Book of Common Prayer
మేమ్
97 నీ ధర్మశాస్త్రాన్ని నేనెంతగా ప్రేమిస్తానో!
దినమంతా అదే నా ధ్యానం.
98 నీ ఆజ్ఞ నన్ను నా శత్రువులకంటే
జ్ఞానవంతునిగా చేస్తుంది.
99 నా గురువులందరికంటే నాకు ఎక్కువ గ్రహింపు ఉన్నది.
ఎందుకంటే నీ ఉపదేశాలే నా ధ్యానం కాబట్టి.
100 ముసలివారి కంటే నేనెక్కువ అర్థం చేసుకొంటాను.
కారణం ఏమిటంటే, నేను నీ శాసనాలను అనుసరిస్తాను.
101 నీ వాక్కు ప్రకారం నడుచుకోటానికి
ప్రతి చెడు మార్గంనుండి నేను తప్పించుకొంటాను.
102 యెహోవా, నీవు నా ఉపాధ్యాయుడవు
కనుక నేను నీ న్యాయ చట్టాలకు విధేయుడనవటం మానను.
103 నీ మాటలు నా నోటికి తేనెకంటే మధురం.
104 నీ ఉపదేశాలు నన్ను తెలివిగలవాణ్ణి చేస్తాయి,
అందుచేత తప్పుడు ఉపదేశాలు నాకు అసహ్యము.
నూన్
105 యెహోవా, నీ వాక్యాలు
నా బాటను వెలిగించే దీపాల్లా ఉన్నాయి.
106 నీ న్యాయ చట్టాలు మంచివి.
నేను వాటికి విధేయుడనవుతానని వాగ్దానం చేస్తున్నాను. మరియు నా వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాను.
107 యెహోవా, నేను చాలాకాలం శ్రమ అనుభవించాను.
దయచేసి ఆజ్ఞయిచ్చి, నన్ను మరల జీవించనిమ్ము!
108 యెహోవా, నా స్తుతి అంగీకరించు.
నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
109 నా జీవితం ఎల్లప్పుడూ ప్రమాదంలోనే ఉంది.
కాని యెహోవా, నేను నీ ఉపదేశాలు మరచిపోలేదు.
110 దుర్మార్గులు నన్ను ఉచ్చులో పట్టాలని ప్రయత్నించారు
కాని నేను నీ ఆజ్ఞలకు అవిధేయుడను కాలేదు.
111 యెహోవా, శాశ్వతంగా నేను నీ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తాను.
అది నన్ను ఎంతో సంతోషింపజేస్తుంది.
112 నీ ఆజ్ఞలు అన్నిటికీ విధేయుడనగుటకు
నేను ఎల్లప్పుడూ కష్టపడి ప్రయత్నిస్తాను.
సామెహ్
113 స్థిరమైన మనస్సు లేనివాళ్లంటే నాకు అసహ్యం.
నేను నీ ఉపదేశాలను ప్రేమిస్తున్నాను.
114 నన్ను దాచిపెట్టి, కాపాడుము.
యెహోవా, నీవు చెప్పే ప్రతిదీ నేను నమ్ముతాను.
115 యెహోవా, దుర్మార్గపు ప్రజలను నా దగ్గరకు రానీయకుము.
నేను మాత్రం నా దేవుని ఆజ్ఞలకు విధేయుడనవుతాను.
116 యెహోవా, నీ వాగ్దానం ప్రకారం నాకు చేయూత నిమ్ము.
నేను జీవిస్తాను. నేను నిన్ను నమ్ముకొన్నాను, నన్ను నిరాశపరచకు.
117 యెహోవా, నాకు సహాయం చేయుము. నేను రక్షించబడతాను.
నీ ఆజ్ఞలను నేను నిరంతరం అధ్యయనం చేస్తాను.
118 యెహోవా, నీ ఆజ్ఞలను ఉల్లంఘించే ప్రతి మనిషినీ నీవు తిప్పికొడతావు.
ఎందుకంటే ఆ మనుష్యులు నిన్ను అనుసరిస్తామని ఒడంబడిక చేసుకున్నప్పుడు అబద్ధం చెప్పారు.
119 యెహోవా, భూమి మీద దుష్టులను నీవు చెత్తలా చూస్తావు.
కనుక నేను శాశ్వతంగా నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తాను.
120 యెహోవా, నీవంటే నాకు భయం,
నీ చట్టాలకు నేను భయపడి వాటిని గౌరవిస్తాను.
సంగీత నాయకునికి: గిత్తీత్ రాగం. ఆసాపు కీర్తన.
81 సంతోషించండి, మన బలమైన దేవునికి గానం చేయండి.
ఇశ్రాయేలీయుల దేవునికి సంతోషంతో కేకలు వేయండి.
2 సంగీతం ప్రారంభించండి.
గిలక తప్పెట వాయించండి.
స్వరమండలం, సితారాలను శ్రావ్యంగా వాయించండి.
3 నెలవంకనాడు గొర్రెపోతు కొమ్ము ఊదండి.
పౌర్ణమినాడు[a] గొర్రెపోతు కొమ్ము ఊదండి. ఆనాడే మన పండుగ ఆరంభం.
4 అది ఇశ్రాయేలు ప్రజలకు న్యాయచట్టం.
ఆ ఆదేశాన్ని యాకోబుకు దేవుడు ఇచ్చాడు.
5 ఈజిప్టునుండి యోసేపును[b] దేవుడు తీసుకొనిపోయిన సమయంలో
దేవుడు వారితో ఈ ఒడంబడిక చేసాడు.
ఈజిప్టులో నేను గ్రహించని భాష విన్నాను.
6 దేవుడు ఇలా చెబుతున్నాడు: “మీ భుజంమీద నుండి బరువు నేను దింపాను.
నేను మీ మోతగంప పడవేయనిచ్చాను.
7 మీరు కష్టంలో ఉన్నప్పుడు మీరు సహాయం కోసం వేడుకొన్నారు. నేను మిమ్మల్ని స్వతంత్రుల్ని చేశాను.
తుఫాను మేఘాలలో దాగుకొని నేను మీకు జవాబు ఇచ్చాను.
నీళ్ల వద్ద నేను మిమ్మల్ని పరీక్షించాను.”
8 “నా ప్రజలారా, నా మాట వినండి. నా ఒడంబడిక[c] నేను మీకు యిస్తాను.
ఇశ్రాయేలూ, నీవు దయచేసి నా మాట వినాలి!
9 విదేశీయులు పూజించే తప్పుడు దేవుళ్ళను
ఎవరినీ ఆరాధించవద్దు.
10 నేను యెహోవాను, నేనే మీ దేవుడను.
మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకొని వచ్చిన దేవుడను నేనే.
ఇశ్రాయేలూ, నీ నోరు తెరువు,
నేను దానిని నింపుతాను.
11 “కాని నా ప్రజలు నా మాట వినలేదు.
ఇశ్రాయేలు నాకు విధేయత చూపలేదు.
12 కనుక వారు చేయగోరిన వాటిని నేను చేయనిచ్చాను.
ఇశ్రాయేలీయులు వారి ఇష్టం వచ్చిందల్లా చేసారు.
13 ఒకవేళ నా ప్రజలు గనుక నిజంగా నా మాట వింటే ఇశ్రాయేలు జీవించాలని నేను కోరిన విధంగా గనుక వారు జీవిస్తే,
14 అప్పుడు నేను ఇశ్రాయేలీయుల శత్రువులను ఓడిస్తాను.
ఇశ్రాయేలీయులకు కష్టాలు కలిగించే ప్రజలను నేను శిక్షిస్తాను.
15 యెహోవా శత్రువులు యెహోవాను కాదంటారు,
అందుచేత వారు శిక్షించబడతారు.
16 దేవుడు తన ప్రజలకు శ్రేష్ఠమైన గోధుమలు ఇస్తాడు.
తన ప్రజలకు తృప్తి కలిగేంతవరకు వారికి ఆ కొండ తేనె ఇస్తాడు.”
ఆసాపు స్తుతి కీర్తన.
82 దైవ సమాజంలో దేవుడు తన స్థానాన్ని తీసుకొన్నాడు. సమాజంలో దేవుడు నిలుచున్నాడు.
ఆ దేవుళ్ళ సమాజంలో ఆయన తీర్పునిస్తాడు.
2 ప్రజలారా, “ఎంతకాలం మీరు అన్యాయపు తీర్పు తీరుస్తారు?
దుర్మార్గులు శిక్షించబడకుండా ఎన్నాళ్లు తప్పించుకోనిస్తారు?” అని దేవుడు అంటున్నాడు.
3 “అనాధలను, పేద ప్రజలను కాపాడండి.
న్యాయం జరగని పేద ప్రజల, అనాధుల హక్కులను కాపాడండి.
4 పేదలకు, నిస్సహాయ ప్రజలకు సహాయం చేయండి.
దుర్మార్గుల బారినుండి వారిని రక్షించండి.
5 “ఏమి జరుగుతుందో ఇశ్రాయేలు ప్రజలకు తెలియదు.
వారు గ్రహించరు.
వారు చేస్తున్నది ఏమిటో వారికి తెలియదు.
వారి ప్రపంచం వారి చుట్టూరా కూలిపోతుంది.”
6 నేను (దేవుడు) మీతో చెప్పాను,
“మీరు దైవాలు, మీరందరూ సర్వోన్నతుడైన దేవుని కుమారులు.
7 కాని మనుష్యులందరూ మరణించినట్టుగానే మీరు కూడా మరణిస్తారు.
ఇతర నాయకులందరి వలెనే మీరు కూడా మరణిస్తారు.”
8 దేవా, లెమ్ము. నీవే న్యాయమూర్తివిగా ఉండుము!
దేవా, రాజ్యములన్నీ నీకు చెందినవే.
ఎలీషా మరియు గొడ్డలి
6 ప్రవక్తల బృందం ఎలీషాతో ఇలా చెప్పింది: “మేమా ప్రదేశంలో నివసిస్తున్నాము. కాని మాకది చాలా చిన్నదిగా వుంది. 2 యోర్దాను నదివద్దకు వెళ్లి, అడవిలో చెట్లు నరుకుదాము. మనలో ప్రతి ఒక్కరికి ఒక దూలము లభిస్తుంది. అక్కడ నివాసయ్యోగ్యమైన ఇల్లు నిర్మించుకుందాము.”
“బాగుంది, అలాగే కానివ్వండి” అని ఎలీషా బదులు చెప్పాడు.
3 “మాతో మీరు రండి” అని ఒకడనెను. ఎలీషా “బాగుంది, నేను కూడా మీతో వస్తాను” అని చెప్పాడు.
4 అందువల్ల ఎలీషా ప్రవక్తల బృందంతో పాటు వెళ్లాడు. వారు యోర్దాను నది వద్దకు చేరుకుని కొన్ని చెట్లు నరకసాగారు. 5 కాని ఒక వ్యక్తి ఒక చెట్టు నరికేటప్పుడు, చేతినుండి గొడ్డలి జారిపోయి నీళ్లలో పడింది. అప్పుడతను, “యజమానీ, నేను ఆ గొడ్డలి చేబదులుగా తెచ్చాను” అని అరిచాడు.
6 దైవజనుడైన ఎలీషా, “అది ఎక్కడ పడింది” అని అడిగాడు.
గొడ్డలి పడిన చోటును అతను ఎలీషాకు చూపాడు. అప్పుడు ఎలీషా ఒక కొమ్మ నరికి, కర్రను నదిలోకి విసిరివేశాడు. ఆ కొమ్మ ఇనుప గొడ్డలి నీళ్లలో తేలునట్లు చేసింది. 7 “గొడ్డలి పైకి తీసుకో” అని ఎలీషా చెప్పాడు. అప్పుడా వ్యక్తి గొడ్డలిని తీసుకున్నాడు.
సిరియా ఇశ్రాయేలును పట్టుకొనుటకు ప్రయత్నించుట
8 సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధం చేయాలని తన సైనికోద్యోగులతో ఆయన సమాలోచన చేస్తున్నాడు. “ఈ చోట దాక్కుని ఇశ్రాయేలు వారు వచ్చినప్పుడు వారిని ఎదుర్కోనండి” అని అతను చెప్పాడు.
9 కాని దైవజనుడు అయిన ఎలీషా ఇశ్రాయేలు రాజుకి ఒక సందేశం పంపాడు. ఎలీషా ఇట్లన్నాడు: “జాగ్రత్తగా వుండండి. ఆ స్థలంగుండా పోవద్దు! సిరియా సైనికులు అక్కడ దాగుకొని వున్నారు”
10 ఇశ్రాయేలు రాజు తన మనుష్యులకు సందేశం పంపుతూ దైవజనుడు (ఎలీషా) తనకు హెచ్చరిక చేశాడని తెలియపరిచాడు. ఇశ్రాయేలు రాజు పలువురిని కాపాడగలిగాడు.
11 ఇందువల్ల సిరియా రాజు తలక్రిందులయ్యాడు. తన సైనికోద్యోగుల్ని సమావేశ పరచి వారితో, “ఇశ్రాయేలు రాజుకోసం గూఢచారి పని చేస్తున్నదెవరో చెప్పండి” అని అడిగాడు.
12 సిరియా రాజు అధికారులలో ఒకడు, “ప్రభూ, రాజా, మాలో ఎవ్వరమూ గూఢాచారులము కాము. ఇశ్రాయేలు ప్రవక్త అయిన ఎలీషా ఇశ్రాయేలు రాజుకు అనేక రహస్య విషయాలు చెప్పగలడు. మీరు నిద్రించే గృహంలో మీరు మాట్లాడే మాటలు కూడా చెప్పగలడు” అన్నాడు.
13 అప్పుడు సిరియా రాజు, “ఎలీషాని కనుగొనండి. అతనిని పట్టుకునేందుకు నేను మనుష్యులను పంపుతాను” అన్నాడు.
“ఎలీషా దోతానులో ఉన్నాడు” అని రాజ సేవకులు చెప్పారు.
14 అప్పుడు సిరియా రాజు గుర్రాలు, రథాలు, ఒక పెద్ద సైన్యం దోతానుకు పంపాడు. వారు రాత్రి వేళ చేరి నగరాన్ని చుట్టుముట్టారు. 15 ఆ ఉదయం ఎలీషా సేవకుడు తర్వగా మేల్కోన్నాడు. అతను వెలుపలికి పోయి నగరం చుట్టూ ఒక పెద్ద సైన్యం రథాలు, గుర్రాలు ఉండటం చూశాడు.
ఎలీషా సేవకుడు, “నా యజమానీ! మనమేమి చేయగలము” అని ఎలీషాని చూసి అడిగాడు.
16 “భయపడకు, సిరియా కోసం యుద్ధం చేసే సైన్యం కంటె మనకోసం చేసే సైన్యం చాలా పెద్దది” అని ఎలీషా చెప్పాడు.
17 అప్పుడు ఎలీషా ప్రార్థించి ఇలా చెప్పాడు: “యెహోవా, నా సేవకుని కళ్లు తెరిపింపుము. అప్పుడతను చూడగలడు.”
యెహోవా ఆ యువకుని కళ్లు తెరిపించాడు. మరియు సేవకుడు కొండ చుట్టూ అగ్నిరథాలు గుర్రాలు వుండటం చుశాడు. అవి ఎలీషా చుట్టూ ఉన్నాయి.
18 ఈ అగ్నిరథాలు గుర్రాలు ఎలీషాకోసం క్రిందికి దిగి వచ్చాయి. ఎలీషా యెహోవాను ప్రార్థించాడు. “ఈ మనష్యులను అంధులను చేయవలసిందిగా నిన్ను ప్రార్థించుచున్నాను” అన్నాడు.
ఎలీషా ప్రార్థించిన ప్రాకారం యెహోవా చేశాడు. సిరియా సైనికులు అంధులగునట్లు యెహోవా చేశాడు. 19 సిరియా సైనికులను వుద్దేశించి ఎలీషా, “ఇది సరి అయిన మార్గం కాదు. ఇది సరి అయిన నగరం కాదు. నన్ను అనుసరించండి. మీరు ఎవరికోసం వెతుకుతున్నారో నేను అతని వద్దకు మిమ్మలను తీసుకుని వెళతాను” అన్నాడు. తర్వాత ఎలీషా సిరియా సైన్యాన్ని షోమ్రోనుకు నడిపించాడు.
20 వారు షోమ్రోనుకు చేరుకోగానే, “యెహోవా, వీరి కళ్లు తెరిపించుము. అప్పుడు వారు చూడగలుగుతారు” అని ఎలీషా ప్రార్థించాడు.
అప్పుడు యెహోవా వారి కళ్లు తెరిపించాడు. 21 తామప్పుడు షోమ్రోను నగరంలో వునన్నట్లుగా సైనికులు చూశారు. ఇశ్రాయేలు రాజు సిరియా సైన్యాన్ని చూశాడు. ఎలీషాతో ఇశ్రాయేలు రాజు, “తండ్రీ, వారిని నేను చంపనా,” అని అడిగాడు.
22 “నీ ఖడ్గముతో, విల్లమ్ములతో నీవు యుద్ధంలో పట్టుకున్న ఈ మనుష్యులను నీవు చంపగోరుచున్నావా? సిరియా సైనికులకు రొట్టెలు మంచినీళ్లు ఇమ్ము. వారిని తిని త్రాగనిమ్ము. తర్వాత వారు వారి దేశానికి యజమాని వద్దకు వెళ్తారు” అని ఎలీషా చెప్పాడు.
23 ఇశ్రాయేలు రాజు సిరియా సైన్యానికై చాలా ఆహారం తయారు చేయించాడు. ఆ సైనికులు తిన్నారు, త్రాగారు. తర్వాత ఇశ్రాయేలు రాజు సిరియా సైనికులను వారి దేశానికి పంపించాడు. సిరియా సైనికులు వారి యజమాని వద్దకు వెళ్లారు. సిరియా వారు దాడి చేయడానికై సైనికులెవరినీ ఇశ్రాయేలుకి పంపలేదు.
9 నేను నా లేఖల్లో లైంగిక అవినీతి కలవాళ్ళతో సాంగత్యం చేయవద్దని వ్రాసాను. 10 అంటే, సంఘానికి చెందని అవినీతిపరులతో, లోభులతో, మోసగాళ్ళతో, విగ్రహారాధకులతో సాంగత్యం చేయవద్దని నేను చెప్పటం లేదు. అలా చేస్తే మీరు ఈ ప్రపంచాన్నే వదిలివేయవలసి వస్తుంది. 11 నేను ప్రస్తుతం వ్రాసేది ఏమిటంటే తాను సోదరుణ్ణని చెప్పుకొంటూ, లైంగిక అవినీతితో జీవించేవానితో, లోభత్వం చేసేవానితో, విగ్రహారాధన చేసేవానితో, ఇతరులను దూషించేవానితో, త్రాగుబోతుతో, మోసం చేసేవానితో, సహవాసం చేయవద్దని చెపుతున్నాను. అలాంటి వానితో కలిసి భోజనం కూడా చేయవద్దు.
12 సంఘానికి చెందనివానిపై తీర్పు చెప్పే అధికారం నాకు లేదు. కాని సంఘంలో ఉన్నవానిపై తీర్పు చెప్పవలసిన అవసరం ఉంది. 13 “ఆ దోషిని మీ సంఘం నుండి వెలివేయండి.”(A) కాని సంఘానికి చెందనివాళ్ళపై దేవుడు తీర్పు చెపుతాడు.
క్రైస్తవుల మధ్య వివాదాలు
6 ఒకవేళ మీ మధ్య తగువులొస్తే, మన సంఘంలో ఉన్న పవిత్రుల దగ్గరకు వెళ్ళాలి కాని, సంఘానికి చెందనివాళ్ళ దగ్గరకు వెళ్ళేందుకు మీ కెంత ధైర్యం? 2 పవిత్రులు ప్రపంచం మీద తీర్పు చెపుతారన్న విషయం మీకు తెలియదా? మీరు ప్రపంచంమీద తీర్పు చెప్పగలిగినప్పుడు, సాధారణమైన విషయాలపై తీర్పు చెప్పే స్తోమత మీలో లేదా? 3 మనము దేవదూతల మీద కూడా తీర్పు చెపుతామన్న విషయం మీకు తెలియదా? అలాంటప్పుడు ఈ జీవితానికి సంబంధించిన విషయాలు ఏ పాటివి? 4 మీ మధ్య వివాదాలొస్తే, సంఘం లెక్కచెయ్యనివాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళను న్యాయం చెప్పమంటారా? 5 సిగ్గుచేటు! సోదరుల మధ్య కలిగే తగువులు తీర్చగలవాడు మీలో ఒక్కడు కూడా లేడా? 6 సంఘానికి చెందినవాని దగ్గరకు వెళ్ళకుండా ఒక సోదరుడు మరొక సోదరునిపై నేరారోపణ చేయటానికి న్యాయస్థానానికి వెళ్ళుతున్నాడు. అంటే సంఘానికి చెందనివాళ్ళను అడుగుతున్నాడన్న మాట.
7 మీ మధ్య వ్యాజ్యాలు ఉండటం వల్ల మీరు పూర్తిగా ఓడిపొయ్యారని చెప్పవచ్చు. వ్యాజ్యాలు పెట్టు కోవటంకన్నా అన్యాయం సహించటం, మోసపోవటం మంచిది. 8 దానికి మారుగా మీరే అన్యాయాలు, మోసాలు చేస్తున్నారు. ఇతరులను కాక, మీ సోదరులనే మోసం చేస్తున్నారు.
కంటికి కన్ను
(లూకా 6:29-30)
38 “‘కంటికి కన్ను, పంటికి పన్ను ఊడ దీయాలి’(A) అని అనటం మీరు విన్నారు. 39 కాని నేను చెప్పేదేమిటంటే దుష్టుల్ని ఆపటానికి ప్రయత్నించకండి. మిమ్మల్ని ఎవరైనా కుడి చెంపమీద కొడితే మీ రెండవ చెంప కూడా అతనికి చూపండి. 40 ఎవరైనా మీపై వ్యాజ్యము వేసి మీ చొక్కాను కూడా లాక్కోవాలని చూస్తే, మీ కండువా కూడా తీసుకు వెళ్ళనివ్వండి. 41 ఎవరైనా మిమ్మల్ని తమతో మైలు దూరం రమ్మని బలవంతం చేస్తే, అతనితో రెండు మైళ్ళు వెళ్ళండి. 42 అడిగిన వాళ్ళకు ఇవ్వండి. మీ దగ్గర అప్పుపుచ్చుకోవాలని అనుకొని వచ్చిన వాళ్ళతో లేదనకండి.
శత్రువులను ప్రేమించు
(లూకా 6:27-28, 32-36)
43 “‘పొరుగింటి వాణ్ణి ప్రేమించండి. శత్రువును ద్వేషించండి’(B) అని చెప్పటం మీరు విన్నారు. 44 కాని నేను చెప్పేదేమిటంటే ‘మీ శత్రువుల్ని ప్రేమించండి[a] మిమ్మల్ని హింసించిన వాళ్ళ కోసం దేవుణ్ణి ప్రార్థించండి.’ 45 అప్పుడు మీరు పరలోకంలో ఉన్న మీ తండ్రికి బిడ్డలౌతారు. ఎందుకంటే దేవుడు చెడ్డవాళ్ళ కోసం, మంచి వాళ్ళ కోసం సూర్యోదయం కలిగిస్తాడు. నీతిమంతుల కోసం, అనీతిమంతుల కోసం వర్షాలు కురిపిస్తాడు. 46 మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళను మీరు ప్రేమిస్తే మీకేం ప్రతిఫలం కలుగుతుంది? పాపులు కూడా అలాచెయ్యటం లేదా? 47 మీ సోదరులకు మాత్రమే మీరు అభివందనాలు చేస్తే యితర్ల కన్నా మీరు ఏం గొప్ప? యూదులుకాని వాళ్ళు కూడా అలా చేస్తారే! 48 పరలోకంలో ఉన్న మీ తండ్రి పరిపూర్ణుడు. మీరును ఆయనలా ఉండాలి.
© 1997 Bible League International