Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 66

సంగీత నాయకునికి: ఒక స్తుతి కీర్తన.

66 భూమి మీద ఉన్న సమస్తమా, దేవునికి ఆనందధ్వని చేయుము!
మహిమగల ఆయన నామాన్ని స్తుతించండి.
    స్తుతిగీతాలతో ఆయనను ఘనపరచండి.
ఆయన కార్యాలు అద్భుతమైనవి. ఆయనకు ఇలా చెప్పండి:
    దేవా, నీ శక్తి చాలా గొప్పది. నీ శత్రువులు సాగిలపడతారు. వారికి నీవంటే భయం.
సర్వలోకం నిన్ను ఆరాధించుగాక.
    నీ నామమునకు ప్రతి ఒక్కరూ స్తుతి కీర్తనలు పాడుదురుగాక.

దేవుడు చేసిన అద్భుత విషయాలను చూడండి.
    అవి మనల్ని ఆశ్చర్యపరుస్తాయి.
సముద్రాన్ని[a] ఆరిపోయిన నేలలా దేవుడు చేశాడు.
    ఆయన ప్రజలు నదిని దాటి వెళ్లారు.[b]
    అక్కడ వారు ఆయనపట్ల సంతోషించారు.
దేవుడు తన మహా శక్తితో ప్రపంచాన్ని పాలిస్తున్నాడు.
    సర్వత్రా మనుష్యులను దేవుడు గమనిస్తున్నాడు.
    ఏ మనిషీ ఆయన మీద తిరుగుబాటు చేయలేడు.

ప్రజలారా, మా దేవుని స్తుతించండి.
    స్తుతి కీర్తనలు ఆయన కోసం గట్టిగా పాడండి.
దేవుడు మాకు జీవాన్ని ఇచ్చాడు.
    దేవుడు మమ్మల్ని కాపాడుతాడు.
10 దేవుడు మమ్మల్ని పరీక్షించాడు. మనుష్యులు నిప్పుతో వెండిని పరీక్షించునట్లు దేవుడు మమ్మల్ని పరీక్షించాడు.
11 దేవా, నీవు మమ్మల్ని ఉచ్చులో పడనిచ్చావు.
    భారమైన బరువులను నీవు మాపైన పెట్టావు.
12 మా శత్రువులను నీవు మా మీద నడువ నిచ్చావు.
    అగ్నిగుండా, నీళ్ల గుండా నీవు మమ్మల్ని ఈడ్చావు.
    కాని క్షేమ స్థలానికి నీవు మమ్మల్ని తీసుకొచ్చావు.
13-14 కనుక నేను నీ ఆలయానికి బలులు తీసుకొస్తాను.
నేను కష్టంలో ఉన్నప్పుడు నిన్ను నేను సహాయం కోసం అడిగాను.
    నేను నీకు చాల వాగ్దానాలు చేసాను.
ఇప్పుడు, నేను వాగ్దానం చేసినవాటిని నీకు ఇస్తున్నాను.
15     నేను నీకు పాపపరిహారార్థ బలులు ఇస్తున్నాను.
    నేను నీకు పొట్టేళ్లతో ధూపం[c] ఇస్తున్నాను.
    నేను నీకు ఎద్దులను, మేకలను ఇస్తున్నాను.

16 దేవుని ఆరాధించే ప్రజలారా, మీరంతా రండి.
    దేవుడు నా కోసం ఏమి చేసాడో నేను మీతో చెబుతాను.
17 నేను ఆయన్ని ప్రార్థించాను.
    నేను ఆయన్ని స్తుతించాను.
18 నా హృదయం పవిత్రంగా ఉంది.
    కనుక నా యెహోవా నా మాట విన్నాడు.
19 దేవుడు నా మొరను విన్నాడు.
    దేవుడు నా ప్రార్థన విన్నాడు.
20 దేవుని స్తుతించండి!
    దేవుడు నాకు విముఖుడు కాలేదు. ఆయన నా ప్రార్థన విన్నాడు.
    దేవుడు తన ప్రేమను నాకు చూపించాడు!

సంఖ్యాకాండము 21:4-9

ఇత్తడి సర్పం

ఇశ్రాయేలు ప్రజలు హోరు కొండ విడిచి ఎర్ర సముద్రానికి వెళ్లే మార్గంలో ప్రయాణం చేసారు. ఎదోము అనే ప్రాంతాన్ని చుట్టి వచ్చేందుకు వారు ఇలా చేసారు. కానీ ప్రజల్లో సహనం లేదు. ప్రయాణం చేస్తూ దూరాన్ని గూర్చి వారు సణిగారు. దేవునికి, మోషేకు ప్రజలు వ్యతిరేకంగా మాట్లాడారు. “మమ్మల్ని ఈజిప్టునుండి నీవెందుకు తీసుకువచ్చావు? మేము ఇక్కడ అరణ్యంలోనే చస్తాము! రొట్టెలేదు, నీళ్లు లేవు. ఈ దారుణమైన ఆహారం మాకు అసహ్యము” అన్నారు ప్రజలు.

కనుక విష సర్పాలను ఆ ప్రజల మధ్యకు యెహోవా పంపించాడు. ఆ పాములు ప్రజలను కరిచాయి. ఇశ్రాయేలు ప్రజలు చాల మంది చనిపోయారు. ప్రజలు మోషే దగ్గరకు వచ్చి, “యెహోవాకు, నీకు వ్యతిరేకంగా మాట్లాడి మేము పాపం చేసామని మాకు తెలుసు. యెహోవాకు ప్రార్థన చేసి ఈ పాములను తీసివేయమని అడుగు” అని చెప్పారు. కనుక ఆ ప్రజల కోసం మోషే ప్రార్థించాడు.

“ఇత్తడి సర్పం ఒకటి చేసి దాన్ని ఒక స్తంభం మీద ఉంచు. పాము కరిచిన వ్యక్తి ఆ స్తంభం మీది ఇత్తడి సర్పాన్ని చూడాలి. అప్పుడు అతడు చావడు” అని యెహోవా మోషేతో చెప్పాడు. కనుక మోషే యెహోవా చెప్పినట్టు చేసాడు. అతడు ఒక ఇత్తడి సర్పాన్ని చేసి, ఒక స్తంభం మీద దాన్ని పెట్టాడు. అప్పుడు ఎవర్నయినా పాము కరిస్తే, ఆ మనిషి స్తంభం మీది ఇత్తడి సర్పాన్ని చూచి బ్రతికాడు.

యోహాను 3:11-17

11 ఇది నిజం. మేము మాకు తెలసిన విషయాలు చెబుతున్నాము. చూసిన వాటికి సాక్ష్యం చెబుతున్నాము. అయినా మీరు మేము చెబుతున్న వాటిని అంగీకరించరు. 12 నేను మాట్లాడిన ప్రాపంచిక విషయాలను గురించి మీరు నమ్మలేదు. అటువంటప్పుడు పరలోక విషయాలు మాట్లాడితే ఎట్లా నమ్ముతారు? 13 పరలోకం నుండి వచ్చిన మనుష్యకుమారుడు తప్ప పరలోకమునకు ఎవ్వరూ ఎప్పుడూ వెళ్ళలేదు.

14-15 “ఆయన్ని నమ్మిన ప్రతి ఒక్కడూ నశించకుండా అనంత జీవితం పోందాలంటే, మోషే ఎడారిలో పామును ఎత్తినట్లు మనుష్యకుమారుడు కూడా ఎత్త బడాలి” అని అన్నాడు.

16 దేవుడు ఈ ప్రపంచ ప్రజల్ని ఎంతగానో ప్రేమించాడు. తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఈ ప్రపంచంలోకి పంపాడు. ఆయన్ని నమ్మిన వాళ్ళెవ్వరూ నాశనం కాకూడదని, వాళ్ళు అనంత జీవితం పొందాలనీ ఆయన ఉద్దేశ్యం. 17 దేవుడు తన కుమారుని ద్వారా ఈ ప్రపంచానికి రక్షణనివ్వటానికే గాని తీర్పు చెప్పటానికి పంపలేదు.

కీర్తనలు. 118

118 యెహోవా దేవుడు గనుక ఆయనకు కృతజ్ఞత తెలపండి.
    నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది.
“నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది”
    అని ఇశ్రాయేలూ, నీవు చెప్పుము.
“నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది”
    అని యాజకులారా, మీరు చెప్పండి.
“నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది”
    అని యెహోవాను ఆరాధించే ప్రజలారా, మీరు చెప్పండి.

నేను కష్టంలో ఉన్నాను. గనుక సహాయం కోసం నేను యెహోవాకు మొర పెట్టాను,
    యెహోవా నాకు జవాబిచ్చి, నన్ను విముక్తుని చేశాడు.
యెహోవా నాతో ఉన్నాడు గనుక నేను భయపడను.
    నన్ను బాధించుటకు మనుష్యులు ఏమీ చేయలేరు.
యెహోవా నా సహాయకుడు;
    నా శత్రువులు ఓడించబడటం నేను చూస్తాను.
మనుష్యులను నమ్ముకొనుటకంటే
    యెహోవాను నమ్ముట మేలు.
మీ నాయకులను నమ్ముకొనుట కంటే
    యెహోవాను నమ్ముకొనుట మేలు.

10 అనేకమంది శత్రువులు నన్ను చుట్టుముట్టారు.
    యెహోవా శక్తితో నేను నా శత్రువులను ఓడించాను.
11 శత్రువులు మరల మరల నన్ను చుట్టుముట్టారు.
    యెహోవా శక్తితో నేను వారిని ఓడించాను.
12 తేనెటీగల దండులా శత్రువులు నన్ను చుట్టుముట్టారు.
    కాని వేగంగా కాలిపోతున్న పొదలా వారు అంతం చేయబడ్డారు.
యెహోవా శక్తితో నేను వారిని ఓడించాను.

13 నా శత్రువు నా మీద దాడి చేసి దాదాపుగా నన్ను నాశనం చేశాడు.
    కాని యెహోవా నాకు సహాయం చేశాడు.
14 యెహోవా నా బలం, నా విజయ గీతం!
    యెహోవా నన్ను రక్షిస్తాడు!
15 మంచివాళ్ల ఇండ్లలో విజయ ఉత్సవం మీరు వినగలరు.
    యెహోవా తన మహా శక్తిని మరల చూపించాడు.
16 యెహోవా చేతులు విజయంతో పైకి ఎత్తబడ్డాయి.
    యెహోవా తన మహా శక్తిని మరల చూపించాడు.

17 నేను జీవిస్తాను! కాని మరణించను.
    మరియు యెహోవా చేసిన వాటిని గూర్చి నేను చెబుతాను.
18 యెహోవా నన్ను శిక్షించాడు,
    కాని ఆయన నన్ను చావనియ్య లేదు.
19 మంచి గుమ్మములారా, నా కోసం తెరచుకోండి,
    నేను లోనికి వచ్చి యెహోవాను ఆరాధిస్తాను.
20 అవి యెహోవా గుమ్మాలు.
    ఆ గుమ్మాలలో నుండి మంచివాళ్లు మాత్రమే వెళ్లగలరు.
21 యెహోవా, నా ప్రార్థనకు జవాబు ఇచ్చినందుకు నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
    నన్ను రక్షించినందుకు నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.

22 ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి
    మూలరాయి అయ్యింది.
23 ఇలా జరుగునట్లు యెహోవా చేశాడు.
    అది ఆశ్చర్యంగా ఉందని అనుకొంటున్నాము.
24 ఈ వేళ యెహోవా చేసిన రోజు.
    ఈ వేళ మనం ఆనందించి సంతోషంగా ఉందాము!

25 ప్రజలు ఇలా చెప్పారు, “యెహోవాను స్తుతించండి.
    దేవుడు, మమ్మల్ని రక్షించెను. దేవా, దయచేసి మమ్మల్ని వర్ధిల్లజేయుము.
26     యెహోవా నామమున వస్తున్న వానికి స్వాగతం చెప్పండి.”

యాజకులు ఇలా జవాబు ఇచ్చారు, “యెహోవా ఆలయానికి మేము నిన్ను ఆహ్వానిస్తున్నాము!
27 యెహోవాయే దేవుడు. ఆయన మనలను అంగీకరిస్తాడు.
    బలి కోసం గొర్రెపిల్లను కట్టివేయండి. బలిపీఠపు కొమ్ముల[a] వద్దకు గొర్రెపిల్లను మోసికొని రండి.”

28 యెహోవా, నీవు నా దేవుడవు. నేను నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను.
    నేను నిన్ను స్తుతిస్తున్నాను.
29 యెహోవా మంచివాడు గనుక ఆయనకు కృతజ్ఞత తెలపండి.
    నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.

1 పేతురు 3:17-22

17 చెడును చేసి కష్టాలను అనుభవించటంకన్నా మంచి చేసి కష్టాలను అనుభవించటమే దైవేచ్ఛ. యిదే ఉత్తమం.

18 క్రీస్తు మీ పాపాల నిమిత్తం
    తన ప్రాణాన్ని ఒకేసారి యిచ్చాడు.
దేవుని సన్నిధికి మిమ్మల్ని
    తీసుకు రావాలని నీతిమంతుడైన
    క్రీస్తు మీ పాపాల నిమిత్తం మరణించాడు.
వాళ్ళాయనకు భౌతిక మరణం కలిగించినా,
    ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పునర్జీవం పొందాడు.

19 పరిశుద్ధాత్మ ద్వారా, చెరలోబడిన ఆత్మల దగ్గరకు వెళ్ళి బోధించాడు. 20 గతంలో ఈ ఆత్మలు దేవుని పట్ల అవిధేయతతో ప్రవర్తించాయి. నోవహు కాలంలో, నోవహు ఓడ నిర్మాణాన్ని సాగించినంతకాలం దేవుడు శాంతంగా కాచుకొని ఉన్నాడు. ఆ తర్వాత కొందరిని మాత్రమే, అంటే ఓడలో ఉన్న ఎనిమిది మందిని మాత్రమే నీళ్ళనుండి రక్షించాడు. 21 అదేవిధంగా మీరు బాప్తిస్మము పొందటంవల్ల దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. బాప్తిస్మము పొదంటం అంటే శరీరం మీదినుండి మలినాన్ని కడిగివేయటం కాదు. దేవుణ్ణి స్వచ్ఛమైన మనస్సునిమ్మని వేడుకోవడం. ఇది యేసు క్రీస్తు చావు నుండి బ్రతికి రావటం వల్ల సంభవిస్తోంది. 22 ఆయన పరలోకానికి వెళ్ళి దేవుని కుడి చేతి వైపు కూర్చొని, దేవదూతల మీద, అధికారుల మీద, శక్తుల మీద రాజ్యం చేస్తున్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International