Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 56-58

సంగీత నాయకునికి: “దూరపు సింధూర మ్రానులోని పావురము” రాగం. ఫిలిప్తీయులు దావీదును గాతులో పట్టుకొన్నప్పుడు అతడు రచించిన అనుపదగీతం.

56 దేవా, ప్రజలు నా మీద దాడి చేసారు గనుక నాకు దయ చూపించుము.
    రాత్రింబగళ్లు వారు నన్ను తరుముతూ పోరాడుతున్నారు.
నా శత్రువులు రోజంతా నా మీద దాడి చేసారు.
    నాకు విరోధంగా పోరాడేవారు అనేకులు.
నేను భయపడినప్పుడు నేను నిన్ను నమ్ముకొంటాను.
నేను దేవుని నమ్ముకొన్నాను. కనుక నేను భయపడను. మనుష్యులు నన్ను బాధించలేరు.
    దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం కోసం నేనాయనను స్తుతిస్తాను.
నా శత్రువులు ఎల్లప్పుడూ నా మాటలు మెలితిప్పుతున్నారు.
    వారు ఎల్లప్పుడూ నాకు విరోధంగా చెడు పథకాలు వేస్తున్నారు.
వారంతా కలసి దాక్కొని నా ప్రతీ కదలికనూ గమనిస్తున్నారు.
    నన్ను చంపుటకు ఏదో ఒక మార్గం కోసం ఎదురు చూస్తున్నారు.
దేవా, వారిని తప్పించుకోనియ్యకుము,
    వారు చేసే చెడ్డ పనుల నిమిత్తం వారిని శిక్షించుము.
నేను చాలా కలవరపడిపోయానని నీకు తెలుసు.
    నేను ఎంతగా ఏడ్చానో నీకు తెలుసు
నిజంగా నీవు నా కన్నీళ్ల లెక్క వ్రాసే ఉంటావు.

కనుక సహాయం కోసం నేను నీకు మొర పెట్టినప్పుడు నా శత్రువులు ఓడింపబడతారు.
దేవుడు నాతో ఉన్నాడు ఇది నాకు తెలుసు.

10 దేవుడి వాగ్దానం కోసం నేను ఆయనను స్తుతిస్తాను.
    యెహోవా నాకు చేసిన వాగ్దానం కోసం నేను ఆయనను స్తుతిస్తాను.
11 నేను దేవుని నమ్ముకొన్నాను అందుచేత నేను భయపడను.
    మనుష్యులు నన్ను బాధించలేరు.

12 దేవా, నేను నీతో ప్రత్యేక ప్రమాణం చేసాను. దాన్ని నెరవేరుస్తాను.
    నా కృతజ్ఞతార్పణ నేను నీకు యిస్తాను.
13 ఎందుకంటే మరణం నుండి నీవు నన్ను రక్షించావు.
    నేను ఓడిపోకుండా నీవు కాపాడావు.
కనుక బ్రతికి ఉన్న మనుష్యులు మాత్రమే
    చూడగల వెలుగులో నేను దేవుని ఆరాధిస్తాను.

సంగీత నాయకునికి: “నాశనం చేయవద్దు” రాగం. దావీదు అనుపదగీతం. గుహలో సౌలు నుండి అతడు పారిపోయినప్పటిది.

57 దేవా, నన్ను కరుణించు
    నా ఆత్మ నిన్నే నమ్ముకొన్నది గనుక దయ చూపించుము.
కష్టం దాటిపోయేవరకు
    నేను నీ శరణు జొచ్చియున్నాను.
మహోన్నతుడైన దేవుని సహాయం కోసం నేను ప్రార్థించాను.
    దేవుడు నా విషయమై సంపూర్ణ జాగ్రత్త తీసుకొంటాడు.
పరలోకము నుండి ఆయన నాకు సహాయం చేసి, నన్ను రక్షిస్తాడు.
    నన్ను ఇబ్బందిపెట్టే మనుష్యులను ఆయన శిక్షిస్తాడు.
దేవుడు తన నిజమైన ప్రేమను
    నాకు చూపిస్తాడు.

నా జీవితం ప్రమాదంలో ఉంది.
    నా శత్రువులు నా చుట్టూరా ఉన్నారు.
ఈటెలు, బాణాలవంటి పదునైన పళ్లు,
    మనుష్యులను తినే ఖడ్గంలా పదునైన నాలుకలుగల సింహాల్లా వారున్నారు.

దేవా, నీవు ఆకాశాలకంటె ఎత్తుగా హెచ్చింపబడ్డావు.
    నీ మహిమ భూమిని ఆవరించి ఉంది.
నా శత్రువులు నాకు ఉచ్చు వేసారు.
    వారు నన్ను ఉచ్చులో పట్టుకోవాలని చూస్తున్నారు.
నేను పడుటకు వారు గొయ్యి తవ్వారు.
    కాని వారే దానిలో పడ్డారు.

దేవా, నిన్ను విశ్వసించటంలో నా హృదయం నిబ్బరంగా వున్నది.
    నేను నీకు స్తుతులు పాడుతాను.
నా ఆత్మా, మేలుకొనుము!
    స్వరమండలమా, సితారా, మేలుకోండి. వేకువను మనం మేల్కొందాము
నా ప్రభూ, నేను నిన్ను ప్రతి ఒక్కరి వద్దా స్తుతిస్తాను.
    ప్రతీ జనంలో నేను నిన్ను గూర్చిన స్తుతిగీతాలు పాడుతాను.
10 నీ నిజమైన ప్రేమ ఆకాశంలోకెల్లా అత్యున్నత మేఘాలకంటె ఎత్తయింది.
11 ఆకాశాలకంటె దేవుడు ఎక్కువగా ఘనపర్చబడ్డాడు.
    ఆయన మహిమ భూమి మీద నిండిపోయింది.

సంగీత నాయకునికి: “నాశనం చేయవద్దు” రాగం. దావీదు అనుపదగీతం.

58 న్యాయమూర్తుల్లారా, మీరు మీ నిర్ణయాల్లో న్యాయంగా ఉండటంలేదు.
    మీరు ప్రజలకు న్యాయంగా తీర్పు చెప్పటంలేదు.
లేదు, మీరు చేయగల కీడును గూర్చి మాత్రమే మీరు తలుస్తారు.
    ఈ దేశంలో మీరు బలాత్కారపు నేరాలే చేస్తారు.
ఆ దుర్మార్గులు తాము పుట్టగానే తప్పులు చేయటం మొదలు పెట్టారు.
    పుట్టినప్పటి నుండి వారు అబద్దికులే.
వారు సర్పాలంత ప్రమాదకరమైన వాళ్లు.
    వినలేని త్రాచుపాముల్లా, ఆ దుర్మార్గులు సత్యాన్ని వినేందుకు నిరాకరిస్తారు.
త్రాచుపాములు సంగీతంగాని, పాములను ఆడించే వాని నాగ స్వరంగాని వినవు.
    ఆ దుర్మార్గులు అలా ఉన్నారు.

యెహోవా, ఆ మనుష్యులు సింహాల్లా ఉన్నారు.
    కనుక యెహోవా, వారి పళ్లు విరుగగొట్టుము.
ఖాళీ అవుతున్న నీళ్లలా ఆ మనుష్యులు మాయమవుదురుగాక.
    బాటలోని కలుపు మొక్కల్లా వారు అణగదొక్కబడుదురు గాక.
మట్టిలో దూరిపోయే నత్తల్లా వారు ఉందురుగాక.
    చచ్చి పుట్టి, పగటి వెలుగు ఎన్నడూ చూడని శిశువులా వారు ఉందురు గాక.
కుండక్రింద ఉన్న నిప్పువేడిలో అతిత్వరగా
    కాలిపోయే ముళ్లకంపలా వారు వెంటనే నాశనం చేయబడుదురు గాక.

10 మనుష్యులు తమకు చేసిన చెడు పనుల నిమిత్తం
    వారికి శిక్ష విధించబడినప్పుడు మంచివాడు సంతోషిస్తాడు.
ఆ దుర్మార్గుల రక్తంలో అతడు తన పాదాలు కడుగుకొంటాడు.
11 అది జరిగినప్పుడు, ప్రజలు ఇలా అంటారు: “మంచి మనుష్యులకు నిజంగా ప్రతిఫలం కలిగింది.
    లోకానికి తీర్పు తీర్చే దేవుడు నిజంగానే ఉన్నాడు.”

కీర్తనలు. 64-65

సంగీత నాయకునికి: దావీదు కీర్తన.

64 దేవా, నా ప్రార్థన ఆలకించుము.
    నా శత్రువులను గూర్చి నేను భయపడుతున్నాను. నా ప్రాణమును కాపాడుము.
నా శత్రువుల రహస్య పన్నాగాల నుండి నన్ను కాపాడుము.
    ఆ దుర్మార్గుల బారి నుండి నన్ను దాచి పెట్టుము.
వారు నన్ను గూర్చి ఎన్నో చెడ్డ అబద్ధాలు చెప్పారు.
    వారి నాలుకలు వాడిగల కత్తులవలె ఉన్నాయి, వారి కక్ష మాటలు బాణాల్లా ఉన్నాయి.
వారు దాక్కొని ఆ తరువాత తమ బాణాలను సామాన్యమైన ఒక నిజాయితీపరుని మీద వేస్తారు.
    అతడు దానిని గమనించకముందే అతడు గాయ పరచబడతాడు.
అతన్ని ఓడించుటకు వారు చెడ్డ పనులు చేస్తారు.
    వారు వారి ఉరులను పెడతారు. “వారిని ఎవరూ పట్టుకోరని, చూడరని” వారనుకొంటారు.
మనుష్యులు చాలా యుక్తిగా ఉండగలరు.
    మనుష్యులు ఏమి తలస్తున్నారో గ్రహించటం ఎంతో కష్టం.
కాని దేవుడు తన “బాణాలను” వారిమీద వేయగలడు.
    అది వారు గమనించకముందే దుర్మార్గులు గాయపరచబడతారు.
దుర్మార్గులు ఇతరులకు కీడు చేయుటకు పథకం వేస్తారు.
    కాని దేవుడు వారి పథకాలను పాడుచేయగలడు.
ఆ కీడు వారికే సంభవించేలా ఆయన చేయగలడు.
    అప్పుడు వారిని చూసే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో వారి తలలు ఊపుతారు.
దేవుడు చేసిన వాటిని మనుష్యులు చూస్తారు.
    వారు దేవుని క్రియలను ప్రకటిస్తారు.
అప్పుడు ప్రతి ఒక్కరూ దేవుని గూర్చి ఎక్కువగా తెలిసికొంటారు.
    ఆయనకు భయపడి గౌరవించడం వారు నేర్చుకొంటారు.
10 మంచివాళ్లు యెహోవాయందు సంతోషంగా ఉండాలి.
    వారు ఆయన్ని నమ్ముకోవాలి.
మంచి మనుష్యుల్లారా, మీరంతా యెహోవాను స్తుతించండి.

సంగీత నాయకునికి: దావీదు స్తుతి కీర్తన.

65 సీయోను మీద ఉన్న దేవా, నేను నిన్ను స్తుతిస్తాను.
    నేను వాగ్దానం చేసిన వాటిని నేను నీకు ఇస్తాను.
నీవు చేసిన వాటిని గూర్చి మేము చెబుతాము మరియు నీవు మా ప్రార్థనలు వింటావు.
    నీ దగ్గరకు వచ్చే ప్రతి మనిషి యొక్క ప్రార్థనలూ నీవు వింటావు.
మా పాపాలు మేము భరించలేనంత భారమైనప్పుడు,
    ఆ పాపాలను నీవు తీసివేస్తావు.
దేవా, నీ ప్రజలను నీవు ఏర్పరచుకొన్నావు.
    నీ ఆలయానికి వచ్చి నిన్ను ఆరాధించుటకు నీవు మమ్మల్ని ఏర్పాటు చేసికొన్నావు.
మాకు చాలా సంతోషంగా ఉంది!
    నీ ఆలయంలో నీ పరిశుద్ధ ఇంటిలో మాకన్నీ అద్భుత విషయాలే ఉన్నాయి.
దేవా, నీవు మమ్మల్ని రక్షించుము. మంచి మనుష్యులు నిన్ను ప్రార్థిస్తారు.
    నీవు వారి ప్రార్థనలకు జవాబిస్తావు.
వారి కోసం నీవు ఆశ్చర్య కార్యాలు చేస్తావు.
    ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు నిన్ను నమ్ముకొంటారు.
దేవుడు తన మహాశక్తిని ఉపయోగించి పర్వతాలను చేశాడు.
    మనచుట్టూరా ఆయన శక్తిని చూడగలము.
ఘోషించే సముద్రాలను దేవుడు నిమ్మళింప చేస్తాడు.
    మరియు ప్రపంచంలో ఉన్న మనుష్యులందరినీ దేవుడు సంతోషంతో స్తుతింప చేస్తాడు.
దేవుడు చేసే శక్తివంతమైన విషయాలకు భూమిమీద ప్రతి మనిషీ భయపడతాడు.
    దేవా, నీవు సూర్యుని ఉదయింపజేసే, అస్తమింపజేసే ప్రతి చోటా ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
నీవు భూమిని గూర్చి శ్రద్ధ తీసుకొంటావు.
    నీవు దానికి నీరు పోస్తావు, అది దాని పంటలు పండించేలా నీవు చేస్తావు.
దేవా, నీవు కాలువలను ఎల్లప్పుడూ నీళ్లతో నింపుతావు.
    నీవు ఇలా చేసి పంటలు పండింపచేస్తావు.
10 దున్నబడిన భూమి మీద వర్షం కురిసేటట్టు నీవు చేస్తావు.
    భూములను నీవు నీళ్లతో నానబెడతావు.
నేలను నీవు వర్షంతో మెత్తపరుస్తావు.
    అప్పుడు నీవు మొలకలను ఎదిగింపచేస్తావు.
11 కొత్త సంవత్సరాన్ని మంచి పంటతో నీవు ప్రారంభింప చేస్తావు.
    బండ్లను నీవు అనేక పంటలతో నింపుతావు.
12 అరణ్యము, కొండలు పచ్చగడ్డితో నిండిపోయాయి.
13 పచ్చిక బయళ్లు గొర్రెలతో నిండిపోయాయి.
    లోయలు ధాన్యంతో నిండిపోయాయి.
పచ్చిక బయళ్లు, లోయలు సంతోషంతో పాడుతున్నట్లున్నాయి.

నెహెమ్యా 6

ఎదురైన మరిన్ని సమస్యలు

నేను ప్రాకార నిర్మాణం పూర్తి చేశానన్న సంగతిని సన్బల్లటు, టోబీయా, అరబీయుడైన గెషెము మా ఇతర శత్రువులూ విన్నారు. మేము గోడలోని కంతలన్నీ పూడ్చాము. అయితే, ద్వారాలకు మేమింకా తలుపులు అమర్చలేదు. సన్బల్లటూ, గెషెమూ నాకు, “నెహెమ్యా, నువ్వొకసారి వస్తే మనం కలుసు కుందాము. ఓనో మైదానంలోని కెఫీరిము గ్రామంలో కలుసుకోవచ్చు” అని కబురంపారు. అయితే, వాళ్లు నాకు హాని తలపెట్టారని నాకు తెలుసు.

అందుకని, దూతల ద్వారా నేను వాళ్లకి, “నేను చాలా ముఖ్యమైన పనిలో నిమగ్నమై వున్నాను. అందు కని, నేను రాలేను. మిమ్మల్ని కలుసు కొనడానికై నేను పని చేయుట ఆపినప్పుడు, పని ఆగుట నాకిష్టము లేదు” అని సమాధానం పంపాను.

సన్బల్లటూ, గెషెమూ అదే సందేశాన్ని నాకు నాలుగుసార్లు పంపారు. ప్రతి ఒక్కసారీ నేను వాళ్లకి నా వెనకటి సమాధానమే పంపాను. అప్పుడు అయిదవసారి, సన్బల్లటు అదే సందేశాన్ని తన సహాయకుని ద్వారా నాకు పంపాడు. అతడి చేతిలో విప్పియున్న ఒక లేఖవుంది. ఆ లేఖలో ఇలా పేర్కొనబడింది,

“ఒక విషయం నాలుగు ప్రక్కలా ప్రచారమవుతోంది. ఎక్కడ చూసినా జనం అదే చెప్పుకుంటున్నారు. మరి, అన్నట్టు, గెషెము అది నిజమే అంటున్నాడు. నీవూ, యూదులూ రాజు మీద తిరగబడాలని కుట్రపన్నుతున్నట్లు జనం చెప్పుకుంటున్నారు. అందుకే నీవు యెరూషలేము ప్రాకారం నిర్మిస్తున్నావట. అంతేకాదు, నీవు యూదులకు కాబోయే రాజువని కూడా జనం చెప్పుకుంటున్నారు. యెరూషలేములో నిన్ను గురించి ఈ విషయాన్ని ప్రకటించేటందుకు నీవు ప్రవక్తలను ఎంపిక చేశావన్న విషయం, ‘యూదాలో ఒక రాజు వున్నాడు!’ అన్న విషయం ప్రచారంలో వుంది.

“నెహెమ్యా, ఇప్పుడు నిన్ను నేను హెచ్చరిస్తున్నాను. అర్తహషస్త రాజురు ఈ విషయం వింటారు. అందుకని, నీవు రా, మనం కలిసి కూర్చుని ఈ విషయం మాట్లాడుకుందాము.”

అందుకని, నేను సన్బల్లటుకి ఈ క్రింది సమాధానం పంపాను: “మీరు చెబుతున్నదేమీ ఇక్కడ జరగడం లేదు. ఇదంతా మీ ఊహా కల్పితం మాత్రమే.”

మన శత్రువులు మనల్ని భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వాళ్ల మట్టుకు వాళ్లు, “ఈ యూదులు భయంతో బిక్కచచ్చి, జావకారిపోయి పని కొనసాగించేందుకు అసమర్థులవుతారు. అప్పుడిక ప్రాకార నిర్మాణం పూర్తికాదు” అనుకుంటున్నారు.

కాని నేను, “దేవా, నన్ను బలపరచుము” అని ప్రార్థించాను.

10 నేనొక రోజున దెలాయ్యా కొడుకు షెమయా ఇంటికి వెళ్లాను. దెలాయ్యా మెహేతబేలు కొడుకు. ఇంటి వద్దనే వుండవలసిన షెమయా ఇలా అన్నాడు: “నెహెమ్యా, ఆలయానికి పోయి కూర్చుందాము. లోపలికి పోయి తలుపులు మూసుకుందాము. ఎందుకంటే నిన్ను చంపేందుకు మనుష్యులు వస్తున్నారు. ఈ రాత్రి నిన్ను చంపేందుకు వాళ్లొస్తున్నారు.”

11 అయితే, నేను షెమయాతో ఇలా అన్నాను: “నాలాంటి మనిషి పారిపోవాలంటావా? నాలాంటి వాడు తన ప్రాణం కాపాడుకొనేందుకు దేవాలయంలోకి పారిపోకూడదు, నేనలా వెళ్లను!”

12 షెమయాని దేవుడు పంపించలేదని నాకు తెలుసు. టోబీయా, సన్బల్లటు అతనికి డబ్బు ముట్టజెప్పారు కనుక, అతను నాకు వ్యతిరేకంగా హితబోధ చేశాడు. 13 నన్ను ఇరుకున పెట్టేందుకూ, భయపెట్టేందుకూ వాళ్లు షెమయాని కుదుర్చుకున్నారు. భయపడి, ఆలయానికి పారిపోవడం ద్వారా నేను పాపం చెయ్యాలని వాళ్లు కోరుకున్నారు. అప్పుడు, నన్ను భయపెట్టి, నాకు అపకీర్తి తెచ్చేందుకు నా శత్రువులకి అవకాశం చిక్కి వుండేది.

14 ఓ నా దేవా, దయచేసి టోబియా, సన్బల్లటులు చేస్తున్న పనులు గమనించు. వాళ్లు చేసిన పాపిష్టి పనులు కూడా గుర్తు చేసుకో. నన్ను భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్న నోవద్యా అనే ప్రవక్త్రిని, తదితర ప్రవక్తలను కూడా గుర్తు చేసుకో.

ప్రాకార నిర్మాణం పూర్తయింది

15 ఈ విధంగా యెరూషలేము ప్రాకార నిర్మాణం ఏలూలు[a] నెల ఇరవై ఐదవ రోజున పూర్తయింది. ఆ గోడ కట్టడం పూర్తి చేసేందుకు ఏభై రెండు రోజులు పట్టింది. 16 అప్పుడు, మేము గోడ కట్టడం పూర్తి చేసినట్లు మా శత్రువులందరూ విన్నారు. గోడ కట్టడం పూర్తయిందన్న విషయాన్ని మా చుట్టు ప్రక్కల దేశపు ప్రజలందరూ చూశారు. దానితో, వాళ్లు ధైర్యం కోల్పోయారు. ఎందుకంటే, ఈ పని మన దేవుని సహాయం వల్ల జరిగిందని వాళ్లు అర్థం చేసుకున్నారు.

17 అంతేకాదు, ఆ రోజుల్లో, గోడ కట్టడం పూర్తయిన దరిమిలా, యూదాలోని ధనికులు టోబీయాకి ఎన్నో ఉత్తరాలు పంపుతూవచ్చారు. టోబీయా వాళ్ల జాబులకి సమాధానాలు వ్రాస్తూండే వాడు. 18 యూదాలో చాలామంది అతనికి విధేయులుగా వుంటామని మాట ఇచ్చినందువల్ల, వాళ్లు అతనికి ఆ జాబులు వ్రాశారు. దీనికి కారణం ఏమిటంటే, టోబీయా అరహు కుమారుడైన షెకన్యాకి అల్లుడు. టోబీయా కొడుకు యోహానాను మెషూల్లము కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. మెషూల్లము బెరెక్యా కొడుకు. 19 గతంలో వాళ్లు టోబీయాకి ఒక ప్రత్యేక వాగ్దానం చేశారు. అందుకని, వాళ్లు నాకు టోబీయా ఎంతో మంచివాడని చెప్తూ వచ్చారు. నేను చేస్తున్న పనులను గురించి వాళ్లు టోబీయాకి చెప్తూండేవారు. నన్ను భయపెట్టేందుకని టోబీయా నాకు లేఖలు పంపుతూ వచ్చాడు.

ప్రకటన 10

దేవదూత, చిన్న గ్రంథము

10 శక్తివంతుడైన మరొక దేవదూత పరలోకం నుండి క్రిందికి రావటం చూశాను. ఆయన మేఘాన్ని ఒక వస్త్రంగా ధరించి ఉన్నాడు. ఆయన తలపై మేఘధనుస్సు ఉంది. ఆయన ముఖం సూర్యునిలా ఉంది. ఆయన కాళ్ళు మండుతున్న స్తంభాల్లా ఉన్నాయి. ఆయన చేతిలో ఒక చిన్న గ్రంథం ఉంది. అది తెరువబడి ఉంది. ఆయన తన కుడి కాలు సముద్రం మీద, ఎడమకాలు భూమ్మీద ఉంచి బిగ్గరగా అరిచాడు. ఆ అరుపు సింహ ఘర్జనలా ఉంది. ఆయన అలా అరచినప్పుడు ఏడు ఉరుములు మాట్లాడాయి.

ఏడు ఉరుములు మాట్లాడిన వాటిని నేను వ్రాయటం మొదలుపెట్టాను. కాని పరలోకం నుండి ఒక స్వరం నాతో, “ఏడు ఉరుములు అన్న మాటల్ని దాచి ముద్ర వేయి, వాటిని వ్రాయవద్దు” అని అన్నది.

సముద్రం మీద, భూమ్మీద నిలబడి ఉన్న దూత నేను చూస్తుండగా తన కుడి చేతిని పరలోకం వైపుకు చాపాడు. చిరకాలం జీవించేవాని మీద, పరలోకం, అందులో ఉన్నవాటిని సృష్టించినవాని మీద, భూమిని, అందులో ఉన్నవాటన్నిటినీ సృష్టంచినవానిమీద, సముద్రాన్ని, అందులో ఉన్నవాటన్నిటినీ సృష్టించినవాని మీద ప్రమాణం చేసి ఈ విధంగా అన్నాడు: “ఇక ఆలస్యం ఉండదు. కాని ఏడవ దూత తన బూర ఊదటం మొదలు పెట్టే రోజులు వచ్చినప్పుడు దేవుని రహస్య ప్రణాళిక సమాప్తమౌతుంది. దేవుడు తన సేవకులైన ప్రవక్తలకు ఈ రహస్యాన్ని ముందే చెప్పాడు.” అని అన్నాడు.

నేను పరలోకం నుండి విన్న స్వరం మళ్ళీ నాతో, “వెళ్ళు. సముద్రం మీదా, భూమ్మీదా నిలబడి ఉన్న దూత చేతిలో తెరువబడివున్న గ్రంథాన్ని తీసుకో!” అని అన్నది.

అందువల్ల, నేను దేవదూత దగ్గరకు వెళ్ళి, ఆ చిన్న గ్రంథాన్నివ్వమని అడిగాను. ఆయన నాతో, “ఇది తీసుకొని తిను. అది నీ కడుపుకు చేదు కలిగిస్తుంది. కాని నీ నోటికి తేనెలా మధురంగా ఉంటుంది” అని అన్నాడు. 10 నేనా చిన్న గ్రంథాన్ని, దూత చేతినుండి తీసుకొని తినివేసాను. అది నా నోటికి తేనెలా మధురంగా ఉండెను. కాని అది తిన్నాక నా కడుపుకు చేదుగానుండెను. 11 ఆ తర్వాత ఆ దూత నాతో, “నీవు చాలమంది ప్రజల్ని గురించి, దేశాల్ని గురించి, రాజుల్ని గురించి మళ్ళీ ప్రవచనం చెప్పాలి” అని అన్నాడు.

మత్తయి 13:36-43

కలుపు ఉపమానానికి అర్థం

36 ఆ తర్వాత ఆయన ప్రజల్ని వదలి యింట్లోకి వెళ్ళాడు. ఆయన శిష్యులు వచ్చి ఆయన్ని, “పొలంలోని కలుపు మొక్కల ఉపమానాన్ని గురించి మాకు వివరంగా చెప్పండి” అని అడిగారు.

37 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “మంచి విత్తనాన్ని నాటుతున్న వాడు మనుష్య కుమారుడు. 38 ఈ ప్రపంచం పొలంతో పోల్చబడింది. మంచి విత్తనాలు దేవుని రాజ్యంలోవున్న ప్రజలతో పోల్చబడ్డాయి. పొలంలోని కలుపు మొక్కలు సైతాను కుమారులతో పోల్చబడ్డాయి. 39 వాటిని నాటిన శత్రువు సైతానుతో పోల్చబడ్డాడు. కోతకాలం యుగాంతంతో పోల్చబడింది. కోతకోసేవాళ్ళు దేవదూతలతో పోల్చబడ్డారు.

40 “కలుపు మొక్కల్ని పెరికి మంటల్లో వేసి కాల్చి వేసినట్లే యుగాంతంలో కూడా మనుష్య కుమారుడు తన దూతల్ని పంపుతాడు. 41 వాళ్ళు వచ్చి ఆయన రాజ్యంలో ఉన్న పాపుల్ని, పాపాలను కలుగజేసే వాళ్ళను ప్రోగు చేస్తారు. అలా ప్రోగు చేసి వాళ్ళను అగ్ని గుండంలో పారవేస్తారు. 42 వాళ్ళు ఏడుస్తారు. బాధననుభవిస్తారు. 43 ఆ తర్వాత నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యునిలా ప్రకాశిస్తారు. విన్నవాళ్ళు అర్థం చేసుకోండి!

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International