Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 88

కోరహు కుమారుల స్తుతి కీర్తన. సంగీత నాయకునికి: బాధాకరమైన ఒక వ్యాధిని గూర్చి ఎజ్రాహివాడైన హేమాను ధ్యాన గీతం.

88 యెహోవా దేవా, నీవు నా రక్షకుడవు.
    రాత్రింబగళ్లు నేను నిన్ను ప్రార్థిస్తున్నాను.
దయచేసి నా ప్రార్థనలను గమనించుము.
    కరుణకోసం నేను చేస్తున్న ప్రార్థనలు ఆలకించుము.
నా కష్టాలు అన్నింటితో నేను విసిగిపోయాను.
    మరణించుటకు నేను సిద్ధంగా ఉన్నాను.
జీవించుటకు బహు బలహీనుడివలె, చనిపోయిన మనిషివలె
    ప్రజలు నాతో వ్యవహరిస్తున్నారు.
మరణించుటకు నేను ఒంటరిగా విడువబడ్డాను.
    నేను సమాధిలో ఉన్న శవంలా ఉన్నాను.
నీనుండీ, నీ కాపుదలనుండి నీవు వేరుచేసిన మృతులలో ఒకనివలె నేనున్నాను.
    మనుష్యులు వారిని పూర్తిగా మరచిపోతారు.
యెహోవా, నీవు నన్ను భూమి క్రింద సమాధిలో ఉంచావు.
    నీవు నన్ను ఆ చీకటి స్థలంలో ఉంచావు.
నీవు నా మీద కోపగించావు.
    నీవు నన్ను శిక్షించావు.

నా స్నేహితులు నన్ను విడిచిపెట్టేశారు.
    అంటరాని మనిషిలా వారంతా నన్ను తప్పించి వేస్తారు.
నేను యింటిలో బంధించబడ్డాను, నేను బయటకు వెళ్లలేను.
    నా బాధ అంతటిని గూర్చి ఏడ్చి నా కళ్లు నొప్పిగా ఉన్నాయి.
యెహోవా, నేను ఎడతెగకుండా నిన్ను ప్రార్థిస్తున్నాను.
    ప్రార్థనలో నేను నీకు నా చేతులు జోడిస్తున్నాను.
10 యెహోవా, చనిపోయినవారి కోసం నీవు అద్భుతాలు చేస్తావా? లేదు!
    దురాత్మలు లేచి నిన్ను స్తుతిస్తాయా? లేదు!

11 చనిపోయినవాళ్లు వారి సమాధుల్లో నీ ప్రేమను గూర్చి మాట్లాడలేరు.
    చనిపోయినవారు మృతుల లోకంలో ఉండి నీ నమ్మకత్వం గూర్చి మాట్లాడలేరు.
12 చీకటిలో పడివున్న మృతులు నీవు చేసే అద్భుత కార్యాలు చూడలేరు.
    మరచిపోయిన వారి లోకంలో ఉన్న మృతులు నీ మంచితనం గూర్చి మాట్లాడలేరు.
13 యెహోవా, నాకు సహాయం చేయుమని నేను నిన్ను అడుగుతున్నాను.
    ప్రతి వేకువ జామునా నేను నిన్ను ప్రార్థిస్తాను.
14 యెహోవా, నీవెందుకు నన్ను విడిచిపెట్టేశావు?
    నానుండి నీ ముఖాన్ని ఎందుకు దాచుకొంటున్నావు?
15 నేను బాలుడిగా ఉన్నప్పటినుండి నేను బలహీనుడను, రోగిని.
    నేను నీ కోపాన్ని అనుభవించాను, నేను నిస్సహాయుడను.
16 యెహోవా, నీవు నా మీద చాలా కోపగించావు.
    శిక్ష నన్ను చంపేస్తుంది.
17 నాకు నొప్పులు, బాధలు ఎల్లప్పుడూ ఉన్నాయి.
    నా నొప్పులు, బాధల్లో నేను మునిగిపోతున్నట్టుగా నాకు అనిపిస్తుంది.
18 మరియు యెహోవా, నా స్నేహితులు, నా ప్రియులు అంతా నన్ను విడిచిపెట్టివేసేటట్టుగా నీవు చేశావు.
    చీకటి మాత్రమే నాకు మిగిలింది.

కీర్తనలు. 91-92

91 మహోన్నతుడైన దేవుని ఆశ్రయంలో నివసించే వాడు
    సర్వశక్తిమంతుడైన దేవుని నీడలో విశ్రాంతి తీసుకొంటాడు.
“నీవే నా క్షేమ స్థానం, నా కోట. నా దేవా, నేను నిన్నే నమ్ముకొన్నాను.”
    అని నేను యెహోవాకు చెబుతాను.
దాగి ఉన్న అపాయాలన్నింటి నుండి దేవుడు నిన్ను రక్షిస్తాడు.
    ప్రమాదకరమైన రోగాలన్నింటినుండి దేవుడు నిన్ను రక్షిస్తాడు.
కాపుదలకోసం నీవు దేవుని దగ్గరకు వెళ్లవచ్చు.
    పక్షి తన రెక్కలతో దాని పిల్లలను కప్పునట్లు ఆయన నిన్ను కాపాడుతాడు.
    దేవుడు కేడెంగా, నిన్ను కాపాడే గోడలా ఉంటాడు.
రాత్రివేళ నీవు దేనికి భయపడవు.
    పగటివేళ శత్రువు బాణాలకు నీవు భయపడవు.
చీకటిలో దాపురించే రోగాలకు గాని
    మధ్యాహ్నం వేళ దాపురించే వ్యాధులకుగాని నీవు భయపడవు.
నీ ప్రక్కన వేయిమంది,
    నీ కుడి ప్రక్కన పది వేలమంది శత్రుసైనికులను ఓడిస్తావు.
    నీ శత్రువులు నిన్ను కనీసం తాకలేరు.
ఊరికే చూడు, ఆ దుర్మార్గులు శిక్షించబడినట్లుగా
    నీకు కనబడుతుంది.
ఎందుకంటే నీవు యెహోవాను నమ్ముకొన్నావు గనుక.
    సర్వోన్నతుడైన దేవుణ్ణి నీ క్షేమ స్థానంగా చేసుకొన్నావు గనుక.
10 కీడు ఏమీ నీకు జరగదు.
    నీ ఇంట ఎలాంటి వ్యాధి ఉండదు.
11 ఎందుకంటే నిన్ను కనిపెట్టుకొని ఉండుటకు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీవు ఎక్కడికి వెళ్లినా వారు నిన్ను కాపాడుతారు.
12 నీ పాదం రాయికి తగులకుండా
    దేవదూతలు వారి చేతులతో నిన్ను పైకి ఎత్తుతారు.
13 సింహాల మీద, విషసర్పాల మీద
    నడిచే శక్తి నీకు ఉంటుంది.
14 యెహోవా చెబుతున్నాడు: “ఒక వ్యక్తి నన్ను నమ్ముకొంటే, నేను అతన్ని రక్షిస్తాను.
    నా పేరు అతనికి తెలుసు కనుక నేను కాపాడుతాను.
15 నా అనుచరులు సహాయంకోసం నాకు మొరపెడ్తారు.
    నేను వారికి జవాబు ఇస్తాను.
    వారికి కష్టం కలిగినప్పుడు నేను వారితో ఉంటాను. నేను వారిని తప్పించి, ఘనపరుస్తాను.
16 నా అనుచరులకు నేను దీర్ఘాయుష్షు యిస్తాను.
    నేను వాళ్లను రక్షిస్తాను.”

సబ్బాతుకోసం స్తుతి కీర్తన.

92 యెహోవాను స్తుతించుట మంచిది.
    సర్వోన్నతుడైన దేవా, నీ నామాన్ని కీర్తించుట మంచిది.
ఉదయం నీ ప్రేమను గూర్చి పాడటం,
    రాత్రివేళ నీ నమ్మకత్వాన్ని గూర్చి పాడటం మంచిది.
దేవా, పదితంత్రుల వాయిద్యాలను స్వరమండల ములను నీ కోసం వాయించటం మంచిది.
    సితారా మీద నీ కోసం సంగీతనాదం చేయటం మంచిది.
యెహోవా, నీవు చేసిన పనుల మూలంగా నిజంగా నీవు మమ్మల్ని సంతోషింపచేస్తావు.
    నీవు చేసిన వాటిని గూర్చి మేము సంతోషంగా పాడుకొంటాం.
యెహోవా, నీవు గొప్ప కార్యాలు చేశావు.
    నీ తలంపులు మేము గ్రహించటం మాకు ఎంతో కష్టతరం.
నీతో పోల్చినట్లయితే మనుష్యులు బుద్ధిలేని జంతువుల్లాంటి వారు.
    మేము ఏదీ గ్రహించలేని బుద్ధిలేని వాళ్లలా ఉన్నాము.
దుర్మార్గులు గడ్డిలా మొలిచినా,
    చెడ్డవాళ్లు అభివృద్ధి చెందినా వారు శాశ్వతంగా నాశనం అవుతారు.
కాని యెహోవా, నీవు శాశ్వతంగా గౌరవించబడతావు.
యెహోవా, నీ శత్రువులు అందరూ నాశనం చేయబడతారు.
    చెడు కార్యాలు చేసే ప్రజలందరూ నాశనం చేయబడతారు.
10 కాని నీవు నన్ను బలపరుస్తావు. బలమైన కొమ్ములుగల పొట్టేలువలె నీవు నన్ను చేస్తావు.
    సేదదీర్చే నీ తైలాన్ని నీవు నా మీద పోశావు.
11 నా శత్రువుల పతనాన్ని నా కండ్లారా చూచాను.
    నా శత్రువుల నాశనాన్ని నా చెవులారా విన్నాను.

12 నీతిమంతులు ఖర్జూరపు చెట్టులా అభివృద్ధి చెందుతారు.
    వారు లెబానోనులోని దేవదారు వృక్షంలా పెరుగుతారు.
13 మంచి మనుష్యులు యెహోవా ఆలయంలో నాటబడిన మొక్కలవలె బలంగా ఉంటారు.
    వారు మన దేవుని ఆలయంలో బలంగా ఎదుగుతారు.
14 వారు వృద్ధులైన తరువాత కూడా ఫలిస్తూనే ఉంటారు.
    వారు ఆరోగ్యంగా ఉన్న పచ్చని మొక్కల్లా వుంటారు.
15 యెహోవా మంచివాడని నేను చెబుతున్నాను.
ఆయనే నా బండ.
    ఆయనలో అవినీతి లేదు.

2 రాజులు 9:17-37

17 యెజ్రెయేలులోని ఒక గోపురం మీద ఒక కాపలావాడు నిలబడివున్నాడు. యెహూ యొక్క పెద్ద సైన్యం రావడం అతను చూశాడు. “చాలా మంది మనుష్యులు వచ్చుట చూస్తున్నాను.” అని అతను చెప్పాడు.

“వారిని కలుసుకునేందుకు ఎవరినైనా గుర్రం మీద పంపుము. ఆ మనుష్యులు శాంతికోసం వస్తున్నారో లేదో కనుక్కోమని ఈ దూతతో చెప్పుము” అని యెహోరాము చెప్పాడు.

18 అందువల్ల ఆ దూత యెహూని కలుసుకోవడానికి గుర్రమెక్కి వెళ్లాడు. వార్తహరుడు, “మీరు శాంతికోసం వచ్చారా? లేదా అని యెహోరాము, అడుగుతున్నాడు” అని పలికాడు.

“శాంతితో నీకేమీ పని లేదు. రమ్ము, నన్ను అనుసరింపుము” అని యెహూ చెప్పాడు.

“దూత ఆ బృందం వద్దకు వెళ్లాడు. కాని ఇంత వరకూ తిరిగి రాలేదు” అని కాపలాదారుడు యెహోరాముతో చెప్పాడు.

19 తర్వాత యెహోరాము రెండవ దూతను గుర్రంమీద పంపాడు. ఈ వ్యక్తి యెహూ బృందం వారి వద్దకు వచ్చి, “యెహోరాము రాజు శాంతి అని చెప్పుచున్నాడు” అన్నాడు.

“నీకు శాంతితో ఏమీ పనిలేదు. రమ్ము, నన్ను అనుసరింపుము” అని సమాధానమిచ్చాడు.

20 “రెండవ దూత బృందం వద్దకు వెళ్లాడు. కాని అతను కూడా ఇంకా తిరిగి రాలేదు. పిచ్చివానివలె, ఒకడు అతని రథం నడుపుతున్నాడు. నింషీ కుమారుడైన యెహూవలె నడుపుతున్నాడు” అని కాపలాదారుడు యెహోరాముతో అన్నాడు.

21 “నా రథం తీసుకుని రా” అని యెహోరాము చెప్పాడు.

అందువల్ల సేవకుడు యెహోరాము యొక్క రథమును తీసుకువచ్చాడు. ఇశ్రాయేలు రాజయిన యెహోరాము, యూదా రాజయిన అహజ్య, ఇద్దరూ రథాలలో యెహూని కలుసుకోడానికి వెళ్లారు. వారు యెజ్రెయేలియుడైన నాబోతు పొలం వద్ద యెహూని కలుసుకున్నారు.

22 యెహోరాము యెహూని చూసి, “యెహూ, నీవు శాంతికోసం వచ్చావా?” అని అడిగాడు.

“నీ తల్లి యెజెబెలు వ్యభిచారము, చేతబడితనము ఘోరముగా చేయుచుండగా సమాధానం ఎక్కడనుండి వచ్చును?” అన్నాడు.

23 యెహోరాము గుర్రాలను వెనక్కి పరుగు తీయించాడు. యెహోరాము అహజ్యాను చూసి “అహజ్యా, ఇది ఒక మాయోపాయం” అని చెప్పి, పారిపోవుచు ఉండెను.

24 అప్పుడు యెహూ తన బలంకొద్దీ బాణం లాగి యెహోరాముని వీపుమీద కొట్టగా, ఆ బాణం యెహోరాము గుండెలోనుండి దూసుకొని వెళ్లగా, యెహోరాము తన రథం మీదనే మరణించాడు.

25 యెహూ తన అధిపతియైన బిద్కరుతో, “యెహోరాము దేహాన్ని పైకి ఎత్తి, యెజ్రెయేలులో నాబోతు పొలంలోకి విసిరివేయుము. ఒకసారి జ్ఞాపకం చేసుకో నీవు, నేను యెహోరాము తండ్రి అయిన అహాబుతో కలిసి పయనం చేసినప్పుడు, ఇది అతనికి జరుగునని యెహోవా చెప్పాడు. 26 ‘నిన్న నాబోతు అతని కుమారుల రక్తం నేను చూశాననీ, అందువల్ల ఈ పొలంలో అహాబును శిక్షించెదననీ’ యెహోవా చెప్పెను. కావున, యెహోవా చెప్పినట్లు ఈ కళేబరాన్ని తీసుకొని పొలంలోకి విసరుము అనెను.”

27 యూదా రాజయిన అహజ్యా దీనిని చూసి పారిపోయాడు. అతను ఉద్యానవన గృహంద్వారా తప్పించుకొనడానికి ప్రయత్నించాడు. యెహూ అతనిని అనుసరించాడు. “అహజ్యా తన రథంలోకి వెళ్లినా, అతనిని చంపి వేయుము” అని యెహూ చెప్పాడు.

అందువల్ల యెహూ మనుష్యులు అహజ్యాను ఇబ్లెయాము దగ్గర గూరునకు వెళ్లే బాటమీద కొట్టగా అహజ్యా మెగిద్దోకు పారిపోయి అతను అక్కడ మరణించాడు. 28 అహజ్యా సేవకులు అహజ్యా శరీరాన్ని రథంలో తీసుకొని యెరూషలేముకు వెళ్లారు. వారు అహజ్యాను దావీదు నగరంలో అతని పూర్వికుల సమాధిలో సమాధి చేశారు.

29 ఇశ్రాయేలు రాజుగా యెహోరాము పదకొండవ పరిపాలనా సంవత్సరమున అహజ్యా యూదాకు రాజయ్యాడు.

యెజెబెలు భయంకర మరణం

30 యెహూ యెజ్రెయేలుకు వెళ్లాడు. యెజెబెలు ఆ వార్త విన్నది. కనుక ఆమె తనను సింగారించుకుంది. జుట్టు సరిదిద్దుకుంది, రంగుపూసుకుంది, శిరోభూషణములు ధరించుకున్న తర్వాత ఆమె కిటికీకి ప్రక్కగా నిలిచి వెలుపలికి చూచింది. 31 యెహూ గుమ్మం ద్వారా నగరం ప్రవేశించాడు. ఆమె అతనిని చూసి, “జిమ్రీ వంటివాడా, అతనివలె నీవు నీ యజమానిని చంపివేశావు. సమాధానంగా వచ్చుచున్నావా” అని అడిగింది.

32 యెహూ కిటికీ పైకి చూశాడు. “దాని ప్రక్కన ఎవరున్నారు? ఎవరు?” అన్నాడు. ఇద్దరో ముగ్గురో నపుంసకులు యెహూని కిటికీ నుండి చూశారు. 33 వారితో యెహూ, “యెజెబెలుని క్రిందికి త్రోసి వేయండి” అన్నాడు.

తర్వాత నపుంసకులు యెజెబెలుని క్రిందికి త్రోసివేశారు. యెజెబెలు రక్తం కొంచెం గోడమీద చిమ్మింది. గుర్రాలమీద కూడా చిమ్మింది. గుర్రాలు యెజెబెలు శరీరం మీదుగా నడిచాయి. 34 యెహూ ఇంట్లోకి వెళ్లి అన్నపానాదులు చేసిన తరువాత, “ఇప్పుడు ఈ శాపగ్రస్తురాలిని చూడండి, ఈమె ఒక రాజు కుమార్తె. అందువల్ల ఆమెను సమాధి చేయండి” అన్నాడు.

35 ఆ మనుష్యులు యెజెబెలుని సమాధి చేయడానికి వెళ్లారు. కాని ఆమె శరీరం వారికి కనబడలేదు. ఆమె కపాలము, ఆమె పాదాలు, ఆమె అరచేతులు మాత్రమే కనిపించాయి. 36 అందువల్ల ఆ మనుష్యులు వెనుదిరిగి వచ్చి యెహూతో చెప్పారు. అప్పుడు యెహూ, “యెజ్రెయేలు ప్రదేశంలో యెజెబెలు శవాన్ని కుక్కలు తింటాయని యెహోవా తన సేవకుడు తిష్బీవాడయిన ఏలీయాతో చెప్పాడు. 37 యెజ్రెయేలు ప్రదేశపు పొలంలో యెజెబెలు శవం పెంటవలె ఉంటుందనీ, ఇది యెజెబెలని ఎవరూ గుర్తు పట్టలేరనీ ఏలీయా చెప్పాడు.”

1 కొరింథీయులకు 7:1-9

వివాహం

ఇక మీరు వ్రాసిన ప్రశ్నలకు నా సమాధానం ఇది: ఔను. వివాహం చేసుకోకుండా ఉండటం మంచిది. కాని లైంగిక అవినీతి చాలా వ్యాపించిపోయింది కనుక స్త్రీపురుషులు వివాహం చేసుకోవటం మంచిది. ప్రతీ పురుషుడు భర్తగా తన కర్తవ్యాలు నిర్వహించాలి. అలాగే ప్రతీ స్త్రీ భార్యగా తన కర్తవ్యాలు నిర్వహించాలి. భార్యకు తన శరీరంపై అధికారం లేదు. భర్తకు మాత్రమే ఆమె శరీరంపై అధికారం ఉంది. అలాగే భర్తకు తన శరీరంపై అధికారం లేదు. అతని శరీరంపై అతని భార్యకు మాత్రమే అధికారం ఉంది. భార్యాభర్తలు ఇరువురు సమ్మతించి దేవుని ప్రార్థించటంలో తమ కాలాన్ని గడపదలిస్తే తప్ప వేరువేరుగా ఉండకూడదు. ప్రార్థనా సమయం ముగిసాక మళ్ళీ మీరు కలిసికొనండి. మీలో ఆత్మనిగ్రహంలేదు. కనుక సాతాను ప్రేరేపణకు లొంగిపోకుండా జాగ్రత్త పడటానికి ఇలా చెయ్యటం అవసరం. ఇలా చెయ్యమని నేను ఆజ్ఞాపించటం లేదు. ఇలా చెయ్యటానికి నా అనుమతి తెలుపుతున్నాను. అందరూ నాలా ఉండాలని నా కోరిక. కాని ప్రతి ఒక్కనికీ దేవుడు ఒక ప్రత్యేకమైన వరం ఇచ్చాడు. ఒకనికి ఒక వరం, ఇంకొకనికి ఇంకొక వరం ఇచ్చాడు.

అవివాహితులకు, వితంతువులకు నా సలహా ఇది: వాళ్ళు నాలాగే పెళ్ళి చేసుకోకుండా ఉండటం మంచిది. కాని వాళ్ళలో నిగ్రహం లేకపోతే పెళ్ళి చేసుకోవటం ఉత్తమం. కామంతో కాలిపోవటం కన్నా పెళ్ళి చేసుకోవటం మంచిది.

మత్తయి 6:7-15

“అంతేకాక, మీరు ప్రార్థించేటప్పుడు యూదులు కాని వాళ్ళవలె మాట్లాడవద్దు. ఆలా చేయడంవల్ల దేవుడు వింటాడని వాళ్ళు అనుకొంటారు. వాళ్ళవలె చేయకండి. మీకేం కావాలో మీరడగక ముందే మీ తండ్రికి తెలుసు. కాబట్టి మీరి విధంగా ప్రార్థించాలి:

‘పరలోకంలో ఉన్న మా తండ్రీ,
    నీ పేరు సదా పవిత్ర పర్చబడాలని మేము ప్రార్థిస్తున్నాము.
10 నీ రాజ్యం రావాలనీ, పరలోకంలో నీ చిత్తం నెరవేరునట్లే
    ఈ లోకంలో కూడా నెరవేరాలని మేము ప్రార్థిస్తున్నాము.
11 ప్రతి రోజు మాకు కావలసిన ఆహారం మాకు దయ చేయుము.
12 ఇతరులు మా పట్ల చేసిన పాపాలను మేము క్షమించినరీతి,
    మేము చేసిన పాపాలను కూడా క్షమించుము.
13 మేము శోధనకు గురిఅయ్యేలా చేయవద్దు.
    పైగా మమ్ములను దుష్టుని నుండి కాపాడుము.’[a]

14 ఇతర్ల తప్పుల్ని మీరు క్షమిస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి మిమ్మల్ని క్షమిస్తాడు. 15 కాని యితర్లను మీరు క్షమించకపోతే మీ తండ్రి మీ తప్పుల్ని క్షమించడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International