Book of Common Prayer
ఆసాపు స్తుతి గీతం.
83 దేవా, మౌనంగా ఉండవద్దు!
నీ చెవులు మూసికోవద్దు!
దేవా, దయచేసి ఊరుకోవద్దు.
2 దేవా, నీ శత్రువులు నీకు వ్యతిరేకంగా పథకాలు వేస్తున్నారు.
నీ శత్రువులు త్వరలోనే దాడి చేస్తారు.
3 నీ ప్రజలకు వ్యతిరేకంగా వారు రహస్య పథకాలు వేస్తారు.
నీవు ప్రేమించే ప్రజలకు విరోధంగా నీ శత్రువులు పథకాలను చర్చిస్తున్నారు.
4 “ఆ మనుష్యులను పూర్తిగా నాశనం చేద్దాం. రమ్ము.
అప్పుడు ‘ఇశ్రాయేలు’ అనే పేరు తిరిగి ఎవ్వరూ జ్ఞాపకంచేసుకోరు,” అని శత్రువులు చెబుతున్నారు.
5 దేవా, నీకు విరోధంగా పోరాడేందుకు నీవు మాతో చేసిన
ఒడంబడికకు విరోధంగా పోరాడేందుకు ఆ ప్రజలంతా ఏకమయ్యారు.
6-7 ఆ శత్రువులు మనకు విరోధంగా పోరాడేందుకు ఏకమయ్యారు. ఎదోము, ఇష్మాయేలు ప్రజలు; మోయాబు, హగ్రీ సంతతివారు;
గెబలువారు; అమ్మోను, అమాలేకీ ప్రజలు;
ఫిలిష్తీ ప్రజలు; తూరులో నివసించే ప్రజలంతా మనతో పోరాడుటకు ఏకమయ్యారు.
8 అష్షూరు సైన్యం లోతు వంశస్థులతో చేరి,
వారంతా నిజంగా బలముగలవారయ్యారు.
9 దేవా, మిద్యానును నీవు ఓడించినట్టు, కీషోను నది దగ్గర సీసెరాను,
యాబీనును నీవు ఓడించినట్టు శత్రువును ఓడించుము.
10 ఫన్దోరు వద్ద నీవు వారిని ఓడించావు.
వారి దేహాలు నేల మీద కుళ్లిపోయాయి.
11 దేవా, శత్రువుల నాయకులను ఓడించుము. ఓరేబుకు, జెయేబుకు నీవు చేసిన వాటిని వారికి చేయుము.
జెబహు, సల్మున్నా అనేవారికి నీవు చేసిన వాటిని వారికి చేయుము.
12 దేవా, మేము నీ దేశం విడిచేందుకు
ఆ ప్రజలు మమ్మల్ని బలవంత పెట్టాలని అనుకొన్నారు.
13 గాలికి చెదరిపోయే కలుపు మొక్కవలె[a] ఆ ప్రజలను చేయుము.
గాలి చెదరగొట్టు గడ్డిలా ఆ ప్రజలను చేయుము.
14 అగ్ని అడవిని నాశనం చేసినట్టు
కారుచిచ్చు కొండలను తగులబెట్టునట్లు శత్రువును నాశనం చేయుము.
15 దేవా, తుఫానుకు ధూళి ఎగిరిపోవునట్లు ఆ ప్రజలను తరిమివేయుము.
సుడిగాలిలా వారిని కంపింపజేసి, విసరివేయుము.
16 దేవా, వారి ముఖాలను సిగ్గుతో కప్పుము.
అప్పుడు వారు నీ నామం ఆరాధించాలని కోరుతారు.
17 దేవా, ఆ ప్రజలు శాశ్వతంగా భయపడి సిగ్గుపడునట్లు చేయుము.
వారిని అవమానించి, నాశనం చేయుము.
18 అప్పుడు నీవే దేవుడవు అని ఆ ప్రజలు తెలుసుకొంటారు.
నీ పేరు యెహోవా అని వారు తెలుసుకొంటారు.
నీవే లోకమంతటిపై మహోన్నతుడవైన దేవుడవు
అని వారు తెలుసుకొంటారు.
146 యెహోవాను స్తుతించండి!
నా ప్రాణమా! యెహోవాను స్తుతించు!
2 నా జీవిత కాలమంతా నేను యెహోవాను స్తుతిస్తాను.
నా జీవిత కాలమంతా నేను ఆయనకు స్తుతులు పాడుతాను.
3 సహాయం కోసం మీ నాయకుల మీద ఆధారపడవద్దు.
మనుష్యులు నిన్ను రక్షించలేరు గనుక మనుష్యులను నమ్ముకోవద్దు.
4 మనుష్యులు చనిపోయి, పాతిపెట్టబడతారు.
అప్పుడు నీకు సహాయం చేసేందుకు వారు వేసిన పథకాలన్నీ పోయినట్టే.
5 సహాయం కోసం దేవుణ్ణి అడిగేవారు చాలా సంతోషంగా ఉంటారు.
ఆ మనుష్యులు వారి దేవుడైన యెహోవా మీద ఆధారపడతారు.
6 భూమిని, ఆకాశాన్ని యెహోవా చేశాడు.
సముద్రాన్నీ, అందులో ఉన్న సమస్తాన్నీ యెహోవా చేశాడు.
యెహోవా వాటిని శాశ్వతంగా కాపాడుతాడు.
7 అణచివేయబడిన ప్రజలకు యెహోవా సరియైన సహాయం చేస్తాడు.
ఆకలితో ఉన్న ప్రజలకు దేవుడు ఆహారం ఇస్తాడు.
చెరలోవున్న ప్రజలను యెహోవా విడుదల చేస్తాడు.
8 గుడ్డివారు మరల చూచుటకు యెహోవా సహాయం చేస్తాడు.
కష్టంలో ఉన్న ప్రజలకు యెహోవా సహాయం చేస్తాడు.
మంచి మనుష్యులను యెహోవా ప్రేమిస్తాడు.
9 మన దేశంలో నివసిస్తున్న పరాయి వాళ్లను యెహోవా కాపాడుతాడు.
విధవరాండ్రు, అనాథల విషయమై యెహోవా శ్రద్ధ తీసికొంటాడు.
అయితే దుర్మార్గుల పథకాలను యెహోవా నాశనం చేస్తాడు.
10 యెహోవా శాశ్వతంగా పాలిస్తాడని నేను ఆశిస్తున్నాను.
సీయోనూ, నీ దేవుడు శాశ్వతంగా పాలిస్తాడని నేను ఆశిస్తున్నాను.
యెహోవాను స్తుతించండి!
147 యెహోవా మంచివాడు గనుక ఆయనను స్తుతించండి.
మన దేవునికి స్తుతులు పాడండి.
ఆయనను స్తుతించుట మంచిది, అది ఎంతో ఆనందం.
2 యెహోవా యెరూషలేమును నిర్మించాడు.
బందీలుగా తీసికొనిపోబడిన ఇశ్రాయేలు ప్రజలను దేవుడు వెనుకకు తీసికొనివచ్చాడు.
3 పగిలిన వారి హృదయాలను దేవుడు స్వస్థపరచి,
వారి గాయాలకు కట్లు కడతాడు.
4 దేవుడు నక్షత్రాలను లెక్కిస్తాడు.
వాటి పేర్లనుబట్టి వాటన్నిటినీ ఆయన పిలుస్తాడు.
5 మన ప్రభువు చాలా గొప్పవాడు. ఆయన చాలా శక్తిగలవాడు.
ఆయన పరిజ్ఞానానికి పరిమితి లేదు.
6 పేదలను యెహోవా బలపరుస్తాడు.
కాని చెడ్డ ప్రజలను ఆయన ఇబ్బంది పెడతాడు.
7 యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి.
స్వరమండలాలతో మన దేవుణ్ణి స్తుతించండి.
8 దేవుడు ఆకాశాన్ని మేఘాలతో నింపుతాడు.
భూమి కోసం దేవుడు వర్షాన్ని సృష్టిస్తాడు.
పర్వతాల మీద దేవుడు గడ్డిని మొలిపిస్తాడు.
9 జంతువులకు దేవుడు ఆహారం యిస్తాడు.
పక్షి పిల్లల్ని దేవుడు పోషిస్తాడు.
10 యుద్ధాశ్వాలు, బలంగల సైనికులు ఆయనకు ఇష్టం లేదు.
11 యెహోవాను ఆరాధించే ప్రజలు ఆయనకు సంతోషాన్ని కలిగిస్తారు.
ఆయన నిజమైన ప్రేమను నమ్ముకొనే ప్రజలు యెహోవాకు సంతోషం కలిగిస్తారు.
12 యెరూషలేమా, యెహోవాను స్తుతించుము.
సీయోనూ, నీ దేవుని స్తుతించుము!
13 యెరూషలేమా, దేవుడు నీద్వారబంధాలను బలపరుస్తాడు.
నీ పట్టణంలోని ప్రజలను దేవుడు ఆశీర్వదిస్తాడు.
14 నీ దేశానికి దేవుడు శాంతి కలిగించాడు. కనుక యుద్ధంలో నీ శత్రువులు నీ ధాన్యం తీసుకొని పోలేదు.
ఆహారం కోసం నీకు ధాన్యం సమృద్ధిగా ఉంది.
15 దేవుడు భూమికి ఒక ఆజ్ఞ ఇస్తాడు.
దానికి వెంటనే అది లోబడుతుంది.
16 నేల ఉన్నిలా తెల్లగా అయ్యేంతవరకు మంచు కురిసేటట్టు దేవుడు చేస్తాడు.
ధూళిలా గాలిలో మంచు విసిరేటట్టు చేస్తాడు.
17 దేవుడు ఆకాశం నుండి బండలవలె వడగండ్లు పడేలా చేస్తాడు.
ఆయన పంపే చలికి ఎవడూ నిలువ జాలడు.
18 అప్పుడు, దేవుడు మరో ఆజ్ఞ ఇస్తాడు. వెచ్చటి గాలి మరల వీస్తుంది.
మంచు కరిగిపోతుంది. నీళ్లు ప్రవహించటం మొదలవుతుంది.
19 దేవుడు యాకోబుకు (ఇశ్రాయేలు) తన ఆజ్ఞ ఇచ్చాడు.
దేవుడు ఇశ్రాయేలుకు తన న్యాయచట్టాలు, ఆదేశాలు ఇచ్చాడు.
20 దేవుడు యిలా మరి ఏ దేశానికీ చెయ్యలేదు.
ఇతర మనుష్యులకు దేవుడు తన న్యాయ చట్టం ఉపదేశించలేదు.
యెహోవాను స్తుతించండి!
సంగీత నాయకునికి: కోరహు కుమారుల స్తుతి కీర్తన
85 యెహోవా, నీ దేశం మీద దయ చూపించుము.
యాకోబు ప్రజలు విదేశంలో ఖైదీలుగా ఉన్నారు. ఖైదీలను తిరిగి వారి దేశానికి తీసుకొని రమ్ము.
2 యెహోవా, నీ ప్రజలను క్షమించుము!
వారి పాపాలు తుడిచివేయుము.
3 యెహోవా, కోపంగాను,
ఆవేశంగాను ఉండవద్దు.
4 మా దేవా, రక్షకా, మా మీద కోపగించటం మానివేసి,
మమ్మల్ని మరల స్వీకరించు.
5 నీవు మామీద శాశ్వతంగా కోపగిస్తావా?
6 దయచేసి మమ్మల్ని మరల బ్రతికించుము!
నీ ప్రజలను సంతోషింపజేయుము.
7 యెహోవా, నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నట్టుగా మాకు చూపించుము.
మమ్మల్ని రక్షించుము.
8 దేవుడు చెప్పేది నేను వింటున్నాను.
తన ప్రజలకు శాంతి కలుగుతుందని యెహోవా చెబుతున్నాడు.
ఆయన అనుచరులు వారి అవివేక జీవిత విధానాలకు తిరిగి వెళ్లకపోతే వారికి శాంతి ఉంటుంది.
9 దేవుడు తన అనుచరులను త్వరలో రక్షిస్తాడు.
మేము త్వరలోనే మా దేశంలో గౌరవంగా బ్రతుకుతాము.
10 దేవుని నిజమైన ప్రేమ ఆయన అనుచరులకు లభిస్తుంది.
మంచితనం, శాంతి ఒకదానితో ఒకటి ముద్దు పెట్టుకొంటాయి.
11 భూమి మీద మనుష్యులు దేవునికి నమ్మకంగా ఉంటారు.
పరలోకపు దేవుడు వారికి మేలు అనుగ్రహిస్తాడు.
12 యెహోవా మనకు అనేకమైన మంచివాటిని ఇస్తాడు.
భూమి అనేక మంచి పంటలను ఇస్తుంది.
13 మంచితనం దేవునికి ముందర నడుస్తూ
ఆయన కోసం, దారి సిద్ధం చేస్తుంది.
దావీదు ప్రార్థన.
86 నేను నిరుపేదను, నిస్సహాయుణ్ణి.
యెహోవా, దయతో నా మాట విని నా ప్రార్థనకు జవాబు ఇమ్ము.
2 యెహోవా, నేను నీ అనుచరుడను. దయతో నన్ను కాపాడు.
నేను నీ సేవకుడను. నీవు నా దేవుడవు.
నేను నిన్ను నమ్ముకొన్నాను. కనుక నన్ను రక్షించుము.
3 నా ప్రభువా, నా మీద దయ చూపించుము.
రోజంతా నేను నీకు ప్రార్థన చేస్తున్నాను.
4 ప్రభువా, నా జీవితాన్ని నేను నీ చేతుల్లో పెడుతున్నాను.
నన్ను సంతోషపెట్టుము, నేను నీ సేవకుడను.
5 ప్రభువా, నీవు మంచివాడవు, దయగలవాడవు.
సహాయం కోసం నిన్ను వేడుకొనే నీ ప్రజలను నీవు నిజంగా ప్రేమిస్తావు.
6 యెహోవా, దయకోసం నేను మొరపెట్టుకునే
నా ప్రార్థనలు ఆలకించుము.
7 యెహోవా, నా కష్టకాలంలో నేను నిన్ను ప్రార్థిస్తున్నాను.
నీవు నాకు జవాబు యిస్తావని నాకు తెలుసు.
8 దేవా, నీవంటివారు మరొకరు లేరు.
నీవు చేసిన వాటిని ఎవ్వరూ చేయలేరు.
9 ప్రభువా, నీవే అందరినీ సృష్టించావు.
వారందరూ నిన్ను ఆరాధించెదరు గాక. వాళ్లంతా నీ నామాన్ని ఘనపరిచెదరు గాక.
10 దేవా, నీవు గొప్పవాడవు! నీవు అద్భుత కార్యాలు చేస్తావు.
నీవు మాత్రమే దేవుడవు.
11 యెహోవా, నీ మార్గాలు నాకు నేర్పించు
నేను నీ సత్యాలకు లోబడి జీవిస్తాను.
నిన్నారాధించుటయే నా జీవితంలోకెల్లా
అతి ముఖ్యాంశంగా చేయుము.
12 దేవా, నా ప్రభువా, నేను నా పూర్ణ హృదయంతో నిన్ను స్తుతిస్తాను.
నీ నామాన్ని నేను శాశ్వతంగా కీర్తిస్తాను.
13 దేవా, నా యెడల నీకు ఎంతో గొప్ప ప్రేమ ఉంది.
మరణపు అగాథ స్థలం నుండి నీవు నన్ను రక్షిస్తావు.
14 దేవా, గర్విష్ఠులు నాపై పడుతున్నారు.
కృ-రులైన మనుష్యుల గుంపు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు.
ఆ మనుష్యులు నిన్ను గౌరవించటం లేదు.
15 ప్రభూ, నీవు దయ, కరుణగల దేవుడవు.
నీవు సహనం, నమ్మకత్వం, ప్రేమతో నిండి ఉన్నావు.
16 దేవా, నీవు నా మాట వింటావని నా యెడల దయగా ఉంటావని చూపించుము.
నాకు బలాన్ని అనుగ్రహించుము. నేను నీ సేవకుడను.
నన్ను రక్షించుము. నేను నీ సేవకుడను.
17 దేవా, నీవు నాకు సహాయం చేస్తావని రుజువు చేయుటకు ఏదైనా చేయుము.
అప్పుడు నా శత్రువులు నిరాశ చెందుతారు.
ఎందుకంటే ప్రభూ, నీవు నా యెడల దయ చూపించావని, నాకు సహాయం చేశావని అది తెలియచేస్తుంది.
ఒక యువ ప్రవక్తతో యెహూని అభిషేకించమని ఎలీషా చెప్పుట
9 ప్రవక్త అయిన ఎలీషా ప్రవక్తల బృందంలో ఒకనిని పిలిచి, అతనితో ఎలీషా, “ఈ చిన్న నూనె సీసాని నీచేతిలో తీసుకుని వెళ్లడానికి నీవు సిద్ధంగా ఉండు. రామోత్గిలాదుకు వెళ్లు. 2 నీవక్కడికి చేరుకోగానే, నింషీ కుమారుడైన యెహోషాపాతు కుమారుడగు యెహూ నీకు కనిపిస్తాడు. అతని సోదరులలోనుండి అతనిని చాటుగా పిలిచి, తర్వాత ఒక గదిలోకి తీసుకు వెళ్లు. 3 చిన్న నూనె సీసా తీసుకుపోయి, యెహూ తలమీద నూనె పోసి ఈరీతిగా చెప్పు. ఇది యెహోవా చెప్పింది. ఇశ్రాయేలీయుల కొత్తరాజుగా నిన్ను అభిషేకించాను. తర్వాత నీవు తలుపు తెరిచి పారిపో. అక్కడ నిలిచి వుండవద్దు” అన్నాడు.
4 అందువల్ల ఈ యువ ప్రవక్త రామోత్గిలాదుకు వెళ్లాడు. 5 ఆ యువకుడు అక్కడకు చేరగానే, అతను సైన్యాధిపతులు అక్కడ కూర్చుని వుండటం చూశాడు. “అధిపతీ! నీకు నేనొక సందేశం తెచ్చాను” అని ఆ యువకుడు చెప్పాడు.
“మేమందరము ఇక్కడున్నాము. ఎవరికి సందేశం?” అని యెహూ అడిగాడు.
“అధిపతీ! నీకే సందేశం” అని యువకుడు చెప్పాడు.
6 యెహూ లేచి ఇంట్లోకి వెళ్లాడు. అప్పుడు యువ ప్రవక్త యెహూను అభిషేకించాడు. ఆ యువ ప్రవక్త యెహూతో ఈ విధంగా చెప్పాడు: “యెహోవా యొక్క ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించే కొత్తరాజుగా నిన్ను అభిషేకించానని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పుచున్నాడు. 7 నీ రాజైన అహాబు వంశాన్ని నీవు నాశనం చెయ్యాలి. కాబట్టి నా సేవకులు, ప్రవక్తలు, యెహోవా యొక్క మనుష్యుల మరణానికి కారణమైన యెజెబెలును శిక్షిస్తున్నాను. 8 అందువల్ల అహాబు వంశీయులందరూ మరణిస్తారు. అహాబు వంశంలో మగపిల్లవాడెవ్వడూ బతకనీయకుండా చేస్తాను. ఆ మగబిడ్డ సేవకుడైనా సరే స్వతంత్రుడైనా సరే భేదము లేదు. 9 నెబాతు కుమారుడైన యరొబాము వంశంవలె, అహీయా కుమారుడైన బయెషా వంశంవలె అహాబు వంశాన్ని చేస్తాను. 10 యెజ్రెయేలు ప్రదేశంలో యెజెబెలుని కుక్కలు తింటాయి, యెజెబెలు సమాధి చేయబడదు.”
ఆ తర్వాత యువ ప్రవక్త తలుపు తెరిచి పరుగెత్తుకొని పోయాడు.
యెహూని రాజుగా సేవకులు ప్రకటించుట
11 యెహూ తన రాజ ఉద్యోగుల వద్దకు వెళ్లాడు. ఒక అధికారి యెహూతో, “అంతా మంచిగా వున్నదా? ఈ పిచ్చివాడు నీ వద్దకు ఎందుకు వచ్చాడు?” అని అడిగాడు.
ఆ సేవకులకు యెహూ ఇలా సమాధాన మిచ్చాడు. “ఆ వ్యక్తిని గురించి నీకు తెలుసు. అతను చెప్పే పిచ్చి విషయాలు నీకు తెలుసు.”
12 అధికారులు, “కాదు నిజం చెప్పు. అతడు ఏమి చెప్పాడు?” అని అడిగాడు. ఆ యువ ప్రవక్త చెప్పిన విషయాలు యెహూ అధికారులకు, “అతడు చెప్పిన దేమనగా, ‘ఇశ్రాయేలుకు కొత్తరాజుగా నేను నిన్ను అభిషేకించానని యెహోవా చెప్పాడు’ అని అతను నాకు చెప్పాడు.”
13 తర్వాత ప్రతి అధికారి వెంటనే తమ దుస్తులు తీసివేసి, యెహూ ఎదుట మెట్లమీద పరిచారు. ఆ తర్వాత, “యెహూ రాజు” అని బూర ఊది ప్రకటించారు.
యెహూ యెజ్రెయేలుకు వెళ్లుట
14 అందువల్ల యెహోషాపాతు కుమారుడైన యెహూ, యెహోరాముకు విరుద్ధంగా పధక రచన చేసెను. యెహోషాపాతు నింషీ కుమారుడు.
ఆ సమయమున యెహోరాము మరియు ఇశ్రాయేలు వాళ్లు సిరియాకు రాజయిన హజాయేలుకు వ్యతిరేకంగా రామోత్గిలాదును కాపాడటానికి ప్రయత్నించారు. 15 సిరియా రాజయిన హజాయేలుకు ప్రతికూలంగా యెహోరాము రాజు యుద్ధం చేశాడు. కాని సిరియనులు యెహోరాము రాజును గాయపరిచారు. అతను ఆ గాయాల నుంచి బయటపడటానికి యెజ్రేయేలుకు వెళ్లాడు.
అందువల్ల యెహూ అధికారులను ఉద్దేశించి, “నేను కొత్త రాజని మీరు సమ్మతించినట్లయితే, ఇప్పుడు ఎవరినీ నగరం నుంచి తప్పించుకొనకుండా చేయండి. ఎందుకనగా, ఈ విషయం యెజ్రెయేలీయులతో చెప్పకూడదు” అని పలికాడు.
16 యెజ్రెయేలులో యెహోరాము మంచము పట్టి విశ్రాంతి పొందుచున్నాడు. అందువల్ల యెహూ తన రథమెక్కి, యెజ్రెయేలుకు వెళ్లాడు. యూదా రాజయిన అహజ్యా యెహోరామును చూడడానికి యెజ్రెయేలుకు వచ్చాడు.
లైంగిక అవినీతి
12 “ఏది చెయ్యటానికైనా నాకు అనుమతి ఉంది.” కాని వాటివల్ల లాభం కలుగదు. “ఏది చెయ్యటానికైనా నాకు అనుమతి ఉంది” కాని నేను దానికి బానిసను కాను, 13 “తిండి కడుపు కోసము, కడపు తిండి కోసం సృష్టింపబడినాయి.” కాని దేవుడు రెంటినీ నాశనం చేస్తాడు. దేహం ఉన్నది వ్యభిచారం చేయటానికి కాదు. అది ప్రభువు కోసం ఉంది. ప్రభువు దేహం కోసం ఉన్నాడు. 14 దేవుడు తన శక్తితో ప్రభువును బ్రతికించాడు. అదే విధంగా మనల్ని కూడా బ్రతికిస్తాడు. 15 మీ దేహాలు క్రీస్తుకు అవయవాలని మీకు తెలియదా? మరి అలాంటప్పుడు క్రీస్తు అవయవాల్ని, వేశ్య దేహంతో కలుపమంటారా? అసంభవము. 16 తన దేహాన్ని వేశ్య దేహంతో కలిపినవాడు ఆ దేహంతో ఒకటైపోతాడని మీకు తెలియదా? దీన్ని గురించి, “రెండు దేహాలు ఒక దేహంగా అవుతాయి”(A) అని లేఖనాల్లో వ్రాయబడి ఉంది. 17 కాని ప్రభువుతో ఐక్యమైన వాడు ఆయన ఆత్మతో ఐక్యమౌతాడు.
18 లైంగిక అవినీతికి దూరంగా ఉండండి, మనిషి చేసే మిగతా పాపాలు తన దేహానికి సంబంధించినవి కావు. కాని వ్యభిచారం చెయ్యటంవల్ల వ్యక్తి తన స్వంత దేహంపట్ల పాపం చేసినట్లౌతుంది. 19 మీ దేహం పరిశుద్ధాత్మకు మందిరమని మీకు తెలియదా? దేవుడు యిచ్చిన పరిశుద్ధాత్మ మీలో ఉన్నాడు. మీ దేహంపై మీకు హక్కులేదు. 20 మీ కోసం వెల చెల్లించబడింది. కనుక మీ దేహాల్ని దేవుని మహిమ కోసం ఉపయోగించండి.
యేసు ఇచ్చుటను గురించి బోధించటం
6 “జాగ్రత్త! మీరు చేసే నీతికార్యాలు ఇతర్లు చూసేలా చెయ్యకండి. అలా చేస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి మీకు ప్రతిఫలమివ్వడు.
2 “అందువల్ల మీరు దానం చేసినప్పుడు చాటింపు వేయించుకొని నలుగురికి తెలుపకండి. కపటులు సమాజాల్లో, వీధుల్లో, ప్రజలు గౌరవించాలని అలా చేస్తారు. ఇది సత్యం, వాళ్ళకు లభించవలసిన ప్రతి ఫలం అప్పుడే పూర్తిగా లభించింది. 3 కాని, మీరు దానం చేసేటప్పుడు మీ కుడిచేయి ఏమి యిస్తుందో మీ ఎడమచేతికి తెలియనివ్వకండి. 4 అప్పుడే మీ దానం గుప్తంగా ఉంటుంది. అప్పుడు, మీరు రహస్యంగా చేస్తున్నది చూసి మీ తండ్రి మీకు ప్రతిఫలం యిస్తాడు.
యేసు ప్రార్థన గురించి బోధించటం
(లూకా 11:2-4)
5 “మీరు ప్రార్థించేటప్పుడు కపటుల్లా ప్రార్థించకండి. వాళ్ళు సమాజమందిరాల్లో, వీధుల ప్రక్కన నిలుచొని నలుగురూ చూడాలని ప్రార్థిస్తారు. అది వాళ్ళకు ఆనందాన్నిస్తుంది. కాని ఇది సత్యం—వాళ్ళకు లభించవలసిన ఫలితం వాళ్ళకప్పుడే పూర్తిగా లభించింది. 6 మీరు ప్రార్థించేటప్పుడు గదిలోకి వెళ్ళి తలుపు వేసికొని కనిపించని మీ తండ్రికి ప్రార్థించండి. అప్పుడు రహస్యంలో ఉండే మీ తండ్రి మీకు ప్రతిఫలం యిస్తాడు.
యేసు ఉపవాసమును గురించి బోధించటం
16 “కపటులు ఉపవాసం చేసినప్పుడు ప్రజలు గమనించాలని తమ ముఖాలు నీరసంగా కనిపించేటట్లు చేసుకొంటారు. మీరు ఉపవాసం చేసినప్పుడు అలా చేయకండి. ఇది సత్యం, వాళ్ళు పొందవలసిన ఫలాన్ని పొందారు. యింకేమీ లభించదు. 17 మీరు ఉపవాసం చేసినప్పుడు తలకు నూనె రాసుకొని ముఖాన్ని కడుక్కొండి. 18 అలా చేస్తే, మీరు ఉపవాసం చేస్తున్నట్లు ప్రజలకు కనిపించదు. కాని కనిపించని మీ తండ్రికి మాత్రమే మీరు ఉపవాసం చేస్తున్నట్లు తెలుస్తుంది. అందువలన రహస్యంగా చూసే మీ తండ్రి మీకు ప్రతిఫలం యిస్తాడు.
© 1997 Bible League International