Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 25

దావీదు కీర్తన.

25 యెహోవా, నేను నీకు నన్ను అర్పించుకొంటాను.
నా దేవా, నేను నిన్ను నమ్ముకొంటున్నాను.
    నేను నిరాశచెందను.
    నాశత్రువులు నన్ను చూచి నవ్వరు.
నిన్ను నమ్ముకొనే ఏ మనిషి నిరాశచెందడు.
    కాని నమ్మక ద్రోహులు నిరాశపడతారు.
    వారికి ఏమీ దొరకదు.

యెహోవా, నీ మార్గాలు నేర్చుకొనుటకు నాకు సహాయం చేయుము.
    నీ మార్గాలను ఉపదేశించుము.
నన్ను నడిపించి, నీ సత్యాలు నాకు ఉపదేశించుము.
    నీవు నా దేవుడవు, నా రక్షకుడవు.
    రోజంతా నేను నిన్ను నమ్ముతాను.
యెహోవా, నా యెడల దయ చూపుటకు జ్ఞాపకం ఉంచుకొనుము.
    నీవు ఎల్లప్పుడూ చూపిస్తూ వచ్చిన ఆ ప్రేమను నా యెడల చూపించుము.
నేను యౌవ్వనంలో ఉన్నప్పుడు చేసిన పాపాలు చెడు కార్యాలు జ్ఞాపకం చేసుకోవద్దు.
    యెహోవా, నీ నామ ఘనతకోసం ప్రేమతో నన్ను జ్ఞాపకం చేసుకొనుము.

యెహోవా నిజంగా మంచివాడు.
    జీవించాల్సిన సరైన మార్గాన్ని పాపులకు ఆయన ఉపదేశిస్తాడు.
దీనులకు ఆయన తన మార్గాలను ఉపదేశిస్తాడు.
    న్యాయంగా ఆయన వారిని నడిపిస్తాడు.
10 యెహోవా ఒడంబడికను, వాగ్దానాలను అనుసరించే మనుష్యులందరికి
    ఆయన మార్గాలు దయగలవిగా, వాస్తవమైనవిగా ఉంటాయి.

11 యెహోవా, నేను ఎన్నెన్నో తప్పులు చేసాను.
    కాని, నీ మంచితనం చూపించుటకు గాను, నేను చేసిన ప్రతి దానిని నీవు క్షమించావు.

12 ఒక వ్యక్తి యెహోవాను అనుసరించాలని కోరుకొంటే
    అప్పుడు శ్రేష్ఠమైన జీవిత విధానాన్ని దేవుడు ఆ వ్యక్తికి చూపిస్తాడు.
13 ఆ వ్యక్తి మేళ్లను అనుభవిస్తాడు.
    అతనికిస్తానని దేవుడు వాగ్దానం చేసిన భూమిని ఆ వ్యక్తి పిల్లలు వారసత్వంగా పొందుతారు.
14 యెహోవా తన అనుచరులకు తన రహస్యాలు చెబుతాడు.
    ఆయన తన అనుచరులకు తన ఒడంబడికను ఉపదేశిస్తాడు.
15 నా కళ్లు సహాయం కోసం ఎల్లప్పుడూ యెహోవా వైపు చూస్తున్నాయి.
    ఆయన నన్ను ఎల్లప్పుడూ నా కష్టాల్లో నుంచి విడిపిస్తాడు.

16 యెహోవా, నేను బాధతో ఒంటరిగా ఉన్నాను.
    నా వైపు తిరిగి, నాకు నీ కరుణ ప్రసాదించుము.
17 నా కష్టాలనుంచి నన్ను విడిపించుము.
    నా సమస్యలు పరిష్కరించబడుటకు నాకు సహాయం చేయుము.
18 యెహోవా, నా పరీక్షలు, కష్టాలు చూడుము.
    నేను చేసిన పాపాలు అన్నింటి విషయంలో నన్ను క్షమించుము.
19 నాకు ఉన్న శత్రువులు అందరినీ చూడుము,
    నా శత్రువులు నన్ను ద్వేషిస్తూ, నాకు హాని చేయాలని కోరుతున్నారు.
20 దేవా, నన్ను కాపాడుము, నన్ను రక్షించుము.
    నేను నిన్ను నమ్ముకొన్నాను కనుక నన్ను నిరాశపర్చవద్దు.
21 దేవా, నీవు నిజంగా మంచివాడివి. నిన్ను నేను నమ్ముకొన్నాను.
    కనుక నన్ను కాపాడుము.
22 దేవా, ఇశ్రాయేలు ప్రజలను, వారి కష్టములనుండి రక్షించుము.

కీర్తనలు. 9

సంగీత నాయకునికి: ముత్లబ్బేను రాగం. దావీదు కీర్తన.

పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతిస్తాను.
    యెహోవా, నీవు చేసిన అద్భుతకార్యాలన్నింటిని గూర్చి నేను చెబుతాను.
నీవు నన్ను ఎంతగానో సంతోషింపజేస్తున్నావు.
    మహోన్నతుడవైన దేవా, నీ నామానికి నేను స్తుతులు పాడుతాను.
నా శత్రువులు నీ నుండి పారిపోయేందుకు మళ్లుకొన్నారు.
    కాని వారు పడిపోయి, నాశనం చేయబడ్డారు.

నీవే మంచి న్యాయమూర్తివి. న్యాయమూర్తిగా నీవు నీ సింహాసనం మీద కూర్చున్నావు.
    యెహోవా, నీవు నా వ్యాజ్యెం విన్నావు. మరియు నన్ను గూర్చి న్యాయ నిర్ణయం చేశావు.
యూదులు కాని ఆ మనుష్యులతో నీవు కఠినంగా మాట్లాడావు.
    యెహోవా, ఆ చెడ్డ మనుష్యుల్ని నీవు నాశనం చేశావు.
    బతికి ఉన్న మనుష్యుల జాబితాలో నుండి శాశ్వతంగా ఎప్పటికి వారి పేర్లను నీవు తుడిచి వేసావు.
శత్రువు పని అంతం అయిపోయింది.
    యెహోవా, వారి పట్టణాలను నీవు నాశనం చేశావు.
    ఇప్పుడు శిథిల భవనాలు మాత్రమే మిగిలి ఉన్నాయి.
    ఆ దుర్మార్గపు ప్రజలను జ్ఞాపకం చేసుకొనేటట్టు చేసేది ఏమీ మిగల్లేదు.

అయితే యెహోవా శాశ్వతంగా పరిపాలిస్తాడు.
    యెహోవా తన రాజ్యాన్ని బలమైనదిగా చేసాడు. లోకానికి న్యాయం చేకూర్చేందుకు ఆయన దీనిని చేశాడు.
భూమి మీద మనుష్యులందరికీ యెహోవా న్యాయంగా తీర్పు తీరుస్తాడు.
    యెహోవా రాజ్యాలన్నింటికి ఒకే విధంగా తీర్పు తీరుస్తాడు.
అనేకమంది ప్రజలకు అనేక కష్టాలు ఉన్నాయి
    గనుక వారు చిక్కుబడి, బాధ పొందుతున్నారు.
ఆ ప్రజలు వారి సమస్యల భారంతో నలిగిపోతున్నారు.
    యెహోవా, వారు పారిపోవుటకు భద్రతాస్థలంగా ఉండుము.

10 నీ నామం తెలిసిన ప్రజలు
    నీమీద విశ్వాసం ఉంచాలి.
యెహోవా, ప్రజలు నీ దగ్గరకు వస్తే
    సహాయం చేయకుండా నీవు వారిని విడిచి పెట్టవు.

11 సీయోనులో నివసిస్తున్న ప్రజలారా, మీరు యెహోవాకు స్తుతులు పాడండి.
    యెహోవా చేసిన గొప్ప కార్యాలను గూర్చి ఇతర దేశాలతో చెప్పండి.
12 సహాయం కోసం యెహోవా దగ్గరకు వెళ్లిన వారిని
    ఆయన జ్ఞాపకం చేసుకొన్నాడు.
ఆ దీన ప్రజలు సహాయం కోసం మొరపెట్టారు.
    మరి యెహోవా వారిని మరచిపోలేదు.

13 దేవుణ్ణి నేను ఇలా ప్రార్థించాను: “యెహోవా, నా మీద దయ చూపుము.
    నా శత్రువులు నాకు హాని చేస్తున్న విధం చూడుము.
    ‘మరణ ద్వారాల’ నుండి నన్ను రక్షించుము.
14 తర్వాత యెరూషలేము గుమ్మాల దగ్గర, యెహోవా, నేను నీకు స్తుతులు పాడగలను.
    నీవు నన్ను రక్షించావు గనుక నేను చాలా సంతోషంగా ఉంటాను.”

15 యూదులు కాని ఆ ప్రజలు, ఇతరులను ఉచ్చులో వేయుటకు గోతులు త్రవ్వారు.
    కాని, యూదులుకాని ఆ ప్రజలు, వారి ఉచ్చులో వారే పడ్డారు.
    ఆ మనుష్యులు ఇతరులను పట్టడానికి వలలు మాటున పెట్టారు.
    కాని, వారి పాదాలే ఆ వలల్లో చిక్కుబడ్డాయి.
16 యెహోవా న్యాయం జరిగిస్తాడని ప్రజలు తెలుసుకొన్నారు.
    యెహోవా చేసినదాని మూలంగా ఆ దుర్మార్గులు పట్టుబడ్డారు. దాని విషయం ఆలోచించుము. హిగ్గాయోన్[a]

17 దేవుని మరచే ప్రజలు దుష్టులు.
    ఆ మనుష్యులు చచ్చినవారి చోటికి వెళ్తారు.
18 పేదలకు ఇక నిరీక్షణ లేదేమో అన్నట్లు కనిపిస్తుంది.
    కాని నిజంగా దేవుడు వారిని శాశ్వతంగా మరచిపోడు.

19 యెహోవా, లేచి దేశాలకు తీర్పు తీర్చుము.
    వారే శక్తిగలవారు అని ప్రజలను తలంచనీయకుము.
20 ప్రజలకు పాఠం నేర్పించు.
    వారు కేవలం మానవ మాత్రులేనని వారిని తెలుసుకోనిమ్ము.

కీర్తనలు. 15

దావీదు కీర్తన.

15 యెహోవా, నీ పవిత్ర గుడారంలో ఎవరు నివసించగలరు?
    నీ పవిత్ర పర్వతం మీద ఎవరు నివసించగలరు?
ఎవరైతే పరిశుద్ధ జీవితం జీవించగలరో, మంచి కార్యాలు చేయగలరో తమ హృదయంలో నుండి సత్యం మాత్రమే మాట్లాడుతారో
    అలాంటి వ్యక్తులు మాత్రమే నీ పర్వతం మీద నివసించగలరు.
అలాంటి వ్యక్తి ఇతరులను గూర్చి చెడు సంగతులు మాట్లాడడు.
    ఆ మనిషి తన పొరుగు వారికి కీడు చేయడు.
    ఆ మనిషి తన స్వంత కుటుంబం గూర్చి సిగ్గుకరమైన విషయాలు చెప్పడు.
ఆ మనిషి దేవుని చేత నిరాకరింపబడిన ప్రజలను గౌరవించడు.
    అయితే యెహోవాను సేవించేవారందరినీ ఆ మనిషి గౌరవిస్తాడు.
ఆ మనిషి గనుక తన పొరుగువానికి ఒక వాగ్దానం చేస్తే
    అతడు ఏమి చేస్తానన్నాడో దాన్ని నెరవేరుస్తాడు.
ఆ మనిషి ఎవరికైనా అప్పిస్తే
    అతడు దాని మీద వడ్డీ తీసుకోడు.
నిర్దోషులకు కీడు చేయుటకుగాను అతడు డబ్బు తీసుకోడు.
    ఒక మనిషి ఆ మంచి వ్యక్తిలాగ జీవిస్తే, అప్పుడు ఆ మనిషి ఎల్లప్పుడూ దేవునికి సన్నిహితంగా ఉంటాడు.

2 దినవృత్తాంతములు 6:32-7:7

32 నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు చెందని పరదేశీయుడెవడైనా తన సుదూరదేశం నుండి ఇక్కడికి రావచ్చును. అతడు నీ మహోన్నత నామం వినిగాని, తిరుగులేని నీ బాహుబలం గూర్చి వినిగాని, చాచిన నీ చేతుల ప్రభావం వినిగాని రావచ్చును. అతడు వచ్చి నీ ఆలయంవైపు చూస్తూ ప్రార్థన చేస్తే, 33 నీ ఆకాశ నివాసం నుండి వాని ప్రార్థన ఆలకించుము. ఆ పరదేశి కోరిన సహాయాన్ని అందించుము. అప్పుడు ప్రపంచ దేశాలన్నీ నీ నామ మహిమను, నీ ప్రభావాన్ని తెలుసుకొని, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులవలె నీ పట్ల భయ భక్తులతో మెలుగుతారు. దానితో ప్రపంచ ప్రజలంతా నేను నిర్మించిన ఈ ఆలయం నీ పేరు మీద పిలువ బడుతూ వుందని తెలుసుకుంటారు.

34 “నీవు నీ ప్రజలను తమ శత్రువుల మీదికి ఒక చోటికి యుద్దానికి పంపితే, వారు ఈ నగరంవైపు, నేను నిర్మించిన ఈ ఆలయంవైపు తిరిగి నిన్ను తలంచి ప్రార్థన చేసిన పక్షంలో 35 వారి ప్రార్థన ఆకాశంనుండి నీవు ఆలకించి తగిన సహాయం చేయుము.

36 “ప్రజలు నీకు విరుద్ధంగా పాపం చేస్తారు. సామాన్యంగా పాపం చేయని మానవులుండరు. అలాగే ఈ ప్రజలు నీపట్ల పాపం చేసినప్పుడు నీకు వారిపై కోపం రావటం సహజం. ఒకానొక శత్రువు వచ్చి వారిని ఓడించి బందీలుగా దూరదేశానికో, దగ్గర దేశానికో తీసుకొని పోయేలా నీవు చేయవచ్చు. 37 కాని వారు బందీలుగా వున్న రాజ్యంలో వున్నప్పుడు వారిలో పరివర్తన వచ్చి నిన్ను ప్రాధేయపడవచ్చు. ‘మేము పాపం చేశాము; మేము తప్పు చేశాము; మేము దుర్మార్గంగా ప్రవర్తించాము,’ అని వారు పరితపించవచ్చు. 38 పరితపించి వారు మళ్లీ హృదయపూర్వకంగా, ఆత్మ సాక్షిగా తాము బందీలుగా వున్న దేశంలోనే వారు నిన్ను ఆశ్రయించవచ్చు. నీవు వారి పితరులకు యిచ్చిన దేశంవైపు, నీవు ఎంపిక చేసిన నీ నగరంవైపు చూస్తూ నిన్ను ప్రార్థించవచ్చు. నేను నీ పేరు మీద నిర్మించిన ఈ ఆలయంవైపు తిరిగి ప్రార్థించవచ్చు. 39 ఇలా జరిగిన సందర్భంలో ఆకాశంలో నుండి నీవు వారి మొర ఆలకించుము. ఆకాశం నీ నివాసం. నీపట్ల పాపం చేసిన నీ ప్రజలైన వారి ప్రార్థన, వారి మనవి ఆలకించి, వారిని క్షమించి సహాయపడుము. 40 ఓ నాప్రభూ, నీ నేత్రాలను విప్పమని, నీ చెవులను ఒగ్గుమని నేను ప్రాధేయపడుచున్నాను. ఈ స్థానంలో మేము చేసే ప్రార్థనపట్ల శ్రద్ధ వహించుము.

41 “ఓ ప్రభూ, మేలుకో తండ్రీ, నీ మహత్తర శక్తికి నిదర్శనమైన ఒడంబడిక పెట్టెతో
    నీ విశ్రాంతి ఆలయాన్ని ప్రవేశించుము.
నీ యాజకులు రక్షణ పొందుదురు గాక!
    ఓ ప్రభూ, దేవా, పవిత్రులైన నీ ప్రజలకు సుఖశాంతులను కలుగజేయుము!
42 ఓ దేవా, నీవల్ల అభిషిక్తుడైన వానిని తిరస్కరించవద్దు.
    నీ సేవకుడైన దావీదు చేసిన విశ్వాసపాత్రమైన కార్యాలను జ్ఞాపకముంచు కొనుము!”

ఆలయాన్ని దేవునికి అంకింతం చేయటం

సొలొమోను ప్రార్థన పూర్తి చేసేసరికి ఆకాశం నుండి అగ్ని దిగి దహనబలులను, మిగిలిన అర్పణలను దహించి వేసింది. యెహోవా మహిమ ఆలయాన్ని నింపివేసింది. యెహోవా మహిమ నిండి వున్న ఆలయంలో యాజకులు ప్రవేశించలేక పోయారు. ఆకాశం నుండి అగ్ని దిగిరావటం ఇశ్రాయేలీయులంతా చూశారు. యెహోవా మహిమ ఆలయాన్ని ఆవరించి వుండటం కూడ వారు చూశారు. వారంతా బాటపై సాష్టాంగ పడ్డారు. వారు యెహోవాను స్తుతించి, నమస్కరించారు. వారింకా యిలా అన్నారు:

“ప్రభువు ఉత్తముడు,
    ఆయన కరుణ ఎప్పటికీ కొనసాగుతుంది.”

పిమ్మట రాజైన సొలొమోను, ఇశ్రాయేలు ప్రజలందరు యెహోవా ముందు బలులు అర్పించారు. రాజైన సొలొమోను ఇరవై రెండువేల గిత్తలను, ఒక లక్షా ఇరవైవేల గొర్రెలను బలియిచ్చాడు. రాజు, ప్రజలు అంతా కలిసి ఆలయాన్ని పవిత్రం చేశారు. అది యెహోవా ఆరాధనకై వినియోగింపబడాలి. యాజకులు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించటానికి సిద్ధంగా నిలబడ్డారు. లేవీయులు కూడ యెహోవా మేళం వాయించే పనిముట్లు పట్టుకుని నిలిచారు. దేవునికి వందనాలర్పించే నిమిత్తం ఈ వాద్య విశేషాలను రాజైన దావీదు చేయించాడు. “దేవుని ప్రేమ అనంతం!” అని యాజకులు, లేవీయులు పలికారు. లేవీయులకు ఎదురుగా నిలబడి యాజకులు బాకాలు ఊదారు. ఇశ్రాయేలీయులందరూ నిలబడ్డారు.

ఆలయం ముందున్న ఆవరణ మధ్య భాగాన్ని సొలొమోను ప్రతిష్ఠించాడు. అక్కడే సొలొమోను దహనబలులు,[a] సమాధాన బలుల కొవ్వును అర్పించాడు. తాను నిర్మించిన కంచు బలిపీఠం దహనబలులు, ధాన్యపు అర్పణలు, కొవ్వును పెట్టటానికి చాలనందున, సొలొమోను ఆలయ ఆవరణ మధ్య భాగాన్ని వినియోగించాడు.

యాకోబు 2:1-13

పక్షపాతం చూపరాదు

నా సోదరులారా! తేజోవంతుడైన మన యేసుక్రీస్తు ప్రభువును విశ్వసిస్తున్న మీరు పక్షపాతం చూపకూడదు. బంగారు ఉంగరాలు, మంచి దుస్తులు వేసుకొన్నవాడొకడు, మాసిన దుస్తులు వేసుకొన్నవాడొకడు మీ సమావేశానికి వస్తారనుకోండి. అప్పుడు మీరు మంచి దుస్తులు వేసుకొన్నవాని పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కనపరుస్తూ, “రండి! ఈ మంచి స్థానంలో కూర్చోండి” అని అంటూ, పేదవానితో, “నీవక్కడ నిలబడు!” అనిగాని, “నా కాళ్ళ దగ్గర కూర్చో” అనిగాని అంటే, మీరు వ్యత్యాసము చూపుతున్నట్లే కదా! దుర్బుద్ధితో తీర్పు చెప్పినట్లే కదా!

నా ప్రియమైన సోదరులారా! ప్రపంచం దృష్టిలో పేదవాళ్ళు విశ్వాసంలో ధనికులు కావాలనీ, వాళ్ళు తన రాజ్యానికి వారసులు కావాలనీ దేవుడు వాళ్ళను ఎన్నుకోలేదా? తనను ప్రేమించినవాళ్ళకు రాజ్యాన్నిస్తానని దేవుడు యింతకు క్రితమే వాగ్దానం చేసాడు. మీరు పేదవాళ్ళను అవమానిస్తున్నారు. మిమ్మల్ని దోచుకొనే వాళ్ళు ధనికులే కదా! వాళ్ళేకదా మిమ్ములను న్యాయస్థానానికి ఈడ్చేది? మీరు ఎవరికి చెందారో గౌరవప్రదమైన ఆయన పేరును దూషిస్తున్నది వాళ్ళే కాదా?

“నీ పొరుగింటివాణ్ణి నిన్ను నీవు ప్రేమించుకొన్నంతగా ప్రేమించు”(A) అని ధర్మశాస్త్రంలో ఉన్న ఈ ఆజ్ఞను మీరు నిజంగా పాటిస్తే మీలో సత్‌ప్రవర్తన ఉన్నట్లే. కాని ఒకవేళ మీరు పక్షపాతం చూపితే పాపం చేసినవాళ్ళౌతారు. తద్వారా ధర్మశాస్త్రం ప్రకారం మీరు నీతిని ఉల్లంఘించినవాళ్ళౌతారు.

10 ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఉన్న నియమాలన్నిటినీ పాటిస్తూ ఒకే ఒక నియమాన్ని ఉల్లంఘిస్తే అలాంటివాడు ధర్మశాస్త్రాన్నంతా ఉల్లంఘించినవాడౌతాడు. 11 ఎందుకంటే, “వ్యభిచారం చేయరాదు”(B) అని అన్నవాడే “హత్యచేయరాదు” అని కూడా అన్నాడు. మీరు వ్యభిచారం చేసివుండక పోవచ్చు. కాని హత్య చేసి ఉంటే! అలాంటప్పుడు మీరు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినట్లే కదా!

12 స్వేచ్ఛను కలిగించే క్రొత్త ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పు పొందనున్న వాళ్ళలా ప్రవర్తించండి. అదేవిధంగా మాట్లాడండి. 13 దేవుడు తీర్పు చెప్పేటప్పుడు దయాహీనులపై దయ చూపడు. కాని దయచూపిన వాళ్ళు తీర్పు చెప్పే సమయంలో ఆనందిస్తారు.

మార్కు 14:53-65

మహాసభ సమక్షంలో యేసు

(మత్తయి 26:57-68; లూకా 22:54-55, 63-71; యోహాను 18:13-14, 19-24)

53 వాళ్ళు యేసును ప్రధానయాజకుని దగ్గరకు తీసుకు వెళ్ళారు. ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు అందరూ అక్కడ సమావేశం అయ్యారు. 54 పేతురు కొంత దూరంలో ఉండి వాళ్ళను అనుసరిస్తూ ప్రధాన యాజకుని యింటి పెరట్లోకి వచ్చాడు. భటులతో పాటు తాను కూడా చలిమంటలు వేసుకొంటూ వాళ్ళతో కూర్చున్నాడు.

55 ప్రధానయాజకులు, మహాసభకు చెందిన అందరు సభ్యులు, యేసుకు మరణదండన విధించటానికి తగిన సాక్ష్యం కోసం వెతక సాగారు. కాని వాళ్ళకు సాక్ష్యం లభించలేదు. 56 చాలా మంది ప్రతికూలంగా దొంగసాక్ష్యం చెప్పారు. కాని వాళ్ళ సాక్ష్యాలు ఒకదానితో ఒకటి పొసగలేదు.

57 అప్పుడు కొందరు లేచి ఈ దొంగ సాక్ష్యం చెప్పారు: 58 “‘మానవులు కట్టిన ఈ మందిరాన్ని పడగొట్టి మూడు రోజుల్లో మానవులు కట్టని మరొక మందిరాన్ని నిర్మిస్తాను’ అని అతడు అనటం మేము విన్నాము.” 59 కాని ఆ సాక్ష్యం కూడా ఒకరు ఒక విధంగా, యింకొకరు యింకో విధంగా చెప్పారు.

60 ఆ తర్వాత ప్రధాన యాజకుడు లేచి సభ్యుల ముందు నిలుచొని యేసుతో, “నీవు సమాధానం చెప్పదలచుకోలేదా? వీళ్ళు నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతున్నారు కదా! నీవేమంటావు?” అని అడిగాడు. 61 కాని యేసు ఏ సమాధానం చెప్పక మౌనం వహించాడు.

ప్రధాన యాజకుడు, “నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువా? మానవులు స్తుతించే దేవుని కుమారుడవా?” అని మళ్ళీ ప్రశ్నించాడు.

62 యేసు, “ఔను, సర్వశక్తిసంపన్నుడైన దేవుని కుడిచేతి వైపు మనుష్యకుమారుడు కూర్చొని ఉండటం, ఆయన పరలోకంలో నుండి మేఘాలపై రావటం మీరు చూస్తారు” అని అన్నాడు.

63 ప్రధానయాజకుడు తన దుస్తుల్ని చింపుకొని[a] “మనకు యితర సాక్ష్యాలు ఎందుకు? 64 అతడు దైవదూషణ చేయటం మీరు విన్నారుగదా; మీ అభిప్రాయమేమిటి?” అని సభ్యుల్ని అడిగాడు.

అందరూ మరణదండన విధించాలని అన్నారు. 65 ఆ తర్వాత కొందరు యేసు మీద ఉమ్మివేయటం మొదలుపెట్టారు. కొందరు ఆయన కళ్ళకు గంతలు కట్టి తమ పిడికిలితో గుద్ది, “ఎవరో చెప్పుకో” అని హేళన చేసారు. కాపలాకాచే భటులు ఆయన్ని తీసుకువెళ్ళి కొట్టారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International