Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 101

దావీదు కీర్తన.

101 ప్రేమ, న్యాయాలను గూర్చి నేను పాడుతాను.
    యెహోవా, నేను నీకు భజన చేస్తాను.
నేను జాగ్రత్తగా పరిశుద్ధ జీవితం జీవిస్తాను.
    నేను నా ఇంటిలో పరిశుద్ధ జీవితం జీవిస్తాను.
    యెహోవా, నీవు నా దగ్గరకు ఎప్పుడు వస్తావు?
నా యెదుట ఏ విగ్రహాలు[a] ఉంచుకోను.
    అలా నీకు విరోధంగా తిరిగే వారిని నేను ద్వేషిస్తాను.
    నేను అలా చేయను!
నేను నిజాయితీగా ఉంటాను.
    నేను దుర్మార్గపు పనులు చేయను.
ఒకవేళ ఎవరైనా తన పొరుగువారిని గూర్చి రహస్యంగా చెడ్డమాటలు చెబితే
    అలా చేయకుండా అతన్ని నేను ఆపివేస్తాను.
మనుష్యులు ఇతరులకంటే తామే మంచివారమని తలుస్తూ
    అతిశయించడం నేను జరుగనివ్వను.

నమ్మదగిన మనుష్యులకోసం నేను దేశం అంతటా చూస్తాను.
    ఆ మనుష్యులను మాత్రమే నేను నాకోసం పని చేయనిస్తాను.
    యదార్థ జీవితాలు జీవించేవాళ్లు మాత్రమే నా సేవకులుగా ఉండగలరు.
అబద్ధీకులను నేను నా ఇంటిలో ఉండనివ్వను.
    అబద్ధీకులను నేను నా దగ్గర ఉండనివ్వను.
ఈ దేశంలో నివసించే దుర్మార్గులను నేను ఎల్లప్పుడూ నాశనం చేస్తాను.
    దుర్మార్గులను యెహోవా పట్టణం నుండి బలవంతంగా వెళ్లగొడతాను.

కీర్తనలు. 109:1-30

సంగీత నాయకునికి: దావీదు స్తుతి కీర్తన.

109 దేవా, నా ప్రార్థనలను పెడచెవిని పెట్టవద్దు.
దుర్మార్గులు నన్ను గూర్చి అబద్ధాలు చెబుతున్నారు.
    నిజం కాని సంగతులు ఆ అబద్ధికులు చెబుతున్నారు.
ప్రజలు నన్ను గూర్చి ద్వేషపూరిత విషయాలు చెబుతున్నారు.
    ఏ కారణం లేకుండానే ప్రజలు నా మీద దాడి చేస్తున్నారు.
నేను వారిని ప్రేమిస్తున్నాను. కాని వారు నన్ను ద్వేషిస్తున్నారు.
    కనుక దేవా, ఇప్పుడు నేను నిన్ను ప్రార్థిస్తున్నాను.
ఆ ప్రజలకు నేను మంచి పనులు చేశాను.
    కాని వారు నాకు చెడ్డపనులు చేస్తున్నారు.
నేను వారిని ప్రేమించాను.
    కాని వారు నన్ను ద్వేషించారు.

నా శత్రువు చేసిన చెడు కార్యాల కోసం అతనిని శిక్షించుము.
    వానిదే తప్పు అని రుజువు చేయగల ఒక మనిషిని చూడుము.
నా శత్రువు తప్పు చేసిన దోషి అని న్యాయవాదిని తీర్పు చెప్పనీయుము.
    నా శత్రువు చెప్పే ప్రతి సంగతీ వానికి చెడుగావుండేటట్టు చేయుము.
నా శత్రువును త్వరగా చావనిమ్ము.
    నా శత్రువు ఉద్యోగం మరొకరు తీసికొనును గాక!
నా శత్రువు పిల్లలను అనాథలు కానిమ్ము, వాని భార్య విధవరాలు అగుగాక!
10 వాళ్లు వారి ఇల్లు పోగొట్టుకొని భిక్షగాళ్లు అగుదురు గాక!
11 నా శత్రువు ఎవరికైతే పైకం బాకీ ఉన్నాడో వాళ్లు అతనికి ఉన్నదంతా తీసుకోనివ్వుము.
    అతని కష్టార్జితం అంతా తెలియని వాళ్లెవరినో తీసికోనివ్వుము.
12 నా శత్రువుకు ఎవ్వరూ దయ చూపించకూడదని నా ఆశ.
    అతని పిల్లలకు ఎవ్వరూ దయ చూపించకూడదని నా ఆశ.
13 నా శత్రువును పూర్తిగా నాశనం చేయుము.
    తర్వాత తరంవారు అన్నిటిలోనుండి అతని పేరు తొలగించి వేయుదురు గాక.
14 నా శత్రువు తండ్రి పాపాలను, తల్లి పాపాలను
    యెహోవా శాశ్వతంగా జ్ఞాపకం చేసికొంటాడని నా ఆశ.
15 ఆ పాపాలను యెహోవా శాశ్వతంగా జ్ఞాపకం చేసికొంటాడని నా ఆశ.
    ప్రజలు నా శత్రువును పూర్తిగా మరచిపోయేటట్టు యెహోవా వారిని బలవంతం చేస్తాడని నా ఆశ.
16 ఎందుకంటే, ఆ దుర్మార్గుడు ఎన్నడూ ఏ మంచీ చేయలేదు.
    అతడు ఎన్నడూ ఎవరిని ప్రేమించలేదు.
    అతడు నిరుపేద, నిస్సహాయ ప్రజలకు జీవితం ఎంతో కష్టతరం చేసాడు.
17 ప్రజలకు సంభవించే చెడు సంగతులు, శాపము చూడటానికి ఆ దుర్మార్గునికి ఎంతో ఇష్టం.
    కనుక ఆ చెడు సంగతులు అతనికే సంభవించనిమ్ము.
ప్రజల కోసం మంచి సంగతులు జరగాలని ఆ దుర్మార్గుడు ఎన్నడూ అడుగలేదు.
    కనుక అతనికి మంచి సంగతులేవీ జరుగనివ్వకుము.
18 శాపాలే వానికి వస్త్రాలుగా ఉండనిమ్ము.
దుర్మార్గులు త్రాగేందుకు శాపాలే నీళ్లుగా ఉండనిమ్ము
    శాపాలే వాని శరీరం మీద తైలంగా ఉండనిమ్ము.
19 శాపాలే ఆ దుర్మార్గునికి చుట్టే వస్త్రాలుగా ఉండనిమ్ము.
    శాపాలే వాని నడుం చుట్టూ దట్టిగా ఉండనిమ్ము.

20 నా శత్రువుకు వాటన్నిటినీ యెహోవా చేస్తాడని నేను ఆశిస్తున్నాను.
    నన్ను చంపాలని చూస్తున్న మనుష్యులందరికీ వాటన్నిటినీ యెహోవా చేస్తాడని నేను ఆశిస్తున్నాను.
21 యెహోవా, నీవే నాకు ప్రభువు. కనుక నీ నామానికి గౌరవం కలిగే విధంగా నన్ను పరామర్శించు.
    నీకు ఎంతో గొప్ప ప్రేమ ఉంది. కనుక నన్ను రక్షించుము.
22 నేను కేవలం నిరుపేద, నిస్సహాయ మనిషిని,
    నేను నిజంగా దుఃఖంగా ఉన్నాను, నా హృదయం పగిలిపోయింది.
23 దినాంతంలో దీర్ఘ ఛాయలవలె నా జీవితం అయిపోయినట్టు నాకు అనిపిస్తుంది.
    ఎవరో నలిపివేసిన నల్లిలా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది.
24 నేను ఉపవాసం ఉండుటవలన నా మోకాళ్లు బలహీనంగా ఉన్నాయి.
    నా బరువు తగ్గిపోయి నేను సన్నబడుతున్నాను.
25 చెడ్డవాళ్లు నన్ను అవమానిస్తారు.
    వారు నన్ను చూచి వారి తలలు ఊపుతారు.
26 దేవా, యెహోవా! నాకు సహాయం చేయుము!
    నీ నిజమైన ప్రేమను చూపించి నన్ను రక్షించుము.
27 అప్పుడు నీవు నాకు సహాయం చేశావని ఆ ప్రజలు తెలుసుకొంటారు.
    నాకు కలిగిన సహాయం నీ శక్తివల్ల అని వారు తెలుసుకొంటారు.
28 ఆ దుర్మార్గులు నాకు శాపనార్థాలు పెడతారు; కాని యెహోవా, నీవు నన్ను ఆశీర్వదించగలవు.
    వారు నా మీద దాడి చేశారు కనుక వారిని ఓడించుము.
    అప్పుడు నీ సేవకుడనైన నేను సంతోషిస్తాను.
29 నా శత్రువులను ఇబ్బంది పెట్టుము!
    వారు వారి సిగ్గును వారి అంగీలా ధరించనిమ్ము.
30 యెహోవాకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
    అనేక మంది ప్రజల ఎదుట నేను ఆయనను స్తుతిస్తాను.

కీర్తనలు. 119:121-144

అయిన్

121 యెహోవా, సరియైనవి, మంచివి నేను చేశాను.
    నన్ను బాధించాలని కోరేవారికి నన్ను అప్పగించవద్దు.
122 నీవు నాకు సహాయం చేస్తావని ప్రమాణం చేయుము.
    యెహోవా, నేను నీ సేవకుడను, ఆ గర్విష్ఠులను నాకు హాని చేయనియ్యకుము.
123 యెహోవా, నన్ను రక్షించుటకు నీవు మంచి ప్రమాణం చేశావు.
    కాని నన్ను రక్షిస్తావని నీ కోసం ఎదురు చూచి నా కళ్లు అలసిపోయాయి.
124 నిజమైన నీ ప్రేమ నా మీద చూపించుము. నేను నీ సేవకుడను.
    నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
125 నేను నీ సేవకుడను
    నేను నీ ఒడంబడికను నేర్చుకొని, గ్రహించుటకు నాకు సహాయం చేయుము.
126 యెహోవా, యిది నీవు ఏమైనా చేయాల్సిన సమయం.
    ప్రజలు నీ న్యాయ చట్టం ఉల్లంఘించారు.
127 యెహోవా, నీ ఆజ్ఞలు
    మేలిమి బంగారంకంటె నాకు ఎక్కువ ఇష్టం.
128 నీ ఆజ్ఞలన్నింటికీ నేను జాగ్రత్తగా విధేయుడనవుతాను.
    తప్పుడు బోధలు నాకు అసహ్యం.

పే

129 యెహోవా, నీ ఒడంబడిక అద్భుతం,
    అందుకే నేను దానిని అనుసరిస్తాను.
130 ప్రజలు నీ మాట గ్రహించడం మొదలు పెట్టినప్పుడు అది వారికి సరైన జీవన విధానాన్ని చూపెట్టి దీపంలా ఉంటుంది.
    నీ మాట తెలివితక్కువ జనులను కూడా తెలివిగల వారినిగా చేస్తుంది.
131 యెహోవా, నేను నిజంగా నీ ఆజ్ఞలు ధ్యానించాలని కోరుతున్నాను.
    నేను కష్టంగా ఊపిరి పీలుస్తూ, అసహనంగా కనిపెడ్తున్న మనిషిలా ఉన్నాను.
132 దేవా, నావైపుకు తిరిగి, నా మీద దయ చూపించుము.
    నీ నామమును ప్రేమించే వారికి సరియైనవి ఏవో వాటిని చేయుము.
133 యెహోవా, నీ వాగ్దానం ప్రకారం నన్ను నడిపించుము.
    నాపై ఏ దుష్టత్వమూ అధికారం చేయనీయవద్దు.
134 యెహోవా, నన్ను బాధించు ప్రజల నుండి నన్ను రక్షించుము.
    నేనేమో, నీ ఆజ్ఞలకు విధేయుడనవుతాను.
135 యెహోవా, నీ సేవకుని అంగీకరించి
    నీ న్యాయచట్టాలు నేర్పించుము.[a]
136 ప్రజలు నీ ఉపదేశాలకు లోబడనందువల్ల
    నదిలా నా కన్నీళ్లు ప్రవహించేట్టు నేను ఏడ్చాను.

సాదె

137 యెహోవా, నీవు మంచివాడవు.
    నీ చట్టాలు న్యాయమైనవి.
138 ఒడంబడికలో నీవు మాకు ఇచ్చిన న్యాయ చట్టాలు మంచివి.
    యెహోవా, మేము నీ న్యాయ చట్టాలపై నిజంగా నమ్మకముంచగలము.
139 నా ఉత్సాహం నాలో కృంగిపోయినది.
    ఎందుకంటే, నా శత్రువులు నీ న్యాయ చట్టాలను మరచిపోయారు.
140 యెహోవా, మేము నీ మాట నమ్మగలుగుటకు మాకు రుజువు ఉంది.
    అదంటే నాకు ప్రేమ.
141 నేను యువకుడను. ప్రజలు నన్ను గౌరవించరు.
    కాని నేను నీ ఆజ్ఞలు మరచిపోను.
142 యెహోవా, నీ మంచితనం శాశ్వతంగా ఉంటుంది.
    నీ ఉపదేశాలు నమ్మదగినవి.
143 నాకు కష్టాలు, చిక్కులు కలిగాయి.
    కాని నీ ఆజ్ఞలు నాకు ఆనందకరము.
144 నీ ఒడంబడిక శాశ్వతంగా మంచిది.
    నేను జీవించగలుగునట్లు నీ ఒడంబడికను గ్రహించుటకు నాకు సహాయం చేయుము.

2 రాజులు 18:9-25

అష్షూరువారు షోమ్రోనును పట్టుకొనుట

అష్షూరు రాజైన షల్మనేసెరు షోమ్రోనుకు విరుద్ధంగా యుద్ధం చేయడానికి వెళ్లాడు. అతని సైన్యము నగరాన్ని చుట్టుముట్టింది. హిజ్కియా యూదా రాజుగా ఉన్న నాల్గవ సంవత్సరంలో ఇది జరిగింది. (ఏలా కుమారుడైన హోషేయా ఇశ్రాయేలు రాజుగా ఉన్న ఏడవ సంవత్సరములో ఇది జరిగింది). 10 మూడవ సంవత్సరము చివరను షల్మనేసెరు షోమ్రోనుని పట్టుకున్నాడు. హిజ్కియా యూదా రాజుగా ఉన్న ఆరవ సంవత్సరమున, అతను షోమ్రోనుని వశము చేసుకున్నాడు. (ఇశ్రాయేలు రాజుగా హోషేయా వున్న తొమ్మిదో సంవత్సరమున ఇది జరిగింది). 11 అష్షూరు రాజు ఇశ్రాయేలు వారిని బందీలుగా అష్షూరుకు తీసుకుని వెళ్లాడు. వారిని హాలహు లేక హాబోరు (గోజాను నది), మాదీయుల నగరాలలో నివసింపజేశాడు. 12 ఇశ్రాయేలువారు తమ దేవుడైన యెహోవాను పాటించక పోవడంవల్ల ఇలా జరిగింది. వారు యెహోవా ఒడంబడికను విచ్ఛిన్నం చేశారు. యెహోవా సేవకుడైన మోషే చెప్పిన అన్ని విషయాలను వారు పాటించలేదు. యెహోవా ఒడంబడికను ఇశ్రాయేలు ప్రజలు పెడ చెవిని పెట్టారు. మరియు ఆయన చేయమని చెప్పిన పనులు వారు చేయలేదు.

అష్షూరు యూదాని తీసుకొనుటకు సిద్ధపడుట

13 హిజ్కియా రాజుగా వున్న 14వ సంవత్సరములో అష్షూరు రాజయిన సన్హెరీబు యూదాలోని అన్ని బలిష్ఠ నగరాల మీద దండెత్తి వెళ్లాడు. సన్హెరీబు ఆ నగరాలన్నిటిని ఓడించాడు. 14 అప్పుడు యూదా రాజయిన హిజ్కియా అష్షూరు రాజుకి లాకీషు వద్ద ఒక సందేశం పంపాడు. “నేను తప్పు చేశాను. నన్ను ఒంటరిగా వదలండి. అప్పుడు మీరు ఏమి కోరినా అది నేనిస్తాను” అని హిజ్కియా చెప్పాడు.

తర్వాత అష్షూరు రాజు యూదా రాజయిన హిజ్కియాని 11 టన్నుల వెండి, 1 టన్ను బంగారం ఇమ్మని అడిగాడు. 15 హిజ్కియా యెహోవా ఆలయం నుండి, రాజుగారి నిధుల నుండీ వెండి అంతా తీసి ఇచ్చాడు. 16 ఆ సమయంలో హిజ్కియా యెహోవా మందిరానికి ద్వారము మెట్లకి గల బంగారమంతా తీయించి వేశాడు. హిజ్కియా రాజు ఆ తలుపుల మీద మెట్లమీద బంగారం ఉంచాడు. హిజ్కియా అష్షూరు రాజుకు ఈ బంగారమంతా ఇచ్చివేశాడు.

అష్షూరు రాజు యెరూషలేముకు మనుష్యులను పంపుట

17 అష్షూరు రాజు అతి ముఖ్యులైన తర్తానును, రబ్బారీసు, రబ్బాకేను అను తన ముగ్గురు సైన్యాధిపతులను పెద్ద సైన్యముతో యెరూషలేములోని హిజ్కియా రాజు వద్దకు పంపాడు. ఆ మనుష్యులు లాకీషు నుంచి యెరూషలేము వెళ్లారు. వారు చేరి “చాకిరేవు” వెళ్లే దారిలోవున్న యెరక కొలను కాలువ దగ్గర నిలబడ్డారు. 18 వారు రాజుని పిలిచారు. హిల్కీయా కుమారుడైన ఎల్యాకీము (ఎల్యాకీము రాజభవన అధికారి), షెబ్నా (కార్యదర్శి), అసాపు కొడుకైన యోవాహును (దస్తావేజులు సంరక్షించేవాడు) వారిని కలుసుకోడానికి వచ్చారు. 19 ఒక సైన్యాధిపతి ఇలా చెప్పాడు, “అష్షూరు మహా రాజు చెప్పుచున్నది:

‘హిజ్కియాతో చెప్పు. నీవు దేనిని విశ్వసిస్తున్నావు? 20 నీ మాటలు విలువలేనివి. యుద్ధంలో “నాకు సహాయంగా వుండదగినంత. సలహా, శక్తివున్నాయి” అని నీవు చెప్పుచున్నావు. కాని నీవు నా పరిపాలన నుండి వేరుపడిన తర్వాత నీవెవరిని నమ్ముతున్నావు? 21 విరిగిపోయిన రెల్లుతో చేయబడిన చేతికర్రను ఊని ఉన్నావు! ఈ చేతికర్ర ఈజిప్టు. ఈ చేతికర్రను ఊని నడిస్తే అది విరిగిపోయి, చేతిలో గుచ్చుకొని గాయపరుస్తుంది. తనను విశ్వసించే వారికందరికీ ఈజిప్టు రాజు అటువంటివాడు. 22 “మీ దేవుడైన యెహోవాని నమ్ముతున్నట్లు” నీవు చెప్పవచ్చు. కాని ఉన్నత స్థలాలను బలిపీఠాలను హిజ్కియా తొలగించి యెరూషలేములోని బలిపీఠం ఎదురుగా మాత్రమే ఆరాధించాలని యూదా, యెరూషలేము ప్రజలకు చెప్పినట్లు నాకు తెలుసు.

23 ‘నా యాజమాని అయిన అష్షూరు రాజుతో ఇప్పుడు నీవు ఈ ఒడంబడిక చేసుకో. స్వారీ చేయగల మనుష్యులుంటే, నీకు రెండు వేల గుర్రాలు ఇస్తానని నేను వాగ్దానం చేస్తాను. 24 నా యజమానికి గల చాలా తక్కువ అధిపతిని కూడా నీవు ఓడించలేవు. రథాలకు, అశ్విక వీరులకు నీవు ఈజిప్టు మీద ఆధారపడి వున్నావు.

25 ‘యెహోవా ఆజ్ఞ లేకుండ యెరూషలేమును నాశనం చేయుటకు నేను రాలేదు. “ఈ దేశానికి విరుద్ధంగా వెళ్లి దానిని నాశనము చేయుము” అని యెహోవా నాకు చెప్పాడు.’

1 కొరింథీయులకు 8

విగ్రహార్పితమైన పదార్ధం

ఇక విగ్రహాలకు బలి యిచ్చిన వాటిని గురించి: మనలో జ్ఞానం ఉందని మనకు తెలుసు. జ్ఞానం గర్వాన్ని కలిగిస్తుంది. ప్రేమ మనిషిని అభివృద్ధి పరుస్తుంది. తనలో జ్ఞానముందని భావిస్తున్నవానిలో నిజానికి ఉండవలసిన జ్ఞానం లేదు. కాని తనను ప్రేమిస్తున్న మనిషిని దేవుడు గుర్తిస్తాడు.

ఇక విగ్రహాలకు బలి ఇచ్చినవాటి విషయం: విగ్రహానికి అర్థం లేదని, ఒక్కడే దేవుడున్నాడని మనకు తెలుసు. దేవుళ్ళని పిలువబడేవాళ్ళు ఆకాశంలోగాని, భూమిమీదగాని ఉన్నా, వాళ్లు “దేవుళ్ళని”, “ప్రభువులని” పిలవబడుచున్నారు. అయితే నిజానికి మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయనే మన తండ్రి. అన్నిటినీ ఆయనే సృష్టించాడు. ఆయన కోసమే మనము జీవిస్తున్నాము. మనకు ఒక్కడే ప్రభువు. ఆయనే యేసుక్రీస్తు. ఆయన ద్వారానే అన్నీ సృష్టింపబడ్డాయి. ఆయనవల్ల మనము జీవిస్తున్నాము.

కాని ఈ విషయం తెలియనివాళ్ళు చాలమంది ఉన్నారు. ఈనాటికీ విగ్రహారాధనకు అలవాటు పడ్డ కొందరు ఆ పదార్థాన్ని తిన్నప్పుడు అది విగ్రహానికి అర్పించింది అనుకొని తింటారు. వాళ్ళ మనసులు బలహీనమైనవి కనుక వాళ్ళు మలినమయ్యారు. ఆహారంవల్ల మనము దేవునికి సన్నిహితులము కాలేము. ఆ ఆహారం తినకపోతే నష్టం ఏమీ లేదు. తింటే వచ్చిన లాభం లేదు.

కాని మీ నిర్ణయము దృఢవిశ్వాసం లేనివాళ్ళకు నష్టం కలిగించకుండా జాగ్రత్తపడండి. 10 ఈ విషయంపై గట్టి అభిప్రాయం లేనివాడొకడు ఈ విషయాన్ని గురించి జ్ఞానమున్న మిమ్మల్ని గుడిలో నైవేద్యం తినటం చూస్తాడనుకోండి. అప్పుడు అతనికి విగ్రహాలకు నైవేద్యం పెట్టిన ఆహారం తినటానికి ధైర్యం కలుగుతుంది. 11 బలహీనమైన మనస్సుగల మీ సోదరుని కోసం క్రీస్తు మరణించాడు. కాని మీ అజ్ఞానంవల్ల ఆ సోదరుడు నశిస్తాడు. 12 అలా చేస్తే మీ సోదరునిపట్ల పాపం చేసి అతని మనస్సును గాయపరచిన వాళ్ళవుతారు. తద్వారా మీరు క్రీస్తుపట్ల పాపం చేసిన వాళ్ళవుతారు. 13 నా సోదరుడు పాపం చేయటానికి నా ఆహారం కారణమైతే నేనిక మీదట మాంసం తినను! ఏ విధంగానైనా అతని పతనానికి కారకుణ్ణి కాకుండా ఉంటాను.

మత్తయి 7:13-21

పరలోకానికి, నరకానికి మార్గాలు

(లూకా 13:24)

13-14 “నరకానికి వెళ్ళే మార్గము సులభంగా ఉంటుంది. దాని ద్వారం విశాలంగా ఉంటుంది. చాలా మంది ఆ ద్వారాన్ని ప్రవేశిస్తారు. పరలోకానికి వెళ్ళే మార్గము కష్టంగా ఉంటుంది. దాని ద్వారం ఇరుకుగా ఉంటుంది. కొద్దిమంది మాత్రమే దాన్ని కనుగొంటారు. ఇది గమనించి, ఇరుకైన ద్వారాన్నే ప్రవేశించండి.

ప్రజలు చేయునది వారేమైయున్నారని చూపుతుంది

(లూకా 6:43-44; 13:25-27)

15 “కపట ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు గొఱ్ఱె తోళ్ళు కప్పుకొని మీ దగ్గరకు వస్తారు. కాని లోపల క్రూరమైన తోడేళ్ళలా ఉంటారు. 16 వాళ్ళ వల్ల కలిగిన ఫలాన్ని బట్టి వాళ్ళను మీరు గుర్తించ కలుగుతారు. ముళ్ళపొదల నుండి ద్రాక్షాపండ్లను, పల్లేరు మొక్కల నుండి అంజూరపు పండ్లను పొందగలమా? 17 మంచి చెట్టుకు మంచి పండ్లు కాస్తాయి. పులుపు పండ్లు కాచే చెట్టుకు పులుపు పండ్లు కాస్తాయి. 18 మంచి చెట్టుకు పులుపు పండ్లు కాయవు. పులువు పండ్లు కాచే చెట్టుకు మంచి పండ్లు కాయవు. 19 దేవుడు మంచి ఫలమివ్వని చెట్టును నరికి మంటల్లో వేస్తాడు. 20 అందువల్ల, వాళ్ళవల్ల కలిగిన ఫలాన్ని బట్టి మీరు వాళ్ళను గుర్తించ కలుగుతారు.

21 “నన్ను ప్రభూ! ప్రభూ! అని పిలిచినంత మాత్రాన దేవుని రాజ్యంలోకి ప్రవేశింపగలమని అనుకోకండి. నా తండ్రి ఇష్టానుసారం నడచుకున్న వాళ్ళు మాత్రమే ప్రవేశింపగలరు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International