Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 72

సొలొమోను కీర్తన.

72 దేవా, రాజు నీవలె జ్ఞానముగల తీర్మానాలు చేయుటకు సహాయం చేయుము.
    రాజకుమారుడు నీ మంచితనం గూర్చి నేర్చుకొనేందుకు సహాయం చేయుము.
నీ ప్రజలకు న్యాయంగా తీర్పు తీర్చేందుకు రాజుకు సహాయం చేయుము.
    నీ పేద ప్రజలకు ఏది మంచిదో దానిని చేయుటకు అతనికి సహాయం చేయుము.
దేశం అంతటా శాంతి, న్యాయం ఉండనీయుము.
పేద ప్రజలకు రాజు న్యాయంగా ఉండునుగాక.
    నిస్సహాయులకు అతణ్ణి సహాయం చేయనిమ్ము. వారిని బాధించే ప్రజలను అతణ్ణి శిక్షించనిమ్ము.
సూర్యుడు ప్రకాశించునంత వరకు ఆకాశంలో చంద్రుడు ఉన్నంత వరకు
    ప్రజలు రాజుకు భయపడి గౌరవిస్తారని ఆశిస్తున్నాను.
    ప్రజలు అతనికి శాశ్వతంగా భయపడి గౌరవిస్తారని నేను ఆశిస్తున్నాను.
పొలాల మీద కురిసే వర్షంలా రాజు ఉండునట్లు అతనికి సహాయం చేయుము.
    నేలమీద పడే జల్లులా ఉండుటకు అతనికి సహాయం చేయుము.
అతడు రాజుగా ఉండగా మంచితనం వికసించనిమ్ము.
    చంద్రుడున్నంతవరకు శాంతిని కొనసాగనిమ్ము.
సముద్రం నుండి సముద్రానికి, నది నుండి భూమి మీద దూర స్థలాలకు
    అతని రాజ్యాన్ని విస్తరింపనిమ్ము.
అరణ్యంలో నివసించే ప్రజలను అతనికి సాగిలపడనిమ్ము
    అతని శత్రువులందరూ ధూళిలో వారి ముఖాలు పెట్టుకొని అతని యెదుట సాగిలపడనిమ్ము.
10 తర్షీషు రాజులు మరియు దూర తీరాల రాజులు అతనికి కానుకలు సమర్పించుదురు గాక.
    షేబ మరియు సెబా రాజులు అతనికి కప్పం చెల్లించెదరు గాక.
11 రాజులందరూ మన రాజుకు సాగిలపడుదురు గాక.
    రాజ్యాలన్నీ అతన్ని సేవించెదరు గాక.
12 మన రాజు సహాయం లేని వారికి సహాయం చేస్తాడు.
    మన రాజు పేదలకు, నిస్సహాయులకు సహాయం చేస్తాడు.
13 పేదలు, నిస్సహాయులు ఆయన మీద ఆధారపడతారు.
    రాజు వారిని బ్రతికించి ఉంచుతాడు.
14 వారిని బాధించుటకు ప్రయత్నించే కృ-రుల బారినుండి రాజు వారిని రక్షిస్తాడు.
    ఆ పేద ప్రజల ప్రాణాలు రాజుకు చాలా ముఖ్యం.
15 రాజు దీర్ఘాయుష్మంతుడగును గాక.
    షేబ నుండి బంగారం అతడు తీసుకొనును గాక.
రాజుకోసం ఎల్లప్పుడూ ప్రార్థించండి.
    ప్రతిరోజూ అతణ్ణి దీవించండి.
16 పొలాలు పుష్కలంగా ధాన్యం పండించునుగాక.
    కొండలు పంటలతో నిండిపోవునుగాక.
పొలాలు లెబానోనులోని పొలాలవలె సారవంతంగా ఉండును గాక.
    పొలాలు గడ్డితో నిండిపోయినట్లు పట్టణాలు ప్రజలతో నిండిపోవును గాక.
17 రాజు శాశ్వతంగా ప్రసిద్ధినొందునుగాక.
    సూర్యుడు ప్రకాశించునంతవరకు ప్రజలు అతని పేరును జ్ఞాపకం చేసికొందురు గాక.
అతని మూలంగా ప్రజలందరూ ఆశీర్వదించబడుదురు గాక.
    మరియు వారందరూ అతన్ని దీవించెదరుగాక.

18 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించండి.
    అలాంటి అద్భుతకార్యాలు చేయగలవాడు దేవుడు ఒక్కడే.
19 ఆయన మహిమగల నామాన్ని శాశ్వతంగా స్తుతించండి.
    ఆయన మహిమ ప్రపంచమంతా వ్యాపించును గాక.
ఆమేన్, ఆమేన్!

20 యెష్షయి కుమారుడు దావీదు ప్రార్థనలు ఇంతటితో సమాప్తం.

కీర్తనలు. 119:73-96

యోద్

73 యెహోవా, నీవు నన్ను చేశావు, నీ చేతులతో నన్ను నిలబెడుతావు.
    నీ ఆదేశాలు నేర్చుకొని గ్రహించుటకు నాకు సహాయం చేయుము.
74 యెహోవా, నీ అనుచరులు నన్ను చూచి సంతోషిస్తారు.
    నీవు చెప్పే విషయాలను నేను నమ్ముతాను. కనుక వారికి చాలా సంతోషం.
75 యెహోవా, నీ నిర్ణయాలు న్యాయంగా ఉంటాయని నాకు తెలుసు.
    నీవు నన్ను శిక్షించటం నీకు సరియైనదే.
76 ఇప్పుడు నిజమైన నీ ప్రేమతో నన్ను ఆదరించుము.
    నీ వాగ్దాన ప్రకారం నన్ను ఆదరించుము.
77 యెహోవా, నన్ను ఆదరించి, నన్ను బ్రతుకనిమ్ము.
    నీ ఉపదేశములలో నిజంగా నేను ఆనందిస్తాను.
78 నాకంటే తామే మంచివాళ్లు అనుకొనే మనుష్యులు నన్ను గూర్చి అబద్ధం చెప్పారు కనుక వారిని సిగ్గుపరచు.
    యెహోవా, నేను నీ ఆజ్ఞలను అధ్యయనం చేస్తాను.
79 నీ అనుచరులను తిరిగి నా దగ్గరకు రానిమ్ము.
    నీ ఒడంబడిక తెలిసిన మనుష్యులను తిరిగి నా దగ్గరకు రానిమ్ము.
80 యెహోవా, నన్ను నీ ఆజ్ఞలకు పరిపూర్ణంగా విధేయుడను కానిమ్ము.
    అందుచేత నేను అవమానించబడను.

కఫ్

81 నీవు నన్ను రక్షిస్తావని నిరీక్షిస్తూ నేను చనిపోబోతున్నాను.
    కాని యెహోవా, నీవు చెప్పే విషయాలు నేను నమ్ముతాను.
82 నీవు వాగ్దానం చేసిన వాటికోసం నేను ఎదురు చూస్తూనే ఉంటాను. కాని నా కళ్లు అలసిపోతున్నాయి.
    యెహోవా, నీవు నన్ను ఎప్పుడు ఆదరిస్తావు?
83 నేను చెత్తకుప్పలో ఎండిపోయిన ద్రాక్ష తొక్కలా ఉన్నప్పుడు కూడా
    నీ న్యాయ చట్టాలను నేను మరచిపోలేదు.
84 నేను ఎంత కాలం జీవిస్తాను?
    యెహోవా, నన్ను హింసించే మనుష్యులకు ఎప్పుడు తీర్పు తీరుస్తావు?
85 కొందరు గర్విష్ఠులు వారి అబద్ధాలతో నన్ను పొడిచారు.
    మరి అది నీ ఉపదేశాలకు విరుద్ధం.
86 యెహోవా, మనుష్యులు నీ ఆజ్ఞలన్నింటిని నమ్మగలరు.
    అబద్ధికులు నన్ను హింసిస్తారు. నాకు సహాయం చేయుము!
87 ఆ అబద్ధికులు నన్ను దాదాపుగా నాశనం చేశారు.
    నేను మాత్రం నీ ఆదేశాలను అనుసరించటం మానలేదు.
88 యెహోవా, నిజమైన నీ ప్రేమ చూపించి నన్ను జీవించనిమ్ము.
    నీవు చెప్పే వాటిని నేను చేస్తాను.

లామెద్

89 యెహోవా, నీ మాట శాశ్వతంగా కొనసాగుతుంది. నీ మాట పరలోకంలో శాశ్వతంగా కొనసాగుతుంది.
90 నీవు ఎప్పటికీ నమ్మదగిన వాడవు.
    యెహోవా, భూమిని నీవు చేశావు, అది ఇంకా నిలిచి ఉంది.
91 నీ ఆజ్ఞ మూలంగా, ఇంకా అన్నీ కొనసాగుతాయి.
    యెహోవా, అన్నీ నీ సేవకుల్లా నీ ఆజ్ఞకు లోబడుతాయి.
92 నీ ఉపదేశాలు నాకు స్నేహితుల్లా ఉండకపోతే,
    నా శ్రమ నన్ను నాశనం చేసి ఉండేది.
93 యెహోవా, నీ ఆజ్ఞలు నన్ను జీవింపజేస్తాయి
    కనుక నేను ఎన్నటికీ వాటిని మరచిపోను.
94 యెహోవా, నేను నీ వాడను. నన్ను రక్షించుము.
    ఎందుకంటే, నేను నీ ఆజ్ఞలకు విధేయుడనగుటకు కష్టపడి ప్రయత్నిస్తాను.
95 దుష్టులు నన్ను నాశనం చేయాలని ప్రయత్నించారు.
    అయితే నీ ఒడంబడిక నాకు తెలివినిచ్చింది.
96 నీ ధర్మశాస్త్రానికి తప్ప
    ప్రతిదానికీ ఒక హద్దు ఉంది.

2 సమూయేలు 3:22-39

అబ్నేరు మరణం

22 యోవాబు, దావీదు అధికారులు యుద్ధం నుండి తిరిగి వచ్చారు. వారు శత్రువుల నుండి ఎన్నో విలువైన వస్తువులను కొల్లగొట్టుకొచ్చారు. దావీదు అబ్నేరును శాంతంగా వెళ్లమని పంపివేశాడు. అందువల్ల హెబ్రోనులో దావీదు వద్ద అబ్నేరు లేడు. 23 యోవాబు, అతని సైనికులంతా హెబ్రోనుకు చేరారు. సైన్యం యోవాబుతో, “నేరు కుమారుడైన అబ్నేరు దావీదు రాజు వద్దకు రాగా, ఆయన అబ్నేరును శాంతంగా వెళ్లమని పంపివేశాడు” అని అన్నది.

24 యోవాబు రాజు వద్దకు వచ్చి, “ఏమిటి నీవు చేసిన పని? అబ్నేరు నీ వద్దకు వస్తే, అతనికి ఏ హాని చేయకుండా ఎందుకు పంపించివేశావు! 25 నేరు కుమారుడైన అబ్నేరును నీవెరుగుదువు! అతడు నిన్ను మోసగించటానికి వచ్చాడు! నీవు చేస్తున్నదంతా సమగ్రంగా తెలుసుకోవాలనే తలంపుతో వచ్చాడు!” అని అన్నాడు.

26 యోవాబు దావీదు వద్ద నుండి వెళ్లి, సిరా అనుబావి వద్దకు అబ్నేరు కొరకు తన దూతలను పంపాడు. దూతలు అబ్నేరును వెనుకకు తీసుకొని వచ్చారు. కాని ఇదంతా దావీదుకు తెలియదు. 27 అబ్నేరు హెబ్రోనుకు రాగానే, యోవాబు అతనిని సింహద్వారం మధ్యలో ఏదో రహస్యంగా మాట్లాడాలని ఒక పక్కకు తీసుకొని వెళ్లాడు. కాని యోవాబు తన కత్తితో అబ్నేరు పొట్టలో పొడిచాడు. అబ్నేరు చనిపోయాడు. గతంలో యోవాబు సోదరుడైన అశాహేలును అబ్నేరు చంపాడు. కావున యోవాబు అబ్నేరును చంపివేశాడు.

దావీదు అబ్నేరు కొరకు దుఃఖించటం

28 తరువాత ఈ వార్త దావీదు విన్నాడు. దావీదు ఇలా అన్నాడు; “నేను, నా రాజ్యం నేరు కుమారుడైన అబ్నేరు హత్య విషయంలో నిర్దోషులం. యెహోవాకి ఇది తెలుసు. 29 యోవాబు, అతని కుటుంబం దీనంతటికీ బాధ్యులు. అతని కుటుంబమంతా నిందితులే. యోవాబు కుటుంబానికి అనేక కష్టాలు ఎదురవుతాయని నేను నమ్ముతున్నాను. అతని కుటుంబంలో ఎప్పుడూ ఎవరో ఒకరు కుష్టువ్యాధి పీడితుడో, అంగవైకల్యంతో కర్ర పట్టుకు నడిచే వాడో, యుద్ధంలో హతుడయ్యేవాడో, లేదా ఆహారము లేనివాడో వుంటాడని కూడ నేను నమ్ముతున్నాను.”

30 యోవాబు, అతని సోదరుడు అబీషైలిరువురూ అబ్నేరును చంపిన కారణమేమనగా అబ్నేరు వారి సహోదరుడైన అశాహేలును గిబియోను వద్ద యుద్ధంలో చంపాడు.

31-32 యోవాబుతోను, అతనితో ఉన్న మనుష్యులతోను దావీదు “తమ బట్టలను చింపుకొని,[a] విషాద సూచకంగా వేరే వస్త్రాలు వేసుకోమనీ, అబ్నేరు కొరకు విలపించుమనీ” చెప్పాడు. వారు అబ్నేరును హెబ్రోనులో సమాధి చేశారు. అంత్యక్రియలకు దావీదు హాజరయ్యాడు. దావీదు రాజు, ప్రజలు అబ్నేరు సమాధి వద్ద దుఃఖించారు.

33 దావీదు రాజు అబ్నేరుపై ఈ విషాద గీతిక పాడాడు:

“అబ్నేరు ఒక అవివేకిలా హతుడాయెనా?
34     అతని చేతులకు బంధాలులేవు,
    పాదాలకు గొలుసులు వేయలేదు!
అయినా క్రూరుల ముందు నీవు నేలకొరిగావు. ఒరిగి మరణించావు.”

అప్పుడు ప్రజలంతా మళ్లీ అబ్నేరు కొరకు విలపించారు. 35 ఆ రోజు ఇంకా పొద్దువుండగానే దావీదును ఆహారం తీసుకోమని కోరటానికి ప్రజలు వచ్చారు. కాని దావీదు ఒక ప్రత్యేకమైన ప్రమాణం చేశాడు. “నేను రొట్టెగాని, తదితరమైన ఆహారంగాని సూర్యాస్తమయం గాకుండా తింటే దేవుడు నన్ను శిక్షించుగాక! నాకు మరిన్ని కష్టాలు తెచ్చి పెట్టుగాక!” అని అన్నాడు. 36 అసలు అక్కడ ఏమి జరిగిందో ప్రజలంతా చూశారు, కనుక దావీదు రాజు చేసేవాటన్నిటినీ ప్రజలు ఒప్పుకున్నారు. 37 నేరు కుమారుడైన అబ్నేరును చంపినది దావీదు రాజు కాదని యూదా ప్రజలకీ, ఇశ్రాయేలీయులందరికీ ఆ రోజు అర్థమయ్యింది.

38 దావీదు రాజు తన సేవకులతో ఇలా అన్నాడు: “మీకు తెలుసు; ఇశ్రాయేలులో ఈ రోజు ఒక ప్రముఖ నాయకుడు చనిపోయాడు. 39 పైగా ఇదే రోజున నేను రాజుగా అభిషేకించబడ్డాను. ఈ సెరూయా కుమారులు నాకు మిక్కిలి దుఃఖాన్ని కలుగజేశారు. యెహోవా వారికి అర్హమైన శిక్ష విధించుగాక!”

అపొస్తలుల కార్యములు 16:16-24

పౌలు మరియు సీల కారాగారంలో

16 ఒకసారి మేము ప్రార్థనా స్థలానికి వెళ్తుండగా ఒక బానిస పిల్ల కనిపించింది. ఆమెకు సోదె చెప్పే శక్తిగల “పుతోను” అనే దయ్యము పట్టివుంది. ఆమె సోదె చెప్పటం వల్ల ఆమె యజమానులు చాలా డబ్బు గడించారు. 17 ఆమె పౌలును, మమ్మును అనుసరిస్తూ, “వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని సేవకులు. రక్షణకు దారి చూపుతున్నారు” అని బిగ్గరగా కేక పెట్టేది. 18 ఇలా చాలా రోజులు చేసింది. చివరకు పౌలు విసుగు చెంది వెనక్కి తిరిగి ఆమెలో ఉన్న దయ్యంతో, “యేసు క్రీస్తు పేరిట ఆమెను వదిలి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను” అని అన్నాడు. వెంటనే దయ్యం ఆమెను వదిలివేసింది.

19 ఆ బానిస పిల్ల యజమానులు తాము డబ్బు చేసుకొనే ఆశ నశించిందని గ్రహించి పౌలును, సీలను బంధించారు. 20 వాళ్ళను బహిరంగంగా రోమా సైనికాధికారుల ముందుకు పిలుచుకు వచ్చి, “వీళ్ళు యూదులు. మన పట్టణంలో అలజడి లేపుతున్నారు. 21 రోమా పౌరులుగా మనము ఆచరించలేని ఆచారాలను వాళ్ళు మనకు చెబుతున్నారు. వాటిని అంగీకరించటం కూడా న్యాయం కాదు” అని అన్నారు.

22 ప్రజల గుంపు పౌలు, సీలల మీద పడింది. అధికారులు వాళ్ళ దుస్తుల్ని చింపి కొట్టమని ఆజ్ఞాపించారు. 23 చావకొట్టి, వాళ్ళను చెరసాలలో పడవేస్తూ, “వీళ్ళను జాగ్రత్తగా కాపలా కాయండి” అని ఆ చెరసాల అధికారితో చెప్పారు. 24 కనుక ఆ చెరసాల అధికారి వాళ్ళ కాళ్ళను బొండ కొయ్యకు గల రంధ్రాల్లో బిగించి లోపలి గదిలో పడవేసాడు.

మార్కు 6:47-56

47 అర్ధరాత్రికి శిష్యులున్న పడవ సముద్రం మధ్యవుంది. యేసు మాత్రం యింకా గట్టునే ఉన్నాడు. 48 ఎదురు గాలి వీయటంవల్ల శిష్యులు కష్టంగా తెడ్లు వేయటం ఆయన చూసాడు. తెల్లవారు ఝామున యేసు నీళ్ళ మీదుగా నడిచి వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు. వాళ్ళను దాటి ముందుకు వెళ్తుంటే 49 ఆయన శిష్యులు ఆయన నీళ్ళమీద నడవటం చూసి, దయ్యం అనుకొని భయపడి బిగ్గరగా కేకలు వేసారు. 50 వెంటనే ఆయన వాళ్ళతో మాట్లాడుతూ, “ధైర్యంగా ఉండండి. నేనే! భయపడకండి!” అని అన్నాడు. 51 ఆయన పడవనెక్కగానే గాలి తీవ్రత పూర్తిగా తగ్గి పోయింది. వాళ్ళు ఇది చూసి దిగ్భ్రాంతి చెందారు. రొట్టెలు పంచిన అద్భుతాన్ని వాళ్ళు చూశారు. 52 కాని దానిని అర్థం చేసుకోలేక పోయారు.

యేసు రోగులనేకులను నయం చేయటం

(మత్తయి 14:34-36)

53 సముద్రం దాటి గెన్నేసరెతు తీరాన్ని చేరుకొని అక్కడ పడవను నిలిపారు. 54 వాళ్ళు పడవ దిగగానే ప్రజలు యేసును గుర్తించారు. 55 ప్రజలు చుట్టూ ఉన్న ప్రాంతాలకు పరుగెత్తి వెళ్ళి రోగుల్ని చాపలపై పడుకోబెట్టి ఆయనున్న చోటికి తీసుకు వచ్చారు. 56 పల్లెల్లో, పట్టణాల్లో, పొలాల్లో, చుట్టూ, ఆయన వెళ్ళిన ప్రతిచోట రోగుల్ని వీథుల్లో పడుకోబెట్టారు. ఆయన వస్త్రానైనా తాకనీయమని ఆయన్ని బ్రతిమిలాడారు. ఆయన్ని తాకిన ప్రతి ఒక్కరికి నయమై పోయింది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International