Book of Common Prayer
సంగీత నాయకునికి: “నాశనం చేయకు” రాగం. ఆసాపు స్తుతి కీర్తన.
75 దేవా, మేము నిన్ను స్తుతిస్తున్నాము.
మేము నీ నామాన్ని స్తుతిస్తున్నాము.
నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి మేము చెబుతున్నాము.
2 దేవుడు ఇలా చెబుతున్నాడు; “తీర్పు సమయాన్ని నేను నిర్ణయిస్తాను.
న్యాయంగా నేను తీర్పు తీరుస్తాను.
3 భూమి, దాని మీద ఉన్న సమస్తం కంపిస్తూ ఉన్నప్పుడు
దాని పునాది స్తంభాలను స్థిర పరచేవాడను నేనే.”
4-5 “కొందరు మనుష్యులు చాలా గర్విష్ఠులు. తాము శక్తిగలవారమని, ప్రముఖులమని తలుస్తారు.
కాని ‘అతిశయ పడవద్దు’ ‘అంతగా గర్వపడవద్దు.’ అని నేను ఆ మనుష్యులతో చెబుతాను.”
6 తూర్పునుండిగాని పడమరనుండిగాని
ఎడారినుండి గాని వచ్చే ఎవరూ ఒక మనిషిని గొప్ప చేయలేరు.
7 దేవుడే న్యాయమూర్తి, ఏ మనిషి ప్రముఖుడో దేవుడే నిర్ణయిస్తాడు.
దేవుడు ఒక వ్యక్తిని ప్రముఖ స్థానానికి హెచ్చిస్తాడు.
ఆయనే మరొక వ్యక్తిని తక్కువ స్థానానికి దించివేస్తాడు.
8 దుర్మార్గులను శిక్షించుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. యెహోవా చేతిలో ఒక పాత్రవుంది.
అది ద్రాక్షారసంలో కలిసిన విషపూరితమైన మూలికలతో నిండివుంది.
ఆయన ఈ ద్రాక్షారసాన్ని (శిక్ష) కుమ్మరిస్తాడు.
దుర్మార్గులు చివరి బొట్టు వరకు దాన్ని తాగుతారు.
9 ఈ సంగతులను గూర్చి నేను ఎల్లప్పుడూ ప్రజలకు చెబుతాను.
ఇశ్రాయేలీయుల దేవునికి నేను స్తుతి పాడుతాను.
10 దుర్మార్గుల నుండి శక్తిని నేను తీసివేస్తాను.
మంచి మనుష్యులకు నేను శక్తినిస్తాను.
సంగీత నాయకునికి: వాయిద్యాలతో. ఆసాపు స్తుతి కీర్తన.
76 యూదాలో ప్రజలు దేవుని ఎరుగుదురు.
దేవుని నామం నిజంగా గొప్పదని ఇశ్రాయేలుకు తెలుసు.
2 దేవుని ఆలయం షాలేములో[a] ఉంది.
దేవుని గృహం సీయోను కొండ మీద ఉంది.
3 అక్కడ విల్లులను, బాణాలను కేడెములను,
కత్తులను ఇతర యుద్ధ ఆయుధాలను దేవుడు విరుగగొట్టాడు.
4 దేవా, నీవు నీ శత్రువులను ఓడించిన ఆ కొండల నుండి
తిరిగి వస్తూండగా నీవు ఎంతో మహిమతో ఉన్నావు.
5 ఆ సైనికులు చాలా బలం కలవారని తలంచారు. కాని యిప్పుడు వారు చచ్చి పొలాల్లో పడి ఉన్నారు.
వారికి ఉన్నదంతా వారి శరీరాల నుండి దోచుకోబడింది.
బలవంతులైన ఆ సైనికులలో ఒక్కరు కూడా వారిని కాపాడుకోలేకపోయారు.
6 యాకోబు దేవుడు ఆ సైనికులను గద్దించాడు.
రథాలు, గుర్రాలుగల ఆ సైన్యం చచ్చిపడింది.
7 దేవా, నీవు భీకరుడవు.
నీవు కోపంగా ఉన్నప్పుడు ఏ మనిషీ నీకు విరోధంగా నిలువలేడు.
8-9 యెహోవా న్యాయమూర్తిగా నిలిచి తన నిర్ణయాన్ని ప్రకటించాడు.
దేశంలోని దీన ప్రజలను దేవుడు రక్షించాడు.
పరలోకం నుండి ఆయన తీర్మానం ఇచ్చాడు.
భూమి అంతా భయంతో నిశ్శబ్దం ఆయ్యింది.
10 దేవా, నీవు దుర్మార్గులను శిక్షించినప్పుడు ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
నీవు నీ కోపం చూపిస్తావు. బ్రతికి ఉన్నవారు మరింత బలంగలవారు అవుతారు.
11 ప్రజలారా! మీ దేవుడైన యెహోవాకు మీరు వాగ్దానాలు చేశారు.
ఇప్పుడు మీరు వాగ్దానం చేసినదాన్ని ఆయనకు ఇవ్వండి.
అన్ని చోట్లనుండీ ప్రజలు
తాము భయపడే దేవునికి కానుకలు తెస్తారు.
12 దేవుడు మహా నాయకులను ఓడిస్తాడు.
భూలోక రాజులందరూ ఆయనకు భయపడుతారు.
దావీదు కీర్తన.
23 యెహోవా నా కాపరి
నాకు కొరత ఉండదు
2 పచ్చటి పచ్చిక బయళ్లలో ఆయన నన్ను పడుకో పెడతాడు.
ప్రశాంతమైన నీళ్లవద్దకు ఆయన నన్ను నడిపిస్తాడు.
3 ఆయన తన నామ ఘనత కోసం నా ఆత్మకు నూతన బలం ప్రసాదిస్తాడు.
ఆయన నిజంగా మంచివాడని చూపించేందుకు ఆయన నన్ను మంచితనపు మార్గాల్లో నడిపిస్తాడు.
4 చివరికి మరణాంధకారపు లోయలో నడిచినప్పుడు కూడా
నేను భయపడను. ఎందుకంటే, యెహోవా, నీవు నాతో ఉన్నావు.
నీ చేతికర్ర, నీ దండం నన్ను ఆదరిస్తాయి కనుక.
5 యెహోవా, నా శత్రువుల ఎదుటనే నీవు నాకు భోజనం సిద్ధం చేశావు.
నూనెతో నా తలను నీవు అభిషేకిస్తావు.
నా పాత్ర నిండి, పొర్లిపోతుంది.
6 నా మిగిలిన జీవితం అంతా మేలు, కరుణ నాతో ఉంటాయి.
మరియు నేను ఎల్లకాలం యెహోవా ఆలయంలో నివసిస్తాను.
దావీదు కీర్తన.
27 యెహోవా, నీవే నా వెలుగు, నా రక్షకుడవు.
నేను ఎవరిని గూర్చి భయపడనక్కర్లేదు.
యెహోవా, నీవే నా జీవిత క్షేమస్థానం.
కనుక నేను ఎవరికి భయపడను.
2 దుర్మార్గులు నా మీద దాడి చేయవచ్చు.
వారు నా శరీరాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించవచ్చు.
వారు నా శత్రువులు, విరోధులు.
వారు కాలు తప్పి పడిపోదురు.
3 అయితే నా చుట్టూరా సైన్యం ఉన్నప్పటికీ నేను భయపడను.
యుద్ధంలో ప్రజలు నామీద విరుచుకు పడ్డప్పటికీ నేను భయపడను. ఎందుకంటే నేను యెహోవాను నమ్ముకొన్నాను.
4 యెహోవా నాకు అనుగ్రహించాలని నేను ఆయనను అడిగేది ఒకే ఒకటి ఉంది.
నేను అడిగేది ఇదే:
“నా జీవిత కాలం అంతా నన్ను యెహోవా ఆలయంలో కూర్చుండనిచ్చుట.
ఆయన రాజ భవనాన్ని నన్ను సందర్శించనిచ్చుట.
యెహోవా సౌందర్యాన్ని నన్ను చూడనిమ్ము.”
5 నేను ఆపదలో ఉన్నప్పుడు యెహోవా నన్ను కాపాడుతాడు.
ఆయన తన గుడారంలో నన్ను దాచిపెడతాడు.
ఆయన తన క్షేమ స్థానానికి నన్ను తీసుకొని వెళ్తాడు.
6 నా శత్రువులు నన్ను చుట్టుముట్టేశారు. కాని ఇప్పుడు వారిని ఓడించటానికి యెహోవా నాకు సహాయం చేస్తాడు.
అప్పుడు నేను ఆయన గుడారంలో బలులు అర్పిస్తాను. సంతోషంతో కేకలు వేస్తూ ఆ బలులు నేను అర్పిస్తాను.
యెహోవాను ఘనపరచుటకు నేను వాద్యం వాయిస్తూ గానం చేస్తాను.
7 యెహోవా, నా స్వరం ఆలకించి నాకు జవాబు ఇమ్ము.
నా మీద దయ చూపించుము.
8 యెహోవా, నా హృదయం నిన్ను గూర్చి మాట్లాడమంటున్నది.
వెళ్లు, నీ యెహోవాను ఆరాధించమంటున్నది అందువల్ల యెహోవా నేను నిన్ను ఆరాధించటానికి వచ్చాను.
9 యెహోవా, నా దగ్గర్నుండి తిరిగిపోకుము.
కోపగించవద్దు, నీ సేవకుని దగ్గర్నుండి తిరిగి వెళ్లిపోవద్దు.
నీవు నాకు సహాయమైయున్నావు, నన్ను త్రోసివేయకుము. నన్ను విడిచిపెట్టవద్దు. నా దేవా, నీవు నా రక్షకుడవు.
10 నా తల్లి, నా తండ్రి నన్ను విడిచిపెట్టారు.
అయితే యెహోవా నన్ను తీసుకొని, తన వానిగా చేసాడు.
11 యెహోవా, నాకు శత్రువులు ఉన్నారు, కనుక నాకు నీ మార్గాలు నేర్పించుము.
సరైన వాటిని చేయటం నాకు నేర్పించుము.
12 నా శత్రువుల కోరికకు నన్నప్పగించవద్దు.
నన్ను గూర్చి వాళ్లు అబద్ధాలు చెప్పారు. నాకు హాని కలిగించేందుకు వాళ్లు అబద్ధాలు చెప్పారు.
13 నేను చనిపోక ముందు యెహోవా మంచితనాన్ని నేను చూస్తానని
నిజంగా నేను నమ్ముచున్నాను.
14 యెహోవా సహాయం కోసం కనిపెట్టి ఉండుము.
బలంగా, ధైర్యంగా ఉండుము.
యెహోవా సహాయం కోసం కనిపెట్టుము.
ఏలీయాని తీసికొని వెళ్ళటానికి యెహోవా నడిపించుట
2 సుడిగాలి ద్వారా ఏలీయాని యెహోవా పరలోకానికి తీసుకు వెళ్లేందుకు సమయం దగ్గరపడింది. ఏలీయా ఎలీషాతో గిల్గాలుకు వెళ్లాడు.
2 ఎలీషాతో, “దయచేసి ఇక్కడ వుండుము, ఎందుకనగా యెహోవా నన్ను బేతేలునకు వెళ్లుమని ఆదేశించాడు” అని చెప్పాడు.
కాని ఎలీషా, “యెహోవా జీవంతోడు, నా జీవం తోడు నేను నిన్ను విడిచి వెళ్లను” అని ఏలీయాతో చెప్పాడు. అందువల్ల ఆ ఇద్దరు మనష్యులు బేతేలుకు వెళ్లారు.
3 బేతేలులో వున్న ప్రవక్తలు ఎలీషా వద్దకు వచ్చి యిట్లన్నారు: “నేడు నీ యజమానిని నీ వద్దనుండి యెహోవా తీసుకొని పోవునన్న విషయం నీకు తెలుసా?”
“అవును. నాకు తెలుసు. ఆ విషయం మాటలాడకు.” అని ఎలీషా చెప్పాడు.
4 ఎలీషాతో ఏలీయా, “దయచేసి ఇక్కడ వుండుము. ఎందుకనగా నన్ను యెరికోకు వెళ్లమని యెహోవా ఆదేశించాడు” అని చెప్పాడు.
కాని ఎలీషా, “యెహోవా జీవంతోడు, నా జీవంతోడు నేను నిన్ను విడిచి వెళ్లను” అని చెప్పాడు. అందువల్ల వారిరువురు మనష్యులు యెరికోకు వెళ్లారు.
5 యెరికోలోనున్న ప్రవక్తల బృందం ఎలీషా వద్దకు వచ్చి యిట్లున్నారు. “నేడు నీ యజమానిని నీ వద్దనుండి యెహోవా తీసుకొని పోవునన్న విషయం నీకు తెలుసా?”
ఎలీషా, “అవును, నాకు తెలుసు. ఆ విషయమై మాటలాడకు” అని చెప్పాడు.
6 ఏలీయా ఎలీషాతో, “దయచేసి ఇక్కడ వుండుము. ఎందుకంటే నన్ను యోర్దాను నది వద్దకు వెళ్లమని యెహోవా ఆదేశించాడు” అనిచెప్పాడు.
ఎలీషా ఇలా అన్నాడు, “యెహోవా జీవంతోడు, నా జీవంతోడు నేను నిన్ను విడిచి వెళ్లను.” అందువల్ల ఆ ఇరువురు వెళ్లారు.
7 ప్రవక్తల బృందం నుండి ఏభై మంది మనుష్యులు వారిని అనుసరించారు. ఏలీయా ఎలీషాలు యోర్దాను నదివద్ద నిలిచారు. ఆ ఏభై మంది మనుష్యులు ఏలీయా ఎలీషాలకు దూరంగా నిలబడ్డారు. 8 ఏలీయా తన దుప్పటిని తీసి మడత పెట్టి నీటిమీద దానితో కొట్టాడు. నీళ్లు కుడికీ ఎడమకీ వేరు వేరయ్యాయి. అప్పుడు ఏలీయా ఎలీషాలు పొడినేల మీద నదిని దాటారు.
9 వారు నదిని దాటిన తర్వాత, ఏలీయా ఎలీషాతో, “నీనుండి యెహోవా నన్ను తీసుకొని పోవడానికి ముందు నీ కోసం నన్నేమి చేయమంటావు?” అని ఏలీయా అడిగాడు.
“నీ ఆత్మ రెండింతల భాగాముగా నామీదికి వచ్చునట్లు చేయి” అని ఎలీషా అడిగాడు.
10 ఏలీయా, “కష్టమైన విషయం నీవు అడిగావు. నన్ను నీనుండి తీసుకొని పోయేటప్పుడు నన్ను చూస్తూ వుంటే అది జరుగుతుంది. కాని నన్ను నీనుండి తీసుకొని పోయెటప్పుడు చూడకుంటే, అప్పుడు, అది జరగదు” అని చెప్పాడు.
దేవుడు ఏలీయాను పరలోకానికి తీసుకొని పోవుట
11 ఏలీయా ఎలీషాలు ఒకటిగా నడుస్తూ మాటాలాడుతూ వున్నారు. ఉన్నట్టుండి కొన్ని గుర్రాలు, ఒక అగ్నిరథం వచ్చి ఏలీయా ఎలీషాలను వేరు చేసాయి. ఆ గుర్రాలు మరియు రథం ఉన్నాయి. తర్వాత ఒక సుడిగాలి ద్వారా ఏలీయా పరలోకానికి తీసుకొని పోబడ్డాడు.
12 అది ఎలీషా చూచి, నా తండ్రి! “నా తండ్రి! ఇశ్రాయేలు రథం, దాని గుర్రపు సైనికులు నీవె”[a] అని అరిచాడు.
ఎలీషా ఏలీయాని ఆ తర్వతా ఎన్నడూ చూడలేదు. ఎలీషా తన విచారాన్ని వ్యక్తం చేయడానికి తన వస్త్రాలను రెండుగా చింపివేశాడు. 13 ఏలీయా ధరించు కంబళి భూమిమీదికి పడింది. అందువల్ల ఎలీషా దానిని తీసుకున్నాడు. ఎలీషా నీటినికొట్టి, “ఏలీయా దేవుడైన యెహోవా ఎక్కడ?” అన్నాడు. 14 ఎలీషా నీటిని కొట్టగా నీళ్లు కుడుకీ ఎడమకీ వేరు వేరయ్యాయి. అప్పుడు ఎలీషా నదిని దాటాడు.
ఏలీయా కోసం ప్రవక్తలు అడుగుట
15 యెరికోలోని ప్రవక్తల బృందం ఎలీషాని చూడగానే, “ఏలీయా ఆత్మ ఇప్పుడు ఎలీషా మీద వున్నది” అన్నారు. ఎలీషాని కలుసుకునేందుకు వారు వచ్చారు. ఎలీషా ముందు వారు నేలకు తాకునట్లుగా నమస్కరించారు. 16 అతనితో వారు ఇట్లన్నారు: “ఇదుగో, మా వద్ద ఏభై మంది సజ్జనులున్నారు. వారు వెళ్లి నీ యజమానికోసం వెతకనిమ్ము. యెహోవా ఆత్మ ఒకవేళ ఏలీయాని పైకి తీసుకొని పోయి ఏ కొండమీదనో లేక ఏ లోయలోనో పడవేసి వుండవచ్చు.”
కాని ఎలీషా, “వద్దు ఏలీయాని వెతకడం కోసం మనుష్యుల్ని పంపవద్దు” అని చెప్పాడు.
17 ప్రవక్తల బృందం అతను ఇబ్బందిలో పడనంత వరకు ప్రార్థంచారు. అప్పుడు ఎలీషా, “బాగున్నది. ఏలీయాని వెతకడం కోసం మనుష్యుల్ని పంపించండి” అని చెప్పాడు.
ప్రవక్తల బృందం ఆ ఏభై మంది మనుష్యులను ఏలీయాకోసం పంపారు. మూడు రోజుల పాటు వారు వెతికారు. కాని వారు ఏలీయాను కనుగొనలేక పోయారు. 18 కనుక ఎలీషా నివసించుచున్న యెరికోకి వారు వెళ్లారు. ఏలీయాని తాము కనుగొనలేక పోయామని వాళ్లు అతనితో చెప్పారు. ఎలీషా, “మీరు వెళ్లవద్దని నేను చెప్పాను గదా” అన్నాడు.
క్రీస్తు యొక్క అపొస్తలులు
4 అందువల్ల మమ్మల్ని మీరు క్రీస్తు సేవకులుగా, దేవుని రహస్యాలు అప్పగింపబడ్డ వాళ్ళుగా పరిగణించండి. 2 బాధ్యత అప్పగింపబడిన సేవకుడు ఆ బాధ్యతను నమ్మకంతో నిర్వర్తించాలి. 3 మీరు నాపై తీర్పు చెప్పినా, ఇతరులు తమ నియమాల ప్రకారము తీర్పు చెప్పినా నేను లెక్కచెయ్యను. నాపై నేనే తీర్పు చెప్పుకోను. 4 నా మనస్సు నిర్మలమైనది. అంత మాత్రాన నేను నిర్దోషినికాను. ప్రభువు నాపై తీర్పు చెపుతాడు. 5 అందువల్ల తీర్పు చెప్పే సమయం వచ్చే దాకా, ఎవరిమీదా తీర్పు చెప్పకండి. ప్రభువు వచ్చేదాకా ఆగండి. ఆయన చీకట్లో దాగివున్నదాన్ని వెలుగులోకి తెస్తాడు. మానవుల హృదయాల్లో దాగివున్న ఉద్దేశ్యాలను బహిరంగ పరుస్తాడు. అప్పుడు ప్రతి ఒక్కడూ తనకు తగిన విధంగా దేవుని మెప్పు పొందుతాడు.
6 సోదరులారా! “లేఖనాల్లో వ్రాయబడినవాటిని అతిక్రమించకండి” అనే లోకోక్తి యొక్క అర్థం మీరు నేర్చుకోవాలని, దానివల్ల మీరు లాభం పొందాలని మేము, అంటే నేను, అపొల్లో ఆ లోకోక్తి ప్రకారం నడుచుకొన్నాము. మీరు ఒకరిని పొగిడి యింకొకరిని ద్వేషించకండి. 7 ఇతరులకన్నా మీలో ఏమి ప్రత్యేకత ఉంది? మీదగ్గరున్నవన్నీ మీరు దేవుని నుండే కదా పొందింది. మరి అలాంటప్పుడు మీకు అవి దేవుడు యివ్వనట్లు ఎందుకు చెప్పుకొంటున్నారు?
ధర్మశాస్త్రాన్ని గురించి ఉపదేశం
17 “నేను ధర్మశాస్త్రాన్ని కాని, ప్రవక్తల వచనాలను కాని రద్దు చేయటానికి వచ్చానని అనుకోవద్దు. నేను వాటిని రద్దుచేయటానికి రాలేదు. వాటిని పూర్తి చేయటానికి వచ్చాను. 18 ఇది సత్యం. భూమి, ఆకాశం గడచి పోయేలోపుల అన్ని సంగతులు, ధర్మశాస్త్రంలోని చిన్న అక్షరం, పొల్లుతో సహా నెరవేరుతాయి.
19 “ఒక చిన్న ఆజ్ఞనైనా సరే రద్దుచేసిన వాడును, తనలాగే చెయ్యమని బోధించిన వాడును దేవుని రాజ్యంలో తక్కువ వాడుగా ఎంచబడుతాడు. కాని ఈ ఆజ్ఞల్ని అనుసరిస్తూ వాటిని బోధించినవాడు దేవుని రాజ్యంలో గొప్పవానిగా ఎంచబడతాడు. 20 ఎందుకంటే, మీరు శాస్త్రులకన్నా, పరిసయ్యుల[a] కన్నా గొప్ప నీతిమంతులని గుర్తింపబడక పోతే దేవుని రాజ్యంలోకి ప్రవేశింపలేరని నేను చెబుతున్నాను.
© 1997 Bible League International