Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 69

సంగీత నాయకునికి: “పుష్పాల రాగం.” దావీదు కీర్తన.

69 దేవా, నా కష్టాలన్నిటినుండి నన్ను రక్షించుము.
    నా నోటి వరకు నీళ్లు లేచాయి.
నిలబడి ఉండుటకు ఏదీ లేదు.
    నేను మునిగిపోతున్నాను. క్రింద బురదలోకి దిగజారిపోతున్నాను.
లోతైనజలాల్లో నేనున్నాను.
    అలలు నా చుట్టూ కొట్టుకొంటున్నాయి. నేను మునిగిపోబోతున్నాను.
సహాయం కోసం పిలిచి పిలిచి నేను బలహీనుడనౌతున్నాను.
    నా గొంతు నొప్పిగా ఉంది.
నా కళ్లకు నొప్పి కలిగినంతవరకు
    నేను నీ సహాయం కోసం కనిపెట్టి చూశాను.
నా తలపైగల వెంట్రుకల కంటె ఎక్కువ మంది శత్రువులు నాకున్నారు.
    ఏ కారణం లేకుండానే వారు నన్ను ద్వేషిస్తున్నారు.
    వారు నన్ను నాశనం చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
నా శత్రువులు నన్ను గూర్చి అబద్ధాలు చెబుతున్నారు.
    వారు అబద్ధమాడి నేను వస్తువులు దొంగిలించానని చెప్పారు.
    ఆ తరువాత నేను దొంగిలించని వాటికి నా చేత బలవంతంగా డబ్బు కట్టించారు.
దేవా, నేను ఏ తప్పు చేయలేదని నీకు తెలుసు.
    నా పాపము నీ నుండి దాచి పెట్టబడలేదు.
నా దేవా, సర్వశక్తిమంతుడవైన యెహోవా, నా మూలంగా నీ అనుచరులను సిగ్గుపడనియ్యకుము.
    ఇశ్రాయేలీయుల దేవా, నా మూలంగా నీ ఆరాధకులను ఇబ్బంది పడనీయకుము.
నా ముఖం సిగ్గుతో నిండి ఉంది.
    నీ కోసం ఈ సిగ్గును నేను భరిస్తాను.
నా సోదరులు నన్ను పరాయి వానిలా చూస్తారు.
    నా తల్లి కుమారులు నన్నొక విదేశీయునిలా చూస్తారు.
నీ ఆలయాన్ని గూర్చిన నా ఉత్సాహము నన్ను దహించుచున్నది.
    నిన్ను ఎగతాళి చేసే మనుష్యుల అవమానాలను నేను పొందుతున్నాను.
10 నేను ఉపవాసం ఉండి ఏడుస్తున్నాను.
    అందు నిమిత్తం వారు నన్ను ఎగతాళి చేస్తున్నారు.
11 నా విచారాన్ని చూపించేందుకు నేను దుఃఖ బట్టలు ధరిస్తున్నాను.
    ప్రజలు నన్ను గూర్చి పరిహాసాలు చెప్పుకొంటున్నారు.
12 బహిరంగ స్థలాల్లో వారు నన్ను గూర్చి మాట్లాడుకొంటున్నారు.
    త్రాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుతున్నారు.
13 నా మట్టుకైతే యెహోవా, ఇదే నీకు నా ప్రార్థన.
    నీవు నన్ను స్వీకరించాలని కోరుతున్నాను.
దేవా, ప్రేమతో నీవు నాకు జవాబు ఇవ్వాలని కోరుతున్నాను.
14 బురదలో నుండి నన్ను పైకి లాగుము.
    బురదలోకి నన్ను మునిగిపోనియ్యకు.
నన్ను ద్వేషించే మనుష్యుల నుండి నన్ను రక్షించుము.
    లోతైన ఈ జలాల నుండి నన్ను రక్షించుము.
15 అలలు నన్ను ముంచివేయనీయకుము.
    లోతైన అగాధం నన్ను మ్రింగివేయనీయకుము.
    సమాధి తన నోరును నా మీద మూసికొననీయకుము
16 యెహోవా, నీ ప్రేమ మంచిది. నీ ప్రేమ అంతటితో నాకు జవాబు ఇమ్ము.
    నీ పూర్ణ దయతో నాకు సహాయం చేయుటకు మళ్లుకొనుము.
17 నీ సేవకునికి విముఖుడవు కావద్దు.
    నేను కష్టంలో ఉన్నాను. త్వరపడి నాకు సహాయం చేయుము.
18 వచ్చి నా ఆత్మను రక్షించుము.
    నా శత్రువులనుండి నన్ను తప్పించుము.
19 నా అవమానం నీకు తెలుసు.
    నా శత్రువులు నన్ను అవమానపరిచారని నీకు తెలుసు.
    వారు నన్ను కించపరచటం నీవు చూసావు.
20 సిగ్గు నన్ను కృంగదీసింది.
    అవమానం చేత నేను చావబోతున్నాను.
సానుభూతి కోసం నేను ఎదురు చూశాను.
    కాని ఏమీ దొరకలేదు.
ఎవరైనా నన్ను ఆదరిస్తారని నేను ఎదురుచూశాను.
    కాని ఎవరూ రాలేదు.
21 వారు నాకు భోజనం కాదు విషం పెట్టారు.
    ద్రాక్షారసానికి బదులుగా చిరకను వారు నాకు ఇచ్చారు.
22 వారి బల్లల మీద భోజన పానాలు పుష్కలంగా ఉన్నాయి.
    విందులు జరుగుతుంటాయి. వారి భోజనాలే వారికి ఎక్కువ అగును గాక.
23 వారి కన్నులకు చీకటి కలిగి చూడలేక పోదురు గాక! వారి నడుములు ఎడతెగకుండా వణుకునట్లు చేయుము.
24 నీ కోపమును వారిపై కుమ్మరించుము.
    నీ భయంకర కోపమును వారు సహించనిమ్ము.
25 వారి కుటుంబాలు, ఇండ్లు
    పూర్తిగా నాశనం చేయబడునుగాక.
26 నీవు వారిని శిక్షించుము. వారు పారిపోతారు.
    అప్పుడు బాధను గూర్చి వారు మాట్లాడుకుంటారు.
27 వారు చేసిన చెడ్డ పనులకు గాను వారిని శిక్షించుము.
    నీవు ఎంత మంచివాడవుగా ఉండగలవో వారికి చూపించవద్దు.
28 జీవ గ్రంథంలో నుండి వారి పేర్లు తుడిచివేయుము.
    మంచి మనుష్యుల పేర్లతో పాటు వారి పేర్లను గ్రంథంలో వ్రాయవద్దు.
29 నేను విచారంగాను, బాధతోను ఉన్నాను.
    దేవా, నన్ను లేవనెత్తుము. నన్ను రక్షించుము.
30 దేవుని నామమును కీర్తనతో నేను స్తుతిస్తాను.
    కృతజ్ఞతా గీతంతో నేను ఆయన్ని స్తుతిస్తాను.
31 ఆబోతును వధించుట, జంతువునంతటిని బలి అర్పించుటకంటె ఇది ఉత్తమము.
    ఇది దేవుణ్ణి సంతోషింపజేస్తుంది.
32 పేద ప్రజలారా, మీరు దేవుని ఆరాధించుటకు వచ్చారు.
    పేద ప్రజలారా, ఈ సంగతులను తెలుసుకొనేందుకు మీరు సంతోషిస్తారు.
33 నిరుపేదల, నిస్సహాయ ప్రజల ప్రార్థన యెహోవా ఆలకిస్తాడు.
    యెహోవా కారాగారంలో ఉన్న తన వారిని విసర్జించడు.
34 ఆకాశమా, భూమీ, సముద్రమా,
    దానిలోని సమస్తమా, యెహోవాను స్తుతించండి.
35 యెహోవా సీయోనును రక్షిస్తాడు.
    యూదా పట్టణాలను యెహోవా తిరిగి నిర్మిస్తాడు.
ఆ భూమి స్వంతదారులు మరల అక్కడ నివసిస్తారు.
36     ఆయన సేవకుల సంతతివారు ఆ దేశాన్ని పొందుతారు.
    ఆయన నామాన్ని ప్రేమించే ప్రజలు అక్కడ నివసిస్తారు.

కీర్తనలు. 73

మూడవ భాగం

(కీర్తనలు 73–89)

ఆసాపు స్తుతి కీర్తన.

73 దేవుడు నిజంగా ఇశ్రాయేలీయుల యెడల మంచివాడు.
    పవిత్ర హృదయాలు గల ప్రజలకు దేవుడు మంచివాడు.
నేను దాదాపుగా జారిపోయి,
    పాపం చేయటం మొదలు పెట్టాను.
దుర్మార్గులు సఫలమవటం నేను చూసాను.
    ఆ గర్విష్ఠులైన ప్రజలను గూర్చి నేను అసూయ పడ్డాను.
ఆ మనుష్యులు ఆరోగ్యంగా ఉన్నారు.
    వారు జీవించుటకు శ్రమపడరు.[a]
మేము కష్టాలు అనుభవిస్తున్నట్టు ఆ గర్విష్ఠులు కష్టాలు పడరు.
    ఇతర మనుష్యుల్లా వారికి కష్టాలు లేవు.
కనుక వారు చాలా గర్విష్ఠులు, ద్వేష స్వభావులు.
    వారు ధరించే అందమైన బట్టలు, నగలు ఎంత తేటగా ఉన్నాయో ఈ విషయం కూడ అంత తేటతెల్లం.
ఆ మనుష్యులకు కనబడింది ఏదైనా వారికి నచ్చితే వారు వెళ్లి దాన్ని తీసుకొంటారు.
    వారు కోరుకొన్న పనులు వారు చేస్తారు.
ఇతరులను గూర్చి కృ-రమైన చెడ్డ మాటలు వారు చెబుతారు. వారు ఇతరులను ఎగతాళి చేస్తారు.
    వారు గర్విష్ఠులు, మొండివారు. ఇతరులను వారు ఉపయోగించుకోటానికి ప్రయత్నిస్తారు.
ఆ గర్విష్ఠులు వారే దేవుళ్లని అనుకుంటారు.
    వారు భూమిని పాలించేవారని తలుస్తారు.
10 కనుక దేవుని ప్రజలు సహితం ఆ దుర్మార్గుల వైపు తిరిగి
    వారు చెప్పే సంగతులు నమ్ముతారు.
11 “మేము చేసే సంగతులు దేవునికి తెలియవు.
    సర్వోన్నతుడైన దేవునికి తెలియదు అని ఆ దుర్మార్గులు చెబుతారు.”

12 ఆ గర్విష్ఠులు దుర్మార్గులు, ధనికులు.
    మరియు వారు ఎల్లప్పుడూ మరింత ధనికులౌతున్నారు.
13 కనుక నేనెందుకు ఇంకా నా హృదయాన్ని పవిత్రం చేసుకోవాలి?
    నేనెందుకు ఎల్లప్పుడూ నా చేతులను పవిత్రం చేసుకోవాలి?
14 దేవా, రోజంతా నేను శ్రమ పడుతున్నాను.
    నీవేమో ప్రతి ఉదయం నన్ను శిక్షిస్తున్నావు.
15 ఈ సంగతులు నేను ఇతరులతో చెప్పాలని అనుకొన్నాను.
    కాని దేవా, నేను నీ ప్రజలను ద్రోహంగా అప్పగిస్తానని నాకు తెలిసియుండినది.
16 ఈ సంగతులను నా మనస్సునందు గ్రహించుటకు నేను ప్రయత్నించాను.
    కాని నేను నీ ఆలయానికి వెళ్లేదాకా దానిని గ్రహించడం ఎంతో కష్టతరమైనది.
17 నేను దేవుని ఆలయానికి వెళ్లాను,
    వారి చివరి గమ్యాన్ని నేను గ్రహించాను.
18 దేవా, ఆ మనుష్యులను నీవు నిజంగా అపాయకరమైన పరిస్థితిలో పెట్టావు.
    వారు పడిపోయి నాశనం అవడం ఎంతో సులభం.
19 కష్టం అకస్మాత్తుగా రావచ్చును.
    అప్పుడు ఆ దుర్మార్గులు నాశనం అవుతారు.
భయంకరమైన సంగతులు వారికి సంభవించవచ్చు.
    అప్పుడు వారు అంతమైపోతారు.
20 యెహోవా, మేము మేల్కొన్నప్పుడు
    మరచిపోయే కలవంటి వారు ఆ మనుష్యులు.
మా కలలో కనిపించే రాక్షసుల్లా ఆ మనుష్యులను
    నీవు కనబడకుండా చేస్తావు.

21-22 నేను చాలా తెలివి తక్కువ వాడను.
    ధనికులను, దుర్మార్గులను గూర్చి నేను తలంచి చాలా తల్లడిల్లి పోయాను.
దేవా, నేను నీ మీద కోపంగించి తల్లడిల్లి పోయాను.
    తెలివితక్కువగాను, బుద్ధిలేని పశువుగాను నేను ప్రవర్తించాను.
23 నాకు కావలసిందంతా నాకు ఉంది. నేను ఎల్లప్పుడూ నీతో ఉన్నాను.
    దేవా, నీవు నా చేయి పట్టుకొనుము.
24 దేవా, నీవు నన్ను నడిపించి నాకు మంచి సలహా ఇమ్ము.
    ఆ తరువాత మహిమలో నేను నీతో ఉండుటకు నీవు నన్ను తీసుకొని వెళ్తావు.
25 దేవా, పరలోకంలో నాకు నీవు ఉన్నావు.
    మరియు నేను నీతో ఉన్నప్పుడు భూమిమీద నాకు ఏమికావాలి?
26 ఒకవేళ నా మనస్సు,[b] నా శరీరం నాశనం చేయబడతాయేమో.
    కాని నేను ప్రేమించే బండ[c] నాకు ఉంది.
    నాకు శాశ్వతంగా దేవుడు ఉన్నాడు.
27 దేవా, నిన్ను విడిచిపెట్టే ప్రజలు తప్పిపోతారు.
    నీకు నమ్మకంగా ఉండని మనుష్యులను నీవు నాశనం చేస్తావు.
28 కాని నేను దేవునికి సన్నిహితంగా ఉన్నాను.
    దేవుడు నా యెడల దయ చూపించాడు.
    నా యెహోవా నా కోసం శ్రద్ధ తీసుకొంటాడు. నా ప్రభువైన యెహోవా నా క్షేమస్థానం.
    దేవా, నీవు చేసిన వాటన్నిటిని గూర్చి నేను చెబుతాను.

ఎజ్రా 7:27-28

దేవునికి ఎజ్రా స్తోత్రాలు

27 [a] యెరూషలేములో వున్న యెహోవా ఆలయానికి ఘనత చేకూర్చాలనే తలంపును రాజు మదిలో నాటిన ప్రభువుకు, మా పూర్వీకుల దేవుడైన యెహోవాకు కీర్తి కలుగునుగాక! 28 రాజు, ఆయన మంత్రుల, ఇతరేతర ముఖ్యాధికారుల ఎదుట నాపై నిజమైన ప్రేమను ప్రభువు చూపించాడు. దేవుడైన యెహోవా నాతో ఉన్నాడు, అందుకే నేను ధైర్యంగా ఉన్నాను. యెరూషలేముకు నాతో పోయేందుకు నేను ఇశ్రాయేలీయుల నాయకులను ప్రోగుచేశాను.

ఎజ్రా 8:21-36

21 అక్కడ, ఆ అహవా నది దగ్గర నేను (ఎజ్రా) మనమందరం ఉపవాసం చెయ్యాలని ప్రకటించాను. మన దేవుని ముందు విధేయత చూపేందుకుగాను మనం ఉపవాసం చెయ్యాలి. మేమూ, మా పిల్లలూ, మాకున్న సమస్త వస్తువులూ క్షేమంగా యెరూషలేము చేరేలా దీవించుమని దేవుణ్ణి వేడు కోవాలనుకున్నాము. 22 మా ప్రయాణ మార్గంలో మా రక్షణ కోసం సైనికుల్నీ, అశ్వికుల్నీ పంపమని అర్తహషస్త రాజుని అర్థించడం నాకు సిగ్గుగా తోచింది. మార్గంలో శత్రువులున్నారని నాకు తెలుసు. అయితే అర్తహషస్త రాజుకి మేమంతకు ముందు ఇలా చెప్పివున్నాము: “మా దేవుడు తనని నమ్మే ప్రతి ఒక్కరికీ తోడుగా ఉంటాడు. అయితే, దేవుడు తనకు ఎడముఖంగా వున్న ప్రతి ఒక్కనిపట్లా చాలా కోపంగా వుంటాడు.” 23 అందుకని, మేము ఉపవాసం వుండి, మా ప్రయాణం గురించి మేము దేవుణ్ణి ప్రార్థించాము. ఆయన మా ప్రార్థనలకు జవాబిచ్చాడు.

24 తర్వాత నేను పన్నెండుగురు ముఖ్య యాజకులను, షెరేబ్యాను, హషబ్యాను, వాళ్ల సొదరులు పది మందిని ఎంపికచేశాను. 25 దేవాలయం కోసం ఇవ్వబడిన వెండిని, బంగారాన్ని తదితర వస్తువులను తూకం వేయించాను. నేను ఎంపికచేసిన పన్నెండుగురు యాజకులకు నేను వాటిని అప్పగించాను. అర్తహషస్త రాజు, ఆయన మంత్రులు, ఆయన ముఖ్యాధికారులు, బబులోనులోని ఇశ్రాయేలీయులు అందరూ దేవుని దేవాలయం కోసం యిచ్చిన వస్తువులవి. 26 నేను వాటన్నింటినీ తూకం వేశాను. వెండి 25 టన్నులు వుంది. వెండిగిన్నెలు, వస్తువులు మూడుమ్ముప్పాతిక టన్నులున్నాయి. మూడుమ్ముప్పాతిక టన్నుల బంగారం వుంది. 27 నేను వాళ్లకి 20 బంగారు గిన్నెలు యిచ్చాను. అవి 19 పౌనుల బరువున్నాయి. నేను వాళ్లకి మెరుగు పెట్టిన కంచుతో చేసిన అందమైన రెండు పాత్రలు ఇచ్చాను. అవి బంగారు వస్తువులంతటి విలువైనవి. 28 తర్వాత నేనా పన్నెండుగురు యాజకులతో యిలా చెప్పాను: “యెహోవా దేవుని దృష్టిలో మీరు పవిత్రులు, ఆ వస్తువులు పవిత్రమైనవి. ప్రజలు యీ వెండి బంగారాలను మీ పూర్వీకుల దేవునికి యిచ్చారు. 29 అందుకని, మీరీ వస్తువులను జాగ్రత్తగా కాపాడండి. యెరూషలేములోని దేవాలయ పెద్దలకు మీరు వీటిని అప్పగించేదాకా, యీ వస్తువులకు మీరే బాధ్యులు. మీరు వీటిని ముఖ్య లేవీయులకి, ఇశ్రాయేలు కుటుంబ పెద్దలకీ యిచ్చినప్పుడు వాళ్లు వీటిని తూకం వేసి, యెరూషలేములోని యెహోవా దేవాలయంలోని గదుల్లో పదిలపరుస్తారు.”

30 ఎజ్రా తూకం వేసి తమకిచ్చిన వెండి బంగారాలనూ, ప్రత్యేక వస్తువులనూ యాజకులూ, లేవీయులు స్వీకరించి, ఎజ్రా చెప్పినట్లు, వాటిని యెరూషలేము లోని దేవాలయానికి చేర్చేందుకు సంసిద్ధులయ్యారు.

31 మొదటి నెల పన్నెండవ రోజున మేము అహవానది దగ్గరనుంచి యెరూషలేముకు బయల్దేరాము. దేవుడు మాకు తోడుగావుండి, మార్గంలో శత్రువులనుంచీ, దోపిడిగాండ్రనుంచీ మమ్మల్ని కాపాడాడు. 32 చివరకు మేము యెరూషలేము చేరుకున్నాము. మేమక్కడ మూడు రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నాము. 33 నాల్గవ రోజున దేవాలయానికి వెళ్లి వెండి బంగారాలనూ, ప్రత్యేక వస్తువులనూ తూకం వేశాము. మేమా వస్తువులను ఊరియా యాజకుని కొడుకైన మెరేమోతుకు అప్పగించాము. అతనితో ఫినేహాసు కుమారుడు ఎలీయాజరు వున్నాడు. వాళ్లతోబాటు లేవీయులైన యేషూవ కొడుకు యోజాబాదు, బిన్నూయి కొడుకు నోవద్యా కూడా వున్నారు. 34 మేము అన్ని వస్తువులనూ లెక్క పెట్టి, వాటన్నింటినీ తూకం వేశాము. తర్వాత మేము అప్పటి మొత్తం బరువును వ్రాసి పెట్టాము.

35 అటు తర్వాత నిర్బంధంనుంచి తిరిగివచ్చిన యూదులు ఇశ్రాయేలు దేవునికి దహనబలులు అర్పించారు. వాళ్లు ఇశ్రాయేలీయులందరి కొరకు 12 ఎడ్లను, 96 పోట్టేళ్లను, 77 మగ గొర్రెపిల్లలను, పాప పరిహారార్థబలి నిమిత్తం 12 మేక పోతులను బలి యిచ్చారు. ఇవన్నీ దహసబలిగా ఇవ్వబడ్డాయి.

36 అటుతర్వాత వాళ్లు అర్తహషస్త ఆజ్ఞలను రాజ ప్రతినిధులైన సామంత నాయకులకు, యూఫ్రటీసు నది పశ్చిమ ప్రాంతపు పాలనాధికారులకు అందజేశారు. కనుక వారందరూ వచ్చి దేవుని ఆలయపు పనిలో సహాయపడ్డారు.

ప్రకటన 15

ఏడు తెగుళ్ళతో ఏడుగురు దూతలు

15 నేను పరలోకంలో యింకొక అద్భుతమైన దృశ్యం చూశాను. ఏడుగురు దూతలు ఏడు చివరి తెగుళ్ళు పట్టుకొని ఉండటం చూశాను. వీటితో దేవుని కోపం సమాప్తమౌతుంది. కనుక యివి చివరివి.

నిప్పుతో కలిసిన గాజు సముద్రం లాంటి ఒక సముద్రం నాకు కనిపించింది. మృగాన్ని, దాని విగ్రహాన్ని జయించినవాళ్ళు, దాని నామానికున్న సంఖ్యను జయించినవాళ్ళు సముద్రతీరం మీద నిలబడి ఉండటం చూసాను. వాళ్ళు తమ చేతుల్లో దేవుడుంచిన వీణల్ని పట్టుకొని ఉన్నారు. దేవుని సేవకుడైన మోషే గీతాన్ని, గొఱ్ఱెపిల్ల గీతాన్ని వాళ్ళు ఈ విధంగా పాడుతూ ఉన్నారు:

“ప్రభూ! సర్వశక్తి సంపన్నుడవైన దైవమా!
    నీ కార్యాలు గొప్పవి. అద్భుతమైనవి.
యుగయుగాలకు రాజువు నీవు.
    నీ మార్గాలు సత్యసమ్మతమైనవి. న్యాయసమ్మతమైనవి.
ఓ ప్రభూ! నీకెవరు భయపడరు?
నీ నామాన్ని స్తుతించనివారెవరున్నారు?
    నీ వొక్కడివే పరిశుద్ధుడవు.
నీ నీతికార్యాలు ప్రత్యక్షమైనవి.
    కనుక ప్రజలందరూ వచ్చి నిన్ను ఆరాధిస్తారు.”

దీని తర్వాత పరలోకంలో ఉన్న మందిరాన్ని చూసాను. అంటే సాక్ష్యపు గుడారము తెరుచుకోవటం చూసాను. ఆ మందిరం నుండి ఏడుగురు దేవదూతలు ఏడు తెగుళ్ళతో బయటకు వచ్చారు. వాళ్ళు తెల్లటి మెరిసే నార బట్టలు వేసుకొని ఉన్నారు. రొమ్ముల మీద బంగారు దట్టి కట్టుకొని ఉన్నారు. ఆ తర్వాత ఆ నాలుగు ప్రాణుల్లో ఒకటి ఆ ఏడుగురు దూతలకు చిరంజీవి అయిన దేవుని ఆగ్రహంతో నిండిన ఏడు బంగారు పాత్రల్ని యిచ్చింది. ఆ మందిరమంతా దైవశక్తి వల్ల మరియు ఆయన తేజస్సు వల్ల కలిగిన పొగలతో నిండిపోయింది. ఏడుగురు దూతలు తెచ్చిన ఏడు తెగుళ్ళు పూర్తి అయ్యేవరకు ఆ మందిరంలో ఎవ్వరూ ప్రవేశించలేకపోయారు.

మత్తయి 14:13-21

అయిదువేల మందికి భోజనం

(మార్కు 6:30-44; లూకా 9:10-17; యోహాను 6:1-14)

13 జరిగింది విని యేసు పడవనెక్కి ఏకాంతంగా నిర్జన ప్రదేశానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన సమాచారం విని ప్రజలు గుంపులు గుంపులుగా పట్టణాలనుండి వచ్చి కాలినడకన ఆయన్ని అనుసరించారు. 14 యేసు పడవనుండి దిగి ప్రజలు గుంపులు గుంపులుగా అక్కడ ఉండటం చూసాడు. ఆయనకు జాలి వేసింది. వాళ్ళలో రోగాలున్న వాళ్ళను ఆయన బాగు చేసాడు.

15 సాయంకాలం కాగానే శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, “ఈ ప్రదేశం ఏమూలో ఉంది, పైగా ఇప్పటికే చాలా ప్రొద్దుపోయింది. వీళ్ళను పంపి వేయండి. గ్రామాల్లోకి వెళ్ళి ఏదైనా కొనుక్కొని తింటారు” అని అన్నారు.

16 యేసు, “వాళ్ళు వెళ్ళనక్కరలేదు. తినటానికి మీరే ఏదైనా యివ్వండి.” అని వాళ్ళతో అన్నాడు.

17 “మా దగ్గర అయిదు రొట్టెలు, రెండు చేపలు మాత్రమే ఉన్నాయి” అని వాళ్ళు సమాధానం చెప్పారు.

18 “వాటిని ఇక్కడకు తీసుకు రండి” అని యేసు అన్నాడు. 19 ఆ తర్వాత ప్రజల్ని అక్కడున్న పచ్చిక బయళ్ళలో కూర్చోమని అన్నాడు. ఆ అయిదు రొట్టెల్ని, రెండు చేపల్ని తీసికొని ఆకాశం వైపు చూసి దేవునికి స్తోత్రం చెల్లించాడు. ఆ రొట్టెను విరచి తన శిష్యులకు ఇచ్చాడు. శిష్యులు ప్రజలకు పంచారు. 20 అందరూ కడుపు నిండా తిన్నారు. ఆ తర్వాత శిష్యులు మిగిలిన ముక్కల్ని పన్నెండు గంపల నిండా నింపారు. 21 స్త్రీలు, పిల్లలే కాకుండా అయిదువేల మంది దాకా పురుషులు ఆ రోజు అక్కడ భోజనం చేసారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International