Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 40

సంగీత నాయకునికి: దావీదు కీర్తన.

40 నేను సహనంగా యెహోవా కోసం వేచియున్నాను. ఆయన తన చెవినిచ్చి, నా మొర ఆలకించెను.
    నా వైపుకు ఒంగియున్నాడు. ఆయన నా మొరలు విన్నాడు.
నాశనపు గుంటలోనుండి యెహోవా నన్ను పైకిలేపాడు.
    ఆ బురద గుంటలోనుండి ఆయన పైకి లేపాడు.
ఆయన నన్ను పైకి లేపి, ఒక బండమీద నన్ను ఉంచాడు.
    ఆయన నా పాదాలను స్థిరపరచాడు.
ఒక క్రొత్త కీర్తనను, ఒక స్తుతి కీర్తనను
    యెహోవా నా నోట ఉంచాడు.
నాకు జరిగిన విషయాలను అనేకమంది చూస్తారు. వారు దేవుని ఆరాధిస్తారు.
    వారు యెహోవాను నమ్ముకొంటారు.
ఒక మనిషి యెహోవాను నమ్ముకొంటే
    ఆ మనిషి నిజంగా సంతోషంగా ఉంటాడు.
    ఒక మనిషి సహాయం కోసం దయ్యాల తట్టు మరియు తప్పుడు దేవుళ్ళ తట్టు, విగ్రహాల తట్టు, తిరుగకుండా ఉంటే ఆ మనిషి నిజంగా సంతోషంగా ఉంటాడు.
యెహోవా, మా దేవా, నీవు ఎన్నో అద్భుత కార్యాలు చేశావు.
    మాకోసం నీ వద్ద అద్భుత పథకాలు ఉన్నాయి. యెహోవా, నీవలె ఎవడూ లేడు.
నీవు చేసిన పనులను గూర్చి నేను మరల మరల చెబుతాను.
    నేను లెక్కించగలిగిన వాటికంటే ఎక్కువ విషయాలున్నాయి.

యెహోవా, నీవు నాకు ఈ గ్రహింపు కలిగించావు.
    బలులు, ధాన్యార్పణలు నిజంగా నీవు కోరలేదు.
    దహన బలులు, పాపపరిహారార్థపు బలులు నిజంగా నీవు కోరలేదు.
అందుచేత నేను అన్నాను, “ఇదిగో, నేను వస్తున్నాను.
    నన్ను గూర్చి గ్రంథంలో ఈలాగువ్రాయబడింది.
నా దేవా, నీవు కోరినట్టే నేను చేయగోరుతున్నాను.
    నీ ఉపదేశాలు నా హృదయంలో ఉన్నాయి.”
మంచితనాన్ని గూర్చిన శుభవార్త మహా సమాజానికి నేను చెబుతాను.
    యెహోవా, నేను నా నోరు మూసికొని ఉండనని నీకు తెలుసు.
10 యెహోవా, నీవు చేసిన మంచి కార్యాలను గూర్చి నేను చెబుతాను.
    ఆ మంచి కార్యాలను నా హృదయంలోనే రహస్యంగా ఉంచుకోను.
యెహోవా, ప్రజల యెడల నీవు ఎలా వాస్తవంగాను, నమ్మకంగాను ఉన్నావో అది నేను చెబుతాను.
    నీవు ప్రజల్ని ఎలా రక్షిస్తావో అది చెబుతాను. నీ దయ, నమ్మకత్వాన్ని గూర్చి సమాజంలోని మనుష్యులకు నేను దాచిపెట్టను.
11 కనుక యెహోవా, నీ కనికరం నాకు మరుగు చేయవద్దు.
    నీ దయ, కనికరం ఎల్లప్పుడూ నన్ను కాపాడనిమ్ము.

12 దుష్టులు నన్ను చుట్టుముట్టారు.
    లెక్కించాలంటే వారు చాలా మంది ఉన్నారు.
నా పాపాలు నన్ను పట్టుకొన్నాయి.
    నేను వాటిని తప్పించుకోలేను.
నా తలమీది వెంట్రుకల కంటె నా పాపాలు ఎక్కువగా ఉన్నాయి.
    నేను ధైర్యాన్ని కోల్పోయాను.
13 యెహోవా, నా దగ్గరకు వేగంగా వచ్చి నన్ను రక్షించుము.
    త్వరగా వచ్చి నాకు సహాయం చేయుము.
14 ఆ దుర్మార్గులు నన్ను చంపాలని చూస్తున్నారు.
    యెహోవా, ఆ మనుష్యులు సిగ్గుపడి, నిరాశ చెందేటట్టుగా చేయుము.
    ఆ మనుష్యులు నాకు హాని చేయాలని కోరుతున్నారు. వాళ్లను సిగ్గుతో పారిపోనిమ్ము.
15 ఆ చెడ్డ మనుష్యులు నన్ను ఎగతాళి చేస్తారు.
    వాళ్లు మాట్లాడలేనంతగా వారిని ఇబ్బంది పడనిమ్ము.
16 కాని నీకోసం చూచే మనుష్యుల్ని సంతోషంగా ఉండనిమ్ము.
    “యెహోవాను స్తుతించుము.” అని ఆ మనుష్యుల్ని ఎల్లప్పుడూ చెప్పనిమ్ము. నీ చేత రక్షించబడటం ఆ మనుష్యులకు ఎంతో ఇష్టం.

17 ప్రభూ, నేను కేవలం నిస్సహాయ, నిరుపేద మనిషిని.
    యెహోవా, నన్ను గూర్చి ఆలోచించుము.
నాకు సహాయం చేయుము.
    నన్ను రక్షించుము, నా దేవా, త్వరగా రమ్ము.

కీర్తనలు. 54

సంగీత నాయకునికి: వాయిద్యాలతో పాడునది. దావీదు ధ్యానము. జిఫీయులు సౌలు దగ్గరకు వెళ్లి “దావీదు మా ప్రజల వద్ద దాక్కొన్నాడని తలస్తున్నాము” అని అతనితో చెప్పినప్పటిది.

54 దేవా, నీ నామం ద్వారా నన్ను రక్షించుము.
    నన్ను విడుదల చేయుటకు నీ శక్తి ఉపయోగించుము.
దేవా, నా ప్రార్థనను,
    నేను చెప్పే సంగతులను ఆలకించుము.
పరదేశీయులు నాకు విరోధంగా తిరిగారు.
    బలాఢ్యులైన మనుష్యులు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు. దేవా, ఆ మనుష్యులు నిన్ను కనీసం ఆరాధించరు.

చూడండి, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు.
    నా ప్రభువు నన్ను బలపరుస్తాడు.
తమ స్వంత దుష్టత్వముతో నాపై గూఢచారత్వము చేసే జనులను దేవుడు శిక్షిస్తాడు.
    దేవా, నీవు నాకు నమ్మకస్థుడవై ఉండుటనుబట్టి ఆ జనులను నాశనం చేయుము.

దేవా, నేను నీకు స్వేచ్ఛార్పణలు ఇస్తాను.
    యెహోవా, నేను నీకు వందనాలు చెల్లిస్తాను. ఎందుకంటే నీవు మంచివాడవు.
నీవు నా కష్టాలన్నిటినుండి నన్ను రక్షించావు.
    మరియు నా శత్రువులు ఓడిపోవటం నేను చూసాను.

కీర్తనలు. 51

సంగీత నాయకునికి: దావీదు కీర్తన. బత్షెబతో దావీదు పాపం చేసిన తర్వాత నాతాను ప్రవక్త దావీదు దగ్గరకి వెళ్లినప్పుడు వ్రాసిన కీర్తన.

51 దేవా, నీ నమ్మకమైన ప్రేమ మూలంగా
    నా మీద దయ చూపించుము.
నీ మహా దయ మూలంగా
    నా పాపాలన్నీ తుడిచివేయుము.
దేవా, నా దోషం అంతా తీసివేయుము.
    నా పాపాలు కడిగివేసి, నన్ను మరల శుద్ధి చేయుము.
నేను పాపం చేశానని నాకు తెలుసు.
    నేను ఎల్లప్పుడు నా పాపాన్ని ఎరిగియున్నాను.
తప్పు అని నీవు చెప్పే వాటినే నేను చేసాను.
    దేవా, నీకే వ్యతిరేకంగా నేను పాపం చేసాను.
కనుక నేను దోషినని నీవు అన్నప్పుడు నీ మాట నిజమే.
    నీవు నన్ను నిందించేటప్పుడు నీవు న్యాయవంతుడవే.
నేను పాపంలో పుట్టాను.
    పాపంలోనే నా తల్లి నన్ను గర్భాన ధరించింది.
దేవా, సంపూర్ణ భక్తిని లేదా యదార్థతను నీవు కోరతావు.
    అందుచేత నా హృదయంలో నాకు జ్ఞానమును బోధించుము.
హిస్సోపు ముక్కను ప్రయోగించి నన్ను పవిత్రం చేసే క్రమం జరిగించుము.
    నేను హిమం కంటె తెల్లగా ఉండేంతవరకు నన్ను కడుగుము.
నీవు విరుగ గొట్టిన ఎముకలను సంతోషించనిమ్ము.
    నన్ను సంతోషపరచుము! మరల నన్ను సంతోషపరచుము.
నా పాపాలను చూడకుము!
    వాటన్నింటినీ తుడిచి వేయుము.
10 దేవా, నాలో పవిత్ర హృదయాన్ని కలిగించుము
    నా ఆత్మను నూతనపరచి బలపరచుము.
11 నన్ను త్రోసివేయకుము!
    నీ పవిత్ర ఆత్మను నాలోనుండి తీసివేయకుము.
12 నీచేత రక్షించబడుట మూలంగా
    కలిగే ఆనందం నాకు తిరిగి ఇమ్ము!
    నీకు విధేయత చూపుటకు నా ఆత్మను సిద్ధంగా, స్థిరంగా ఉంచుము.
13 నీ జీవిత మార్గాలను నేను పాపులకు నేర్పిస్తాను.
    వారు తిరిగి నీ దగ్గరకు వచ్చేస్తారు.
14 దేవా, నన్ను ఘోర మరణమునుండి రక్షించుము.
    నా దేవా, నీవే నా రక్షకుడవు.
నీవు ఎంత మంచివాడవో నన్ను పాడనిమ్ము.
15     నా ప్రభువా, నా నోరు తెరచి, నీ స్తుతులు పాడనిమ్ము.
16 నీవు బలులు కోరటం లేదు.
    లేనియెడల నేను వాటిని అర్పిస్తాను. దహనబలులను నీవు కోరవు.
17 దేవా, నా విరిగిన ఆత్మయే నీకు నా బలి అర్పణ.
    దేవా, విరిగి నలిగిన హృదయాన్ని నీవు త్రోసివేయవు.

18 దేవా, సీయోను యెడల మంచితనము, దయ కలిగి ఉండుము.
    యెరూషలేము గోడలను కట్టుము.
19 అప్పుడు నీవు సరియైన బలులను, సంపూర్ణ దహనబలులను అనుభవిస్తావు.
    మరియు ప్రజలు మరల నీ బలిపీఠం మీద ఎద్దులను అర్పిస్తారు.

నెహెమ్యా 2

అర్తహషస్త నెహెమ్యాను యెరూషలేముకు పంపటం

అర్తహషస్త రాజు పాలన ఇరవయ్యవ సంపత్సరం, నీసాను నెలలో,[a] ఎవరో కొంత ద్రాక్షారసం తెచ్చి ఇచ్చారు. నేను ముందు దాన్ని తాగి, పరిక్షించి, తర్వాత దాన్ని రాజుకు అందించాను. నేను రాజు సమక్షంలో వున్నప్పుడెప్పుడూ విచారంగా లేను, కాని అప్పుడు విచారంగా వున్నాను. దానితో, రాజు నన్ను, “నీ ఒంట్లో బాగాలేదా, ఎందుకలా విచారంగా కనిపిస్తున్నావు? నీ గుండెల్లో విచారం గూడు కట్టుకుందన్నట్లు అనిపిస్తోంది” అని ప్రశ్నించాడు.

అప్పుడు నేను చాలా భయపడ్డాను. అయితేనేమి, నేను భయపడినా కూడా, రాజుతో, “రాజు చిరంజీవిగా వర్ధిల్లాలి! నా పూర్వీకులు సమాధి చేయబడిన నగరం శిథిలమైంది. ఆ నగర ప్రాకార ద్వారాలు దగ్ధం చేయబడ్డాయి” అని విన్నవించాను.

అప్పుడు రాజు, “నీకు నావల్ల ఏ సహాయం కావాలి?” అని నన్ను అడిగాడు.

జవాబిచ్చేందుకు ముందు, నేను పరలోక దేవుణ్ణి ప్రార్థించి. రాజుకు ఇలా సమాధానమిచ్చాను. “రాజుకు దయ కలిగితే, నేను తమపట్ల మంచిగా ప్రవర్తించివుంటే, దయచేసి నన్ను నా పూర్వీకులు సమాధి చేయబడిన యెరూషలేము నగరానికి పంపండి. నేను అక్కడికి పోయి, ఆ నగరాన్ని తిరిగి నిర్మించాలని కోరుకొంటున్నాను.”

అప్పుడు రాణి రాజు పక్కనే కూర్చుని వుంది. రాజు మరియు రాణి, “నీ ప్రయాణానికి ఎన్ని రోజులు పడుతుంది? నువ్విక్కడకి తిరిగి ఎప్పుడు వస్తావు?” అని అడిగారు.

అందుకని, ఇంత సమయము పట్టును అని చెప్పాను, నన్ను పంపేందుకు రాజుగారు సంతోషంగా ఒప్పుకున్నారు. నేను రాజుతో ఇంకా యిలా మనవి చేసుకున్నాను: “రాజురు దయదలిస్తే మరో కోరిక కూడా కోరుకుంటాను. యూఫ్రటీసు నది పశ్చిమ ప్రాంతపు పాలనాధికార్లకు కొన్ని ఉత్తరువు లేఖలు ఇప్పించండి. నేను యూదాకి పోయే మార్గంలో వారివారి ప్రాంతాల్లో క్షేమంగా పోయేందుకు ఆ పాల నాధికార్లు నాకు అనుమతి ఇచ్చేందుకు ఈ లేఖలు నాకు అవసరము. నగర ప్రాకార ద్వారాలకూ, గోడలకూ, ఆలయ ప్రాకారానికీ,[b] నా యింటికీ కలప కావాలి. తమ అడవులకు బాధ్యుడైన అధికారి ఆసాపుకి ఒక లేఖ ఇవ్వండి.”

రాజు నాకు లేఖలే కాకుండా, నేను కోరినవన్నీ ఇచ్చాడు. నా పట్ల దేవుని దయ కారణంగా రాజు ఇవన్నీ చేశాడు.

సరే, నేను యూఫ్రటిసు నది పశ్చిమ ప్రాంతాల పాలనాధికారి వద్దకు వెళ్లాను. నేను రాజురి లేఖలు వారికి యిచ్చాను. రాజు నాకు తోడుగా కొందరు సైనికోద్యోగులను, అశ్విక సైనికులను కూడా పంపాడు. 10 నేను చేస్తున్నదేమిటో చూసినవాళ్లు ఇద్దరు, సన్బల్లటు, టోబీయా. వాళ్లు కలత చెందారు. ఇశ్రాయేలు ప్రజలకి తోడ్పడేందుకు ఎవరో వచ్చినందుకు వాళ్లకి కోపం కలిగింది. సన్బల్లటు హారోనీయుడు, టోబీయా అమ్మోనీయుడు.

నెహెమ్యా చేత యెరూషలేము గోడల తనిఖీ

11-12 నేను యెరూషలేముకు పోయి, అక్కడ మూడు రోజులు వున్నాను. తర్వాత రాత్రిపూట కొద్దిమందిని వెంటతీసుకొని బయల్దేరాను. యెరూషలేముకు నేను ఏమి చేయాలన్న సంకల్పం నాకు దేవుడు నా హృదయంలో కలిగించిన దానిని గురించి నేను ఎవరికీ ఏమీ చెప్పలేదు. నేను సవారీ చేస్తున్న గుర్రం తప్పనాకు వేరే గుర్రాలేమీ లేవు. 13 చీకట్లో నేను లోయ ద్వారం గుండా బయటికి వెళ్లాను. నేను నక్కల బావి దిక్కున సవారీచేస్తూ పోయి, బూడిద రాశుల ద్వారం దగ్గరికి పోయాను. నేను యెరూషలేము గోడలు తనిఖీ చేస్తూ పోయాను. గోడలు శిథిలమయ్యాయి, ద్వారాలు కాలిపోయి వున్నాయి. 14 తర్వాత నేను నీటిబుగ్గ ద్వారంవద్దకు, రాజ కోనేరుల దిశగా సవారీ చేస్తూ పోయాను. నేను దగ్గరికి పోయేసరికి అక్కడి మార్గం నా గుర్రం పోలేనంతటి యిరుకుగా వుండటం గమనించాను. 15 అందుకని నేను చీకట్లో గోడని పరిశీలిస్తూ లోయపైకి పోయాను. చివరికి నేను వెనక్కి తిరిగి, లోయ ద్వారం గుండా లోనికి పోయాను. 16 అధికారులకు, ఇశ్రాయేలులోని ప్రముఖులకు నేనెక్కడికి వెళ్లానో తెలియదు. నేనేమి చేస్తున్నానో తెలియదు. యూదులకు, యాజకులకు, రాజ కుటుంబీకులకు, ఉద్యోగులకు, లేక పని చేయబోయే ఏ యితరులకు నేను అప్పటికింకా ఏమీ చెప్పలేదు.

17 తర్వాత నేను వాళ్లందరికీ యిలా చెప్పాను: “మనకు ఇక్కడున్న ఇబ్బందేమిటో మీరు చూడగలరనుకుంటున్నాను. యెరూషలేము శిథిలాల గుట్టలావుంది. దాని ద్వారాలు మంటలకి కాలిపొయాయి. రండి, యెరూషలేము ప్రాకారాన్ని తిరిగి కట్టెదము. అప్పుడిక మనం ఎప్పటికీ సిగ్గుపడము.” 18 అప్పుడు నేను వాళ్లకి దేవుడు నాపట్ల ఎలాదయ చూపాడో చెప్పాను. రాగారు నాతో అన్న మాటలుచె ప్పాను. అప్పుడు వాళ్లు, “ఇప్పుడే పని ప్రారంభిద్దాం పదండి!” అన్నారు. దానితో మేము ఈ మంచి పని ప్రారంభించాము. 19 హారోనీయుడైన సన్బల్లటు, అమ్మోనీయ ఉద్యోగి టోబీయా, అరబీయుడైన గెషెము మేము తిరిగి నిర్మాణం సాగిస్తున్నామన్న విషయం విన్నారు. వాళ్లు మమ్మల్ని, “ఏమిటి మీరు చేస్తున్న పని? రాజు మీదే తిరుగుబాటు చెయ్యబోతున్నారా?” అంటూ చెడుగా ఎగతాళి చేశారు.

20 అయితే, నేను వాళ్లకిలా బదులు చెప్పాను: “పరలోకమందున్న దేవుడే మా పనిలో మాకు విజయం చేకూరుస్తాడు. దేవుని దాసులమైన మేము ఈ నగరాన్ని తిరిగి నిర్మిస్తున్నాము. ఈ కృషిలో మాకు మీరు సహాయం చెయ్యలేరు. మీ కుటుంబంలో ఏ ఒక్కరూ ఇక్కడ యెరూషలేములో నివసించలేదు. ఈ నేలలో కొంచెం స్థలం కూడా మీకు చెందదు. మీకు యిక్కడ వుండే హక్కు బొత్తిగా లేదు!”

ప్రకటన 6:12-7:4

12 ఆయన ఆరవ ముద్రను విప్పుతూ ఉంటే నేను చూసాను. ఒక పెద్ద భూకంపం కలిగింది. గొఱ్ఱె బొచ్చుతో చేసిన గొంగళిలాగా, సూర్యగోళం నల్లగా మారిపోయింది. పున్నమి చంద్రబింబం ఎఱ్ఱటి రక్తంలా మారిపోయింది. 13 తీవ్రంగా గాలి వీచినప్పుడు, కాలం కాని కాలంలో కాచిన అంజూరపు పండ్లు క్రింద పడినట్లు, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు భూమ్మీద పడ్డాయి. 14 ఆకాశం కాగితంలా చుట్టుకుపోయి మాయమైపోయింది. అన్ని పర్వతాలు, ద్వీపాలు స్థానం తప్పాయి.

15 అప్పుడు ఈ భూమిని పాలించే రాజులు, యువరాజులు, సైన్యాధిపతులు, శ్రీమంతులు, శక్తివంతులు, బానిసలు, బానిసలు కానివాళ్ళు గుహల్లో, పర్వతాలపై ఉన్న రాళ్ళ మధ్య దాక్కొన్నారు. 16 వాళ్ళు పర్వతాలను, రాళ్ళను పిలుస్తూ, “మాకు అడ్డంగా పడి మమ్మల్ని సింహాసనంపై కూర్చొన్నవానినుండి, ఆ గొఱ్ఱెపిల్ల కోపంనుండి కాపాడండి. 17 ఆయన ఆగ్రహం చూపించే గొప్ప దినం వచ్చింది! దాన్ని ఎవరు ఎదుర్కోగలరు?” అని అన్నారు.

దేవుని సేవకులు రక్షింపబడతారు

ఇది జరిగిన తర్వాత భూమి నాలుగు మూలలా నలుగురు దేవదూతలు నిలబడి ఉండటం చూసాను. వాళ్ళు భూమ్మీద, సముద్రం మీద, చెట్ల మీద గాలి వీయకుండా భూమి యొక్క నలుదిశలనుండి వీచే గాలిని పట్టుకొన్నారు. అతడు వారిని పిలిచాడు. ఈ నలుగురి దూతలకు భూమికి, సముద్రానికి హాని చేయగల శక్తి ఉంది. మరొక దూత తూర్పునుండి రావటం చూసాను. అతని దగ్గర చిరంజీవి అయిన దేవుని ముద్ర ఉంది. అతడు బిగ్గరగా ఆ నలుగురి దూతలతో, “దేవుని సేవకుల నొసళ్ళపై ముద్ర వేసే వరకు, భూమికి గాని, సముద్రానికి గాని, చెట్లకు గాని హాని కలిగించకండి” అని అన్నాడు.

ఆ తర్వాత ముద్రలు వేయబడ్డవారి సంఖ్య నాకు వినబడింది. వాళ్ళ సంఖ్య మొత్తం ఒక లక్ష నలభై నాలుగు వేలు. వీళ్ళందరు ఇశ్రాయేలు జనాంగం, అన్ని గోత్రాలకు చెందిన వాళ్ళు.

మత్తయి 13:24-30

కలుపు మొక్కలు

24 యేసు వాళ్ళకింకొక ఉపమానం చెప్పాడు: “దేవుని రాజ్యాన్ని మంచి విత్తనాల్ని తన పొలంలో నాటిన మనిషితో పోల్చవచ్చు. 25 అందరూ నిద్రపోతుండగా అతని శత్రువు వచ్చి గోధుమ విత్తనాల మధ్య కలుపు విత్తనాలను చల్లిపోయాడు. 26 గోధుమ మొలకెత్తి విత్తనం వేసింది. వాటితో సహా కలుపుమొక్కలు కూడ కనిపించాయి. 27 పని వాళ్ళు, తమ యజమాని దగ్గరకు వచ్చి ‘అయ్యా! మీరు మీ పొలంలో మంచి విత్తనాలను నాటలేదా? మరి కలపు మొక్కలు ఎట్లా మొలిచాయి?’ అని అడిగారు.

28 “‘ఇది శత్రువు చేసిన పని’ అని ఆ యజమాని సమాధానం చెప్పాడు.

“పని వాళ్ళు, ‘మమ్మల్ని వెళ్ళి కలుపు తీయమంటారా?’ అని అడిగారు.

29 “అతడు, ‘వద్దు! మీరిప్పుడు కలుపు తీస్తే గోధుమ మొక్కల్ని కూడా పెరికి వేసే అవకాశం ఉంది. 30 కోతకొచ్చేవరకు రెండింటినీ పెరగనివ్వండి. అప్పుడు నేను కోత కోసే వాళ్ళతో, మొదట కలుపు మొక్కలు కోసి, కాల్చివేయటానికి వాటిని మోపులుగా కట్టి కాల్చివేయండి. ఆ తర్వాత గోధుమ గింజల్ని ప్రోగు చేసి నా ధాన్యపు కొట్టులోకి తీసుకు వెళ్ళమంటాను’ అని అంటాడు.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International