Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 37

దావీదు కీర్తన.

37 దుర్మార్గుల పట్ల కోపగించకుము
    చెడు పనులు చేసేవారి పట్ల అసూయచెందకు.
గడ్డి, పచ్చటి మొక్కలు త్వరలోనే వాడిపోయి చస్తాయి.
    దుర్మార్గులు సరిగ్గా అలానే ఉంటారు.
నీవు యెహోవాయందు నమ్మకం ఉంచి, మంచి పనులు చేస్తే
    నీవు బ్రతికి, దేశం ఇచ్చే అనేక వస్తువులను అనుభవిస్తావు.
యెహోవాను సేవించటంలో ఆనందించుము.
    ఆయన నీకు కావల్సినవాటిని యిస్తాడు.
యెహోవా మీద ఆధారపడుము. ఆయనను నమ్ముకొనుము.
    జరగాల్సినదాన్ని ఆయన జరిగిస్తాడు.
నీ మంచితనం, న్యాయం
    మధ్యాహ్నపు సూర్యునిలా ప్రకాశింపనిమ్ము.
యెహోవాను నమ్ముకొనుము. ఆయన సహాయం కోసం కనిపెట్టుము.
    చెడ్డవాళ్లు జయించినప్పుడు కలవరపడకుము.
    చెడ్డవాళ్లు చెడు తలంపులు తలంచి, వారి తలంపులు జయించినప్పుడు కలవరపడకుము.
కోపగించవద్దు, ఆవేశపడవద్దు, నీవు కూడ కీడు చెయ్యాలి అనిపించేటంతగా తొందరపడిపోకుము.
ఎందుకంటే దుర్మార్గులు నాశనం చేయబడతారు.
    కాని సహాయం కోసం యెహోవాను వేడుకొనే వారికి దేశం సొంతమవుతుంది.
10 కొద్ది కాలానికి ఇక దుర్మార్గులు ఉండరు.
    అలాంటి మనుష్యుల కోసం నీవు చూడవచ్చు. కాని వాళ్లు కనబడరు.
11 దీనులు భూమిని జయిస్తారు,
    వాళ్లు శాంతిని అనుభవిస్తారు.

12 దుర్మార్గులు మంచి వాళ్లకు విరోధంగా కీడు చేయాలని తలుస్తారు.
    ఆ దుర్మార్గులు మంచి మనుష్యుల మీద పండ్లు కొరికి, తమ కోపం వ్యక్తం చేస్తారు.
13 అయితే మన ప్రభువు ఆ దుర్మార్గులను చూచి నవ్వుతాడు,
    వారికి సంభవించే సంగతులను ఆయన చూస్తాడు.
14 దుర్మార్గులు వారి ఖడ్గాలు తీసుకొంటారు, విల్లు ఎక్కుపెడ్తారు. పేదలను, నిస్సహాయులను వాళ్లు చంపాలని చూస్తారు.
    మంచివాళ్లను, నిజాయితీపరులను వాళ్లు చంపాలని చూస్తారు.
15 కాని వారి విల్లులు విరిగిపోతాయి.
    వారి ఖడ్గాలు వారి స్వంత గుండెల్లో గుచ్చుకు పోతాయి.
16 దుష్టుల ఐశ్వర్యంకంటే
    మంచివాని అల్పభాగమే ఉత్తమమైనది.
17 ఎందుకంటే దుర్మార్గులు నాశనం చేయబడుతారు.
    కాని మంచివాళ్ల విషయమై యెహోవా శ్రద్ధ పుచ్చుకొంటాడు.
18 పవిత్రమైన మనుష్యుల్ని వారి జీవితాంతం వరకూ యెహోవా కాపాడుతాడు.
    వారి ప్రతిఫలం శాశ్వతంగా ఉంటుంది.
19 కష్టం వచ్చినప్పుడు మంచి మనుష్యులు నాశనం చేయబడరు.
    కరువు కాలం వచ్చినప్పుడు మంచి మనుష్యులకు భోజనం సమృద్ధిగా ఉంటుంది.
20 కాని దుర్మార్గులు యెహోవాకు శత్రువులు,
    ఆ దుర్మార్గులు నాశనం చేయబడుతారు.
వారు పొలంలోని పువ్వులవలె అదృశ్యమౌతారు.
    వారు పొగవలె కనబడకుండా పోతారు.
21 దుర్మార్గుడు త్వరగా అప్పు చేస్తాడు. అతడు దాన్ని మరల చెల్లించడు.
    కాని మంచి మనిషి సంతోషంతో ఇతరులకు ఇస్తాడు.
22 ఒకవేళ ఒక మంచి మనిషి ప్రజలను ఆశీర్వదిస్తే, అప్పుడు ఆ ప్రజలు దేవుడు వాగ్దానం చేసిన భూమిని పొందుతారు.
    కాని ప్రజలకు కీడు జరగాలని గనుక అతడు అడిగితే, అప్పుడు ఆ మనుష్యులు నాశనం చేయబడతారు.
23 ఒకడు జాగ్రత్తగా నడిచేందుకు యెహోవా సహాయం చేస్తాడు.
    వాని నడవడియందు యెహోవా ఆనందిస్తాడు.
24 అతడు తొట్రుపడినా పడిపోడు,
    ఎందుకంటే యెహోవా వాని చేయిపట్టుకొని పడిపోకుండా చేస్తాడు.
25 నేను యువకునిగా ఉండేవాడ్ని, ఇప్పుడు ముసలివాడినయ్యాను.
    మంచి మనుష్యులకు దేవుడు సహాయం చేయకుండా విడిచిపెట్టడం నేను ఎన్నడూ చూడలేదు.
    మంచి మనుష్యుల పిల్లలు భోజనం కోసం భిక్షం ఎత్తుకోవడం నేను ఎన్నడూ చూడలేదు.
26 మంచి మనిషి ఇతరులకు ఎల్లప్పుడూ ఉచితంగానే ఇస్తూంటాడు.
    మంచి మనిషి పిల్లలు ఆశీర్వాదం పొందుతారు.
27 నీవు చెడు పనులు చేయటం మానివేసి మంచి పనులు చేస్తే
    అప్పుడు నీవు శాశ్వతంగా జీవిస్తావు.
28 యెహోవా న్యాయాన్ని ప్రేమిస్తాడు.
    ఆయన తన భక్తులకు సహాయం చేయకుండా విడిచిపెట్టడు.
యెహోవా తన భక్తులను ఎల్లప్పుడూ కాపాడతాడు.
    కాని దుష్టులను ఆయన నాశనం చేస్తాడు.
29 మంచి మనుష్యులకు దేవుడు వాగ్దానం చేసిన భూమి దొరుకుతుంది.
    వారు దానిమీద శాశ్వతంగా నివసిస్తారు.
30 మంచి మనిషి మంచి సలహా యిస్తాడు.
    అతని నిర్ణయాలు ప్రతి ఒక్కరికి న్యాయంగా ఉంటాయి.
31 యెహోవా ఉపదేశాలు మంచి మనిషి హృదయంలో ఉంటాయి.
    అతడు సరిగా జీవించే విధానాన్ని విడిచిపెట్టడు.

32 కాని చెడ్డవాళ్లు, మంచివాళ్లను బాధించే మార్గాలను వెదకుతారు.
    మరియు చెడ్డవాళ్లు మంచివాళ్లను చంపటానికి ప్రయత్నిస్తారు.
33 యెహోవా దుష్టుల శక్తికి మంచివారిని వదిలి వేయడు.
    మంచివారిని దోషులుగా ఆయన తీర్చబడనీయడు.
34 యెహోవా సహాయం కోసం కనిపెట్టుము. యెహోవాను అనుసరించుము.
    దుర్మార్గులు నాశనం చేయబడతారు. కాని యెహోవా నిన్ను ప్రముఖునిగా చేస్తాడు,
    మరియు దేవుడు వాగ్దానం చేసిన భూమిని నీవు పొందుతావు.

35 శక్తిమంతులైన దుర్మార్గులను నేను చూశాను.
    వారి శక్తి ఒక బలమైన, ఆరోగ్యమైన వృక్షంలా పెరుగుతూ వచ్చింది.
36 కాని తర్వాత వారు లేకుండా పోయారు.
    నేను వారికోసం చూశాను, కాని వారు నాకు కనబడలేదు.
37 నీతి, నిజాయితీ కలిగి ఉండి,
    సమాధానపరచువారి సంతతి నిలుస్తుంది. అది శాంతి కలిగిస్తుంది.
38 అయితే చట్టాన్ని ఉల్లంఘించే వారందరు నాశనం చేయబడతారు.
    వారి సంతానం భూమిని వదలవలసి వస్తుంది.
39 నీతిమంతులను యెహోవా రక్షిస్తాడు.
    నీతిమంతులకు కష్టాలు వచ్చినప్పుడు యెహోవా వారికి బలంగా ఉంటాడు.
40 నీతిమంతులకు యెహోవా సహాయం చేస్తాడు. వారిని రక్షిస్తాడు.
    నీతిమంతులు సహాయంకోసం యెహోవా దగ్గరకు వస్తారు, మరియు యెహోవా దుర్మార్గుల నుండి వారిని రక్షిస్తాడు.

ఎజ్రా 1

యూదుల చెర విముక్తికి కోరెషు సహాయం

పారశీక రాజ్యానికి కోరెషు రాజైన మొదటి సంవత్సరం,[a] యెహోవా కోరెషును ఒక ప్రకటన చేయవలసిందిగా ప్రోత్సహించాడు. కోరెషు ఆ ప్రకటనను వ్రాయించి, తన రాజ్యపు అన్ని ప్రాంతాలలోనూ చదివి వినిపించే ఏర్పాటు చేశాడు. దేవుడు యిర్మీయా నోట పలికించిన యీ సందేశం[b] వాస్తవ రూపం ధరించేందుకు అనువుగా ఈ ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన యిలా సాగింది:

“పారశీక రాజు కోరెషు తెలియజేసేది ఏమంటే:

పరలోకాధిపతి అయిన యెహోవా దేవుడు భూలోకంలోని దేశాలన్నింటినీ నాకు అప్పగించాడు. యూదా దేశంలోని యెరూషలేములో తనకొక ఆలయాన్ని నిర్మించేందుకుగాను యెహోవా నన్ను ఎంచుకున్నాడు. యెరూషలేములో వున్న ఇశ్రాయేలీయుల దేవుడే ప్రభువైన యెహోవా. మీ మధ్య దేవుని మనుష్యులు ఎవరైనా వున్నట్లయితే, వారిని ఆశీర్వదించ వలసిందిగా నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను. యూదా దేశంలోని యెరూషలేముకు మీరు వాళ్లని పోనివ్వాలి. మీరు వాళ్లని దేవుని ఆలయాన్ని నిర్మించనివ్వాలి ఇశ్రాయేలీయుల్లో మిగిలివున్నవాళ్లు[c] ఎక్కడైనా ఉన్నట్లయితే, వాళ్లకి అక్కడి ప్రజలు తోడ్పడాలి. ప్రజలు ఆ హతశేషులకు వెండిది బంగారాలు, ఆవులు, వగైరాలు ఇవ్వాలి. యెరూషలేములో దేవాలయ నిర్మాణం కోసం వాళ్లకి కానుకలు ఇవ్వాలి.”

యూదా, బెన్యామీను వంశాలకు చెందిన కుటుంబాల పెద్దలు యెరూషలేముకు పోయేందుకు సన్నద్ధ మయ్యారు. వాళ్లు యెరూషలోములో దేవాలయ నిర్మాణానికి పోసాగారు. వాళ్లే కాకుండా, దేవుడు ప్రేరేపించిన ప్రతి ఒక్క వ్యక్తి యెరూషలేముకు పోయేందుకు సంసిద్ధుడయ్యాడు. వాళ్ల ఇరుగుపొరుగు వారు వాళ్లకి అనేక కానుకలు సమర్పించారు. వెండి బంగారాలు, ఆవులు, ఖరీదైన ఇతర వస్తువులు ఇచ్చారు. ఇరుగు పొరుగువారు వాళ్లకి ఈ కానుకలన్నీ స్వచ్ఛందంగా ఇచ్చారు. పూర్వం నెబుకద్నెజరు యెరూషలేమునందున్న యెహోవా ఆలయానికి చెందిన కొన్ని వస్తువులు కొల్లగొట్టి, వాటిని తన అబద్ధపు దేవతల ఆలయంలో వుంచాడు. వాటిని ఇప్పుడు కోరెషు మహారాజు బయటికి తీయించాడు. పారశీక రాజైన కోరెషు ఆ వస్తువులను బయటికి తీసుకురమ్మని తన ఖజానాదారుని ఆదేశించాడు. ఆ ఖజానాదారుని పేరు మిత్రిదాతు. మిత్రిదాతు ఆ వస్తువులను బయటికి తీయించి, వాటిని యూదా నాయకుడైన షేష్బజ్జరుకు[d] అప్పగించాడు.

మిత్రిదాతు బయటికి తెచ్చిన దేవాలయ వస్తువుల జాబితా యిది: బంగారు గిన్నెలు 30, వెండి గిన్నెలు 1,000, చాకులు, పెనాలు 29, 10 బంగారు పాత్రలు 30, బంగారు పాత్రల వంటివే వెండి పాత్రలు 410, ఇతర పాత్రలు 1,000.

11 వెండి బంగారాలతో చేసిన వస్తువులు కలసి మొత్తం 5,400 వున్నాయి. బబులోను చెరనుండి విడి పింపబడినవారు యెరూషలేముకు తిరిగి వెళ్లేటప్పుడు, షేష్బజ్జరు పై వస్తువులన్నింటినీ తనతో యెరూషలేముకు తీసుకువెళ్లాడు.

1 కొరింథీయులకు 16:1-9

పరిశుద్ధుల కోసం చందా

16 పరిశుద్ధుల కోసం సేకరించవలసిన చందాల విషయంలో ఏం చెయ్యాలో, గలతీయలో ఉన్న సంఘాలకు చెప్పాను. మీరు కూడా అదే విధంగా చెయ్యండి. తన సంపాదనను బట్టి ప్రతి ఒక్కడూ కొంత డబ్బు ఆదివారం రోజు దాచాలి. అలా చేస్తే నేను వచ్చిన రోజెల్లా చందానెత్తనవసరం ఉండదు. నేను వచ్చాక మీరెన్నుకొన్నవాళ్ళకు పరిచయ పత్రాలు వ్రాసి వాళ్ళతో మీరు సేకరించిన డబ్బును యెరూషలేము పంపుతాను. నేను కూడా వెళ్ళటం ఉచితమని అనిపిస్తే అంతా కలిసి వెళ్తాం.

పౌలు ప్రణాళికలు

నేను మాసిదోనియ ద్వారా వెళ్ళాలి కనుక అక్కడికి వెళ్ళి, మీ దగ్గరకు వస్తాను. అలా చేస్తే నేను మీతో కొంతకాలం గడపవచ్చు. బహుశా చలికాలమంతా అక్కడే ఉంటానేమో. ఆ తర్వాత నా ముందు ప్రయాణం ఎక్కడికైతే అక్కడికి వెళ్ళటానికి మీరు సహాయపడవచ్చు. అందుకే ప్రస్తుతం మీ దగ్గరకు రావాలని లేదు. అలా చేస్తే, నేను వెళ్తూ మిమ్మల్ని చూసినట్లు మాత్రమే ఔతుంది. అలా కాక, ప్రభువు చిత్తమైతే మీతో కొంతకాలం గడపాలని ఉంది. నేను ఎఫెసులో పెంతుకొస్తు పండుగ దాకా ఉంటాను. అక్కడ ఫలవంతమైన కార్యాలు చెయ్యటానికి నాకొక గొప్ప అవకాశం కలిగింది. కాని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు.

మత్తయి 12:15-21

యేసు దేవునిచేత ఎన్నుకొనబడిన సేవకుడు

15 యేసు ఇది తెలుసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చాలా మంది ఆయన్ని అనుసరించారు. ఆయన వాళ్ళ వ్యాధుల్ని నయం చేసాడు. 16 తనను గురించి ఎవ్వరికీ చెప్పవద్దని వాళ్ళను హెచ్చరించాడు. 17 యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన ఈ వాక్యాలు నిజం కావటానికి ఈ విధంగా జరిగింది:

18 “ఆయన నేనెన్నుకున్న
    నా సేవకుడు!
ఆయన పట్ల నాకు ప్రేమవుంది.
    ఆయన నా ఆత్మకు చాలా ఆనందం కలిగించాడు.
నా ఆత్మ ఆయన పైకి రప్పించుదును.
    ఆయన జనములకు న్యాయం చేకూరుతుందని ప్రకటిస్తాడు.
19 ఆయన పోట్లాడడు: కేకలు పెట్టడు,
    ఆయన ధ్వని వీధిలోని వాళ్ళకెవ్వరికి వినిపించదు.
20 న్యాయం చేకూరే వరకు నలిగిన రెల్లును ఆయన విరువడు.
    ఆరిపోతున్న దీపాన్ని ఆయన ఆర్పడు.
21 ఈయన పేరుమీద ఇతర జనాలకు నిరీక్షణ కలుగుతుంది.”(A)

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International