Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 131-135

యాత్ర కీర్తన.

131 యెహోవా, నేను గర్విష్ఠిని కాను.
    నేను ప్రముఖుడిని అన్నట్టు ప్రవర్తించ ప్రయత్నించను.
నేను గొప్ప పనులు చేయాలని ప్రయత్నించను.
    నాకు మరీ కష్టతరమైన వాటిని గూర్చి నేను చింతించను.
నేను మౌనంగా ఉన్నాను. నా ప్రాణం నెమ్మదిగా ఉంది.
    తల్లి చేతుల్లో సంతృప్తిగా ఉన్న ఒక శిశువులా
    నా ప్రాణం మౌనంగా, నెమ్మదిగా ఉంది.

ఇశ్రాయేలూ, యెహోవానే నమ్ముకో.
    ఇప్పుడు ఆయనను నమ్ముకో, ఎప్పటికీ ఆయన్నే నమ్ముకో.

యాత్ర కీర్తన.

132 యెహోవా, దావీదు శ్రమపడిన విధానం జ్ఞాపకం చేసుకొమ్ము.
కాని దావీదు యెహోవాకు ఒక ప్రత్యేక ప్రమాణం చేసాడు.
    ఇశ్రాయేలీయుల మహత్తర శక్తిగల దేవునికి దావీదు ఒక ప్రత్యేక ప్రమాణం చేసాడు.
దావీదు చెప్పాడు, “నేను నా యింట్లోకి వెళ్లను.
    నేను నా పడక మీద పండుకొనను,
నేను నిద్రపోను,
    నేను నా కండ్లకు విశ్రాంతినివ్వను,
యెహోవా కోసం నేను ఒక మందిరాన్ని కనుగొనేంత వరకు ఆ పనుల్లో ఏదీ నేను చేయను!
    ఇశ్రాయేలీయుల మహా శక్తిగల దేవునికి నేనొక గృహం చూస్తాను!”

ఎఫ్రాతాలో[a] మేము దాన్ని గూర్చి విన్నాం.
    ఒడంబడిక పెట్టెను కిర్యత్యారీము[b] దగ్గర మేము కనుగొన్నాము.
మనం పవిత్ర గుడారానికి వెళ్దాం రండి.
    దేవుడు తన పాదాలు పెట్టుకొనే పీఠం దగ్గర మనము ఆయనను ఆరాధించుకొందాం.
యెహోవా, నీ విశ్రమ స్థానం నుండి లెమ్ము.
    యెహోవా, నీవు నీ శక్తిగల ఒడంబడిక పెట్టెతో రమ్ము.
యెహోవా, నీ యాజకులు నీతిని వస్త్రాలుగా ధరించనిమ్ము.
    నీ అనుచరులు చాలా సంతోషంగా ఉన్నారు.
10 నీ సేవకుడైన దావీదు కోసం
    నీవు ఏర్పరచుకొన్న రాజును నిరాకరించవద్దు.
11 యెహోవా దావీదుతో ఒక స్థిర ప్రమాణం చేశాడు. యెహోవా దావీదుతో వెనుక తిరుగని ప్రమాణం చేశాడు.
    దావీదు వంశం నుండి రాజులు వస్తారని యెహోవా ప్రమాణం చేశాడు.
12 “దావీదూ, నీ పిల్లలు నా ఒడంబడికకు, నేను వారికి నేర్పించే నా న్యాయ చట్టాలకు విధేయులయితే
    అప్పుడు నీ వంశంలో నుండి ఎవరో ఒకరు ఎల్లప్పుడూ రాజుగా ఉంటాడు” అని యెహోవా చెప్పాడు.

13 యెహోవా, తన ఆలయ స్థానంగా ఉండుటకు సీయోనును ఎంచుకున్నాడు.
    తన నివాసస్థలంగా దాన్ని కోరుకొని యున్నాడు.
14 యెహోవా చెప్పాడు, “శాశ్వతంగా ఇదే నా స్థలం.
    నేను ఉండే చోటుగా ఈ స్థలాన్ని ఎంచుకొంటున్నాను.
15 సమృద్ధిగా ఆహారం యిచ్చి నేను ఈ పట్టణాన్ని ఆశీర్వదిస్తాను.
    ఇక్కడ పేదవాళ్లకు కూడా తినుటకు సమృద్ధిగా ఉంటుంది.
16 యాజకులకు నేను రక్షణను ధరింపచేస్తాను.
    మరియు నా అనుచరులు ఇక్కడ చాలా సంతోషంగా ఉంటారు.
17 ఈ స్థలంలో, దావీదుకు ఒక కొమ్ము లేచేలా చేస్తాను.
    నేను ఏర్పాటు చేసుకొన్న రాజుకు నేను ఒక దీపాన్ని సిద్ధం చేస్తాను.
18 దావీదు శత్రువులను నేను అవమానంతో కప్పుతాను.
    కాని దావీదు కిరీటం దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది.”

దావీదు యాత్ర కీర్తనల్లో ఒకటి.

133 సహోదరులు ఐక్యంగా శాంతి కలిగి జీవించటం
    ఎంతో మంచిది, ఎంతో ఆనందం.
అది యాజకుని తలమీద పోయబడిన కమ్మని వాసనగల తైలంలాగా ఉంటుంది. అది అహరోను గడ్డం మీదికి కారుతున్న తైలంలాగా ఉంటుంది.
    అది అహరోను ప్రత్యేక వస్త్రాల మీదికి కారుతున్న తైలంలాగ ఉంటుంది.
అది హెర్మోను పర్వతం మీద నుండి సీయోను కొండమీద పడుతున్న మంచులా ఉంటుంది.
    సీయోను వద్దనే యెహోవా తన ఆశీర్వాదం ఇచ్చాడు. శాశ్వతజీవాన్ని ఆశీర్వాదంగా యెహోవా ఇచ్చాడు.

యాత్ర కీర్తన.

134 యెహోవా సేవకులారా, మీరందరూ ఆయన్ని స్తుతించండి!
    రాత్రి అంతా ఆలయంలో సేవించిన సేవకులారా, మీరందరూ ఆయన్ని స్తుతించండి.
సేవకులారా, మీ చేతులు ఎత్తి
    యెహోవాను స్తుతించండి.
యెహోవా సీయోనులో నుండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక!
    యెహోవా ఆకాశాన్ని, భూమిని చేశాడు.

135 యెహోవాను స్తుతించండి.
    యెహోవా సేవకులారా, యెహోవా నామాన్ని స్తుతించండి.
యెహోవా ఆలయంలో నిలిచి ఉండే ప్రజలారా, ఆయన నామాన్ని స్తుతించండి!
    ఆలయ ప్రాంగణంలో నిలబడే ప్రజలారా, ఆయన నామాన్ని స్తుతించండి!
యెహోవా మంచివాడు గనుక ఆయనను స్తుతించండి.
    యెహోవాను స్తుతించుట ఆనందదాయకం గనుక ఆయన నామాన్ని స్తుతించండి.

యెహోవా యాకోబును కోరుతున్నాడు.
    యెహోవా ఇశ్రాయేలును తన విశేషమైన సొత్తుగా ఎన్నుకొన్నాడు.
యెహోవా గొప్పవాడని నాకు తెలుసు.
    మన ప్రభువు ఇతర దేవుళ్లందరికంటె గొప్పవాడు!
ఆకాశంలో, భూమి మీద, సముద్రాల్లో,
    అగాధపు మహా సముద్రాల్లో యెహోవా ఏది చేయాలనుకొంటే అది చేస్తాడు.
భూమికి పైగా మేఘాలను దేవుడు చేస్తాడు.
    మెరుపులను, వర్షాన్ని దేవుడు చేస్తాడు.
    దేవుడు గాలిని తన నిధిలోనుండి రప్పిస్తాడు.
ఈజిప్టు మనుష్యులలో జ్యేష్ఠులందరినీ, జంతువులలో మొదట పుట్టినవాటన్నిటినీ దేవుడు నాశనం చేసాడు.
దేవుడు ఈజిప్టులో అనేకమైన ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు చేసాడు.
    ఫరోకు, అతని అధికారులకు ఆ సంగతులు సంభవించేలా దేవుడు చేశాడు.
10 దేవుడు అనేక రాజ్యాలను ఓడించాడు.
    బలమైన రాజులను దేవుడు చంపేసాడు.
11 అమోరీయుల రాజైన సీహోనును దేవుడు ఓడించాడు.
    బాషాను రాజైన ఓగును దేవుడు ఓడించాడు.
    కనానులోని జనాంగాలన్నింటినీ దేవుడు ఓడించాడు.
12 వారి దేశాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు.
    దేవుడు ఆ దేశాన్ని తన ప్రజలకు ఇచ్చాడు.

13 యెహోవా, నీ పేరు శాశ్వతంగా ఖ్యాతి కలిగియుంటుంది.
    యెహోవా, ప్రజలు నిన్ను ఎప్పటికీ జ్ఞాపకం చేసుకొంటారు.
14 యెహోవా జనాంగాల్ని శిక్షించాడు.
    కాని తన సేవకుల యెడల దయ చూపించాడు.
15 ఇతర మనుష్యుల దేవుళ్లు కేవలం వెండి, బంగారు విగ్రహాలే.
    వారి దేవుళ్లు కేవలం మనుష్యులు చేసిన విగ్రహాలే.
16 ఆ విగ్రహాలకు నోళ్లు ఉన్నాయి. కాని అవి మాట్లాడలేవు.
    కళ్లు వున్నాయి కాని అవి చూడలేవు.
17 ఆ విగ్రహాలకు చెవులు ఉన్నాయి కాని అవి వినలేవు.
    ముక్కులు ఉన్నాయి కాని అవి వాసన చూడలేవు.
18 మరియు ఆ విగ్రహాలను తయారు చేసిన మనుష్యులు సరిగ్గా ఆ విగ్రహాల్లాగానే అవుతారు.
    ఎందుకంటే వారికి సహాయం చేయాలని వారు ఆ విగ్రహాల మీదనే నమ్మకముంచారు.

19 ఇశ్రాయేలు వంశమా, యెహోవాను స్తుతించు!
    అహరోను వంశమా, యెహోవాను స్తుతించు.
20 లేవీ వంశమా, యెహోవాను స్తుతించు!
    యెహోవాను ఆరాధించే ప్రజలారా, యెహోవాను స్తుతించండి.
21 సీయోనులో నుండి, తన నివాసమైన యెరూషలేములో నుండి,
    యెహోవా స్తుతించబడును గాక!

యెహోవాను స్తుతించండి!

2 రాజులు 23:4-25

తర్వాత ప్రధాన యాజకుడు అయిన హిల్కీయా, ఇతర యాజకులు, ద్వారపాలకులు మొదలైన వారికి రాజు ఆజ్ఞాపించాడు, యెహోవా యొక్క ఆలయము నుండి బయలు అషేరాదేవికి, ఆకాశములోని నక్షత్రాలను గౌరవించేందుకు చేయబడిన అన్ని పాత్రలు తీసుకురమ్మని తర్వాత యోషీయా ఆ వస్తువులను యెరూషలేముకు వెలుపల కిద్రోను లోయలో కాల్చివేశాడు. తర్వాత వారు బూడిదను బెతేలుకు తీసుకువెళ్లారు.

యూదా రాజులు కొందరు సామాన్యులను యాజకులుగా ఎంపిక చేశారు. ఆ మనుష్యులు అహరోను వంశానికి చెందినవారు కారు. ఆ అబద్ధపు యాజకులు యూదాలోని ప్రతినగరంలో ఉన్నత స్థానాలలోను యెరూషలేముకు చుట్టుప్రక్కలనున్న పట్టణాలలోను ధూపం వెలిగించారు. వారు బయలునకు సూర్య చంద్రులను, నక్షత్రగణాలను, ఆకాశంలోని అన్ని నక్షత్రాలను గౌరవించేందుకు ధూపం వేసారు. కాని యోషీయా ఆ అబద్ధపు యాజకుల చేతలు ఆపివేశాడు.

యోషీయా యెహోవాయొక్క ఆలయము నుండి అషేరా స్తంభము తొలగించాడు. అతను అషేరా స్తంభము యెరూషలేము వెలుపలికి తీసుకువెళ్లి కిద్రోను లోయలో కాల్చివేశాడు. తర్వాత ఆ కాల్చిన వస్తువులను ధూళిగా చేసి, ఆ ధూళిని సామాన్యుల సమాధుల మీద చల్లాడు.

తర్వాత యోషీయా రాజు యెహోవా ఆలయంలోని పురుష వ్యభిచారుల ఇండ్లను ధ్వంసము చేశాడు. ఆ ఇండ్లను స్త్రీలు కూడా ఉపయోగించి, అబద్ధపు దేవత అషేరా గౌరవార్థం గుడారపు కప్పులు తయారు చేశారు.

8-9 ఆ సమయాన యాజకులు బలులు యెరూషలేముకు తీసుకురాలేదు; ఆలయములో బలిపీఠం మీద వాటిని నివేదించలేదు. యూదా అంతటా నగరాలలో యాజకులు నివసించారు. ఆ నగరాలలో వారు ఉన్నత స్థానాలలో ధూపము వేసేవారు. బలులు సమర్పించేవారు. ఆ ఉన్నత స్థలాలు గెబానుండి బెయేర్షెబా వరకు అన్ని చోట్ల వుండేవి. మరియు యాజకులు ఆ పట్టణాలలో పులియని రొట్టెను సామాన్యులతో కలిసి తింటూ ఉన్నారు. యెరూషలేములో యాజకులకోసం ప్రత్యేకించబడిన స్థలంలో కాదు. కాని యోషీయా రాజు ఆ ఉన్నత స్థానాలను ధ్వంసము చేసి, యెరూషలేముకు ఆ యాజకులను తీసుకువచ్చాడు. యోషీయా యెహోషువ ద్వారానికి ఎడమ నున్న ఉన్నత స్థానాలను కూడా ధ్వంసము చేశాడు. (యెహోషువ ఆ నగరపు పాలకుడు).

10 అబద్ధపు దేవుడైన మొలెకు గౌరవార్థం ప్రజలు తమ పిల్లలను చంపి బలిపీఠం మీద కాల్చివేసేవారు. ఈ పని బెన్‌హిన్నోము లోయలో తోఫెతు అనేచోట జరిగేది. యోషీయా ఆ స్థలాన్ని ప్రజలు దానిని మరల ఉపయోగించుకొనేందుకు వీలులేనంతగా ధ్వంసము చేశాడు. 11 వెనకటి కాలంలో, యూదా రాజులు యెహోవా యొక్క ఆలయ ప్రవేశద్వారం వద్ద కొన్ని గుర్రాలను, ఒక రథాన్ని ఉంచేవారు. నెతన్మెలకు అనే ముఖ్య అధికారి గదికి దగ్గరగా వుండేది. ఆ గుర్రాలూ, రథమూ సూర్యదేవుని గౌరవార్థం నిలపబడేవి. యోషీయా ఆ గుర్రాలను తొలగించి రథాన్ని కాల్చివేశాడు.

12 వెనుకటి రోజుల్లో, యూదా రాజుల అహాబు భవనం కప్పు మీద బలిపీఠాలు అమర్చారు. మనష్షే రాజు కూడా యెహోవా యొక్క ఆలయము రెండు ప్రాంగణాలలో బలిపీఠాలు నిర్మించాడు. యోషీయా ఆ బలిపీఠాలన్నిటినీ నాశనము చేశాడు. విరిగిపోయిన ముక్కలను కిద్రోను లోయలోకి విసిరివేశాడు.

13 వెనుకటి కాలములో, సొలొమోను రాజు యెరూషలేముకు దగ్గరలో “నాశన పర్వతము” మీద కొన్ని ఉన్నత స్థలాలు నిర్మించాడు. ఆ కొండకు దక్షిణంగా ఆ ఉన్నత స్థలాలు ఉండేవి. ఆ ఉన్నతస్థలాలలో ఒకటి అష్ఠారోతు గౌరవార్థము కట్టబడింది. సీదోను ప్రజలు ఆరాధించే హేయమైన విగ్రహమది. మరియు సొలొమోను రాజు మిలోము గౌరవార్థం ఒక ఉన్నత స్థానము నిర్మించాడు. అమ్మోనీయులు కొలిచే హేయమైన విగ్రహమది. కాని యోషీయా రాజు ఆ ఆరాధనా స్థలాలన్నిటినీ ధ్వంసంచేశాడు. 14 యోషీయా రాజు స్మారక శిలలను పగులగొట్టాడు; అషరా స్తంభాలను విరగగొట్టాడు. తర్వాత అతను ఆ స్థలము మీద చచ్చినవారి ఎముకలను వెదజల్లాడు.

15 యోషీయా బేతేలు వద్ద గల బలిపీఠాన్ని ఉన్నత స్థలమును ధ్వంసము చేశాడు. నెబాతు కొడుకైన యరొబాము ఈ బలిపీఠం నిర్మించాడు. యరొబాము ఇశ్రాయేలుని పాపానికి పాల్పడజేశాడు. యోషీయా బలిపీఠపు శిలలను ముక్కలు ముక్కలుగా చేశాడు. యోషీయా బలిపీఠమును ఉన్నత స్థానమును ధ్వంసము చేశాడు. తర్వాత వాటిని ధూళిగా చేశాడు. మరియు అతను అషేరా స్తంభమును కాల్చివేసెను. 16 యోషీయా చుట్టు ప్రక్కలు చూచెను; కొండమీద సమాధులు కనిపించాయి అతను మనుష్యులను పంపాడు. వారు ఆ సమాధులనుండి ఎముకలు తీసుకువాచ్చారు. తర్వాత బలిపీఠం మీద ఆ ఎముకలను కాల్చాడు. ఈ విధంగా యోషీయా బలిపీఠాన్ని అపవిత్రము చేశాడు. దైవజనుడు ప్రకటించెనని యెహోవా యొక్క సందేశం తెలిపినట్లుగా ఇది జరిగింది. యరొబాము బలిపీఠం ప్రక్కగా నిలబడినప్పుడు దైవజనుడు ఇది ప్రకటించాడు.

తర్వాత యోషీయా చుట్టుప్రక్కల చూశాడు. దైవజనుడి సమాధి చూశాడు.

17 “నేను చూస్తున్న సమాధి ఏమిటి?” అని యోషీయా అడిగాడు.

“యూదానుంచి వచ్చిన దైవజనుని సమాధి ఇది. బేతేలులోని బలిపీఠానికి నీవు చేసిన పనులను ఈ దైవజనుడు చెప్పాడు. ఈ విషయాలను అతను చాలా కాలము క్రిందటనే సూచించాడు” అని ఆ నగర ప్రజలు చెప్పారు.

18 “దైవజనుడను ఒంటరిగా విడిచిపెట్టండి, అతని ఎముకలను కదిలించకండి” అని యోషీయా చెప్పాడు. అందువల్ల వారు అతని ఎముకలు విడిచిపెట్టారు. షోమ్రోను నుంచి వచ్చిన దైవజనుని ఎముకలు కూడా విడిచిపెట్టారు.

19 యోషీయా షోమ్రోను నగరాలలోని ఉన్నత స్థలాలలో వున్న అన్ని ఆలయాలను కూడా ధ్వంసము చేశాడు. ఇశ్రాయేలు రాజులు ఆ ఆలయాలను నిర్మించారు. అది యెహోవాను ఆగ్రహాపరిచింది. యోషీయా బేతేలులోని ఆరాధనాస్థలాలను ధ్వంసము చేసినట్లుగా, ఆ ఆలయాలను కూడా ధ్వంసము చేశాడు.

20 యోషీయా షోమ్రోనులోని ఉన్నత స్థలాలకు చెందిన యాజకులందరినీ చంపివేశాడు. ఆ బలిపీఠముల మీద ఆ యాజకులను చంపాడు. బలిపీఠముల మీద మనుష్యుల ఎముకలు కాల్చాడు. ఈ విధంగా అతను ఆ ఆరాధనా స్థలాలను పాడుచేశాడు. తర్వాత అతను యెరుషలేముకు మరలి వెళ్లాడు.

యూదా ప్రజలు పస్కా పండుగను ఆచరించుట

21 తర్వాత యోషీయా రాజు ప్రజలందరకు ఒక ఆజ్ఞ విధించాడు. “మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగను ఆచరించండి. ఒడంబడిక పుస్తకంలో వ్రాయబడినట్లుగా జరపండి” అని అతను చెప్పాడు.

22 న్యాయాధిపతులు ఇశ్రాయేలుని పరిపాలించిన నాటినుంచి ప్రజలు ఈ విధంగా ఆ ఉత్సవము జరపలేదు. ఇశ్రాయేలు రాజులుగాని, యూదా రాజులుగాని పస్కా పండుగను అంత బ్రహ్మాండంగా ఆచరించి వుండలేదు. 23 యోషీయా రాజయిన 18వ సంవత్సరాన యెరూషలేములో యెహోవాకు ఈ ఉత్సవము జరిపారు.

24 కర్ణపిశాచి గలవారిని, సొదె చెప్పువారిని, గృహదేవతలను, విగ్రహాలను, యూదా యెరూషలేములోనున్న ప్రజలు పూజించే ఆ భయంకర వస్తువులను యోషీయా నాశనము చేశాడు. హిల్కీయా యాజకుడు యెహోవాయొక్క ఆలయములో కనుగొన్న ధర్మశాస్త్రములోని నియమాలను పాటించేందుకు యోషీయా ఈ విధముగా చేశాడు.

25 అంతకు ముందు యోషీయా వంటి రాజు లేడు. యోషీయా పూర్ణహృదయముతో, పూర్ణ ఆత్మతో శక్తినంతా కూడాగట్టుకుని యెహోవా వైపు నిలిచాడు. యోషీయా వలె మోషే ధర్మశాస్త్రాన్ని ఏ రాజు పాటించి వుండలేదు. ఆ తర్వాత కూడా యోషీయా వంటి మరొక రాజు లేడు.

1 కొరింథీయులకు 12:1-11

పవిత్రాత్మ వరాలు

12 సోదరులారా! పరిశుద్ధాత్మ యిచ్చే వరాలను గురించి మీరు తెలుసుకోవాలని నా అభిప్రాయము. మీరు క్రీస్తులో విశ్వాసులు కానప్పుడు ఏదో ఒక విధంగా ప్రేరేపింపబడి త్రోవతప్పి, మాట్లాడలేని విగ్రహాల వైపుకు మళ్ళారు. ఇది మీకు తెలుసు. అందువల్ల నేను చెప్పేదేమిటంటే, దేవుని ఆత్మ ద్వారా మాట్లాడేవాడెవ్వడూ, “యేసు శాపగ్రస్తుడని” అనడు. అదే విధంగా ఆత్మ ద్వారా మాత్రమే “యేసే ప్రభువు” అని అనగలడు.

దేవుని ఆత్మ ఒక్కడే అయినా ఆయన ఎన్నో రకాల వరాలిస్తాడు. ప్రభువు ఒక్కడే కాని, ఆయనకు ఎన్నో విధాలుగా సేవ చేయవచ్చు. దేవుడు నలుగురిలో పలువిధాలుగా పని చేస్తాడు. దేవుడు ఒక్కడే అయినా ఆయన అన్నీ చేస్తాడు. అందరిలో చేస్తాడు.

దేవుడు ప్రతీ ఒక్కరిలో తన ఆత్మ ఉండేటట్లు చేసాడు. ఇది మనము చూస్తున్నాము. అందరికీ శ్రేయస్సు కలగాలని ఆయన ఉద్దేశ్యం. ఒకనికి పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మీయ జ్ఞానంతో మాట్లాడే వరాన్ని, ఆ ఆత్మ ద్వారానే బుద్ధి వాక్యాన్ని ఇచ్చాడు. అదే పరిశుద్ధాత్మ ద్వారా ఒకనికి విశ్వాసము ఇచ్చాడు. మరొకనికి వ్యాధులు నయం చేసే వరము నిచ్చాడు. 10 ఒకనికి అద్భుతాలు చేయు శక్తిని, మరొకనికి ప్రవచించే శక్తిని ఇచ్చాడు. ఒకనికి ఆత్మలను గుర్తించే శక్తిని, మరొకనికి రకరకాల భాషల్లో మాట్లాడే శక్తిని ఇచ్చాడు. ఇంకొకనికి వాటి అర్థాలను విడమర్చి చెప్పే శక్తినిచ్చాడు. 11 ఆ ఒక్క ఆత్మయే అన్నీ చేస్తున్నాడు. ఆయన తన యిచ్ఛానుసారం ప్రతీ ఒక్కనికి వరాల్ని ఇస్తాడు.

మత్తయి 9:18-26

యేసు బాలికను బ్రతికించటం, ఒక స్త్రీని నయం చేయటం

(మార్కు 5:21-43; లూకా 8:40-56)

18 యేసు ఈ విధంగా మాట్లాడుతుండగా యూదుల సమాజమందిరానికి అధికారిగా ఉన్నవాడు ఒకడు వచ్చి, ఆయన ముందు మోకరిల్లి, “నా కూతురు చనిపోయింది. కాని మీరు వచ్చి మీ చేయి ఆమె మీద ఉంచితే ఆమె బ్రతుకుతుంది” అని అన్నాడు.

19 యేసు, ఆయన శిష్యులు లేచి అతని వెంట వెళ్ళారు.

20 వాళ్ళు వెళ్తుండగా పండ్రెండేండ్ల నుండి రక్త స్రావంతో బాధ పడ్తున్న ఒక స్త్రీ వెనుక నుండి వచ్చి ఆయన అంగీ యొక్క కొనను తాకింది. 21 ఆమె, “నేను ఆయన వస్త్రాన్ని తాకగలిగితే చాలు నాకు నయమైపోతుంది” అని తనలో తాను అనుకొన్నది.

22 యేసు వెనక్కు తిరిగి ఆమెను చూసి, “ధైర్యంగా వుండమ్మా! నీ విశ్వాసమే నిన్ను బాగుచేసింది” అని అన్నాడు.

23 యేసు ఆ అధికారి యింట్లోకి ప్రవేశిస్తూ, అక్కడ పిల్లన గ్రోవి వాయించే వాళ్ళు, గోల చేస్తున్న వాళ్ళు ఉండటం చూసాడు. 24 వాళ్ళతో, “వెళ్ళిపొండి, ఆమె చనిపోలేదు. నిద్రపోతూ ఉంది, అంతే!” అని అన్నాడు. వాళ్ళాయన్ని హేళన చేసారు. 25 ఆయన వాళ్ళను పంపేసాక లోపలికి వెళ్ళి ఆ అమ్మాయి చేయి తాకాడు. ఆమె వెంటనే లేచి నిలుచుంది. 26 ఈ వార్త ఆ ప్రాంతమంతా వ్యాపించింది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International