Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 26

దావీదు కీర్తన.

26 యెహోవా, నాకు తీర్పు తీర్చుము, నేను పవిత్ర జీవితం జీవించినట్టు రుజువు చేయుము.
    యెహోవాను నమ్మకోవటం నేనెన్నడూ మానలేదు.
యెహోవా, నన్ను పరిశోధించి, నన్ను పరీక్షించి.
    నా హృదయంలోనికి, నా మనసులోనికి నిశితంగా చూడుము.
నేను ఎల్లప్పుడూ నీ ప్రేమను చూస్తాను.
    నీ సత్యాల ప్రకారం నేను జీవిస్తాను.
పనికిమాలిన ఆ మనుష్యుల్లో
    నేను ఒకడ్ని కాను.
ఆ దుర్మార్గపు ముఠాలంటే నాకు అసహ్యం.
    ఆ దుష్టుల ముఠాలలో నేను చేరను.

యెహోవా, నేను నా చేతులు కడుగుకొంటాను.
    నేను నీ బలిపీఠం దగ్గరకు వస్తాను.
యెహోవా, నేను నీకు స్తుతి కీర్తనలు పాడుతాను.
    నీవు చేసిన అద్భుత విషయాలను గూర్చి నేను పాడుతాను.
యెహోవా, నీ గుడారం అంటే నాకు ప్రేమ.
    మహిమగల నీ గుడారాన్ని నేను ప్రేమిస్తున్నాను.

యెహోవా, ఆ పాపులతో నన్ను జత చేయకుము.
    ఆ హంతకులను నీవు చంపేటప్పుడు, నన్ను చంపకుము.
10 ఆ మనుష్యులకు దుష్ట పథకాలున్నాయి.
    చెడుకార్యాలు చేయటానికి ఆ మనుష్యులు లంచం తీసుకొంటారు.
11 కాని నేను నిర్దోషిని.
    కనుక దేవా, నన్ను కరుణించి, రక్షించుము.
12 నేను సురక్షితమైన స్థలాల్లో నిలుస్తాను.
    యెహోవా, నీ అనుచరులు సమావేశమైనప్పుడు నేను నిన్ను స్తుతిస్తాను.

కీర్తనలు. 28

దావీదు కీర్తన.

28 యెహోవా, నీవే నా బండవు.
సహాయం కోసం నేను నిన్ను పిలుస్తున్నాను.
    నా ప్రార్థనలకు నీ చెవులు మూసుకోవద్దు.
సహాయంకోసం పిలుస్తున్న నా పిలుపుకు నీవు జవాబు ఇవ్వకపోతే
    అప్పుడు నేను సమాధిలోనున్న శవాల్లాగే ఉంటాను.
యెహోవా, నీ అతి పవిత్ర స్థలం వైపు నేను నా చేతులు ఎత్తి, ప్రార్థిస్తున్నాను.
    నేను నిన్ను వేడుకొన్నప్పుడు, నా మాట ఆలకించుము.
    నా మీద దయ చూపించుము.
యెహోవా, నేను చెడ్డవాళ్లవలె ఉన్నానని తలంచవద్దు. చెడు కార్యాలు చేసే దుర్మార్గుల్లోకి నన్ను లాగకుము.
    ఆ మనుష్యులు వారి పొరుగువారిని “షాలోం”[a] అని అభినందిస్తారు. కాని వారి హృదయాల్లో వారి పొరుగువారిని గూర్చి వారు చెడ్డ పథకాలు వేస్తున్నారు.
యెహోవా, ఆ మనుష్యులు ఇతరులకు కీడు చేస్తారు.
    కనుక వారికి కూడ కీడు జరిగేటట్టుగా చేయుము.
    ఆ చెడ్డవాళ్లు శిక్షించబడాల్సిన విధంగా వారిని శిక్షించుము.
యెహోవా చేసే మంచి పనులను చెడ్డవాళ్లు గ్రహించరు.
    ఆయన చేసే మంచి వాటిని వారు చూడరు, అర్థం చేసుకోరు.
    వారు నాశనం చేయటానికి ప్రయత్నిస్తారు.

యెహోవాను స్తుతించండి.
    కరుణించుమని నేను చేసిన నా ప్రార్థన ఆయన విన్నాడు.
యెహోవా నా బలం, ఆయనే నా డాలు.
    నేను ఆయనను నమ్ముకొన్నాను.
ఆయన నాకు సహాయం చేసాడు. నేను చాలా సంతోషంగా ఉన్నాను.
    మరియు నేను ఆయనకు స్తుతి కీర్తనలు పాడుతాను.
యెహోవా తన ప్రజలకు బలమైయున్నాడు.
    ఆయన ఏర్పాటు చేసుకొన్నవానికి[b] శక్తి, విజయాలను ఆయన ఇస్తాడు.

దేవా, నీ ప్రజలను రక్షించుము.
    నీకు చెందిన ప్రజలను ఆశీర్వదించుము.
    కాపరిలా వారిని నిత్యం నడిపించుము.

కీర్తనలు. 36

సంగీత నాయకునికి: యెహోవా సేవకుడైన దావీదు కీర్తన.

36 “నేను దేవునికి భయపడను, గౌరవించను” అని దుర్మార్గుడు తనలో తాను చెప్పుకొన్నప్పుడు
    అతడు చాలా చెడ్డ పని చేస్తున్నాడు.
ఆ మనిషి తనకు తానే అబద్ధం చెప్పుకొంటున్నాడు.
    ఆ మనిషి తన సొంత తప్పులను చూడడు.
    కనుక అతడు క్షమాపణ వేడుకోడు.
అతని మాటలు కేవలం పనికిమాలిన అబద్ధాలే.
    అతడు తెలివిగలవాడు కాజాలడు, మేలు చేయడం నేర్చుకోలేడు.
రాత్రిపూట, అతడు పనికిమాలిన సంగతులు తలుస్తూంటాడు.
    అతడు మేల్కొన్నప్పుడు, ఏ మేలూ చేయడు.
    ఏ చెడు కార్యాం చేయటానికైనా అతడు నిరాకరించడు.

యెహోవా, నీ నిజమైన ప్రేమ ఆకాశాల కంటె ఉన్నతమైనది.
    నీ నమ్మకత్వం మేఘాలకంటె ఉన్నతం.
యెహోవా, నీ నీతి “దేవతల పర్వతాల కంటె ఉన్నతమైనది.”
    నీ న్యాయం లోతైన మహాసముద్రం కంటె లోతైనది.
యెహోవా, నీవు మానవులను, జంతువులను కాపాడుతావు.
ప్రేమగల నీ దయకంటె ఎక్కువ ప్రశస్తమైనది ఇంకేది లేదు.
    కాపుదల కోసం మనుష్యులు, దేవ దూతలు నీ దగ్గరకు వస్తారు.
యెహోవా, నీ ఇంటిలోని సమృద్ధియైన ఆహారంనుండి వారు నూతన బలం పొందుతారు.
    అధ్బుతమైన నీ నదిలోనుండి నీవు వారిని త్రాగనిస్తావు.
యెహోవా, జీవపు ఊట నీ నుండి ప్రవహిస్తుంది.
    నీ వెలుగు మమ్మల్ని వెలుగు చూడనిస్తుంది.
10 యెహోవా, వాస్తవంగా నిన్ను ఎరిగినవారిని ప్రేమించటం కొనసాగించుము.
    నీకు నమ్మకంగావుండే ప్రజలకు నీ మేలు కలుగనిమ్ము.
11 యెహోవా, గర్విష్ఠుల మూలంగా నన్ను పట్టుబడనివ్వకుము.
    దుర్మార్గుల చేత తరుమబడనియ్యకుము.

12 వారి సమాధుల మీద ఈ మాటలు చెక్కుము.
    “ఇక్కడే దుర్మార్గులు పడిపోయారు.
    వారు చితుకగొట్టబడ్డారు.
    వారు మళ్లీ ఎన్నటికీ లేచి నిలబడరు.”

కీర్తనలు. 39

సంగీత నాయకునికి, యెదూతూనునకు: దావీదు కీర్తన.

39 “నేను జాగ్రత్తగా నడచుకొంటాను.
    నా నాలుకతో నన్ను పాపం చేయనివ్వను” అని నేను అన్నాను.
    నేను దుర్మార్గులకు సమీపంగా ఉన్నప్పుడు నేను నా నోరు మూసుకొంటాను.[a]

మాట్లాడుటకు నేను తిరస్కరించాను.
    నేనేమి చెప్పలేదు.
    కాని నేను నిజంగా తల్లడిల్లిపోయాను.
నాకు కోపం వచ్చింది.
    దీని విషయం నేను తలంచిన కొలది నాకు మరింత కోపం వచ్చింది.
    కనుక నేను ఏదో అన్నాను.

యెహోవా, నాకు ఏమి జరుగుతుందో చెప్పుము.
    నేను ఎన్నాళ్లు జీవిస్తానో నాకు చెప్పుము.
    నిజానికి నా జీవితం ఎంత కొద్దిపాటిదో నాకు చెప్పుము.
యెహోవా, నీవు నాకు కొద్దికాలం జీవితం మాత్రమే ఇచ్చావు.
    నా జీవితం నీ ఎదుట శూన్యం.
ప్రతి మనిషి యొక్క జీవితం ఒక మేఘంలాంటిది మాత్రమే. ఏ మనిషి శాశ్వతంగా జీవించడు.

మేము జీవించే జీవితం అద్దంలోని ప్రతిబింబం వంటిది.
    మా ప్రయాసలన్నియు వ్యర్థము. మేము సామగ్రి సమకూర్చుకొంటూనే ఉంటాము.
    కాని ఆ సామగ్రి ఎవరికి దొరుకుతుందో మాకు తెలియదు.

కనుక ప్రభూ, నాకు ఏమి ఆశ ఉంది?
    నీవే నా ఆశ.
యెహోవా, నేను చేసిన చెడు కార్యాలనుండి నీవు నన్ను రక్షిస్తావు.
    దేవునియందు నమ్మకము లేనివానిలా, వెర్రివాడిలా నన్ను యితరులు చూడకుండా నీవు చేస్తావు.
నేను నా నోరు తెరవను.
    నేను ఏమీ చెప్పను.
    యెహోవా, నీవు చేయవలసింది చేశావు.
10 దేవా, నన్ను శిక్షించటం మానివేయుము.
    నీ శిక్షవల్ల నేను అలసిపోయాను.
11 యెహోవా, తప్పు చేసినవారిని నీవు శిక్షించుము. ప్రజలు జీవించాల్సిన సరైన విధానాన్ని నీవు అలా నేర్పిస్తావు.
    వారికి ప్రియమైన దాన్ని చిమ్మటవలె నీవు నాశనం చేస్తావు.
    మా జీవితాలు అంతలోనే మాయమయ్యే మేఘంలా ఉన్నాయి.

12 యెహోవా, నా ప్రార్థన ఆలకించుము.
    నేను నీకు మొరపెట్టే మాటలు వినుము.
    నా కన్నీళ్లు తెలియనట్లు ఉండవద్దు.
నేను దాటిపోతున్న ఒక అతిథిని.
    నా పూర్వీకులందరిలాగే నేను కూడా ఒక బాటసారిని.
13 యెహోవా, నా వైపు చూడకుము. నేను చనిపోక ముందు నన్ను సంతోషంగా ఉండనిమ్ము.
    కొంచెంకాలంలో నేను ఉండకుండా పోతాను.

1 రాజులు 8:65-9:9

65 రాజైన సొలొమోను, ఇశ్రాయేలీయులు దేవాలయంలో ఆ విధంగా పండుగ జరుపుకున్నారు. ఉత్తర భాగాన బహుదూరంలో ఉన్న హమాతు కనుమ నుండి దక్షిణాన ఈజిప్టు సరిహద్దు వరకుగల ఇశ్రాయేలీయులంతా పండుగలో పాల్గొన్నారు. లెక్కకు మించిన జనాభా అక్కడ చేరింది. ఏడు రోజులపాటు వారంతా అక్కడ ఆహారపానీయాలు స్వీకరిస్తూ వేడుక చేసుకున్నారు. 66 ఎనిమిదవ రోజు సొలొమోను వారందరినీ తమ ఇండ్లకు వెళ్లమన్నాడు. ప్రజలంతా రాజుకు కృతజ్ఞతా వందనాలు చెప్పి తమ ఇండ్లకు వెళ్లారు. తన సేవకుడైన దావీదుకు, తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు యెహోవా ఇచ్చిన సహాయ సంపత్తికి ప్రజలంతా చాలా సంతోషపడ్డారు.

దేవుడు మరల సొలొమోను వద్దకు వచ్చుట

సొలొమోను యెహోవా దేవాలయాన్ని, తన రాజ భవనాన్ని నిర్మించటం పూర్తి చేశాడు. తాను నిర్మించదలచుకొన్నవన్నీ పూర్తి చేశాడు. తరువాత యెహోవా సొలొమోనుకు పూర్వం గిబియోను పట్టణంలో ప్రత్యక్షమైనట్లు మళ్లీ కన్పించాడు. యెహోవా అతనితో ఇలా అన్నాడు,

“నీ ప్రార్థన విన్నాను. నీవు నన్ను చేయమని అడిగిన విషయాలను కూడా విన్నాను. నీవు ఈ దేవాలయము కట్టించావు. నేను దానిని పవిత్రస్థలంగా చేశాను. కావున నేనక్కడ శాశ్వతంగా ఆరాధించబడతాను. నేను దానిని కనిపెట్టుకుని ఉండి ఎల్లప్పుడూ దానిని గూర్చి ఆలోచన చేస్తాను. నీ తండ్రివలె నీవు సదా నన్ను ఆరాధిస్తూ వుండాలి. అతడు న్యాయవర్తనుడు; నిజాయితీపరుడు. నా న్యాయసూత్రాలను, నేను నిర్దేశించిన కట్టుబాట్లను నీవు పాటించాలి. నీవు ఇవన్నీ పాటిస్తే, ఇశ్రాయేలు రాజు ఎల్లప్పుడూ నీ వంశంలో నుండి వచ్చేలా చేస్తాను. ఈ వాగ్దానం నేను నీ తండ్రి దావీదుకు చేశాను. ఇశ్రాయేలు ఎల్లప్పుడూ అతని సంతానంలోని వాడొకనిచే పరిపాలింపబడుతుందని నేనతనితో చెప్పాను.

6-7 “అయితే నీవు గాని, నీ సంతతి గాని నన్ను అనుసరించక పోయినా, నా న్యాయసూత్రాలను, నేను నిర్దేశించిన కట్టుబాట్లను పాటించకపోయినా, లేక మీరు ఇతర దేవుళ్లను సేవించి, ఆరాధించినా, నేను ఇచ్చిన రాజ్యంలో నుంచి ఇశ్రాయేలీయులు బయటికి పోయేలా ఒత్తిడి తెస్తాను. ఇశ్రాయేలీయులు నలుగురిలో నవ్వులపాలై, క్రమశిక్షణారాహిత్యంలో ఒక ఉదాహరణగా మిగిలిపోతారు. నేను ఈ దేవాలయాన్ని పవిత్రపరిచాను. ఇది ప్రజలు నన్ను గౌరవించే స్థలం. కాని మీరు నా ఆజ్ఞలను మన్నించకపోతే ఈ దేవాలయాన్ని నేలమట్టం చేస్తాను. ఈ దేవాలయం సర్వనాశనం చేయబడుతుంది. ఇది చూచిన ప్రతివాడూ విస్మయము చెందుతాడు. వారంతా, ‘యెహోవా ఈ రాజ్యానికి, ఈ దేవాలయానికి ఈ భయంకర పరిస్థితిని ఎందుకు కల్పించాడు?’ అని అడుగుతారు. మరికొందరు, ‘ఈ పరిణామం ఎందుకు వచ్చిందంటే ఆ ప్రజలు వారి యెహోవా దేవుని మర్చిపోయారు. వారి దేవుడు వారి పూర్వీకులను ఈజిప్టునుండి తీసుకుని వచ్చాడు. కాని వారు ఇతర దైవాలను సేవించటం మొదలు పెట్టారు’ అని సమాధానం చెపుతారు.”

యాకోబు 2:14-26

విశ్వాసము, క్రియ

14 నా సోదరులారా! “నాకు విశ్వాసం ఉంది” అని అన్న వ్యక్తి ఆ విశ్వాసాన్ని క్రియా రూపకంగా చూపకపోతే అది నిష్ప్రయోజనం. అలాంటి విశ్వాసం అతణ్ణి రక్షించగలదా? 15 ఒక సోదరుడో లేక సోదరియో కూడూ గుడ్డా లేక బాధపడ్తున్నారనుకోండి. 16 అప్పుడు మీరు అతనితో, “క్షేమంగా వెళ్ళిరా! కడుపునిండా తిని, ఒంటి నిండా దుస్తులు వేసుకో!” అని అంటూ వాళ్ళ అవసరాలు తీర్చకపోతే దానివల్ల వచ్చిన లాభమేమిటి? 17 విశ్వాసంతో పాటు క్రియ లేకపోతే ఆ విశ్వాసం పూర్తిగా నిష్ప్రయోజనమైపోతుంది.

18 కాని, “ఒకనిలో విశ్వాసం ఉండవచ్చు. మరొకనిలో క్రియ ఉండవచ్చు!” అని మీరనవచ్చు! అలాగైతే క్రియలు లేకుండా మీలో ఉన్న విశ్వాసాన్ని నాకు చూపండి. నేను క్రియారూపకంగా నా విశ్వాసాన్ని చూపుతాను. 19 ఒక్కడే దేవుడున్నాడని మీరు విశ్వసిస్తారు. మంచిదే. దయ్యాలు కూడా దాన్ని నమ్ముతాయి. అయినా, దేవుడు తమను శిక్షిస్తాడేమోనని భయపడ్తూ ఉంటాయి.

20 ఓ మూర్ఖుడా! క్రియలు లేని విశ్వాసం వ్యర్థమన్న[a] దానికి నీకు ఋజువు కావాలా? 21 మన పూర్వికుడు అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠంపై బలిగా యివ్వటానికి సిద్ధమైనందుకు దేవుడతణ్ణి, అతడు చేసిన క్రియలను బట్టి నీతిమంతునిగా పరిగణించలేదా? 22 అతనిలో ఉన్న విశ్వాసము క్రియతో కలిసి పని చెయ్యటం మీరు గమనించారు. అతడు చేసిన క్రియ అతని విశ్వాసానికి పరిపూర్ణత కలిగించింది. 23 “అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు. తద్వారా దేవుడతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడు”(A) అని లేఖనాల్లో చెప్పిన విషయం నిజమైంది. దేవుడతణ్ణి తన మిత్రునిగా పిలిచాడు. 24 మానవునిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి మాత్రమే కాకుండా అతడు చేసిన క్రియలను బట్టి నీతిమంతునిగా పరిగణింపబడటం మీరు చూసారు.

25 మరొక ఉదాహరణ రాహాబు. ఆమె గూఢచారులకు ఆతిథ్యమిచ్చి వాళ్ళను వేరొక దారిన పంపివేసింది. ఆమె చేసిన క్రియను బట్టి దేవుడు ఆమెను నీతిమంతురాలిగా పరిగణించ లేదా?

26 ఆత్మలేని శరీరం ఏ విధంగా నిర్జీవమైందో అదే విధంగా క్రియలేని విశ్వాసము నిర్జీవమైనది.

మార్కు 14:66-72

పేతురు యేసును ఎరుగుననుటకు భయపడటం

(మత్తయి 26:69-75; లూకా 22:56-62; యోహాను 18:15-18, 25-27)

66 పేతురు, క్రింద యింటి ముందు పెరట్లో ఉన్నాడు. ప్రధాన యాజకుని దాసీలలో ఒకతె అక్కడకు వచ్చింది. 67 పేతురు చలిమంటలు వేసుకొంటూ అక్కడ ఉండటం చూసి అతని దగ్గరకు వెళ్ళి అతణ్ణి పరీక్షగా చూసింది. “నజరేతు యేసుతో నీవు కూడా ఉన్నావు కదూ!” అని ఆమె పేతురుతో అన్నది.

68 అతడు నాకు తెలియదంటూ, “నీవేం అంటున్నానో నాకు అర్థం కావటంలేదు” అని అన్నాడు. పేతురు ద్వారం వైపు వెళ్ళాడు. వెంటనే కోడి కూసింది.

69 ఆ దాసీపిల్ల పేతురును చూసి, చుట్టూ ఉన్న వాళ్ళతో, “ఇతడు వాళ్ళలో ఒకడు” అని మళ్ళీ అన్నది. 70 మళ్ళీ పేతురు, “అది నిజం కాదు; నాకు తెలియదు” అని అన్నాడు.

కొద్ది సేపయ్యాక పేతురుతో నిలుచున్న వాళ్ళు అతనితో, “నీవు కూడ గలిలయ వాడవు కనుక తప్పకుండా వాళ్ళలో ఒకడివి” అని అన్నారు.

71 పేతురు తన మీద ఒట్టు పెట్టుకొంటూ, “ప్రమాణంగా చెబుతున్నాను. మీరు మాట్లాడుతున్న మనిషి ఎవరో నాకు తెలియదు” అన్నాడు.

72 వెంటనే రెండవసారి[a] కోడి కూసింది. అప్పుడు యేసు తనతో అన్న ఈ మాటలు పేతురుకు జ్ఞాపకం వచ్చాయి: “కోడి రెండు సార్లు కూయకముందే నేనెవరో తెలియదని మూడుసార్లు అంటావు.” పేతురు దుఃఖం ఆపుకోలేక శోకించటం మొదలు పెట్టాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International