనాడండి! ఎందుకంటే, యెహోవా ఆనందం మీకు పుష్టిని చేకూరుస్తుంది.”

11 జనం శాంతచిత్తులయ్యేందుకు లేవీయులు తోడ్పడ్డారు. “శాంతించండి, మౌనంగా వుండండి. ఇదొక ప్రత్యేక దినం, దుఃఖించకండి.”

12 అప్పుడిక అందరూ విందు భోజనం చేసేందుకు వెళ్లారు. వాళ్లు తమ ఆహార పదార్థాలనీ, పానీయాలనీ పరస్పరం పంచుకున్నారు. ఆ ప్రత్యేక దినాన్ని వాళ్లెంతో సంతోషంగా జరుపుకున్నారు. వాళ్లు చివరికి బోధకులు తమకి బోధించ ప్రయత్నిస్తున్న ధర్మశాస్త్ర గుణపాఠాలను అర్థం చేసుకున్నారు.

13 అటు తర్వాత, నెల రెండవ రోజున[b] అన్ని కుటుంబాల పెద్దలూ ఎజ్రానూ, యాజకులనూ, లేవీయులనూ కలుసుకునేందుకు వెళ్లారు. వాళ్లందరూ ధర్మశాస్త్రంలోని ప్రవచనాలను అధ్యయనం చేసేందుకు ఉపదేశకుడైన ఎజ్రాచుట్టూ చేరారు.

14-15 వాళ్లు ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేయగా దానిలో ఈ దిగువ ఆజ్ఞలు వాళ్లకి కనిపించాయి యెహోవా మోషే ద్వారా ఈ ఆజ్ఞ ఇచ్చాడు: ఏడాది ఏడవ నెలలో ఇశ్రాయేలీయులు యెరూషలేముకు ప్రత్యేకమైన పండుగ జరుపుకునేందుకు విధిగా పోవాలి. వాళ్లు తాత్కాలిక పర్ణశాలల్లో ఉండాలి. తమ పట్టణాలన్నింటికీ, యెరూషలేముకీ పోయి, ఈ క్రింది మాటలు ప్రకటించాలి. “పర్వత ప్రాంతానికి పోయి రకరకాల ఒలీవ చెట్ల కొమ్మలు తీసుకురావాలి. కదంబ, తాటి, ఈత ఆకులను, అలాగే నీడనిచ్చే ఇతర మొక్కలను తీసుకురావాలి. ఆ కొమ్మలతో తాత్కాలికమైన పర్ణశాలలు వెయ్యాలి. ధర్మశాస్త్ర గ్రంథం చెప్పినట్లు చెయ్యండి.”

16 సరే, జనం పోయి, ఆ చెట్ల కొమ్మలు తెచ్చారు. తర్వాత వాటితో వాళ్లు తమకి తాత్కాలిక పర్ణశాలలు నిర్మించుకున్నారు. వాళ్లు పర్ణశాలలను తమ ఇళ్ల కప్పులపైనా, తమ ఆవరణల్లోనూ వేసుకున్నారు. వాళ్లు ఆలయ ప్రాంగణంలో, నీటి గుమ్మం దగ్గరి ఖాళీ స్థలంలో, ఎఫ్రాయిము ద్వారం దగ్గర పర్ణశాలలు నిర్మించారు. 17 చెరనుంచి బంధవిముక్తులై తిరిగివచ్చిన ఇశ్రాయేలీయుల బృందమంతా పర్ణశాలలు కట్టు కున్నారు. వాళ్లు తాము కట్టుకున్న పర్ణశాలల్లో నివసించారు. నూను కుమారుడైన యెహోషువా కాలంనుంచి ఆనాటిదాకా ఇశ్రాయేలీయులు పర్ణశాలల పండుగను ఇంత చక్కగా జరుపుకోలేదు. అందరూ ఎంతో సంతోషించారు!

18 ఆ పండుగ ప్రతి రోజూ, మొదటి రోజునుంచి చివరి రోజు వరకు ఎజ్రా వాళ్లకి ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి వినిపించాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ పండగను వారం రోజులపాటు జరుపుకున్నారు. అటు తర్వాత ఎనిమిదో రోజున, ధర్మ శాస్త్రం నిర్దేశించినట్టు ఒక ప్రత్యేక సమావేశం కోసం ఒక చోట కూడారు.

ప్రకటన 18:21-24

21 అప్పుడు ఒక శక్తివంతుడైన దూత తిరుగటిరాయి వంటి పెద్దరాయిని ఎత్తి సముద్రంలో పారవేసి ఈ విధంగా అన్నాడు:

“గొప్ప శక్తితో బాబిలోను మహానగరం క్రిందికి పారవేయబడుతుంది.
    అది మళ్ళీ కనిపించదు.
22 వీణను వాయించేవాళ్ళ సంగీతం, యితర వాయిద్యాలు వాయించేవాళ్ళ సంగీతం, పిల్లనగ్రోవి ఊదేవాళ్ళ సంగీతం, బూర ఊదేవాళ్ళ సంగీతం, నీలో మళ్ళీ వినిపించదు.
పని చేయగలవాడు నీలో మళ్ళీ కనిపించడు.
తిరుగటి రాయి శబ్దం మళ్ళీ నీలో వినిపించదు.
23 దీపపు కాంతి నీలో మళ్ళీ ప్రకాశించదు.
కొత్త దంపతుల మాటలు నీలో మళ్ళీ వినిపించవు.
నీ వర్తకులు ప్రపంచంలో గొప్పగా ఉన్నారు.
నీ గారడీలతో దేశాలు తప్పుదారి పట్టాయి.
24 ఆ పట్టణంలో ప్రవక్తల రక్తం, పవిత్రుల రక్తం కనిపించింది.
    ప్రపంచంలో వధింపబడిన వాళ్ళందరి రక్తం, ఆ పట్టణంలో కనిపించింది.”

మత్తయి 15:29-39

యేసు అనేకులను నయం చేయటం

29 యేసు అక్కడి నుండి బయలుదేరి, గలిలయ సరస్సు తీరము మీదుగా నడిచి కొండ మీదికి వెళ్ళి కూర్చున్నాడు.

30 ప్రజలు గుంపులు గుంపులుగా అక్కడికి వచ్చారు. వాళ్ళు తమ వెంట కుంటి వాళ్ళను, గ్రుడ్డి వాళ్ళను, కాళ్ళు చేతులు పడి పోయిన వాళ్ళను, మూగ వాళ్ళను యింకా అనేక రకాల రోగాలున్న వాళ్ళను తీసికొని వచ్చి ఆయన కాళ్ళ ముందు పడ వేసారు. ఆయన వాళ్ళకు నయం చేసాడు. 31 మూగ వాళ్ళకు మాట వచ్చింది. కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళకు నయమైపోయింది. కుంటి వాళ్ళు నడిచారు. గ్రుడ్డి వాళ్ళకు చూపు వచ్చింది. ఇవన్నీ జరగటం చూసి ప్రజలు ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుణ్ణి స్తుతించారు.

యేసు నాలుగువేల మందికి పైగా భోజనం పెట్టటం

(మార్కు 8:1-10)

32 యేసు తన శిష్యుల్ని పిలిచి వాళ్ళతో, “వీళ్ళపట్ల నాకు చాలా జాలి వేస్తోంది. వాళ్ళు మూడు రోజులనుండి నా దగ్గరే ఉన్నారు. వాళ్ళ దగ్గర తినటానికి ఏమీ లేదు. వాళ్ళను ఆకలితో పంపటం నాకిష్టం లేదు. అలా పంపివేస్తే వాళ్ళు దారిలో మూర్ఛ పడిపోతారు” అని అన్నాడు.

33 ఆయన శిష్యులు సమాధానంగా, “ఈ మారు మూల ప్రాంతంలో అందరికి సరిపోయె రొట్టెలు ఎక్కడ దొరుకుతాయి?” అని అన్నారు.

34 “మీ దగ్గర ఎన్ని రొట్టెలున్నాయి?” యేసు అడిగాడు.

“ఏడు రొట్టెలు, కొన్ని చేపలు ఉన్నాయి” అని వాళ్ళు సమాధానం చెప్పారు.

35 యేసు ప్రజల్ని కూర్చోమన్నాడు. 36 ఆ తర్వాత ఆ ఏడు రొట్టెల్ని, చేపల్ని తీసుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పి వాటిని విరిచి శిష్యులకు యిచ్చాడు. శిష్యులు వాటిని ప్రజలకు పంచి పెట్టారు. 37 అందరూ సంతృప్తిగా తిన్నారు. ఆ తర్వాత శిష్యులు మిగిలిన ముక్కల్ని ఏడు గంపల నిండా నింపారు. 38 స్త్రీలు, చిన్న పిల్లలు కాక నాలుగు వేలమంది పురుషులు ఆ రోజు అక్కడ భోజనం చేసారు. 39 యేసు ప్రజల్ని పంపేసాక పడవనెక్కి మగదాను ప్రాంతానికి వెళ్ళాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International