Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 34

దావీదు కీర్తన. అబీమెలెకు తనని పంపించి వేయాలని దావీదు వెర్రివానిలా నటించినప్పుడు అతడు దావీదును పంపించివేసినప్పటిది.

34 నేను యెహోవాను ఎల్లప్పుడూ స్తుతిస్తాను.
    ఆయన స్తుతి ఎల్లప్పుడూ నా పెదాల మీద ఉంటుంది.
దీన జనులారా, విని సంతోషించండి.
    నా ఆత్మ యెహోవాను గూర్చి ఘనంగా కీర్తిస్తుంది.
యెహోవా మహాత్మ్యం గూర్చి నాతో పాటు చెప్పండి.
    మనం ఆయన నామాన్ని కీర్తిద్దాం.
సహాయం కోసం నేను దేవుణ్ణి ఆశ్రయించాను. ఆయన విన్నాడు.
    నేను భయపడే వాటన్నింటి నుండి ఆయన నన్ను రక్షించాడు.
సహాయం కోసం దేవుని తట్టు చూడండి.
    మీరు స్వీకరించబడుతారు. సిగ్గుపడవద్దు.
ఈ దీనుడు సహాయంకోసం యెహోవాను వేడుకొన్నాడు.
    యెహోవా నా మొర విన్నాడు.
    నా కష్టాలన్నింటినుండి ఆయన నన్ను రక్షించాడు.
యెహోవాను వెంబడించే ప్రజల చుట్టూ ఆయన దూత కావలి ఉంటాడు.
    ఆ ప్రజలను యెహోవా దూత కాపాడి, వారికి బలాన్ని ఇస్తాడు.
యెహోవా ఎంత మంచివాడో రుచిచూచి తెలుసుకోండి.
    యెహోవా మీద ఆధారపడే వ్యక్తి ధన్యుడు.
యెహోవా పవిత్ర జనులు ఆయనను ఆరాధించాలి.
    ఆయన్ని అనుసరించే వారికి సురక్షిత స్థలం ఆయన తప్ప మరేదీలేదు.
10 యౌవనసింహాలు[a] బలహీనమై, ఆకలిగొంటాయి.
    అయితే సహాయం కోసం దేవుని ఆశ్రయించే వారికి ప్రతి మేలు కలుగుతుంది. మంచిదేదీ కొరతగా ఉండదు.
11 పిల్లలారా, నా మాట వినండి.
    యెహోవాను ఎలా సేవించాలో నేను నేర్పిస్తాను.
12 ఒక వ్యక్తి జీవితాన్ని ప్రేమిస్తోంటే,
    ఒక వ్యక్తి మంచి దీర్ఘకాల జీవితం జీవించాలనుకొంటే
13 అప్పుడు ఆ వ్యక్తి చెడ్డ మాటలు మాట్లాడకూడదు,
    ఆ వ్యక్తి అబద్ధాలు పలుకకూడదు,
14 చెడ్డ పనులు చేయటం చాలించండి. మంచి పనులు చేయండి.
    శాంతికోసం పని చేయండి. మీకు దొరికేంతవరకు శాంతికోసం వెంటాడండి.
15 మంచి మనుష్యులను యెహోవా కాపాడుతాడు.
    ఆయన వారి ప్రార్థనలు వింటాడు.
16 కాని చెడు కార్యాలు చేసే వారికి యెహోవా విరోధంగా ఉంటాడు.
    ఆయన వారిని పూర్తిగా నాశనం చేస్తాడు.

17 ప్రార్థించండి, యెహోవా మీ ప్రార్థన వింటాడు.
    ఆయన మిమ్మల్ని మీ కష్టాలన్నింటినుండి రక్షిస్తాడు.
18 గర్విష్ఠులు కాని మనుష్యులకు యెహోవా సమీపంగా ఉంటాడు.
    ఆత్మలో అణగిపోయిన మనుష్యులను ఆయన రక్షిస్తాడు.
19 మంచి మనుష్యులకు అనేక సమస్యలు ఉండవచ్చు.
    కాని ఆ మంచి మనుష్యులను వారి ప్రతి కష్టం నుండి యెహోవా రక్షిస్తాడు.
20 వారి ఎముకలన్నింటినీ యెహోవా కాపాడుతాడు.
    ఒక్క ఎముక కూడా విరువబడదు.
21 అయితే దుష్టులను కష్టాలు చంపేస్తాయి.
    చెడ్డవాళ్లు మంచి మనుష్యులను ద్వేషిస్తారు. కాని ఆ చెడ్డ వాళ్లు నాశనం చేయబడతారు.
22 యెహోవా తన సేవకులలో ప్రతి ఒక్కరి ఆత్మనూ రక్షిస్తాడు.
    తన మీద ఆధారపడే ప్రజలను నాశనం కానీయడు.

యిర్మీయా 16:14-21

14 “ప్రజలు ప్రమాణాలు చేస్తూ, ‘ఇశ్రాయేలీయులను ఈజిప్టునుండి తీసుకొని వచ్చిన నిత్యుడైన దేవునితోడు’ అని వారు అంటారు. కాని ప్రజలు ఈ మాటలు అనకుండా ఉండే సమయం ఆసన్నమవుతూఉంది.” ఇది యెహోవా వాక్కు. 15 ప్రజలు వాగ్దానాలు చేసి అంటారు: “నిత్యుడైన దేవుని సాక్షిగా అని, ‘ఇశ్రాయేలీయులను ఉత్తర దేశంనుండి తీసుకొని వచ్చినది నిత్యుడైన యెహోవాయే!’ అని, ‘ఇశ్రాయేలీయులను ఆయన పంపిన దేశాలనుండి మరల తీసుకొని వచ్చినది ఆయనే’ అని అంటారు. ప్రజలు ఇలా ఎందుకు అంటారు? ఎందువల్లనంటే ఇశ్రాయేలీయులను వారి పూర్వీకులకు నేనిచ్చిన రాజ్యానికి మరల తీకుకొనివస్తాను.

16 “ఈ రాజ్యానికి చాలామంది జాలరులను త్వరలో పంపిస్తాను” ఇది యెహోవా వాక్కు “ఆ జాలరులు యూదా ప్రజలను పట్టుకుంటారు. అది జరిగిన పిమ్మట ఈ రాజ్యానికి చాలామంది వేటగాండ్రను పిలిపిస్తాను. ఈ వేటగాండ్రు[a] యూదావారిని ప్రతి కొండమీద, పర్వతంమీద, కొండ బొరియల్లోను వేటాడతారు. 17 వారు చేసేదంతా నేను చూస్తాను. యూదా వారు చేసేది దేనినీ నానుండి దాచలేరు. వారి పాపం నానుండి మరుగు పర్చబడలేదు. 18 యూదా ప్రజలు చేసిన దుష్కార్యాలకు తగిన శిక్ష విధిస్తాను. వారి ప్రతి పాపానికీ రెండు సార్లు శిక్షిస్తాను. ఇది ఎందుకు చేస్తానంటే, వారు నా రాజ్యాన్ని ‘అపవిత్ర’ పర్చారు. వారు నా రాజ్యాన్ని భయంకరమైన విగ్రహాలతో ‘కలుషితం’ చేశారు. ఆ విగ్రహాలను నేను అసహ్యించుకుంటాను. కాని వారు నా దేశాన్నంతా ఘోరమైన చెడు విగ్రహాలతో నింపివేశారు.”

19 యెహోవా, నీవే నాకు బలం; నీవే నాకు రక్షణ.
    ఆపదలో తలదాచుకోటానికి నీవే సురక్షితమైన చోటు.
ప్రపంచ దేశాలన్నీ నీ శరణు వేడి వస్తాయి.
    ఆ దేశాల వారంతా ఇలా అంటారు: “మా పితరులు చాలామంది బూటకపు దేవుళ్లను నమ్మారు.
వారా పనికిమాలిన విగ్రహాలను ఆరాధించారు.
    కాని ఆ విగ్రహాలు వారికి ఏ రకంగానూ సహాయపడలేవు.
20 ప్రజలు వారికై వారు నిజమైన దేవతలను చేయగలరా?
    చేయలేరు! వారు విగ్రహాలను మాత్రమే చేయగలరు. కాని ఆ బొమ్మలు నిజానికి దేవుళ్లే కారు!”

21 “అందుచేత బొమ్మల దేవుళ్లను చేసేవారికి నేను గుణపాఠం నేర్పుతాను.
    ఇప్పుడే వారికి నా శక్తిని గురించీ, నా బలాన్ని గురించీ తెలియజెబుతాను.
అప్పుడు నేనే దేవుడననే జ్ఞానం వారికి కలుగుతుంది.
    నేనే యోహోవా అని వారు తెలుసుకుంటారు.”

మార్కు 1:14-20

గలిలయలో యేసుని సేవా ప్రారంభం

(మత్తయి 4:12-17; లూకా 4:14-15)

14 యోహాను చెరసాలలో వేయబడ్డాడు. యేసు గలిలయకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించాడు. 15 ఆయన, “దేవుని రాజ్యం వస్తుంది. ఆ సమయం దగ్గరకు వచ్చింది. మారుమనస్సు పొంది సువార్తను విశ్వసించండి” అని ప్రకటించాడు.

యేసు కొందరు శిష్యులను ఎన్నుకొనటం

(మత్తయి 4:18-22; లూకా 5:1-11)

16 యేసు గలిలయ సముద్రం ఒడ్డున నడుస్తూ ఉన్నాడు. ఆయన చేపలు పట్టేవాళ్ళైన సీమోను మరియు అతని సోదరుడు అంద్రెయ వల వేయటం చూసాడు. 17 యేసు వాళ్ళతో, “నన్ను అనుసరించండి. మీరు మనుష్యులను పట్టుకొనేటట్లు చేస్తాను” అని అన్నాడు. 18 వాళ్ళు వెంటనే తమ వలల్ని వదిలి ఆయన్ని అనుసరించారు.

19 ఆయన కొంతదూరం వెళ్ళాక జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సోదరుడు యోహాను పడవలో ఉండటం చూసాడు. వాళ్ళు వల సిద్ధం చేసుకొంటూ ఉన్నారు. 20 యేసు వాళ్ళను పిలిచాడు. వాళ్ళు తమ తండ్రి జెబెదయిని పనివాళ్ళతో అక్కడే పడవలో వదిలివేసి యేసును అనుసరించారు.

కీర్తనలు. 33

33 మంచి మనుష్యులారా, యెహోవాయందు ఆనందించండి.
    నమ్మకమైన మంచి మనుష్యులారా, ఆయనను స్తుతించండి.
సితారా వాయిస్తూ, యెహోవాను స్తుతించండి.
    యెహోవాకు పదితంతుల స్వరమండలాన్ని వాయించండి.
ఆయనకు ఒక క్రొత్త కీర్తన పాడండి.
    ఆనంద గీతాన్ని ఇంపుగా పాడండి.
దేవుని మాట సత్యం!
    ఆయన చేసే ప్రతిదాని మీద నీవు ఆధారపడవచ్చును.
నీతిన్యాయాలను దేవుడు ప్రేమిస్తాడు.
    యెహోవా భూమిని తన ప్రేమతో నింపాడు.
యెహోవా ఆజ్ఞ ఇవ్వగానే లోకం సృష్టించబడింది.
    భూమి మీద ఉన్న సమస్తాన్నీ దేవుని నోటి నుండి వచ్చే శ్వాస సృజించింది.
సముద్రంలోని నీరు అంతటినీ దేవుడు ఒక్కచోట రాశిగా కూర్చాడు.
    మహా సముద్రాన్ని దాని స్థానంలో ఆయనే ఉంచాడు.
భూమి మీద ప్రతి మనిషీ యెహోవాకు భయపడి ఆయనను గౌరవించాలి.
    ఈ లోకంలో జీవించే మనుష్యులందరూ ఆయనకు భయపడాలి.
ఎందుకంటే దేవుడు ఆదేశించిన తక్షణం దాని ప్రకారం నెరవేరుతుంది.
    ఏదైనా “నిలిచిపోవాలని” ఆయన ఆజ్ఞ ఇస్తే, అప్పుడు అది ఆగిపోతుంది.
10 జనసమూహాల పథకాలను పనికిమాలినవిగా యెహోవా చేయగలడు.
    వారి తలంపులన్నింటినీ ఆయన నాశనం చేయగలడు.
11 అయితే యెహోవా సలహా శాశ్వతంగా మంచిది.
    ఆయన తలంపులు తర తరాలకు మంచివి.
12 యెహోవా ఎవరికి దేవుడుగా ఉంటాడో ఆ ప్రజలు ధన్యులు.
    దేవుడే వారిని తన స్వంత ప్రజలుగా ఏర్పాటు చేసుకొన్నాడు.
13 యెహోవా పరలోకం నుండి క్రిందికి చూసాడు.
    మనుష్యులందరిని ఆయన చూశాడు.
14 భూమి మీద నివసిస్తున్న మనుష్యులందరినీ
    ఆయన తన ఉన్నత సింహాసనం నుండి చూశాడు.
15 ప్రతి మనిషి మనస్సునూ దేవుడు సృష్టించాడు.
    ప్రతి మనిషి ఏమి చేస్తున్నాడో అది అయన గ్రహిస్తాడు.
16 ఒక రాజు తన స్వంత గొప్ప శక్తితో రక్షించబడడు.
    ఒక సైనికుడు తన స్వంత గొప్ప బలంతో రక్షించబడడు.
17 యుద్ధంలో గుర్రాలు నిజంగా విజయం తెచ్చిపెట్టవు.
    తప్పించుకొనేందుకు వాటి బలం నిజంగా నీకు సహాయపడదు.
18 యెహోవాను అనుసరించే మనుష్యులను ఆయన కాపాడుతాడు,
    ఆయన నిజమైన ప్రేమయందు నిరీక్షణయుంచు వారిని జాగ్రత్తగా చూస్తాడు. ఆయన మహా ప్రేమ, ఆయనను ఆరాధించే వారిని కాపాడుతుంది.
19 ఆ మనుష్యులను మరణం నుండి రక్షించేవాడు దేవుడే.
    ఆ మనుష్యులు ఆకలిగా ఉన్నప్పుడు ఆయన వారికి బలాన్ని యిస్తాడు.
20 అందుచేత మనం యెహోవా కోసం కనిపెట్టుకుందాము.
    ఆయన మనకు సహాయం, మన డాలు.
21 దేవుడు నన్ను సంతోషపరుస్తాడు,
    నేను నిజంగా ఆయన పవిత్ర నామాన్ని నమ్ముకొంటాను.
22 యెహోవా, మేము నిజంగా నిన్ను ఆరాధిస్తున్నాము.
    కనుక నీ గొప్ప ప్రేమ మాకు చూపించుము.

మత్తయి 10:16-32

కష్టాలను గురించి యేసు హెచ్చరించటం

(మార్కు 13:9-13; లూకా 21:12-17)

16 “తోడేళ్ళ మధ్యకు గొఱ్ఱెల్ని పంపినట్లు మిమ్మల్ని పంపుతున్నాను. అందువల్ల పాముల్లాగా తెలివిగా, పాపురాల్లా నిష్కపటంగా మీరు మెలగండి. 17 కాని, వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు మిమ్మల్ని స్థానిక సభలకు అప్పగిస్తారు. తమ సమాజ మందిరాల్లో కొరడా దెబ్బలుకొడతారు. 18 వాళ్ళు నా కారణంగా మిమ్మల్ని పాలకుల ముందుకు, రాజుల ముందుకు తీసుకు వెళ్తారు. మీరు వాళ్ళ ముందు, యూదులుకాని ప్రజలముందు నా గురించి చెప్పాలి. 19 వాళ్ళు మిమ్మల్ని అధికారులకు అప్పగించినప్పుడు, ఏ విధంగా మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? అని చింతించకండి. మీరు ఏం మాట్లాడాలో దేవుడు ఆ సమయంలో మీకు తెలియచేస్తాడు. 20 ఎందుకంటే, మాట్లాడేది మీరు కాదు. మీ తండ్రి ఆత్మ మీ ద్వారా మాట్లాడుతాడు.

21 “సోదరుడు సోదరుణ్ణి, తండ్రి కుమారుణ్ణి మరణానికి అప్పగిస్తారు. పిల్లలు తమ తల్లి తండ్రులకు ఎదురు తిరిగి వాళ్ళను చంపుతారు. 22 ప్రజలందరూ నా పేరు కారణంగా మిమ్మల్ని ద్వేషిస్తారు. కాని చివరి దాకా సహనంతో ఉన్న వాళ్ళను దేవుడు రక్షిస్తాడు. 23 మిమ్మల్ని ఒక పట్టణంలో హింసిస్తే తప్పించుకొని యింకొక పట్టణానికి వెళ్ళండి. ఇది నిజం. మీరు ఇశ్రాయేలు దేశంలోని పట్టణాలన్ని తిరగక ముందే మనుష్యకుమారుడు వస్తాడు.

24 “విద్యార్థి గురువుకన్నా గొప్పవాడు కాడు. అలాగే సేవకుడు యజమానికన్నా గొప్పవాడు కాడు. 25 విద్యార్థి గురువులా ఉంటే చాలు. అలాగే సేవకుడు యజమానిలా ఉంటే చాలు. ఇంటి యజమానినే బయెల్జెబూలు[a] అని అన్న వాళ్ళు ఆ యింటివాళ్ళను యింకెంత అంటారో కదా!

దేవునికి భయపడుము, జనులకు కాదు

(లూకా 12:2-7)

26 “అందువల్ల వాళ్ళకు భయపడకండి. రహస్యమైనవి బయటపడతాయి. దాచబడినవి నలుగురికి తెలుస్తాయి. 27 నేను రహస్యంగా చెబుతున్న విషయాలను బాహాటంగా యితర్లకు చెప్పండి. మీ చెవుల్లో చెప్పిన విషయాలను యింటి కప్పులపై ఎక్కి ప్రకటించండి.

28 “వాళ్ళు దేహాన్ని చంపగలరు కాని ఆత్మను చంపలేరు. వాళ్ళను గురించి భయపడకండి. శరీరాన్ని, ఆత్మను నరకంలో వేసి నాశనం చెయ్యగల వానికి భయపడండి. 29 ఒక పైసాకు రెండు పిచ్చుకలు అమ్ముతారు కదా. అయినా మీ తండ్రికి తెలియకుండా ఒక్క పిచ్చుక కూడా నేల మీదికి పడదు. 30 మీ తల మీద ఉన్న వెంట్రుకల సంఖ్య కూడా ఆయనకు తెలుసు. 31 అందువలన భయపడకండి. ఎన్ని పిచ్చుకలైనా మీకు సాటి కాలేవు.

నీ విశ్వాసాన్ని గురించి సిగ్గుపడవద్దు

(లూకా 12:8-9)

32 “నన్ను ప్రజల సమక్షంలో అంగీకరించిన ప్రతి వ్యక్తిని పరలోకంలో ఉన్న నా తండ్రి సమక్షంలో అంగీకరిస్తాను.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International