Book of Common Prayer
సంగీత నాయకునికి: దావీదు కీర్తన
41 పేద ప్రజలకు సహాయం చేసే మనిషి అనేక ఆశీర్వాదాలు పొందుతాడు.
కష్టాలు వచ్చినప్పుడు యెహోవా ఆ మనిషిని రక్షిస్తాడు.
2 ఆ మనిషిని యెహోవా కాపాడి అతని ప్రాణాన్ని రక్షిస్తాడు.
ఆ మనిషికి ఈ దేశంలో అనేక ఆశీర్వాదాలు ఉంటాయి.
దేవుడు అతని శత్రువుల మూలంగా అతన్ని నాశనం కానివ్వడు.
3 ఆ మనిషి రోగిగా పడకలో ఉన్నప్పుడు
యెహోవా అతనికి బలాన్ని ఇస్తాడు. ఆ మనిషి రోగిగా పడకలో ఉండవచ్చు, కాని యెహోవా అతనిని బాగుచేస్తాడు.
4 నేను చెప్పాను, “యెహోవా, నాకు దయ చూపించుము.
నేను నీకు విరోధంగా పాపం చేసాను. కాని నన్ను క్షమించి నన్ను బాగుచేయుము.”
5 నా శత్రువులు నన్ను గూర్చి చెడు సంగతులు పలుకుతున్నారు.
“వీడెప్పుడు చచ్చి మరువబడుతాడు?” అని వారంటున్నారు.
6 కొందరు మనుష్యులు వచ్చి నన్ను దర్శిస్తున్నారు.
కాని వాళ్లు నిజంగా ఏమి తలుస్తున్నారో చెప్పరు.
ఆ మనుష్యులు నన్ను గూర్చిన వార్తలు తెలుసుకొనేందుకు మాత్రమే వస్తారు,
మరియు వారు వెళ్లి, వారి గాలి కబుర్లు ప్రచారం చేస్తారు.
7 నా శత్రువులు నన్ను గూర్చి చెడ్డ సంగతులను రహస్యంగా చెబుతారు.
వారు నాకు విరోధంగా చెడు సంగతులను తలపెడుతున్నారు.
8 “ఇతడు ఏదో తప్పుచేసాడు, అందుచేత ఇతడు రోగి అయ్యాడు.
ఇతడు తన పడక మీద నుండి ఎన్నటికి తిరిగి లేవడు” అని వారు అంటారు.
9 నా మంచి స్నేహితుడు నాతో భోజనం చేసాడు.
నేను అతన్ని నమ్మాను. కాని ఇప్పుడు నా మంచి స్నేహితుడు కూడా నాకు విరోధి అయ్యాడు.
10 కనుక యెహోవా, దయతో నన్ను కరుణించి, బాగుపడనిమ్ము.
అప్పుడు నేను వారికి తగిన విధంగా చేస్తాను.
11 యెహోవా, నా శత్రువులు నన్ను భాధించని యెడల
అప్పుడు నీవు నన్ను స్వీకరించావని నేను తెలుసుకొంటాను.
12 నేను నిర్దోషినైయుండగా నాకు సహాయం చేసితివి.
నీ సన్నిధానంలో నీవు నన్ను ఎల్లప్పుడూ నిలుచుండనిస్తావు.
13 ఇశ్రాయేలీయుల యెహోవా దేవుడు స్తుతింపబడును గాక.
ఆయన ఎల్లప్పుడూ స్తుతించబడ్డాడు. మరియు ఎల్లప్పుడూ స్తుతించబడతాడు.
ఆమేన్! ఆమేన్!
సంగీత నాయకునికి: దావీదు దైవధ్యానాల్లో ఒకటి. ఎదోము వాడైన దోయేగు సౌలు దగ్గరకు వచ్చి దావీదు అహీమెలెకు ఇంటిలో ఉన్నాడని చెప్పినప్పటిది.
52 పెద్ద మనిషీ, దైవజనులకు విరోధంగా చేసే చెడ్డ పనులను గూర్చి నీవెందుకు అతిశయిస్తున్నావు?
2 వంకర పనులు చేయాలనే నీవు పథకం వేస్తుంటావు.
నీ నాలుక పదునుగల కత్తిలా ఉంది. ఎందుకంటే నీ నాలుక అబద్ధాలు పలుకుతుంది.
3 మంచి కంటె కీడునే నీవు ఎక్కువగా ప్రేమిస్తున్నావు.
సత్యం పలుకుటకంటె ఎక్కువగా అబద్ధాలు చెప్పటం నీకు ఇష్టం.
4 నీవూ, నీ అబద్ధాల నాలుక మనుష్యులను బాధించటానికే ఇష్టపడుతుంది.
5 అందుచేత దేవుడు నిన్ను శాశ్వతంగా నాశనం చేస్తాడు.
ఆయన నిన్ను పట్టి నీ గుడారము నుండి బయటకు లాగివేస్తాడు. సజీవుల దేశంలోనుండి ఆయన నిన్ను వేళ్లతో పెళ్లగిస్తాడు.
6 మంచి వాళ్లు ఇది చూచి,
దేవునిని గౌరవిస్తారు.
వారు నిన్ను చూచి నవ్వి ఇలా అంటారు,
7 “దేవుని మీద ఆధారపడని ఆ మనిషికి ఏమి సంభవించిందో చూడండి.
ఆ మనిషి తనకు సహాయం చేసేందుకు ఐశ్వర్యాన్ని, తనకున్న దానిని మూర్ఖంగా నమ్ముకున్నాడు.”
8 అయితే దేవుని ఆలయంలో నేను పచ్చని ఒలీవ మొక్కలా ఉన్నాను.
నేను శాశ్వతంగా ఎప్పటికీ దేవుని ప్రేమనే నమ్ముకొన్నాను.
9 దేవా, నీవు చేసిన వాటి మూలంగా నేను నిన్ను శాశ్వతంగా స్తుతిస్తాను.
నీ అనుచరుల సముఖములో నీవు మంచివాడవని నేను ప్రకటిస్తాను.
సంగీత నాయకునికి: కోరహు కుటుంబంవారి దైవ ధ్యానం.
44 దేవా, నిన్ను గూర్చి మేము విన్నాము.
మా పూర్వీకుల కాలంలో నీవు చేసిన కార్యాలను గూర్చి మా తండ్రులు మాతో చెప్పారు.
చాలా కాలం క్రిందట నీవు చేసిన వాటిని గూర్చి వారు మాతో చెప్పారు.
2 దేవా, నీ మహా శక్తితో ఇతరుల నుండి ఈ దేశాన్ని నీవు తీసుకొన్నావు.
మరియు మా తండ్రులను ఇక్కడ ఉంచావు.
ఆ విదేశీ ప్రజలను నీవు చితుకగొట్టావు.
వారు ఈ దేశం వదిలిపెట్టేలా బలవంతం చేశావు. నీవు మా తండ్రులను స్వతంత్రులుగా చేశావు.
3 ఈ దేశాన్ని మా తండ్రుల ఖడ్గాలు స్వాధీనం చేసికోలేదు.
వారిని విజేతలుగా చేసింది వారి బలమైన హస్తాలు కావు.
నీవు మా తండ్రులకు తోడుగా ఉన్న కారణం చేతనే అది జరిగింది.
దేవా, నీ మహా శక్తి మా తండ్రులను రక్షించింది. ఎందుకంటే వారిని నీవు ప్రేమించావు గనుకనే!
4 నా దేవా, నీవు నా రాజువు.
నీ ఆజ్ఞలే యాకోబు ప్రజలను విజయానికి నడిపించాయి.
5 నా దేవా, నీ సహాయంతో మా శత్రువులను మేము వెనుకకు త్రోసివేసాము.
నీ నామంతో, మా శత్రువుల మీదుగా మేము నడిచాము.
6 నా విల్లును, బాణాలను నేను నమ్ముకోను.
నా ఖడ్గం నన్ను రక్షించజాలదు.
7 దేవా, మా విరోధుల నుండి నీవు మమ్మల్ని రక్షించావు.
మా శత్రువుల్ని నీవు సిగ్గుపరచావు.
8 మేము ప్రతిరోజూ దేవుని స్తుతిస్తాము!
నీ నామాన్ని శాశ్వతంగా మేము స్తుతిస్తాము!
9 కాని, దేవా, నీవు మమ్మల్ని విడిచిపెట్టావు. నీవు మమ్మల్ని ఇబ్బంది పెట్టావు.
నీవు మాతో కూడ యుద్ధంలోనికి రాలేదు.
10 మా శత్రువులు మమ్మల్ని వెనుకకు నెట్టివేయనిచ్చావు.
మా శత్రువులు మా ఐశ్వర్యాన్ని దోచుకున్నారు.
11 గొర్రెల్ని ఆహారంగా తినుటకు ఇచ్చినట్టు నీవు మమ్మల్నిచ్చి వేశావు.
రాజ్యాల మధ్య నీవు మమ్మల్ని చెదరగొట్టావు.
12 దేవా, నీ ప్రజలను నీవు విలువ లేకుండా అమ్మివేశావు.
ధర విషయం నీవేమీ వాదించలేదు.
13 మా యిరుగు పొరుగు వారికి నీవు మమ్మల్ని హాస్యాస్పదం చేశావు.
మా యిరుగు పొరుగు వారు మమ్మల్ని చూచి నవ్వుతూ హేళన చేస్తారు.
14 మేము ప్రజలు చెప్పుకొనే హాస్యాస్పద కథలలో పాత్రల్లా ఉన్నాము.
ప్రజలు మమ్మల్ని చూచి నవ్వుతూ వారి తలలు ఊపుతారు.
15 నేను సిగ్గుతో కప్పబడి ఉన్నాను.
రోజంతా నా అవమానాన్ని నేను చూస్తున్నాను.
16 నా శత్రువు నన్ను ఇబ్బంది పెట్టాడు.
నా శత్రువు నన్ను హేళన చేయడం ద్వారా నా మీద కక్ష సాధిస్తున్నాడు.
17 దేవా, మేము నిన్ను మరచిపోలేదు.
అయినప్పటికీ వాటన్నిటినీ నీవు మాకు చేస్తున్నావు.
మేము నీతో మా ఒడంబడికపై సంతకం చేసినప్పుడు మేము అబద్ధమాడలేదు!
18 దేవా, మేము నీ నుండి తిరిగిపోలేదు.
నిన్ను అనుసరించటం మేము మానుకోలేదు.
19 కాని, దేవా, నక్కలు నివసించే ఈ స్థలంలో నీవు మమ్మల్ని చితుక గొట్టావు.
మరణం అంత చీకటిగా ఉన్న ఈ స్థలంలో నీవు మమ్మల్ని కప్పివేశావు.
20 మా దేవుని పేరు మేము మరచిపోయామా?
అన్యదేవతలకు మేము ప్రార్థించామా? లేదు!
21 నిజంగా ఈ విషయాలు దేవునికి తెలుసు.
లోతైన రహస్యాలు సహితం ఆయనకు తెలుసు.
22 దేవా, నీకోసం ప్రతి రోజూ చంపబడుతున్నాము!
చంపటానికి నడిపించబడే గొర్రెల్లా ఉన్నాము మేము.
23 నా ప్రభువా, లెమ్ము!
నీవేల నిద్రపోతున్నావు?
లెమ్ము! మమ్ముల్ని శాశ్వతంగా విడిచిపెట్టకుము!
24 దేవా, మానుండి నీవేల దాక్కుంటున్నావు?
మా బాధ, కష్టాలు నీవు ఎందుకు మరచిపోయావు?
25 బురదలోకి మేము త్రోసివేయబడ్డాము.
మేము దుమ్ములో బోర్లాపడి ఉన్నాము.
26 దేవా, లేచి మాకు సహాయం చేయుము!
నీ మంచితనాన్ని బట్టి మమ్మల్ని రక్షించుము.
దేవుడు బేతేలుకు వ్యతిరేకంగా పలుకుట
13 ఒక రోజు యూదా దేశపువాడైన ఒక దైవజనుడ్ని బేతేలు నగరానికి వెళ్లమని యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు. ఆ దైవజనుడు అక్కడికి వెళ్లే సరికి రాజైన యరొబాము బలిపీఠం వద్ద నిలబడి ధూపం వేస్తూ వున్నాడు. 2 ఆ బలిపీఠానికి వ్యతిరేకంగా మాట్లాడమని యెహోవా దైవజనునికి ఆజ్ఞ ఇచ్చాడు. అతను ఇలా చెప్పాడు:
“బలిపీఠమా, నీకు యెహోవా ఇలా చెప్పుచున్నాడు: ‘దావీదు వంశంలో యోషీయా అనువాడొకడు జన్మిస్తాడు. ఈ యాజకులు ఇప్పుడు కొండలపై, గుట్టలపై ఆరాధిస్తున్నారు కాని ఓ బలిపీఠమా, యోషీయా ఈ యాజకులను నీ మీద పెట్టి, వారిని చంపుతాడు. ఇప్పుడా యాజకులు నీ మీద ధూపం వేస్తున్నారు. కాని యోషీయా నీమీద మానవుల అస్తికలను తగులబెడతాడు. అప్పుడు నీవు దేనికీ ఉపయోగపడవు.’”
3 ఇవి జరిగి తీరుతాయనటానికి దైవజనుడు ఒక సూచనఇచ్చాడు. “యెహోవా ఈ సూచన నాకు తెలియజెప్పాడు. ఈ బలిపీఠం నిలువునా పగిలిపోతుంది. దాని మీది బూడిద కిందికి పడి పోతుంది” అని ప్రవక్త అన్నాడు.
4 బేతేలులో వున్న బలిపీఠాన్ని గురించి దైవజనుడు చెప్పిన సమాచారాన్ని రాజైన యరొబాము విన్నాడు. అతడు తన చేతిని బలిపీఠం మీదినుంచి తీసి ప్రవక్తవైపు చూస్తూ, “అతనిని నిర్బంధించండి!” అని అన్నాడు. రాజు అలా అన్నదే తడవుగా అతని చేయి చచ్చుపడిపోయింది. దానిని అతడు కదల్చలేక పోయాడు. 5 అంతే గాకుండా, బలిపీఠం ముక్కలై పోయింది. దాని మీది బూడిద కిందికి పడిపోయింది. దేవుని సమాచారంగా ఆ దైవజనుడు దీనినే చెప్పాడు. 6 అప్పుడు యరొబాము దైవజనునితో, “దయచేసి నా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించు. నా చేతిని బాగు చేయమని యెహోవాను అడుగు” అంటూ ప్రాధేయపడ్డాడు. అందుకొరకు దైవజనుడు యెహోవాను ప్రార్థించాడు.
తక్షణమే రాజు చేయి స్వస్థపడింది. అది పూర్వపు చేయిలా ఆరోగ్యవంతంగా వుంది.
7 అప్పుడు రాజు ఆ దైవజ్ఞుడితో, “దయచేసి నాతో నా ఇంటికి వచ్చి, నాతో భోజనం చేయి. నేను నీకు ఒక కానుక సమర్పించదలిచాను” అని అన్నాడు.
8 అది విన్న ప్రవక్త రాజుతో, “నేను నీతో నీ ఇంటికి రాను! నీవు నీ రాజ్యంలో సగంభాగం నాకిచ్చినా నేను నీతో రాను! ఈ స్థలంలో నేనేదీ తినను, త్రాగను. 9 ఏదీ తినకూడదని త్రాగరాదని యెహోవా ఆజ్ఞ. నేనిక్కడికి వచ్చిన బాట వెంట మళ్లీ ప్రయాణం చేయవద్దని కూడా యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు” అని అన్నాడు. 10 అందువల్ల అతడు మరో మార్గాన తిరుగు ప్రయాణం సాగించాడు. బేతేలుకు వచ్చిన బాట వెంట తను తిరిగి వెళ్లలేదు.
1 యేసు క్రీస్తు సేవకులైన పౌలు మరియు తిమోతియు, యేసు క్రీస్తులో ఐక్యమై, ఫిలిప్పీ పట్టణంలో నివసిస్తున్న పవిత్రులకు, పెద్దలకు, పరిచారకులకు వ్రాయునది ఏమనగా:
2 మన తండ్రియైన దేవుని నుండి, యేసు క్రీస్తు ప్రభువు నుండి మీకు అనుగ్రహము, శాంతి లభించును గాక!
కృతజ్ఞత, ప్రార్థన
3 నేను మిమ్మల్ని తలచుకొన్నప్పుడెల్లా దేవునికి కృతజ్ఞతలు చెప్పుకొనుచున్నాను. 4 కనుక మీకోసం ప్రార్థించినప్పుడెల్లా ఆనందంతో ప్రార్థిస్తాను. 5 దైవసందేశం ప్రచారం చెయ్యటానికి మీరు మొదటి రోజు నుండి ఈ రోజుదాకా నాతో కలిసి పని చేసారు. 6 ఈ మంచి కార్యాన్ని మీలో ప్రారంభించినవాడు అది పూర్తి అయ్యేదాకా, అంటే యేసు క్రీస్తు వచ్చేదాకా కొనసాగిస్తాడని నాకు నమ్మకం ఉంది.
7 మీరు నా హృదయంలో ఉన్నారు. కనుక మీ అందర్ని గురించి నేనీవిధంగా ఆలోచించటం సమంజసమే. ఎందుకంటే నేను సంకెళ్ళలో ఉన్నా, లేక సువార్తను ప్రకటిస్తూ దానిలో ఉన్న నిజాన్ని నిరూపిస్తూ, స్వేచ్ఛగా పర్యటన చేస్తున్నా దైవానుగ్రహాన్ని మీరు నాతో కలిసి పంచుకొన్నారు. 8 మీ పట్ల నాకున్న ప్రేమ యేసు క్రీస్తు నుండి వచ్చిందని నేను దైవసాక్షిగా చెపుతున్నాను.
9 ఇదే నా ప్రార్థన:
మీ ప్రేమ అవధులు లేకుండా పెరగాలి, దానితోబాటు మీకు నిజమైన జ్ఞానము, ఆ జ్ఞానంలోని లోతులు తెలుసుకొనే శక్తి కలగాలి. 10 అప్పుడు మీకు మంచి, చెడు విడమరిచే శక్తి కలుగుతుంది. క్రీస్తు వచ్చే వరకు మీరు పవిత్రంగా ఎలాంటి అపవాదులు లేకుండా ఉండగలుగుతారు. 11 మీరు నీతిగా జీవించటంవల్ల ఫలం పొందుతారు. ఆ ఫలం యేసు క్రీస్తు నుండి వచ్చి మీలో నిండిపోతుంది. తద్వారా దేవునికి కీర్తి, స్తుతి కలుగుతుంది.
40 కొందరు స్త్రీలు దూరం నుండి అన్నీ గమనిస్తూ ఉన్నారు. వాళ్ళలో మగ్దలేనే మరియ, చిన్న యాకోబుకు, యోసేపుకు తల్లి అయిన మరియ మరియు సలోమే ఉన్నారు. 41 గలిలయలో ఉన్నప్పుడు వీళ్ళు యేసును అనుసరిస్తూ, ఆయనకు సేవచేస్తూ ఉండేవాళ్ళు, వీళ్ళేగాక ఆయన వెంట యెరూషలేమునకు వచ్చిన స్త్రీలు కూడా అక్కడ ఉన్నారు.
యేసును సమాధి చేయటం
(మత్తయి 27:57-61; లూకా 23:50-56; యోహాను 19:38-42)
42 అది సబ్బాతుకు సిద్దమయ్యే రోజు, అనగా విశ్రాంతి రోజుకు ముందు రోజు సాయంత్రమయింది. 43 అరిమతయియ గ్రామస్తుడు యోసేపు ధైర్యంగా పిలాతు దగ్గరకు వెళ్ళి యేసు దేహాన్ని అడిగాడు. యోసేపు మహాసభలో పేరుగల సభ్యుడు. ఇతడు స్వయంగా దేవుని రాజ్యంకొరకు కాచుకొని ఉండేవాడు.
44 యేసు అప్పుడే చనిపోయాడని విని పిలాతు ఆశ్చర్యపడ్డాడు. శతాధిపతిని పిలిచి, “యేసు అప్పుడే చనిపోయాడా?” అని అడిగాడు. 45 ఆ సైన్యాధిపతి ఔనని అన్నాక యేసు దేహాన్ని తీసుకు వెళ్ళటానికి యోసేపుకు అనుమతి యిచ్చాడు.
46 యోసేపు, నారతో చేసిన వస్త్రాన్ని కొనుక్కొని వచ్చి, యేసు దేహాన్ని క్రిందికి దింపి ఆ వస్త్రంలో చుట్టాడు. ఆ తర్వాత ఆ దేహాన్ని తీసుకువెళ్ళి రాతితో మలచిన సమాధిలో ఉంచాడు. ఒక రాయిని అడ్డంగా దొర్లించి ఆ సమాధి మూసివేసాడు. 47 మగ్దలేనే మరియ, యోసేపు తల్లి మరియ ఆ దేహం ఉంచిన స్థలాన్ని చూసారు.
© 1997 Bible League International