Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 131-135

యాత్ర కీర్తన.

131 యెహోవా, నేను గర్విష్ఠిని కాను.
    నేను ప్రముఖుడిని అన్నట్టు ప్రవర్తించ ప్రయత్నించను.
నేను గొప్ప పనులు చేయాలని ప్రయత్నించను.
    నాకు మరీ కష్టతరమైన వాటిని గూర్చి నేను చింతించను.
నేను మౌనంగా ఉన్నాను. నా ప్రాణం నెమ్మదిగా ఉంది.
    తల్లి చేతుల్లో సంతృప్తిగా ఉన్న ఒక శిశువులా
    నా ప్రాణం మౌనంగా, నెమ్మదిగా ఉంది.

ఇశ్రాయేలూ, యెహోవానే నమ్ముకో.
    ఇప్పుడు ఆయనను నమ్ముకో, ఎప్పటికీ ఆయన్నే నమ్ముకో.

యాత్ర కీర్తన.

132 యెహోవా, దావీదు శ్రమపడిన విధానం జ్ఞాపకం చేసుకొమ్ము.
కాని దావీదు యెహోవాకు ఒక ప్రత్యేక ప్రమాణం చేసాడు.
    ఇశ్రాయేలీయుల మహత్తర శక్తిగల దేవునికి దావీదు ఒక ప్రత్యేక ప్రమాణం చేసాడు.
దావీదు చెప్పాడు, “నేను నా యింట్లోకి వెళ్లను.
    నేను నా పడక మీద పండుకొనను,
నేను నిద్రపోను,
    నేను నా కండ్లకు విశ్రాంతినివ్వను,
యెహోవా కోసం నేను ఒక మందిరాన్ని కనుగొనేంత వరకు ఆ పనుల్లో ఏదీ నేను చేయను!
    ఇశ్రాయేలీయుల మహా శక్తిగల దేవునికి నేనొక గృహం చూస్తాను!”

ఎఫ్రాతాలో[a] మేము దాన్ని గూర్చి విన్నాం.
    ఒడంబడిక పెట్టెను కిర్యత్యారీము[b] దగ్గర మేము కనుగొన్నాము.
మనం పవిత్ర గుడారానికి వెళ్దాం రండి.
    దేవుడు తన పాదాలు పెట్టుకొనే పీఠం దగ్గర మనము ఆయనను ఆరాధించుకొందాం.
యెహోవా, నీ విశ్రమ స్థానం నుండి లెమ్ము.
    యెహోవా, నీవు నీ శక్తిగల ఒడంబడిక పెట్టెతో రమ్ము.
యెహోవా, నీ యాజకులు నీతిని వస్త్రాలుగా ధరించనిమ్ము.
    నీ అనుచరులు చాలా సంతోషంగా ఉన్నారు.
10 నీ సేవకుడైన దావీదు కోసం
    నీవు ఏర్పరచుకొన్న రాజును నిరాకరించవద్దు.
11 యెహోవా దావీదుతో ఒక స్థిర ప్రమాణం చేశాడు. యెహోవా దావీదుతో వెనుక తిరుగని ప్రమాణం చేశాడు.
    దావీదు వంశం నుండి రాజులు వస్తారని యెహోవా ప్రమాణం చేశాడు.
12 “దావీదూ, నీ పిల్లలు నా ఒడంబడికకు, నేను వారికి నేర్పించే నా న్యాయ చట్టాలకు విధేయులయితే
    అప్పుడు నీ వంశంలో నుండి ఎవరో ఒకరు ఎల్లప్పుడూ రాజుగా ఉంటాడు” అని యెహోవా చెప్పాడు.

13 యెహోవా, తన ఆలయ స్థానంగా ఉండుటకు సీయోనును ఎంచుకున్నాడు.
    తన నివాసస్థలంగా దాన్ని కోరుకొని యున్నాడు.
14 యెహోవా చెప్పాడు, “శాశ్వతంగా ఇదే నా స్థలం.
    నేను ఉండే చోటుగా ఈ స్థలాన్ని ఎంచుకొంటున్నాను.
15 సమృద్ధిగా ఆహారం యిచ్చి నేను ఈ పట్టణాన్ని ఆశీర్వదిస్తాను.
    ఇక్కడ పేదవాళ్లకు కూడా తినుటకు సమృద్ధిగా ఉంటుంది.
16 యాజకులకు నేను రక్షణను ధరింపచేస్తాను.
    మరియు నా అనుచరులు ఇక్కడ చాలా సంతోషంగా ఉంటారు.
17 ఈ స్థలంలో, దావీదుకు ఒక కొమ్ము లేచేలా చేస్తాను.
    నేను ఏర్పాటు చేసుకొన్న రాజుకు నేను ఒక దీపాన్ని సిద్ధం చేస్తాను.
18 దావీదు శత్రువులను నేను అవమానంతో కప్పుతాను.
    కాని దావీదు కిరీటం దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది.”

దావీదు యాత్ర కీర్తనల్లో ఒకటి.

133 సహోదరులు ఐక్యంగా శాంతి కలిగి జీవించటం
    ఎంతో మంచిది, ఎంతో ఆనందం.
అది యాజకుని తలమీద పోయబడిన కమ్మని వాసనగల తైలంలాగా ఉంటుంది. అది అహరోను గడ్డం మీదికి కారుతున్న తైలంలాగా ఉంటుంది.
    అది అహరోను ప్రత్యేక వస్త్రాల మీదికి కారుతున్న తైలంలాగ ఉంటుంది.
అది హెర్మోను పర్వతం మీద నుండి సీయోను కొండమీద పడుతున్న మంచులా ఉంటుంది.
    సీయోను వద్దనే యెహోవా తన ఆశీర్వాదం ఇచ్చాడు. శాశ్వతజీవాన్ని ఆశీర్వాదంగా యెహోవా ఇచ్చాడు.

యాత్ర కీర్తన.

134 యెహోవా సేవకులారా, మీరందరూ ఆయన్ని స్తుతించండి!
    రాత్రి అంతా ఆలయంలో సేవించిన సేవకులారా, మీరందరూ ఆయన్ని స్తుతించండి.
సేవకులారా, మీ చేతులు ఎత్తి
    యెహోవాను స్తుతించండి.
యెహోవా సీయోనులో నుండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక!
    యెహోవా ఆకాశాన్ని, భూమిని చేశాడు.

135 యెహోవాను స్తుతించండి.
    యెహోవా సేవకులారా, యెహోవా నామాన్ని స్తుతించండి.
యెహోవా ఆలయంలో నిలిచి ఉండే ప్రజలారా, ఆయన నామాన్ని స్తుతించండి!
    ఆలయ ప్రాంగణంలో నిలబడే ప్రజలారా, ఆయన నామాన్ని స్తుతించండి!
యెహోవా మంచివాడు గనుక ఆయనను స్తుతించండి.
    యెహోవాను స్తుతించుట ఆనందదాయకం గనుక ఆయన నామాన్ని స్తుతించండి.

యెహోవా యాకోబును కోరుతున్నాడు.
    యెహోవా ఇశ్రాయేలును తన విశేషమైన సొత్తుగా ఎన్నుకొన్నాడు.
యెహోవా గొప్పవాడని నాకు తెలుసు.
    మన ప్రభువు ఇతర దేవుళ్లందరికంటె గొప్పవాడు!
ఆకాశంలో, భూమి మీద, సముద్రాల్లో,
    అగాధపు మహా సముద్రాల్లో యెహోవా ఏది చేయాలనుకొంటే అది చేస్తాడు.
భూమికి పైగా మేఘాలను దేవుడు చేస్తాడు.
    మెరుపులను, వర్షాన్ని దేవుడు చేస్తాడు.
    దేవుడు గాలిని తన నిధిలోనుండి రప్పిస్తాడు.
ఈజిప్టు మనుష్యులలో జ్యేష్ఠులందరినీ, జంతువులలో మొదట పుట్టినవాటన్నిటినీ దేవుడు నాశనం చేసాడు.
దేవుడు ఈజిప్టులో అనేకమైన ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు చేసాడు.
    ఫరోకు, అతని అధికారులకు ఆ సంగతులు సంభవించేలా దేవుడు చేశాడు.
10 దేవుడు అనేక రాజ్యాలను ఓడించాడు.
    బలమైన రాజులను దేవుడు చంపేసాడు.
11 అమోరీయుల రాజైన సీహోనును దేవుడు ఓడించాడు.
    బాషాను రాజైన ఓగును దేవుడు ఓడించాడు.
    కనానులోని జనాంగాలన్నింటినీ దేవుడు ఓడించాడు.
12 వారి దేశాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు.
    దేవుడు ఆ దేశాన్ని తన ప్రజలకు ఇచ్చాడు.

13 యెహోవా, నీ పేరు శాశ్వతంగా ఖ్యాతి కలిగియుంటుంది.
    యెహోవా, ప్రజలు నిన్ను ఎప్పటికీ జ్ఞాపకం చేసుకొంటారు.
14 యెహోవా జనాంగాల్ని శిక్షించాడు.
    కాని తన సేవకుల యెడల దయ చూపించాడు.
15 ఇతర మనుష్యుల దేవుళ్లు కేవలం వెండి, బంగారు విగ్రహాలే.
    వారి దేవుళ్లు కేవలం మనుష్యులు చేసిన విగ్రహాలే.
16 ఆ విగ్రహాలకు నోళ్లు ఉన్నాయి. కాని అవి మాట్లాడలేవు.
    కళ్లు వున్నాయి కాని అవి చూడలేవు.
17 ఆ విగ్రహాలకు చెవులు ఉన్నాయి కాని అవి వినలేవు.
    ముక్కులు ఉన్నాయి కాని అవి వాసన చూడలేవు.
18 మరియు ఆ విగ్రహాలను తయారు చేసిన మనుష్యులు సరిగ్గా ఆ విగ్రహాల్లాగానే అవుతారు.
    ఎందుకంటే వారికి సహాయం చేయాలని వారు ఆ విగ్రహాల మీదనే నమ్మకముంచారు.

19 ఇశ్రాయేలు వంశమా, యెహోవాను స్తుతించు!
    అహరోను వంశమా, యెహోవాను స్తుతించు.
20 లేవీ వంశమా, యెహోవాను స్తుతించు!
    యెహోవాను ఆరాధించే ప్రజలారా, యెహోవాను స్తుతించండి.
21 సీయోనులో నుండి, తన నివాసమైన యెరూషలేములో నుండి,
    యెహోవా స్తుతించబడును గాక!

యెహోవాను స్తుతించండి!

2 సమూయేలు 19:1-23

దావీదును యోవాబు మందలించటం

19 ప్రజలు ఈ వార్తను యోవాబుకు అందజేశారు. “చూడు, రాజు దుఃఖిస్తున్నాడు. అబ్షాలోము కొరకు చాలా విచారిస్తున్నాడు” అని వారు యోవాబుకు చెప్పారు. ఆ రోజు దావీదు సైన్యం యుద్ధంలో గెలిచింది. కాని అది వారందరికీ మిక్కిలి సంతాప దినంగా మారింది. విషాదమయ దినమయిన కారణమేమనగా “రాజు తన కుమారుని కొరకు మిక్కిలిగా విచారిస్తున్నాడని” ప్రజలంతా విన్నారు.

ప్రజలంతా నిశ్శబ్దంగా నగరంలోకి వచ్చారు. వారంతా యుద్ధంనుండి, పారిపోయి వచ్చిన వారిలా అగుపించారు. రాజు తన ముఖాన్ని కప్పుకున్నాడు. “నా కుమారుడా, అబ్షాలోమా; ఓ అబ్షాలోమా, నా కుమారుడా, నా కుమారుడా!” అని బిగ్గరగా ఏడ్వసాగాడు.

యోవాబు రాజు ఇంటికి వచ్చాడు. యోవాబు రాజుతో ఇలా అన్నాడు: “ఈ రోజు నీవు నీ ముఖాన్ని కప్పుకున్నావు. అంతేగాదు, నీవు నీ సేవకుల ముఖాలన్నీ సిగ్గుతో కప్పివేశావు! ఈ రోజు నీ సేవకులు నీ ప్రాణాన్ని కాపాడారు! వారు నీ కుమారుల ప్రాణాలను, కుమార్తెలను, భార్యలను, నీ దాసీలను – అందరినీ కాపాడారు. నీ సేవకులంతా సిగ్గుతో తలవంచుకున్నారు. కారణమేమంటే నిన్ను అసహ్యించుకునే వారిని నీవు ప్రేమిస్తున్నావు. నిన్ను ప్రేమించేవారిని నీవు అసహ్యించుకుంటున్నావు! నీ క్రింది అధికారులన్నా, నీ మనుష్యులన్నా నీకు లెక్కలేదని ఈ రోజు నీవు స్పష్టంచేశావు. నిజానికి అబ్షాలోము బ్రతికి, మేమంతా చచ్చిపోయి వుంటే నీవు చాలా సంతోషపడి వుండేవాడివని ఈ రోజు నాకు విశదమయింది! లెమ్ము. ఇప్పుడు నీ సేవకులందరితో మాట్లాడి, వారిని ప్రోత్సహించు! నేను యెహోవా మీద ఒట్టుపెట్టి చెబుతున్నాను. నీవు గనుక బయటికి వెళ్లి ఈ పని చేయకపోతే, రాత్రయ్యేసరికి నీతో ఒక్కడు కూడా వుండడు! నీ యవ్వనం నుండి ఇప్పటి వరకు నీవనుభవించిన కష్టాలన్నిటికంటె, ఇప్పటి నీ పరిస్థితి చాలా అధ్వాన్నమవుతుంది.”

అప్పుడు రాజు నగరద్వారం[a] వద్దకు వెళ్లాడు. రాజు నగర ద్వారం వద్ద వున్నాడన్న వార్త వ్యాపించింది. అందుచే ప్రజలంతా ఆయనను చూసేందుకు వచ్చారు.

దావీదు మరల రాజవటం

అబ్షాలోమును అనుసరించిన ఇశ్రాయేలీయులంతా ఇండ్లకు పారిపోయారు. ఇశ్రాయేలు వంశాల ప్రజలందరూ ఒకరితో ఒకరు చర్చించటం మొదలు పెట్టారు. వారిలా అనుకున్నారు: “రాజైన దావీదు మనల్ని ఫిలిష్తీయులనుండి, తదితర శత్రువులనుండి కాపాడాడు. దావీదు అబ్షాలోముకు దూరంగా పారిపోయాడు. 10 మనల్ని పాలించటానికి అబ్షాలోమును ఎన్నుకున్నాము, కాని అతనిప్పుడు యుద్ధంలో చనిపోయాడు. కావున మనం మళ్లీ దావీదును రాజుగా చేసుకోవాలి.”

11 దావీదు రాజు యాజకులైన సాదోకుకు, అబ్యాతారుకు వర్తమానం పంపించాడు. దావీదు వారికిలా చెప్పాడు: “యూదా నాయకులతో మాట్లాడండి. వారితో, ‘రాజును (దావీదును) తిరిగి ఇంటికి తీసుకొని రావటంలో మీరెందుకు వెనుకబడి వున్నారు? చూడండి. ఇశ్రాయేలీయులంతా రాజును తిరిగి ఇంటికి తీసుకొని వచ్చే విషయం మాట్లాడుతున్నారు. 12 మీరంతా నా సోదరులు. మీరు నా కుటుంబం వారు అయినప్పుడు రాజును తిరిగి ఇంటికి తీసుకొని రావటంలో మీరెందుకు చివరివంశం వారవుతున్నారు?’ అని చెప్పండి. 13 అమాశాతో, ‘నీవు నా కుటుంబంలో భాగస్వామివి. నేను నిన్ను యోవాబు స్థానంలో సైన్యాధికారిగా చేయకపోతే దేవుడు నన్ను శిక్షించు గాక!’ అని కూడ చెప్పండి.”

14 దావీదు యూదా ప్రజలందరి హృదయాలను చూర గొన్నాడు. వారంతా ఒకటయ్యేలా చేశాడు. యూదా ప్రజలు దావీదుకు వర్తమానం పంపారు. “నీ సేవకులందరితో కలిసి తిరిగి రమ్ము” అని వారన్నారు.

15 అప్పుడు రాజు (దావీదు) యొర్దాను నది వద్దకు వచ్చాడు యూదా ప్రజలు రాజును కలవటానికి గిల్గాలుకు వచ్చారు. వారు రాజును యొర్దాను నదిని దాటించి తీసుకొని రావటానికి వచ్చారు.

దావీదును షిమీ క్షమాభిక్ష కోరటం

16 గెరా కుమారుడైన షిమీ బెన్యామీను వంశానికి చెందినవాడు. అతడు బహూరీములో నివసిస్తూండేవాడు. దావీదు రాజును కలవటానికి షిమీ వేగంగా ముందుకు వచ్చాడు. యూదా ప్రజలతో కలిసి షిమీ వచ్చాడు. 17 వేయిమంది బెన్యామీనీయులు కూడ షిమీతో వచ్చారు. సౌలు కుటుంబమువారి సేవకుడు సీబా కూడా వచ్చాడు. సీబా తన పదునైదుగురు కుమారులను ఇరవై మంది సేవకులను తనతో తీసుకొని వచ్చాడు. వీరంతా దావీదు రాజును కలవటానికి హుటాహుటిని యొర్దాను నది వద్దకు వెళ్లారు.

18 రాజ కుటుంబాన్ని యూదాకు తిరిగి తీసుకొని రావటంలో సహాయపడటానికి ప్రజలు యొర్దాను నదిని దాటి వెళ్లారు. రాజు ఏది కోరితే వారది చేయసాగారు. రాజు నదిని దాటుతూ వుండగా, గెరా కుమారుడైన షిమీ అతని వద్దకు వచ్చాడు. అతడు రాజు ముందు సాష్టాంగపడ్డాడు. 19 రాజుతో షిమీ ఇలా అన్నాడు, “నా ప్రభువా, నేను చేసిన పొరపాట్లను పట్టించుకోవద్దు! నా ప్రభువైన రాజా, నీవు యెరూషలేము వదిలి వెళ్లేటప్పుడు నేను నీ పట్ల చేసిన అపచారాలను మనసులో పెట్టుకోవద్దు. 20 పాపం చేసినట్లు నేను తెలుసుకున్నాను. అందువల్ల యోసేపు కుటుంబంలో[b] నుండి నేను ముందుగా నిన్ను నా ప్రభువైన రాజును, కలుసుకోవాలని వచ్చాను.”

21 కాని సెరూయా కుమారుడైన అబీషై ఇలా అన్నాడు: “యెహోవాచే అభిషిక్తము చేయబడిన రాజునకు కీడు జరగాలని కోరుకున్నందుకు షిమీని మనం తప్పక చంపివేయాలి.”

22 దావీదు వారిని వారించి, వారితో, “సెరూయా కుమారులారా, మీకును – నాకును ఏమి పొందిక! ఈ రోజు మీరు నాకు వ్యతిరేకులయ్యారు! ఇశ్రాయేలులో ఏ ఒక్కడూ చంపబడడు. నాకు తెలుసు. ఈ రోజు నేను ఇశ్రాయేలుకు రాజును!” అని అన్నాడు.

23 ఆ తరువాత రాజు షిమీతో, “నీవు చంపబడవు” అని అన్నాడు. పైగా తనకై తాను షిమీని చంపనని రాజు అతనికి ప్రమాణం చేసి చెప్పాడు.[c]

అపొస్తలుల కార్యములు 24:1-23

ఫేలిక్సు సమక్షంలో విచారణ

24 అయిదు రోజుల తర్వాత ప్రధాన యాజకుడైన అననీయ, కొంతమంది పెద్దలతో, తెర్తుల్లు అనబడే న్యాయవాదితో కలిసి కైసరియ చేరుకున్నాడు. పౌలు పట్ల తాము చేయదలచిన నేరారోపణల్ని రాష్ట్రాధిపతి ముందు ఉంచాడు. తెర్తుల్లు తన వాదనను ప్రారంభిస్తూ, “మీ పాలనలో చాలాకాలం శాంతంగా జీవించాము. ఇది మా అదృష్టం. మీ ముందు చూపువల్ల ఈ దేశంలో ఎన్నో సంస్కరణలు జరిగాయి.

“మహా ఘనత పొందిన ఫేలిక్సు ప్రభూ! మీరు చేసిన వాటిని అన్ని ప్రాంతాల్లో ఉన్న మా ప్రజలు, ఎంతో కృతజ్ఞతతో, సంపూర్ణంగా అంగీకరిస్తున్నారు. మిమ్మల్ని ఎక్కువగా విసిగించటం మాకు ఇష్టం లేదు. కనుక క్లుప్తంగా చెపుతాము. మేము చెప్పేది మాపై దయ ఉంచి వినమని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇతడు సమస్యలు, కష్టాలు కలిగిస్తాడని మాకు తెలిసింది. ప్రపంచంలో ఉన్న యూదులందరిలో ఇతడు అల్లర్లు లేపాడు. ఇతడు కుట్రలు పన్నే నజరేతు జాతికి నాయకుడు. ఇతడు దేవాలయాన్ని అపవిత్రం చెయ్యటానికి ప్రయత్నించాడు. [a] మీరితణ్ణి విచారిస్తే మేము చేసిన ఆరోపణల యొక్క నిజానిజాలు మీకే తెలుస్తాయి” అని అన్నాడు. న్యాయస్థానంలో యూదులందరూ ఈ ఆరోపణలు నిజమని చెబుతూ, తెర్తుల్లు వాదనను బలపరిచారు.

పౌలు నిర్దోషినని ఫేలిక్సుముందు చెప్పుకొనటం

10 రాష్ట్రాధిపతి పౌలును మాట్లాడమని సంజ్ఞ చేసాడు. పౌలు ఈ విధంగా మాట్లాడటం మొదలు పెట్టాడు: “మీరు ఈ దేశంలో ఎన్నో సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నారు. అందువల్ల నేను ఆనందంగా నా నిర్దోషత్వం నిరూపిస్తాను. 11 నేను ఆరాధించటానికి యెరూషలేము వెళ్ళి యింకా పన్నెండు రోజులు కాలేదు. నేను చెబుతున్నదానిలోని నిజానిజాలు మీరు సులభంగా విచారించవచ్చు. 12 నాపై నేరారోపణ చేసిన వీళ్ళు నేను మందిరంలో వాదిస్తుండగా చూసారా? లేదు. సమాజమందిరంలో కాని పట్టణంలో మరెక్కడైనా కాని, నేను ప్రజల్ని పురికొల్పటం వీళ్ళు చూసారా? లేదు. 13 వీళ్ళు ప్రస్తుతం నాపై మోపుతున్న నేరాల్ని నిరూపించలేరు.

14 “వాళ్ళు, దేన్ని వేరొక మతంగా పరిగణిస్తారో దాన్ని నేను అనుసరిస్తున్నానని ఒప్పుకుంటాను. ఈ మార్గాన్ననుసరించి నేను మా పూర్వికుల దేవుణ్ణి ఆరాధిస్తున్నాను. పైగా, ధర్మశాస్త్రంలో వ్రాయబడినవాటిని, మన ప్రవక్తలు వ్రాసిన వాటిని నేను సంపూర్ణంగా విశ్వసిస్తాను. 15 వాళ్ళలాగే నాకూ దేవుడంటే నమ్మకం ఉంది. వాళ్ళలాగే, సన్మార్గుడు, దుర్మార్గుడు బ్రతికి వస్తారని నేను ఎదురు చూస్తున్నాను. 16 అందువలన నా ఆత్మను దేవుని దృష్టిలో, మానవుని దృష్టిలో మలినం కాకుండా ఉంచుకోవటానికి ఎప్పుడూ మనసారా ప్రయత్నిస్తున్నాను.

17 “పేదవాళ్ళకు డబ్బు దానం చెయ్యాలని, దేవునికి కానుకలివ్వాలని ఎన్నో ఏండ్ల తర్వాత నేను యెరూషలేముకు వచ్చాను. 18 నేనీ కార్యాలు మందిరావరణంలో చేస్తుండగా వాళ్ళు చూసారు. నేను శాస్త్రయుక్తంగా శుభ్రమయ్యాను. నా వెంట ప్రజా సమూహం లేదు. నేను ఏ అల్లర్లు మొదలు పెట్టలేదు. 19 కాని ఆసియనుండి అక్కడికి వచ్చిన కొందరు యూదులకు నేను నేరం చేసానని అనిపిస్తే, యిక్కడికి వచ్చి నేరారోపణ చేయవలసి ఉంది. 20 నేను మహాసభ ముందు నిలుచున్నప్పుడు నాలో ఏ అపరాధం కనిపెట్టారో ఇక్కడ నిలుచున్నవాళ్ళను చెప్పమనండి. 21 ఔను! నేను ఒకటి చేసాను. వాళ్ళ సమక్షంలో నిలుచొని బిగ్గరగా ‘చనిపోయినవాళ్ళు బ్రతికి వస్తారని నమ్మినందుకు మీ ముందు ఈ రోజు నేరస్థునిగా నిలుచున్నాను’ అని అన్నాను. ఇది తప్ప నేనేమీ చెయ్యలేదు.”

22 యేసు ప్రభువు మార్గం బాగా తెలిసిన ఫేలిక్సు సభను ముగిస్తూ, “సహస్రాధిపతి లూసియ వచ్చాక నీ విషయం నిర్ణయిస్తాను” అని అన్నాడు. 23 శతాధిపతితో, “పౌలును కాపలాలో ఉంచు! కాని కొంత స్వేచ్ఛనివ్వు. అతని స్నేహితులు అతనికి ఏదైనా ఇవ్వటానికి వస్తే వాళ్ళనాపవద్దు” అని అన్నాడు.

మార్కు 12:28-34

అతి ముఖ్యమైన ఆజ్ఞ ఏది?

(మత్తయి 22:34-40; లూకా 10:25-28)

28 శాస్త్రుల్లో ఒకడు వచ్చి వాదన విన్నాడు. యేసు చక్కటి సమాధానం చెప్పాడని గ్రహించి, “ఆజ్ఞలన్నిటిలో ఏ ఆజ్ఞ ముఖ్య మైనది?” అని యేసును అడిగాడు.

29 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ఓ ఇశ్రాయేలు జనాంగమా విను. మొదటిది ఇది: మన ప్రభువైన దేవుడు మాత్రమే ప్రభువు. 30 నీ శక్తి, బుద్ధి, సంపూర్ణంగా ఉపయోగిస్తూ నీ ప్రభువైన దేవుణ్ణి నీ సంపూర్ణమైన ఆత్మతో మనస్ఫూర్తిగా ప్రేమించు,(A) 31 రెండవది ఇది: నిన్ను నీవు ప్రేమించుకున్నంతగా నీ పొరుగు వాణ్ణి ప్రేమించు.(B) వీటిని మించిన ఆజ్ఞ మరొకటి లేదు.”

32 ఆ శాస్త్రి, “అయ్యా! చక్కగా చెప్పారు. దేవుడు ఒక్కడేనని, ఆయన తప్ప మరెవ్వరూ లేరని సరిగ్గా చెప్పారు. 33 ఆ దేవుణ్ణి సంపూర్ణమైన బుద్ధితో, సంపూర్ణమైన మనస్సుతో శక్తినంతా ఉపయోగిస్తూ ప్రేమించాలని, మరియు తనను ప్రేమించుకొన్నంతగా, తన పొరుగువాణ్ణి ప్రేమించాలని చక్కగా చెప్పారు. ఈ రెండు ఆజ్ఞలు, బలులకన్నా, దహన బలులకన్నా ముఖ్యమైనవి” అని అన్నాడు.

34 అతడు తెలివిగా చెప్పాడని యేసు గ్రహించి అతనితో, “నీవు దేవుని రాజ్యానికి దూరంగా లేవు!” అని అన్నాడు. ఆ తర్వాత ఆయన్ని ప్రశ్నలు అడగటానికి ఎవ్వరికి ధైర్యం చాలలేదు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International