Book of Common Prayer
దావీదు కీర్తన.
37 దుర్మార్గుల పట్ల కోపగించకుము
చెడు పనులు చేసేవారి పట్ల అసూయచెందకు.
2 గడ్డి, పచ్చటి మొక్కలు త్వరలోనే వాడిపోయి చస్తాయి.
దుర్మార్గులు సరిగ్గా అలానే ఉంటారు.
3 నీవు యెహోవాయందు నమ్మకం ఉంచి, మంచి పనులు చేస్తే
నీవు బ్రతికి, దేశం ఇచ్చే అనేక వస్తువులను అనుభవిస్తావు.
4 యెహోవాను సేవించటంలో ఆనందించుము.
ఆయన నీకు కావల్సినవాటిని యిస్తాడు.
5 యెహోవా మీద ఆధారపడుము. ఆయనను నమ్ముకొనుము.
జరగాల్సినదాన్ని ఆయన జరిగిస్తాడు.
6 నీ మంచితనం, న్యాయం
మధ్యాహ్నపు సూర్యునిలా ప్రకాశింపనిమ్ము.
7 యెహోవాను నమ్ముకొనుము. ఆయన సహాయం కోసం కనిపెట్టుము.
చెడ్డవాళ్లు జయించినప్పుడు కలవరపడకుము.
చెడ్డవాళ్లు చెడు తలంపులు తలంచి, వారి తలంపులు జయించినప్పుడు కలవరపడకుము.
8 కోపగించవద్దు, ఆవేశపడవద్దు, నీవు కూడ కీడు చెయ్యాలి అనిపించేటంతగా తొందరపడిపోకుము.
9 ఎందుకంటే దుర్మార్గులు నాశనం చేయబడతారు.
కాని సహాయం కోసం యెహోవాను వేడుకొనే వారికి దేశం సొంతమవుతుంది.
10 కొద్ది కాలానికి ఇక దుర్మార్గులు ఉండరు.
అలాంటి మనుష్యుల కోసం నీవు చూడవచ్చు. కాని వాళ్లు కనబడరు.
11 దీనులు భూమిని జయిస్తారు,
వాళ్లు శాంతిని అనుభవిస్తారు.
12 దుర్మార్గులు మంచి వాళ్లకు విరోధంగా కీడు చేయాలని తలుస్తారు.
ఆ దుర్మార్గులు మంచి మనుష్యుల మీద పండ్లు కొరికి, తమ కోపం వ్యక్తం చేస్తారు.
13 అయితే మన ప్రభువు ఆ దుర్మార్గులను చూచి నవ్వుతాడు,
వారికి సంభవించే సంగతులను ఆయన చూస్తాడు.
14 దుర్మార్గులు వారి ఖడ్గాలు తీసుకొంటారు, విల్లు ఎక్కుపెడ్తారు. పేదలను, నిస్సహాయులను వాళ్లు చంపాలని చూస్తారు.
మంచివాళ్లను, నిజాయితీపరులను వాళ్లు చంపాలని చూస్తారు.
15 కాని వారి విల్లులు విరిగిపోతాయి.
వారి ఖడ్గాలు వారి స్వంత గుండెల్లో గుచ్చుకు పోతాయి.
16 దుష్టుల ఐశ్వర్యంకంటే
మంచివాని అల్పభాగమే ఉత్తమమైనది.
17 ఎందుకంటే దుర్మార్గులు నాశనం చేయబడుతారు.
కాని మంచివాళ్ల విషయమై యెహోవా శ్రద్ధ పుచ్చుకొంటాడు.
18 పవిత్రమైన మనుష్యుల్ని వారి జీవితాంతం వరకూ యెహోవా కాపాడుతాడు.
వారి ప్రతిఫలం శాశ్వతంగా ఉంటుంది.
19 కష్టం వచ్చినప్పుడు మంచి మనుష్యులు నాశనం చేయబడరు.
కరువు కాలం వచ్చినప్పుడు మంచి మనుష్యులకు భోజనం సమృద్ధిగా ఉంటుంది.
20 కాని దుర్మార్గులు యెహోవాకు శత్రువులు,
ఆ దుర్మార్గులు నాశనం చేయబడుతారు.
వారు పొలంలోని పువ్వులవలె అదృశ్యమౌతారు.
వారు పొగవలె కనబడకుండా పోతారు.
21 దుర్మార్గుడు త్వరగా అప్పు చేస్తాడు. అతడు దాన్ని మరల చెల్లించడు.
కాని మంచి మనిషి సంతోషంతో ఇతరులకు ఇస్తాడు.
22 ఒకవేళ ఒక మంచి మనిషి ప్రజలను ఆశీర్వదిస్తే, అప్పుడు ఆ ప్రజలు దేవుడు వాగ్దానం చేసిన భూమిని పొందుతారు.
కాని ప్రజలకు కీడు జరగాలని గనుక అతడు అడిగితే, అప్పుడు ఆ మనుష్యులు నాశనం చేయబడతారు.
23 ఒకడు జాగ్రత్తగా నడిచేందుకు యెహోవా సహాయం చేస్తాడు.
వాని నడవడియందు యెహోవా ఆనందిస్తాడు.
24 అతడు తొట్రుపడినా పడిపోడు,
ఎందుకంటే యెహోవా వాని చేయిపట్టుకొని పడిపోకుండా చేస్తాడు.
25 నేను యువకునిగా ఉండేవాడ్ని, ఇప్పుడు ముసలివాడినయ్యాను.
మంచి మనుష్యులకు దేవుడు సహాయం చేయకుండా విడిచిపెట్టడం నేను ఎన్నడూ చూడలేదు.
మంచి మనుష్యుల పిల్లలు భోజనం కోసం భిక్షం ఎత్తుకోవడం నేను ఎన్నడూ చూడలేదు.
26 మంచి మనిషి ఇతరులకు ఎల్లప్పుడూ ఉచితంగానే ఇస్తూంటాడు.
మంచి మనిషి పిల్లలు ఆశీర్వాదం పొందుతారు.
27 నీవు చెడు పనులు చేయటం మానివేసి మంచి పనులు చేస్తే
అప్పుడు నీవు శాశ్వతంగా జీవిస్తావు.
28 యెహోవా న్యాయాన్ని ప్రేమిస్తాడు.
ఆయన తన భక్తులకు సహాయం చేయకుండా విడిచిపెట్టడు.
యెహోవా తన భక్తులను ఎల్లప్పుడూ కాపాడతాడు.
కాని దుష్టులను ఆయన నాశనం చేస్తాడు.
29 మంచి మనుష్యులకు దేవుడు వాగ్దానం చేసిన భూమి దొరుకుతుంది.
వారు దానిమీద శాశ్వతంగా నివసిస్తారు.
30 మంచి మనిషి మంచి సలహా యిస్తాడు.
అతని నిర్ణయాలు ప్రతి ఒక్కరికి న్యాయంగా ఉంటాయి.
31 యెహోవా ఉపదేశాలు మంచి మనిషి హృదయంలో ఉంటాయి.
అతడు సరిగా జీవించే విధానాన్ని విడిచిపెట్టడు.
32 కాని చెడ్డవాళ్లు, మంచివాళ్లను బాధించే మార్గాలను వెదకుతారు.
మరియు చెడ్డవాళ్లు మంచివాళ్లను చంపటానికి ప్రయత్నిస్తారు.
33 యెహోవా దుష్టుల శక్తికి మంచివారిని వదిలి వేయడు.
మంచివారిని దోషులుగా ఆయన తీర్చబడనీయడు.
34 యెహోవా సహాయం కోసం కనిపెట్టుము. యెహోవాను అనుసరించుము.
దుర్మార్గులు నాశనం చేయబడతారు. కాని యెహోవా నిన్ను ప్రముఖునిగా చేస్తాడు,
మరియు దేవుడు వాగ్దానం చేసిన భూమిని నీవు పొందుతావు.
35 శక్తిమంతులైన దుర్మార్గులను నేను చూశాను.
వారి శక్తి ఒక బలమైన, ఆరోగ్యమైన వృక్షంలా పెరుగుతూ వచ్చింది.
36 కాని తర్వాత వారు లేకుండా పోయారు.
నేను వారికోసం చూశాను, కాని వారు నాకు కనబడలేదు.
37 నీతి, నిజాయితీ కలిగి ఉండి,
సమాధానపరచువారి సంతతి నిలుస్తుంది. అది శాంతి కలిగిస్తుంది.
38 అయితే చట్టాన్ని ఉల్లంఘించే వారందరు నాశనం చేయబడతారు.
వారి సంతానం భూమిని వదలవలసి వస్తుంది.
39 నీతిమంతులను యెహోవా రక్షిస్తాడు.
నీతిమంతులకు కష్టాలు వచ్చినప్పుడు యెహోవా వారికి బలంగా ఉంటాడు.
40 నీతిమంతులకు యెహోవా సహాయం చేస్తాడు. వారిని రక్షిస్తాడు.
నీతిమంతులు సహాయంకోసం యెహోవా దగ్గరకు వస్తారు, మరియు యెహోవా దుర్మార్గుల నుండి వారిని రక్షిస్తాడు.
సొలొమోను, అతని భార్యలు
11 రాజైన సొలొమోను ఇశ్రాయేలీయులు కాని వారైన అనేక మంది స్త్రీలను ప్రేమించాడు. అలాంటి స్త్రీలలో ఫరో కుమార్తె, మోయాబీయులు, అమ్మోనీయులు, ఎదోమీయులు, సీదోనీయులు, హిత్తీయులు వున్నారు. 2 గతంలో ఇశ్రాయేలు ప్రజలతో యెహోవా దేవుడు ఇలా అన్నాడు: “ఇతర దేశాల వారిని మీరు వివాహం చేసుకోరాదు. ఒక వేళ మీరు అలా చేస్తే ఆ ప్రజలు వాళ్ల దేవుళ్లను మీరు కొలిచేలా చేస్తారు.” కాని సొలొమోను ఈ స్త్రీల వ్యామోహంలో పడ్డాడు. 3 సొలొమోనుకు ఏడు వందల మంది భార్యలున్నారు. (వీరంతా ఇతర దేశాల రాజుల కుమార్తెలే). అతనికి ఇంకను మూడు వందల మంది స్త్రీలు ఉపపత్నులుగ ఉన్నారు. అతని భార్యలు అతనిని తప్పుదారి పట్టించి దేవునికి దూరం చేశారు. 4 సొలొమోను వృద్దుడయ్యే సరికి అతని భార్యలు అతడు ఇతర దేవుళ్లను మొక్కేలా చేశారు. తన తండ్రియగు దావీదు యెహోవా పట్ల చూపిన వినయ విధేయతలు, భక్తి శ్రద్ధలు సొలొమోను చూపలేకపొయాడు. 5 సొలొమోను అష్తారోతును ఆరాధించాడు. ఇది ఒక సీదోనీయుల దేవత. మరియు సొలొమోను మిల్కోమును ఆరాధించాడు. ఇది అమ్మోనీయుల ఒక భయంకర దేవత విగ్రహం. 6 ఈలాగున సొలొమోను యెహోవా పట్ల అపచారం చేశాడు. తన తండ్రి దావీదువలె సొలొమోను సంపూర్ణంగా యెహోవాని అనుసరించలేదు.
7 కెమోషుకు ఒక ఆరాధనా స్థలాన్ని సొలొమోను నిర్మించాడు. కెమోషు మోయాబీయుల ఒక ఘోరమైన దేవత విగ్రహం. యెరూషలేముకు తూర్పుదిశలో ఒక కొండపై ఆ ఆరాధనా స్థలాన్ని సొలొమోను నిర్మించాడు. అదే కొండ మీద మొలెకునకు కూడా ఒక ఆరాధనా స్థలాన్ని సొలొమోను నిర్మించాడు. మొలెకు అమ్మోనీయులకు చెందిన ఒక భయానక దేవత విగ్రహం. 8 ఇతర దేశాలకు చెందిన తన భార్యలందరి నిమిత్తం సొలొమోను ఈ మాదిరి ఆరాధనా స్థలాలను నిర్మించాడు. అతని భార్యలు వారి వారి దేవుళ్లకు ధూపం వేసి, బలులు సమర్పించేవారు.
9 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నుండి సొలొమోను దూరమైనాడు. కావున యెహోవా సొలొమోను పట్ల కోపం వహించాడు. సొలొమోనుకు యెహోవా రెండు సార్లు ప్రత్యక్షమైనాడు. 10 చిల్లర దేవుళ్లను ఆరాధించరాదని యెహోవా సొలొమోనుకు చెప్పాడు: యెహోవా ఆజ్ఞను సొలొమోను పాటించ లేదు. 11 కావున యెహోవా సొలొమోనుతొ ఇలా అన్నాడు, “నాతో నీవు చేసుకొన్న ఒడంబడికను అనుసరించుటకు నీవిష్టపడలేదు. నీవు నా ఆజ్ఞలను శిరసావహించలేదు. కావున నీ రాజ్యాన్ని నీ నుండి వేరు చేస్తానని నిశ్చయంగా చెబుతున్నాను. దానిని నీ సేవకునికి ఇస్తాను. 12 కాని నీ తండ్రి దావీదును నేను మిక్కిలి ప్రేమించియున్నాను. అందువల్ల నీవు బతికియుండగా నీ రాజ్యం నీ నుండి తీసుకొనను. నీ కుమారుడు రాజు అయ్యే వరకు నేను వేచి వుంటాను. అప్పుడు వాని నుండి దానిని నేను తీసుకుంటాను. 13 అప్పుడు కూడ, రాజ్యాన్నంతా నీ కుమారుని వద్ద నుండి తీసుకోను. అతను పరిపాలించటానికి ఒక తెగను అతనికి వదిలి వేస్తాను. ఉన్నతుడైన నా సేవకుడగు దావీదు కొరకు నేనది చేయదలిచాను. నేను ఎంపిక చేసుకున్న యెరూషలేము నగరం కొరకు నేనలా చేస్తాను.”
తెలివిగల వాళ్ళు
13 జ్ఞానవంతులు, విజ్ఞానవంతులు మీలో ఎవరైనా ఉన్నారా? అలాగైతే వాళ్ళను సత్‌ప్రవర్తనతో, వినయంతో కూడుకొన్న విజ్ఞానంతో సాధించిన కార్యాల ద్వారా చూపమనండి. 14 ఒకవేళ మీ హృదయాల్లో అసూయతో కూడుకొన్న కోపము, స్వార్ధంతో కూడుకొన్న ఆశ ఉంటే మీలో వివేకముందని ప్రగల్భాలు చెప్పుకోకండి. అలా చేస్తే నిజాన్ని మరుగు పరచినట్లౌతుంది. 15 మీలో ఉన్న ఈ జ్ఞానము పరలోకంలో నుండి దిగి రాలేదు. ఇది భూలోకానికి చెందింది. ఇందులో ఆధ్యాత్మికత లేదు. ఇది సాతానుకు చెందింది. 16 ఎందుకంటే అసూయ, స్వార్థము, ఎక్కడ ఉంటాయో అక్కడ అక్రమాలు, అన్ని రకాల చెడు పద్ధతులు ఉంటాయి. 17 కాని పరలోకం నుండి వచ్చిన జ్ఞానం మొదట పవిత్రమైనది. అది శాంతిని ప్రేమిస్తుంది. సాధుగుణం, వినయం, సంపూర్ణమైన దయ, మంచి ఫలాలు, నిష్పక్షపాతం, యథార్థత కలిగియుంటుంది. 18 శాంతి స్థాపకులు శాంతిని విత్తి, నీతి అనే పంటను కోస్తారు.
దేవుణ్ణి శరణు కోరండి
4 మీలో మీకు యుద్ధాలు, పోట్లాటలు ఎందుకు జరుగుతున్నాయి? మీ ఆంతర్యంలోని ఆశలు మీలో యుద్ధం చేయటం వల్లనే గదా యివి జరగటం? 2 మీరు కోరుతారు. అది లభించదు. దాని కోసం మీరు చంపటానికి కూడా సిద్ధమౌతారు. మీలో అసూయ కలుగుతుంది. అయినా మీ కోరిక తీర్చుకోలేరు. మీరు పోట్లాడుతారు. యుద్ధం చేస్తారు. కాని మీరు దేవుణ్ణి అడగరు కనుక మీ కోరిక తీరదు. 3 మీరు దురుద్దేశ్యంతో అడుగుతారు. కనుక మీరు అడిగినా మీకు లభించదు. మీరు అడిగేది మీ సుఖాలకు ఖర్చు పెట్టాలని అడుగుతారు.
4 నమ్మక ద్రోహులారా! ప్రపంచంతో స్నేహం చేస్తే దేవుణ్ణి ద్వేషించినట్లని మీకు తెలియదా? ప్రపంచంతో స్నేహం చెయ్యాలనుకొన్నవాడు దేవునికి శత్రువు అవుతాడు. 5 లేఖనాల్లో ఈ విషయం వృధాగా వ్రాసారనుకుంటున్నారా? “ఆయన మనకిచ్చిన ఆత్మను[a] మనం ఆయన కోసం మాత్రమే వాడాలని చూస్తుంటాడు.” 6 దేవుడు మనపై ఎంతో అనుగ్రహం చూపుతున్నాడు. అందువల్ల లేఖనాల్లో, “దేవుడు అహంకారం కలవాళ్ళను ద్వేషిస్తాడు. వినయం కలవాళ్ళను కనికరిస్తాడు”(A) అని వ్రాయబడింది.
7 అందువల్ల దేవుని పట్ల విధేయతతో ఉండండి. సాతాన్ను ఎదిరించండి. అప్పుడు సాతాను మీనుండి పారిపోతాడు. 8 దేవుణ్ణి మీరు సమీపిస్తే దేవుడు మిమ్మల్ని సమీపిస్తాడు. పాపాత్ములారా! మీ పాపాలు కడుక్కోండి. చంచలమైన మనస్సుగల ప్రజలారా! మీ హృదయాల్ని పవిత్రం చేసుకోండి. 9 విచారించండి, దుఃఖించండి, శోకించండి. మీ నవ్వును దుఃఖంగా మార్చుకోండి. మీ ఆనందాన్ని విషాదంగా మార్చుకోండి. 10 ప్రభువు సమక్షంలో మీరు తగ్గింపు కలవారుగా ఉండండి. అప్పుడు ఆయన మిమ్మల్ని పైకిలేపుతాడు.
నీవు న్యాయాధిపతివి కావు
11 సోదరులారా! పరస్పరం దూషించుకోకండి. తన సోదరుల్ని దూషించినవాడు, లేక సోదరునిపై తీర్పు చెప్పినవాడు, ధర్మశాస్త్రాన్ని దూషించినవానిగా పరిగణింపబడతాడు. మీరు అలా చేస్తే ధర్మశాస్త్రాన్ని ఆచరించటానికి మారుగా, న్యాయాధిపతివలె ఆ ధర్మశాస్త్రంపై తీర్పు చెపుతున్నారన్నమాట. 12 ధర్మశాస్త్రాన్నిచ్చిన వాడును, న్యాయాధిపతియు ఆయనే. రక్షించగలవాడు, నాశనం చెయ్యగలవాడు ఆయనే. మరి యితర్లపై తీర్పు చెప్పటానికి నీవెవరు?
12 పిలాతు, “మరి మీరు ‘యూదుల రాజు’ అని పిలిచే ఈ మనిషిని ఏం చెయ్యమంటారు?” అని అడిగాడు.
13 వాళ్ళు, “సిలువకు వేయుము!” అని కేకలు వేసారు.
14 “ఎందుకు? అతడు చేసిన నేరమేమిటి?” అని పిలాతు అడిగాడు.
ప్రజలు యింకా బిగ్గరగా, “అతణ్ణి సిలువకు వేయండి” అని కేకలు వేసారు.
15 ఆ ప్రజల గుంపును ఆనందపరచాలని వాళ్ళు అడిగినట్లు బరబ్బను విడుదల చేసాడు. కొరడా దెబ్బలు కొట్టి సిలువకు వెయ్యమని యేసును భటులకు అప్పగించాడు.
16 భటులు యేసును రాజభవనంలో, అంటే ప్రేతోర్యమునకు తీసుకెళ్ళి, భటులందరిని సమావేశ పరచారు. 17 వాళ్ళాయనకు ఊదారంగు రాజ దుస్తులను తొడిగించారు. ముళ్ళతో ఒక కిరీటాన్ని అల్లి ఆయన తలపై పెట్టారు. 18 ఆ తర్వాత, “యూదుల రాజా! జయము!” అని ఆయన్ని పిలుస్తూ కేకలు వేసారు. 19 ఆయన తలపై కర్రతో మాటి మాటికి కొడుతూ ఆయన మీద ఉమ్మివేసారు. ఆయన ముందు వంగి తమ మోకాళ్ళపై కూర్చొని ఆయన్ని వ్యంగ్యంగా పూజించారు. 20 ఆయన్ని హేళన చేసిన తర్వాత, ఊదారంగు దుస్తుల్ని తీసేసి ఆయన దుస్తుల్ని ఆయనకు తొడిగించారు. ఆ తర్వాత ఆయన్ని సిలువకు వేయటానికి తీసుకు వెళ్ళారు.
యేసుని సిలువకు వేయటం
(మత్తయి 27:32-44; లూకా 23:26-39; యోహాను 19:17-19)
21 కురేనే పట్టణానికి చెందిన సీమోను అనే వాడొకడు పొలాలనుండి ఆ దారిన వెళ్తూ ఉన్నాడు. ఇతడు అలెక్సంద్రుకు మరియు రూపునకు తండ్రి. భటులు యితనితో బలవంతంగా సిలువ మోయించారు.
© 1997 Bible League International