Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 119:1-24

ఆలెఫ్[a]

119 పవిత్ర జీవితాలు జీవించేవాళ్లు సంతోషంగా ఉంటారు.
    ఆ మనుష్యులు యెహోవా ఉపదేశాలను అనుసరిస్తారు.
యెహోవా ఒడంబడికకు విధేయులయ్యే ప్రజలు సంతోషిస్తారు.
    వారు వారి హృదయపూర్తిగా యెహోవాకు విధేయులవుతారు.
ఆ మనుష్యులు చెడ్డ పనులు చెయ్యరు.
    వారు యెహోవాకు విధేయులవుతారు.
యెహోవా, నీవు మాకు నీ ఆజ్ఞలిచ్చావు.
    ఆ ఆజ్ఞలకు మేము పూర్తిగా విధేయులము కావాలని నీవు మాతో చెప్పావు.
యెహోవా, నేను నీ ఆజ్ఞలకు
    ఎల్లప్పుడూ విధేయుడనౌతాను,
అప్పుడు నేను నీ ఆజ్ఞలను
    ఎప్పుడు చదివినా సిగ్గుపడను.
అప్పుడు నేను నీ న్యాయం, నీ మంచితనం గూర్చి చదివి
    నిన్ను నిజంగా ఘనపర్చగలుగుతాను.
యెహోవా, నేను నీ ఆజ్ఞలకు విధేయుడనవుతాను.
    కనుక దయచేసి నన్ను విడిచిపెట్టకుము!

బేత్

యువకుడు పవిత్ర జీవితం ఎలా జీవించగలడు?
    నీ ఆజ్ఞలను అనుసరించుట ద్వారానే.
10 నేను నా హృదయపూర్తిగా దేవుని సేవించుటకు ప్రయత్నిస్తాను.
    దేవా, నీ ఆజ్ఞలకు విధేయుడనవుటకు నాకు సహాయం చేయుము.
11 నీ ఉపదేశాలను నేను చాలా జాగ్రత్తగా ధ్యానం చేసి నా హృదయంలో భద్రపరచుకొంటాను.
    ఎందుకంటే, నేను నీకు విరోధంగా పాపం చేయను
12 యెహోవా, నీకే స్తుతి.
    నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
13 జ్ఞానంగల నీ నిర్ణయాలను గూర్చి నేను మాట్లాడుతాను.
14 ఒకడు గొప్ప ఐశ్వర్యంలో ఆనందించేలా
    నేను నీ ఆజ్ఞలు అనుసరించటంలో ఆనందిస్తాను.
15 నీ నియమాలను నేను చర్చిస్తాను.
    నీ జీవిత విధానం నేను అనుసరిస్తాను.
16 నీ న్యాయ చట్టాలలో నేను ఆనందిస్తాను.
    నీ మాటలు నేను మరచిపోను.

గీమెల్

17 నీ సేవకుడనైన నాకు మేలుగా నుండుము.
    తద్వారా నేను జీవించగలను. నేను నీ ఆజ్ఞలకు విధేయుడను అవుతాను.
18 యెహోవా, నా కళ్లు తెరువుము, అప్పుడు నేను నీ ఉపదేశములను అనుసరించి
    నీవు చేసిన ఆశ్చర్యకార్యాలను గూర్చి చదువుతాను.
19 ఈ దేశంలో నేను పరాయివాణ్ణి.
    యెహోవా, నీ ఉపదేశాలు నాకు దాచిపెట్టకుము.
20 నేను ఎంతసేపూ నీ నిర్ణయాలను గూర్చి
    చదవాలని కోరుతున్నాను.
21 యెహోవా, గర్వించే ప్రజలను నీవు గద్దిస్తావు.
    ఆ గర్విష్ఠులకు కీడులే సంభవిస్తాయి.
    నీ అజ్ఞలకు విధేయులవుటకు వారు నిరాకరిస్తారు.
22 నన్ను సిగ్గుపడనియ్యకు, ఇబ్బంది పడనియ్యకు.
    నేను నీ ఒడంబడికకు విధేయుడనయ్యాను.
23 నాయకులు కూడ నన్ను గూర్చి చెడు విషయాలు చెప్పారు.
    అయితే యెహోవా, నేను నీ సేవకుడను; మరియు నేను నీ న్యాయ చట్టాలు చదువుతాను.
24 నీ ధర్మశాస్త్రమే నాకు శ్రేష్ఠమైన స్నేహితుడు.
    అది నాకు మంచి సలహా ఇస్తుంది.

కీర్తనలు. 12-14

సంగీత నాయకునికి: షెమినిత్ రాగం. దావీదు కీర్తన.

12 యెహోవా, నన్ను రక్షించుము!
    మంచి మనుష్యులంతా పోయారు.
    భూమి మీద ఉన్న మనుష్యులందరిలో సత్యవంతులైన విశ్వాసులు ఎవ్వరూ మిగల్లేదు.
మనుష్యులు వారి పొరుగువారితో అబద్ధాలు చెబుతారు.
    ప్రతి ఒక్క వ్యక్తీ, తన పొరుగువారికి అబద్ధాలు చెప్పి, ఉబ్బిస్తాడు.
అబద్ధాలు చెప్పేవారి పెదవులను యెహోవా కోసివేయాలి.
    పెద్ద గొప్పలు పలికే వారి నాలుకలను యెహోవా కోసివేయాలి.
“మన అబద్ధాలే మనలను ప్రముఖులుగా అయ్యేందుకు తోడ్పడతాయి.
మన నాలుకలు ఉండగా, మన మీద ఎవ్వరూ పెద్దగా ఉండరు.”
    అని ఆ ప్రజలు చెప్పుకొంటారు.

కాని యెహోవా చెబుతున్నాడు,
    “దుర్మార్గులు పేదల దగ్గర వస్తువులు దొంగిలించారు.
ఆ నిస్సహాయ ప్రజలు వారి దుఃఖం వ్యక్తం చేయటానికి గట్టిగా నిట్టూర్చారు.
    కాని ఇప్పుడు నేను నిలిచి, దాన్ని కోరేవారికి క్షేమము నిచ్చెదను.”

యెహోవా మాటలు సత్యం, నిర్మలం.
    నిప్పుల కుంపటిలో కరగించిన స్వచ్ఛమైన వెండిలా పవిత్రంగా ఆ మాటలు ఉంటాయి.
    కరిగించబడి ఏడుసార్లు పోయబడిన వెండిలా నిర్మలముగా ఆ మాటలు ఉంటాయి.

యెహోవా, నిస్సహాయ ప్రజల విషయమై జాగ్రత్త తీసుకొంటావు.
    ఇప్పుడు, శాశ్వతంగా నీవు వారిని కాపాడుతావు.
మనుష్యుల మధ్యలో దుష్టత్వము, చెడుతనము పెరిగినప్పుడు
    ఆ దుర్మార్గులు వారేదో ప్రముఖులైనట్టు తిరుగుతుంటారు.

సంగీత నాయకునికి: దావీదు కీర్తన.

13 యెహోవా, ఎన్నాళ్లు నన్ను మరచిపోతావు?
    నీవు నన్ను శాశ్వతంగా మరచిపోతావా?
నీవు నన్ను స్వీకరించకుండా ఎన్నాళ్లు నిరాకరిస్తావు?
నీవు ఒకవేళ నన్ను మరచిపోయావేమోనని ఇంకెన్నాళ్లు నేను తలంచాలి?
    ఇంకెన్నాళ్లు నేను నా హృదయంలో దుఃఖ అనుభూతిని పొందాలి?
ఇంకెన్నాళ్లు నా శత్రువు నా మీద విజయాలు సాధిస్తాడు?

నా దేవా, యెహోవా, నన్ను చూడుము. నా ప్రశ్నలకు జవాబిమ్ము.
    నన్ను ఆ జవాబు తెలుసుకోనిమ్ము. లేదా నేను చనిపోతాను!
అప్పుడు నా శత్రువు, “నేనే వానిని ఓడించాను” అనవచ్చు.
    నేను అంతం అయ్యానని నా శత్రువు సంతోషిస్తాడు.

యెహోవా, నాకు సహాయం చేయుటకు నీ ప్రేమనే నేను నమ్ముకొన్నాను.
    నీవు నన్ను రక్షించి, నన్ను ఆనందింపజేశావు.
యెహోవా నాకు మేలైన కార్యాలు చేశాడు.
    కనుక నేను యెహోవాకు ఒక ఆనందగీతం పాడుతాను.

సంగీత నాయకునికి: దావీదు కీర్తన.

14 “దేవుడు లేడు” అని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొంటారు.
    బుద్ధిహీనులు దారుణమైన, చెడు కార్యాలు చేస్తారు.
    వారిలో కనీసం ఒక్కడు కూడా మంచి పనులు చేయడు.

పరలోకం నుండి యెహోవా క్రింద మనుష్యులను చూశాడు.
    వివేకంగలవాణ్ణి కనుక్కోవాలని దేవుడు ప్రయత్నించాడు.
    (వివేకంగల వాడు సహాయం కోసం దేవుని తట్టు తిరుగుతాడు.)
కాని ప్రతి మనిషి దేవుని నుండి తిరిగిపోయాడు.
    మొత్తం మనుష్యులంతా చెడ్డవాళ్లయ్యారు.
కనీసం ఒక్క వ్యక్తి కూడా
    మంచి పనులు చేయలేదు.

దుర్మార్గులు నా ప్రజలను నాశనం చేశారు.
    ఆ దుర్మార్గులు దేవుణ్ణి అర్థం చేసుకోరు.
    దుర్మార్గులు తినుటకు ఆహారం సమృద్ధిగా ఉంది.
    ఆ మనుష్యులు యెహోవాను ఆరాధించరు.
5-6 దుష్టులైన మీరు పేదవారి ఆలోచనలను చెడగొడ్తారు.
    కాని పేదవాడు తన రక్షణకొరకు దేవుని మీద ఆధారపడ్డాడు.
కాని ఆ దుర్మార్గులు చాలా భయపడిపోయారు.
    ఎందుకంటే దేవుడు మంచి మనుష్యులతో ఉన్నాడు గనుక.

సీయోనులోని ఇశ్రాయేలీయులను ఎవరు రక్షిస్తారు?
    ఇశ్రాయేలీయులను రక్షించేవాడు యెహోవాయే. యెహోవా ప్రజలు తీసుకొనిపోబడ్డారు. బలవంతంగా బందీలుగా చేయబడ్డారు.
కాని యెహోవా తన ప్రజలను వెనుకకు తీసుకొని వస్తాడు.
    ఆ సమయంలో యాకోబు (ఇశ్రాయేలు) ఎంతో సంతోషిస్తాడు.

యిర్మీయా 37:3-21

యెహుకలు అనువానిని, యాజకుడైన జెఫన్యాను రాజైన సిద్కియా ప్రవక్తయగు యిర్మీయా వద్ధకు ఒక సందేశమిచ్చి పంపాడు. యెహుకలు తండ్రి పేరు షెలెమ్యా. యాజకుడైన జెఫన్యా తండ్రి పేరు మయశేయా. వారు యిర్మీయాకు తెచ్చిన వర్తమానం యిలా ఉంది: “యిర్మీయా, మా కొరకు మన యెహోవా దేవుని ప్రార్థించు.”

(ఆ సమయంలో ఇంకా యిర్మీయా చెరసాలలో నిర్బంధించబడలేదు. కావున అతనెక్కడికి వెళ్లాలన్నా స్వేచ్ఛ కలిగియున్నాడు. అదే సమయంలో ఈజిప్టు నుండి ఫరో సైన్యం కూడా యూదా వైపుకు కదలి వచ్చింది. కల్దీయుల సైన్యం యెరూషలేమును ఓడించటానికి దానిని చుట్టుముట్టింది. అయితే, ఈజిప్టు నుండి వచ్చిన సైన్యం (కల్దీయులు) తమ మీదికి వస్తున్నట్లు వారు విన్నారు. కావున బబులోను సైన్యం యెరూషలేమును వదలి ఈజిప్టు సైన్యాన్ని ఎదిరించటానికి వెళ్లింది.)

యెహోవా నుండి ఒక వర్తమానం ప్రవక్తయైన యిర్మీయాకు వచ్చింది: “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ వర్తమానం చెప్పుచున్నాడు: ‘యెహుకలు మరియు జెఫన్యా! యూదా రాజైన సిద్కియా నన్ను ప్రశ్నలడిగే నిమిత్తం మిమ్మల్ని నావద్దకు పంపినట్లు నాకు తెలుసు. రాజైన సిద్కియాకు ఇలా చెప్పండి: ఫరో సైన్యం బబులోను సైన్యాన్ని ఎదుర్కొనే విషయంలో నీకు సహాయం చేయాలని ఈజిప్టు నుండి ఇక్కడికి కదలి వస్తున్నది. కాని ఫరో సైన్యం ఈజిప్టుకు తిరిగి వెళ్లిపోతుంది. ఆ తరువాత బబులోను సైన్యం ఇక్కడికి తిరిగి వస్తుంది. వారు యెరూషలేము మీద దాడి చేస్తారు. బబులోను సైన్యం ఆ పిమ్మట యెరూషలేమును వశపర్చుకొని దానిని తగలబెడుతుంది.’ యెహోవా ఇలా అంటున్నాడు: ‘యెరూషలేము ప్రజలారా మిమ్మల్ని మీరు మోసగించుకోవద్దు. “బబులోను సైన్యం మమ్మల్ని వదలి తప్పక వెళ్లి పోతుంది” అని మీకు మీరు అనుకోవద్దు. వారు మిమ్మల్ని వదలరు. 10 యెరూషలేము ప్రజలారా, మిమ్మల్ని ఎదుర్కొనే కల్దీయుల సైన్యాన్నంతా మీరు ఓడించగలిగినా వారి డేరాలలో కొద్దిమంది గాయపడిన సైనికులు మిగులుతారు. ఆ కొద్దిమంది గాయపడిన మనుష్యులే వారి డేరాల నుండి వచ్చి యెరూషలేమును తగలబెడతారు.’”

11 కల్దీయుల సైన్యం ఈజిప్టు రాజైన ఫరో సైన్యాన్ని ఎదుర్కొనటానికి యెరూషలేమును వదిలిన సమయంలో 12 యిర్మీయా యెరూషలేము నుండి బెన్యామీను దేశానికి[a] వెళ్లగోరాడు. అక్కడ తన కుటుంబ ఆస్తుల పంపకం విషయంలో యిర్మీయా వెళ్లాడు. 13 కాని యెరూషలేములో బెన్యామీను ద్వారం[b] వద్దకు వెళ్లే సరికి రక్షక భటాధికారి యిర్మీయాను నిర్బంధించాడు. ఈ అధికారి పేరు ఇరీయా. ఇరీయా తండ్రి పేరు షెలెమ్యా. షెలెమ్యో తండ్రి పేరు హనన్యా. రక్షక భటాధికారి అయిన ఇరీయా యిర్మీయాను నిర్బంధంలోకి తీసుకొని “యిర్మీయా, నీవు మమ్మల్ని వదిలి బబులోను పక్షం వహించటానికి వెళ్తున్నావు” అని అన్నాడు.

14 “అది నిజం కాదు! నేను బబులోను పక్షం వహించటానికి వెళ్లటం లేదు” అని యిర్మీయా ఇరీయాతో అన్నాడు. కాని యిర్మీయా చెప్పేది ఇరీయా వినటానికి నిరాకరించాడు. యిర్మీయాను ఇరీయా నిర్బంధించి యెరూషలేములో రాజ్యాధికారుల వద్దకు తీసికొని వెళ్లాడు. 15 ఆ అధికారులు యిర్మీయా పట్ల చాలా కోపగించారు. యిర్మీయాను దండించాలని వారు ఆజ్ఞ ఇచ్చారు. వారు యిర్మీయాను కారాగారంలో నిర్బంధించారు. యోనాతాను అనేవాని ఇంటిలో ఈ చెరసాల ఉంది. యోనాతాను యూదా రాజుకు లేఖకుడు. యోనాతాను ఇంటిని చెరసాలగా మార్చారు. 16 యోనాతాను ఇంటి క్రిందవున్న చెరసాల గదిలో వారు యిర్మీయాను నిర్బంధించారు. అది ఇంటి క్రింద భూమిలో కట్టిన ఒక చెరసాల గది. యిర్మీయా అందులో చాలాకాలం ఉన్నాడు.

17 పిమ్మట రాజైన సిద్కియా మనుష్యులను పంపగా వారు యిర్మీయాను రాజభవనానికి తీసికొని వచ్చారు. యిర్మీయాతో సిద్కియా ఏకాంతంగా మాట్లాడాడు. “యెహోవా నుండి ఏమైనా సందేశం వచ్చిందా?” అని యిర్మీయాను అడిగాడు.

“అవును. యెహోవా సందేశం ఒకటి ఉంది సిద్కియా, నీవు బబులోను రాజుకు ఇవ్వబడతావు” అని యిర్మీయా సమాధాన మిచ్చాడు. 18 తరువాత యిర్మీయా రాజైన సిద్కియాతో ఇలా అన్నాడు. “నేను ఏమి తప్పు చేశాను? నీ పట్లగాని, నీ అధికారుల పట్లగాని యెరూషలేము ప్రజల పట్లగాని నేను చేసిన నేరం ఏమిటి? నన్నెందుకు కారాగృహంలో పడవేశావు? 19 సిద్కియా రాజా, నీ ప్రవక్తలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఆ ప్రవక్తలు నీకు తప్పుడు వర్తమానం యిచ్చారు. ‘బబులోను రాజు నిన్నుగాని, ఈ యూదా రాజ్యాన్ని గాని ఎదుర్కోడు’ అని వారన్నారు. 20 కాని మహారాజా, ఇప్పుడు నేను చెప్పేది దయచేసి వినండి. దయచేసి నా విన్నపం ఆలకించండి. నేనడిగేది ఏమంటే లేఖకుడైన యోనాతాను ఇంటికి నన్ను మరల పంపవద్దు. మీరు నన్ను మరల పంపితే నేనక్కడ చనిపోతాను.”

21 కావున యిర్మీయాను రాజభవనపు ఆవరణలోనే నిర్బందించి ఉంచాలని రాజైన సిద్కియా ఆజ్ఞాపించాడు. వీధిలోని రొట్టెల దుకాణము నుండి రొట్టె తెచ్చి యిర్మీయాకు ఇవ్వాలని కూడ రాజు ఆజ్ఞాపించాడు. నగరంలో అమ్మే రొట్టెలు అయిపోయే వరకు యిర్మీయాకు రొట్టెలు ఇవ్వబడ్డాయి. ఆ విధంగా రాజ ప్రాంగణంలో యిర్మీయా బందీగా ఉన్నాడు.

1 కొరింథీయులకు 14:13-25

13 కనుక తనకు తెలియని భాషల్లో మాట్లాడేవాడు తాను మాట్లాడిన వాటికి అర్థం చెప్పగలిగే శక్తినివ్వమని దేవుణ్ణి ప్రార్థించాలి. 14 ఎందుకంటే నేను నాకు తెలియని భాషల్లో ప్రార్థిస్తే నా ఆత్మ ప్రార్థిస్తుంది కాని నా బుద్ధి అందులో పాల్గొనదు. 15 మరి నేను ఏం చెయ్యాలి? నేను నా ఆత్మతో మాత్రమే కాక, నా బుద్ధితో కూడా ప్రార్థిస్తాను. నా ఆత్మతోను నా మనస్సుతోను కూడా పాడుతాను. 16 మీరు దేవుణ్ణి ఆత్మతో స్తుతిస్తున్నారనుకోండి. మీ సమావేశంలో సభ్యుడు కానివాడుంటే, అతనికి మీరు ఏమంటున్నారో తెలియదు. కనుక, మీరు చేస్తున్న ప్రార్థనలకు ఎప్పుడు, “ఆమేన్” అని అనాలో అతనికి ఎట్లా తెలిస్తుంది? 17 మీరు సక్రమంగా స్తుతించినా ఆ వ్యక్తికి దాని వల్ల మేలు కలుగదు.

18 మీ అందరికంటే ఎక్కువగా యితర భాషల్లో మాట్లాడగలందుకు నేను దేవునికి కృతజ్ఞుణ్ణి. 19 నేను సంఘంలో మాట్లాడినప్పుడు తెలియని భాషల్లో పదివేల పదాలు మాట్లాడటం కన్నా నాకు తెలిసిన భాషల్లో ఐదు పదాలు ఉపయోగించి బోధించటం ఉత్తమమని నా అభిప్రాయము.

20 సోదరులారా! చిన్నపిల్లలవలె ఆలోచించకండి. చెడు విషయంలో చిన్నపిల్లల్లా ఉండండి. కాని ఆలోచించేటప్పుడు పెద్దవాళ్ళలా ఆలోచించండి. 21 లేఖనాల్లో ఇలా వ్రాయబడి ఉంది:

“ఇతర భాషలు మాట్లాడేవాళ్ళ ద్వారా,
    విదేశీయుల పెదాల ద్వారా
వీళ్ళతో నేను మాట్లాడుతాను.
    అయినా వాళ్ళు నా మాటలు వినరు.”(A)

22 తెలియని భాషల్లో మాట్లాడగల శక్తివుంటే, అది విశ్వాసం లేనివాళ్ళకు రుజువుగా ఉంటుంది. కాని ఆ రుజువు విశ్వాసం ఉన్నవాళ్ళకు అవసరం లేదు. అయినా దైవసందేశం విశ్వాసం ఉన్నవాళ్ళకే గాని, విశ్వాసం లేనివాళ్ళకు కాదు. 23 సంఘంలో ఉన్నవాళ్ళందరూ ఒకేచోట సమావేశమై, తమకు తెలియని భాషల్లో మాట్లాడటం మొదలు పెడతారనుకోండి. అప్పుడు సభ్యులు కానివాళ్ళు లేక విశ్వాసం లేనివాళ్ళు ఆ సమావేశంలో ఉంటే మీకు పిచ్చి ఎక్కిందని అనుకోరా? 24 దానికి మారుగా మీరంతా దైవసందేశాన్ని చెపుతున్నారనుకోండి. అప్పుడు విశ్వాసం లేనివాడో లేక సభ్యుడు కానివాడో సమావేశంలో ఉంటే మీరు చెపుతున్నది విని తప్పు తెలుసుకుంటాడు. అంటే దైవసందేశం అతనిపై తీర్పు చెప్పిందన్నమాట. 25 అతని మనస్సులో ఉన్న ఆలోచనలు బయట పడతాయి. అతడు మోకరిల్లి దేవుణ్ణి ఆరాధిస్తూ, “దేవుడు నిజంగా యిక్కడ మీతో ఉన్నాడు” అని అంగీకరిస్తాడు.

మత్తయి 10:24-33

24 “విద్యార్థి గురువుకన్నా గొప్పవాడు కాడు. అలాగే సేవకుడు యజమానికన్నా గొప్పవాడు కాడు. 25 విద్యార్థి గురువులా ఉంటే చాలు. అలాగే సేవకుడు యజమానిలా ఉంటే చాలు. ఇంటి యజమానినే బయెల్జెబూలు[a] అని అన్న వాళ్ళు ఆ యింటివాళ్ళను యింకెంత అంటారో కదా!

దేవునికి భయపడుము, జనులకు కాదు

(లూకా 12:2-7)

26 “అందువల్ల వాళ్ళకు భయపడకండి. రహస్యమైనవి బయటపడతాయి. దాచబడినవి నలుగురికి తెలుస్తాయి. 27 నేను రహస్యంగా చెబుతున్న విషయాలను బాహాటంగా యితర్లకు చెప్పండి. మీ చెవుల్లో చెప్పిన విషయాలను యింటి కప్పులపై ఎక్కి ప్రకటించండి.

28 “వాళ్ళు దేహాన్ని చంపగలరు కాని ఆత్మను చంపలేరు. వాళ్ళను గురించి భయపడకండి. శరీరాన్ని, ఆత్మను నరకంలో వేసి నాశనం చెయ్యగల వానికి భయపడండి. 29 ఒక పైసాకు రెండు పిచ్చుకలు అమ్ముతారు కదా. అయినా మీ తండ్రికి తెలియకుండా ఒక్క పిచ్చుక కూడా నేల మీదికి పడదు. 30 మీ తల మీద ఉన్న వెంట్రుకల సంఖ్య కూడా ఆయనకు తెలుసు. 31 అందువలన భయపడకండి. ఎన్ని పిచ్చుకలైనా మీకు సాటి కాలేవు.

నీ విశ్వాసాన్ని గురించి సిగ్గుపడవద్దు

(లూకా 12:8-9)

32 “నన్ను ప్రజల సమక్షంలో అంగీకరించిన ప్రతి వ్యక్తిని పరలోకంలో ఉన్న నా తండ్రి సమక్షంలో అంగీకరిస్తాను. 33 కాని ప్రజల సమక్షంలో నన్ను తిరస్కరించిన వాణ్ణి నేను పరలోకంలో ఉన్న నా తండ్రి సమక్షంలో తిరస్కరిస్తాను.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International