Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 119:41-64

వావ్

41 యెహోవా, నీ నిజమైన ప్రేమ నాకు చూపించుము.
    నీవు వాగ్దానం చేసినట్టే నన్ను రక్షించుము.
42 అప్పుడు నన్ను అవమానించే ప్రజలకు నా దగ్గర జవాబు ఉంటుంది.
    యెహోవా, నీవు చెప్పే విషయాలు నేను నిజంగా నమ్ముతాను.
43 నీ సత్యమైన ఉపదేశాలను నన్ను ఎల్లప్పుడూ చెప్పనిమ్ము.
    యెహోవా, జ్ఞానంగల నీ నిర్ణయాల మీద నేను ఆధారపడుతున్నాను.
44 యెహోవా, నేను శాశ్వతంగా ఎప్పటికీ నీ ఉపదేశాలను అనుసరిస్తాను.
45 అందుచేత నేను క్షేమంగా జీవిస్తాను.
    ఎందుకంటే, నీ న్యాయ చట్టాలకు విధేయుడనగుటకు నేను కష్టపడి ప్రయత్నిస్తాను గనుక.
46 యెహోవా ఒడంబడికను గూర్చి నేను రాజులతో చర్చిస్తాను.
    వారి ఎదుట భయపడకుండా నేను మాట్లాడుతాను.
47 యెహోవా, నీ ఆజ్ఞలను చదవటము నాకు ఆనందం.
    ఆ ఆజ్ఞలంటే నాకు ప్రేమ.
48 యెహోవా, నేను నీ ఆజ్ఞలను గౌరవిస్తున్నాను. వాటిని నేను ప్రేమిస్తున్నాను.
    మరియు నేను వాటిని ధ్యానం చేస్తూ వాటిని గూర్చి మాట్లాడుతాను.

జాయిన్

49 యెహోవా, నాకు చేసిన నీ వాగ్దానం జ్ఞాపకం చేసుకొనుము.
    ఆ వాగ్దానం నాకు ఆశనిస్తుంది.
50 నేను శ్రమ పడుతున్నప్పుడు నీవు నన్ను ఆదరించావు
    నీ మాటలు నన్ను మరల బ్రతికించాయి.
51 నా కంటే తామే మంచివాళ్లు అనుకొన్న మనుష్యులు ఎడతెగక నన్ను అవమానించారు.
    కాని యెహోవా, నీ ఉపదేశాలను అనుసరించటం నేను మానుకోలేదు.
52 జ్ఞానంగల నీ నిర్ణయాలను నేను ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొంటాను.
    యెహోవా, జ్ఞానంగల నీ నిర్ణయాలు నన్ను ఆదరిస్తాయి.
53 నీ ఉపదేశాలను అనుసరించటం మానివేసిన దుర్మార్గులను చూస్తే
    నాకు చాలా కోపం వస్తుంది.
54 నీ న్యాయ చట్టాలు
    నా ఇంటివద్ద పాడుకొనే పాటలు.
55 యెహోవా, రాత్రివేళ నేను నీ నామం జ్ఞాపకం చేసుకొంటాను.
    నీ ఉపదేశాలను నేను జ్ఞాపకం చేసుకొంటాను. నీ న్యాయ చట్టాన్ని నేను అనుసరిస్తాను.
56 నీ ఆజ్ఞలకు నేను జాగ్రత్తగా విధేయుడను అవుతాను
    కనుక నాకు ఈలాగు జరుగుతుంది.

హేత్

57 యెహోవా, నీ ఆజ్ఞలకు విధేయుడనగుట నా విధి అని నేను తీర్మానించుకొన్నాను.
58 యెహోవా, నేను పూర్తిగా నీమీద ఆధారపడుతున్నాను.
    నీ వాగ్దానం ప్రకారం నాకు దయచూపించుము.
59 నేను నా జీవితాన్ని గూర్చి చాలా జాగ్రత్తగా ఆలోచించాను.
    మళ్లీ నీ ఒడంబడికను అనుసరించటానికే వచ్చాను.
60 ఆలస్యం లేకుండా నీ ఆజ్ఞలకు విధేయత చూపాలని నేను త్వరగా మళ్లుకొన్నాను.
61 దుర్మార్గులు కొందరు నన్ను చుట్టుముట్టారు.
    అయితే యెహోవా, నేను నీ ఉపదేశాలు మరచిపోలేదు.
62 నీ మంచి నిర్ణయాల కోసం నీకు కృతజ్ఞత చెల్లించటానికి
    అర్ధరాత్రి వేళ నేను మేల్కొంటాను.
63 నిన్ను ఆరాధించే ప్రతి మనిషికీ నేను స్నేహితుడను.
    నీ ఆజ్ఞలకు విధేయత చూపే ప్రతి మనిషికి నేను స్నేహితుడను.
64 యెహోవా, నీ నిజమైన ప్రేమ భూమిని నింపుతుంది.
    నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.

యెషయా 8:11-20

యెషయాకు హెచ్చరికలు

11 యెహోవా తన మహా శక్తితో నాతో మాట్లాడాడు. ఈ ఇతర మనుష్యుల్లా ఉండొద్దని యెహోవా నన్ను హెచ్చరించాడు. 12 “ప్రతివారూ ఇతరులు తమకు వ్యతిరేకంగా పథకాలు వేస్తున్నట్టు చెబుతున్నారు. నీవు ఆ విషయాలు నమ్మవద్దు. ఆ ప్రజలు భయపడే వాటికి నీవు భయపడవద్దు. వాటిగూర్చి నీవు భయపడవద్దు” అని యెహోవా నాతో చెప్పాడు.

13 సర్వశక్తిమంతుడైన యెహోవా ఒక్కడికే మీరు భయపడాలి. మీరు గౌరవించాల్సిన వాడు ఆయనే. మీరు భయపడాల్సింది ఆయనకే. 14 మీరు యెహోవాను గౌరవించి, ఆయనను పవిత్రునిగా ఎంచుకొంటే, అప్పుడు ఆయనే మీకు క్షేమస్థానంగా ఉంటాడు. కానీ మీరు ఆయనను గౌరవించరు. కనుక మీరు పడిపోయేట్టు చేసే బండ ఆయనే. ఇశ్రాయేలు యొక్క రెండు కుటుంబాలను తొట్రిల్లేలా చేసే బండ ఆయనే. యెరూషలేము ప్రజలందరినీ పట్టుకొనే బోను యెహోవాయే. 15 (అనేకమంది మనుష్యులు ఈ బండ తగిలి పడిపోతారు. వాళ్లు పడిపోయి, విరిగిపోతారు. వారు బోనులో పట్టుబడతారు.)

16 యెషయా చెప్పాడు, “ఒక ఒడంబడిక చేసి, దాన్ని ముద్రించండి. నా ఉపదేశాలను భవిష్యత్తు కోసం భద్రపర్చండి. నన్ను అనుసరించే వాళ్లు చూస్తూ ఉండగా దీనిని చేయండి.”

17 ఆ ఒడంబడిక ఇదేః యెహోవా మాకు సహాయం చేసేవరకు నేను వేచి ఉంటాను.
యాకోబు (ఇశ్రాయేలు) వంశం విషయం యెహోవా సిగ్గు పడుతున్నాడు. ఆయన వాళ్లను చూచేందుకు నిరాకరిస్తున్నాడు.
కానీ నేను యెహోవా కోసం నిరీక్షిస్తాను.
ఆయనే మమ్మల్ని రక్షిస్తాడు.

18 “ఇశ్రాయేలు ప్రజలకు నేనూ, నా పిల్లలే సూచనగా రుజువుగా ఉన్నాము. సీయోను కొండమీద నివాసం చేసే సర్వశక్తిమంతుడైన యెహోవా మమ్మల్ని పంపించాడు.”

19 కొంతమంది, “జ్యోతిష్కుల దగ్గరకు, మాంత్రికుల దగ్గరకు వెళ్లి, ఏమి చేయాలో తెలుసుకోండి” అంటున్నారు. (ఈ జ్యోతిష్కులు, మాంత్రికులు పిట్టల్లా కిచకిచలాడి తమకి చాలా తెలివిగల తలపులు ఉన్నట్టు మనుష్యులు తలచాలని గుసగుసలాడుతారు.) అయితే వాళ్లు వాళ్ల దేవుణ్ణి సహాయం అడుక్కోవాలి అని నేను చెబుతున్నాను. ఆ జ్యోతిష్కులు, మాంత్రికులు వారు ఏమి చేయాలి అనేది చచ్చిపోయిన వాళ్లను అడుగుతారు. బ్రతికి ఉన్న వాళ్లు చచ్చిన వాళ్లను ఏదైనా ఎందుకు అడగాలి? 20 మీరు ఉపదేశాలను, ఒడంబడికను అనుసరించాలి. ఈ ఆదేశాలు మీరు అనుసరించకపోతే, మీరు తప్పు ఆదేశాలను పాటించవచ్చు. (తప్పు ఆదేశాలు అంటే జ్యోతిష్కులు, మాంత్రికులు దగ్గర్నుండి వచ్చేవి. అవి ఎందుకూ పనికి రాని ఆదేశాలు. ఆ ఆదేశాలను పాటించటం వల్ల మీకేమీ లాభం ఉండదు.)

రోమీయులకు 10:1-15

10 సోదరులారా! దేవుడు ఇశ్రాయేలు వంశీయుల్ని రక్షించాలని హృదయ పూర్వకంగా ప్రార్థిస్తున్నాను. వాళ్ళు శ్రద్ధతో దేవుని సేవ చేస్తున్నారని నేను సాక్ష్యం చెప్పగలను. కాని వాళ్ళ శ్రద్ధ జ్ఞానం మీద ఆధారపడలేదు. దేవుడు నీతిమంతులుగా చేసే విధానాన్ని గురించి తెలియక వాళ్ళు తమ విధానాన్ని స్థాపించాలనుకొన్నారు. కనుక వాళ్ళు దేవుడు చెప్పిన విధానాన్ని అంగీకరించలేదు. నమ్మిన ప్రతి ఒక్కడూ నీతిమంతుడు కావాలని క్రీస్తు వచ్చాక ధర్మశాస్త్రం అంతమైపోయింది.

ధర్మశాస్త్రం ద్వారా లభించే నీతిని గురించి మోషే ఈ విధంగా వ్రాస్తున్నాడు: “ధర్మశాస్త్ర క్రియలు చేసే మానవుడు వీటి ద్వారా జీవిస్తాడు”(A) కాని విశ్వాసం వల్ల కలిగే నీతిని గురించి ఈ విధంగా వ్రాశారు: “పరలోకానికి ఎవరు ఎక్కుతారు?” అని అనకండి. అంటే ఎవరు పరలోకానికి ఎక్కి క్రీస్తును క్రిందికి పిలుచుకు రాగలరు? “అగాధంలోకి ఎవరు దిగుతారు?”(B) అని అనకండి. అంటే ఎవరు అగాధంలోకి దిగి క్రీస్తును చావునుండి పిలుచుకు రాగలరు?

మరి వాక్యమేమంటున్నది! “దైవసందేశం మీకు దగ్గరగా ఉంది. అది మీ నోటిలో ఉంది, మీ హృదయాల్లో ఉంది.”(C) ఇది విశ్వాసానికి సంబంధించిన సందేశము. దీన్ని మేము ప్రకటిస్తున్నాము. యేసు, ప్రభువని మీ నోటితో బహిరంగంగా ఒప్పుకొని చనిపోయినవారిలో నుండి దేవుడాయన్ని బ్రతికించాడని మీ హృదయాల్లో విశ్వసిస్తే మీరు రక్షింపబడుతారు. 10 ఎందుకంటే మనము, మన హృదయాలతో విశ్వసిస్తాము కనుక నీతిమంతులుగా పరిగణింపబడుతాము. నోటితో ఒప్పుకొంటాము కనుక రక్షణను పొందుతాము.

11 లేఖనాల్లో ఈ విధంగా వ్రాసారు: “ఆయన్ని నమ్మినవానికి ఆశాభంగం కలుగదు.”(D) 12 యూదులకు, యూదులు కానివాళ్ళకు వ్యత్యాసం లేదు. ప్రభువు ఒక్కడే. ఆయనే అందరికి ప్రభువు. ఆయన, తనను ప్రార్థించిన వాళ్ళందరికీ అడిగినంత ఇస్తాడు. 13 దీన్ని గురించి, “ప్రభువును ప్రార్థించిన ప్రతి ఒక్కడూ రక్షింపబడతాడు”(E) అని వ్రాయబడి ఉంది.

14 మరి, విశ్వసించకుండా ఎలా ప్రార్థించగలరు? ఆయన్ని గురించి వినకుండా వాళ్ళు ఆయన్ని ఏ విధంగా విశ్వసించగలరు? వాళ్ళకు ఎవరో ఒకరు చెప్పకుంటే వాళ్ళు ఏ విధంగా వినగలరు? 15 ఎవరైనా పంపందే వాళ్ళు వచ్చి ఎలా చెపుతారు? దీన్ని గురించి ఈ విధంగా వ్రాసారు: “సువార్తను తెచ్చేవాళ్ళ పాదాలు ఎంత అందంగా ఉన్నాయి!”(F)

కీర్తనలు. 19

సంగీత నాయకునికి: దావీదు కీర్తన.

19 ఆకాశాలు దేవుని మహిమను తెలియజేస్తున్నాయి.
    యెహోవా చేతులు చేసిన మంచివాటిని అంతరిక్షం తెలియజేస్తుంది.
ప్రతి క్రొత్త రోజూ ఆ గాథను మరింత చెబుతుంది.
    ప్రతి రాత్రి దేవుని గురించి మరింత ఎక్కువగా తెలియజేస్తుంది.
నిజానికి నీవు ఏ ఉపన్యాసం గాని మాటలుగాని వినలేవు.
    మనం వినగలిగిన శబ్దం ఏదీ అవి చేయవు.
అయినా వాటి “స్వరం” ప్రపంచం అంతా ప్రసరిస్తుంది.
    వాటి “మాటలు” భూమి చివరి వరకూ వెళ్తాయి.

అంతరిక్షం సూర్యునికి ఒక ఇల్లు లాంటిది.
    తన పడక గది నుండి వచ్చే సంతోష భరితుడైన పెండ్లి కుమారునిలా సూర్యుడు బయటకు వస్తాడు.
పందెంలో పరుగెత్తడానికి ఆత్రంగా ఉన్న ఆటగానిలా సూర్యుడు
    ఆకాశంలో తన దారిని మొదలు పెడతాడు.
సూర్యుడు అంతరిక్షంలోని ఒక దిశలో మొదలు పెడ్తాడు,
    మరియు ఆవలి దిశకు అది పరుగెడుతుంది.
    దాని వేడి నుండి ఏదీ దాక్కొలేదు. యెహోవా ఉపదేశాలు అలా ఉన్నాయి.

యెహోవా ఉపదేశాలు పరిపూర్ణం.
    అవి దేవుని ప్రజలకు బలాన్నిస్తాయి.
యెహోవా ఒడంబడిక విశ్వసించదగింది.
    జ్ఞానం లేని మనుష్యులకు అది జ్ఞానాన్ని ఇస్తుంది.
యెహోవా చట్టాలు సరియైనవి.
    అవి మనుష్యులను సంతోషపెడ్తాయి.
యెహోవా ఆదేశాలు పరిశుద్ధమైనవి.
    ప్రజలు జీవించుటకు సరైన మార్గాన్ని చూపడానికి అవి కన్నులకు వెలుగునిస్తాయి.

యెహోవాను ఆరాధించుట మంచిది.
    అది నిరంతరము నిలుస్తుంది.
యెహోవా తీర్పులు సత్యమైనవి, న్యాయమైనవి.
    అవి సంపూర్ణంగా సరియైనవి.
10 శ్రేష్ఠమైన బంగారంకంటె యెహోవా ఉపదేశాలను మనము ఎక్కువగా కోరుకోవాలి.
    సాధారణ తేనె పట్టు నుండి వచ్చే శ్రేష్ఠమైన తేనె కంటె అవి మధురంగా ఉంటాయి.
11 యెహోవా ఉపదేశాలు నీ సేవకుణ్ణి చాలా తెలివిగలవాణ్ణిగా చేస్తాయి.
    నీ చట్టాలు పాటించేవారు గొప్ప ప్రతిఫలాన్ని పొందుతారు.

12 యెహోవా, ఏ వ్యక్తీ, తన స్వంత తప్పులన్నింటినీ చూడలేడు.
    కనుక నేను రహస్య పాపాలు చేయకుండా చూడుము.
13 యెహోవా, నేను చేయాలనుకొనే పాపాలు చేయకుండా నన్ను ఆపుచేయుము.
    ఆ పాపాలు నా మీద అధికారం చెలాయించ నీయకుము.
నీవు నాకు సహాయం చేస్తే, అప్పుడు నేను గొప్ప పాపము నుండి, పవిత్రంగా దూరంగా ఉండగలను.
14 నా మాటలు, తలంపులు నిన్ను సంతోషపెడ్తాయని నేను ఆశిస్తున్నాను.
    యెహోవా, నీవే నా ఆశ్రయ దుర్గం. నీవే నన్ను రక్షించేవాడవు.

కీర్తనలు. 112

112 యెహోవాను స్తుతించండి.
    యెహోవాకు భయపడి. ఆయనను గౌరవించే వ్యక్తి చాలా సంతోషంగా ఉంటాడు.
    ఆ వ్యక్తికి దేవుని ఆదేశాలంటే ఇష్టం.
ఆ మనిషి సంతతివారు భూమి మీద చాలా గొప్పగా ఉంటారు.
    మంచివారి సంతతివారు నిజంగా ఆశీర్వదించబడతారు.
ఆ వ్యక్తి కుటుంబీకులు చాలా ధనికులుగా ఉంటారు.
    అతని మంచితనం శాశ్వతంగా కొనసాగుతుంది.
మంచివాళ్లకు దేవుడు చీకట్లో ప్రకాశిస్తున్న వెలుతురులా ఉంటాడు.
    దేవుడు మంచివాడు, దయగలవాడు, జాలిగలవాడు.
ఒక మనిషికి దయగా ఉండటం, ధారాళంగా ఇచ్చే గుణం కలిగి ఉండటం, అతనికి మంచిది.
    తన వ్యాపారంలో న్యాయంగా ఉండటం అతనికి మంచిది.
ఆ మనిషి ఎన్నటికీ పడిపోడు.
    ఒక మంచి మనిషి ఎల్లప్పుడు జ్ఞాపకం చేసికోబడతాడు.
మంచి మనిషి చెడు సమాచారాలకు భయ పడాల్సిన అవసరం లేదు.
    ఆ మనిషి ధైర్యంగా ఉంటాడు, యెహోవాను నమ్ముకొంటాడు.
ఆ మనిషి ధైర్యంగా ఉంటాడు. అతడు భయపడడు.
    అతడు తన శత్రువులను ఓడిస్తాడు.
ఆ మనిషి పేదవారికి వస్తువులను ఉచితంగా ఇస్తాడు.
    అతడు చేసే మంచి పనులు శాశ్వతంగా కొనసాగుతాయి.
10 దుష్టులు ఇది చూచి కోపగిస్తారు.
    వారు కోపంతో పళ్లు కొరుకుతారు, అప్పుడు వారు కనబడకుండా పోతారు.
    దుష్టులకు ఎక్కువగా కావాల్సిందేదో అది వారికి దొరకదు.

మత్తయి 13:44-52

దాచిన నిధి

44 “దేవుని రాజ్యం పొలంలో దాచబడిన నిధి లాంటిది. ఒక వ్యక్తి ఆ నిధిని కనుగొన్నాడు. కాని వెంటనే దాన్ని దాచేసాడు. ఆ తర్వాత ఆనందంగా వెళ్ళి తన దగ్గరున్నవన్నీ అమ్మివేసి ఆ పొలాన్ని కొన్నాడు.

45 “దేవుని రాజ్యం మంచి ముత్యాల కోసం వెతికే వర్తకుని లాంటిది. 46 ఒక వర్తకుడు మంచి విలువైన ఒక ముత్యాన్ని కనుగొన్నాడు. ఆ తర్వాత వెళ్ళి తనకున్నదంతా అమ్మేసి దాన్ని కొన్నాడు.

చేపలనుపట్టు వల యొక్క ఉపమానం

47 “దేవుని రాజ్యం సరస్సులోకి వేసి అన్ని రకాల చేపల్ని పట్టుకొనే ఒక వలలాంటిది. 48 వల చేపల్తో నిండిపొయ్యాక బెస్తవాళ్ళు దాన్ని ఒడ్డుకు లాగి మంచి చేపల్ని బుట్టలో వేసికొని పనికిరాని చేపల్ని పారవేస్తారు. 49 అదేవిధంగా యుగాంతంలో కూడా దేవ దూతలు వచ్చి నీతిమంతులనుండి దుర్మార్గుల్ని వేరు చేసి, భయానకమైన మంటల్లో పారవేస్తారు. 50 వాళ్ళు దుఃఖిస్తారు, బాధననుభవిస్తారు, పళ్ళు కొరుకుతారు.”

51 “మీకివన్నీ అర్థమయ్యాయా?” అని యేసు అడిగాడు.

అవునని వాళ్ళు సమాధానం చెప్పారు.

52 యేసు వాళ్ళతో, “దేవుని రాజ్యాన్ని గురించి బోధన పొందిన శాస్త్రుల్ని తన ధనాగారం నుండి క్రొత్త నిధుల్ని, పాతనిధుల్ని తీసుకొని వచ్చే ఆసామితో పోల్చవచ్చు” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International