Book of Common Prayer
సంగీత నాయకునికి: “నాశనం చేయకు” రాగం. ఆసాపు స్తుతి కీర్తన.
75 దేవా, మేము నిన్ను స్తుతిస్తున్నాము.
మేము నీ నామాన్ని స్తుతిస్తున్నాము.
నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి మేము చెబుతున్నాము.
2 దేవుడు ఇలా చెబుతున్నాడు; “తీర్పు సమయాన్ని నేను నిర్ణయిస్తాను.
న్యాయంగా నేను తీర్పు తీరుస్తాను.
3 భూమి, దాని మీద ఉన్న సమస్తం కంపిస్తూ ఉన్నప్పుడు
దాని పునాది స్తంభాలను స్థిర పరచేవాడను నేనే.”
4-5 “కొందరు మనుష్యులు చాలా గర్విష్ఠులు. తాము శక్తిగలవారమని, ప్రముఖులమని తలుస్తారు.
కాని ‘అతిశయ పడవద్దు’ ‘అంతగా గర్వపడవద్దు.’ అని నేను ఆ మనుష్యులతో చెబుతాను.”
6 తూర్పునుండిగాని పడమరనుండిగాని
ఎడారినుండి గాని వచ్చే ఎవరూ ఒక మనిషిని గొప్ప చేయలేరు.
7 దేవుడే న్యాయమూర్తి, ఏ మనిషి ప్రముఖుడో దేవుడే నిర్ణయిస్తాడు.
దేవుడు ఒక వ్యక్తిని ప్రముఖ స్థానానికి హెచ్చిస్తాడు.
ఆయనే మరొక వ్యక్తిని తక్కువ స్థానానికి దించివేస్తాడు.
8 దుర్మార్గులను శిక్షించుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. యెహోవా చేతిలో ఒక పాత్రవుంది.
అది ద్రాక్షారసంలో కలిసిన విషపూరితమైన మూలికలతో నిండివుంది.
ఆయన ఈ ద్రాక్షారసాన్ని (శిక్ష) కుమ్మరిస్తాడు.
దుర్మార్గులు చివరి బొట్టు వరకు దాన్ని తాగుతారు.
9 ఈ సంగతులను గూర్చి నేను ఎల్లప్పుడూ ప్రజలకు చెబుతాను.
ఇశ్రాయేలీయుల దేవునికి నేను స్తుతి పాడుతాను.
10 దుర్మార్గుల నుండి శక్తిని నేను తీసివేస్తాను.
మంచి మనుష్యులకు నేను శక్తినిస్తాను.
సంగీత నాయకునికి: వాయిద్యాలతో. ఆసాపు స్తుతి కీర్తన.
76 యూదాలో ప్రజలు దేవుని ఎరుగుదురు.
దేవుని నామం నిజంగా గొప్పదని ఇశ్రాయేలుకు తెలుసు.
2 దేవుని ఆలయం షాలేములో[a] ఉంది.
దేవుని గృహం సీయోను కొండ మీద ఉంది.
3 అక్కడ విల్లులను, బాణాలను కేడెములను,
కత్తులను ఇతర యుద్ధ ఆయుధాలను దేవుడు విరుగగొట్టాడు.
4 దేవా, నీవు నీ శత్రువులను ఓడించిన ఆ కొండల నుండి
తిరిగి వస్తూండగా నీవు ఎంతో మహిమతో ఉన్నావు.
5 ఆ సైనికులు చాలా బలం కలవారని తలంచారు. కాని యిప్పుడు వారు చచ్చి పొలాల్లో పడి ఉన్నారు.
వారికి ఉన్నదంతా వారి శరీరాల నుండి దోచుకోబడింది.
బలవంతులైన ఆ సైనికులలో ఒక్కరు కూడా వారిని కాపాడుకోలేకపోయారు.
6 యాకోబు దేవుడు ఆ సైనికులను గద్దించాడు.
రథాలు, గుర్రాలుగల ఆ సైన్యం చచ్చిపడింది.
7 దేవా, నీవు భీకరుడవు.
నీవు కోపంగా ఉన్నప్పుడు ఏ మనిషీ నీకు విరోధంగా నిలువలేడు.
8-9 యెహోవా న్యాయమూర్తిగా నిలిచి తన నిర్ణయాన్ని ప్రకటించాడు.
దేశంలోని దీన ప్రజలను దేవుడు రక్షించాడు.
పరలోకం నుండి ఆయన తీర్మానం ఇచ్చాడు.
భూమి అంతా భయంతో నిశ్శబ్దం ఆయ్యింది.
10 దేవా, నీవు దుర్మార్గులను శిక్షించినప్పుడు ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
నీవు నీ కోపం చూపిస్తావు. బ్రతికి ఉన్నవారు మరింత బలంగలవారు అవుతారు.
11 ప్రజలారా! మీ దేవుడైన యెహోవాకు మీరు వాగ్దానాలు చేశారు.
ఇప్పుడు మీరు వాగ్దానం చేసినదాన్ని ఆయనకు ఇవ్వండి.
అన్ని చోట్లనుండీ ప్రజలు
తాము భయపడే దేవునికి కానుకలు తెస్తారు.
12 దేవుడు మహా నాయకులను ఓడిస్తాడు.
భూలోక రాజులందరూ ఆయనకు భయపడుతారు.
దావీదు కీర్తన.
23 యెహోవా నా కాపరి
నాకు కొరత ఉండదు
2 పచ్చటి పచ్చిక బయళ్లలో ఆయన నన్ను పడుకో పెడతాడు.
ప్రశాంతమైన నీళ్లవద్దకు ఆయన నన్ను నడిపిస్తాడు.
3 ఆయన తన నామ ఘనత కోసం నా ఆత్మకు నూతన బలం ప్రసాదిస్తాడు.
ఆయన నిజంగా మంచివాడని చూపించేందుకు ఆయన నన్ను మంచితనపు మార్గాల్లో నడిపిస్తాడు.
4 చివరికి మరణాంధకారపు లోయలో నడిచినప్పుడు కూడా
నేను భయపడను. ఎందుకంటే, యెహోవా, నీవు నాతో ఉన్నావు.
నీ చేతికర్ర, నీ దండం నన్ను ఆదరిస్తాయి కనుక.
5 యెహోవా, నా శత్రువుల ఎదుటనే నీవు నాకు భోజనం సిద్ధం చేశావు.
నూనెతో నా తలను నీవు అభిషేకిస్తావు.
నా పాత్ర నిండి, పొర్లిపోతుంది.
6 నా మిగిలిన జీవితం అంతా మేలు, కరుణ నాతో ఉంటాయి.
మరియు నేను ఎల్లకాలం యెహోవా ఆలయంలో నివసిస్తాను.
దావీదు కీర్తన.
27 యెహోవా, నీవే నా వెలుగు, నా రక్షకుడవు.
నేను ఎవరిని గూర్చి భయపడనక్కర్లేదు.
యెహోవా, నీవే నా జీవిత క్షేమస్థానం.
కనుక నేను ఎవరికి భయపడను.
2 దుర్మార్గులు నా మీద దాడి చేయవచ్చు.
వారు నా శరీరాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించవచ్చు.
వారు నా శత్రువులు, విరోధులు.
వారు కాలు తప్పి పడిపోదురు.
3 అయితే నా చుట్టూరా సైన్యం ఉన్నప్పటికీ నేను భయపడను.
యుద్ధంలో ప్రజలు నామీద విరుచుకు పడ్డప్పటికీ నేను భయపడను. ఎందుకంటే నేను యెహోవాను నమ్ముకొన్నాను.
4 యెహోవా నాకు అనుగ్రహించాలని నేను ఆయనను అడిగేది ఒకే ఒకటి ఉంది.
నేను అడిగేది ఇదే:
“నా జీవిత కాలం అంతా నన్ను యెహోవా ఆలయంలో కూర్చుండనిచ్చుట.
ఆయన రాజ భవనాన్ని నన్ను సందర్శించనిచ్చుట.
యెహోవా సౌందర్యాన్ని నన్ను చూడనిమ్ము.”
5 నేను ఆపదలో ఉన్నప్పుడు యెహోవా నన్ను కాపాడుతాడు.
ఆయన తన గుడారంలో నన్ను దాచిపెడతాడు.
ఆయన తన క్షేమ స్థానానికి నన్ను తీసుకొని వెళ్తాడు.
6 నా శత్రువులు నన్ను చుట్టుముట్టేశారు. కాని ఇప్పుడు వారిని ఓడించటానికి యెహోవా నాకు సహాయం చేస్తాడు.
అప్పుడు నేను ఆయన గుడారంలో బలులు అర్పిస్తాను. సంతోషంతో కేకలు వేస్తూ ఆ బలులు నేను అర్పిస్తాను.
యెహోవాను ఘనపరచుటకు నేను వాద్యం వాయిస్తూ గానం చేస్తాను.
7 యెహోవా, నా స్వరం ఆలకించి నాకు జవాబు ఇమ్ము.
నా మీద దయ చూపించుము.
8 యెహోవా, నా హృదయం నిన్ను గూర్చి మాట్లాడమంటున్నది.
వెళ్లు, నీ యెహోవాను ఆరాధించమంటున్నది అందువల్ల యెహోవా నేను నిన్ను ఆరాధించటానికి వచ్చాను.
9 యెహోవా, నా దగ్గర్నుండి తిరిగిపోకుము.
కోపగించవద్దు, నీ సేవకుని దగ్గర్నుండి తిరిగి వెళ్లిపోవద్దు.
నీవు నాకు సహాయమైయున్నావు, నన్ను త్రోసివేయకుము. నన్ను విడిచిపెట్టవద్దు. నా దేవా, నీవు నా రక్షకుడవు.
10 నా తల్లి, నా తండ్రి నన్ను విడిచిపెట్టారు.
అయితే యెహోవా నన్ను తీసుకొని, తన వానిగా చేసాడు.
11 యెహోవా, నాకు శత్రువులు ఉన్నారు, కనుక నాకు నీ మార్గాలు నేర్పించుము.
సరైన వాటిని చేయటం నాకు నేర్పించుము.
12 నా శత్రువుల కోరికకు నన్నప్పగించవద్దు.
నన్ను గూర్చి వాళ్లు అబద్ధాలు చెప్పారు. నాకు హాని కలిగించేందుకు వాళ్లు అబద్ధాలు చెప్పారు.
13 నేను చనిపోక ముందు యెహోవా మంచితనాన్ని నేను చూస్తానని
నిజంగా నేను నమ్ముచున్నాను.
14 యెహోవా సహాయం కోసం కనిపెట్టి ఉండుము.
బలంగా, ధైర్యంగా ఉండుము.
యెహోవా సహాయం కోసం కనిపెట్టుము.
యూదేతరులతో మిశ్రమ వివాహాలు
9 మేమీ పనులన్నీ ముగించాక ఇశ్రాయేలు నాయకులు నా దగ్గరకు వచ్చి ఇలా చెప్పారు: “ఎజ్రా, ఇశ్రాయేలీయులు తమ చుట్టూ వున్నవారితో తమని తాము వేరుగా నిలుపుకోలేదు. యాజకులు, లేవీయులు సైతం తమ ప్రత్యేకతను కాపాడుకోలేదు. కనాను, హిత్తీ, పెరిజ్జీ, యెబూషీ, అమ్మోను, మెయాబు, ఈజిప్టు అమోరీ జాతులవారు చేసే పాపపు పనులతో ఇశ్రాయేలీయులు చెడుగా ప్రభావితులవుతున్నారు. 2 ఇశ్రాయేలీయులు మన చుట్టూ వున్న ఆయా జాతులవారిని పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇశ్రాయేలీయులు తమ ప్రత్యేకతను నిలుపుకొని వుండవలసింది. కాని. వాళ్లు తమ చుట్టూవున్న ఇతర జాతీయులను పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇశ్రాయేలీయులు నాయకులు, ముఖ్య అధికారులు ఈ విషయంలో చెడ్డ విధానాన్ని అనుసరించారు.” 3 ఈ విషయాలు విన్న నేను నా మనో దుఃఖాన్ని తెలిపేందుకు అంగీని, పైవస్తాన్ని చింపుకున్నాను. నా జుట్టు, గడ్డం పీక్కున్నాను. కలత చెంది దిగ్భ్రాంతుడనై నేను కూర్చుండి పోయాను. 4 అప్పుడు, దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించే ప్రతి ఒక్కడూ భయకంపితుడయ్యాడు. చెరనుంచి తిరిగివచ్చిన ఇశ్రాయేలీయులు దేవుని పట్ల నమ్మక ద్రోహులుగా వ్యవహారించినందుకు వాళ్లందరూ భయపడ్డారు. సాయంత్రపు బలివరకు కలతచెందిన నేను మాటలాడక అక్కడే కూర్చుండిపోయాను. అందరూ నా చుట్టూ మూగారు.
5 సాయంత్రపు బలివేళ అవడంతో, నేను లేచి నిలబడ్డాను. నా అంగీ, పై వస్త్రమూ చీలికలు పేలికలైవున్నాయి. యెహోవా దేవునివైపు చేతులు చాపి ప్రార్థిస్తూ, మోకరిల్లాను. 6 అప్పుడు నేనిలా ప్రార్థించాను:
“ఓ దేవా, ఎక్కువ సిగ్గుచేత, కలవరపాటుచేత నేను నీవైపు ముఖము ఎత్తలేకపోతున్నాను. మా పాపాలు, దోషాలు మా తలల ఎత్తును మీరిపోయి ఆకాశాన్ని అంటుతున్నాయి. 7 మా పూర్వీకుల నాటినుంచి నేటి మా తరందాకా మేము అనేకానేక పాపాలు చేశాము. అందుకే మా రాజులూ, యాజకులూ శిక్షింపబడ్డారు. విదేశాల రాజులు మా పైన దాడి చేసి మా ప్రజలను బందీలుగా తీసుకుపోయారు. ఆ రాజులు మా సంపదను కొల్లగొట్టి, మమ్మల్ని అవమానానికి గురిచేశారు. ఈ నాటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది.
8 “చివరికి ఇప్పుడు, దేవా, నీవు మాపట్ల దయ చూపావు. మాలో కొద్దిమంది చెరనుంచి తప్పించుకొని ఈ పవిత్ర ప్రాంతంలో నివసించడాన్ని సాధ్యంచేశావు. ప్రభువా, నీవు మాకు కొత్త జీవితం, దాస్యములో నుంచి విముక్తి ప్రసాదించావు. 9 మేము బానిసలుగా వున్నమాట నిజమే, కాని, నీవు మమ్మల్మి శాశ్వతంగా బానిసలుగా ఉండనియ్యవు. నీవు మాపట్ల దయ చూపావు. పారసీక ప్రభువులు మాపట్ల దయ చూపేలా నీవు చేశావు. నీ దేవాలయం ధ్వంసం చేయబడింది. కాని, నీవు మాకు నూతన జీవితం ప్రసాదించి, మేము నీ ఆలయాన్ని తిరిగి నిర్మించి, దాన్ని సరికొత్తదానిలా మలచగలిగే అవకాశం మాకు కల్పించావు. దేవా! యూదా, యెరూషలేములకు రక్షణగా ప్రాకారం కట్టేందుకు నీవు మాకు తోడ్పడ్డావు.
10 “ఇప్పుడు దేవా, నీకు మేము చెప్పగలిగింది ఏముంది? మేము మళ్లీ నీ మాట పాటించడం మానేశాం! 11 దేవా, నీవు నీ సేవకులైన నీ ప్రవక్తల ద్వారా ఆ ఆదేశాలను మాకు ఇచ్చావు. నీవు ఇలా అన్నావు, ‘మీరు స్వంతం చేసుకొని, నివసించబోయే ప్రాంతం అపవిత్రమైన భూమి. అక్కడ నివసిస్తూ వచ్చిన మనుష్యులు చేసిన చెడ్డపనుల మూలంగా అది అపవిత్రమైనది. వాళ్లు ఈ దేశంలో అన్నిచోట్లా ఇలాంటి చెడ్డపనులు చాలా చేశారు. వాళ్లు తమ పాపాలతో ఈ దేశాన్ని అపవిత్రం చేశారు. 12 అందుకని, ఇశ్రాయేలీయులారా, మీ బిడ్డలు వారి బిడ్డలను పెళ్లి చేసుకోకుండా చూడండి. మీరు వాళ్లతో కలవకండి! నా ఆదేశాలను పాటించండి, వారితో శాంతి ఒప్పందం చేయకండి. అప్పుడు మీరు శక్తి కలిగి, దేశంలోని మంచి వాటిని ఆనందంగా అనుభవించగలుగుతారు. అప్పుడు మీరు ఈ దేశాన్ని నిలుపుకొని, దాన్ని మీ బిడ్డలకు సంక్రమింప జేయగలుగుతారు.’
13 “మనకి వాటిల్లిన కష్టాలకు మన చెడ్డక్రియలే కారణం. మనం పాపాలు చేశాం, మన దోషాలు అనేకమైనవి. అయితే, ఓ దేవా, నీవు మమ్ముల్ని శిక్షించ వలసినంతగా శిక్షించలేదు. మేము ఘోరమైన పాపాలు ఎన్నో చేశాము. మమ్మల్ని నీవు ఇంకెంతో కఠినంగా శిక్షించియుండవలసింది. మాలో కొందర్ని దాస్యంలో సహితం తప్పించుకోనిచ్చావు. 14 నీ ఆదేశాలను భంగ పరచకూడదని మేము తెలుసుకున్నాము. మేము వాళ్లను పెళ్లి చేసుకోకూడదు. వాళ్లు చేసేవి చాలా చెడ్డ పనులు. దేవా, మేమా చెడ్డవాళ్లతో పెళ్లి కొనసాగించినట్లయితే, నీవు మమ్మల్ని నాశనం చేస్తావని మాకు తెలుసు! అప్పుడిక ఇశ్రాయేలీయుల్లో ఏ ఒక్కడూ ప్రాణాలతో మిగిలివుండడు.
15 “యెహోవా, ఇశ్రాయేలు ప్రజల దేవా, నీవు నీతి మంతుడవై యున్నావు. మాలో కొందర్ని ప్రాణాలతో మిగిల్చావు. మా దోషం కారణంగా, మాలో ఒక్కడుకూడా నీ ముందు నిలిచేందుకు అర్హుడుకాడు.”
మృగముపైనున్న స్త్రీ
17 ఏడు పాత్రలున్న ఏడుగురి దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో ఈ విధంగా అన్నాడు: “అది పేరుగాంచిన వేశ్య. బహు జనముల మీద కూర్చున్న ఆ వేశ్యకు యివ్వబడే శిక్షను నీకు చూపిస్తాను. నా వెంట రా. 2 దానితో భూపతులు వ్యభిచరించారు. ఈ భూమ్మీద నివసించే ప్రజలు అది అందించే వ్యభిచారమనే మద్యంతో మత్తెక్కిపోయారు.”
3 ఆ తర్వాత ఆ దేవదూత నన్ను ఆత్మద్వారా ఒక ఎడారి ప్రాంతానికి తీసుకు వెళ్ళాడు. అక్కడ ఒక స్త్రీ ఎరుపు, ఊదా రంగుగల మృగం మీద కూర్చొని ఉండటం చూసాను. ఆ మృగం మీద దూషణలు వ్రాయబడి ఉన్నాయి. ఆ మృగానికి ఏడు తలలు, పది కొమ్ములు ఉన్నాయి. 4 ఆ స్త్రీ ఊదా, ఎరుపు రంగుగల వస్త్రాల్ని కట్టుకొని ఉంది. బంగారుతో, రత్నాలతో, ముత్యాలతో చేసిన మెరిసే ఆభరణాలను వేసుకొని ఉంది. అది తన చేతిలో ఒక బంగారు పాత్రను పట్టుకొని ఉంది. ఆ పాత్ర అసహ్యమైన వాటితో, అది చేసిన వ్యభిచార కల్మషంతో నిండి ఉంది. 5 ఈ పేరు దాని నుదుటి మీద వ్రాయబడి ఉన్నది:
మర్మము, మహా బాబిలోను
వేశ్యలకు తల్లి!
ప్రపంచంలోని కల్మషాలకు తల్లి!
6 ఆ స్త్రీ భక్తుల రక్తాన్ని త్రాగి, మత్తుగా ఉండటం చూసాను. ఆ రక్తం యేసును గురించి సాక్ష్యం చెప్పిన వాళ్ళది.
నేనా స్త్రీని చూసి ఆశ్చర్యపడ్డాను. 7 అప్పుడు ఆ దేవదూత నాతో ఈ విధంగా అన్నాడు: “నీవెందుకు అంత ఆశ్చర్యపడుతున్నావు? ఆ స్త్రీ యొక్క రహస్యం నీకు చెబుతాను. ఆమె స్వారీ చేసే ఏడుతలల, పది కొమ్ముల మృగాన్ని గురించి చెపుతాను. 8 నీవు చూసిన మృగం ప్రస్తుతం లేదు. ఒకప్పుడు ఉండింది. పాతాళం నుండి లేచి వచ్చి అది నాశనమౌతుంది. ఆ మృగం ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు లేదు. భవిష్యత్తులో వస్తుంది. కనుక ప్రపంచంలో ఉన్నవాళ్ళు ఆ మృగాన్ని చూసి దిగ్ర్భాంతి చెందుతారు. సృష్టి మొదలైనప్పటి నుండి వీళ్ళ పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడలేదు.
9 “దీన్ని అర్థం చేసుకోవటానికి బుద్ధి అవసరం.” ఆ ఏడుతలలు ఆ స్త్రీ కూర్చొన్న ఏడుకొండలు. ఆ ఏడు తలలు ఏడుగురు రాజులతో పోల్చబడ్డాయి. 10 ఐదుగురు పడిపోయారు. ఒకడు ఉన్నాడు. ఇంకొకడు యింకా రాలేదు. అతడొచ్చాక కొద్దికాలం ఉంటాడు. 11 ఒకప్పుడు ఉండి ప్రస్తుతము లేని మృగము ఎనిమిదవ రాజు. అతడు ఏడుగురిలో ఒకడు. అతడు కూడా నాశనమౌతాడు.
12 “నీవు చూసిన ఆ పది కొమ్ములు పదిమంది రాజులు. వాళ్ళకు యింకా రాజ్యము లభించలేదు. కాని వాళ్ళకు రాజులకున్న అధికారము, మృగంతో పాటు ఒక గంట సమయం మాత్రమే లభిస్తుంది. 13 వాళ్ళందరి ఉద్దేశ్యం ఒకటి. దాని కోసం తమ శక్తిని, అధికారాన్ని ఆ మృగానికిచ్చారు. 14 వాళ్ళు గొఱ్ఱెపిల్లతో యుద్ధం చేస్తారు. కాని గొఱ్ఱెపిల్ల ప్రభువులకు ప్రభువు. రాజులకు రాజు. కనుక విజయం పొందుతాడు. ఆయన వెంట ఆయన పిలిచినవాళ్ళు, ఆయన ఎన్నుకొన్నవాళ్ళు, ఆయన్ని విశ్వసించేవాళ్ళు ఉంటారు.”
యేసు నీళ్ళపై నడవటం
(మార్కు 6:45-52; యోహాను 6:16-21)
22 ఆ తర్వాత యేసు తన శిష్యులతో పడవనెక్కి తనకన్నా ముందు అవతలి ఒడ్డుకు వెళ్ళమని చెప్పాడు. తానక్కడే ఉండి ప్రజల్ని ఇళ్ళకు పంపాలని ఆయన ఉద్దేశం. 23 ప్రజల్ని పంపేశాక యేసు ఏకాంతంగా ప్రార్థించటానికి కొండ మీదికి వెళ్ళాడు. సాయంకాలం అయింది. అయినా ఆయనొక్కడే అక్కడ ఉండిపోయాడు. 24 పడవ ఒడ్డుకు చాలా దూరంలో ఉంది. ఎదురు గాలి వీయటం వల్ల అలలు ఆ పడవను కొడ్తూ ఉన్నాయి.
25 రాత్రి నాలుగోఝామున యేసు నీళ్ళ మీద నడుస్తూ శిష్యుల దగ్గరకు వెళ్ళాడు. 26 ఆయన నీళ్ళపై నడవటం చూసి శిష్యులు, “దయ్యం” అంటూ భయంతో పెద్దకేక పెట్టారు.
27 యేసు వెంటనే, “నేనే! ధైర్యంగా ఉండండి! భయపడకండి!” అని అన్నాడు.
28 పేతురు, “ప్రభూ మీరైతే, నీళ్ళ మీద నడుస్తూ నన్ను మీదగ్గరకు రానివ్వండి!” అని అన్నాడు.
29 “రా” అని యేసు అన్నాడు.
అప్పుడు పేతురు పడవ దిగి నీళ్ళ మీద నడుస్తూ యేసు దగ్గరకు వెళ్ళాడు. 30 కాని గాలి వీయటం గమనించి భయపడి నీళ్ళలో మునుగుతూ, “ప్రభూ, నన్ను రక్షించండి!” అని కేక వేశాడు.
31 యేసు వెంటనే తన చేయి జాపి అతణ్ణి పట్టుకొని, “నీలో దృఢవిశ్వాసం లేదు! ఎందుకు సందేహించావు?” అని ప్రశ్నించాడు.
32 వాళ్ళిద్దరూ పడవనెక్కాక గాలి తీవ్రత తగ్గిపోయింది. 33 పడవలోవున్న వాళ్ళు యేసుకు మ్రొక్కుతూ, “మీరు నిజంగా దేవుని కుమారుడు!” అని అన్నారు.
యేసు రోగులనేకులను నయం చేయటం
(మార్కు 6:53-56)
34 వాళ్ళు సరస్సు దాటి గెన్నేసరెతు ఒడ్డును చేరుకున్నారు. 35 ఆ గ్రామం వాళ్ళు యేసును గుర్తించి చుట్టూ ఉన్న ప్రాంతాల వాళ్ళందరికి కబురు పెట్టారు. ప్రజలు రోగాలతో ఉన్న వాళ్ళను ఆయన దగ్గరకు పిలుచుకు వచ్చి. 36 “వాళ్ళను మీ అంగీ అంచునైనా తాకనివ్వండి” అని బ్రతిమిలాడారు. ఆయన్ని తాకిన వాళ్ళకందరికి నయమైపోయింది.
© 1997 Bible League International