Book of Common Prayer
సంగీత నాయకునికి: “ఒప్పందం పుష్పాలు” రాగం. ఆసాపు స్తుతి కీర్తన.
80 ఇశ్రాయేలీయుల కాపరీ, నా మాట వినుము.
యోసేపు గొర్రెలను (ప్రజలను) నీవు నడిపించుము.
కెరూబులపై నీవు రాజుగా కూర్చున్నావు. ప్రకాశించుము.
2 ఇశ్రాయేలీయుల కాపరీ, ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షేలకు నీ మహాత్యం చూపించుము.
వచ్చి మమ్మల్ని రక్షించుము.
3 దేవా, మరల మమ్మల్ని స్వీకరించుము.
మేము రక్షించబడునట్లు నీ ముఖాన్ని మా మీద ప్రకాశింపచేయుము.
4 సర్వశక్తిగల యెహోవా దేవా, నీవు మా మీద ఎప్పటికి కోపంగానే ఉంటావా?
మా ప్రార్థనలు నీవు ఎప్పుడు వింటావు?
5 నీవు నీ ప్రజలకు కన్నీళ్లే ఆహారంగా ఇచ్చావు.
నీ ప్రజల కన్నీళ్లతో నిండిన పాత్రలే నీవు నీ ప్రజలకు ఇచ్చావు. అవే వారు తాగుటకు నీళ్లు.
6 మా పొరుగువారు పోరాడుటకు నీవు మమ్మల్ని హేతువుగా ఉండనిచ్చావు.
మా శత్రువులు మమ్మల్ని చూచి నవ్వుచున్నారు.
7 సర్వశక్తిమంతుడవైన దేవా, మరల మమ్మల్ని అంగీకరించుము.
నీ ముఖము మామీద ప్రకాశించునట్లు మమ్మల్ని రక్షించుము.
8 గతకాలంలో నీవు మమ్మల్ని ప్రాముఖ్యమైన మొక్కలా చూశావు.
ఈజిప్టు నుండి నీవు నీ “ద్రాక్షాలత” తీసుకొని వచ్చావు.
ఇతర ప్రజలను ఈ దేశం నుండి నీవు వెళ్లగొట్టావు.
నీ “ద్రాక్షావల్లిని” నీవు నాటుకొన్నావు.
9 “ద్రాక్షావల్లి” ఎదుగుటకు నేలను నీవు సిద్ధం చేశావు.
దాని వేర్లు బలంగా ఎదుగుటకు నీవు సహాయం చేశావు త్వరలోనే “ద్రాక్షావల్లి” దేశం అంతా వ్యాపించింది.
10 అది పర్వతాలను కప్పివేసింది.
దాని ఆకులు మహాదేవదారు వృక్షాలను సహా కప్పివేసాయి.
11 దాని తీగెలు మధ్యధరా సముద్రం వరకు విస్తరించాయి. దాని కొమ్మలు యూఫ్రటీసు నది వరకూ విస్తరించాయి.
12 దేవా, నీ “ద్రాక్షావల్లిని” కాపాడుతున్న గోడను నీవెందుకు పడగొట్టావు?
ఇప్పుడు దారిన పోయే ప్రతిమనిషీ దాని ద్రాక్షాపండ్లను కోసుకొంటున్నాడు.
13 అడవి పందులు వచ్చి నీ “ద్రాక్షావల్లి” మీద నడుస్తాయి.
అడవి మృగాలు వచ్చి ఆకులు తింటాయి.
14 సర్వశక్తిగల దేవా, తిరిగి రమ్ము.
పరలోకం నుండి నీ “ద్రాక్షావల్లిని” చూడుము. దానిని కాపాడుము.
15 దేవా, నీ స్వంత చేతులతో నీవు నాటుకొన్న నీ “ద్రాక్షావల్లిని” చూడుము.
నీవు పెంచిన ఆ లేత మొక్కలను[a] చూడుము.
16 అగ్నితో నీ “ద్రాక్షావల్లి” కాల్చివేయబడింది.
నీవు దానిమీద కోపగించి నీవు దాన్ని నాశనం చేశావు.
17 దేవా, నీ కుడి ప్రక్క నిలిచి ఉన్న నీ కుమారుని ఆదుకొనుము.
నీవు పెంచిన నీ కుమారుని ఆదుకొనుము.
18 అతడు మరల నిన్ను విడువడు.
అతన్ని బ్రదుక నీయుము. అతడు నీ నామాన్ని ఆరాధిస్తాడు.
19 సర్వశక్తిమంతుడవైన యెహోవా, దేవా, తిరిగి మా దగ్గరకు రమ్ము.
నీ ముఖ మహిమను మామీద ప్రకాశించనీయుము. మమ్మల్ని రక్షించుము.
సంగీత నాయకునికి: యెదూతూను రాగం. ఆసాపు కీర్తన.
77 సహాయం కోసం నేను దేవునికి గట్టిగా మొరపెడతాను.
దేవా, నేను నిన్ను ప్రార్థిస్తాను. నా ప్రార్థన వినుము.
2 నా దేవా, నాకు కష్టం వచ్చినప్పుడు నేను నీ దగ్గరకు వస్తాను.
రాత్రి అంతా నీకోసం నా చేయి చాపి ఉన్నాను.
నా ఆత్మ ఆదరణ పొందుటకు నిరాకరించింది.
3 నేను దేవుని గూర్చి తలుస్తాను. నేనాయనతో మాట్లాడుటకు,
నాకు ఎలా అనిపిస్తుందో ఆయనతో చెప్పుటకు ప్రయత్నిస్తాను. కాని నేనలా చేయలేను.
4 నీవు నన్ను నిద్రపోనియ్యవు.
నేనేదో చెప్పాలని ప్రయత్నించాను. కాని నేను చాలా కలవరపడి పోయాను.
5 గతాన్ని గూర్చి నేను తలపోస్తూ ఉండిపోయాను.
చాలా కాలం క్రిందట సంభవించిన సంగతులను గూర్చి నేను ఆలోచిస్తూ ఉండిపోయాను.
6 రాత్రివేళ నా పాటలను గూర్చి ఆలోచించుటకు నేను ప్రయత్నిస్తాను.
నాలో నేను మాట్లాడుకొని గ్రహించుటకు ప్రయత్నిస్తాను.
7 “మా ప్రభువు మమ్మల్ని శాశ్వతంగా విడిచి పెట్టేశాడా?
ఆయన ఎన్నడైనా తిరిగి మమ్మల్ని కోరుకొంటాడా?
8 దేవుని ప్రేమ శాశ్వతంగా పోయిందా?
ఆయన మరల ఎన్నడైనా మాతో మాట్లాడుతాడా?
9 కనికరం అంటే ఏమిటో దేవుడు మరచి పోయాడా?
ఆయన జాలి కోపంగా మార్చబడిందా” అని నాకు అనిపిస్తుంది.
10 అప్పుడు నేను, “సర్వోన్నతుడైన దేవుడు తన శక్తిని పోగొట్టుకున్నాడా?
అనే విషయం నిజంగా నన్ను బాధిస్తుంది” అని తలచాను.
11 యెహోవా చేసిన శక్తిగల కార్యాలు నేను జ్ఞాపకం చేసుకొంటాను.
దేవా, చాలా కాలం క్రిందట నీవు చేసిన అద్భుత కార్యాలు నేను జ్ఞాపకం చేసుకొంటాను.
12 నీవు చేసిన సంగతులన్నింటిని గూర్చి నేను ఆలోచించాను.
ఆ విషయాలను గూర్చి నేను మాట్లాడాను.
13 దేవా, నీ మార్గాలు పవిత్రం.
దేవా, ఏ ఒక్కరూ నీ అంతటి గొప్పవారు కాలేరు.
14 నీవు అద్భుత కార్యాలు చేసిన దేవుడివి.
నీవు నీ మహా శక్తిని ప్రజలకు చూపెట్టావు.
15 నీవు నీ శక్తిని బట్టి నీ ప్రజలను రక్షించావు.
యాకోబు, యోసేపు సంతతివారిని నీవు రక్షించావు.
16 దేవా, నీళ్లు నిన్ను చూచి భయపడ్డాయి.
లోతైన జలాలు భయంతో కంపించాయి.
17 దట్టమైన మేఘాలు వాటి నీళ్లను కురిపించాయి.
ఎత్తైన మేఘాలలో పెద్ద ఉరుములు వినబడ్డాయి.
అప్పుడు నీ మెరుపు బాణాలు ఆ మేఘాలలో ప్రజ్వరిల్లాయి.
18 పెద్ద ఉరుముల శబ్దాలు కలిగాయి.
మెరుపు ప్రపంచాన్ని వెలిగించింది.
భూమి కంపించి వణికింది.
19 దేవా, నీవు లోతైన జలాలలో నడుస్తావు. లోతైన సముద్రాన్ని నీవు దాటి వెళ్లావు.
కాని నీ అడుగుల ముద్రలు ఏవీ నీవు ఉంచలేదు.
20 అదే విధంగా నీ ప్రజలను గొర్రెల వలె నడిపించేందుకు
మోషేను, అహరోనును నీవు వాడుకొన్నావు.
ఆసాపు స్తుతి కీర్తన.
79 దేవా, కొందరు మనుష్యులు నీ ప్రజలతో యుద్ధం చేసేందుకు వచ్చారు.
ఆ మనుష్యులు నీ పవిత్ర ఆలయాన్ని అపవిత్రపరచి నాశనం చేసారు.
యెరూషలేమును వారు శిథిలాలుగా విడిచి పెట్టారు.
2 అడవి పక్షులు తినేందుకుగాను నీ సేవకుల దేహాలను శత్రువు విడిచిపెట్టాడు.
అడవి మృగాలు తినేందుకు నీ అనుచరుల దేహాలను వారు విడిచిపెట్టారు.
3 దేవా, నీ ప్రజల రక్తం నీళ్లలా యెరూషలేమంతటి చుట్టూ ప్రవహించేంతవరకు శత్రువు వారిని చంపాడు.
మృత దేహాలను పాతి పెట్టేందుకు ఏ ఒక్కరూ విడువబడ లేదు.
4 మా పొరుగు రాజ్యాలు మమ్మల్ని అవమానించాయి.
మా చుట్టూరా ఉన్న ప్రజలంతా మమ్మల్ని చూచి నవ్వుతూ, ఎగతాళి చేస్తున్నారు.
5 దేవా, నీవు మా మీద ఎప్పటికీ కోపంగానే ఉంటావా?
బలమైన నీ భావాలు అగ్నిలా మండుతూనే ఉంటాయా?
6 దేవా, నిన్ను ఎరుగని రాజ్యాల మీదికి నీ కోపాన్ని మరల్చుము.
నీ నామాన్ని ఆరాధించని రాజ్యాల మీదికి నీ కోపాన్ని మరల్చుము.
7 ఎందుకంటే ఆ రాజ్యాలు యాకోబును నాశనం చేశాయి.
వారు యాకోబు దేశాన్ని నాశనం చేశారు.
8 దేవా, మా పూర్వీకుల పాపాలకోసం దయచేసి మమ్మల్ని శిక్షించకుము.
త్వరపడి. నీ దయ మాకు చూపించుము.
నీవు మాకు ఎంతో అవసరం.
9 మా దేవా! రక్షకా, మాకు సహాయం చేయుము.
నీ స్వంత నామానికి మహిమ తెచ్చునట్లుగా మాకు సహాయం చేయుము.
మమ్మల్ని రక్షించుము.
నీ నామ క్షేమం కోసం మా పాపాలు తుడిచివేయుము.
10 “మీ దేవుడు ఎక్కడ? ఆయన మీకు సహాయం చేయలేడా?”
అని ఇతర రాజ్యాలవారు మాతో అననీయకు.
దేవా, మేము చూడగలుగునట్లుగా ఆ ప్రజలను శిక్షించుము.
నీ సేవకులను చంపినందుకు వారిని శిక్షించుము.
11 దయచేసి, ఖైదీల మూల్గులు వినుము!
దేవా, మరణించుటకు ఏర్పరచబడిన ఈ ప్రజలను నీ మహా శక్తివలన రక్షించుము.
12 దేవా, మా చుట్టూరా ఉన్న ప్రజలు మాకు చేసిన వాటిని బట్టి ఏడు మార్లు వారిని శిక్షించుము.
ఆ ప్రజలు నిన్ను అవమానించిన సమయాలనుబట్టి వారిని శిక్షించుము.
13 మేము నీ ప్రజలం, మేము నీ మందలోని గొర్రెలం.
మేము శాశ్వతంగా నిన్ను స్తుతిస్తాము.
దేవా, శాశ్వతంగా, సదాకాలం మేము నిన్ను స్తుతిస్తాము.
ఇశ్రాయేలీయులు తమ పాపాలను ఒప్పుకొనటం
9 తర్వాత అదే నెల 24 వ రోజున, ఇశ్రాయేలీయులు ఒక చోట చేరి సామూహిక ఉపవాసం చేశారు. వాళ్లు విచార సూచకమైన దుస్తులు ధరించారు. (తమ విచారాన్ని చూపేందుకు గాను) నెత్తిన బూడిద పోసుకున్నారు. 2 నిజంగా ఇశ్రాయేలీయులైన వాళ్లు అన్య జనులనుంచి వేరుపడి, ఆలయంలో నిలబడి, తమ పాపాలనూ, తమ పూర్వీకుల పాపాలనూ ఒప్పుకొన్నారు. 3 వాళ్లక్కడ సుమారు మూడు గంటలసేపు నిలబడ్డారు, తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రాన్ని చదివారు, తర్వాత మరో మూడు గంటలు తమ పాపాలు ఒప్పుకొని, యెహోవా ముంగిట సాగిల పడ్డారు.
4 అటు తర్వాత, ఈ క్రింది లేవీయులు మెట్లపైన నిలబడ్డారు: యేషూవా, బానీ, కద్మీయేలు, షెబన్యా, బున్నీ, షేరేబ్యా, బానీ, కెనానీ. వాళ్లు ఉచ్చ స్వరాల్లో యెహోవాను పిలిచారు. 5 తర్వాత ఈ లేవీయులు మళ్వీ ప్రసంగించారు: యేషువా, బానీ, కద్మీయేలు, హషబ్నెయా, షెరేబ్యా, హోదీయా, షబన్యా, పెతహాయా, వాళ్లు, “లేచి నిలబడి, ప్రభువైన దేవుణ్ణి స్తుతించండి” అని చెప్పారు.
“దేవుడు ఎల్లప్పుడు ఉండును. ఆయన ఎల్లప్పుడూ జీవించును!
నీ ఘననామం స్తుతించబడాలి.
నీ ఘనమైన నామం సకలాశీర్వచన స్తోత్రాలనూ అధిగమించి పోవాలి!
6 యెహోవా నీవే దేవుడివి!,
యెహోవా ఆకాశం, అత్యున్నత పరలోకాలు,
వాటిలోవున్న సమస్తాన్ని నీవే సృజించావు!
భూమినీ, దానిపైనున్న సమస్తాన్నీ
నీవే సృజించావు!
సముద్రాలను సృజించింది నీవే.
వాటిలో ఉన్న సమస్తాన్నీ సృజించింది నీవే!
ప్రతిదానికీ ప్రాణంపోసింది నీవే,
దేవదూతలు నీకు నమస్కరిస్తారు. నీ సన్నిధియందు సాగిలపడతారు నిన్ను ఆరాధిస్తారు!
7 యెహోవా, నీవే దేవుడివి.
అబ్రామును ఎంచుకున్నది నీవే.
అతన్ని బబులోనులోని ఊరునుంచి నడిపించింది నీవే.
అబ్రాహాముగా అతని పేరు మార్చింది నీవే.
8 అతడు నీకు నమ్మకంగా, విశ్వాసంగా ఉండేలా చూసుకున్నావు.
అతనితో నీవొక ఒడంబడిక చేసుకున్నావు.
అతని సంతతి వారికి వాగ్దానం చేశావు
నీవు కనాను, హిత్తీ, అమోరీ, పెరిజ్జీ, యెబూసీ, గిర్గాషి జాతుల దేశాన్ని ఇస్తానన్న.
నీ మాటను నీవు నిలుపుకున్నావు!
నీవు నిజాయితీగలవాడవు, మాట నిలుపుకున్నావు!
9 మా పూర్వీకులు ఈజిప్టులో బాధలు పడటం చూశావు!
సహాయార్థం ఎర్ర సముద్ర తీరాన వారి మొరలు ఆలకించావు.
10 నీవు ఫరోకి అద్భుతాలు ప్రదర్శించావు
అతని ఉద్యోగులకీ, ప్రజలకీ దిగ్ర్భాంతికరమైన పనులు చేసి చూపావు.
మా పూర్వీకుల కంటె తాము గొప్ప అని
ఈజిప్టీయులు అనుకోవడం నీకు తెలుసు.
అయితే నీవు, నీ వెంత గొప్పవాడివో నిరూపించుకొన్నావు!
ఈనాటికీ అది వాళ్లు జ్ఞాపకం ఉంచుకొంటారు.
11 నీవు వాళ్ల కళ్ల ముందు ఎర్ర సముద్రాన్ని విభాగించావు.
వాళ్లు పొడినేల మీద నడిచి పోయారు!
ఈజిప్టు సైనికులు వాళ్లని తరుముతున్నారు కాని, నీవు ఆ శత్రువుని సముద్రంలో ముంచేశావు.
మరి వాళ్లు ఒక రాయిలా నీటిలో మునిగారు.
12 పగటి పూట మేఘస్థంభంలో వుండి వాళ్లని నడిపించావు,
రాత్రివేళ దీపస్ధంభంలో వుండి వాళ్లని నడిపించావు,
ఆ విధంగా నీవు వారి మార్గాన్ని వెలిగించితివి.
వాళ్లు చేరవలసిన గమ్యాన్ని చూపావు.
13 అప్పుడిక సీనాయి పర్వతం మీదికి దిగి
ఆకాశంనుంచి వాళ్లతో మాట్లాడాపు.
వాళ్లకి చక్కటి. ధర్మనియమాలిచ్చావు.
వాళ్లకి సదుపదేశాలిచ్చావు.
మంచి ఆజ్ఞలిచ్చావు, చక్కటి ఆదేశాలిచ్చావు!
14 నీ ప్రత్యేక విశ్రాంతి దినమైన సబ్బాతుని గురించి వాళ్లకి చెప్పావు.
వాళ్లకి ఆజ్ఞలు, చట్టాలు, ఉపదేశాలు ఇచ్చేందుకు నీ సేవకుడు మోషేని వినియోగించావు.
15 వాళ్లు ఆకలిగొన్నప్పుడు
వాళ్లకి నీవు ఆకాశంనుంచి తిండినిచ్చావు.
వాళ్లు దప్పి గొన్నప్పుడు
వాళ్లకి నీవు బండ నుంచి మంచి నీళ్లిచ్చావు.
వాళ్లకి చెప్పావు,
‘రండి, ఈ భూమి తీసుకోండని’
నీవు నీ శక్తిని వినియోగించి
వారికోసం ఆ భూమిని తీసుకున్నావు!
16 కాని వాళ్లు, మా పూర్వీకులు గర్వపడి కన్ను గానక ప్రవర్తించారు.
వాళ్లు మొండి వారై నీ ఆజ్ఞలు పాటించక నిరాకరించారు.
17 వాళ్లు నీ మాటలు తిరస్కరించారు.
వాళ్లకు నీవు చేసిన ఆశ్చర్యకారాలను అద్భుతాలను మరిచారు.
వాళ్లు మొండివారై ఎదురు తిరిగినప్పుడు,
వాళ్లు మళ్లీ వెనుకకు తిరిగి బానిసలయ్యారు.
“నీవు క్షమాశీలివి!
నీవు దయామయుడివి. కరుణామయుడివి.
నీవు ఓర్పుగలవాడివి. ప్రేమామయుడవు.
అందుకే నీవు వాళ్లను విడువలేదు.
18 వాళ్లు లేగ దూడల బంగారు బొమ్మలు చేసి, ‘మమ్మల్ని ఈజిప్టు నుంచి వెలికి తెచ్చిన దేవుళ్ళు వీరే’
అన్నా నీవు వాళ్లని వదిలేయలేదు!
19 నీవెంతో దయామయుడివి!
అందుకే వాళ్లని ఎడారిలో వదిలేయలేదు.
పగటివేళ మేఘస్థంభాన్ని
వాళ్లనుంచి తప్పించలేదు.
వాళ్లని నడిపిస్తూనే వచ్చావు.
రాత్రివేళ దీపస్తంభాన్ని
వాళ్ల దృష్టినుంచి తొలగించ లేదు.
వాళ్ల బాటకి వెలుగు చూపుతూనే వచ్చి
వాళ్లకి మార్గదర్శనం చేస్తూనే వచ్చావు.
20 వాళ్లని వివేకవంతుల్ని చేసేందుకు నీవు వారికి నీ మంచి ఆత్మను ఇచ్చావు.
వాళ్లకి ఆహారంగా మన్నానిచ్చావు.
వాళ్ల దప్పిక తీర్చేందుకు మంచి నీరిచ్చావు.
21 నీవు వాళ్లని నలుబదియేండ్లు పోషించావు!
ఎడారిలో అవసరమైనవన్నీ వాళ్లు పొందారు.
వాళ్ల దుస్తులు చిరిగి పోలేదు.
వాళ్ల పాదాలు వాయలేదు, గాయపడలేదు.
22 యెహోవా, నీవు వాళ్లకి రాజ్యాలిచ్చావు, దేశాలిచ్చావు,
జనాభా పలచగావున్న సుదూర ప్రాంతాలనిచ్చావు.
హెష్బోను రాజైన సీహోను దేశాన్నీ,
బాషాను రాజైన ఓగు దేశాన్నీ పొందారు వాళ్లు.
23 యెహోవా నీవు వాళ్ల సంతతివారిని విస్తరింప చేసావు.
వాళ్లు ఆకాశంలోని నక్షత్రాలంత మంది ఉండిరి.
వాళ్ల పూర్వీకులకి నీవివ్వ జూపిన దేశానికి
నీవు వాళ్లని తీసుకొచ్చావు.
వాళ్లు ఆ భూమిలో ప్రవేశించి, దాన్ని స్వాధీన పరుచుకున్నారు.
24 ఆ బిడ్డలు ఆ భూమిని వశపరచుకున్నారు.
అక్కడ నివసిస్తున్న కనానీయుల్ని వాళ్లు ఓడించారు.
ఆ ప్రజలను వాళ్లోడించేటట్టు నీవు చేశావు!
ఆ దేశ ప్రజలను, రాజులను
నీ ప్రజలేమి చేయదలచుకుంటే, అది చేయనిచ్చావు!
25 వాళ్లు బలీయమైన నగరాలను ఓడించారు.
సారవంతమైన భూమిని కైవసం చేసుకున్నారు.
మంచి వస్తువులతో నిండిన ఇళ్లూ,
అంతకు ముందే తవ్విన బావులూ వాళ్లకి చిక్కాయి.
వాళ్లకి ద్రాక్షాతోటలు, ఒలీవ చెట్లు, ఎన్నెన్నో రకాల ఫలవృక్షాలు చిక్కాయి.
వాళ్లు కడువునిండ తిని, కొవ్వెక్కారు.
వాళ్లకి నీవిచ్చిన ఎన్నెన్నో వింత వస్తుపులు వాళ్లు తనివితీరా అనుభవించారు.
బాబిలోను పతనము
18 ఇది జరిగిన తర్వాత పరలోకం నుండి మరొక దూత దిగి రావటం చూసాను. అతని తేజస్సు భూమిని ప్రకాశింప చేసింది. 2 అతడు బిగ్గరగా యిలా అన్నాడు:
“బాబిలోను మహానగరం
కూలిపోయింది, కూలిపోయింది.
అది అక్కడ దయ్యాలకు నివాసమైంది.
ప్రతి దురాత్మకు అది తిరుగులాడు స్థలమైంది.
ప్రతి ఏవగింపు కలిగించే అపవిత్రమైన పక్షికి
అది సంచరించు స్థలమైంది.
3 దేశాలన్నీ దాని వ్యభిచారమనే మద్యాన్ని త్రాగాయి.
దేవుని ఆగ్రహమనే మద్యాన్ని త్రాగి మత్తెక్కి పోయాయి.
భూరాజులు దాంతో వ్యభిచరించారు. ప్రపంచంలోని వర్తకులు, దాని మితి మీరిన విలాసాలతో ధనవంతులయ్యారు.”
4 ఆ తదుపరి ఇంకొక స్వరం పరలోకంలో నుండి ఈ విధంగా అనటం విన్నాను:
“నా ప్రజలారా! దానిలో నుండి బయటకు రండి.
ఎందుకంటే దాని పాపాల్లో మీరు పాలుపంచుకోరు.
అప్పుడు దానికున్న తెగుళ్ళు మీకు రావు.
5 దాని పాపాలు ఆకాశం అంత ఎత్తుగా పేరుకుపోయాయి.
దేవునికి దాని నేరాలు జ్ఞాపకం ఉన్నాయి.
6 అది యిచ్చింది తిరిగి దానికే యివ్వండి.
అది చేసిన దానికి రెండింతలు దానికి చెల్లించండి.
దాని పాత్రలో రెండింతలు ఘాటుగా ఉన్న మద్యాన్ని పొయ్యండి.
7 ఆ పట్టణం అనుభవించిన పేరు ప్రతిష్ఠలకు సమానంగా
అది అనుభవించిన సుఖాలకు సమానంగా దానికి దుఃఖాలు కలిగించి హింసించండి.
అది తన మనస్సులో, ‘నేను రాణిలా సింహాసనంపై కూర్చుంటాను.
నేను ఎన్నటికీ వితంతువును కాను.
నేను ఎన్నటికీ దుఃఖించను’ అని తనలో గర్విస్తుంది.
8 అందువల్ల చావు, దుఃఖము, కరువు,
తెగులు ఒకేరోజు వచ్చి దాన్ని బాధిస్తాయి.
దానిపై తీర్పు చెప్పే మన ప్రభువైన దేవుడు శక్తివంతుడు
కనుక దాన్ని మంటల్లో కాల్చి వేస్తాడు.
దేవుని ప్రేమ మరియు మానవ సాంప్రదాయం
(మార్కు 7:1-23)
15 కొందరు పరిసయ్యులు, శాస్త్రులు యెరూషలేము నుండి వచ్చి, 2 “మీ శిష్యులు భోజనానికి ముందు చేతులెందుకు కడుక్కోరు? పెద్దలు నియమించిన ఆచారాల్ని వాళ్ళెందుకు ఉల్లంఘిస్తున్నారు?” అని అడిగారు.
3 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “మీ ఆచారాల కోసం దేవుని ఆజ్ఞల్ని ఎందుకుల్లంఘిస్తున్నారు? 4 దేవుడు ‘తల్లి తండ్రుల్ని గౌరవించు’ అని అన్నాడు. అంతేకాక ‘తల్లి తండ్రుల్ని దూషించిన వానికి మరణ దండన వేయవలెను!’ అని కూడా చెప్పాడు. 5-6 కాని మీరు ఒక వ్యక్తి తన తల్లి తండ్రులతో ‘మీ అవసరాలకివ్వాలనుకొన్న ధనం దేవునికి ముడుపు కట్టాను’ అని అన్నవాడు, తల్లి తండ్రుల్ని గౌరవించనవసరం లేదని అంటున్నారు. అంటే మీరు మీ ఆచారం కోసం దేవుని మాటను కాదంటున్నారన్న మాట. 7 మీరు మోసగాళ్ళు. యెషయా మిమ్మల్ని గురించి సరిగ్గా ముందే చెప్పాడు. అతడు,
8 ‘ఈ ప్రజలు నన్ను పెదాలతో గౌరవిస్తారు.
కాని వాళ్ళ హృదయాలు నాకు దూరంగా ఉంటాయి.
9 వాళ్ళ ఆరాధనలు వ్యర్థం!
వాళ్ళ బోధనలు మానవులు సృష్టించిన ఆజ్ఞలతో సమానం,’”(A)
అని అన్నాడు.
10 యేసు ప్రజల్ని తన దగ్గరకు రమ్మని పిలిచి వాళ్ళతో, “విని అర్థం చేసుకోండి. 11 మానవుని నోటిలోనికి వెళ్ళేదేదీ అతణ్ణి అపవిత్రం చెయ్యదు. అతని నోటినుండి వచ్చే మాటలు అతణ్ణి అపవిత్రం చేస్తాయి” అని అన్నాడు.
12 ఆ తర్వాత ఆయన శిష్యులు వచ్చి, “మీరన్నది విని పరిసయ్యులు కోపగించుకొన్నారని మీకు తెలుసా?” అని అడిగారు.
13 యేసు సమాధానంగా, “పరలోకంలో ఉన్న నా తండ్రి నాటని ప్రతి మొక్క వేర్లతో పెరికి వేయబడుతుంది. 14 వాళ్ళ విషయాన్ని వదిలెయ్యండి. వాళ్ళు గ్రుడ్డివాళ్ళు. కాని వారు ఇతరులకు దారి చూపుతూ ఉంటారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపితే యిద్దరూ గోతిలో పడ్తారు” అని అన్నాడు.
15 పేతురు, “ఆ ఉపమానాన్ని మాకు విడమరచి చెప్పండి” అని అడిగాడు.
16 యేసు, “మీక్కూడా అర్థంకాలేదా? 17 నోట్లోకి వెళ్ళినవి కడుపులోకి వెళ్ళి తదుపరి శరీరం నుండి బయటకు వెళ్తున్నాయని మీకు తెలియదా? 18 కాని నోటినుండి బయటకు వచ్చే మాటలు హృదయం నుండి వస్తాయి. మనిషిని అపవిత్రం చేసేవి ఇవే. 19 ఎందుకంటే, దురాలోచన, హత్య, లైంగిక అవినీతి, వ్యభిచారం, దొంగతనము, తప్పుడు సాక్ష్యము, అపనింద, మానవుని హృదయం నుండి వస్తాయి. 20 వీటి కారణంగా మానవుడు అపవిత్రమౌతున్నాడు. చేతులు కడుక్కోకుండా భోజనం చేసినంత మాత్రాన అపవిత్రం కాడు” అని అన్నాడు.
© 1997 Bible League International